ఆడుకొంటున్నాడు ఓ అయిదేళ్ళ పిల్లాడు
అటుగా వచ్చిందో కుక్క, పట్టుకొంది పిక్క
ఊడొచ్చెలా, ప్రాణం పోయేలా
ముందుగా చూసింది నేనే
చురుకుగా కదిలాను… నా ఆయుధంతో
క్లిక్… క్లిక్… క్లిక్.
***
కోపంగా వెళ్ళిపోతోందామె… కొరకొరగా చూస్తూ
వెంటబడుతున్నాడతను… వెర్రిమొర్రిగా
బెట్టు చేస్తోందో… బెడిసికొట్టిందో
ఇంతలో కెవ్వుమందామె
తెల్లని మెడ చుట్టూ ఎర్రని రత్నాల హారం
అతనే చేస్తున్నాడు… కసితో కత్తితో
చురుకుగా కదిలాను… నా ఆయుధంతో
క్లిక్… క్లిక్… క్లిక్.
***
వరదలు… ఒక్క ఉదుటున, వడివడిగా
చిక్కుకుపోయారు వాళ్ళు, బెక్కుమంటూ
నీటి మట్టం పెరుగుతోంది…
చురుకుగా కదిలాను… నా ఆయుధంతో
క్లిక్… క్లిక్… క్లిక్.
***
‘రెడ్ సిగ్నల్’ అందరూ ఆగారు,
వాళ్ళు ఆగకుండా అతడిని కొడుతున్నారు
సిగ్నల్ దగ్గరే…
గ్రీన్ సిగ్నల్… అందరూ కదిలారు
వాళ్ళూ కదిలేరు, వాడి పని పూర్తి చేసి
చురుకుగా కదిలాను… నా ఆయుధంతో
క్లిక్… క్లిక్… క్లిక్.
***
‘డౌన్ డౌన్’ ఊపుమీదుంది ఉద్యమం
‘ధన్ ధనా ధన్’ ఊగిపోతోంది ఉద్యోగం
ఆ రెంటికి చెందని
ఆ చెప్పులు కుట్టుకొనేవాడు
కొట్టుకుంటున్నాడు బుల్లెట్ దిగబడి
చురుకుగా కదిలాను… నా ఆయుధంతో
క్లిక్… క్లిక్… క్లిక్.
***
మా ఛానెల్లో ఇటువంటి ‘ఎక్స్‌క్లూజివ్స్’ ఎన్నో
టి.ఆర్.పి. రేటింగ్స్ పెరిగాయి నా వలనే
అందరూ మెచ్చుకొంటారు నన్ను
విధి నిర్వహణలో చురుకుగా కదులుతానట
మెచ్చుకోనిది పనికిమాలిన అంతరాత్మ ఒక్కటే
వృత్తిధర్మంతో కాకుండా
మానవ ధర్మంతో చురుకుగా కదిలుంటే
కొంతమందైనా బ్రతికేవాళ్ళుగా అంటుంది…
కానీ
కాపాడబోయి నేనే కష్టాల్లో పడితే
నన్ను కాపాడేదెవరు?
‘తనకుమాలిన ధర్మం’ అంటారుగా
కనీసం నా క్లిక్‌లు
కేసులలో క్లూస్ ఇవ్వగలవు
అదో ‘తృప్తి’
‘తుత్తైనా’ అనుకోండి…

పొన్నాడ సత్యప్రకాశరావు కవి, కథకులు. వీరు ఇప్పటి వరకు 69 కథలు, 2 నవలలు, 100కి పైగా కవితలు వ్రాశారు. 2002లో వీరి నవల ‘ఊరు పొమ్మంటోంది’ స్వాతి అనిల్ అవార్డును గెలుచుకుంది. ఈ నవలని 2010లో సాహితీప్రచురణలు వారు ప్రచురించారు. 2010లో చినుకు ప్రచురణల ద్వారా వీరి కథాసంపుటి ‘అడవిలో వెన్నెల’ విడుదలైంది. వివిధ పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు.