Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆ రోజు మళ్లీ వస్తే..

[గాజోజి శ్రీనివాస్ గారు రచించిన ‘ఆ రోజు మళ్లీ వస్తే..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

సాయంత్రం మసకబారుతున్న వెలుతురు గదిలోకి నెమ్మదిగా జారుకుంటూ, ప్రతి మూలను ఒక మృదువైన నీడతో కప్పేస్తోంది. కిటికీ అంచుల్ని తాకి లోపలికి జారుకున్న చల్లని గాలి, గదిలో నిలిచిపోయిన నిశ్శబ్దాన్ని కేవలం కదిలించింది గానీ, చెదరగొట్టలేకపోయింది.

గడియారం టిక్‌టిక్‌ శబ్దం తప్ప ఇంకేమీ వినిపించలేదు. ఆ శబ్దం కూడా కాలం కదులుతోందని చెప్పడం కంటే, ఏదో ఒక చోట అది చాలాకాలం క్రితమే ఆగిపోయిందని గుర్తు చేస్తున్నట్టుండింది.

సతీష్‌ చనిపోయి మూడు సంవత్సరాలు అయ్యాయి. అయినా మాలతి ఇంకా అతని డైరీని పూర్తిగా చదవలేకపోయింది. ఆ పాత గోధుమరంగు కవరున్న డైరీ ఇప్పుడు ఆమె ఒడిలో నిశ్శబ్దంగా పడివుంది. అంచులు వెలిసిపోయాయి, పేజీలు పసుపెక్కాయి. కానీ అందులో దాచుకున్న జ్ఞాపకాలు మాత్రం కాలానికి అందకుండా అలాగే నిలిచిపోయాయి. అది కేవలం ఒక పుస్తకం కాదు, తనతో కలిసి ఒకప్పుడు బ్రతికిన మనిషి ఇంకా తనకు చేరువలోనే ఉన్నాడనే చివరి భ్రమ.

ఆమె మెల్లగా డైరీని తెరిచింది. మొదటి పుటలో అతని చేతిరాత.

“నీ మౌనం చాలా శబ్దం చేస్తుంది, మాలతి.”

ఆ ఒక్క వాక్యం కనిపించిన క్షణంలోనే ఆమె వేళ్లు ఆగిపోయాయి. పెదవులపై కనిపించని చిరునవ్వు మెదిలింది. అదే క్షణంలో కళ్లలో తడి నిండింది. అది సతీష్‌కి అలవాటు. ఆమె ఏ బాధనైనా మాటల్లో చెప్పకుండా మౌనంలో దాచుకుంటే, అతను నవ్వుతూ అనేవాడు –

“నువ్వు బాగున్నానంటే నమ్మేస్తా.. కానీ నీ మౌనం మాత్రం నన్ను మోసం చేయదు.” ఆ జ్ఞాపకం, ఎప్పటిలాగే, ఆమెను మెల్లగా వెనక్కి తీసుకెళ్లింది.

ఇంటర్మీడియట్ మొదటి రోజు.

కొత్త క్లాస్‌రూమ్. కొత్త ముఖాలు. కొత్త సంకోచాలు. మాలతి, ఎప్పటిలాగే, చివరి బెంచ్‌వైపు వెళ్లి కిటికీ పక్కన కూర్చుంది. పుస్తకం తెరిచింది. కానీ అక్షరాల కంటే బయట కనిపిస్తున్న చెట్టు నీడనే ఎక్కువగా చూస్తోంది. కొత్త ప్రదేశాల్లో, కొత్త మనుషుల మధ్య, తాను ఎప్పుడూ ముందుగా మాటల్ని కాదు.. మౌనాన్నే ఆశ్రయించేది.

“ఇక్కడ కూర్చోవచ్చా?”

“అవును..” అంది చిన్నగా.

“నేను సతీష్‌.”

“మాలతి.”

“సరే.. ఇక నుంచి మ్యాథ్స్‌లో ఏదైనా అర్థం కాకపోతే అడుగుతాను.”

“నీకు ఎలా తెలుసు నాకు వస్తుందని?”

అతను నవ్వాడు.

