ఆకాశంలో సూర్యుడు ప్రకాశవంతంగా మబ్బులతో దోబూచూలాడుతు సప్త అశ్వాల వేగం పెంచుతూ మానవాళిని తన వెలుగు రేఖలతో మేల్కొలుపుతున్నాడు సంతోషంగా, అందరినీ ఈ ప్రకృతి అందాలు చూడండి అంటూ. కానీ ఎంత మంది తెలుసుకోగలరు?!
ఉదయాన్నే రాగి జావ తాగే అలవాటు పరంధామయ్య గారిది. అలవాటు ప్రకారం రాగి జావ కాచి చల్లార్చి కావలసిన సైజులో గ్లాసులో పోసి నిమ్మరసం పిండి మజ్జిగ కలిపింది ఆయన భార్య.
ఇంట్లో ఆవు పాడి ఉన్నది, ఆ పాలు ఆరోగ్యానికి మంచివి అదే వెన్న పెరుగు మజ్జగ వాడుతారు. ఇంట్లో వీరితో పాటు ఒక పని మనిషి, కాంపౌండర్, నర్సు ఉంటారు. వాళ్ళు ఉదయాన్నే వచ్చేస్తారు.
ప్రక్క పల్లెటూరు అందుకుని అన్నం కూర తెచ్చుకుంటారు. డాక్టర్ భార్య సీతమ్మ గారే వీరికి పచ్చడి మజ్జిగ వేస్తుంది. ఒక్కోసారి అన్నం కూడా తినండి అంటుంది. పండగకు పిండివంటలు పెడుతుంది.
ఊళ్ళో పిట్టకి తుమ్ము దగ్గు వచ్చిన సరే డాక్టర్ గారి దగ్గరికి వస్తారు.
పరంధామయ్య గారి బామ్మ ఆ రోజుల్లో ఆయుర్వేద చిట్కాలు ద్వారా వైద్యం చేసేది. హస్తవాసి మంచిది. మట్టి నలిపి ఇచ్చినా రోగం తగ్గేది. ఆ ఊరు అంతటికీ అమె ఒక పెద్ద దిక్కుగా, ఓ ఆధారంగా ఉండేది.
ఎవరికైనా పురుడు వస్తే కారం పొడి ఖాయం. పాత చింతకాయ పచ్చడి, పాత బియ్యం, ఆవు నెయ్యి అడిగి పట్టుకెళ్లేవారు. అమె డబ్బు పుచుకునేది కాదు.
పూర్వకాలం రాజుల కాలంలో మారకం మాదిరి మనుషులు. పళ్ళు కూరలు ఊరగాయ సీజన్‍లో మామిడి కాయలు తెచ్చి ఇచ్చేవారు. అప్పుడు మొహమాట పడుతూ పుచ్చుకునేధి. తాతగారు వేద పండితుడు. ఇద్దరు ఆడ పిల్లలు పెళ్ళిళ్ళు చేసి పంపేశారు. మనమడు పరంధామయ్య మాత్రం పెద్ద కూతురు కొడుకు. తాత మామ్మ దగ్గర పెరిగాడు. కొంచెం అల్లోపతి కూడా నేర్చాడు. ఆ ఊరి కరణం గారు వాళ్ళ అమ్మాయి సీతను ఊళ్ళో ఉంటుందని పెళ్లి చేశాడు. అప్పటి నుంచి డాక్టర్ గారు కరణం గారి అల్లుడు కూడా. ప్రాక్టీస్ జోరుగా ఉన్నది.
ఊరంతా పెద్దరికం ఇచ్చారు. బ్రాహ్మణ సంఘానికి ప్రెసిడెంట్ చేశారు. ఆయన వైద్యుడు కనుక కుల మత ప్రసక్తి లేకుండా అందరికీ అబ్బాయి అమ్మాయి అని పిలుస్తూ అందరి నోట అదే పేరు. అంతే కాదు కొడుకులు దూరంగా ఉన్న వాళ్ళ బంధువులు “ఒరే పరం, ఈ డబ్బు బ్యాంక్‌లో వేస్తే వడ్డీ తక్కువ వస్తుంది. నువ్వు కాస్త దాచి వడ్డీ వ్యాపారం చేసి పెట్టు” అనేవారు. అలాగే ఆ ఊళ్ళో చాలా మంది పిల్లల చదువులు పెళ్ళిళ్ళకి డాక్టర్ గారి దగ్గర అప్పు పుచ్చుకునేవారు.
