[ఈనెల 26న వరంగల్‍లో ఆవిష్కృతమవుతున్న ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య నవతి అభినందన సంచిక ‘ప్రతిభాసుప్రసన్నము’ కోసం ఆచార్య బన్న అయిలయ్య రచించిన ప్రత్యేక వ్యాసం ఇది. 23 మార్చ్ 2026 నుంచీ 26 మార్చ్ 2026 వరకూ ప్రతిరోజూ ఈ పుస్తకం నుంచి ఒక వ్యాసం సంచిక ప్రచురిస్తున్నది.]
ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్యులు గారు సాధారణమైన వ్యక్తి కాదు. ఒక విద్వత్ కుటుంబంలోంచి ఎదిగి వచ్చిన వ్యక్తి. ఉదార వైష్ణవ సంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన వారు కనుక వారి సంస్కారం ఆదర్శనీయమైనది. వారి జీవన సంస్కారంలోనే ఒక తాత్వికత కన్పిస్తుంది. మానవ సంబంధాల్లో గాఢత గోచరిస్తుంది. సారస్వత ప్రౌఢిమ సరేసరి. ఇలాంటి అసాధారణమైన వ్యక్తితో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా అవిచ్ఛిన్నంగా నా సంభాషణ కొనసాగుతున్నది. ఇది నాకు దక్కిన ఒక అవకాశం. దీన్ని బట్టి సంస్కారవంతమైన మానవ సంబంధాలు పరిఢవిల్లడానికి మార్గదర్శి కో. సు. గారని నా అభిప్రాయం. నేను విశ్వవిద్యాలయంలో పనిచేసినప్పుడు నాపై ఎలాంటి వాత్సల్యం కురిపించారో, ఉద్యోగ విరమణానంతరం అట్లాంటి వాత్సల్యాన్నే కురిపిస్తున్నారు. ఇది వారి సౌమనస్యం తప్ప అన్యం కాదు; నేనెందుకు ఇలా ఒక ఆచార్యులతో సుదీర్ఘ కాలంగా సాన్నిహిత్యం కొనసాగిస్తున్నానోనని కాలాన్ని తవ్వుకుంటు వెనెక్కి వెళ్ళితే కొన్ని అరుదైన సంఘటనలు నాకు గుర్తుకొస్తున్నాయి.
నేను ఎప్పుడో ఎనభైయ్యో దశకం చివర్లో ‘రహస్య చిత్రం’ వచన కవితా సంపుటిని మా ఊరు నర్సంపేటలో ఆవిష్కరించడానికి రావలసిందిగా వారిని కోరితే వెంటనే ఒప్పుకోవడం, ఆనాడే కాదు నేటికీ నాకు ఆశ్చర్యం, అద్భుత అనుభవమే. ఈ రోజంటే నాకు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌గా గుర్తింపు ఉంది. నాడు కేవలం ఎం.ఏ. పూర్తి అయిన ఒక అనామక విద్యార్థిని. నాటికే వారికి కవిగా, విమర్శకులుగా, పండితులుగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆధునిక సాహిత్యంలో మొదటి తరం కవులందరితో పరిచయం వారికుంది. కవిత్వంలో, విమర్శలో వారందరి మన్ననలు పొందిన కో.సు. గారు ఏప్రిల్ ఎండలో ఒక మామూలు విద్యార్థి పుస్తకావిష్కరణకు ద్విచక్ర వాహనంపై రావడం ఆశ్చర్యమే కదా! పైగా ఒక సామాన్యమైన దళిత విద్యార్థి పుస్తకావిష్కరణకు వారు రాకపోవచ్చుననే కొందరు పండితులు నాడు అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసారు. గురువుగారు సభకు వస్తారో రారోననే నా డోలాయమాన పరిస్థితిని, పండితుల ‘ప్రిజుడీస్’ను బద్దలు కొడుతూ కో.సు. గారు వచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆధునిక కవిత్వంపై, నా కవితా సంపుటిపై చక్కని ప్రసంగం చేసారు కూడా. అంతకుముందే తరగతి గదిలో, బయట వారితో ఉన్న నా పరిచయం క్రమంగా చిక్కబడుతూ వచ్చింది. వారితో నా సాన్నిహిత్యానికి విశాలమైన ద్వారాలు తెరించింది వారే. వారెలాంటి పరిస్థితిలో ఉన్నా నాపై వాత్సల్యం అంతకంతకు ఎక్కువగానే కురిపిస్తూ వస్తున్నారు. అది సాహిత్య, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చర్చ ఏదైనా కానీ, మా వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన అంశమైనా కానీ నేను వారితో చర్చించడానికి నిరాసక్తత ఎప్పుడూ చూపించలేదు. ఎందుకంటే వారి కవిత్వం కంటే, విమర్శకంటే వారి స్వభావం పరమ సాత్వికం. కనక, వారి సాత్విక స్వభావమే జీవితంలో నాకు ఎంతో మేలు చేసిందనిపిస్తుంది. నేను రకరకాల ఒత్తిళ్ళల్లో ఉన్నప్పుడు, వారు యథాలాపంగా చెప్పిన మాటలే నన్ను మానసికంగా కుంగదీయకుండా నాలో ధైర్యాన్ని నింపాయనిపిస్తుంది. “కొందరు విలువలు లేని వ్యక్తులు కూడా చాలాసార్లు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధపెడతారు వాటిని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడమే ఉత్తమం” అంటారు. అలా వెళ్ళడమే వారికి మనమిచ్చే పరోక్ష సమాధానం అంటారు. వారు ఎదుర్కొన్న సవాళ్ళ నుండి వచ్చిన అనుభవ వాక్యాలు సోదాహరణంగా చెప్పుతుంటే నాకు ఎంతో స్వాంతన కలిగించాయి. “సమస్య పరిష్కారం ఆలోచనతో కాకుండా అనుభూతితో కూడా చేయవచ్చు” అంటారు కో.సు. గారు. ఎప్పుడు వర్తమానం నుండి పారిపోకూడదు. అలా పారిపోవడం పలాయనవాది లక్షణం అంటారు. పలాయనవాది సాధించే ఫలితం సగం సగమే ఉంటుందంటారు. ఇలా వారితో ఏదైనా సమస్య గూర్చి చర్చిస్తుంటే ఒక తాత్త్వికుడితో చర్చించినట్లు నాకు అనుభవంలోకొచ్చేది. అందుకే వారితో చర్చించడానికి చాలా ఇష్టపడతాను.
ఐదారుయేండ్ల క్రితం వరంగల్లో వారికి మాజీ ప్రధాని, ప్రజ్ఞధురంధరులు, అపర చాణుక్యులు, బహుభాషా కోవిదులు గౌ॥ పి.వి. నరసింహారావు గారి పురస్కారాన్ని ఒక సంస్థ సుప్రసన్న సారుకు అందజేసింది. అప్పుడప్పుడే వారికి వయోభారం వలన చూపు మందగిస్తున్నది. వారి మనుమడు చిరంజీవి అనిరుధ్, మిత్రులు డా॥పాతూరి రఘురామయ్య గారి సహాయంతో సమావేశ మందిరంలోకి ప్రవేశించి కాస్త ఇబ్బందిగానే కుర్చీలో కూర్చున్నారు. నేను వారి పక్కనున్న కుర్చీలో కూర్చుండి “మీకు చూపు మందగించడం నాకు చాలా బాధ కలిగిస్తున్నది సార్” అన్నాను. “ఏం చేద్దాం? కాలం మనల్ని ఎలా నడిపిస్తే అలా నడుచుకోవడమే! అయినా ఇన్నాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసాం కదా! ఇక చాలేమో అనుకున్నాయి కళ్ళు” అంటూ చూపు మందగించడాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసికున్నారు. అనివార్యంగా జరిగే శారీరక మార్పులకు చింతించాల్సిన పనిలేదన్నట్లు మాట్లాడారు. “సర్వేంద్రియాణాం నయనం ప్రధానం” అంటారు కదా! చూపులేకపోయిన నాటి నుండి నేటి వరకు తన మనో నేత్రంతోనే లోకాన్ని దర్శిస్తున్న యోగులు వారు.
