Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

31. రోహిణి

2018 దీపావళి కథల పోటీకి వచ్చిన కథ.

ర్ధరాత్రి పన్నెండు. రోహిణికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ప్రక్కకు తిరిగి చూస్తే సారథి లేడు. ఆ తర్వాత నిద్రపట్టలేదు. మనసంతా అదోలా అయిపోయింది. ‘కొన్ని నిజాలు చెదుగానే వుంటాయి. జీర్ణించుకోకతప్పదు. నెమరువేసుకుంటూ కుర్చుంటే ప్రయోజనం శూన్యం’ అనుకుంటూ మరో ప్రక్కకు తిరిగి పడుకుంది. అన్ని ప్రక్కల నుంచి ఆలోచనలు చుట్టుముడ్తున్నాయి. అసహనంగా మంచం మీంచి లేచి, హాల్లోకి వచ్చి లైటు వేసింది. ప్రక్క గదిలో పిల్లలిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. వాళ్ళ భవిషత్తుతోనే తన భావి జీవితం ముడిపడివుది… అనుకుంటూ సోఫాలోనే తల వెనక్కు వాల్చి కళ్లు మూసుకుంది. లైటు తీయబుద్ది కాలేదు. అసలు తన జీవితంలో నుంచే చీకటిని తరిమికొట్టాలన్నంత కసిగా ఉంది తనకు. పగలు, రాత్రి వెలుగులోనే ఉండాలి.

***

ప్రోద్దున్నే సతీష్ వచ్చాడు. సారథికి క్లోజ్ ఫ్రెండ్, ఆఫీసు కోలీగ్.

“రండన్నయ్యా.. కూర్చోండి. నిన్న సాయంత్రమే హైద్రాబాదు నుంచి వచ్చాను. హెడ్డాఫీసులో మీరు చెప్పిన అతన్ని కలిసాను. అతనితో పనవ్వదని తెలిశాక, ఎం.డి.ని కలిసాను. ఆఫీసు నుంచి రావాల్సిన గ్రాట్యుటీ, ప్రావిడెంట్ ఫండ్… అన్నీ వారంలో అందేలా చూస్తానన్నారు. ఆయన పర్సనల్ ఫోను నంబరు ఇచ్చారు. అవసరమైతే ఫోను చేయమన్నారు” అంది రోహిణి.

“నువ్వు ఆడపిల్లవు. ఎం.డి.ని కలిశావంటే ఆశ్చర్యంగా వుంది. ఇన్నేళైనా నేనే ఎప్పుడూ ఆయన్ను కలిసే సాహసం చేయలేదు.” అన్నాడు సతీష్.

“అన్నయ్యా ప్లీజ్… ఆడ-మగ.. ఆ వివక్ష చూపొద్దు. నా పని నేను చేసుకోవటానికి ఎందుకు భయపడాలి? అలాగే, ఈ రోజు ఇన్సురెన్సు క్లైమ్ కోసం జీవిత భీమా సంస్థ బ్రాంచి మేనేజర్ని కలుద్దామనుకుంటున్నాను.” అంది రోహిణి.

“అన్ని పనులు నువ్వే చేసుకుంటాన్నావు. నాక్కూడా నీకు సాయం చేసే అవకాశం ఇవ్వుమ్మా…”

“నా వల్ల కాని పనిలో మీ సహాయం తప్పక తీసుకుంటాను.”

“పోనీ, డబ్బేమైనా అవసరముంటే చెప్పమ్మా… సర్దుబాటు చేస్తా” అన్నాడు సతీష్.

“ప్రస్తుతానికి లేదు. అవసరమైతే అడుగుతాను. అప్పుడు కాదనకుండా ఇవ్వండి. ఇదిగోండి, ఈ లిస్టులో వున్న వాళ్ల ఫోను నంబర్లు కూడా ఇవ్వండి. వీళ్లంతా మీకు, సారథికి సన్నిహితులే. ఎవరితో ఎప్పుడు ఏ అవసరముంటుందో ఏమో! ఫోను నంబర్లు ఉంటే మంచిది కదా? ” అంది రోహిణి.