అలా అన్ని విధాల ఆ ఊరికి పెద్ద దిక్కు అనండి, ఆధారం అనండి, ఎలాగైనా ఏ విషయం అయినా డాక్టర్ గారికి తెలియకుండా జరుగదు.
చిన్న గ్రామం. పాతిక ఇళ్లు బ్రాహ్మలవి. వాళ్ళంతా ఏదో బీరకాయ పీచు చుట్టాలు. ఒక తరం అంతా పిల్లల్ని కలుపుకున్నారు. ఆ తరువాత తరానికి వరసలు మారిపోయాయి, ఇంకేమీ చేస్తారు, పరాయి ఊరు ప్రక్క ఊరు సంబంధాలు చేస్తున్నారు.
డాక్టర్ గారికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. అందరికీ స్కూటర్ నేర్పించడానికి మనిషిని పెట్టి, ఎవరు స్కూటర్ వారికి కొని ఇచ్చాడు. మగ పిల్లలు పట్నం వెళ్లి ఇంజినీర్ చేశారు. ఆడపిల్ల మాత్రం పిజీ ప్రైవేట్‌గా చేసింది, సంగీతం నేర్చుకున్నది.
దూరం బంధువుల అబ్బాయితో పెళ్లి చేశాడు పిల్లకి. హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనుక్కోమని డబ్బు ఇస్తానన్నాడు. అందుకు వాళ్ళు “మాకు పొలం ఇష్టం, పొలం కొని మీ పిల్లకి ఇవ్వండి కట్నం వద్దు” అన్నారు. “పెళ్లి ఖర్చులు కూడా సగం మేము సగం మీరు” అంటూ ఎక్కడి కక్కడ వాళ్ళ సహకారం అందించారు. ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది
ఆ పల్లెలో వృద్దులకు పెన్షన్ ఇప్పించాడు. అయితే కొందరికి వేలి ముద్ర పడక పెన్షన్ ఆగిపోయింది. వాళ్ళు చాలా బాధ పడ్డారు.
అప్పుడు సీత కలుగ చేసుకుని, “మీరు వాళ్ళకి కళ్ళకి ఫోటోలు వచ్చే మిషన్ తెమ్మని ఆఫీసర్ గారికి చెప్పండి. ఇంచుమించు పది మంది వరకు ఈ సమస్యతో బాధపడుతున్నారు. మందులు మీరు ఫ్రీగా ఇస్తారు. భోజనం నేను పెట్టి గడుపుతాను కానీ వారికి వచ్చేవి ఆగిపోతున్నాయి” అని వాపోయింది.
సరే అని కారు తీసి, వచ్చిన వాళ్ళని చూడమని నర్సుకు అప్పగించి వెళ్లి కనుక్కుని వచ్చాడు.
పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్లి విషయం కనుక్కుని వాళ్ళకి ఫారాలు ఇమ్మని రిక్వెస్ట్ పై తెచ్చాడు. ఎవరి ఫార్మ్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్లాలి అని చెపితే వాళ్ళు వృద్ధులు రాలేరు అంటు ఎలాగో నచ్చ చెప్పి తెచ్చాడు. వాళ్ళు దానిమీద తారీఖు వేసి ఇచ్చారు. అదే రోజుకి తప్పక రావాలని చెప్పాడు.
అలాగే కాగితాలు పూర్తి చేసి వారికి ఆటో మాట్లాడి కొందరిని పంపి, కొందర్ని తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. అయితే పొరుగూరు వాళ్ళు కొందరు అప్పటికే వచ్చి ఆఫీస్ మెట్ల మీద కూర్చున్నారు. చంటి వెంటి పిల్లలు వృద్ధులు అందరూ ఉన్నారు. వారిని దాటుకుంటూ వెళ్లి ఆ ఫారాలు అన్ని కాంపౌండర్ చేత లోపలికి పంపి ఆ బామ్మలను లైన్‌గా పంపి కొందరువి పూర్తి చేశారు.
