Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆ నలుగురు

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఆ నలుగురు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“సార్! మోహన్ గారు వచ్చారు పంపమంటారా?” అటెండర్ వచ్చి చెప్పాడు.

“పంపు”

“గుడ్ ఈవెనింగ్ రమేష్! మా అన్వితకి జే.ఎన్.టి.యు.లో కంప్యూటర్స్‌లో సీటొచ్చింది” అని స్వీట్ బాక్స్ ఇచ్చాడు మోహన్.

“కంగ్రాట్స్” అని అన్వితకి ఫోన్ చేసి అభినందనలు చెప్పి అటెండర్‌తో కాఫీ తెమ్మన్నాడు డాక్టర్ రమేష్.

కాఫీ తాగుతూ మోహన్‍౬తో కబుర్లు చెప్తుంటే అటెండర్ వచ్చి “సార్! పేషెంట్లు ఉన్నారు” అన్నాడు.

“పంపించు”

లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి మోహన్‌కి నవ్వాలనిపించలేదు. పొట్టిగా పుష్టిగా ఉన్న కాళ్ల పైకి షార్ట్స్, అందులో టక్ చేసిన టీ-షర్టు, వాకింగ్ షూస్, తలపై తెల్ల టోపీ.. వస్తూనే ఆపసోపాలు పడుతూ, కాలు కుంటుతూ , “అబ్బా!” అంటూ కూర్చుని తలపై టోపీని తీశాడు. తలకి అంటించినట్టు చెవి పక్క నుండి తీసిన డై వేసిన నాలుగు ఫలిత కేశాలు కర్చీఫ్‌తో తుడుచుకుంటుంటే..

“ఏంటి పార్థసారథి గారూ కుంటుతున్నారు?” అడిగాడు రమేష్.

“వాకింగ్‍కి వెళ్లి వస్తుంటే కాలు స్లిప్పయి చీలమండ దగ్గర మడత పడ్డది. నొప్పి చాలా ఎక్కువగా ఉంది” అంటూ షూస్ తీసి కాలు చూపాడు.

కాలు పరీక్షించి.. “ఈ స్ప్రే, పెయిన్ కిల్లర్స్ వాడండి” అని రాసిచ్చాడు.

డాక్టర్ చెప్పిందానికి సంతృప్తి చెందని పార్థసారథి “ఎందుకైనా మంచిది ఓ ఎక్స్‌రే తీస్తే బావుంటుందేమో!” అన్నాడు తనకి వైద్య పరిజ్ఞానం ఉన్నట్టు.

“నా ట్రీట్మెంట్‌కి అవసరం లేదు. మీకు కావాలంటే రాసిస్తాను.”

“ఎందుకంటే వచ్చే నెలలో నేను మా ఆవిడ అమెరికా వెళుతున్నాం. మళ్ళీ అప్పటికి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమోనని!”

“పోయిన సంవత్సరం వెళ్ళొచ్చానని చెప్పినట్టున్నారు?”

“అప్పుడు మనవడు పుట్టినప్పుడు వెళ్ళాం. ఇప్పుడు మనవడి బర్త్ డే కోసం వెళ్తున్నాం”

“రిటైర్డ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు” అన్నాడు రమేష్.

“అఫ్‌కోర్స్ అందులో సందేహం లేదు. నాకు ఇంకో ఇరవై ఏళ్ళు ఆనందంగా ఆరోగ్యంగా బతకాలని ఉంది” అనగానే మోహన్, రమేష్ వైపు చూశాడు.

వాళ్లను చూసిన పార్థసారథి..