“మొదటి పీరియడ్ మొదలయ్యేలోపే నోట్స్ ఓపెన్ చేసిన వాళ్లు సాధారణంగా తెలివైన వాళ్లే.”

ఆ మాటకు ఆమెకు నవ్వొచ్చింది.

అది వాళ్ల మొదటి మాట. ప్రేమ కాదు. కానీ.. తర్వాత తన జీవితాన్ని మొత్తం మార్చబోయే మొదటి ఆరంభం.

రోజులు గడిచేకొద్దీ, వాళ్ల పరిచయం మెల్లగా స్నేహంగా మారింది. మొదట్లో పుస్తకాలు, పరీక్షలతో మొదలైన మాటలు, తర్వాత ఒకరి రోజుల్లోకి మరొకరిని తీసుకువచ్చాయి. లంచ్ బ్రేక్‌లో ఆమె మౌనంగా కూర్చుంటే,

“ప్రొఫెసర్‌గారు, ఇంత సీరియస్‌గా బ్రతికితే వయసు త్వరగా పెరుగుతుంది,” అని ఆటపట్టించేవాడు.

“నేను ఇంత సీరియస్‌గా ఉండటానికి కారణం మీలాంటి వాళ్లే,” అంది ఆమె.

“అయితే.. నేను నీ జీవితంలో ముఖ్యమైన కారణమన్నమాట.”

“అంత త్వరగా నిర్ణయానికి రాకండి.”

“సరే.. కొంచెం టైమ్ తీసుకుని అదే నిర్ణయం తీసుకో.”

ఆ మాటలు అప్పటికి సాధారణంగానే అనిపించాయి. కానీ కొన్ని మాటలు ఆ క్షణంలో ముగియవు. అవి మనసులో మిగిలి, తర్వాత జీవితమే వాటి అర్థాన్ని చూపిస్తుంది. ఒక సాయంత్రం. లైబ్రరీ మూసే సమయం. బయట వర్షం కురుస్తోంది. అందరూ తొందరగా వెళ్లిపోతున్నారు. మాలతి మాత్రం కిటికీ దగ్గర నిలబడి వర్షాన్ని చూస్తోంది. వర్షం పడుతుంటే ప్రపంచం కొంతసేపు మెల్లగా మారిపోతుందని ఆమెకు ఎప్పటినుంచో అనిపించేది. శబ్దాలు దూరమవుతాయి. మనసు దగ్గరవుతుంది.

“ఇంకా ఇక్కడే ఉన్నావా?” అని వెనక నుంచి సతీష్ అడిగాడు.

“వర్షం తగ్గాక వెళ్తాను,” అంది.

“గొడుగు తెచ్చాను.. వెళ్దాం పదా,” అన్నాడు.

ఇద్దరూ ఒకే గొడుగు కింద దగ్గరగా నడవసాగారు. గొడుగు అంచుల నుంచి జారుతున్న చినుకులు, వాళ్ల మధ్య మౌనాన్ని మరింత దగ్గర చేశాయి.

“నువ్వు ఎప్పుడూ ఇంత తక్కువగా మాట్లాడుతావా?” అని అడిగాడు.

“మాట్లాడాల్సిన వాళ్లు దొరికితేనే మాటలు వస్తాయి,” అంది మాలతి.

అతను కాసేపు ఆమె వైపు చూసి –

“అయితే.. నేను ఆ లిస్ట్‌లో చేరడానికి ఇంకొంచెం ప్రయత్నించాలి అనుకుంటున్నా,” అన్నాడు.

ఆమె నవ్వింది.

ఆ నవ్వులోనే వాళ్ల మధ్య మొదటి దగ్గరత్వం పుట్టింది. ప్రేమ చాలా సార్లు ఒక్కసారిగా రాదు. మన మౌనం అసౌకర్యంగా అనిపించని ఒక మనిషి దగ్గర నుంచే అది మొదలవుతుంది.

డిగ్రీ చివరి సంవత్సరం.

క్యాంపస్‌లోని పాత చెట్టు నీడలో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. గాలి మెల్లగా వీచుతోంది. మాటలేకపోయినా, ఆ మౌనం అసంపూర్ణంగా అనిపించలేదు.

