[ఈనెల 26న వరంగల్లో ఆవిష్కృతమవుతున్న ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య నవతి అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’ కోసం డా. దహగాం సాంబమూర్తి రచించిన సంపాదకీయము ఇది. 23 మార్చ్ 2026 నుంచీ 26 మార్చ్ 2026 వరకూ ప్రతిరోజూ ఈ పుస్తకం నుంచి ఒక వ్యాసం సంచిక ప్రచురిస్తున్నది.]
యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తున్వంతి దివ్యై స్తవైః
వేదై సాంగ పదక్రమోపనిషదై ర్గాయంతి యం సామగాః।
ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో
యస్యాంతం న విదుస్సురగణాః దేవాయ తస్మై నమః॥ (శ్రీమద్భాగవతం 12-13–1)
బ్రహ్మ సకల దేవతాతతులచే ప్రస్తుతింపబడువాడు. యోగులకు ధ్యానావస్థలోనే దర్శనమొసంగువాడు, సురాసురులచే నిత్యము స్మరింపబడు అపరబ్రహ్మమునకు ప్రాంజలి సమర్పిస్తూ..
అనుపమతేజో విరాజితమై యాసేతు శీతాచల పరిగీత యశో విశేషమై మూడు దశాబ్దాల కాలం వెలుగొందిన కాకతీయ సామ్రాజ్య రమాధీదితులు.. ఆంధ్రుల చరిత్రముననే గాక, యావద్భారత చరిత్రములోనే మిగుల మకుటాయమానములు. క్రీ.శ. 3వ శతాబ్దం నుండి ఆరో శతాబ్దం వరకు శాతవాహనుల తర్వాత ఈ సువిస్తృత తెలుగు నేలను ఏలినవారు కాకతీయులు (కాకతీయ సంచిక పుట 191). కాకతీయ సామ్రాజ్యం రుద్రదేవుని కాలంలో-
రాజ్యం ప్రాచ్యాం లవణ జలధేస్తీర పర్యంత మస్యశ్రీ
శైలాన్తం ప్రచలతిసదా దక్షిణాస్యాం సమగ్రమ్
ప్రాతీచ్యాన్తా కటకనికట స్థాయినీ రాజ్యలక్ష్మీః
కౌబేర్యాశాతట విలసితా మాల్యవంతం ప్రపేదే॥ (కాకతీయ సంచిక-పుట.91)
పరివ్యాప్తమైనది. వీరి సకల కళా యశోవిభూషితమైన నగరమే ఓరుగల్లు, తెలుగు నేలపై ఆంధ్రకవితా వాక్సతికి స్వర్ణ, వజ్రాభరణములను సమకూర్చిన నగరాలలో రాజమహేంద్రవరము, విక్రమసింహపురులతో బాటు తెలంగాణమున ఓరుగల్లు ఒకటి.
ఈ ఓరుగంటి నేల.. అగస్త్యుడు (బాల భారతకర్త), విద్యానాథుడు, నారసింహుడు, మల్లికార్జునుడు ప్రభృత గీర్వాణ కవిపుంగవుల వైదుష్యమును రుచి చూసిన నేల. పాల్కురికి సోమన, తెలుగుల పుణ్య పేటి పోతన, అభినవ పోతన బిరుదాంకితులు వరదన్న, బిరుదురాజు, దుర్గయ్య, దేవులపల్లి, గార్లపాటి, కాళోజీ.. వంటి కవులు పండితులు విమర్శకులు నడయాడిన నేల. జాయపసేనాని నృత్త రత్నాకరమును తన అనుభవములోకి తెచ్చుకున్న నేల. కందపద్యం భారతావతరణము కన్న ముందే ఓరుగల్లు సమీపస్థ కరినగరంలో ప్రభవించి పలుకరించిన నేల. బౌద్ధ, జైన, వైదిక, శైవ, వైష్ణవాది సంప్రదాయాలు పరిఢవిల్లిన నేల.
ఇంతటి ప్రశస్తిగల ఓరుగంటిలో పరమ నిష్టాగరిష్ఠులైన కోవెల వంశాకురంగా శ్రీమతి లక్ష్మీనరసమ్మ, వేంకట నరసింహాచార్యులకు జన్మించిన శుక్తిముక్తాఫలమే ఆచార్య సుప్రసన్నాచార్యులు. తొంబదేండ్ల నిండు జవ్వనులు.
శ్రీ భగవద్రామానుజ సంప్రదాయానుయాయులైన వీరి పితామహులు, మాతామహుల కుటుంబాలు కవిపండితులు, ఉభయ వేదాంత దర్శనములలో నిష్ణాతులు. వారి కరకమల పంజాతులైన సుప్రసన్నయూ సంప్రదాయ సాహిత్యంతోబాటు లౌకిక సాహిత్యమును కూడా అధ్యయనం చేసిన గాఢ మననశీలియైన కవితాభావుక విమర్శక శిఖామణి.
పరమ వివేకసౌరభమూర్తిగా, ప్రబంధావలోకన రమ్యమూర్తిగా, తెలుగు సాహిత్య లోకపు దివ్యమూర్తిగా తమ వ్యక్తిత్వమును మలచుకొన్న సుప్రసన్నులు భారతీయ సంస్కృతి, సంస్కారములు, సంస్కృతాంధ్ర సాహిత్యాలను అవలోకనము జేసినవారు. వారికి పలుకులతల్లి ప్రసాదించిన అంతఃస్ఫురణము, హేతు నిరూపణము, ప్రశాంతచిత్తత, సమదృష్టి, స్థితప్రజ్ఞతలతో బాటు శబ్దార్థాలంకారాలతో, భావనా చమత్కృతులతో, అక్షరాకృతులను కవిత్వంగా మలిచి అద్భుతాలను సృజించిన సరసస్వాదువచోవిలాసులు.
‘శ్రీ సుప్రసన్నుల వాఙ్మయం ఒక కవితాత్మక శాస్త్రంగా గోచరిస్తోందన్న’ సమన్వయ సరస్వతి శ్రీసామవేదం షణ్ముఖశర్మ గారి అభిప్రాయం అక్షర సత్యమే. శారదా దరహాస, సుప్రసన్నత, సుధీశుభయశస్సులతో జన్మతః విశిష్టాద్వైత సంప్రదాయమును అద్వైత సిద్దాంతముతోబాటు, జ్ఞాన కర్మ సిద్దాంతాల సారాన్ని కూడా సమదృష్టితో ఆపోశనం పట్టిన దార్శనికులు సుప్రసన్న.. వారిపై పితామహులు, మాతామహులు ఆదిశంకరులు, భగవద్రామానుజులు, కందుకూరి శివానందమూర్తి, విశ్వనాథ, అరవిందులు, రవీంద్రులు, కృష్ణమూర్తి ప్రభృత తత్త్వవేత్తల ప్రభావం మరియు వారి నిండు ఆశీస్సులున్నాయి. వేదశాస్త్ర పురాణములు, ఉపనిషత్తులు, ఆర్షధర్మ సంబంధ రచనల సారాన్ని ఏకసంథాగ్రాహిత్వంతో అవగతం చేసుకున్న సుప్రసన్నులు “పండితైః సహసాంగత్యమ్ పండితైః సహసం కథా పండితైః సహమితృత్వం”తో..
“శ్రుతం కృతధియాం సంగాత్, జ్ఞాయతే వినయః శ్రుతాత్
లోకానురాగో వినయా న్న కింలోకానురాగతః”..
అను శ్లోక స్ఫూర్తిగా అలవడిన జ్ఞానరాశి, ఆ వలన వినయం, ఆ ద్వారా లోకానురాగమును అవగతమును చేసుకున్న సుప్రసన్నులు సాహిత్య శిల్పవేది.
అపూర్వోభాతి భారత్యాః కావ్యామృత ఫలేరసః
చర్వణే సర్వసామాన్యే, స్వాదువిత్ కేవలం కవి.. (భోజచరితం)
అంటే వాక్కు యొక్క అమృత ఫలము కావ్యము. ఆ కావ్యరసము అపూర్వమైన ప్రకాశం గలది. అందరూ దానిని గ్రోలుతుంటారు. కాని ఆ రస స్వారస్యమును గ్రహింపగల అతికొద్ది మంది సాహిత్యమూర్తులలో సుప్రసన్నులు అగ్రగణ్యులు. అందుకే ఆయన స్మృతి చెరగనిది. చిన్ననాటి నుండి తొంబదేళ్ళ వయస్సులో కూడా తాము వినిన, కనిన, చదివిన అంశాల ముచ్చట్లు.. ఆయా సందర్భాల పౌర్వాపర్యాలను, స్వారస్యాలను.. వాటిపై తమ నిశ్చితాభిప్రాయాలను నిత్యనూతనంగా అభివ్యక్తం చేస్తున్న ప్రాజ్ఞులే సుప్రసన్నులు. అందుకే ఆయన.. అంటే.. కోవెల.. ఓరుగల్లు సాహిత్య క్షేత్రానికి ఒక ధ్వజస్తంభం వంటివారని కవితా సామ్రాజ్యాలక్ష్మీ ధురంధర చూడామణియని సాహిత్యశ్రేణుల నిష్కర్ష.