“అలాగే, సాయంత్రం తెచ్చిస్తాను.” అంటూ లేచి వెళ్ళిపోయాడు సతీష్.

***

ఎం.డి. గారు చెప్పిన ప్రకారం, వారం లోపే సారథి ఆఫీసు నుంచి రావల్సిన సొమ్ము మొత్తం అందింది. ఇన్సురెన్సు క్లైమ్ కూడ వచ్చేసింది.

సతీష్, తను అడిగిన లిస్టులో వున్న వాళ్ల ఫోను నంబర్లు ఇవ్వటంతో… కొందరితో ఫోను చేసి మాట్లాడింది. మరి కొందర్ని స్వయంగా కలిసింది. వాళ్ళుకు సారథి తన డైరీలో రాసింది చూపించింది. కొందరు వారంలో, మరి కొందరు నెల, రెండు నెలల్లో స్పందించారు. సారథి వాళ్లందరికీ అప్పుగా ఇచ్చిన సొమ్మును, ఓపికతో రాబట్టుకోగలిగింది.

ఇప్పుడు రోహిణి బ్యాంకు బేలన్సు సంతృప్తికరంగా వుండటంతో.. మనోదైర్యంతో పాటు ఆత్మవిశ్వాసం చోటు చేసుకుంది. ముందున్న బెఱుకు, భయం స్థానే భరోసా, భద్రత వచ్చిచేరింది.

సారథి గుర్తొచ్చాడు. మనిషి తెలివైనవాడు, చురకైనవాడు, మాటకారి, సహాయకారి. అన్నీ ఉండి దారితప్పాడు. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రావటం మానేసి కంట్రాక్టర్లు, స్వేహితులతో కలసి క్లబ్‌లో పేకాట.. మందు.. ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరటం. సరదా, స్టేటస్ అంటూ మొదలు పెట్టిన, వ్యసనంగా మారాక ఆ ఊబిలో నుంచి బయటకు రాలేకపోయాడు. మనిషి చెడిపోయాడే కాని, చెడ్డవాడు మాత్రం కాదు. చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏమైతేనేం నష్టం జరిగిపోయింది. చింతిస్తూ కూర్చుంటే జరిగిన నష్టాన్ని పూడ్చలేం. జరగాల్సిందాని మీద దృష్టి పెట్టాలి. పడిలేచే కెరటం తన ఆదర్శం కావాలి… ఏదో సాధించాలన్న తపన ఆవేశం ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి రోహిణిలో.

ఇప్పుడు తన ముందున్న లక్ష్యాలు రెండు. ఒకటి పిల్లల్ని బాగా చదివించాలి. వాళ్లకు తండ్రి లేని లోటు కన్పించకూడదు. రెండోది… ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు ముసురుకుంటాయి. కనుక, ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలి. అది తనతో పాటుగా మరో కొంతమందికి ఉపాధి కల్పనావకాశం కల్పించేదిగా ఉండాలి. అందుకనే, సారథి ఆఫీసులోనే ఉద్యోగావకాశం ఉందన్నా, తను దానికి మొగ్గు చూపలేదు. ఆయన పని చేసిన చోట, ఆ జ్ఞాపకాల నడుమ తను ఇమడలేదు.

ఆయన ఉన్నప్పుడు తను ఇంటికే పరిమితమైపోయింది. కామర్సులో పి.జి చేసినా, అది కేవలం ఒక విద్యార్హతగానే మిగిలిపోయింది. అదొక్కటే వ్యాపారరంగానికి సరిపోదు. తను ఎంచుకోబోయే స్వయం ఉపాధి పథకానికి రూపకల్పన, సాంకేతిక శిక్షణ, ఆర్ధికాంశాలు, వ్యాపార భాగస్వామ్యం, యూనిట్ స్థాపనకు అవసరమైన మౌళిక సదుపాయాలు, ప్రభుత్వ పర్మిట్లు, మార్కెట్ స్టడీ.. ఇంకా అనేకానేక అంశాలపై సమగ్ర పరిశోధన, అవగాహనతో పాటు… ఆత్మవిశ్వాసం, పట్టుదల, కఠోరశ్రమ, పోటీతత్వం కూడ జతకూడితేనే, వ్యాపారరంగంలో నిలదొక్కుకోగల్గుతుంది… రోహిణి రాత్రింబవళ్లు ఇవే ఆలోచనలతో సతమతమవుతోంది.

