[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘700 యేళ్లనాటి తెలుగు సాహిత్యంలో ‘హోర్ముజ్’’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
700 యేళ్లనాటి తెలుగు సాహిత్యంలో ‘హోర్ముజ్’
1572లో హోర్ముజ్ రేవుపట్టణం రేఖాచిత్రం
పూను స్పర్ధను విద్యలందే
వైరములు వాణిజ్య మందే
వ్యర్థ కలహం పెంచబోకోయ్
కత్తి వైరం కాల్చవోయ్!
గురజాడవారి దేశభక్తి గేయంలో ఒక చరణం ఇది. విద్యా స్పర్థ వల్లగానీ, వాణిజ్య వైరంతోగానీ ఇరాన్, అమెరికా యుద్ధం జరగట్లేదు. గురజాడవారే చెప్పిన వ్యర్థకలహం అంటే ఇదే అనిపిస్తోంది. చివరికి గెలిచేందుకు ఎవరూ లేని అనర్థకపోరాటం ఇది!
నిజానికి హోర్ముజ్ జలసంధిని తెరిపించటం కోసం ఈ యుద్ధం ప్రారంభం కాలేదు. అనేక పక్కదార్లు పట్టి చివరికి ఈ హోర్ముజ్ జలసంధి దగ్గర ఆగింది. పర్షియన్లు హోర్మోజ్ అనీ పోర్చుగీసులు ఓర్మోజ్ అనీ దీన్ని పిలిచేవాళ్లు. స్త్రైట్ ఆఫ్ హోర్ముజ్‌కి తూర్పుగా ఈ హోర్ముజ్ రేవుపట్టణం ఉంది. ఇరాన్ లోని ప్రాచీన జొరాస్ట్రియన్ మతానికి ప్రధాన దేవత అహుర్మజ్దా పేరున వెలసిన నగరం హోర్ముజ్.
హోర్ముజ్ గుర్రాలు, ముత్యాలు, పగడాలు
1397-1422 కాలం నాటి బహమనీ సుల్తాన్ షా తాజ్ ఉద్ దిన్ ఫిరోజ్ షా పర్షియన్ సముద్ర తీర ప్రాంతం నుండి ఎర్రసముద్ర తీరం దాక ఓడలను పంపించి విలాస వస్తువులు ఎగుమతి దిగుమతి చేసేవాడు. ఇదే కాలంలో రెడ్డిరాజులు అద్దంకి, కొండవీడు రాజమహేంద్రవరం కందుకూరు ప్రాంతాల్లో క్రీశ. 1324-1434 మధ్యకాలంలో వర్తక వాణిజ్యాభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకుని పాలించారు.
1386 -1402 మధ్యకాలంలో రాజ్యానికొచ్చిన రెడ్డిరాజు కుమారగిరి రాజకీయ విషయాల్ని మహామంత్రి కాటయ వేమకు అప్పగించి తాను వర్తకవాణిజ్యాలపైన దృష్టి నిలిపాడు. ఏటేటా వసంతోత్సవాల పేరుతో అనేక ట్రేడ్ ఫేర్లు నిర్వహించాడు. అందువలన ఎగుమతి దిగుమతి సుంకాలద్వారా రాజ్యానికి ఆదాయం పెంచాడు.
అత్యధికంగా ఇరాన్ తదితర అరబ్ దేశాల నుండి వివిధ వస్తువులతో పాటు, పార్సీ, అరబ్బీ పదాలు కూడా రెడ్డి రాజుల కాలంలోనే తెలుగులోకి అమితంగా వచ్చి చేరాయి. దానికి కారణం హోర్ముజ్ ద్వారా ఆనాడు విస్తరించిన వర్తక వాణిజ్య సంబంధాలే!
మన వస్త్రాలు, వజ్రాలు, మంచిగంథం, ఏలకులు, లవంగాలకు విదేశాల్లో మంచి గిరాకీ ఉండేది. వినుకొండ నుంచి ఇనుప లోహం ఎగుమతి జరిగేదని చెప్తారు. ఇలా ఎన్నో..!
కుమారగిరిరెడ్డి వద్ద మంత్రిగా ఉన్న రాయన భాస్కరుడికి శ్రీనాథుడు సన్నిహితుడు. అలాగే, సుగంధిశాలాధ్యక్షుడు అవచి తిప్పయసెట్టికి శ్రీనాథుడు చిన్ననాటి స్నేహితుడు. తన హరవిలాసాన్ని ఈ అవచి తిప్పయ్యసెట్టికి శ్రీనాథుడు అంకితం ఇచ్చాడు.
తెలుగులో చేరిన పర్షియన్ పదాలు
పూర్వం పర్షియా అని, ఇప్పుడు ఇరాన్ అనీ పిలుస్తున్న దేశంలో ప్రజలు మాట్లాడే భాష పర్షియన్. దీనిని పారసీ, ఫార్సీ అని కూడా పిలుస్తారు. ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందిన ఇండో-ఇరానియన్ భాష ఇది. ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, తజకిస్థాన్ లలో ఇది అధికారిక భాషగా ఉంది.
భారతదేశంలో షియా మతస్థులు, జొరాస్ట్రియన్ మతస్తులు నేటికీ పర్షియన్ భాషే మాట్లాడుతుంటారు. ఓమర్ ఖయ్యాం, మీర్జా ఘాలిబ్, సాదీ షిరాజీ లాంటి పర్షియన్ మహాకవుల రచనలు కూడా భారత దేశంలో పర్షియన్ భాష వ్యాప్తికి కారణం అయ్యాయి. మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లో పార్శీ, అరబ్బీ పదాలు అనేకం చేరటమే ఇందుకు తార్కాణం. ఆదిభట్ల నారాయణ దాసుగారు పర్షియన్ భాష నేర్చుకుని ఉమర్ ఖయ్యాం రుబాయితుల్ని మూలం చదివి తెలుగు చేశారు.
కొన్ని పర్షియన్ పదాలు తెలుగులో ఎలా ఒదిగిపోయాయో మచ్చుకు కొన్ని పరిశీలిద్దాం:
అంబారీ, అపరంజి, అయివేజు, కళాయి, కళాసీ, ఖాకీ, కిరాయి, కూజా, కుస్తీ, ఖర్చు, ఖరీదు, గజం (ఒక కొలత), గలాటా, గల్లాపెట్టె, గులాబీ, జమాఖర్చు, జాగా, తరఫు, తయారు, తాకట్టు, దస్తావేజు, నగదు, నమోదు, నాజూకు, నామర్దా, నిఘా, నిషా, పత్తా, పహరా, పునాది, ఫలానా, ఫిర్యాదు, బేజారు, బేరీజు, బొంగు (వెదురు), బొత్తాం (బటన్), భరోసా, మావటీ, మాలీసు, మినహ, రహదారి, రాజీనామా, రోజు (దినము), లాహిరి (మైకం), వాపసు, శరము(సిగ్గు), శాలువా, సన్నాయి (షహనాయి), సాంబ్రాణి, సాదా, సాలు (ఒక ఏడాదికి), సీరా (ఇంకు), సుమారు, సాంబ్రాణి, సాదా, శిస్తు, హల్వా, ఇలా లెక్కలేనన్ని పదాలు తెలుగులో పర్షియన్ మూలాలతో ఏర్పడ్డాయి. ఇంతే సంఖ్యలో అరబ్బీ పదాలు కూడా తెలుగులో ఇమిడిపోయాయి.
వీటిలో పాలనా పరమైన పదాలు మాత్రమే ముస్లిం పాలకుల వలన వచ్చి చేరాయి. వాణిజ్యవేత్తలు ప్రజలతో కలిసిపోయి వ్యవహరించటం వలన వారి నుండి వచ్చి చేరిన పదాలే ఎక్కువ.