“ఆర్మీలో చేరాలి,” అన్నాడు సతీష్‌.

“నిజంగానేనా?” అంది మాలతి.

“చిన్నప్పటి నుంచే ఉంది ఆ కోరిక.”

ఆమె కొద్దిసేపు మౌనంగా ఉండి, “నాకు భయం వేస్తోంది,” అంది.

అతను మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు.

“అయితే.. నాకు తిరిగి రావడానికి ఒక కారణం ఉంది.”

ఆమె కళ్లలో తడి నిండింది.

“వెళ్లొచ్చు.. కానీ నన్ను మరిచిపోవద్దు.”

అతను చిరునవ్వుతో, “దేశం కోసం వెళ్లగలను.. కానీ నిన్ను వదిలి కాదు,” అన్నాడు.

ఆ రోజు వాళ్లు “ప్రేమ” అనే మాట పలకలేదు. కానీ కొన్ని బంధాలు పేరు పెట్టకముందే తమలోని ప్రేమను తెలియజేస్తాయి.

కాలం ముందుకు కొనసాగింది.

మాలతి చదువుల్లో ముందుకు వెళ్లి లెక్చరర్‌గా మారింది. సతీష్ తన కలను సాకారం చేసుకుని ఆర్మీ ఆఫీసర్‌గా చేరాడు.

దూరం పెరిగింది. కానీ అనుబంధం మాత్రం తగ్గలేదు. అతను ఎక్కడ ఉన్నా, ఆమెకు ఉత్తరాలు రాయడం మానలేదు.

ఆరు సంవత్సరాల ప్రేమ.. ఎన్నో పరీక్షలు, ఎదురు చూపులు, మౌనాలు దాటి చివరికి వివాహంగా మారింది. వివాహానంతరం వారి జీవితం పెద్ద కలలతో కాదు, చిన్న చిన్న సంతోషాలతో నిండిపోయింది.

ఒక ఉదయం, మాలతి చాయ్ చేస్తుంటే సతీష్ వెనుక నుంచి వచ్చి కప్పులో చక్కెర వేస్తూ –

“ప్రొఫెసర్‌గారు, మీరు బోధించేంత బాగా చాయ్ చేయలేరు,” అన్నాడు.

“మరి తాగొద్దు,” అంది ఆమె.

అతను నవ్వుతూ కప్పు తీసుకున్నాడు.

“నీ చేతి చాయ్ రుచిగా లేకపోయినా.. నీతో తాగడం మాత్రం రుచిగా ఉంటుంది.”

ఆమె అతన్ని చూసి నవ్వింది.

అలాంటి చిన్న ఉదయాలే, తర్వాత ఆమె జీవితంలో అతిపెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి.

ఒక రాత్రి, చంద్రకాంతి కిటికీ అంచులపై జారుతున్న వేళ, ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు.

“ఈ ప్రశాంతత.. ఇలాగే కొనసాగుతుందని అనిపిస్తోంది,” అని సతీష్ అన్నాడు.

మాలతి అతని భుజంపై తల ఆనించింది.

“ప్రశాంతత శాశ్వతం కాదు..”

“అయితే?”

“దాన్ని గుర్తు పెట్టుకునే జ్ఞాపకాలు మాత్రం శాశ్వతం.”

అతను చిరునవ్వుతో,

“అయితే.. మనం జ్ఞాపకాల్లో చాలా కాలం బ్రతుకుతామన్నమాట,” అన్నాడు.

ఆ మాటకు ఆమె నవ్వినా, తెలియని భయం మాత్రం గుండెల్లో ఎక్కడో నీడలా కదిలింది. జీవితం చాలా సార్లు ముందే సూచనలు ఇస్తుంది. కానీ వాటి అర్థం మనకు తెలిసేది.. చాలా ఆలస్యంగా.

