[అక్టోబర్ 31 వానమామలై వరదాచార్యులు గారి వర్ధంతి సందర్భంగా శ్రీ తోకల రాజేశం పంపిన వ్యాసాన్ని అందిస్తున్నాము.]
చిన్న నటంచునెంచకయె సిగ్గొక యించుక లేక భక్త పో
తన్నను గూడి భాగవత తత్వము బాడ గళమ్ము విప్పితిన్
నన్నిక దిట్టి పొండు గరుణంగని దీవెనలిండు నాల్గు కో
ట్లన్నల మంగళార్థమయి ఆంధ్ర పదాల నివాళి పట్టితిన్
‘పోతన చరిత్ర’ ప్రారంభంలో తెలుగు వాళ్ళను స్తుతిస్తూ ‘అభినవ పోతన’ వానమామలై వరదాచార్యులు అత్యంత వినయంతో రాసిన పద్యమిది. ఈ పద్యంలో తెలుగు ప్రజల సంక్షేమాభిలాష ఒకవైపు, తన నిగర్వితనము మరోవైపు ప్రకటింపబడుతున్నాయి. ఒక వ్యక్తిగాను ఒక కవిగాను వరదాచార్యుల వారు ఎంత వినయ సంపన్నులో ఈ పద్యం ఋజువు చేస్తుంది. మహాకావ్యం రాసినప్పటికీ, ఒక్క వాక్యం రాసిన కవిలా తన కావ్యంలో చాలా సందర్భాలలో అణకువ ప్రదర్శించారు. మహాకవులనుకునే వాళ్ళందరూ రాజుల చరిత్రలో, వెయ్యిళ్లుగా నలిగిపోతూనే ఉన్న కథలనో తీసుకొని మహా యమహా కావ్యాలను రాసిపారేస్తున్న సందర్భంలో ఆ సాంప్రదాయానికి భిన్నంగా ఒక కవి చరిత్రను అది కూడా రాజును ధిక్కరించిన ఆత్మాభిమాన సంపన్నుడైన పోతన జీవితాన్ని మహాకావ్యంగా తీర్చిదిద్దడం అరుదైన, అపురూపమైన విషయం. నిజంగా తెలుగు సాహిత్య చరిత్రలో వరదాచార్యుల వారి కాలానికి ఇదొక రికార్డు. ఎందుకంటే పోతన చరిత్ర కథ పురాణాంతర్గతమైనది కాదు. స్వతంత్రమైనది. చారిత్రకమైనది. నిజానికి చారిత్రక ప్రాధాన్యత గల కథా వస్తు స్వీకరణలో చాలా సమస్యలుంటాయి. అప్పటిదాకా చెల్లాచెదురుగా పడి ఉన్న పోతన జీవితానికి సంబంధించిన అనేక విషయాలను క్రోడీకరించి, అందులోని క్రమపరిణామాన్ని దొరికించుకొని, స్పష్టమైన కథను సిద్ధం చేసుకుని కావ్య నిర్మాణం చేయడం నిజంగానే సాహసం. చారిత్రక వ్యక్తుల జీవితాన్ని కావ్యంగా మలచడం అంటే అంత మామూలు విషయమేం కాదు. ఎందుకంటే అందులో స్వేచ్ఛగా యథేచ్ఛగా కల్పనలు చేయటానికి కుదరదు. ఆధారాలు లేకుండా రాయటానికి అంతకంటే కుదరదు. ఇన్ని పరిమితుల మధ్య ఒక చారిత్రక కథను (జీవితాన్ని) మహాకావ్యంగా మలచడం నిజానికి అసాధ్యమైన విషయం. ఆధునిక కాలంలో దాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఏకైక మహాకవి వరదాచార్యులు. అయినప్పటికీ ఇందులో పోతన జీవితానికి సంబంధించిన జనశృతులు కొన్ని కథలో అంతర్భాగమయ్యాయి. బహుశా కథలో వైవిధ్యాన్ని సాధించటానికి వరదాచార్యులు గారు వాటిని గ్రహించి ఉంటారు. అయితే తరువాత వచ్చిన తిక్కన లాంటి చారిత్రక కావ్యాల మీద ‘పోతన చరిత్ర’ ప్రభావం ఉంది.