హోర్ముజ్ ద్వారా దిగుమతులు
రెడ్డిరాజుల కాలంలో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనల్ని సన్నిహితంగా గమనించిన శ్రీనాథుడు విదేశీ వస్తువుల్ని అమ్ముకునే మారుబేరగాళ్ల ఉచ్చారణలోంచి కొన్నివస్తువుల పేర్లను, కొన్ని విదేశీ పదాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. తాను విన్నవీ కన్నవీ హరవిలాసంలో ఒక వచనంగా ఇలా వ్రాశాడు:
“విలాతి బాజారు దుకాణదారులనుండి జలతారుకుల్లాయులు, జరీ శాలువులు, ముఖమల్లు మోజాలు, లాలుజీబులు, పింగాణీ సామానులు, సుప్పాణి ముత్యములు, గంజాయి, గసగసలు, మొదలగు లాహిరి దినుసులు, హురుముంజి తేజీలు, కప్పలి, జోగు, వల్లి, వలికా, సమ్మాన్లలో తెప్పించి సలీసు వెలలకు విక్రయించి, అసలు కర్చు వహితేల్చి, కోటికి పడగ లెత్తినవాడు, జల్మపోసనపు జమ్ముభావనములు పరచిన హజారపు చావడిలో జాళువా పైడి తఖ్తుపై తబల, సన్నాయి, డమాములు మోయ ఖుసిమీరన్ సురధాణి నిండు కొలువై కూర్చుండెడివాడు. కొజ్జాలు, గులాములు సేవింప నకీబులు పరాకులెచ్చరింప, విలాతిఖానులు, సరిహద్దు సహాలు పంపిన రాయబారులు వచ్చి ఆరబి, ఆరె, పారసి, రుమీ మొదలగు బాసలలో వ్రాసిన కాకితములను వినిపించెడి వారు. విలాతి దుకాణదారులు వచ్చి కుందనపు కమ్మరుబందులు, చికిలి సేసిన అపరంజి మోళపు బాఁకులు, బిబ్బీల గాగరాలు, ఉలుపా చదివించెడివారు. జూటరులు గలబ, జులుము, లూటి సేయకుండ గస్తుకావలివారు కాపుండెడివారు. కంఖాణి, కత్తలాని, సామ్రాణి, జిరా తేజీలపై చబుకుసేయు సవాలక్ష పౌజు బరాబరులు సేసెడిది” ఈ వచనంలో ఒక్కో పదమూ ఎంతో చరిత్ర నందిస్తుంది.
విలాతి = విదేశీ
బాజారు = విపణివీధి. “పైజారు కొంగు దడిసిన బాజారే తిరిగి చూచి ఫక్కున నవ్వెన్” అని శ్రీనాథుడిదే ప్రయోగం. ఫారసీలో బాజార్ అంటే సంత.
దుకాణదారు = కొట్టు యజమాని. పారసి. దుకాన్, దుక్కాన్ అరబ్బీ; దుక్కాన్, దుకానీ
జలతారు కుల్లాయు/కుల్లా: kullah, also spelled kolah. ఇరానియన్లు సంప్రదాయపరంగా నేటికీ ధరించే చిన్న టోపీ. పండితులు, మేథావులు, వాణిజ్యవేత్తలు, అధికారులు ఒక దర్పంగా ధరిస్తారు. డిల్లీ సుల్తానేట్లు, మొఘల్సు కూడా భారతదేశంలో ఈ సంప్రదాయ కుల్లాధారణను ఇదేవిధంగా కొనసాగించారు. విజయనగర ప్రభువులను సందర్శించానికి వెళ్లినప్పుడు శ్రీనాథుడు పటరచిత మకుటంగా ‘కుల్లావెట్టితిఁ గోకసుట్టితి.. అంటూ చెప్పుకున్న చాటువులో కుల్లా ఇదే! జలతారు= జర్- బంగారపు- తార్-దారము, పోగు బంగారు పోగులతో నేసిన కుల్లా జరతార్ ఖుల్లా తెలుగు వ్యవాహారికంలో జలతారుకుల్లా అయ్యింది.
జరీ=వెండి బంగారాల సన్నపోగులతో నేసినది. “జరిగొన్న వెలిపట్టు జన్నిదంబుల తోడ రత్నాల తారాహారం ధరించి”లాంటి కవిప్రయోగాలున్నాయి. ‘జరిగొన్న వెలిపట్లు జన్నిదంబులల’ అని క్రీడాభిరామం!