జీవితమంటే మన ఊహకు అందనిదే కదా! మనం అనుకున్నట్లు జీవితంలో అన్నీ జరగవు. వారి పెద్ద కుమారులు కోవెల శ్రీనివాస్, మేడం శారదమ్మ గార్ల మరణం వారికి జీవితంలో తాకిన ఎదురుదెబ్బలే. చిన్న కూతురు భర్త అంటే సార్ చిన్న అల్లుడు గారు అకాల మరణం చెందినప్పుడు మరో దెబ్బ వారిని కుంగదీస్తాయని నేను భావించాను. అనతికాలంలో దుఃఖం నుండి తేరుకున్న ఆచార్యులవారు తన సుఖ దుఃఖాలను సాహిత్య సృజనలో గాఢంగా దర్శించడం, తాత్వికంగా ఆలోచించడం వారు మృత్యువును దర్శించే తీరు సందర్భానుసారంగా వెలువడిన ‘మణికర్ణిక’, ‘అశ్రుభోగ’, ‘పరిక్రమ’ కవితా సంపుటాల్లో చూస్తాం. ‘అశ్రుభోగ’ కవితా సంపుటి ఆవిష్కరణ 17 మే 2014లో శ్రీ రాజరాజ నరేంద్రాంధ్రభాషా నిలయం, హనుమకొండలో జరిగింది. ఆ సభలో కో.సు. గారు మాట్లాడుతూ “మంచి – చెడు; కష్టం – సుఖం; దుఃఖం – ఆనందం ఈ ద్వంద్వాలు జీవితంలో ఉంటాయి. రెండింటిని అనివార్యంగా ఆహ్వానించాల్సిందే” అన్న వారి తాత్విక ప్రసంగం దుఃఖభాజితమైన ప్రతి వ్యక్తిని ఆలోచింపజేస్తుంది. మరణ సంఘటన జరిగినప్పుడూ వారూ సామాన్యుల్లా క్షోభతో, దుఃఖంతో అల్లల్లాడినా, కాలం గడిచాక జీవిత వాస్తవికత గోచరించాక ఆ సంఘటన నుండి వెలుపలికి వచ్చి థర్డ్ పర్సన్‌గా చూడడంలోనే వారి ప్రత్యేకత ఉందనిపిస్తుంది. రోజులు గడిచినా కొద్దీ దుఃఖం పలుచబడుతూ దుఃఖానుభూతి విస్తరిస్తుందని వారి నుండి తెలుసుకోవాల్సిందే అనిపిస్తుంది.
ప్రస్తుతం వారు వారి కుమారుడు సంతోష్, మనుమడు అనిరుధ్ వద్ద హైదరాబాద్‌కు వెళ్ళే దారిలో ‘నారపల్లి’లో ఉంటున్నారు. ఒక తాపసిలాగా కాలం గడుపుతున్నారు. హైదరాబాద్ వెళ్ళిన ప్రతిసారి ‘నారపల్లి’కి వెళ్ళి వారిని కలుసుకోవాలనిపిస్తుంది. కానీ, అన్ని వేళల్లో వారి దగ్గరకు వెళ్ళడానికి కుదిరేది కాదు. హైదరాబాద్లో ఉదయం గం. 10.30 ని॥లకు ఉండాలంటే నేను హన్మకొండ నుండి బయల్దేరి ‘నారపల్లి’కి చేరుకునే సమయానికి వారు తయారై మాట్లాడడానికి సిద్ధంగా ఉండరని వెళ్ళకపోయేవాడిని. తిరుగు ప్రయాణంలో కలువచ్చు అనుకుంటే కొన్నిసార్లు రాత్రి నారపల్లికి చేరుకునే సరికి రాత్రి గం॥ 9.00 అయ్యేది. ఈ సమయంలో ఇంట్లో వారిని, సార్‌ను ఏమి ఇబ్బంది పెట్టాలని ‘డ్రాప్’ అయ్యేవాడని. ఏ మాత్రం వీలు చిక్కినా వెళ్ళిన సందర్భాలు రెండో మూడో ఉన్నాయి. 2021లో ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలు రూపొందించడానికి ప్రధాన సంపాదకుడి బాధ్యతలు స్వీకరించినప్పుడు పలుమార్లు హైదరాబాద్‌కు వెళ్ళే వాడిని. ఈ క్రమంలో 24 జూలై 2021 నాడు హైదరాబాద్ నుండి తిరిగి వరంగల్‌కు వచ్చేటప్పుడు సాయంకాలం నారపల్లిలో వారిని కలిసాను. గురువుల వద్దకు, బంధువుల దగ్గరకు వెళ్ళేటపుడు ఖాళీ చేతులతో వెళ్ళగూడదంటారు కదా! నూతన వస్త్రాలు, స్వీటు, పండ్లను, నేను కొత్తగా ప్రచురించిన ‘ధార’ వ్యాస సంపుటిని తీసుకెళ్ళి వారికి అందించాను. ‘ధార’ పుస్తకాన్ని చేతులతో తడుముతూ దాని పరిమాణాన్ని అంచనావేసి “లావుగానే ఉంది” అంటూ దాన్ని ముద్రించినందుకు నన్ను అభినందించారు. దానిలోని వ్యాసాలను నన్ను అడిగి తెలుసుకున్నారు. ‘సాహిత్య కృషిని ఆపకూడదు నిత్యం కొనసాగించాల’నే ఎప్పుడూ చెప్పే మాటలనే మళ్లీ ఆ సందర్భంగా చెప్పారు. సార్‌కు ‘ధార’ అందించే క్రమంలో నేను పుస్తకం లోపలి పేజీలో కో.సు. గారు వేద వేదాంగాలు, పురాణేతిహాసాలు, కావ్య ప్రబంధాలు, అలంకారశాస్త్రాలు, తర్కశాస్త్రం ఇలా భారతీయ సాహిత్యాన్ని మాత్రమే కాకుండా మనస్తత్వ శాస్త్రాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసినవారు కనుక ఏదో నా చాపల్యం చేత, అభిమానంతో “మహామహోపాధ్యాయ ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్యుల గారికి నమస్సులతో” అని రాసిచ్చాను. ఈ విషయం వారికి చెప్పితే “ఔనా!” అంటూ “చిన్న పిల్లలు పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి పాదాలు తొక్కుతూ, తొడలపైకెక్కి చేతుల పై నుండి భుజాల దాకా ఎగబాకుతారు అందుకు సంతోషిస్తాం కదా” అంటూ “సరే! మంచిది” అన్నారు. ఇలా ఔచిత్యంతో కూడిన చణుకు విసిరారు. ఆ తర్వాత ఇద్దరం చిన్నగా నవ్వుకున్నాం.