ఇంతకు ముందు వచ్చిన వాళ్ళని వదిలి మిమ్మల్ని చెయ్యాలా అని ప్రక్క కౌంటర్‌లో ఎవరినో పెద్దగా కేకలేస్తున్నాడు. పాపం ఆవిడ ఎంతో బాధ పడింది
“మేము ఇచ్చిన రోజు మీరు రాలేదు. ఇవ్వాళ వస్తే ఎలా? ఈరోజు నంబర్స్ మాని మీకు చెయ్యడం కుదరదు వెళ్లి పొండి” అంటూ ఇంకో కౌంటర్ యువతి అరిచింది
“నేను ఎంత టైమ్ ఉండమంటే అంతా టైమ్ ఉంటాను బాబు” అన్నది ఓ ముసలావిడ.
“అయితే మటుకు మేము తిండి తినక్కర లేదా?” అన్నది ఆమె.
ఈలోగా ఈ అరుపులకి పోస్ట్ మాస్టర్ బయటికి వచ్చాడు.
“అదిగో సర్ వచ్చారు. అయన్ని అడగండి” అన్నది.
“సరే బాబు నాకు ఆటో రాలేదు నిన్న. వర్షానికి నేను రాలేక ఈ రోజు వచ్చాను” అని చెప్పింది.
ఆ ఆఫీసర్ ‘ఓహా’ అని ఒకసారి స్టాఫ్ వంక చూసి “పని వాళ్ళు చెయ్యాలి, మీ నంబర్ ఈ రోజు రాదు. వారం తరువాత మళ్ళీ రండి. ఈ ఫార్మ్ పనికి రాదు. ముందు రోజు వచ్చి ఫార్మ్ తీసుకుని మళ్ళీ పూర్తి చేసి ఇవ్వాలి” అన్నాడు. “లేకపోతే మీరు బ్యాంక్‍కి వెళ్లి అక్కడ తీసుకోండి” అన్నాడు.
పాపం ఆవిడ బాధగా వెళ్ళబోయింది. “ఆ తరువాత మళ్ళీ వచ్చినా వీళ్ళతో ఇదే గొడవ” అంటూ వెళ్ళింది.
ఎలాగో తను తీసుకొచ్చిన వృద్దులకు బయోమెట్రిక్ విధానంలో అన్ని పూర్తి చేసుకుని బయటకు వచ్చారు పరంధామయ్య. అప్పటికి మూడు దాటింది. అందరికీ తెచ్చిన అరటిపళ్ళు, బ్రేడ్ ముక్కలు పెట్టి అక్కడ టీ కొట్లో టీ ఇప్పించాడు. మళ్లీ కారు బయలు దేరి పల్లె వైపు వెళ్ళింది.
***
ఈ ఆధార్ కోసం వేలి ముద్రలు పడక ఎంతో మంది తిప్పలు పడుతున్నారు. ఎంతో పెద్ద చదువులు చదివిన వారు కూడా ఆఫీసుల్లో వేలి ముద్ర పడక యిబ్బందులు పడుతున్నారు.
నెలవారీ రేషన్ కూడా దీనిపై ఆధారం చేసుకుని ఉన్నది. పెన్షన్ రాక కొందరు, రేషన్ రాక మరి కొందరు ఇబ్బంది పడుతున్నారు.
పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు. బామ్మలు చిన్న ఊళ్ళల్లో కాలం గడుపుతున్నారు. ఈ రోజుల్లో వృద్ధులు ఉంటే సిటీలో మంచి ఇల్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదు.
ఆధార్ కార్డ్ కోసం – కొందరు విదేశాలకు వెళ్ళడానికి గల్ఫ్ వెళ్ళడానికి భార్య పిల్లలతో కూడా రాత్రి వచ్చి పోస్ట్ ఆఫీస్ గేట్ ముందర మట్టి నేలపై గడ్డి ఉన్న చోట పడుకున్నారు. అది ఒక మీడియా వారు వీడియో తీసి న్యూస్‌లో చూపించారు, పేపర్స్‌లో కూడా వచ్చింది
కొన్ని చోట్ల షామియానా వేసి ఉంచారు. స్వచ్ఛంద సంస్థల వారు కొందరు కుర్చీలు కొందరు టీ, మజ్జిగ సప్లయి చేస్తున్నారు. మరీ ఎక్కువ మంది క్యూలో ఉన్నప్పుడు అక్కడ టీ బండి వాడు పులిహార పాకెట్స్, బిర్యాని పాకెట్స్ అమ్మకము మొదలు పెట్టాడు. కొత్తగా మరి రెండు టిఫిన్ బళ్ళు పెట్టుకున్నారు, ఇడ్లీ ఉప్మా బాగా అమ్ముడు పోతోంది. కూల్ డ్రింక్ బండి పెట్టారు. పిల్లలకి బుడగలు ఈలలు అమ్మే వాళ్ళు వచ్చి చేరారు. అది ఒక ఆధార్ తీర్థం మాదిరి ఏర్పాటు అయ్యింది. పండుగ ఉత్సవం మాదిరి జనం ఉంటున్నారు.