ముఖమల్లు=ఒత్తుగా మెత్తగా మందంగా ఉండే పట్టుబట్ట. విదేశీ వస్త్రం. పర్షియన్ ముఖమల్ లేదా మిఖమిల్ లోంచి వచ్చింది.
మోజాలు = ముందువైపు వంకీ తిరిగినట్టుండేమెత్తని చెప్పులు
లాలుజీబులు=ఎర్రని వస్త్రాలు
పింగాణీ సామానులు= ఒకరకపు మట్టిపాత్ర
సుప్పాణి ముత్యములు=మంచిముత్యాలు
గంజాయి, గసగస ల్లాంటి లాహిరి దినుసులు= లాహిరి అంటే మైకం కలిగించే మాదకద్రవ్యాలు
హురుముంజి= ఇరాన్ అమెరికా ఇజ్రాయేల్ యుద్ధంలో ప్రధానమైన సమస్యగా నిలిచిన హోర్ముజ్ జలసంధి దగ్గరున్న ఒక రేవు పట్టణం. ఒకప్పుడు మేలుజాతి గుర్రాల ఉత్పత్తికి, పగడాలు నవరత్నాల వ్యాపారానికి పేరెన్నిక గన్న ప్రాంతం. “హురుముంజి బలుతేజి హరులు దెచ్చె” అని హరవంశంలో కూడా ప్రయోగం ఉంది.
తేజీలు= వేగంగా వెళ్ళగల గుర్రాలు
కప్పలి=సరకు రవాణాచేసే ఓడ
జోగు= పెద్ద తెరచాపలు కలిగిన ఓడ
వల్లి, వలికా= ఆనాటి ఓడల పేర్లు
సమ్మాన్లు = మూడు పలకల పడవ (పోర్చుగీసు పదం అంటారు)
సలీసు= చవకగా కొనేలా సులభమైన ధర
అసలు=మూలము
కర్చు= ఖర్చు, వ్యయం పారసీ ఖర్చొ అంటే ప్రయాణానికి అయిన వ్యయం అని!
వహితేల్చి= లెక్కలు తేల్చటం.,
జలపోసనం= బంగారు పూత, గోల్డ్ కవరింగ్
జమ్ముఖాణములు= జంపకాణ, కార్పెట్
హజారపు చావడి=రాజ్యసభ
జాళువా పైడి= అపరంజి లాగానే ఒక విదేశీ ప్రాంతం నుండి తెచ్చిన మేలిమి బంగారం
తఖ్తు: తఖ్తు (takht) అంటే ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఉచితాసనం A throne. A bedstead అని!
ఖుసిమీరన్: ఖుషీగా అవటం
సురధాణి = సు-రతాణి ఇంద్రుడి భార్య. (సంస్కృత ప్రయోగం)
కొజ్జాలు= ఈ శబ్దం శ్రీనాథుడి కాలానికి గౌరవపూర్వకమైన బిరుదునామం. ఫారసీ భాషలో మహాశయుడు, నోబుల్ పర్సన్, స్వామి అనే అర్థాన్నే శ్రీనాథుడు తీసుకున్నాడు. ట్రాన్స్‌జెండర్స్‌ని ఈ పేరుతో పిలవటం హిందీ నుండి వచ్చింది. పర్షియన్ కాదు.
గులాములు= ఉంపుడు గత్తెలు, అనుకూలవతులు
నకీబులు: పాదార్ రహే హై… అంటూ ఎచ్చరికలు చెప్పే స్తోత్రపాఠకుడు.
పరాకులెచ్చరింప=రాకని తెలియజెప్పటం
సరిహద్దు సహాలు= ఇరుగుపొరుగు రాజులు. శాహా అంటే రాజు
కాకితము= ఇరానీ లేదా పోర్చుగీసు (కాతరస్)మూలం
విలాతి దుకాణదారులు= విదేశీ వ్యాపారులు
కుందనపు కమ్మరుబందులు= బంగారపు వడ్డాణాలు (నడుముపట్టీలు)
చికిలి సేసిన= శుభ్రపరచిన
అపరంజి= తప్త కాంచనం, మేలిమిబంగారం.