క్రీ.శ. 1954లో.. దాదాపు డెబ్బదేండ్ల క్రితం ‘హృద్గీత’తో ప్రారంభమైన సుప్రసన్నుల కవిత్వ సృష్టి.. ‘వనవాసరాఘవం’తో ఇరువది ఆరు కావ్య సుమపరిమళాలను పాఠకులకు పంచింది. క్రీ.శ. 1971లో ‘సాహిత్య వివేచన’ అను పేరుతో వెలువడిన విమర్శనా వ్యాససంపుటి.. విశ్వనాథ సమన్విత దృక్పథం (2025) వంటి ఏకాదశ రచనలు సాహిత్య విమర్శకే వినూత్న పోకడలు నేర్పాయి. ‘దీపవృక్షం’, ‘రసరాజధాని’ వంటి ఆరు వచన కవితా రచనలు, వేదసూక్త సౌరభం (మంత్ర వ్యాఖ్య).. అనుభవ సంపుటి.. (శివానందమూర్తి ప్రభావ ఫలితం) (13) సంపాదకత్వంలో తెలుగు సాహిత్య సరస్వతికి కానుకగా సమర్పించారు. చేతానవర్త కవితతో.. నవ్యకవిత్వ సంప్రదాయాన్ని ప్రవచించిన వచన కవిత్వము భావ- అభ్యుదయ – విప్లవ – దిగంబర కవిత్వ మార్గాలను మలుపుదిప్పిన సాహితీస్రష్ట సుప్రసన్నులు. వారు భారతీయతకు నిలువుటద్దము. ఈ రచనలన్నీ వారి జ్ఞానారామంలో విరిసిన పుష్పాలు.
ఈ రచనలన్నిటిలో వేదములు – ఉపనిషత్తులు- సూక్తములు, కాళిదాసాది మహాకవుల కావ్యాలు.. నన్నయాదుల ప్రభావంతో బాటు ఆర్షధర్మమకుటాయమైన భారతీయ సంస్కృతి యొక్క ఆత్మ నేపథ్యంలో ప్రతిభింబిస్తుంది. ‘వీరి విమర్శ శుద్ధతత్త్వశాస్త్రము మరియు అద్వైతం వంటిది. వీరి సాహిత్య దర్శనం విశిష్టాద్వైతం వంటిద’న్న ప్రఖ్యాత విమర్శకుల అభిప్రాయము సాభిప్రాయమే. అట్లే వీరి విమర్శ – రెండంచుల కత్తివాదర, వీరి రచన సురభిళ మంజులసుధాకరసుధాధార. వీరి సాహిత్యానుశీలనము సాహిత్య విమర్శకే మరో చూపు ప్రసాదించే మనోనేత్రం. సుహృద్విమర్శకు మార్గదర్శియైన సుప్రసన్నులు పరాదేవతను, విమర్శారూపిణీయైన విద్యాదేవిని, ఆత్మ దర్శనము చేయించు ఆధ్యాత్మ విద్యను, రసదర్శనము చేయించు సాహిత్య విద్యను భావితరాల కందించిన ప్రతిభా వ్యుత్పత్త్యభ్యాసముల పరిణిత మూర్తులు.
శ్రీ గూడ వేంకటసుబ్రహ్మణ్యం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు 1969లో ప్రచురించిన సారస్వత వ్యాసములలో “ప్రతిభా ప్రభావమైన సాహిత్యక్షేత్రమున సామాన్యముగా శాశ్వత నిరంకుశ ప్రమాణాల (Absolute standards) కంటే సాపేక్ష ప్రమాణము (Relative standards)లే అభిలషణీయములు” యన్న అభిప్రాయము సుప్రసన్నుల రచనలలో ప్రతిఫలనం చెందినదనుటలో అతిశయోక్తి లేదు. ఇంతటి విద్వద్విభూషితులే పరిశోధక విద్యార్థుల పాలిటి కల్పిశాఖి.