పోతనకూ, పోతన చరిత్ర రాసిన అభినవ పోతనకూ వారివారి జీవితాలకు సంబంధించి కొన్ని దగ్గరి లక్షణాలు ఉన్నాయి. ‘పోతన గారి జాతకమే ఆయన చరిత్రకారునికి కూడా వారసత్వంలో సంక్రమించింది కాబోలు’నంటాడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు. పోతన కవిత్వంలో మనకు కనిపించే చాలా గుణాలు వరదాచార్యులు గారి కవిత్వంలోనూ కనిపిస్తాయి. అలాగే పోతన జీవితంలోని నిరాడంబరత కూడా వరదాచార్యులు గారి జీవితంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోతన కవిత్వంతో పాటు అతని వ్యక్తిత్వమూ వరదార్యుల గారి జీవితం మీద బలమైన ముద్రను వేసినట్లు ఈ మహాకావ్యంలోని అనేక ఘట్టాలలో గమనించవచ్చు.
‘సదాచార సంపదచే వారిరువురును రుషితుల్యులు శ్రీమద్భాగవతాంధ్రీకరణ పోతన చేతబడుట ఎట్టిదో వారి చరిత్ర ఆచార్యుల వారిచేత బడుట యట్టిది. వారి చరిత్ర పోతన చరిత్రకు ప్రతిబింబము. అందుచేతనే వారీ చరిత్రముననుభవ సిద్ధమవునట్లింత మధుర సుందరముగా వెలియింప జాలినారు’ అని తొలి పలుకులో దివాకర్ల వెంకటావధాని గారన్నారు. బహుశా పోతన అభిమాన సంపద – భాగవతాంద్రీకరణలో పోతన అనుసరించిన పంథా, అతని సామాన్య జీవన విధానమూ వరదాచార్యులు గారి అభిమానానికి పాత్రమై ఉంటాయి. అందుకే ఆయన ‘పోతన చరిత్ర’ రచనకు నడుము కట్టి ఉంటారు.
‘ఎంతటి పుణ్యమ్మును పండించుకున్నదోరుగల్లు/పోతన్నకె కాదభినవ పోతన్నకు పురుడు పోసె/ రత్నగర్భ నామము సార్థకమీ తెలంగాణమునకు/పూత భాగవతము తోడ పోతన చరితము జనించె’-నన్న సినారె గారి వాక్యాల్లో కూడా పోతనకు అభినవ పోతనకు మధ్యగల అవిభాజ్యత ధ్వనిస్తుంది. అయితే తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కవి చరిత్రను మహాకావ్యంగా మలిచిన వారిలో వరదాచార్యులు గారు ద్వితీయుడైనా (మొదటి వారు తంజావూరు రఘునాథ భూపాలుడు-వాల్మీకి చరిత్ర రాశాడు) అద్వితీయమైన ప్రతిభ కనబరచారీ పోతన చరిత్రలో. 12 ఆశ్వాసాలు గల ఈ మహాకావ్యంలో 3833 గద్యపద్యాలున్నాయి. మొదటి పది ఆశ్వాసాల్లో పోతన చరిత్ర, చివరి రెండు ఆశ్వాసాల్లో భాగవత కథలున్నాయి.
వరదాచార్యుల వారి జీవిత కాలపు కృషి ఫలితం పోతన చరిత్ర. ఆయన తన జీవితంలో ఎక్కువ కాలాన్ని ఈ కావ్య రచన కోసమే ఖర్చు పెట్టారు. ఎంతటి దరిద్రం చుట్టుముట్టినప్పటికీ ఈ మహాకావ్యాన్ని పూర్తి చేయడమే తన జీవిత ధ్యేయంగా బతికారు. రచనైక జీవితాన్ని గడిపారు. ఒక్కోసారి రెండు మూడు రోజులు గది తలుపులు తెరవకుండా రచనలోనే నిమగ్నమై ఉండేవారట. నిద్రాహారాలకు దూరమైన అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఆయనను రోగాలు చుట్టుముట్టాయి. క్షయ వ్యాధి ముదరటంతో ఒక ఊపిరితిత్తిని కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత ఒకే ఊపిరితిత్తితో బతకవలసి వచ్చింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న సినారె – ఒక ఊపిరితిత్తిని మిత్తికి కబళముగానొసంగి/విలవిలలాడెడు శబ్దమ్ములకూపిరి పోసినావు – అని వరదాచార్యులు గారి కవిత్వ ప్రేమను గేయ కవితలో ప్రశంసించారు. వానమామలై వారు కవిత రచనను ఒక తపస్సులా కొనసాగించారు. ఆయన తన రక్త మాంసాలను బలిపెట్టి పోతన చరిత్రకు ప్రాణం పోశారు. ఒక కావ్యం రాయటం కోసం తన ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టిన కవి బహుశా వరదాచార్యులు గారొక్కరేనేమో! ఇలాంటి వాళ్లను చూసే కావొచ్చు కవులను రుషితుల్యులు అని అన్నారు. పోతన చరిత్రలో సింగభూపాలుడు తాను చేసిన తప్పులకు పశ్చాత్తాప పడిన సందర్భంలో-
రక్తములోడ్చి చెమ్మటలు రాల్చి దరిద్రత నాశ్రయించి మేల్
మౌక్తిక హార పంక్తులను మాటలుగా జత గూర్చి..