“నా మాటలు మీకు విచిత్రంగా అనిపించవచ్చు. నేను రిటైరై ఐదేళ్ల అవుతోంది. నాకు ఇప్పుడు అరవైఐదేళ్లు. అయినా మనసులో మాత్రం ఇరవై ఏళ్ల లాగానే ఫీలవుతాను. అందుకే నాకంటే చిన్న వయసు వాళ్లతోనే మాట్లాడుతూ నా వయసు మరచిపోతుంటాను. నా బాల్యం యవ్వనాల్లో ఈరోజున ఉన్న వసతులు లేవు. ఒకవేళ ఉన్నా అవి ఆ కాలానికి తగ్గట్టు ఉండేవి. నా ఆర్థిక పరిస్థితి నా అభిరుచులకు అందుబాటులో ఉండేది కాదు. గుమస్తాగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, ఆ తర్వాత ఆఫీస్ సూపరింటెండ్‌ట్‌గా రిటైరయ్యాను. నాకు కూతురు, కొడుకు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. కూతురు భర్తతో అమెరికాలో ఉంటుంది. హైదరాబాదులో కొడుకు కోడలితో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాం. విశ్రాంత జీవితం ప్రశాంతంగా గడుపుతున్నాను. ఇవ్వాళ ల్యాప్‌లాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, వైఫై, ఏ.ఐ.,క్లబ్బులు, పబ్బులు, ఓ.టి.టి. సినిమాలు; ఒక్కటేమిటి డబ్బుంటే చాలు ప్రపంచమంతా మన ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచమే అరచేతిలో ఇమిడిపోతోంది. అందుకే ఇవన్నీ అనుభవించడానికి ఇంకో 20 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలని ఉంది. వయసుతోపాటు శరీరానికి బీ.పీ., షుగర్ వచ్చినా మనసులో డోంట్ వర్రీ బీ హ్యాపీ అనుకుంటూ కంట్రోల్లో ఉంటాను.” అంటూ చెప్పుకుపోతున్న పార్థసారథి మాటలకి అడ్డుపడి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ విచిత్రంగా శబ్దం చేసింది. పౌచ్‌లో నుంచి ఫోన్ బయటికి తీసేసరికి.. మోహన్ ఖంగుతున్నట్టు చూసాడు. లక్ష రూపాయల ఆపిల్ లేటెస్ట్ వర్షన్ ఐ-ఫోన్ అది.

రెండు నిమిషాలు ఫోన్లో మాట్లాడాక.. డాక్టర్ వైపు తిరిగి “మరి వెళ్లి వస్తాను” అని ఫీజ్ ఇచ్చి పక్కనున్న సోఫాలో కూర్చుని షూ లేస్ కట్టుకుంటుంటే.. రమేష్ బజార్ నొక్కాడు.

వెంటనే లోపలికి వచ్చిన నడివయసు వ్యక్తిని చూసి “రండి శంకరం మాస్టారూ! కూర్చోండి” అన్నాడు రమేష్.

“డాక్టర్ ! ఈ లెటర్ చదవండి” అని ఇచ్చాడు కుర్చీలో కూర్చున్న శంకరం కన్నీళ్లొత్తుకుంటూ.

ఆయన ఇచ్చిన లెటర్ చూశాడు రమేష్.

“నేను చచ్చిపోయాక నా అవయవాలు దానం చేయండి – ఇట్లు అనిల్..” అని రాసుంది.

“ముత్యాల్లా ఉండే మీ అనిల్ హ్యాండ్ రైటింగ్ ఇప్పుడు ఎల్కేజీ పిల్లలు రాసినట్టుంది” అన్నాడు నిట్టూరుస్తూ.

“వాడి తలరాతే మారిపోతే చేతిరాత మారకుండా ఉంటుందా?” అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.

“రెండు రోజుల నుంచి మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మీరు ధైర్యంగా ఉండాలి. మీ అనిల్‌కి గ్లియో బ్లాస్టోమా అనే ఓ రకమైన మెదడు వాపు వ్యాధి. ఇంత చిన్న వయసులో రావడం బాడ్ లక్” అన్నాడు రమేష్.

మాస్టారి కళ్ళ నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి .

“మెదడులో ఉండే ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ వ్యాధి ప్రభావం చూపుతుంది. దీనివల్ల క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోవడం, చూపు మందగించటం, తరచూ ఫిట్స్ రావడం జరుగుతుంది. ముందుగా ఎందుకు చెప్తున్నానంటే..” రమేష్ మాటలు పూర్తి చేయకముందే మాస్టారు ఏడుస్తూ “20 ఏళ్లకే అల్పాయుష్కుడు కావటానికా? వాడికి దేవుడు అంత మేధస్సు ఇచ్చాడు. చిన్నప్పటి నుంచి అబ్దుల్ కలామ్ స్ఫూర్తితో సైంటిస్ట్ కావాలని కలలు కనేవాడు. ఇంటర్లో స్టేట్ ర్యాంక్, ఐఐటి ఎంట్రెన్స్ ఐదో ర్యాంక్, తెచ్చుకొని, తనకిష్టమైన బ్రాంచ్ తీసుకుని, ఖరగ్‌పూర్ ఐ.ఐ.టీ లో చేరాడు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చి పది రోజులు కూడా కాలేదు. ఇంతలో..” అంటూ మాస్టారు చేతిలో మొహం దాచుకొని భోరుమన్నాడు.

ఆయన వైపు మోహన్ పరితాపంగా చూస్తుంటే అక్కడే ఉన్న పార్థసారథి ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

“మాస్టారూ! మీరు అధైర్య పడకూడదు. ఏ క్షణాన ఏ మిరాకిల్ జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. మీకు వ్యాధి లక్షణాలు తెలియటం కోసం చెప్పానంతే..” అన్నాడు రమేష్.

“వేరే ఎక్కడికైనా తీసుకెళ్లమంటారా?”

“ఎక్కడికి తీసుకెళ్లినా సర్జరీ ఒక్కటే ఏకైక మార్గం. అంతేకాదు.. లక్షల్లో ఖర్చు అవుతుంది. అందుకు మీ ఆర్థిక పరిస్థితి..?”

“అలా అనకండి డాక్టర్! నా కళ్ళముందే వాడలా జీవన్మరణ పోరాటం చేస్తుంటే చూస్తూ ఎలా బ్రతకమంటారు?”

“అనిల్ ఇప్పుడున్న కండిషన్‌లో 15 నుండి 20 లక్షలు వరకు అవ్వచ్చు.” అని రమేష్ చెప్పగానే మాస్టారు మొహం పాలిపోయింది.

తల పట్టుకుని “వందలకి వేలకి అల్లాడే మేము లక్షల్లో ఎక్కడి నుంచి తీసుకురాగలం డాక్టర్!” అన్నాడు దీనంగా.

“దిగులు పడకండి. గాంధీ ఆస్పత్రిలో నా బ్యాచ్‌మేట్ ఉన్నాడు. బ్రెయిన్ సర్జరీలో ఎక్స్‌పర్ట్. అతనితో మాట్లాడి చెప్తాను”

అంతలో “సార్! పేషెంట్ ఉన్నాడు” అని అటెండర్ చెప్పడంతో..

“నేను తర్వాత మిమ్మల్ని కలుస్తాను” అని కళ్ళు తుడుచుకుంటూ శంకరం వెళ్లారు.

వెంటనే పార్థసారథి లేచి “నేను వెళ్తాను డాక్టర్! రేపు ఎక్స్‌రే తెస్తాను” అని వెళ్ళిపోయాడు.

అప్పటివరకు మౌనంగా కూర్చున్న మోహన్ ఓ సుదీర్ఘ నిటూర్పు విడిచి, తర్వాత “ఆ మాస్టారు అబ్బాయికి సర్జరీ చేస్తే..!?” అని అడిగాడు.

“ఛాన్సెస్ 50.. 50.. కానీ చాలా దేశాల్లో సర్జరీ తర్వాత బాగున్నవాళ్లు చాలామంది ఉన్నారు”

“పాపం మాస్టారి వేదన హృదయ విదారకంగా ఉంది”

“అవును. శంకర మాస్టారు ఎలిమెంటరీ స్కూల్ టీచరు. నాకు చాలా కాలంగా తెలుసు. ఇద్దరమ్మాయిలలో ఈ అబ్బాయికి ఇలా.. కానీ అనిల్ చాలా ఇంటలిజెంట్” అని రమేష్ చెప్తుంటే.. మోహన్ ఫోన్ మోగింది.

ఫోన్లో మాట్లాడక “మరి వెళ్ళనా?” అన్నాడు మోహన్.

