[డా. సారధి మోటమఱ్ఱి గారు రచించిన ‘2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
అంధకార, ఆక్రోశ, అయోమయ –
మేఘాలు జగతిని ఆవరించి..
ఉరిమి, మెరిసే, తోకచుక్కల
విధ్వంసకర, వినీల నాట్యం..
జగతిని వెన్నాడి వేటాడే
అధికార భీకర బలధాటి..
ఒకరిని ఒకరిని ఓర్వలేని
మూర్ఖ మత ఛాందసత..
ఎదురు ఎదురు కూల్చుకొని
ప్రక్క ప్రక్కవారిని కూలదోసి..
మానవ విజ్ఞాన పరాకాష్ఠ –
విధ్వంస వినాశన ధ్యేయాలేనని..
కంట కన్నీరు పారించే
మానవ రోదన బాజాలు..
మనసున్న మనిషిని నిలదీస్తుంటే
మంచియన్న విశ్వావసు మరుగవుతూ..
కష్టనష్టాల అననుకూల పరాభవాల
పరాభవ ఉషోదయ క్షణాన..
ఎగసి నింగి తాకుతున్న జ్వాలలు –
శాంతి పథానికి వెలుగు చూపేనా!!?
ఏకీకృత భావనతో వీక్షించ గలిగితే – ప్రకృతి అంతా, భిన్న విజ్ఞానాల సమాహారమేనని; కళల మరియు శాస్త్రీయ శాలలు, వేరు వేరు కాదని; వాటి అభేద భావనయే – జ్ఞానానికి పరాకాష్టయని – మోటమర్రి సారధి ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఒక కవిత వ్రాయంలో, ఒక వంతెన నిర్మించడంలో లేదా ఒక కంప్యూటర్ ప్రోగ్రాం సృజించడంలో – భేదాలు తనకెప్పుడూ అగపడలేదంటారు.
మనుషులు, మనుషుల తత్వాలు; కొండలు, కోనలు; నదులు, సముద్రాలు; వినీలాకాశం, నిర్మలత్వం – ఇవన్నీ ఆయనకు ప్రేరణ కలిగించేవే. మానవజాతిని ఉన్నత స్థితికి కొనిపోవాలని, అత్యున్నత సాహితీ సంపదను, మనకందించిన, ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న కవులు, రచయితలందరికీ, మనమెంతో ఋణపడి ఉన్నామని అభిప్రాయపడతారు.
మానవజాతి చరితను క్లుప్తంగా క్రోడీకరించిన, స్వామి వివేకానంద, ఈ నాలుగు మాటలు, తననెంతో ప్రభావితం చేశాయని చెబుతారు:
“మనిషి అడుగు వేసినప్పుడు, ముందుకు పోయేది – మెదటి కంటే, అతని ఉదరమే (ఆకలి)! ఉదరాన్ని (ఆకలిని) దాటి, మానవజాతి ముందుకు అడుగు వెయ్యడానికి, యుగాలు పట్టవచ్చు.”