భాగవతాన్ని పోతన రచించాడని అంటారు. ఇవే మాటలు అక్షరాలా పోతన చరిత్ర రాసిన వరదాచార్యుల వారికి కూడా వర్తిస్తాయి. ఇద్దరి జీవిత సాహిత్యాలను తులనాత్మకంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.
‘సత్కవితకు స్వర్ణమునకు వలెనే పాత కొత్తలు లేవు. ఆ కొత్త పాతలు రుచి భేదముల నొప్పారెడి ఆభరణ విశేషములే తప్ప మూల ద్రవ్యమగు ప్రతిభ తాను స్వర్ణమే యనుట శంకింపరానిది’ అన్న అవగాహన (‘పోతన చరిత్ర’ విజ్ఞప్తి: కవి) కలిగిన వానమామలై వరదాచార్యులు తన కవిత్వానికి వాడుకున్న రూపం పద్యమే అయినా, పోతన చరిత్రలో ప్రధాన రసం భక్తి రసమే అయినా, ఈ కావ్యంలో అడుగడుగునా సామాజికత దర్శనమిస్తుంది. ఇది ఆధునిక కవితా లక్షణం. భాషలో, ఉక్తి చమత్కారాలలో నవ్యత – ఆధునికత ఈ కావ్యంలో తేలికగా పట్టుకోవచ్చు. ముఖ్యంగా వరదాచార్యుల వారిది సరళీకరణ పొందిన పద్యం. అనేకమంది మహాకావ్యకర్తల కంటే భిన్నంగా ఆయన శబ్దాలంకారాల కంటే అధికంగా అర్థాలంకారాలను వాడుకున్నారు. శబ్దాలంకారాలు ఎంత తక్కువగా ఉంటే పద్య కవిత్వం అంత సరళంగా తయారవుతుంది. అర్ధాలంకారాలు ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత మనోహరంగా పద్య కవిత్వం రూపొందుతుంది. ముఖ్యంగా అది కవితమై గుబాళిస్తుంది. పద్యం వేరు, పద్యకవిత్వం వేరు అన్న సంగతిని గుర్తిస్తే ఈ విషయం బోధపడుతుంది. అయితే ఇంతకుముందు చెప్పిన కొలతల్లో ఏది తక్కువ ఏది ఎక్కువ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే కవిత్వంలో కలుపుకున్న కవితా రసాయనవేత్త వరదాచార్యులు గారు. ఈ క్రమంలో చూస్తే మహా కావ్యాలనే వాటికి సహజంగానే ఒక దోషం వచ్చి పడే అవకాశం ఉంది. అదేమిటంటే పాండిత్య ప్రదర్శన. పెద్ద పెద్ద కావ్యాల్లో సైతం అర్థంపర్థం లేని పాండిత్య ప్రదర్శన కనిపిస్తూ ఉంటుంది. తమ పాండిత్యాన్ని పదిమంది గుర్తించాలనే అత్యాశతో కావ్యంలో అవకాశం దొరికినప్పుడల్లా,లేకపోతే అవకాశం సృష్టించుకొని మరీ విదూషక ప్రదర్శన గావిస్తారు కవులు. దాని వల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ. కానీ ‘పోతన చరిత్ర’ మాత్రం ఇందుకు మినహాయింపు. విశేషమేమిటంటే ఈ కావ్యంలో అడుగడుగునా కవిత్వం కనిపిస్తుంది. అందుకే దాశరధి గారు ‘కవిత్వం పేరిట లొల్లాయ పదాలు వినబడుతున్న ఈ రోజున కవిత్వం అంటే ఇదీ అని ప్రత్యక్షంగా చూపగల మహాకావ్యం పోతన చరిత్ర’అని పేర్కొన్నారు. నిజమైన మహాకావ్యం అని పిలిపించుకోవడానికి పోతన చరిత్ర, నిజమైన మహాకవి అని అనడానికి వరదాచార్యులు గారు వందకు వంద శాతం అర్హత కలిగి ఉంటారు.
ముత్యాల చెండ్లెత్తి మురిపించు జొన్న చేల్
కర్షక శ్రమ బిందు ఘనతతెల్ప
బంగారు గొలుసుల బరువుల మెడ వంచు
వరలక్ష్మి పాలేరు వరుస చెప్ప..