“వెళ్దువుగాన్లే.. స్వీట్ తోనే పార్టీ సరి పెడతావా.. అదేం కుదరదు”

“ఓ.కే. నువ్వు ఏదంటే అది” అని ఫోన్లో మెసేజ్ చూస్తుంటే, రమేష్ పేషెంట్‍ని చూస్తున్నాడు.

మోహన్, రమేష్ ఎల్.కేజీ నుండి ఇంటర్ వరకు కలిసి చదువుకున్నారు. మోహన్ ఇంజనీరింగ్ చదివి రైల్వే ఉద్యోగం చేస్తుంటే, రమేష్ డాక్టర్ అయ్యాడు. ఇద్దరూ హైదరాబాదులోనే ఉండటం వల్ల తరచూ కలుస్తుంటారు.

***

తన టు వీలర్ కీస్ డాక్టర్ టేబుల్ మీద ఉంచి మర్చిపోయిన సంగతి క్లినిక్ నుంచి బయటకు వచ్చాక గాని గుర్తుకు రాలేదు పార్థసారథికి. వెనక్కొచ్చి డాక్టర్ గదిలోకి వెళ్లబోయి..

లోపలి నుంచి వినిపిస్తున్న మాటలు తన గురించేనని గ్రహించి ఒక్క క్షణం తలుపు దగ్గర ఆగిపోయాడు.

“విన్నావుగా 60 ఏళ్లు దాటిన ముసలి పార్థసారథికి ఇంకో 20 ఏళ్లు బతికి ఇంకా ఏదో అనుభవించాలన్న తపన.. 60 ఏళ్లు బతికి ఎంతో సాధించాల్సిన 20 ఏళ్ల మేధావికి యవ్వనంలోని మరణత్రాసం మొదలైంది. విచిత్రంగా ఉంది కదూ!” అన్నాడు రమేష్.

“పార్థసారథి గారు బాగా సౌండ్ పార్టీ అనుకుంటాను. ఆయన చేతిలో ఉన్న ఐ-ఫోనే లక్ష పైన ఉంటుంది.”

“అంత సీన్ లేదు. ఈ ఆడంబరాలన్నీ ఈమధ్య వచ్చినవే. ఇటీవల మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లల సంపాదన వల్ల తల్లిదండ్రుల నడమంత్రపు సంబరాల కేసుల్లో ఈయన ఒకడు.” అంటూ చెప్తుంటే వింటున్న పార్థసారథికి తల కొట్టేసినట్టయింది.

అక్కడున్న అటెండర్‍కి చెప్పి లోపలి నుంచి కీ తెప్పించుకుని బయలుదేరి ఇల్లు చేరుకున్నాడు.

***

కుంటుతూ ఇంట్లోకి వచ్చిన భర్తను చూసి భార్య గాభరాగా “ఏమైందండీ? కుంటుతున్నారు?” అంది.

చెప్పాడు.

“డాక్టర్ దగ్గరికి వెళ్లారా?”

“వెళ్లే వస్తున్నాను ”

భార్య ఇచ్చిన వేడి వేడి కాఫీ తాగి కాసేపు రిలాక్స్ అయ్యాక స్నానం చేసి వచ్చాడు. భోజనం వడ్డిస్తున్న భార్యతో “వాళ్ళిద్దర్నీ రానీ” అన్నాడు.

“లేట్ అవుతుందట. కోడలు ఫోన్ చేసింది”

ఇద్దరూ భోంచేశాక భార్య టీ.వీ చూస్తుంటే.. పార్థసారథి బాల్కనీలో కూర్చున్నాడు. మనసు ఎందుకో చిరాగ్గా ఉంది. వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.