అంతలోనే… ‘ఉఫ్! ఇదంతా తన శక్తికి మించిన పనిలావుంది. ఇంత శ్రమ, రిస్కుతీసుకోవటం దేనికోసం? కేవలం ధనార్జన కోసమేనా? అందుబాటులో వున్న ఉద్యోగంలో చేరిపోయి… నెల జీతం తీసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ… ప్రశాంతంగా ఉంటే చాలదూ? ఉద్యోగమా… వ్యాపారమా..? క్లేష్.. కన్‌ఫ్యూజన్’. రాత్రుళ్లు నిద్ర కరువు. ఆరోగ్యం క్షీణిస్తోంది.

అయినా ‘మనసంతా నువ్వే’ అన్నట్లు బిజినెస్ వైపే తన పరుగు. ఎంత కష్టమైనా, నష్టమైనా చేసే పనిలో థ్రిల్‌వుండాలి. ఛాలెంజ్ ఉండాలి, పనిలో అలసిపోవాలి. అంకితమైపోవాలి. అంతే కాని డైలీ రోటీన్‌లా, మొనాటనస్‌గా ఉంటూ.. రుచి పచిలేని వంటకంలా చేసే ఉద్యోగం తనకు నచ్చదుగాక నచ్చదు. తన లక్ష్యం.. ‘ఉపాధి పథకమే..’ అన్న స్థిర నిశ్చయానికి వచ్చేసింది రోహిణి.

సతీష్ వచ్చాడు. “మేడమ్, ఎం.డి గారి నుంచి లెటరొచ్చింది. ఈ నెలాఖరు లోపల మీరు ఉద్యోగంలో చేరకపోతే, మీ ఉద్యోగపు నియమక ఉత్తర్వుల రద్దవుతాయట. నా మాట విని ఉద్యోగంలో చేరిపోండి మేడమ్. మీకే ఇబ్బంది వుండదు. మేమందరం మీక అండగా వుంటాం.” అన్నాడు.

సతీష్ చెప్పింది విని, మౌనంగా వుండిపోయింది రోహిణి.

***

కళ్లెం లేని గుర్రంలా కాలం పరుగెడుతోంది.

ఎన్నో ప్రాజెక్టులను పరిశీలించి.. ఒకటి ఎంచుకున్నాక, ఆ ప్రాజెక్టు స్టడీ, సాధ్యాసాధ్యాల పరిశీలనా, ఇతరత్రా అంశాలపై సమగ్ర అవగాహన కోసమే దాదాపు ఏడాది పట్టింది రోహిణికి. ఉదయం ఏడింటికే పిల్లల్ని స్కూలు బస్సు ఎక్కించి, తను కూడా అట్నుంచటే ప్రాజెక్టటు పని మీద బయల్దేరితే… మళ్ళీ సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చే సమయానికి ఇంటికి చేరుకోవల్సి రావటంతో ఎన్నో పనులు అసంపూర్తిగా వదిలేసి రావటం పెద్ద సమస్యగా మారింది.

ఏడాది క్రితమే రిటైరైన రోహిణి తండ్రి, తల్లితో సహా తన దగ్గరకు వచ్చేయటంతో ఒకరకంగా పిల్లల సంరక్షణ, తన ప్రమేయం లేకుండానే వారి చేతుల్లోకి వెళ్ళిపోయిది. ఆ వయస్సులో వారిని శ్రమ పెడ్తున్నందుకు రోహిణి మనసులో బాదగావున్నా తన లక్ష్యసాధనకు మరో ప్రత్యామ్నాయం కన్పడలేదు. అయితే… సంస్థ ఉత్పత్తి ప్రారంభమై ప్రారంభ దశ బాలారిష్టాలు అధిగమించి, గాడిలో పడిన వెంటనే.. ఇంట్లో ఒక మెయిడ్ సర్వెంటును పెట్టి తల్లిదండ్రుల మీద పడిన పని భారాన్ని తగ్గించాలని నిశ్చయించుకుంది.