మోళపు బాఁకులు= మోళము అంటే వెండి లేదా బంగారం పూత, మోలాము, మలాము అంటున్నాం ఇప్పుడు.
బిబ్బీ= తురుష్కుల యంతఃపుర స్త్రీ.
గాగరాలు= స్త్రీలు ధరించే వస్త్రం, గాగరా చోళి,
ఉలుపాలు=కానుకలు
జూటరులు= అబద్ధాలకోర్లు, మోసగాళ్లు
గలబ= అలజడి
జులుము= దౌర్జన్యం, దుండగం
లూటి = దోపిడీ
గస్తుకావలి= గస్తీ తిరగటం
కంఖాణి= ఆఫ్ఘనిస్థాన్ మేలుజాతి గుర్రం.
కత్తలాని = కత్తలాణివఖత్తులాణం: కవచం తొడిగిన ఖత్లాన్ దేశపు గుర్రం. ఇరానీయన్ రాజవంశాల ఏలుబడిలో ఉన్న ప్రాంతం ఖత్లాన్. దీన్ని ఖుత్తాల్, ఖుత్తలాన్, ఖొత్లాన్ ఇలా పిలుస్తారు. మేలుజాతి గుర్రాల ఉత్పాదక కేంద్రం అది ఒకప్పుడు. “…తెల్లని యొక కతలాని తేజీహయమున్’ అని శృంగార నైషధంలో శ్రీనాథ ప్రయోగం. మధ్య ఆసియాలోని తజకిస్తాన్ దక్షిణ భాగంలో ఉన్న ముఖ్యమైన పరిపాలనా ప్రాంతం. ఇది. ఆ దేశంలోని అతిపెద్ద, అత్యంత జనసాంద్రత గల ప్రాంతాలలో ఒకటి.
సామ్రాణి = పర్షియన్ జాతి గుర్రం, సమార్కండ్‌గా నేటికీ నిలిచి ఉన్న నగరం సిల్క్ రూటులో ప్రసిద్ధి చెందింది. 11 వశతాబ్ది నుండీ టర్కీ ఆధీనంలో ఉంది. బహుశా ఈ నగరం నుండి వచ్చిన జాతిగుర్రాన్ని సామ్రాణిగా పిలిచి ఉండవచ్చు.
జిరా తేజీలు= పట్టు వస్త్రం వేసి అంబారీకి సిద్ధం చేసిన గుర్రం
చబుకుసేయు= ఛల్ ఛల్ అంటూ ఈ గుర్రాన్ని అదిలించటం. గుర్రాలు ఇరాన్ ఆఫ్ఘనిస్థాన్‌ల నుండి తెచ్చినవి కాబట్టి వాటిని మహమ్మదీయ భాషలోనే అదిలిస్తుంటారు. సీమకుక్కపిల్లల్ని మనం ఇంగ్లీషులో అదిలించినట్టు!
సవాలక్ష (మరాఠీ) = లక్షా పాతికవేలు
పౌజు= పటాలం
శ్రేష్ఠతకు చిరునామా హురుమంజి ఆనాడు
హరవీలాసం అవచి తిప్పయ్యసెట్టికి అంకితమైన కావ్యం. ఆనాటి వసంతోత్సవాల నిర్వాహకుడు కాబట్టి ఆయనకు సంతోషంగా ఉండేలా ఈ శివకావ్యంలో సందర్భం చూసుకుని పర్షియన్ సంతల గురించిన సమాచారం అంతా నిక్షిప్తం చేశాడు.
ఇంకా ఇతర కవులూ హురుమంజిని ప్రస్తావించిన వారున్నారు.
“గొప్ప హురుమంజి సుప్పాణి కూర్పడంపు డంబు పగడంబు జగడంబు సంబరంబు” అంటూ కృష్ణరాయ విజయంలో కుమార ధూర్జటి హురుమంజిని (హోర్ముజ్) ప్రస్తావించాడు.
