Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

34. చిదిమిన మొగ్గలు

2018 దసరా కవితల పోటీకి వచ్చిన కవిత.

మొగ్గలు రేపటి పుష్పాలుగా మారి
వికసిత పరిమళాలతో ముద్దుమాటల
మురిపాలతోటలో కనువిందు చేసేవి.

ఆటపాటల సందడి చేస్తూ
ఆనందాల బృందావనంలో కన్నవారి కలలు

నెరవేర్చే దిశలో అడుగులు వేసేవారు.

ఏ తల్లి కలల పంటలో?
నవమాసాలు మోసి భావితరంకోసం కన్న ఇంద్రధనుస్సు కలలు కల్లలయ్యాయి
భవిష్యత్తు నందన వనంలో “కీచకులు ” ఉంటారని ఆదమరచినంతలోనే చిదిమి” అంగడి సరుకు” చేస్తారని తెలియదు పాపం!!
ముక్కుపచ్చలారని బంగారు తల్లులు ముద్దు మురిపాలకుదూరమై రక్కసులచేతుల్లో ప్రాణమున్న ఆట బొమ్మలయ్యారు
కన్నపేగు విలవిల రోదనలు కడుపుకోత గాయాలతో ఆ మూడునాళ్ళమురిపాలను నెమరువేసుకుంటూ
శోకసంద్రంలో చెదిరిన నవ్వుల ఆనవాళ్ళకోసం
వెతుకుతున్నారు.
“ఈస్ట్రోజన్” సూదులతో ఒంటినిండా గాయాలతో
పెరిగిన వయసు
మారిన రూపం
వారిని వారే గుర్తించలేనంతగా !!
వారెవరో తెలుసుకోలేనంతగా!!
ఎదిగిన శరీరం ఎదగని మనసుతో మూగబోయారు
పసిమొగ్గలు బలవంతంగా పుష్పాలు గా మారి మృగాల లాంటి మానవుల ఆకృత్యాల వలలో బంధీలయ్యారు.
పవిత్ర భరతభూమి లో అపవిత్ర అగమ్యాలుగా మిగిలి పోయారు.
(ఆపరేషన్ ముస్కాన్ లో బయటపడిన యాదాద్రి లోని వ్యభిచార గృహాలలోని నలిగిపోయిన పసిపిల్లల జీవితాలు)

Exit mobile version