Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మినియేచర్ షీట్ల మీద 1857 విప్లవ వీర నారీమణులు

మే 10వ తేదీ మీరట్‌లో ప్రథమ భారత స్వాతంత్ర్య సమరం మొదలయిన సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎన్నో మహోజ్వల ఘట్టాలు దర్శనమిస్తాయి. స్ఫూర్తిని కలిగిస్తాయి. వీరుల త్యాగాలు కంటతడిని పెట్టిస్తాయి. ఈ పోరాటాలలో ఈస్టిండియా కంపెనీని ఎదిరించి పోరాడిన వారు ఎందరో కనిపిస్తారు. స్త్రీ పురుష, కులమత, ప్రాంతీయ బేధాలు లేకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి చాలా మంది వీరులు కంపెనీ ప్రభుత్వాన్ని ఎదిరించి యుద్ధాలు చేశారు.

ముఖ్యంగా స్త్రీలని గమనిస్తే శివగంగరాణి వేలువేలు నాచియార్, కిత్తూరు రాణి చెన్నమ్మలు కంపెనీతో యుద్ధం చేశారు. వేలునాచియార్ యుద్ధంలో గెలిచి రాజ్యాన్ని పరిపాలించారు. చెన్నమ్మ కంపెనీ ప్రభుత్వంతో చేసిన యుద్ధంలో తొలిసారి గెలిచి, మలిసారి ఓడిపోయారు. బందీగా ఉండి మరణించారు.

1857 వచ్చేసరికి భారతీయ సైన్యం (సిపాయిలు) కంపెనీ ప్రభుత్వ యుద్ధ సంస్కరణలని వ్యతిరేకించారు. బ్రిటిష్ సైన్యంలోని భారతీయులు తిరుగుబాటు చేయడానికి సంసిద్ధులయ్యారు.

ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం 1857 మార్చిలో కొత్త తూటాలని వాడమని సైన్యాన్ని ఆదేశించింది. తూటాని నోటితో కొరికి ఉపయోగించవలసిన పరిస్థితులు ఎదురయినాయి. సైన్యం ఎదురుతిరగడం మొదలయింది. మంగళ్ పాండే ఈ పరిస్థితిలో మరణించాడు. ఈ సంఘటన దావానలంలా దేశమంతా వ్యాపించింది.

1857 మే 9వ తేదీన సూరలోని సిపాయిలు కొత్త తూటాలను వాడేటందుకు నిరాకరించారు. కంపెనీ ప్రభుత్వం వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. అరెస్టు చేసి జైలులో బంధించారు.

మే 10వ తేదీన సిపాయిలు బయలుదేరి ఢిల్లీ వెళ్ళారు. ఉద్యమంలో పాల్గొన్నారు. ఇలా మొదలయిన పోరాటం దేశమంతా వ్యాపించింది. అనేక సంస్థానాధీశులు, రాజులు, రైతులు, వివిధ వర్గాల ప్రజల మనసులలో అణిగియున్న తిరుగుబాటు ధోరణి లావాలా ఉప్పొంగింది. మహోగ్రరూపం దాల్చింది.

ఈ ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అనేకమంది రాజులు, పురుషులతో పాటు చాల మంది మహిళా సైన్యము, మహిళా సేనాధిపతులు, రాణులు, పాల్గొన్నారు.

నానాసాహెబ్, తాంతియోతోపే వంటి నాయకులు రాణితపస్వినితో సంప్రదించి సలహాలను తీసుకున్నారు.

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి యుద్ధంలో వీరోచితంగా పోరాడారు. కంపెనీ సైనికాధికారులకు ముచ్చెమటలు పట్టించారు. సర్ హ్యూరోజ్ ఈమె ధైర్యసాహసాలను మెచ్చుకుని ఆశ్చర్యపోయారు. ఈమె తన ఝాన్సీ కోట చేజారిపోయినా బ్రిటిష్ వారికి లొంగలేదు. గ్వాలియర్ కోటని రక్షించడం కోసం యుద్ధం చేశారు. “1857 విప్లవకారులందరిలోనూ అత్యంత ధైర్యసాహసాలతో యుద్ధం చేసిన మహిళ” అనీ హ్యూరోజ్ ఈమెని కొనియాడారు.

ఝూన్సీ లక్ష్మీబాయి ఆధ్వర్యంలో నడిచిన ‘దుర్గావాహిని’ మహిళా సైన్యాధిపతి శ్రీమతి ఝల్కారీబాయి. విపత్కర పరిస్థితులు సంభవించినపుడు లక్ష్మీబాయి రక్షించి బయటకు పంపించారీమె. లక్ష్మీబాయి స్థానంలో ఈమె నిలబడి యుద్ధం చేశారు. ప్రాణత్యాగం చేశారు.

ఔధ్ రాణి బేగం హజ్రత్ మహల్ కంపెనీని వ్యతిరేకించి, హిందూ – ముస్లిం సమైక్యతతో ప్రజలను యుద్ధానికి సన్నద్ధం చేశారు. ఉదాదేవిని సైనికాధిపతిగా నియమించారు. ఉదాదేవి స్వయంగా 32 మంది బ్రిటీష్ యోధులను మట్టు పెట్టడం గొప్ప విశేషం. బేగం హజ్రత్ మహల్ బ్రిటిష్ వారికి లొంగకుండా నేపాల్‌లో అజ్ఞాతంగా ఉన్నారు.

1857 స్వాతంత్ర్య సమరానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండు మినియేచర్ షీట్లను, ఒక షీట్‌లెట్‌ను విడుదల చేసింది భారత తపాలాశాఖ. 2007 ఆగష్టు 9వ తేదీన కొన్ని స్టాంపులతో పాటుగా అవి విడుదలయ్యాయి.

షీట్‍టెట్లు, మినియేచర్ షీట్ల లోపలి దీర్ఘచతురస్రాకారపు చట్రాలలో మనదేశపు యోధులు, బ్రిటిష్ సైనికులతో పోరాడే సన్నివేశాలను ముద్రించారు.

చట్రాల వెలుపల 1857 స్వాతంత్ర సమరయోధుల చిత్రాలను ముద్రించారు. వీరిలో బహదూర్‌షా జాఫర్, నానాసాహెబ్, తాంతియాతోపే వంటి వీరులతో పాటు ఝూన్సీరాణి లక్ష్మీబాయి, బేగం హజ్రత్ మహల్‌ల చిత్రాలు కూడా కనిపిస్తాయి.

1857 ప్రథమ ప్రపంచానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విడుదలయిన మినియేచర్ షీట్లను గుర్తు తెచ్చుకుంటూ మే 10వ తేదీ విప్లవ ప్రారంభాన్ని గుర్తు చేసుకుంటూ వీరులు నివాళిగా ఈ వ్యాసం.

***

Image Courtesy: Internet

Exit mobile version