వీల్‌చైర్‌లో కూర్చొని కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదువుతున్న రాఘవయ్యకు బయట గంటల చప్పుడు వినబడి లేచి బయటకు వచ్చాడు. కచ్చరం బండి ఇంటిముందాగింది. ‘ఎవరై ఉంటారా’ అనుకుంటు చూస్తున్నాడు.
‘తాతయ్యా’ అంటూ ఒక్క ఉదుటున బండి దిగి వచ్చి గట్టిగా చుట్టుకున్నారు మనవడు కిరణ్, మనవరాలు కీర్తన.
రాఘవయ్యకు ఆనందం ఆశ్చర్యంతో ఊపిరాడలేదు. కీర్తనను చంక నెత్తుకుని మనవడిని చేతితో పట్టుకుని పరుగు పరుగున ఇంట్లోకి వచ్చాడు.
‘ఏమేవ్ ఎవరొచ్చారో చూడు’ అంటూ గట్టిగా కేక పెడుతూ భార్య జానకిని పిలిచాడు రాఘవయ్య. ఆమె అప్పుడే పనులన్ని ముగించుకుని రెండవసారి భర్తకు కాఫీ ఇచ్చి పూజగదిలో కూచుంది.
‘అబ్బ ఏంటండి, ఇప్పడే కదా పూజకు కూర్చున్నాను. ఆ ఎవరిస్తారు పాలబ్బాయేనో లేక కూరలమ్మినో వచ్చి ఉంటారు మీరు తీసుకోండి నేను లేవను’ అంటూ ఆమె కూడా లోపలనుండి గట్టిగా చెప్పింది.
‘ఓస్ పిచ్చిముఖమా ఇటు చూడు ఒకసారి’ అంటూ పూజగది ముందుకు వచ్చాడు రాఘవయ్య.
అంతే గభాల్న లేచి వచ్చి కిరణ్ కీర్తనను గుండెలకదుముకుంది. ‘నా బంగారు తల్లి’ అంటూ ఒళ్ళంతా ముద్దులతో ముంచేసింది. ‘ఏమోయ్ రానాన్నవు కదా ఇప్పుడెలా వచ్చావు’ పరిహాసమాడాడు రాఘవయ్య.
ముసిముసి నవ్వులు నవ్వుతూ, ‘అమ్మా నాన్న ఎక్కడ’ అంటూ హాల్‍లోకి వచ్చింది జానకి.
ఈ లోపల కొడుకు భరత్, కోడలు స్వప్న లోపలికి వచ్చారు. వస్తూనే ‘ఎక్కడమ్మా మమ్మల్ని పట్టించుకుంటేనా మీ ఆయన, మనవడు మనవరాలు కనిపించారు ఇక అంతే ఎవరు కనపడరు ఈ తాతయ్యకు నానమ్మకు. అందుకే ముందొచ్చిన కొమ్ములకంటే వెనకిచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మమ్ములను చూసిన పాపాన కూడా పోలేదు’ అని నవ్వుతూ తల్లి తండ్రికి నమస్కారం చేసారు భరత్ స్వప్న.
‘అంతేనోయ్ మరి అసలు కన్నా వడ్డియే ముద్దు అంటారు, ఊరికే వచ్చిందేమిటి సామెత’ అంటూ ఆప్యాయంగా కొడుకును దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ‘ఏమ్మా బాగున్నావా’ అంటూ కోడలిని పలకరించాడు.
‘అత్తయ్యా బాగున్నారా’ అంటూ జానకిని కౌగిలించుకుంది స్వప్న. అత్త కోడలు పరామర్శలు అయ్యాక ‘ప్రయాణం బాగా జరిగిందా, చెప్ప పెట్టకుండా వచ్చారు ఎలా వచ్చారు, చెప్పి ఉంటే మన బండి పంపేవాణ్ని కదా. పిల్లలకు సెలవులు ఇచ్చేసారా’ అంటూ కిరణ్‌తో ఆటలో మునిగిపోయాడు రాఘవయ్య.
కీర్తన నానమ్మను వదిలిపెట్టకుండా ఆమె చంకనుండి దిగలేదు.
‘అయ్యో నా మతిమండ. పిల్లలకు ఎంత ఆకలిగా ఉందో ఏమిటో. మీరు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని రండి కాఫీ పెడతాను’ అంటూ గబగబా లోపలికి వెళ్ళింది జానకి.
‘మేము అనుకోలేదు నాన్నా ఇప్పుడే వస్తామని. ఇంకా దీపావళి పండగా వారం రోజులు ఉంది కదా రెండు రోజుల ముందు వద్దామనుకున్నాము. మాకు అప్పుడే సెలవులు ఇచ్చారు. ఇదిగో నీ మనవడు మనవరాలు వింటేనా, వీళ్ళకు సెలవులు ఇచ్చేశారు ఇక మా ప్రాణం తినేశారు అనుకోండి. ఎంత చెప్పిన వినరు మేము నానమ్మ తాతయ్య దగ్గరకు వెళ్తాము అని. మమ్మల్ని అయినా పంపండి అని ఒకటే నస. ఇక సరేలే అని మేము కూడా ఆఫీసులో సెలవులు అడిగి తీసుకున్నాము’ చెప్పాడు భరత్ తండ్రితో.
