[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘ఆచంట మల్లన్న..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
లక్ష్మమ్మ, మూతి విరుస్తూ శేఖరానికి విసురుగా కాఫీ అందించి, చర చరా లోనికి వెళ్ళిపోయింది.
అలా విసురుగా అందించడంతో, రెండు కాఫీ చుక్కలు అతని చేతి మీద పడ్డంతో, ‘అబ్బా’ అని చేసేది లేక ఆ చుక్కల్ని నాకేసి, కాస్త ఆశ్చర్యంగా బుర్ర గోక్కుంటూ, ‘ఏవైంది దీనికి ఇవాళ. నిన్నటి వరకూ గంగలా ఉంది. ఇవాళ ఏవిటి చంద్రముఖిలా ప్రవర్తిస్తోంది. ఏం జరిగి ఉంటుంది’ అని ఈ సారి ముక్కు గోక్కున్నాడు.
ఆమె మళ్ళీ కిచెన్ లోంచి రుస రుసలాడుతూ వచ్చి, చేతిలోని ఉప్మా ప్లేటుని, టపీమని టీపాయి మీద పెట్టి వెళ్ళిపోబోతుండగా,
“లక్ష్మి, ఏవైంది నీకు ఇవాళ! పొద్దున్న నుండీ మొహం చలివిడి ముద్దలా పెట్టుకున్నావ్. ఎందుకంత చిరాకు, కొంపదీసి పోయిన వారంలా, రాత్రి తిన్న నూనె పూరీలు అరక్క మళ్ళీ అజీర్తి గానీ చేసిందా. అందుకే నిన్న నేను పూరీకి బదులు చపాతీ చేయిమని చెప్పాను. విన్నావా, తిన్నావ్ ఇప్పుడు చూడు” అన్నాడు.
“తెలియనట్టు అమాయకంగా మాట్లాడి నటించకండి. నేను మొహం చలివిడి ముద్దలా పెట్టుకుంది పూరీ అరక్క కాదు, మీపై చిరాకుతో” అని ముక్కు చీది, “మన చిన్నమ్మాయికి వచ్చిన పెళ్ళి సంబంధం ఎందుకు వద్దంటున్నారో అది చెప్పండి ముందు. మన వైజాగ్లో సంబంధాన్ని పురోహితుడు ఏరికోరి తెస్తే, మీరు చస్తే వద్దు అని ఎందుకలా వెర్రెత్తిపోతున్నారు. అయినా అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పైగా పాడు చెడు అలవాట్లు ఏవీ లేవట. పైగా అత్తమామలు మంచి వాళ్ళు. ఆడబడుచులు కూడా ఎవరూ లేరు. పైగా కట్న కానుకలు పెద్దగా డిమాండ్ చేయడం లేదు. అన్నిటిని మించి, అబ్బాయి అమ్మాయిని, అమ్మాయి అబ్బాయిని కూడా ఇష్టపడ్డట్టే కనిపిస్తున్నారు. అలాగే మన పురోహితుడు కూడా, వాళ్ళ కుటుంబం గురించి గట్రా చుట్టుపక్కల వాళ్ళని వాకబు చేసి,ఆ బాబు గురించి బాగానే చెప్పాడు. ఇంకా దేని గురించి మీరు తటపటాయిస్తున్నారు” అడిగింది లక్ష్మమ్మ బుగ్గ నొక్కుకుంటూ
“అదీ, మరీ, అన్నీ బాగానే ఉన్నాయనుకో. కానీ ఒకే విషయం నన్ను ఆలోచనలో పడేస్తోంది. అది ఏవిటంటే” అని ఇంకా ఏదో చెప్పే లోపు లక్ష్మమ్మ అడ్డుపడిపోయి
“మీరు ఇంకేం చెప్పకండి. ఆ మాత్రం నేనూహించగలను. నాకు విషయం మొత్తం అర్ధమైంది,మనమ్మాయి డిప్యూటీ సి.యం. పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఆ అబ్బాయి తమిళనాడు సి.యం. విజయ్ గారి అభిమాని. ఆ విషయంలో ఏవైనా మనస్పర్ధలు వస్తాయని భయపడుతున్నారా” అడిగింది.