***
ఇటువంటి సందడిలో రశ్మికి వేలి ముద్ర పడటం లేదు కనుక “మీ ఊరు వెళ్లి అక్కడ తీసుకో” అని చెప్పారు. తను బెంగుళూరులో ఉన్నది. అక్కడ నుంచి తణుకు వచ్చి పుచ్చుకోవాలి. సరే పోస్ట్ ఆఫీస్ సంగతి తెలిసింది, తణుకులో బామ్మ ఉన్నది కనుక ఇబ్బంది లేదు అని ఫోన్ చేసి ఫ్లయిట్‌లో బయలు దేరి రాజమండ్రి వచ్చింది. అక్కడ నుంచి టాక్సీ మాట్లాడుకుని తణుకు వచ్చింది.
పోస్ట్ ఆఫీస్ ముందు ఎప్పుడు పెద్ద హీరో గారి సినిమాకి మొదటి రోజు క్యూ ఉన్నట్లు జనం ఉన్నారు.
ఇది పద్దతి కాదు అనుకుని, తన ఫ్రెండ్ ఆంధ్రా బ్యాంక్‌లో పని చేస్తోంది ఆమెకి ఫోన్ చేసింది రశ్మి.
ఆక్కడ అన్నం క్యారేజ్ లతో వచ్చి జనం కూర్చున్నారు. అదంతా చూసి, ఈ మేరకు ఇప్పుడిప్పుడే పని అవదు తనకి వర్కు ఫ్రమ్ హోమ్ అవకాశం ఉంది కనుక నాన్నకి ఫోన్ చేసి పని అయ్యేవరకు ఇక్కడే ఉంటాను అని చెప్పింది రశ్మి.
“మేము మటుకు ఇక్కడ ఎందుకు? నీ కోసం ఇక్కడ ఉన్నాము. ఒక్క పిల్లవి వదిలి ఉండలేక నీతో బెంగుళూరు వచ్చాము” అని రిటైర్డ్ అధ్యాపకుడు సర్వేశ్వర రావు, భార్య లక్ష్మి బయలు దేరి రైలులో వచ్చేశారు. అంతా కలిసి బామ్మ దగ్గర మకాం వేశారు.
“ఒరే సర్వేశ్ నేను రమ్మంటే రావు, నీ కూతురు పని కనుక వచ్చావు?” అంది బామ్మ.
“అదేమిటి అమ్మ నాకు ఉద్యోగం సరిపోయింది, ఆ తరువాత పెళ్లి అవవలసిన పిల్ల అని దాని దగ్గరకు వెళ్ళి ఉన్నాము. పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే ఇంకా బాదరబందీలు ఉండవు. మేము వచ్చి నీ దగ్గరే ఉంటాము కదా” అన్నాడు.
“ఏమైనా ఆధార్ తిరకాసు వల్ల మీరు వచ్చారు” అంటూ బామ్మ సంతోష పడింది.
“అవును మన డాక్టర్ గారు ఆ మధ్య పోస్ట్ ఆఫీస్‌కి వృద్ధులు అందరినీ తీసుకుని వెళ్లి ఆధార్ కార్డ్ ఇప్పించాడు, నువ్వుకూడా వెళ్లి అయన్ని కనుక్కో” అని రశ్మికి చెప్పింది.
“సరే బామ్మా ఫోన్ చేస్తాను. వెళ్లి ఆయన పని మనం డిస్ట్రబ్ చెయ్యడం ఎందుకు?” అంటూ ఫోన్ చేసింది
“అంకుల్ నాకు కూడా ఆధార్ కార్డ్ ఇప్పించాలి” అన్నది.