ఆచార్య సుప్రసన్నులు:
“సద్బుద్ధిస్సాధుసేవీ సముచిత చరిత స్తత్త్వబోధాభిలాషీ
శుశ్రూషుస్త్యక్తమానః ప్రణిపతనపరః ప్రశ్నకాల ప్రతీక్షః
శాంతోదాంతోనసూయ శ్శరణముపగతః శ్శాస్త్ర విశ్వాస శాలీ
శిష్యః ప్రాప్తః పరీక్షాం కృతవిదభిమతం తత్త్వతః శిక్షణీయః”
అను మహితోక్తికి నిలువుటద్దము. తమ పరిశోధక శిష్యులకు సాహిత్య తత్త్వవిషయక రహస్యములు విప్పిచెప్పిన తాత్త్వికులు వారు.
అట్లే
“యః పఠతి, లిఖతి, పశ్యతి, పరిపృచ్ఛతి, పండితానుపాశ్రయతి
తస్యదివాకరకిరణైః నళినీదళ మివ వికాస్యతే బుద్ధి” ని
సద్గురువులు శ్రీ కందుకూరు శివానందమూర్తిగారిననుసరించి సుప్రసన్నులు మూర్తీభవించిన భారతీయ ధర్మాకృతి. భారతీయ వైదిక, సంస్కృతీ వైభవ ప్రకాశిత అంతరాత్ములు. సంపత్కుమార ననుసరించి సుప్రసన్నులు
అతని ఆలోచనమె అనాహతమ్ము, అతని విశ్లేషణ విశుద్ధ, మతని వాక్కు
పద్మకోశ భ్రమర వినిస్వాన మధువు, అల సహస్రారమాతని అనుభవము..
మరియు షోడశరామాయణ రహస్యవేది. గుంటూరు శేషేంద్ర శర్మ గారి ననుసరించి.. “సుప్రసన్న కవిత్వధార అకలుషిత ప్రసన్న ధార.. ఇందుకు దర్శనము వారి శతాంకుర”.
ఆపై పాములపర్తి వేంకటనరసింహారావు గారి మాటల్లో.. “విశ్వనాథ ఒక బ్రహ్మరోచిస్సు.. సుప్రసన్న రెండవ ఉషస్సు..”.
ప్రముఖ సంస్కృత విద్వాంసులు, శ్రీభాష్యం విజయసారథి, సర్వవైదిక సంస్థానం కరీంనగర్ వారిచే –
“మనోజ్జ మధుమాస సంస్కృత రసాలసారగ్రసద్
వికస్వర, పికస్వర ప్రియరసోక్తి బిబ్బోకితా
ఉదారతర వేద రసభారతీ జయతి సుప్రసన్నార్యతే”
అని విద్వత్ప్రశంసలు పొందిన కవన ఋషి సుప్రసన్న.
ఆచార్య శ్రీపెరుంబూదూరు లక్ష్మణమూర్తి ననుసరించి సుప్రసన్నులు కవిభావుక శిఖామణులు.
ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారిచే “ఏ గురూత్తము కవితాగాంగా ఝరియందు త్రిషవణస్నాన సందీప్త తనువు.. ఏజగదేవమాతృశ్రీ పదారాధనము, హృదయ మనాతనముగ” అని ప్రశసంలు పొందిన ఆచార్యవర్యులు సుప్రసన్నులు.
డా॥ శలాక రఘునాథశర్మ గారి ననుసరించి సుప్రసన్నులు వెలకట్టరాని కోవెల. శ్రీ వేముగంటి నరసింహాచార్యుల ప్రకారము ‘శారదా దరహాస ప్రపన్నులు.. విద్వద్వరేణ్యులు సుప్రసన్న సుధీమణి శుభయశస్వి’.
ఆధునిక మానవుడు దైవం తొలగి, ధర్మం తొలగి, సమగ్రజీవసూత్రం తొలగి, ‘తానెక్కిన చెట్టును తానే నరుక్కునే మూర్ఖ మానవుడని నిర్వచించిన విధం’ అన్నది సుప్రసన్నుల సాభిప్రాయమే.
“ఎల్లగుండెలలోన రహించుగాత ప్రణవనాద మనాహతభర్మసీమ
పూలు పక్షులు వెన్నెలల్ పొలచిమరల.. తీయనైన జీవితము”
అంటూ పరిక్రమలో ప్రస్తావిస్తే.. ఋతంభరలో భావుకతను పండించారు ఈ కవిశిఖామణి.