వివాహం జరిగిన కొద్దిరోజులకే, సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అత్యవసర ఆర్డర్ వచ్చింది. సతీష్ వెంటనే బయలుదేరాల్సి వచ్చింది. ఆ రాత్రి ఇంట్లో అన్నీ అలాగే ఉన్నా, గాలి మాత్రం మారిపోయింది. మాలతి అతని బ్యాగ్ సర్దుతోంది. చొక్కా మడుస్తున్న చేతులు బలంగా కనిపిస్తున్నా, వేళ్లు మాత్రం వణుకుతున్నాయి.

“ఇంత శుభ్రంగా సర్దితే.. నేను అక్కడ కూడా నిన్నే మిస్ అవ్వాలి కదా,” అన్నాడు సతీష్ చిరునవ్వుతో.

ఆమె నవ్వలేదు. అతను దగ్గరకు వచ్చి మెల్లగా అడిగాడు –

“ఇంత మౌనంగా ఎందుకు ఉన్నావు?”

ఆమె తలదించుకుంది.

అతను మెల్లగా ఆమె ముఖాన్ని పైకెత్తాడు.

“నీ మౌనం చాలా శబ్దం చేస్తుంది, మాలతి.”

ఆ మాట వినగానే ఆమె కళ్లలో నీళ్లు నిండిపోయాయి.

“వెళ్లొద్దు..” అని చెప్పాలని ఆమెకు చాలా బలంగా అనిపించింది. కానీ ఆ మాట పెదవుల దాకా వచ్చి, గుండెలోనే ఆగిపోయింది. ఎందుకంటే అతను కేవలం తన భర్త మాత్రమే కాదు, తన ప్రమాణానికి, తన దేశానికి కట్టుబడిన మనిషి కూడా. ఆమె చేయగలిగింది ఒక్కటే. అతని చేతిని పట్టుకుని –

“జాగ్రత్తగా ఉండు..” అంది.

అతను ఆమె నుదుటిపై ముద్దుపెట్టి, “నేను వస్తాను,” అన్నాడు.

కొన్ని హామీలు అప్పట్లో ఆశలా అనిపిస్తాయి. తర్వాత అవే జీవితంలో పెద్ద శూన్యాలుగా మిగిలిపోతాయి. వెళ్లే రోజు రైల్వే స్టేషన్ జనసంచారంతో కిక్కిరిసిపోయింది. విజిల్స్, అనౌన్స్‌మెంట్స్, చక్రాల శబ్దం, అందరూ ఎక్కడికో వెళ్తున్నారు.

కానీ ఆ రద్దీ మధ్య, మాలతి ప్రపంచం మాత్రం ఒక మనిషి చుట్టూనే తిరుగుతోంది. సతీష్ తన జేబులోంచి ఒక చిన్న నీలిరంగు పెన్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. తాను లేని రోజుల్లో మాట్లాడాలని అనిపిస్తే, అందులో రాయమన్నాడు.

ఆమె వేళ్లు ఆ పెన్‌ను గట్టిగా పట్టుకున్నాయి. త్వరగా తిరిగి వస్తానన్న అతని మాటకు, ఆమె తల ఊపినా.. కళ్లలోని తడి ఆ నమ్మకాన్ని దాచలేకపోయింది.

రైలు కదలబోయే క్షణంలో, అతను లోతుగా ఆమెను చూస్తూ, తన కోసం ఎదురు చూస్తావా అని మెల్లగా అడిగాడు.

ఆ ప్రశ్నతోనే ఆమె గుండెల్లో ఏదో బలంగా విరిగిపోయింది. ఎదురు చూడటం కష్టమైనా, ఇప్పుడే అతన్ని వదిలేయడం ఇంకా కష్టమని ఆమె మనసు నిశ్శబ్దంగా ఒప్పుకుంది.

రైలు కదిలింది. అతను తలుపు దగ్గర నిలబడి, ఆమె చేతిని చివరి వరకూ పట్టుకున్నాడు. మాలతి కూడా వదలలేదు.