తన ప్రసంగం ముగిసిన తర్వాత తనవద్ద మొదటి పిహెచ్.డి. పట్టాను పొందిన డా॥జి. వి. రత్నం గారు రాసిన ‘మహాభారతం-విజ్ఞాన సర్వస్వం’ అనే బృహత్ గ్రంథాన్ని గురువుగారు ఆవిష్కరించారు. ఒక విశ్వవిద్యాలయం గాని, ఒక సంస్థగాని, చేయాల్సిన పనిని ఒంటిచేతి మీద జి. వి. రత్నం గారు చేయడం అభినందనీయమని జి.వి.రత్నం గారిని ప్రశంసించారు. ఇక్కడ సందర్భం ఏమిటంటే జి.వి. రత్నం గారు కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడకముందే ఉస్మానియా పి.జి. సెంటర్ ఆర్ట్స్ కాలేజీలో ఉండేది. ఇక్కడ ఎం.ఏ. తెలుగు కోర్సు చదివిన మొదటి బ్యాచ్ విద్యార్థి జి.వి.రత్నం. వీరు రాసిన ఈ గ్రంథం ఇక్కడ ఆవిష్కరించడం సభలో ఉన్నవారందరికీ ఆనందాన్ని కలిగించింది. ఈ గ్రంథం రాయడానికి గురువుల ప్రోత్సాహమేనని జి.వి.రత్నం గారు తెలిపారు.
తేది 26, 27 ఫిబ్రవరి 2024లో నేను డైరెక్టర్గా ఉండి ‘కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యుల సాహిత్య సేవ’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించాం. తెలుగు శాఖలో సుదీర్ఘ కాలంగా పనిచేసిన ఆచార్యులవారిని ప్రారంభ సమావేశానికి అతిథిగా ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని మన్నించి సదస్సుకు వచ్చారు. “తెలుగు శాఖ నాకు ఇల్లు లాంటిది. ఇక్కడికి రావడం ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఇచ్చింది” అన్నారు. తెలుగుశాఖలో సిలబస్‍ను రూపొందించడంలో ఇతర విశ్వవిద్యాలయ తెలుగు శాఖలకు మార్గదర్శకంగా ఉందన్నారు. ఆచార్యులమంతా ఒక టీమ్ వర్క్ చేసి తెలుగుశాఖ అభివృద్ధికి, సాహిత్య వికాసానికి దోహదపడే కార్యక్రమాలు అనేకం చేసామన్నారు. ‘సాహిత్య చరిత్ర’ పేపరుకు ‘తెలుగు సాహిత్య పరిణామం’ (Evolution of Telugu Literature) పేరుతో బోధించామని, నవలను పాఠ్యాంశంగా మొదట మన తెలుగు శాఖలోనే పెట్టామని ఆ తరువాత ఇతర విశ్వవిద్యాలయాలు దాన్ని అనుసరించాయని తెలిపారు. ఇలా అరుదైన విషయాలు ఈ తరం విద్యార్థులకు తన ప్రసంగం ద్వారా తెలియజేసారు. ఉద్యోగ విరమణ సందర్భంగా వెలువడిన నా ‘విజయపథం’ షష్టిపూర్తి సంచికను వారికి అందించగా చాలా ఆనందించారు. ఇది నీ కృషికి ఫలితం అంటూ ఆశీర్వదించారు.