ఇంతటి ప్రతిభావ్యుత్పనులు.. కవితా తపస్వి, భారతీ హృదయవేది, విశ్వనాథవారన్నట్లు ప్రాక్పశ్చిమమతంబున రసము వేయిరెట్లు గొప్పది. నవకథాధృతిని మించి.. రసము పుట్టింపగ వ్యవహారము నెరుంగ జనును. లోకమ్ము వీరి రసమ్ములేదు.. అను సాహిత్య బ్రహ్మసూత్ర వాక్యాలను ఒడిసిపట్టుకొని లౌకిక జీవనంలోనూ, పారమార్థిక జీవనంలోను అనుదిన సంభాషణల్లోనూ.. కవిత్వ సృష్టిలోనూ.. ఆలోచనా పరిశీలనములోనూ ఆ రసాధిదేవతను దర్శించి తరించిన సాహిత్య ఋషి ఆచార్య సుప్రసన్నులు.
అనంత విభూషితులు శ్రీశ్రీశ్రీ శ్రీరామచంద్ర రామానుజజీయర్ స్వామి భాష్యకార పీఠంవారి మంగళాశాసనములను పొందిన వేదాంతి. శ్రీ సముద్రాల వేంకట రంగరామానుజాచార్యుల వారిచే –
“కవిభావుకతాశక్తి ద్వయమండిత పండితః
జయతాత్ సుప్రసన్నార్యః స్వశీత్యజ్ఞ సుమాన్విత”
అంటూ వైదికాశంసనమును కన్నులకద్దుకున్న దార్శనికులు సుప్రసన్నులు.
ఆపై పోతన పంచశతి ఉత్సవ (1982) కార్యక్రమాల నిర్వహణాదక్షులుగా, స్థానిక విశ్వేశ్వర సంస్కృతాంధ్ర సంస్కృత కళాశాల నిర్వాహక కార్యదర్శిగా, కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో.. వివిధ హోదాలలో..; విశ్వవిద్యాలయ సాయం కళాశాల ప్రధానాచార్యులుగా; సాహితీబంధుబృందం వంటి సాహిత్య సంస్థలకు హితవరిగా, పోతన విజ్ఞానపీఠం కార్యదర్శిగా, సమకాలీన, అభ్యుదయ రచయితలు, కవిపండితులకు ఆదర్శమూర్తియైన వీరిని కేంద్ర సాహిత్య అకాడమీ వారి ఠాగూర్ తొలి సాహిత్య పురస్కారంతోబాటు (నేటి వరకు) విశ్వనాథ సత్యనారాయణ జాతీయ పురస్కారంతో ముప్పది మూడు పురస్కారాలు.. అవార్డులు, గౌరవాలు వీరిని వరించాయి. వీరి సాంపరాయం, శేఫాలికా కావ్యాలు ఆంగ్లంలోకి అనూదితాలయ్యాయి. వీరి రచనలు మరియు వ్యక్తిత్వ జీవితంపై పదిహేను రచనలు వెలుగు చూచాయి. 1973 నుండి డెబ్బదికి పైగా అవధానాలు నిర్వహించి శ్రీశ్రీశ్రీ భారతీతీర్థులు (శృంగేరి జగద్గురువులు); మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదులు సాహితీ సమరాంగణ చక్రవర్తి, పాములపర్తి వెంకటనరసింహారావుగారి ఆశీస్సులను పొందిన విద్వన్మణులు, విమలస్వాంతులు సుప్రసన్నులు.
ఆప్తులు, జీవితభాగస్వామి, కుమారుడు, చిన్న అల్లుడి అకాల మరణాన మువ్వేదనలు.. ముప్పేటలా ముసురుకున్నా.. జనన మరణాలు దైవనిర్ణయాలని.. మనసును దిటవు పరచుకొని.. తరువాతికాలంలో ఆధ్యాత్మిక ఆలోచనలతో అంతర్ముఖులై.. పరాత్పరునితో అనుసంధానమై.. తనను తాను ఊరడించుకున్న జనన మరణ రహస్య వేది. ఇటీవలే అంధత్వం సంప్రాప్తించినా.. ఇది కేవలం శరీరానికే కాని మనసుకు కాదని భావించి.. శ్రీరమణుల సరసన నిలిచిన సాహిత్య ఋషి. ప్రతిభామూర్తియై ఉపనిషత్సారాన్ని గ్రోలిన అనుష్ఠాన వేదాంతియై.. శ్రీ విద్యాత్త విదేహరాజ తనమాక్లిష్టత; శేషాహి శయ్యా విన్యాసము; శంఖచక్రయుగలక్ష్యన్యస్తహస్తము, ద్యావా పృథ్వీసమాస సంకలన సంప్రదాయములు, దివ్యప్రీతి సంభావ్యమై ఆవేశించిన సుప్రసన్నుల మానసాభ్రము ఒక జీవచైతన్య సంపుటి. ఆ అమేయ ప్రభావమనస్సు చిత్కళా విధము వారికి శతాయువును, ఆరోగ్య సౌభాగ్యములను ప్రసాదించవలయునని.. తాము సందర్శించే జ్యోతిశ్చక్ర వేవెలుంగులను సాహితీ ప్రియంభావుకులకు పంచాలని అభిలషిస్తూ..