రైలు వేగం పెరిగేకొద్దీ, వాళ్ల వేళ్లు మెల్లగా జారిపోయాయి. చివరికి.. విడిపోయింది చేతి కాదు. ఆమె జీవితం. అతను చిరునవ్వుతో చేతిని ఊపాడు. ఆమె కూడా నవ్వడానికి ప్రయత్నించింది. కానీ అదే క్షణం తన జీవితంలో చివరిసారి అతన్ని చూస్తోందని అప్పుడు ఆమెకు తెలియదు. అతను వెళ్లిపోయిన తర్వాత, ప్రతి రోజు ఎదురు చూపుగానే మారింది. ప్రతి ఉదయం ఫోన్ మోగుతుందేమో అన్న ఆశ. ప్రతి రాత్రి తలుపు తట్టే శబ్దం వినిపిస్తుందేమో అన్న నిరీక్షణ. ఆ నీలిరంగు పెన్ ఆమె టేబుల్‌పై ఎప్పుడూ అలాగే ఉండేది. అతనితో మాట్లాడాలని అనిపించినప్పుడల్లా,

డైరీలో తన మనసును రాసేది.

“నువ్వు తిరిగి రా.”

ఆ మూడు మాటలే, ప్రతి రాత్రి ఆమె ప్రార్థనగా మారిపోయాయి. కానీ ఒక రోజు.. ఆమె ఎదురు చూసిన తలుపు శబ్దం,

ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.

ఇద్దరు ఆర్మీ అధికారులు ఇంటి ముందు నిలబడి ఉన్నారు. వాళ్లను చూసిన క్షణంలోనే, మాలతి గుండె ఏదో చెడు జరిగిపోయిందని గ్రహించింది. వాళ్లలో ఒకరు మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఆమెకు మాత్రం ఒక్క మాటే వినిపించింది –

“వీరమరణం..”

అంతే. ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగిపోయింది. సతీష్ మృతదేహం ముందు నిలబడ్డప్పుడు, చుట్టూ ఉన్నవాళ్ల ఏడుపు కూడా చాలా దూరం నుంచి వినిపిస్తున్నట్టే అనిపించింది. ఆమె మెల్లగా అతని దగ్గరకు వెళ్లింది. ఇప్పటివరకు ఎప్పుడూ తన కోసం వేడిగా ఉన్న ఆ చేయి.. ఇప్పుడు చల్లగా ఉంది. వణుకుతున్న వేళ్లతో అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. అందులో ఇక జీవం లేదు. కానీ ఆమె ప్రేమ మాత్రం ఇంకా అతనినే గట్టిగా పట్టుకుని ఉంది. ఆమె పెదవులు వణికాయి.

“నువ్వు తిరిగి వస్తానన్నావు కదా..”

ఆ ఒక్క మాటతోనే, ఇన్నాళ్లుగా గుండెల్లో నిలిచిపోయిన దుఃఖం ఒక్కసారిగా విరిగిపడింది. ఆమె అతని చేతిని గుండెలకు హత్తుకుని, హృదయం పగిలేలా ఏడ్చింది.

ఆ క్షణంలో ఆమెకు అర్థమైంది, తాను కోల్పోయింది ఒక మనిషిని మాత్రమే కాదు, తనతో పాటు బ్రతకాలసిన భవిష్యత్తుని కూడా. కన్నీళ్లు ఆగిన తర్వాత కూడా, గదిలో నిశ్శబ్దం మాత్రం అలాగే నిలిచిపోయింది. మాలతి మళ్లీ డైరీ పేజీలపై చూపు నిలిపింది. కొన్ని పేజీలు అతని చేతిరాతతో నిండిపోయాయి. కొన్ని చోట్ల ఆమెకోసం చిన్న చిన్న గమనికలు. మరికొన్ని పంక్తుల్లో, ఆమె పేరును అతను ఒకే లైన్లో మూడుసార్లు రాసి, మళ్లీ కొట్టేశాడు. ఎంత దగ్గరగా అనిపించినా, ప్రేమలో చెప్పలేని దూరాలు కూడా ఉంటాయని గుర్తు చేసేలా.

ఆమె వేళ్లు మెల్లగా పేజీలను తిప్పసాగాయి. అకస్మాత్తుగా ఒక పుట దగ్గర ఆగిపోయాయి. ఆ పేజీ మధ్యలో, సతీష్ చేతిరాతలో ఒక చిన్న వాక్యం కనిపించింది –

“ఒకవేళ జీవితమే వెనక్కి తిరిగితే.. నువ్వు ఏ క్షణాన్ని మార్చాలనుకుంటావు, మాలతి?”