నేను 29 ఫిబ్రవరి 2024లో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ చేసాను. గురువుగారిని ఒకసారి కలుసుకొని వారి ఆశీస్సులు తీసుకోవాలని అనుకుంటున్న సందర్భంలోనే వారి కుమారుడు కోవెల సంతోష్ కుమార్ 7 జూలై 2024లో తమ వివాహ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులం గురువు గారిని కలిసి నూతన వస్త్రాలు సమర్పించి ఆశీస్సులు తీసికున్నాం. ఈ సందర్భంగా ఆచార్యుల వారు “నా మీద ఎక్కువ భారం మోపకు, భరించే స్థాయిలో లేను” అన్నారు. దీనిలో ధ్వని ఏంటంటే నాకు ఏ బహుమతులు ఇవ్వకండి, నేను తిరిగి ఇచ్చే స్థితిలో లేను అని మాకు అర్థమైంది. అందుకు నేను నవ్వుతూ “సార్! గురువు గారికి మోయలేనంత బహుమతులిచ్చేంత గొప్ప స్థాయిలో మేం లేము” అనగానే గురువుగారు కూడా చిరునవ్వు నవ్వారు. ఎంతో వయో భారంతో ఉండి ఇంచుమించు వానప్రస్థ జీవితం గడుపుతూ అన్ని ఆడంబరాలను త్యజించిన వారికి మేం ఏమివ్వగలం చెప్పండి. ఏమీ ఆశించి బహుమతులిస్తాం., ఆశీస్సుల కోసం తప్ప!. ఈ సందర్భంగా మాకు ప్రత్యేక సమయమిచ్చి నా సాహిత్య వ్యాసంగం, నా శ్రీమతి ఉద్యోగ ప్రస్థానం, మా కుమారుడు అజయ్ రావు విద్యాభివృద్ధి గూర్చి అడిగి తెలుసుకున్నారు.
గురువుగారు సంక్రాంతి పండుగకు హన్మకొండలోని వారి కూతుళ్ళ వద్దకు వచ్చారని మిత్రులు డా॥పాతూరి రఘురామయ్య గారి ద్వారా తెలిసింది, తేది 12 జనవరి 2025 నాడు సాయంకాలం నేను, ఖండాంతర కవి వి. ఆర్. విద్యార్థి గారితో కలిసి వెళ్ళాను. విద్యార్థి గారు పెద్దతరం వ్యక్తి గనక ఖాళీ చేతులతో గురువు గారి వద్దకు వెళ్ళొద్దని మూడు నాలుగు రకాల పండ్లు పట్టుకొచ్చి ఇంట్లో ఇచ్చారు. తర్వాత కొంత సాహిత్య చర్చలు విద్యార్థి గారికి, గురువు గారికి మధ్య జరిగాయి. అప్పుడే వరంగల్ రేడియో కేంద్రం తరుఫు నుండి శ్రీ అనిల్ కుమార్ గారు వచ్చి గురువు గారిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నామన్నారు. అందుకు గురువు గారు, అయిలయ్యతో నన్ను ఇంటర్వ్యూ చేయించండని అనిల్ గారికి సూచించారు. వారి చిన్నకూతురు డా॥శ్రీలత ఇంటి నుండి 13 జనవరి 2025 భోగిపండుగ రోజు గురువు గారిని ఇంటర్వ్యూ చేయడానికి నా కారులో వరంగల్ రేడియో స్టేషన్‌కు తీసుకెళ్ళి ఇంటర్వ్యూ చేసాను. ఎ.సి. గదిలో నాలుగు గంటలు ఈ ఇంటర్వ్యూ కొనసాగింది. గదంతా ఎసి వ్యాప్తితో ఎక్కువ చల్లగా ఉంది. పైగా అది జనవరి మాసం. బయటి వాతావరణమంతా చల్లగానే ఉంది. గురువుగారు ఏమాత్రం ఎ.సి. గూర్చి ప్రస్తావించకుండానే ఇంటర్వ్యూ నిర్విఘ్నంగా పూర్తి చేసారు. 1953లో తాను తొలుత రాసిన కవితను మరిచిపోకుండా వినిపించారు. అట్లాగే డెబ్బయైదేళ్ళ సామాజిక, రాజకీయ, సాహిత్య సాంస్కృతిక అంశాలను జోడిస్తూ ఇంటర్వ్యూ ఇచ్చారు. వ్యక్తిగత జీవితం, సాహిత్య నేపథ్యం, తమ గురువులు, తాము చదివిన స్కూళ్ళు, పుస్తకాలు ఉస్మానియాలో పి.జీ. చదవడం, పరిశోధన చేయడం, తాను సంపత్కుమార గారు కలిసి చేసిన ఉమ్మడి సాహిత్య కృషిని, కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసింది, చేతనావర్తం కవిత్యోద్యమ ఆవిర్భావం, జాతీయత తదితర విషయాలెన్నో ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంత సుదీర్ఘంగా జరిగిన ఈ ఇంటర్వ్యూ వలన వయోభారంతో బాధపడుతున్న వ్యక్తికి ఏమైనా అసౌకర్యం కల్గిందేమో అని – అనిల్ గారు వారికి విశ్రాంతి కల్పిస్తూ మధ్యలో రెండుసార్లు చాయ్ అందించారు. మేం అనుకున్నదానికంటే కూడా ఆచార్యులుగారు ఎంతో ఓపికతో ఈ ఇంటర్వ్యూను ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూను రేడియో కేంద్రం వారు నాలుగు భాగాలుగా విడగొట్టి ప్రసారం చేసారు.