నగరంలో వున్న కొంత మంది పారిశ్రామిక వేత్తులను కలసి.. వారి సూచనలు, సలహాలు, అనుభవాలు అడిగి తెలుసుకుంది. పారిశ్రామిక రంగానికి చెందిన ప్రభుత్వాధికారులతో అనేక సార్లు సమావేశమై సందేహాలు నివృత్తి చేసుకుంది. బ్యాంకు అధికారులతో సంస్థాపనకు కావాల్సిన యంత్రసామగ్రి కోనుగోలు, ముడి సరుకు సేకరణ, కార్మికుల నియామకం, సాంకేతిక శిక్షణ ఇప్పించటం.. తనతో జత కడ్తామన్న వ్యాపార భాగస్వాములతో సంప్రదింపులు.. ఓహ్! అసలు తను తనేనా అన్నంతగా తను ఈ సంవత్సర కాలం కష్టపడిన తీరు చూసి తనను తానే నమ్మలేకపోయింది. అదే ఈ రోజు సారథి సజీవంగా ఉండి వుంటే, తన శక్తి సామర్థ్యాలు తనకు ఎప్పటికీ తెలిసి వచ్చేవికావు. ఏ మనిషికైనా అవకాశం, అవసరం ఉండి.. ఏదైనా శోధించి, సాధించాలి అన్న తపన, ‘ఇన్నర్ ఫైర్’ ఉంటే కాని, ఆ వ్యక్తిలో నిబిడీక్తమైవున్న శక్తియుక్తులు వెలుగులోకి రావు.. తనను తానే అంచనా వేసుకుంటోంది రోహిణి.

***

రోహిణి కల, కష్టం నిజమయ్యే రోజు రానే వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సాంకేతిక శాఖ ‘స్త్రీ స్వాభిమాన్’ వారి సహకారంతో.. మహిళా ఆత్మ గౌరవానికి, ఆరోగ్య రక్షణకి అవసరమైన శానిటరీ న్యాప్కిన్ల తయారీ సంస్థ రూపు దిద్దుకుంది. ఉత్పత్తి ప్రారంభమైంది. తను తన మహిళా సిబ్బంది స్వయంగా వాడి చూడటంతో పాటు, చుట్టు ప్రక్కల మహిళలకు ఉచితంగా ఇచ్చి, స్త్రీల విద్యాసంస్థల్లో శిబిరాలు ఏర్పాటు చేసి.. న్యాప్కిన్ల వాడకంపై అవగాహన కల్పించటంతో, రోహిణి బ్రాండ్ శానిటరీ న్యాప్కిన్లకు డిమాండు అనుహ్యంగా పెరిగింది. డ్వాక్రా మహిళా సంఘాలతో కూడ వ్యాపార ఒప్పందం కుదుర్చుకోవటంతో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా న్యాప్కిన్ల వాడకం విస్తరంచింది.

అనతి కాలంలోనే న్యాప్కిన్ల ఉత్పత్తి లక్షల్లోకి చేరింది. పరిశ్రమ సామర్ధ్యంతో పాటు, కార్మికుల సంఖ్యకూడ ఎన్నో రెట్లు పెరిగింది. బ్రాండెడ్ కంపెనీల ఉత్పత్తుల్లో ప్లాస్టిక్ వాడకంతో పాటు, ధరకూడ అధికం కావటం.. అందుకు భిన్నంగా కేవలం కలప గుజ్జుకే వాడి తయారు చేసిన పర్యావరణహిత న్యాప్కిన్లు తక్కువ ధరకే లక్ష్యమవుతుండటంతో.. బ్రాండెడ్ కంపెనీల గట్టి పోటిని తట్టుకుని విజేతగా నిలిచింది రోహిణి.

కేంద్ర ప్రభుత్వం నుంచి ‘స్త్రీ స్వాభిమాన్ ఎన్స్‌లెన్స్’ అవార్టును అందుకుంది.

***

 ఒక ప్రముఖ దినపత్రిక విలేకరి తనను ఇంటర్వూ చేయటానికి వచ్చాడని తెలిసి, తన ఛాంబర్‌లోకి ఆహ్వానించింది రోహిణి.