ఆ మాటలు చూసిన క్షణంలో, ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. అది ప్రశ్నలా అనిపించలేదు.

చాలా కాలం తర్వాత, సతీష్ మళ్లీ తనను పేరుపెట్టి పిలిచినట్టుగా అనిపించింది. ఆమె పెదవులు మెల్లగా కదిలాయి.

“నేను మార్చాలనుకునేది ఒక్క క్షణం కాదు.. నిన్ను కోల్పోయిన.. ఆ రోజంతా..”

ఆ మాట బయటకు వచ్చిన వెంటనే, గదిలో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. కిటికీ తలుపు ఝంఝనమని తాకింది.

డైరీ పేజీలు ఒక్కసారిగా వేగంగా తిప్పుకుపోవడం మొదలుపెట్టాయి. మాలతి గుండె దడతో చేతులు చాపింది. కానీ ఆ పుటలు ఆమె వేళ్లను దాటి, ఎవరో కనిపించని శక్తి వాటిని వెనక్కి లాగుతున్నట్టుగా మరింత వేగంగా తిరుగుతూనే ఉన్నాయి. గదిలోని వెలుతురు మసకబారసాగింది. ఆమె శ్వాస భారమైంది. గుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తోంది. ధక్.. ధక్.. ధక్.. చివరికి, పేజీలు ఒక్కసారిగా ఒక చోటికి వచ్చి ఆగిపోయాయి. ఆమె చూపు మెల్లగా ఆ పుటపై పడింది.

అది – ఒక తేదీ.

ఆ రోజు.

రైల్వే స్టేషన్‌లో, సతీష్ తన కళ్లలోకి చివరిసారి చూసి వీడ్కోలు పలికిన రోజు. ఆమె వేళ్లు వణికాయి. తర్వాతి క్షణంలో, గది కనిపించకుండా పోయింది. ఒక్కసారిగా విజిల్ శబ్దం చెవుల్లో బలంగా మోగింది. మాలతి ఉలిక్కిపడి కళ్లుతెరిచింది. తన చుట్టూ జనసందోహం.

రైల్వే స్టేషన్. అనౌన్స్‌మెంట్స్. ప్లాట్‌ఫారమ్ మీద పరుగులు తీస్తున్న మనుషులు. ఆమె గుండె బలంగా కొట్టుకుంది. తన చేతిలో ఇంకా అదే నీలిరంగు పెన్ ఉంది. అది చూసిన క్షణంలోనే, ఆమె శ్వాస ఆగినట్టైంది. మెల్లగా తలెత్తి చూసింది.

కొద్దిదూరంలో, సతీష్ జీవించి, తన ముందే నిలబడి ఉన్నాడు. అతని కళ్లలో అదే వెలుగు. పెదవులపై అదే చిరునవ్వు. తనను చూసే అదే మృదుత్వం. మాలతికి కాళ్లు బలహీనంగా అనిపించాయి.

“మాలతి?” అని అతను ఆశ్చర్యంగా దగ్గరికి వచ్చాడు.

ఆమె మాత్రం అతని ముఖాన్ని చూస్తూనే నిలిచిపోయింది. చేతులు వణికాయి.

“సతీష్..” అని ఆమె పెదవులు కదిలాయి.

అతను స్వల్పంగా నవ్వాడు.

ఎప్పటిలాగే, తిరిగి వస్తానన్న నమ్మకంతో ఆమెను చూసాడు. ఆ మాట విన్న క్షణంలోనే, ఆమె లోపల ఏదో బలంగా కూలిపోయింది. ఈసారి అతన్ని పంపిస్తే.. ఇక మళ్లీ తిరిగి రాడు. ఆ నిజం మెరుపులా ఆమెను చీల్చింది. ఆలోచించకుండా, ఆమె ఒక్కసారిగా అతని చేతిని గట్టిగా పట్టుకుంది, వెళ్లొద్దని అంది. మొదట సతీష్ ఆశ్చర్యపోయాడు. కానీ ఆమె కళ్లలో నిండిన భయాన్ని చూసిన క్షణంలోనే, ఆ మాట సరదా కాదని అతనికి అర్థమైంది.