14 జనవరి 2025 రోజు సాయంకాలం నేను, వి.ఆర్. విద్యార్థి గారు, ప్రజాకవి కాళోజీ నారాయణ రావు గారిపై పిహెచ్.డి. చేసిన డా॥ ఆగపాటి రాజ్‌కుమార్ గారు గోపాలపురం రోడ్డులో ఉన్న వారి చిన్న కూతురు డా॥ కోవెల శ్రీలత గారింటికి వెళ్ళాం. చాలా ఉత్సాహంగా ఒక గంటకు పైగా మాతో ముచ్చటించారు. అదో రకంగా ‘మతం- రాజకీయ’ చర్చలాగా సాగింది. మా మధ్య జరిగిన సంభాషణనంతా డా॥ ఆగపాటి రాజ్‌కుమార్ గారు సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసారు. వారు అంత ఉత్సాహంగా, కొన్నిసార్లు ఆలోచించే విధంగా మాట్లాడడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది.
‘ఈ దేశంలో రచయితలు, కవులు లౌకికవాదం అంటూ ఒక మతాన్ని విమర్శించడం మరో మతాన్ని వెనుకేసుకొని రావడం సరియైందేనా? మేధావులు కూడా చరిత్రను మరిచి ఇలాగే ప్రవర్తించడంలో అర్థం లేదన్నారు. మొన్న ఖమ్మం వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ కవితో గొడవ కూడా పడ్డాను. ఒక మతం వాళ్ళ ఆలయాన్ని కూల్చారని మీరంతా బాధపడుతూ కవిత్వం రాసారు. మరి ఈ దేశంలో పుట్టిన మతంవాళ్ళ దేవాలయాలు దాదాపు పది లక్షలదాకా కూల్చారు, దాని మీద ఎవరూ స్పందించరేం? ఒకే మతాన్ని వెనకేసుకు రావడం లౌకికవాదం అవుతుందా? అంటూ ఒకింత ఆవేశంగానే మాట్లాడారు. దానికి నేను “ఔను సార్, ఈ దేశంలో పుట్టిన మతం దేశంలోని వివిధ సామాజిక వర్గాలను సమానంగా చూడలేదుకదా!” అంటే, ఈ దేశంలో పుట్టిన మతం వేల ఏళ్ళ క్రితంది. ఔను చూడలేదు?!, మీరు చెబుతున్నది రెండువేల సంవత్సరాల క్రితం మాట. రాజారామమోహన్ రాయ్, రామకృష్ణ పరమహంసలు, సంస్కరణ ఉద్యమాలు వచ్చాక ఆ మతంలోనూ మార్పు వచ్చిందికదా!, ఇప్పటి వరకు ఎంతో మారింది కదా! అన్నారు. అందుకు నేను ఉత్తరభారతంలో రోజు కొన్ని సామాజిక వర్గాల మీద ఇప్పటికీ ఏదో సాకుతో దౌర్జన్యాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు సార్ అని నేనంటే – కో.సు. గారు మతం ప్రభుత్వందా!, ఈ మతం రెండువేల సంవత్సరాల క్రితంది. ఈ రాజకీయ పార్టీలు ఎప్పుడు పుట్టాయి?, మతం ప్రజలది కదా అన్నారు. ఎక్కడో ఒకటి, రెండు సంఘటనలు జరిగితే జరగవచ్చు. మునుపటికంటే పరిస్థితిలో మార్పు మాత్రం వచ్చిందన్నారు. కాలక్రమేణా సామాజిక పరిస్థితిలో ఇంకా మార్పు రావాల్సి ఉంది అంటూ అందరిని కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ చర్చల్లో భాగంగా వి.ఆర్. విద్యార్థి గారు మతంపై తాను రాసిన కవితా పాదాలను చదివి వినిపించారు..
