[యం. ధరిత్రీ దేవి గారు రచించిన ఆ రాగాలాపన.. మనందరి కోసం..’ అనే కవితని అందిస్తున్నాము.]
నిన్న మొన్నటిదాకా
ముడుచుకుపోయే చలిగాలులు..!
మూల్గుతూ.. గజగజ వణుకుతూ..
పనికి బద్ధకిస్తూ జనాలు..!
చలిమంటల వెచ్చదనానికై వెతుకులాటలు..
స్వెట్టర్లకూ.. మఫ్లర్లకూ ఎక్కడలేని గిరాకీలు!
అంతలోనే..! మెల్లిగా.. మెల్లమెల్లగా..
పలుకరించాయి చిరుచెమటలు..!
సూర్యభగవానుని చండ్రనిప్పుల తాకిడికవి
ధారలు ధారలై మొదలైంది నిట్టూర్పుల జడి!!
చలికి తాళలేక ఎండను కోరిన నోళ్లు..
కలవరించిన కళ్ళు..
కావాలంటున్నాయి
సేద తీర్చే చిరుజల్లులు..!!
అలసిన దేహం ఆహారం మాట మరిచి..
ఎండిన గొంతు తడవాలి..చన్నీళ్లు చాలంటోంది..
మరోపక్క..పగుళ్ళు వారిన ఎండిన బీళ్లు..
ఎదురుచూస్తున్నాయి తొలకరి చినుకుల కోసం..!
నిరీక్షణ ఫలించి.. అదిగో నింగిని కమ్మిన మబ్బులు
అటు ఇటు పరుగులు తీస్తూ..
చల్లనిగాలులు సోకి.. మేఘాల దాగిన
నీటి కుండలు కరుగుతూ కరుగుతూ..
కురిపిస్తున్నాయి పూలవానలు..!
దుమ్ము.. ధూళి ఆవహించి
కళతప్పిన చెట్టూచేమా.. ఊరూవాడా..
ప్రకృతి వర్షంలో తడిసి..
అయిపోయాయి కడిగిన ముత్యాలు!!
మొదలయ్యాయి.. పక్షుల కిలకిలారావాలు..
చెంగుచెంగున లేగదూడల పరుగులు..!
నాగలి పడుతూ రైతన్నల ఆనందోత్సవాలు
“చిరుజల్లు కాస్త జడివానగా మారితే చాలు..
దేవుడా.. వరదలు.. బీభత్సాలూ లేకున్న
అదే పదివేలు..” అంటూ మళ్ళీ వేడుకోళ్ళు..!!
ఇదేమి మాయో !! చలి ఎక్కువైతే వద్దంటాం..
ఎండకై ఎదురు చూస్తాం.. అదెక్కువైతే..
వాన రావాలంటాం.. మానవ నైజం..!!
అయినా అది ప్రకృతి ధర్మం…
అవును మరి..! అవి ఋతురాగాలు!!
సృష్టి సమతుల్యతకవి సూత్రధారులు..
మానవాళికి తిరుగులేని రక్షణకవచాలు!!
ప్రకృతిలో మమేకమౌతూ ఆలపించే
ఆ రాగాలాపన.. మనకోసం.. మనందరి కోసం..
యం. ధరిత్రీ దేవి విశ్రాంత అధ్యాపకురాలు. వీరి కవితలు, కథలు, వ్యాసాలు కొన్ని ప్రింట్ పత్రికల్లో, అంతర్జాల పత్రికల్లో ప్రచురింపబడినవి.