ఈసారి తాను అతన్ని పంపలేనని ఆమె వణికిన స్వరంతో చెప్పింది. అతను నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ, ఏమైందని మెల్లగా అడిగాడు. మాలతి శ్వాసను సరిచేసుకోవడానికి ప్రయత్నించింది. కానీ కన్నీళ్లు ఆగలేదు.తనకు ఇది ఎలా జరిగిందో, తాను ఎలా ఇక్కడికి వచ్చిందో తెలియకపోయినా, ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుసని అంది.

ఈరోజు అతన్ని వెళ్లనిస్తే, తాను అతన్ని శాశ్వతంగా కోల్పోతానని.

జనం రాకపోకలు, అనౌన్స్‌మెంట్లు, విజిల్స్ అన్నీ వాళ్ల చుట్టూ జరుగుతున్నా, ఆ క్షణంలో వాళ్ల ప్రపంచం మాత్రం నిలిచిపోయింది. మాలతి కళ్లలోకి చూస్తూ, ఆమె నిజంగానే భయపడుతోందని సతీష్ గ్రహించాడు. కానీ ఆమె మెల్లగా తల ఊపింది. అది భయం కాదని, తాను బ్రతికి చూసిన నిజమని అంది.

అప్పుడే రైలు రెండోసారి విజిల్ మోగించింది.

ఆ క్షణంలో, ఒక జీవితం వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంది. మరో జీవితం దాన్ని ఆపడానికి పోరాడుతోంది.

సతీష్ మెల్లగా తలదించుకున్నాడు. అతని కళ్లలో మొదటిసారి సందేహం కనిపించింది. ఒకవైపు తన ప్రమాణం.

మరోవైపు తన ముందున్న ఈ స్త్రీ ప్రేమ. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికి అతను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆ క్షణంలో మొదటిసారి అతను ఆలోచించాడు, ప్రాణం ఇవ్వడం మాత్రమే ధైర్యమా? లేక, ఎవరో ఒకరి కోసం బ్రతకడమూ ధైర్యమేనా?

“నేను వెళ్లకపోతే.. నువ్వు నన్ను జీవితాంతం గౌరవించగలవా?” అని అతను మెల్లగా అన్నాడు.

ఆమె కన్నీళ్ల మధ్య అతని వైపు చూసింది.

“నువ్వు చనిపోతే నేను గర్వపడగలను, సతీష్‌, కానీ.. గర్వంతో జీవితం నిండదు. నువ్వు లేకపోతే నేను బ్రతకగలను.. కానీ జీవించలేను.” అంది.

ఆ మాటలు అతని గుండెల్లో నేరుగా దిగిపోయాయి.

రైలు కదలడానికి సిద్ధమవుతోంది. సతీష్ ఒకసారి ప్లాట్‌ఫారమ్ వైపు చూశాడు. తర్వాత మళ్లీ మాలతి వైపు తిరిగిచూశాడు. ఆమె చేతులు ఇంకా అతని చేతులనే గట్టిగా పట్టుకుని ఉన్నాయి. అతను మెల్లగా తన బ్యాగ్‌ను భుజం నుంచి దించాడు. మాలతి ఊపిరి ఒక్కసారిగా ఆగినట్టైంది. అతను ఆమె కళ్లలోకి చూస్తూ చిరునవ్వు నవ్వాడు.

“ఈసారి..” అన్నాడు.

“నీ మౌనం నన్ను మోసం చేయలేదు.”

రైలు కదిలింది. అది ముందుకు వెళ్లిపోయింది. కానీ సతీష్ మాత్రం అక్కడే నిలిచిపోయాడు. మాలతి కళ్లలోంచి కన్నీళ్లు జారిపోయాయి. ఆమె ఒక్కసారిగా అతన్ని కౌగిలించుకుంది. అతను కూడా ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. చుట్టూ స్టేషన్ శబ్దాలు అలాగే ఉన్నాయి. జనాలు అలాగే కదులుతున్నారు. ప్రపంచం తన దారిలోనే సాగుతోంది. కానీ ఆ క్షణంలో, కాలం మాత్రం వాళ్లిద్దరికోసం ఒక్కసారిగా ఆగిపోయింది.