‘అత్తయ్యా దాన్ని కింద దించండి అదేమన్నా చిన్నపిల్లా ఆరుసంవత్సరాలు వచ్చాయి. అంతంత బరువుమోయకండి’ అంటూ, ‘దిగవే కిందకు నానమ్మకు ఇబ్బంది అవుతుంది’ అంది స్వప్న ఒక చేత్తో కాఫీ మరో చేతిలో మనవరాలుతో వస్తున్న అత్తగారితో.
వీళ్ళు కాఫీలు తాగడం అవకముందే, ‘తాతయ్యా అమ్మమ్మా’ అంటూ పరుగుపరుగున వచ్చారు మనవడు శరత్, మనవరాలు శారద. ఆశ్చర్యంతో చూసాడు రాఘవయ్య మనవడిని దగ్గరకు తీసుకుంటూ.
శారదను దగ్గరకు తీసుకుని కూతురు కోసం చూసింది జానకి. వెనకాలే వచ్చారు కూతురు పద్మ, అల్లుడు రాజేశ్.
గబగబా లేచి అల్లుడిని కూతురిని పలకరించారు. ‘అయ్యో అదేమిటండి మీరు వస్తున్నట్టు ఒక్కమాట చెప్పివుంటే మన బండి తీసుకోని వచ్చేవాడిని కదా స్టేషన్‌కు’ కొంచెం నిష్ఠూరం ధ్వనించే కంఠంతో అన్నాడు రాఘవయ్య.
‘అసలు మీ మనవళ్ళు మనవరాళ్ళు తక్కువ వాళ్ళనుకున్నారా. సెలవులు వస్తున్నాయి అన్నప్పటినుండి వాళ్ళు వీళ్ళు ఫోన్‌లు చేసుకోవడం, అందరు కలిసి ఒకటే పట్టుబట్టారు ఇక్కడకు రావడానికి ఇక తప్పేట్టులేదని మేము కూడా సెలవులు తీసుకున్నాము. అంతే కాదు వచ్చేవరకు మీకు చెప్పోద్దని వీళ్ళ ప్లాన్’ అంటూ చెబుతూ ‘మీరు బాగున్నారా మామయ్యా, అత్తయ్యా’ అడిగాడు రాజేశ్.
‘పోనిలేండి. మంచి పని చేసారు పిల్లలు’ అంటూ ఆప్యాయతతో పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు రాఘవయ్య.
‘నానమ్మా నీకు తెలుసా నేను శరత్ కలిసి ప్లాన్ వేసుకున్నాము. ముందుగా వస్తే మా కిష్టమైన టపాసులన్ని తాతయ్యతో వెళ్ళి కొనుక్కోవచ్చు. మా నాన్న వాళ్ళూ మీరు చిన్నపిల్లలు అని చెప్పి చిన్న చిన్న టపాసులు తీసుకొని వస్తారు. తాతయ్య అయితే నాకిష్టమైనవి అన్నీ కొనిస్తారు మాకేమో లక్ష్మి బాంబులు, ఉల్లిగడ్డ బాంబులు, రాకెట్‌లు కాల్చాలని ఇష్టం. నాన్న కాకరవత్తులు చిచ్చుబుడ్లు మాత్రమే కొంటారు.మేము ఈసారి ఇక్కడే కొనుక్కోవాలనుకున్నాము’ తాతయ్య నానమ్మల దగ్గరపడుకుని చెబుతున్నారు మనవలు.
‘అంతే కాదు తాతయ్య. మన కచ్చరం బండి ఎక్కి ఊరంతా తిరగొచ్చు పోలాలు చూసి రావచ్చు. నానమ్మ చేసిన మురుకులు తినుకుంటూ సరదాగా తిరిగి రావచ్చు. ఎంత బాగుంటుందో. అందుకే ఈసారి ముందుగా వచ్చాము తాతయ్యా’ చెప్పాడు శరత్.
‘అదేం కాదు నానమ్మా. నేను ఆ రోజంతా అన్నం తినడం మానేసాను. ఆ రోజంతా ఏడుస్తున్నాను ఇక్కడకు రావాలని.’
‘అయ్యో నా తల్లీ. మా కోసం నువ్వు కడుపు మాడుచుకున్నావా, ఎంత ఆకలేసిందో ఏమో’ అంటూ కీర్తన మాటలకు అడ్డువస్తూ దగ్గరకు తీసుకుంది జానకి.
‘అయ్యో నానమ్మా అదంతా ఉత్తినే, ఏడిచినట్టు నటించాను. మా ఫ్రెండ్ బాక్సులో అన్నం తిన్నాను, నా బాక్సు అలానే పట్టుకొచ్చాను. మరేమో అన్నయ్య నాకు అమ్మా నాన్నా చూడకుండా ఏవేవో ఇచ్చాడులే. మరి అలా చేస్తే గాని మమ్మల్ని ఇక్కడకు తీసుకవచ్చారు’ ఆయాసపడుతు ముద్దుముద్దు మాటలతో చెప్పింది కీర్తన.
