Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘విమలాస్మారక’ విమలాశాంతి కథాసాహిత్య పురస్కారం-2026 -పురస్కారాల ప్రకటన

జాతీయస్థాయిలో అందించే ప్రతిష్ఠాత్మకమైన ‘విమలా స్మారక’ విమలా శాంతి కథా సాహిత్య పురస్కారం-2026 కోసం, ఈ సంవత్సరం మారుతీ పౌరోహితం గారి ‘ఇల్లిడిసిన తొమ్మిది కథలు’, స్వర్ణ కిలారి గారి ‘గోడవతల’ కథాసంపుటాలు ఎంపికయ్యాయని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాం.

ఈ పురస్కార ఎంపికకు ఆచార్య కాత్యాయనీ విద్మహే, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, పలమనేరు బాలాజి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. అట్లే కొంతమంది ప్రముఖ సాహిత్యవేత్తలు, ఈ పోటీలో పాల్గొన్న కొందరు రచయితలు చేసిన సూచన ప్రకారం, ఈ సంవత్సరం మరొక ముగ్గురు రచయితలు మునిసురేష్ పిళ్ళై (కథాసంపుటి – గారడివాడు),  డా. కెంగార మోహన్ (బ్లాక్ రెయిన్‌బో), శ్రీ ఊహ (బల్కావ్) గారికి ప్రత్యేక పురస్కారాలు సగౌరవంగా ప్రదానం చేయడానికి విమలా శాంతి సాహిత్య సేవాసమితి నిర్ణయించింది.

ఈ పురస్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కథా సాహిత్యంలో లబ్ధ ప్రతిష్ఠులు, యువ కథా రచయితలు, మా సాహిత్య పురస్కారం పట్ల ఎనలేని గౌరవంతో 53 కథా సంపుటాలను పంపారు. ఆ కథా సంపుటాలను స్థానిక కథా రచయితలు ప్రాథమికంగా పరిశీలన చేసి, అందులో 24 కథా సంపుటాలను న్యాయ నిర్ణేతల కోసం ఎంపిక చేశారు.

మా సాహిత్య సేవాసమితి అభ్యర్థన మేరకు, తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధులైన ఆచార్య కాత్యాయనీ విద్మహే, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, పలమనేరు బాలాజి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, మేము పంపిన 24 కథా సంపుటాలను క్షుణ్ణంగా పరిశీలించి, 10 కథా సంపుటాలకు మార్కులు కేటాయించి వాటి స్థానాలను తెలియజేసినారు.

ఈ మా పురస్కారం కోసం ఎంపికైన కథారచయితలకు మనసారా అభినందనలు తెలుపుతున్నాం. మా ఈ క్రతువులో పాలుపంచుకొని, దాదాపు రెండు నెలల కాలాన్ని వెచ్చించి, ఎంతో శ్రమపడి, మేము పంపిన కథా సంపుటాలన్నీ చదివి తమ అమూల్యమైన నిర్ణయాలను అందజేసిన న్యాయనిర్ణేతలకు,  తమ తమ కథా సంపుటాలను పంపి ఈ పురస్కారం పట్ల గౌరవభావాన్ని వెలిబుచ్చిన రచయితలకు మనసారా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వచ్చే నవంబర్ నెల చివర్లో గానీ డిసెంబర్ మొదటి వారంలో గానీ అనంతపురంలో ఏర్పాటు చేయబోయే పురస్కార ప్రదాన సభలో పురస్కార గ్రహీతలకు నగదు పారితోషికంతో పాటు పురస్కార జ్ఞాపికను అందించి సముచిత రీతిని సత్కరిస్తామని విన్నవిస్తున్నాం.

Exit mobile version