“నీ తెలివి తెల్లారింది. నేను ఆలోచిస్తోంది అది కాదు, మన ఊళ్ళోనే మన పెద్ద అమ్మాయికి సంబంధం చేసుకుని అఘోరిస్తున్నాం, సరిపోదూ. మన ఊళ్లోని సంబంధం కదా అని ఏరుకోరి చేసుకున్నాను, ఏమైంది? చీటికిమాటికి, చిన్న పండక్కి, పెద్ద పండుగకి కూడా మన పెద్ద అల్లుడు వచ్చి మనింట్లో వాలిపోతున్నాడు. ఎన్ని పండుగలకు మనం మాత్రం అతన్ని చూడగలం. కష్టంగా ఉంది, మూడు సంవత్సరాల నుంచి ఇదే తంతు. రావడం, ప్రతి పండక్కి వచ్చి నాలుగు రోజుల నుండి వారం వరకూ ఉండడం, వెళ్లడం. చిన్న అల్లుడుని కూడా ఉన్న ఊర్లోంచే తెచ్చుకుంటే, అతను కూడా అత్తారిల్లు దగ్గరే కదా అని అన్ని పండగలకీ మనింటికి వస్తే? మనకి మిగిలేది పస్తే” అని ఓ క్షణం కప్పలా నోరు తెరిచి, “ఆ ఆలోచనతోనే నాకు భయంగా ఉంది” చెప్పాడు పైకి చూస్తూ.
“మీరు మరీను, పాయిజన్కీ పాయసానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అయినా, పెళ్లయ్యాక అలా అన్ని పండగలకీ మనింటికి ఎందుకు వస్తాడు. మన పెద్దల్లుడు లాంటి అల్లుడు ఎక్కడో గాని ఉండడు. అతని వరస వేరు. అందుకే అన్ని పండగలకీ వచ్చేస్తున్నాడు. కాదని చెప్పలేం కదా. అందుకే మౌనంగా ఉండిపోయాం. ఇతను అలా చేయడని నా మనస్సాక్షి గట్టిగా డిజే తరహాలో చెబుతోంది” అంది
“అలా అనకు, చిన్నల్లుడు కూడా పెద్దల్లుడు లాగే పోటీపడ్డాడంటే, మనం నెత్తిమీద చెంగేసుకోవాలి.వేరే ఊరి సంబంధం చేసుకుంటే పోలా, ఎందుకొచ్చిన రిస్కు మనకి” అన్నాడు
“ఇలా ప్రతి విషయాన్నీ మీరు విషమ పరీక్షలా ఫీలయిపోయి, లేనిపోనివి మీకు మీరే పెద్దవి చేసుకుని సెవెంటీ ఎం.ఎం.లో ఊహించకండి, అన్నీ ఒకలాగే ఎందుకు జరుగుతాయి. అంతా మీరు అతిగా ఊహించుకోవడం కానీ” అంది అసహనంగా.
ఇంతలో పురోహితుడు రానే వచ్చాడు. వచ్చి ఓ నమస్కారం పెడుతూ సోఫాలో కూలబడి “అయ్యా అన్ని బాగున్నాయి, ఊ అంటే చాలు ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటున్నారు మగ పెళ్లివారు. అయినా లోకల్లో చేసుకుంటే మంచిదే కదా” అన్నాడు పళ్ళికిలిస్తూ.
“మంచిదే అనుకోండి” అని నీళ్ళు నమిలి, అతనితో అసలు విషయం చెప్పలేక, కక్కలేక మింగలేక తల అటు, ఇటూ ఊపి సంబంధం ఓకే అనేసాడు. దాంతో లక్ష్మమ్మ మొహంలో చిచ్చు బుడ్డి వెలిగినంత కాంతి కనిపించింది శేఖరానికి.
ముహూర్తాలు పెట్టుకున్న కొద్ది వారాలకే, వందే భారత్ రైలు స్పీడులో, చిన్నమ్మాయి పెళ్ళి తంతు మొత్తం పూర్తి అయిపోయింది.
లక్ష్మమ్మ నిదానంగా కాఫీ ఇస్తూ, “రెండు వారాల క్రితమే, ఇద్దరళ్ళుళ్ళు వినాయక చవితికి వచ్చి వెళ్లిపోయారు. ఇక దసరా వరకూ మనకి గొడవ లేదు” అంది.
“ఔను, ఖర్చుల విషయంలో ఓ రెండు వారాలు నిదానంగా ఊపిరి పీల్చుకోవచ్చు. పైగా, సగం టాబ్లెట్లు కొనుక్కునే డబ్బులే నా దగ్గర మిగిలాయ్” అన్నాడు బేలగా.
తర్వాత కొద్ది సేపటికి, ఏదో ఆటో ఆగిన శబ్దం రాగానే, లక్ష్మమ్మ, శేఖరం బయటికి వచ్చారు.
పెద్ద సూట్ కేసుతో చిన్నల్లుడు, అమ్మాయి దిగారు.
ముందుకు నడిచి వస్తూ, “ఏం లేదు మావగారూ, రేపు శుక్రవారం గాంధీ జయంతి ఉంది కదా, శనివారం సెలవు పెట్టుకున్నాను. ఆదివారం ఎలాగూ సెలవు. అందుకే ఈ మూడు రోజులూ మీతో గడుపుదామని వచ్చేసాం” అనగానే, శేఖరం లక్ష్మమ్మ వంక ఎర్రగా చూస్తూ, అతని కంటే ఘనుడు అన్నాడామె చెవిలో, లో గొంతుతో.