పొద్దున కొడుక్కి తనకీ జరుగుతున్న వాగ్వాదంలో కోడలు కల్పించుకుని భర్తతో “60 ఏళ్లు దాటాక కూడా ఇంటి సాధక బాధకాలు అర్థం చేసుకోకుండా అమెరికా వెళ్లాల్సిందేనని ఆయన మొండిగా వాదిస్తుంటే.. మీ కంఠశోష అంతా వృథా! అనవసర రభస ఆపి రండి. ఇవాళ ఫ్లైట్ టికెట్స్ తెచ్చి ఇద్దాం” అనేసరికి

“ఇదిగో కావ్యా! గుడ్డు వచ్చి పిల్లలకి ఇచ్చినట్టున్నాయి నీ మాటలు. వాడేం మమ్మల్ని ఊరికినే చూడటం లేదు. కనీ పెంచి, పెద్ద చేసి, చదువులు చెప్పించి, కానీ కట్నం లేకుండా వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేసింది ఎందుకు అనుకుంటున్నావు? అవసాన దశలో అడ్డుపడతారానా” అన్నాడు పార్థసారథి కోపంగా.

“మీ తాపత్రయం చూస్తుంటే మీకు అవసానం రావడానికి ఇంకో 60 ఏళ్లు పట్టేలా ఉంది.” అని భర్త వైపు తిరిగి

“మీరు బయల్దేరండి. ఆఫీస్‌కి టైం అవుతోంది ” అంది.

“నాలుగు డబ్బులు సంపాదిస్తున్నానని మిడిసిపడుతూ నడమంత్రంగా మాట్లాడకు. అయినా మీ ముష్టి డబ్బు నాకు అక్కర్లేదు. ఊర్లో ఉన్న స్థలం అమ్మి వెళ్తాం” అని పార్థసారథి ఆవేశంగానే అనేసరికి

“అది మీ ఇష్టం నాన్నా! పోయిన సంవత్సరం అక్కయ్య దగ్గరకు అమెరికా వెళ్తామంటే ఇద్దరినీ పంపాం. సంవత్సరం తిరగకుండా అప్పుడే మనవడిని చూడటానికి మళ్లీ అమెరికా వెళ్తామంటే లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్లైట్ టికెట్స్ కూడా భారీగా పెంచారు. 36 ఏళ్ళు ఉద్యోగం చేశారు. చిన్న ఇంటి స్థలం ఏర్పర్చలేకపోయారు. మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం. అందరం కలిసి ఉండటానికి త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ తీసుక్కున్నాం. నా జీతం ఇంటి ఈ.ఎం.ఐ.కి సరిపోతుంటే, కావ్య జీతం ఇల్లు గడగటానికి సరిపోతోంది. ఇవి కాక రెండు బైకులు, కారు. అదనంగా మీ ఆడంబరాలు. ఒక్క విషయం ఆలోచించండి. మీకు వచ్చే పెన్షన్‌కి మీరు పెట్టే ఖర్చులకి పొంతన ఉందేమో! ఇద్దరం రోజంతా 12 గంటలు కష్టపడుతుంటే మీకు అర్థం కావడం లేదు. లక్షలు తగలేసే బదులు ఏవైనా ఉపయోగపడే పనులు చేయండి. జీవితానికి సార్థకత, వృద్ధాప్యంలో సంతృప్తి మిగులుతాయి” అని వేగంగా వెళ్ళిపోతున్న కొడుకు వైపు అసహనంగా చూసాడు పార్థసారథి. ఆ క్షణంలో అతని లోని అభిజాత్యం ఆకాశం వైపు చూసింది .

***

ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తున్న పార్థసారథికి ఇన్నేళ్లుగా తన చేసింది ఇప్పుడు చేస్తున్నది కళ్ళముందు కదులుతుంటే.. కొడుకు కోడలు అడిగి వెళ్లిన ప్రశ్నలకి తన దగ్గర సమాధానం దొరకట్లేదు. అనుభవించడానికి హద్దులు ఎక్కడ ఉన్నాయి. ఈరోజుకి రేపు కొత్త.. ఆలోచిస్తున్న కొద్దీ పార్ధరథి అంతరంగంలో అవగాహన నిద్రలేచి.. అవసరమైనప్పుడు గుడ్డు పిల్లను వెక్కిరించడంలో తప్పు లేదని నొక్కి చెబుతున్నట్టు అనిపించింది.

