Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

11. నాన్న గారి జేబు!

2018 దసరా కవితల పోటీలలో న్యాయ నిర్ణేతల ద్వారా ద్వితీయ ఉత్తమ బహుమతి పొందిన కవిత

నాన్న గుండెలోని
గాయాల తడిని
ఎవరి కంట్లో పడకుండా
పెట్టని గోడలా నిలిచేది!

పిల్లలు డబ్బుల కోసం
మారాం చేసినపుడల్లా
నాన్న గారి జేబు
చిల్లర ఊరే ఊట బావయ్యేది!
అనుకోని ఖర్చులెన్నో
అతిథిలా వచ్చిపడినపుడు
నాన్నకు మనో ధైర్యాన్ని
అదే కదా నూరి పోసేది!

నాన్న గుండె చప్పుడు వింటూ
తాను ఓదార్పు నిచ్చే నేస్తమయ్యేది!!

ఇంట్లో అందరి చూపులూ
తన మీదే ఉన్నాయనీ
తండ్రి గుండె లోతుల్లోకి
చూపులెవరూ సారించట్లేదనీ
ఆ జేబు లోలోన కుమిలి పోయేది!!

అది ఒట్టి జేబు మాత్రమేనా?
కాదు కాదు
కుటుంబ అంబరాన
ఎగరేసిన త్యాగాల పతాక!!

Exit mobile version