“అనాదిగా దళారులకు
అటు దేవుడు
ఇటు శాస్త్రం
భలే గట్టి కవచాలు
నమ్మికైన బానిసలు”
ఈ కవిత వినగానే గురువు గారు – దళారులకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిందేనన్నారు. 1971లో బంగ్లాదేశ్‌తో జరిగిన యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ తాను చాలా కవిత్వం రాసానని విద్యార్థి గారన్నారు.
రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని రోజుకు మూడు, నాలుగుసార్లు తిట్టడమేమిటి? అట్లాగే ప్రతిపక్షంలో మరో జాతీయ నాయకుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు ఎందుకు? కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండగా తమకు ఏ పదవులు రావనే కదా! ఇలా బహిరంగంగా ఒక పార్టీ మరో పార్టీపై విమర్శలు చేసికుంటారు, అంతర్గతంగా ఒక పార్టీ మరో పార్టితో సంబంధాలు పెట్టుకుంటారు? ఇదేం రాజనీతి అన్నారు. వీరికంటే నక్సలైట్స్ నయం కదా! వారికొక సిద్ధాంతం ఉంది; కమిట్‌మెంట్ ఉంది అన్నారు. నిత్యం ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఏ సిద్ధాంతం లేదు, ఏ కమిట్‌మెంట్ లేదన్నారు. మనది ప్రజాస్వామ్యం కదా ఇలాగే ఉంటుందని నేను అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంతా నాయకస్వామ్యమే కదా! ఒక ఇంట్లో నుండే ముగ్గురు ఎం.పి.లు ఉండడం ప్రజాస్వామ్యమా? అంటూ కొంచెం తీవ్రంగానే మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ఎమర్జన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రజాస్వామ్యం గురించి మాట్లాడిన వాళ్ళందరిని నాడు జైల్లో ఎందుకు పెట్టారు? అంటూ ఆవేదనతో మాట్లాడారు. కీ॥శే॥ భండారు సదాశివరావు గారి లాంటి దేశభక్తుడిని నాడు జైల్లో పెట్టారు. వారు జైల్లోనే ‘కృష్ణావతారం’ అనే గ్రంథాన్ని అనువాదం చేసారు. అప్పుడే సదాశివరావుగారు ‘మన వారసత్వం’ అనే పుస్తకం కూడా రాసారు. ఇటీవల ఆ పుస్తకాన్ని జాతీయ సాహిత్య పరిషత్తు వారు మళ్ళీ ముద్రించారు. అంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. మీరు ఎమర్జెన్సీని వ్యతిరేకించారా సార్! అని మేం అడిగితే, వ్యతిరేకించాను అన్నారు. ఎమర్జన్సీలో అజ్ఞాతంలో ఉంటూ ఉద్యమిస్తున్న వాళ్ళతో తాను సంబంధం నెరిపానన్నారు. వారితో కలిసి భోజనం కూడా చేసాను. ఎమర్జన్సీని వ్యతిరేకిస్తూ వారు రాసిన వ్యాసాలు, తదితర మెటీరియల్‌ను కవర్లో పెట్టి ఎవరికీ కనిపించకుండా వచ్చి మా ఇంట్లో కిటికీల ద్వారా లోపల జారవిడిచేవారు. అభ్యుదయ కవులనుకునే దాశరథి కృష్ణమాచార్యులు, శేషేంద్రలు ఎమర్జెన్సీని సమర్థించారని మాకు తెలియని అనేక విషయాలను సార్ చెప్పారు. నాడు ఎమర్జెన్సీని సమర్థిస్తూ కవిత్వం రాయమని నన్ను హైదరాబాద్ రేడియో కేంద్రం వాళ్ళు అడిగారు, నేను రాయలేదు. ఎమర్జన్సీని వ్యతిరేకిస్తూ వ్యాసం రాసాను. అది తన వ్యాస సంపుటి ‘భావ సంధ్య’లో ఉంది. చూడమన్నారు.
ఈ ప్రతిపక్షాలన్నీ మాట్లాడితే ప్రస్తుతం కేంద్రంలో ఉన్న అధికారపార్టీ ఎన్నడైనా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొందా? అని ప్రశ్నిస్తున్నాయి. ఇలా విమర్శించే వారంతా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వారేనా? కాదు కదా! మరి వీరికి అలా విమర్శించే అర్హత ఉందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు మాపై కురిపించారు కో.సు. గారు.