పార్థసారథి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ రాత్రి 11 గంటలకి కాలింగ్ బెల్ మోగింది.

భార్య లేచి తలుపు తీసేసరికి అలసిపోయి లోపలికిచ్చిన కొడుకు కోడల్ని చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా బాల్కనీలోనే కూర్చున్నాడు.

భోజనం చేస్తూ “అమ్మా! నాన్న పడుకున్నారా?” కొడుకు వంశీ అడిగాడు.

“నిద్ర పట్టడం లేదని బాల్కనీలోనే కూర్చున్నట్టున్నారు”

భోజనం చేసి తండ్రి దగ్గరికి వెళ్లి “నాన్నా! ఫ్లైట్ టికెట్స్ తెచ్చాను. మీరు చెప్పిన తేదీల్లోనే దొరికాయి” అన్నాడు.

“వద్దు వంశీ! క్యాన్సిల్ చెయ్.”

“అలిగారా? లేకపోతే మావయ్యకి చెప్పి ఊళ్ళో స్థలం అమ్మించే ఏర్పాటు చేసారా?”

“లేదు. మేం వెళ్లడం లేదు. ఆవేశంలో ఏదో అన్నాను. కానీ ఆలోచిస్తే అనవసరం అనిపించింది.”

“ఏదో ఆఫీస్‌కి వెళ్లే హడావిడిలో అనుకున్న దానికి అలుగుతారా!?”

“కాదురా! నా కళ్ళు మనసు తెరిపించారు”

“టికెట్స్ తెచ్చాను కదా! ఈసారికి వెళ్లి రండి”

“వద్దురా! ఈ డబ్బుతో..,” అని పార్థసారథి ఆగిపోయాడు.

“చెప్పండి.”

సాయంత్రం తనకి కాలు స్లిప్ అయిన సంగతి డాక్టర్ రమేష్ క్లినిక్‌లో చూసిన శంకర మాస్టారు గురించి ఆయన కొడుకు పరిస్థితి చెప్పి “మీ ఇద్దరికీ అభ్యంతరం లేకపోతే ఈ డబ్బు..!”

***

మర్నాడు సాయంత్రం డాక్టర్ రమేష్ ఛాంబర్ లోకి వచ్చిన మోహన్ అక్కడ పార్థసారథి అతని పక్కనున్న మరో వ్యక్తిని చూసి..

“బయట వెయిట్ చేస్తాను” అని వెళ్లబోతుంటే..

“పర్లేదు.. పార్థసారథి గారిని నిన్ను చూశావుగా! ఇతను వాళ్ళ అబ్బాయి వంశీ” అని పరిచయం చేశాడు.

ప్యాంటు షర్టులో నుదిటిన బొట్టుతో వయస్సు తెచ్చిన హుందాతనం ఉట్టిపడేలా కనిపిస్తున్న పార్థసారథిని ఆశ్చర్యంగా చూస్తున్న మొహంతో..

“పార్థసారథి గారు తమ అమెరికా ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ డబ్బుకి ఇంకొంత కలిపి రెండు లక్షలు శంకరం మాస్టారి అబ్బాయి అనిల్ సర్జరీ కోసం ఇచ్చారు.” అని వాళ్ళిద్దరూ చేసిన గూగుల్ పే చూపించాడు రమేష్.

పార్థసారథి వైపు ఆశ్చర్యంగా చూసిన మోహన్ డాక్టర్ వైపు తిరిగి

“నేను కూడా లక్ష రూపాయలు అనిల్ సర్జరీ కోసం ఇద్దామని” అని గూగుల్ పే చేశాడు మోహన్. ఈసారి ఆశ్చర్య పోవడం రమేష్ వంతయింది.

“ఇంత డబ్బు..!?!”

“అన్విత ఇంజనీరింగ్ సీట్ కోసం ఉంచాను. మెరిట్ లోనే సీటు వచ్చింది. ఇప్పుడు ఈ డబ్బు ఆ అబ్బాయి సర్జరీకి ఉపయోగపడాలని తెచ్చాను. మరో రెండు రోజుల్లో ఫ్రెండ్స్ ద్వారా ఇంకొంత ఫండ్ కలెక్ట్ చేసి ఇస్తాను.” అన్నాడు మోహన్.