మనుచరిత్ర ప్రబంధంలో అలల్సాని పెద్దన కూడా స్వారోచిషుణ్ణి హురుమంజి గుర్రం ఎక్కించాడు. “పచ్చని హురుమంజి పని వాగె పక్కెర /పారసి పల్ల ౦బు పట్టమయము/ రాణ నొప్పారు పైఠాణంబు సింగిణి /తళుకు లకోరుల తరకసంబు..” ఇలా ఆ హురుమంజి గుర్రానికి చేసి అలంకారాలతో పాటు దానికి అమర్చిన రక్షణ కవచాలను కూడా వర్ణించాడు. రాయలవారు కూడా హురుమంజి గుర్రాలు శత్రువుల చేతికి చిక్కకుండా చూడాలని ఉద్బోధించారు.
హురుమంజి రేవు నుండి కోటిపల్లి రేవుకి నేరుగా సరుకు రవాణా అయ్యేదని కూడా చెప్తారు.
ఏమయ్యింది ఇరానుకి?
వాణిజ్యవేత్తలు అందరితోనూ మంచిగా ఉంటూ అందరూ తమ వినియోగదారులే అన్నట్టు వ్యవహరిస్తారు. కానీ, ఇరాన్ మిత్రుల్లేని ఒంటరి అయ్యింది. భారతదేశాన్ని ఆక్రమించి, ఇక్కడి సంస్కృతిని వీరధ్వంసం చేసిన మహమ్మదీయ ప్రభువుల్లో పర్షియన్లే ఎక్కువ. ఆనాటి పాపం ఇరాన్ని ఇంకా వెంటాడుతోంది. అంతేకాదు, హోర్ముజ్ ప్రసిద్ధిపొందిన గుర్రాల అవసరం ఈ యుగానికి లేకుండా పోయింది. మోటారుబళ్ళ రాక గురాలకు ప్రాణసంకటం అయ్యింది. సముద్రగర్భంలోకి వెళ్లి గంటల తరబడి ఊపిరిబిగబట్టి పగడాలు ఏరి తెచ్చే నిపుణులు కూడా తగ్గిపోయారు. చివరికి వ్యాపారం అంటే ఆయుధాల వ్యాపారమే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇద్దరు ఆయుధ వ్యాపారుల మధ్య నడుస్తున్న ఈ సమరానికి సమస్త ప్రపంచమూ మూల్యం చెల్లిస్తోంది.
ఇరుగుపొరుగు దేశాలతో సఖ్యత కోల్ఫోయి ఇవ్వాళ ఇరాన్ ఒంటరిదయ్యింది. ఈ యుద్ధం ఫలితంగా అమెరికా కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది.
తన 4,000 ఏళ్ళ భాషా సాంస్కృతిక వారసత్వ సంపద గురించి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటోంది ఇరాన్. అంతే ప్రాచీన సంపన్న విశిష్ట సంస్కృతి కలిగిన భారతదేశంలో మధ్యయుగాలలో విధ్వంసం సృష్టించినప్పుడు ఈ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ ఇరాన్ పాలకులకు ఏనాడూ గుర్తుకు రాలేదు. కాగా, 250 యేళ్ల చరిత్ర మాత్రమే కలిగిన అమెరికా పరమ అనాగరిక భాషలో ఇరాన్ ప్రాచీనతను యద్దేవా చేస్తోంది. చివరికి ఇది అనాగరకుల మధ్య అనాగరిక యుద్దంలా పరిణమిస్తోంది.
చరిత్ర పూర్వ యుగాలలో ఆంధ్రరాజులు అత్యంత ప్రాచీన కాలంలో ఇరానుతో జరిపిన వర్తక వాణిజ్యాలకు ఆధారాలు లేకపోవచ్చు. కానీ, మధ్యయుగాలలో శ్రీనాథుడు సహా అనేకమంది కవులు తమ సాహిత్యంలో హోర్ముజ్ ద్వారా జరిగిన వాణిజ్య విశేషాలను పదిలపరచారు. యుద్ధ విధ్వంసంలో హోర్ముజ్ రేవుపట్టణం రేపు మిగిలి ఉన్నా లేకపోయినా హురుమంజిగా దాని ఙ్ఞాపకాలు మన దగ్గర అజరామరంగా ఉన్నాయి.
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