‘ఒసేయ్ ఇంత లేవు అబద్దాలు ఆడచ్చా తప్పుకదూ. అమ్మా నాన్నలను అలా ఇబ్బంది పెట్టొద్దు కదా, ఇంకెప్పుడు అలా చెయ్యకండి’ బుజ్జగిస్తు చెప్పింది జానకి.
‘పో నానమ్మా. నీకు మేము రావడం ఇష్టం లేదా’ అంటూ బుంగమూతి పెట్టింది కీర్తన.
‘అయ్యో నా బంగారం. మీరు ఇలా వచ్చినందుకు తాతయ్యకు, నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేము. మీరంతా ఎప్పుడు ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండేదో’ అంటూ కీర్తనను శారదను దగ్గరకు తీసుకుంది.
‘అమ్మమ్మ మీరు మాతోపాటే పట్నం రావచ్చు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య వాళ్ళు అక్కడే ఉంటారు రోజు కథలు చెబుతారట. వాళ్ళదగ్గరే పడుకుంటారట తెలుసా అమ్మమ్మా’ గోముగా జానకి చెంపలను రెండు చేతులతో పట్టుకుని అడిగింది శారద.
‘వస్తాము ఇంకా కొన్ని రోజులయ్యాక మీ దగ్గరకే వస్తాము. ఇంకా ఇక్కడ కొన్ని పనులున్నాయి కదా అవన్నీ అయిపోయాక వస్తాము’ అంటూ కీర్తనను శారదను చెరోవైపు పడుకోబెట్టుకుని కథలు చెబుతు నిద్రబుచ్చింది.
***
దీపావళి రోజు రానే వచ్చింది. జానకి రాఘవయ్య లేచి వచ్చేవరకు ఇల్లంతా మామిడి తోరణాలు, బంతిపువ్వుల తోరణాలు, ఎక్కడ చూసినా దీపాలు ఆశ్చర్యపోతూ హాల్లోకి వచ్చారు. పిల్లలంతా పువ్వుల వర్షం కురిపిస్తూ ‘పుట్టినరోజు శుభకాంక్షలు తాతయ్యా’ అన్నారు. చప్పట్లతో మారుమ్రోగిపోయింది హాలంత.
నోటమాట రాక ఆనందంతో ఆనందభాష్పాలు రాల్చారు రాఘవయ్య జానకిలు.
‘నాన్నా పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు పట్టుబట్టలు పెట్టి కాళ్ళకు నమస్కారం చేసారు. ఆశీర్వదించి అందరిని అక్కున చేర్చుకున్నారు.
‘మీరంతా రాత్రి నిద్దరపోయారా లేదా ఎప్పుడు చేసారు ఇదంతా’ అడిగింది జానకి.
‘అమ్మా. నాన్నకు ఈ దీపావళితో అరవైసంవత్సరాలు పూర్తి అవుతున్నాయి కదా. నాన్నకేమో షష్టిపూర్తి చేద్దామంటే ఆర్భాటాలు వద్దు అంటారు. సరే ఎలాగు పిల్లలు పట్టుబట్టారు కదా ముందే రావాలని చెల్లి, బావగారు, స్వప్న, నేను కూడా ఆలోచించాము. అందుకే ముందే బయలుదేరి వచ్చాము, అందరము కలిసి ఆనందంగా దీపావళి జరుపుకోవాల’ని చెప్పాడు భరత్.
‘పదండిరా హారతులు తీసుకోని తలంటు పోసుకుందురుగాని’ అందరిని హడావుడి చేసింది జానకి. పిల్లలకు పట్టుపరికిణిలు ఇచ్చింది.
‘అమ్మమ్మా నువ్వు చేతితో చేస్తావు కదా సేవ్ పాయసం నాకు కావాలి’ అంటూ వచ్చింది శారద.
‘నానమ్మా నాకు మురుకులివ్వు. నువ్వు చేసిన మురుకులంటే ఎంతిష్టమో నాకు’ అంటూ వచ్చాడు కిరణ్.
‘అమ్మమ్మా నాకు పులిహోర కావాలి’ అడిగాడు శరత్.
‘అబ్బో మీరవన్నీ తినండి. నాకు మాత్రం మా నానమ్మా తాతయ్య అంటేనే ఇష్టం’ అంటూ వచ్చి జానకి వళ్ళో వాలిపోయింది కీర్తన.
పిల్లలు టపాకాయలు కాలుస్తుంటే కేరింతలతో ఆ వీధి అంతా మారు మ్రోగిపోయింది.
‘ఏమిటోయ్ రాఘవయ్య, దీపావళి పండగ మా ఇండ్లల్లకు ఈ రోజు వస్తే మీ ఇంటికి వారం ముందే వచ్చినట్టుందే’ అటు వైపుగా వచ్చిన సుందరయ్య సుబ్బారావులు అడిగారు.
‘మరేమనుకున్నారు ఈ రాఘవయ్య’ అంటే అంటూ మీసాలు మెలేశాడు రాఘవయ్య.