కొన్ని క్షణాల తర్వాత, మాలతి మెల్లగా అతని కౌగిలి నుంచి కొద్దిగా వెనక్కి జరిగి అతని ముఖాన్ని గమనించింది.

అతను నిజంగానే ఆమె ముందున్నాడు, జీవించి, వేడిగా, ప్రతి శ్వాసతో ఆమెను తాకుతున్న నిజంలా.

“ఇప్పుడు?” అని అతను మృదువుగా అడిగాడు.

“ఇప్పుడు ఏం చేద్దాం?”

ఆమె కన్నీటి తడిలోనే ఒక చిన్న నవ్వు విరబూసింది. ఆ నవ్వులో బాధ ఉంది. కానీ దానికంటే ఎక్కువగా ఆశ ఉంది.

“ఇప్పుడు.. బ్రతుకుదాం,” అంది.

అతను చిరునవ్వు నవ్వాడు. అప్పుడే, ఆమె చేతిలో ఉన్న నీలిరంగు పెన్ జారి నేలపై పడింది. ఇద్దరూ ఒకేసారి దానివైపు చూశారు. మాలతి దాన్ని తీసుకోవడానికి వంగింది. కానీ ఆమె వేళ్లు దానిని తాకేలోపే, అది మసక వెలుతురులో నెమ్మదిగా కరిగిపోతున్నట్టుగా కనిపించింది. ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది.

ఆమె తలెత్తి చూసింది. అతను ఇంకా అక్కడే ఉన్నాడు. కానీ అతని ముఖం చుట్టూ గాలి స్వల్పంగా కంపిస్తున్నట్టనిపించింది. ఆమెకు ఒక్కసారిగా అర్థమైంది. కాలం తనకు ఒక వరం ఇచ్చింది. కానీ వరాలు ఎప్పటికీ నిలవవు. ఆమె కళ్లలో మళ్లీ నీళ్లు నిండాయి.

“ఏమైంది?” అని అడిగాడు అతను.

ఆమె అతని చేతులను తన రెండు చేతుల్లోకి తీసుకుంది. ఈసారి వదిలేయకుండా. ఈసారి ప్రతి స్పర్శను గుర్తుంచుకునేలా. ఆమె ముందుకు వాలి, అతని నుదుటిపై ముద్దుపెట్టింది.

“ఈసారి,” అంది ఆమె మెల్లగా,

“నువ్వు వెళ్లిపోతే కూడా.. నేను నిన్ను ఆపిన ఆక్షణం మాత్రం నాతోనే ఉంటుంది.”

అతను ఏదో చెప్పబోయేలోపే, వెలుతురు ఒక్కసారిగా మాయమైంది. మాలతి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. తన గదిలోనే ఉంది. కిటికీ అంచుల్ని తాకి చల్లని గాలి లోపలికి వచ్చి హాయిగా ఊపిరి తాకుతోంది. గడియారం టిక్‌టిక్‌ శబ్దం వినిపిస్తోంది. ఆమె ఒడిలో అదే పాత డైరీ. ఒక్కసారిగా ఊపిరి అడ్డుపడినట్లై, గుండె గట్టిగా కొట్టుకుంటుంది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. సతీష్‌ లేడు. అది.. నిజమా? కలనా? కాలం నిజంగా వెనక్కి తిరిగిందా? లేక తన బాధే తనకు ఆ భ్రమను చూపించిందా? ఆమె వేళ్లు ఇంకా వణుకుతూనే ఉన్నాయి.

డైరీ తెరిచి చూసింది. చివరి పుటలో, ముందెప్పుడూ లేని ఒక కొత్త వాక్యం కనిపించింది. అది సతీష్‌ చేతిరాతే.

“కొన్ని రోజులు తిరిగి రావు. కానీ కొన్ని క్షణాలు.. మనల్ని మళ్లీ బ్రతికిస్తాయి.”

Exit mobile version