“అలాగే, కానీ ఆ జనంలో పోస్ట్ ఆఫీసులో కుదరదు. అప్పుడే నెల ముందు నుంచి రిజిస్టర్ చేసుకున్న జనం ఉన్నారు” అన్నాడు. “నువ్వు ఒక పని చెయ్యి. ఇండియన్ బ్యాంకులో మంచి పద్ధతిగా ఇస్తున్నారు. ఆక్కడకు వెళ్లి అడుగు” అని సలహా చెప్పాడు
“సరే అంకుల్, ధన్యవాదాలు” అని ఫోన్ పెట్టేసిన చప్పుడు బామ్మ విన్నది.
“ఏమన్నాడు మన డాక్టర్?” అంది. “నేను వెళ్ళందే పని అవదు అని అన్నారు” అన్నది రశ్మి.
“సరే రేపు అన్నం తిని బాక్స్‌లో టిఫిన్ పెట్టుకుని వెళ్ళు. ఓ రోజు అంతా అక్కడే సరిపోతుంది” అని బామ్మ చెప్పింది.
సరే అంటూ మరునాడు ఇండియన్ బ్యాంక్‌కి వెళ్ళింది అక్కడ మెట్ల మీద సన్ షేడ్ దగ్గర జనం ఉన్నారు. ఎలాగో లోపలికే వెళ్ళింది. ఆధార్ కౌంటర్ దగ్గర పోస్ట్ ఆఫీస్ అంతా రష్ లేదు. ఓ రెండు గంటలకు సమాధానం చెప్పి, “నెల అంతా బుక్ అయ్యింది కనుక వచ్చే నెల నాలుగవ తారీఖున రండి” అన్నాడు అక్కడి క్లర్కు.
“ఏమి తెచ్చుకోవాలి?” అంటే, ఆధార్ పాతది ఒరిజనల్, ఫోటోస్టేట్ తెచ్చుకోండి” అన్నాడు.
సరే అంటూ వారినందరినీ తప్పించుకుంటూ బయటకు వచ్చి అటో ఎక్కి ఇంటికి వచ్చింది. ఇంటికి రాగానే “ఆ బట్టలు తడుపుకుని వేరేవి కట్టుకో” అంటూ బామ్మ ఆర్డరు చేసింది.
నిజమే అక్కడ చాలా మంది జనం ఉన్నారు. శానిటైజర్ రాసుకుని మాస్కు తడిపి అప్పుడు లోపలికి వచ్చింది. బాత్‌రూమ్ లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అప్పుడు టిఫిన్ తిన్నది. బాక్స్‌లో టిఫిన్ బయట పడేసింది. బామ్మకి ఆనాటి మడి ఈనాడు స్వచ్ఛ భారత్‌గా వచ్చింది.
“అప్పటికే అక్కడ చాలా మంది ఉన్నారు” అంటూ విషయం చెప్పింది రశ్మి. “అయితే నా మనుమరాలు ఆధార్ ధర్మమా అని నా దగ్గర ఇంకా ఉంటుంది. నీతో పాటే మీ అమ్మ నాన్న” అని నవ్వింది బామ్మ.
***
అయితే అక్కడ చాలా చిన్నపిల్లలు, బడి పిల్లలు బుక్ చేసుకున్నారు. వాళ్ళకి ముందు చెయ్యాలి అన్నాడు. ఒకే ఒక మనిషి అన్నీ చేస్తున్నాడు.
ఒకామె పిల్ల పేరు తప్పు పడింది అంటే ఊరు అవతల ఆఫీస్ పేరు చెప్పి అక్కడకు వెళ్ళ ఫామ్ ఫిలప్ చేసి తెమ్మన్నాడు. ఎవరో వృద్ధులు వస్తే మధ్యాహ్న మూడు తరువాత రండి అన్నాడు.
ఇలా ప్రతి ఒక్కరికీ ఆధార్ లింక్‌లో ఎన్నో సమస్యలు. చిన్న పిల్లలు అయితే బయో మెట్రిక్‌లో వేళ్ళు పెట్టడం రాక ఇబ్బంది పడుతున్నారు.
ఏది ఏమైనా గతంలో పిల్లలే ఆధారం, ఇప్పుడు ఈ కార్డ్ జీవిత ఆధారం. అన్నిటికీ దానిదే పెత్తనం. అందుకే ఎక్కడి వాళ్ళు అక్కడ నానా తిప్పలు పడి ఆధార్ పొందుతున్నారు.