అంటూ వీలు చిక్కినప్పుడల్లా పల్లెను, రైతును, పంటను కొత్త కొత్తగా దర్శింప చేస్తారు. నిజంగా వీరి కవిత్వం దృశ్యాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తుంది. ఈ గుణం పోతన చరిత్ర నిండా దృశ్యమానమవుతుంది. వరదాచార్యులు గారు ‘పోతన చరిత్ర’ ద్వారా తెలుగు సాహిత్యానికి కలిగించిన మరొక మేలు కూడా ఉంది. అది పోతన్నను కడప వాడని పట్టుకుపోయే పని చేసిన – చేస్తున్న వాళ్ళ కళ్ళు తెరిపించి ఓరుగల్లు నివాసి గానే ప్రతిష్ఠించడం (అనంతరం దొరికిన ఆధారాలన్నీ కూడా పోతన్నను ఓరుగల్లు నివాసి గాని నిరూపించాయి). అయితే రావలసిన స్థాయిలో గుర్తింపు రాలేదు కానీ ఈ ఆధునిక కాలంలో తెలుగులో వెలువడిన అతి కొద్ది కావ్యాలలో మొదట పేర్కొనదగిన మహాకావ్యం ‘పోతన చరిత్రము’. తన కావ్యానికి గానీ తనకు గానీ సరైన గుర్తింపు రాకపోవడానికి ఇతరేతర ప్రాంతీయ, రాజకీయ కారణాలతో బాటు తన నిరాడంబరత, ప్రచార దృష్టి లేకపోవడం కూడా కారణాలు కావచ్చు. ‘ప్రతి మనుషుడును ఏదో ఒక విషయమున నాకంటే పెద్దవాడే కావున నేను అందరికంటే చిన్నవాడ’నని తరచుగా చెప్తుండే వరదార్యుల వారు గొప్ప వినయ శీలి. ఎదిగినా కొద్ది ఒదిగి ఉండే రకం. ఇప్పుడు ఇలాంటి వాళ్లు చాలా అరుదు. మాడపాటి హనుమంతరావు గారు ‘శ్రీ ఆచార్యుల వారు ఎంత గొప్ప కవి శేఖరులో అంత నిరాడంబర జీవనులని నేను మొదటి నుండి ఎరిగియున్నా’ నంటారు తన అభిప్రాయంలో.
అయితే ఇప్పుడు పద్యకావ్యాలను కేవలం కథ కోసమో మరోదాని కోసమో చదివే అవసరం లేదు. దానికి సాహిత్యంలో ఇతర వనరులున్నాయి. ప్రస్తుత కాలంలో కావ్యాలను భాషా సౌందర్యం కోసం, పద్యం సౌందర్యం కోసం, తెలుగు పలుకుబళ్ల కోసం, కవిత్వం కోసమే చదువుతారు. ఈ దృష్టితో చూస్తే ఈ ‘పోతన చరిత్రము’ ఒక విలువైన ఆకరం. ఇందులో తెలుగుపదాల కమ్మదనం ప్రతీ పద్యంలో ఎదురుపడుతుంది. అచ్చతెలుగు పదాల సౌందర్యం అచ్చం పోతన మహాకవి పోత పోసినట్టే అభినవ పోతన చేతిలోనూ పోత పోసుకొని వీనుల విందు చేస్తాయి. అడుగడుగునా వికసించిన కవిత్వం కావ్యాన్ని చివరిదాకా చదివేలా పాఠకులను చేయి పట్టుకొని తీసుకెళ్తుంది. పాత కావ్యమైనా, కథ పాతదే అయినా కొత్త పాఠకులను సైతం ఆకట్టుకునే మహత్తు ఈ కావ్యంలో ఉంది. అందుకే ఇలాంటి కావ్యాలకు కాలదోషం పట్టదు.
‘అకలంకంబయి యత్యుదాత్తమయి లోకాదర్శ విజ్ఞాన దా
యకమై దివ్యకథా ప్రపూతమయి పాత్రౌచిత్య సల్లాప దీ
పకమై ప్రాజ్ఞ మనోనురంజక రస ప్రస్ఫోటమై కావ్యమున్
సుకవీంద్రున్డొకడే రచించు’..
అని ‘పోతన చరిత్ర’లో కావ్యం గురించి,కవి గురించి ‘అభినవ పోతన’ చేసిన ప్రతిపాదన తన కావ్యానికీ, తనకూ వర్తిస్తుంది.
