Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ – నివేదిక

గుంటూరు బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలో డిసెంబర్ 14వ తేది ఆదివారం ఉదయం 16వ సోమేపల్లి సాహితీ పురస్కారాల సభ జరిగింది.

రమ్యభారతి సాహిత్య త్రైమాస పత్రిక నిర్వహణలో జరిగిన ఈ సభకు ముఖ్య అతిధిగా ఛైర్మెన్, ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృతిక అకాడమీ ఆర్. డి. విల్సన్, సభాధ్యక్షులుగా గౌరవ సలహాదారు రమ్యభారతి వేముల హాజరత్తయ్య గుప్తా, ఆత్మీయ అతిధులుగా ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ సి. భవాని దేవీ, ప్రముఖ కథకులు శ్రీకంఠస్ఫూర్తి పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు.

అధ్యక్షులు హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ “మనలో అంతర్లీనంగా వున్న సాహిత్యాన్ని వెలికి తీయడానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన మహావ్యక్తి సోమేపల్లి” అని, “అదే బాటలో నడుస్తున్న కుమారుడు శ్రీ వశిష్ఠ సోమేపల్లి” అని అన్నారు. అనంతరం కథల పోటీలలో విజేతలు ప్రథమ స్థాయి ‘గెలుపు’ కథకు సింగరాజు శ్రీనివాస రావు, ద్వితీయ స్థాయి ‘ఇకనైనా మారండి’ కథకు జి.రంగబాబుకు, తృతీయ స్థాయి కథ ‘బేరం’, బి.ఎస్.కే. కరీముల్లా నరసారావు పేట వారికి, ప్రోత్సాహక పురస్కారాలలో ‘మార్పు రావాలి’ కథకు ఇంద్రగంటి నరసింహమూర్తి, ‘సామజిక నేరం’ కథకు సింహప్రసాద్‌కు, ‘అమూల్య’ కథకు ఎం. వెంకటేశ్వరావు లను పురస్కారాలతో అతిథులు ఘనంగా సత్కరించారు.

ముఖ్య అతిథి విల్సన్ మాట్లాడుతూ రాజ్యాంగంలో లేని ఎన్నో సమస్యలను పరిష్కరించటానికి అత్యుత్తమ మార్గం సాహిత్యమే అన్నారు. సాహిత్యంలో మానవతా విలువలు ఉన్నప్పుడు రాణిస్తుందన్నారు. అనేక సంఘటనల సమాహారమే సాహిత్యం అంటూ చరిత్ర సృష్టించగలిగిన వారు, భావితరాలకు చరిత్ర అందించే వారు సాహిత్య వేత్తలన్నారు.

కార్యక్రమంలో సాహితీవేత్తలు పాపినేని శివశంకర్, రావెల సాంబశివరావు, సి.హెచ్. సుశీలమ్మ, పెనుగొండ లక్ష్మీనారాయణ, శివప్రసాద్, తోటకూర వెంకట నారాయణ, ఎస్.ఎం.సుభాని, నానా తదితరులు  పాల్గొని పురస్కార గ్రహీతలను అభినందించారు. కార్యక్రమాన్ని చలపాక ప్రకాష్, శ్రీ వశిష్ట నిర్వహించారు.

Exit mobile version