తేది 19-03-2026 న సాయంత్రం 06.00 గంటలకు ముంబయి, ఖార్ లోని విష్ణుప్రసాద్ సభాగృహంలో తెలుగువారి ఉగాది – మరాఠీ వారి గుడి పాడ్వా సంబరాలు ఘనంగా జరిగాయి.
మహారాష్ట్ర ప్రభుత్వ తెలుగు సాహిత్య అకాడెమీ ద్వారా సాహిత్య – సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసిద్ధ మరాఠీ, హిందీ సాహితీవేత్త, అనువాదకులు శ్రీ చంద్రకాంత్ భోంజాళ్ గారు ‘మరాఠీ-తెలుగు అనుబంధాలు’ పై మాట్లాడుతూ, ఉగాది-గుడి పాడ్వా పేర్లు వేరైనా వాటి ఆత్మ ఒక్కటే, అని విశ్లేషించారు. ఎన్నో మరాఠీ పుస్తకాల, తెలుగు అనువాదాల లభ్యత గురించి చెబుతూ, తంజావూరు పరిపాలించిన నాటి మరాఠా రాజులు తెలుగులో కావ్యాలు రాశారని అన్నారు. అలాగే జ్ఞానపీఠ్ గ్రహీతలు విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణరెడ్డి గార్లు, వారికి ఆ పురస్కారాలు లభించిన సందర్భంగా చేసిన ప్రసంగాలు, వారి పరిచయం, తాను మరాఠీలోకి అనువదించానన్నారు. ఇంకా ఇరు సంస్కృతుల్లో ఉన్న సామ్యాలను వివరించారు. అక్క, అన్న లాంటి తెలుగు శబ్దాలు మరాఠీలో ఉన్న వైనం ఉటంకించారు. పచ్చడి పదం మరాఠీలో కూడా ఉందన్నారు.
దాదాపు రెండు వందల యాభై మంది హాజరైన ఆ సమావేశానికి ఆడపడుచులు పెద్ద సంఖ్యలో రావడం విశేషం. ఆహూతుల ద్వారా దీప ప్రకాశనం తర్వాత, సభకు మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యదర్శి శ్రీ సచిన్ నింబాళ్ కర్ గారు, స్వాగతం చెబుతూ, మహారాష్ట్ర ప్రభుత్వం, తెలుగు సాహిత్య అకాడెమీ స్థాపించిన ఉద్దేశం ఇరు సాహిత్యాల, సంస్కృతుల సమ్మేళనం మరియు వారి మధ్య అనుబంధం మరింత పెరగడం అన్నారు. అలాగే దాదాపు వంద పుస్తకాలు రాసిన ముఖ్య అతిథి శ్రీ చంద్రకాంత్ భోంజాళ్ గారిని సభకు పరిచయం చేశారు.
ఆ తర్వాత శ్రీ గుఱ్ఱం బాలరాజు గారు శ్రీ పరాభవ నామ సంవత్సరం పై పంచాంగ శ్రవణం చేశారు. వివిధ రాశుల వారికి ఈ సంవత్సరంలో ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాల గురించి, ఆయా గ్రహాల స్థానాల ఆధారంగా వివరించారు. శ్రీ జిల్లా గోవర్ధన్ గారు, శ్రీ కంటె అశోక్ గారి తెలుగు భాష సేవ గురించి, వారు తెలుగు వారందరిని కలుపుకొని ముందుకు సాగడం గురించి విశేషించి ప్రస్తావించారు. గంజి జగన్ బాబు, కంటె అశోక్ గార్లు విజయవంతంగా నిర్వహించే ఎన్నో కార్యక్రమాలు తనను అబ్బుర పరిచాయన్నారు. ఆ తర్వాత ఉగాది-గుడి పాడ్వా పండగల ఆచార వ్యవహారాలు, సామ్యాలు, భేదాలు విపులంగా విశ్లేషించారు.
స్థానిక కళాకారులు తమ నాట్యాలతో ప్రేక్షకులను అలరించారు. చిన్నారుల ఉగాది పండుగ నృత్యం, పెద్ద ఆడపడుచుల బతుకమ్మ నాట్యం మన సంస్కృతిని వేదికపై సాక్షాత్కరింపజేశాయి. ఆ ప్రదర్శనలో, జీడిమెట్ల సంధ్య, చంద్రకళ వల్లాల, దీప్తి నరగె, ధనలక్ష్మి నలమడి, సుదాగాణి దేవేంద్ర, సబిత కర్నాటి, కవిత తాండ, అనిత బుడగె, పల్లవి గోలడ, సైనేహ బాంది, ధ్రువిక శాకపురం పాల్గొన్నారు. ఐతే తొమ్మిది సంవత్సరాల చిన్నారి, రణవిత సోనవేణి చేసిన ‘ఎల్లమ్మ’ నృత్యంతో ప్రేక్షకుల చప్పట్లు మిన్నుముట్టాయి. అంత చిన్న వయసులో చిన్నారి చేసిన ఆ నాట్యం మన తెలుగు రాష్ట్రాల్లోని బోనాలను తలపించింది.
గణపతి స్తవంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీమతి శ్రావణి చాట్ల, మధ్యమధ్యలో తన శ్రావ్య కంఠంతో తెలుగు పాటలు వీనుల విందుగా ఆలపించారు.
తదుపరి జరిగిన కవి సమ్మేళనంలో డా. కె.వి. నరసింహారావు, గుఱ్ఱపు కిషన్, అంబల్ల జనార్దన్, తురగా జయశ్యామల, పొన్నూరి భారతలక్ష్మి గార్లు ఉగాది పండుగపై, వైవిధ్యమైన తమ కవితలను వినిపించారు.
ఈ కార్యక్రమం రూపొందించిన గంజి జగన్ బాబు, కంటె అశోక్, అంబల్ల జనార్దన్, హరీశ్, నరేశ్ ప్రభృతులు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న వారందరిని జ్ఞాపిక, ప్రమాణ పత్రాలతో సన్మానించారు.
కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికి మన ఉగాది పచ్చడి స్వాగతం పలుకగా, బూరెలతో విందు, వీడ్కోలు పలికింది. కార్యక్రమానికి శ్రీ నరేశ్ గారు సమన్వయకులుగా ఉన్నారు. శ్రీ అశోక్ కంటె గారు, ఆసక్తికరమైన తన సహజ శైలిలో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహారాష్ట్ర గడ్డపై మన ఉగాది, గుడి పాడ్వలు చేయిలో చేయి వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయి.
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.