“థాంక్యూ! మరి నా వంతుగా నేను..” అని ఫోన్ పే ఓపెన్ చేశాడు డాక్టర్ రమేష్.

***

60 లో 20 లా ప్రవర్తిస్తే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఆలస్యంగానైనా అనుభవపూర్వకంగా తెలుసుకున్న పార్థసారధిలో కలిగిన పరివర్తన అతనిలో స్వార్థాన్ని బయటకు నెట్టి నిద్రపోతున్న మానవత్వాన్ని తట్టిలేపింది. తన వంతు సహాయంతో ముందుకు వచ్చిన పార్థసారథి..

తన దగ్గర అదనంగా ఉన్న డబ్బు ఆపదలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలన్న మానవత్వపు ఆలోచనతో ముందుకు వచ్చాడు మోహన్.

తండ్రిలో పరివర్తన కలగటం, మరణం అంచున ఉన్న అనిల్‌ని ఆదుకోవాలని ముందుకు రావడంతో.. ఆ స్పూర్తితో తన వంతు సహాయంతో ముందుకు వచ్చిన వంశీ..

పవిత్రమైన వైద్య వృత్తిని వ్యాపారంగా మార్చి, డబ్బు కోసం శవాలకు సైతం వైద్యం చేస్తూ రోగుల్ని పీడిస్తూ డబ్బే ప్రధానం అనుకుని వైద్యవృత్తిని కళంకితం చేస్తున్న వైద్యుల మధ్య.. వైద్య నారాయణ హరిః అనే విధంగా మానవత్వపు విలువలతో వైద్య వృత్తికి వన్నె తేవాలనే లక్ష్యంతో అనిల్‌ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకొచ్చిన దైవ స్వరూపమే డాక్టర్ రమేష్.

అందుకే.. వైద్యో నారాయణో నారాయణ హరిః అన్నారు.

***

“భగవంతుడా! ఇతరుల అనారోగ్య పరిస్థితిపై నా వృత్తి, అభివృద్ధి ఆధారపడి ఉండడం నాకు విచారకరం. అయితే వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే బృహత్కరమైన అవకాశాన్ని నాకు ప్రసాదించావు. ఇది నువ్వు నాపై ఉంచిన బాధ్యతగా స్వీకరించాను. ఈ బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తించగల మానవత్వాన్ని మనోశక్తిని నాకు ప్రసాదించు” అని తన వద్దకు వచ్చే వాళ్లందరికీ కనిపించేలా రాయించిన పై మాటలు డాక్టర్ రమేష్ లోని మానవత్వానికి అద్దం పడతాయి.

అందుకే మనిషిగా స్పందించి ఆర్థికంగా తన వంతు చెయ్యందించాడు. మానవత్వం ఉన్న వైద్యుడిగా బాధ్యత వహించి శంకరం మాస్టారి అబ్బాయి ఆపరేషన్‌కి పూనుకున్నాడు.

ఇలాంటి వ్యక్తులు కొంతమందైనా సమాజంలో ఉండబట్టే.. విలువలు కొన్నైనా వలువలతో బ్రతికి బట్టకడుతున్నాయి.

మేధావిని బ్రతికించాలన్న సత్సంకల్పం నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆయుష్మాన్ భవ అని ఆ నలుగురూ దీవించి ఆపరేషన్ థియేటర్లోకి పంపారు. హోప్ ఫర్ ది బెస్ట్..

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా అవకాశం ఉన్న ప్రతివారూ చెయ్యీ చెయ్యీ కలిపితే.. ఎంత జటిలమైన సమస్యకైనా సమాధానం దొరుకుతుంది.

“ఒక వాహనానికి నాలుగు చక్రాలు ఉంటేనే అది ముందుకు సాగుతుంది. అలాగే ఒక సమస్య పరిష్కరింపబడాలంటే నలుగురు కలిసి చేతులు కలిపితేనే అది సులభంగా పరిష్కరించబడుతుంది”.

Exit mobile version