Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అలరించిన 2026 ఉగాది కవిసమ్మేళనం – వార్త

[మహబూబ్‍నగర్‌లో జరిగిన ‘2026 ఉగాది కవిసమ్మేళనం’ కార్యక్రమం వివరాలను అందిస్తున్నారు శ్రీ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్.]

పాలమూరు సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ ఉగాది కవిసమ్మేళనం అందరినీ అలరించింది. మార్చి 14  మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ రెడ్ క్రాస్ బిల్డింగ్ లో జరిగిన శ్రీ పరాభవ ఉగాది కవిసమ్మేళనం మరియు బోల యాదయ్య రచించిన తండ్లాట అనువాద కృతి ‘హార్ట్ బీట్’ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ ఉగాది కవిసమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కళాకారుల సంస్థ అధ్యక్షులు‌‌, ప్రముఖ న్యాయవాది వి. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎంతోమంది నవయువకవులు రావడానికి, రాయడానికి ఇలాంటి కవిసమ్మేళనాలు ఉపయోగపడతాయని అన్నారు. కవిత్వం అంటేనే ఒక రకమైన తండ్లాట అని అన్నారు. కవిత్వం రాయడం గొప్ప విషయం కాదని, అందరినీ మెప్పించేటట్లు రాయడం గొప్ప విషయమన్నారు.

‘హార్ట్ బీట్’ పుస్తకావిష్కర్త, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కం జనార్దన్ మాట్లాడుతూ పాలమూరు కవిత్వం ప్రపంచస్థాయిలో రాణించాలంటే మన కవిత్వం ఆంగ్లంలోకి అనువాదం కావాలన్నారు. బోల కవిత్వాన్ని అనువాదం చేసిన పుస్తక అనువాదకులు సానె శివశంకర్ ను ఈ సందర్భంగా అభినందించారు.

సభాధ్యక్షులు, ప్రముఖ విద్యావేత్త కె.లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ సందర్భానుసారంగా సమకాలీన అంశాలను తీసుకుని రాయడం కవి లక్షణమని అన్నారు. మానవత్వమే కవిత్వం యొక్క ప్రధాన లక్షణమన్నారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి ఉదయమిత్ర మాట్లాడుతూ పాలమూరు కవిత్వం పాలమూరు వరకు మాత్రమే ఉండకుండా ఇతర భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర భాషా కవులతో పోటీపడి రాయాలన్నారు.

ప్రముఖ ఆంగ్ల అధ్యాపకులు బైరెడ్డి సతీష్ రెడ్డి పుస్తకాన్ని చక్కగా సమీక్షించారు. తెలుగు సాహిత్యంలో కాలానుగుణంగా అనేక కవితా ప్రక్రియలు వస్తున్నాయని‌, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. తెలుగులో నానీలు, మొగ్గలు వంటి ప్రక్రియలు వచ్చిన తర్వాత ఎంతోమంది కవులు తయారయ్యారన్నారు. ‘తండ్లాట’ను ‘హార్ట్ బీట్’ పేరుతో చక్కగా అనువాదం చేసిన సానె శివశంకర్ ను అభినందించారు.

ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పుస్తక అనువాదకులు సానె శివశంకర్ మాట్లాడుతూ బోల యాదయ్య నానీల ప్రక్రియలో రాసిన తండ్లాటలో తన జీవితంలో జరిగిన అనేక సంఘటనలను చక్కగా కవిత్వం చేశాడన్నారు. ‘తండ్లాట’ పుస్తకాన్ని అనువాదం చేయడానికి తనకు అవకాశం కల్పించిన బోల యాదయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

మూలకృతికర్త బోల యాదయ్య మాట్లాడుతూ తండ్లాట నానీలు ఇప్పుడు విశ్వవ్యాప్తం కావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

కార్యక్రమ సంయోజకులు డా. భీంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలకు పైగా ఉగాది కవిసమ్మేళనాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం శ్రీ పరాభవ ఉగాది పురస్కారాలను ప్రముఖ కవి, నటులు ఏపూరి కిష్టప్ప, ప్రముఖ కవయిత్రి టి.అంబుజ లకు అందజేశారు. అలాగే కవిసమ్మేళనంలో పాల్గొన్న యాభైమంది కవులకు సన్మానం చేశారు.

Exit mobile version