తొంబది ఏళ్ళ ప్రాయం తొలి సంధ్యలో పుంభావ సరస్వతీమూర్తులు దార్శనికులు, వాగ్విదాంవరులు, నవ్య సంప్రదాయ ప్రవర్తకులైన సుప్రసన్నులను అభినందించి వారి ఆశీస్సులను పొందడానికి వారి శిష్య మిత్రబృందాలు సంకల్పించిన ఈ విశిష్ట సంచిక ‘ప్రతిభాసుప్రస్ననము’ చంద్రునికో నూలుపోగు వంటిది. ఇందుకు అభ్యర్థించిన వెంటనే వారి శిష్యులు, కవి పండితులు, ఆచార్యులు, ఆధ్యాత్మికవేత్తలు తమ అమూల్య రచనలనిచ్చి సహకరించారు. ఇంతటి అపురూప సంచికకు ప్రధాన సంపాదక బాధ్యత వహించుటకు నాకు అవకాశమిచ్చిన అభినందన సమితి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలనా విష్కరిస్తూ..
“యస్యాఃపాదయుగం తథాకరయుగం, చంద్రశ్చకల్పఃక్రమాత్
వక్త్రంవ్యాకరణమ్, వచోవివరణమ్, శ్రోత్రమ్ నిరుక్తం స్మృతమ్
నేత్రం జ్యోతిషమాయతం, వికలుషం, ఘ్రాణంతు శిక్షాపరా
తస్మైనోఽస్తు నమస్కృతి శ్రుతి మహామాత్రే జగత్సూతయే” (మనుస్మృతి -4-3)
ఇదం కవిభ్యః పూర్వేభ్యో నమోవాకం ప్రశాస్మహే
ఓం సహనావవతు – సహనౌభునక్తు
సహవీర్యం కరవావహై- తేజస్వినావధీతమస్తు
మావిద్విషావహై ఓం శాంతిః శాంతిః శాంతి.
ఇతిశమ్
హనుమకొండ, 26 మార్చి, 2026.
– డా॥ దహగాం సాంబమూర్తి
ప్రధాన సంపాదకులు
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య ‘నవతి’ పూర్తి అభినందన సమితి, వరంగల్లు
అధ్యక్షులు:
ఆచార్య బన్న అయిలయ్య
కార్యదర్శి:
గన్నమరాజు గిరిజామనోహరబాబు
ఉపాధ్యక్షులు:
వనం లక్ష్మీకాంతరావు
రామాచంద్రమౌళి
డా॥ ఎన్.వి.ఎన్. చారి
సహాయ కార్యదర్శులు:
డా॥ ఎల్.ఎస్.ఆర్. ప్రసాద్
పొట్లపల్లి శ్రీనివాసరావు
కుందావఝల కృష్ణమూర్తి
ఆర్థిక కార్యదర్శి:
న్యాలకొండ భాస్కరరావు
హితవరులు:
డా. దహగాం సాంబమూర్తి
డా.జి.వి. రత్నం
డా. అంపశయ్య నవీన్
ఆచార్య యల్లాప్రగడ సుదర్శనరావు
నాగిళ్ళ రామశాస్త్రి
వి.ఆర్. విద్యార్థి
డా. ఎ.వి. నరసింహారావు
సభ్యులు:
ఆచార్య చిలుకమారి సంజీవ
డా॥ వజ్ఝల రంగాచార్య
వరిగొండ కాంతారావు
శ్రీమతి నెల్లుట్ల రమాదేవి
పందిళ్ళ అశోక్ కుమార్
కంది శంకరయ్య
చేపూరి శ్రీరామావు
డా॥ తుమ్మూరి లక్ష్మణరావు
మలినేని కృష్ణ
డా॥ పాతూరి రఘురామయ్య
గందె శ్రీనివాస్