“మేడమ్, మీ విజయ ప్రస్థానం గురించి చెప్పండి” అని విలేకరి అడగ్గనే, “మా వారున్నంత వరకూ నేను ఒక సామాన్య గృహిణినే. ఆ తర్వాతే.. పరిస్థితుల ప్రభావం అనుకోండి, అంతర్గతంగా నాలో ఉన్న తపన, తృష్ణ అనుకోండి.. స్వయం కృషితో ఏదో ఒకటి సాధించితీరాలనే ‘స్టీల్ విల్’.. నన్ను ఆ దిశగా నడిపించాయి.”

“సామాన్య గృహిణి నుంచి ఒక పారిశ్రామిక వేత్తగా ఎదగటం అంటే మాటలు కాదు. దానికి ఎంతో ఓర్పు నేర్పు, సహనం అవసరం, ఏ దశలోనైనా మీరు మళ్లీ గృహిణిగానే ఉండి పోదామనుకున్నారా?”

“లేదు, అది నాలక్షణం కాదు. నేనొకసారి నిర్ణయం తీసుకున్నానంటే ఆ దిశగా ప్రయత్నలోపం వుండదు. వెనుకడుగు వేయటం వుండదు. నిజానికి ఆయన ఉన్నంత కాలం నేను ఏ ఒక్క ఆఫీసు గడప తొక్కలేదు. కనీసం బ్యాంకుకు కూడా వెళ్లలేదు. బ్యాంకు అకౌంట్ క్యాష్ డిపాజిట్టు, విత్ డ్రాయల్, బ్యంకులాకర్ ఆపరేషన్.. ఇవేమీ తెలిసేవి కావు. అన్నీ ఆయనే చూసుకునేవారు. డ్రైవింగు రాదు. ఎక్కడికెళ్ళాలన్నా సిటీ బస్సో ఆటోనో, ఆయన లేకపోయిన తర్వాత నేనంతగా వెనుక పడిపోయున్నానో తెలిసొచ్చింది.”

“నాలక్ష్య సాధన కోసం.. ఇవన్నీ ఎంత అవసరమో తెలిసొచ్చి మూడుంటే మూడు నెలల్లో.. డ్రైవింగుతో సహా అన్నీ నేర్చేసుకున్నాను. ఆ తర్వాత ఒక్కోక్కటిగా ఆఫీసులకు బ్యాంకులకు వెళ్ళటం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను కలవటం.. ఈ క్రమంలో నాలాంటి ‘లైక్ మైండెడ్’ వ్యక్తులతో పరిచయాలు, స్నేహం.. పరస్పర సహాయసహకారాలు అందజేసుకుంటూ సాగిపోయాం. దాంతో నాలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. అహర్నిశలు కష్టపడ్డాను. శారీరకంగా మానసికంగా అలసిపోతున్నా, పని.. పని.. పని రాక్షసిలా వర్కహాలిక్‌లా పని చేసాను” అంటూ నవ్వింది రోహిణి.

“మీ గెలుపు శాశ్వతం అనుకుంటున్నారా?” అడిగాడు విలేకరి.

“వాటే సిల్లీ క్వశ్చన్? మీరు నేనూ శాశ్వతమా? మీ ఉద్యోగం శాశ్వతమా? గెలుపు-ఓటమి ఏదీ శాశ్వతం కాదు. ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే, ఎప్పటి కప్పుడు మార్కెట్ రీసెర్చ్ చేస్తూనే పోవాలి. ఈ రోజున్న వస్తువు రేపు ఔట్‌డేట్ అయిపోతుంది. నిరంతరం మార్పులు చేర్పులు అవసరం.”

“మీ కుటుంబ సభ్యుల సహకారం?”

“మా తల్లిదండ్రులప్రోత్సాహం, సహకారం ఉంది కాబట్టే, నేను ఇల్లు, పిల్లల్ని వారికి వదిలేసి పూర్తిగా ఈ ప్రాజెక్టుకే అంకితమైపోయాను.”

“చివరగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు, ముఖ్యంగా మహిళలకు మీ సందేశం?”