పాత కార్డ్స్ ఉన్నా సరే వీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. గ్రామ వాలంటీర్లు ఈ కార్డ్స్ లేనిదే ఏ పని జరుగదు అని చెపుతున్నారు.
జీవిత గమనంలో పుట్టిన పిల్ల దగ్గర నుంచి దీనిపై ఆధారపడాలి. పుట్టుట గిట్టుట నిజము, నట్ట నడిమ పని నాటకము అని శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తనలలో చెప్పినా; లైఫ్ ఇజ్ ఏ డ్రామా స్టేజ్ అన్నవి జీవిత సత్యాలు. ఈ కలియుగంలో అంతా ఆధార్ కార్డ్ అంటున్న పద్ధతి దేశ వ్యాప్తంగా ఉన్నది.
మనిషి సంతకానికి విలువ లేదు డాక్టర్ అయిన దాక్రతే అయిన అందరూ విద్యుత్ వేలి ముద్రలు తప్పడం లేదు.
కొన్నాళ్ళు పెద్దవారికి సంతకం నేర్పి వయోజన విద్య కేంద్రాలు నడిపారు. ఇప్పుడు అంతా మారి బయో మెట్రిక్‌లో ఎన్నో ట్రిక్లు వచ్చాయి. ప్రతి మనిషి వెంట ఆధార్ కార్డ్ లాకెట్ మాదిరి మెడలో వేసుకోవలసిన పరిస్థితి వచ్చింది.
మెడలో ఆఫీస్ ఐడెంటిటీతో పాటు ఆధార్ కూడా తప్పదు. రెండు లాకెట్‌లు పిల్లలకి పెద్దలకి; అందరూ వేసుకోవాలి.
బామ్మ దగ్గరికి వెళ్ళి “కొత్త గొలుసు చేయించిపెట్టు, నేను ఆధార్ కార్డ్ అందులో పెట్టుకుంటాను” అన్నది రశ్మి.
ఆన్ని ధారములలోకి ఆధార్‌మే గొప్ప. గాలిపటానికి దారం లాగే జీవితానికి ఆధార్ అన్నారు. అందరూ హాయి హాయిగా అంటూ నవ్వుకున్నారు.
“వంకిలో ఆధార్, వడ్డాణంలో ఆధార్, బిళ్ళ లాకెట్‌లో ఆధార్, రిస్ట్ వాచీలో ఆధార్ పెట్టే మోడల్‌లు కూడా మార్కెట్‌లో వస్తాయి. ఇందులో అతిశయోక్తి లేదు” అంటూ అంతా నవ్వుకున్నారు.
శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి గారు సంగీత సాహిత్యాలలో విశేషమైన ప్రజ్ఞ కలవారు. వీణా విద్వాంసురాలు. 11 వరల్డ్ రికార్డ్ల గ్రహీత. 300కు పైగా కథలు, 2500 పైగా కవితలు, 18 నవలలు, వ్యాసాలు 2000 పైగా, వంటలు 1500 వ్రాసారు. 6000కి పైగా వివిధ అంశాల ప్రచురణ. వారికి 126 పైగా బిరుదులు పురస్కారాలు లభించాయి. అనేక అవధానాలలో పాల్గొని వర్ణన, సమస్య, దత్తపది అంశాలు అడిగారు. ఎన్నో సభలలో కర్ణాటక సంగీతం, శ్రీ అన్నమయ్య శ్రీ వెంటేశ్వరస్వామి కీర్తనలు, లలిత సంగీతం ఆలపించారు. ప్రముఖ వ్యక్తులను, మహిళలను, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేశారు. తెలుగు సాహితీ వైభవంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటారు.
అంతర్జాల కవి సమ్మేళనాలు 1800 పైగా వీణ కచ్చేరీలు అంతర్జాలంలో 68 పై గా సూర్య వర్ణం నూతన లఘు ప్రక్రియలో 150 కవులు పాల్గొని విజయవంతం చేశారు.
మోడరన్ టైలరింగ్ బుక్, సంగీత స్వర రవళి బుక్ వెలువడినాయి. వీరి నవలలు కథలు, 516 కవితలపై విద్యార్థులు పరిశోధన చేస్తున్నారు. ‘ఉదయం’ ద్వారా వీరి వంటల వీడియోలు వస్తున్నాయి.