“నేటి మహిళలు భర్త చాటు భార్యలు కాకుడదు. నేడు స్త్రీ పురుషులిరువురికీ సమాన అవకాశాలున్నాయి. ఈ ఇంటర్నెట్ యుగంలో స్త్రీలు ఇంట్లో కూర్చునే ఎన్నో పనులు చేయొచ్చు. గుడ్డిగా తమ భర్తల్ని అనుసరించి పోకుండా.. ప్రతీదీ అడిగి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి… స్త్రీలు డ్రైవింగు నేర్చుకోవటం చాలా అవసరం. అప్పుడే ప్రతి చిన్న పనికీ తమ భర్తలపై ఆధార పడకుండా వాళ్ళే చేసుకోగలుగుతారు. మావారు త్రాగిన మైకంలో వాహన నడుపుతూ ప్రమాదవశాత్తు తలకు గాయమై ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. హెల్మెట్ ఉంటే బ్రతికేవారు. ఒకటికి రెండు తప్పులు. హెల్మట్ ధరించటం, సీట్ బెల్టు పెట్టుకోవటం మహిళా చోదకులు సైతం తప్పక పాటించవలసిన నియమం. తమకు సంబంధించిన బ్యాంకు, పోస్టాఫీసు అకౌంట్లు, డిపాజిట్లు, ఆస్తుల పత్రాల్లో తప్పని సరిగా భార్యాభర్తల ఇద్దరి పేర్లు ఉండేలా.. జాయింటు అకౌంట్లు మాత్రమే ఉండాలి. ఉత్తరోత్రా సమస్యలు రాకుండా ఉంటాయి.”

“జరగరానిది ఒకవేళ ఏదైనా జరిగినా ‘సింపతీ వేవ్‌’లో కొట్టుకుపోకండి. ‘సింపతీ’ అనేది మనల్ని మరింత కృంగదీస్తుంది. మావారు పోయిన నెలకే నేను బయట తిరుగుతున్నానని కొందరు నన్ను తప్పు పడ్తే, ఆయన పోయినప్పుడు నేను బిగ్గరగా, గుండెలవిసేలా నెత్తి నోరు బాదుకుని ఏడవలేదని మరికొందరు నెపం వేశారు. నేను లోలోపల ఎంతగా కుమిలిపోయానో నా మనసుకు తెలుసు. అందుకనే కువిమర్శలు పట్టించుకోకండి. భవిష్యత్ కార్యాచరణపై మనసు లగ్నం చేయండి. అదొక్కటే మీ కళ్ళముందు కన్పడాలి. జేగంటలే మీ చెవులకు విన్పడాలి. మీ అడుగులు గెలుపు బాటలోనే నడవాలి. మీ చేతలు మీలో చైతన్యం రగిలించాలి. ‘వర్క్ ఈజ్ వర్షిప్’ అనుకుంటూ ఇష్టపడి పని చేస్తే శ్రమలోని మధుర్యాన్ని చవిచూస్తారు.”

“పురుషులకు నాదోక విన్నపం. మీతో పాటుగా మీ ‘బెటర్‌హాఫ్’కి సమాన హోదా ఇవ్వండి. వాళ్లని ‘కాన్ఫిడెన్స్’లోకి తీసుకోండి. ఎవరు ముందు ఎవరు వెనుక ఎవరు చెప్పగలరు? ‘జాయింట్ లైఫ్ పార్ట్‌నర్స్‌గా’ ఉంటూనే, అన్నింటా ‘జాయింట్ అకౌంట్ హోల్డర్స్’ గానూ ఉండండి.. నమస్కారం.” అంటూ తన సందేశాన్ని ముగించింది రోహిణి.

“ధాంక్స్ మేడమ్” అంటూ లేచి నుంచున్నాడు విలేకరి.

“మీ క్కూడా ధాంక్స్.. ఇదిగోండి.. ఈ ప్యాకెట్టు తీసుకోండి. మీ శ్రీమతికి ఇవ్వండి.” అంటూ రోహిణి బ్రాండ్ శానిటరీ న్యాప్కిన్ల కాంప్లిమంటరీ ప్యాకెట్టు విలేకరికి ఇచ్చింది రోహిణి.

Exit mobile version