మా చర్చను గురువు గారు భారత మాజీ ప్రధాని భారతరత్న పి.వి. నరసింహారావు గారి వైపుకు మళ్లించారు. ఢిల్లీలో పి.వి. గారి పార్థివ దేహానికి ఎందుకంత అవమానం జరిగింది? ఢిల్లీలో వారి పార్థివ దేహాన్ని ఎందుకు సమాధి చేయనివ్వలేదు? పి.వి. జీవితకాలం పనిచేసిన రాజకీయపార్టీ ఆఫీస్ లో పి.వి. భౌతిక కాయాన్ని పెట్టడానికి వెళితే కనీసం ఆఫీస్ గేట్లు కూడా తెరుచుకోలేదు ఎందుకు? ఎవరి సూచనల మేరకు పి.వి.ని వాళ్ళ పార్టీ వారే ఇంతగా అవమానించారు? స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనలేదని కొన్ని పార్టీలను, వ్యక్తులను పదేపదే విమర్శిస్తున్నారుగా! మరి పి.వి. స్వాతంత్ర్య సమరయోధులు కాదా! వారికి దక్కిన గౌరవం ఎంత? వాళ్ళ పార్టీ వారే కేంద్రంలో అధికారమున్నప్పుడు వారికి ‘భారత రత్న’ ఎందుకివ్వలేకపోయారు? ఇప్పుడు కేంద్రంలో ఉన్న పార్టీయే కదా పి.వి. గారికి భారతరత్న ఇచ్చింది. అంటూ ఒకింత ఆవేశంగానే మాట్లాడారు. కోవెల సుప్రసన్న గారికి పి.వి. గారికి వ్యక్తిగత పరిచయం ఉండడం వల్లనే ఇంత ఆవేదనతో మాట్లాడరని అనుకుంటే పొరపాటే, వారు చారిత్రక వాస్తవాన్ని చెబుతూ వచ్చారు. ఈ సంఘటనపై కవులు ఎందుకు స్పందించలేదు? స్పందిచాల్సిందే కదా! అన్నారు.
ఇలా ఘాటుఘాటుగా మా చర్చ ముగిశాక, ఇక భోజనాల టైం అయ్యింది. భోజనం చేసి వెళ్ళండని డా॥ శ్రీలత గారు మమ్మల్ని కోరారు. అయితే మేం నవ్వుతూ ఈ రోజు పండగ కదా! మా ఇంట్లో స్పెషల్ ఉంటుంది అంటూ నవ్వుతూ అక్కడి నుండి బయలుదేరాం.
చింతనాపరులైన వి.ఆర్. విద్యార్థి గారు మరోసారి కోవెల సుప్రసన్న గారిని కలవాలని నాతో అన్నారు. వారి కోరిక మేకు గురువు గారితో మళ్లీ అపాయింట్మెంట్ తీసికొని 15 జనవరి 2025 సాయంకాలం కలిసాం. విద్యార్థి గారు కోవెల సుప్రసన్న గారిని “ప్రపంచంలో హింస తప్ప మరో పాపం లేదు, హింస అనివార్యమంటారా? సార్” అని అడిగి వారి జవాబు కోసం ఎదిరుచూస్తుండగా గురువు గారు ఒక నిమిషం ఆలోచించి “హింస అనివార్యమే” అన్నారు. ‘ఒక పెద్ద వృక్షం కొమ్మ విరిగి చిన్న చెట్టు మీద పడితే చిన్న చెట్టు దెబ్బ తింటుంది. ఒక అగ్ని పర్వతం బద్ధలైతే దాని పరిసర ప్రాంతాలన్నీ దెబ్బతిటాయి. ఈ సంఘటనలకు బాధ్యులను ఎవరినీ చేయలేం. కానీ, నష్టం మాత్రం వాటిల్లింది. ఒక వ్యక్తి తండ్రి ఆజ్ఞ ప్రకారం సమస్త రాజ్యాన్ని తృణప్రాయంగా భావించి ఉత్తర భారతం నుండి దక్షిణ భారతం పయనించాడు. దీనిలో భాగంగానే సమస్త అడవుల్ని, కొండల్ని, నదీనదాలను, వివిధ జాతుల వారిని కలుస్తూ వారితో మమేకమైయ్యారు. సుగ్రీవుడి రాజ్యాన్ని, భార్యను వాలి లాక్కుంటే వాలిదుశ్చర్యలకు వాలిని సంహరించి సుగ్రీవుడికి పూర్వవైభవం చేకూర్చాడు. అట్లాగే రావణుడు కుబేరుడి రాజ్యం లంకను లాక్కున్నాడు, అతని బంగారం, పుష్పక విమానం దౌర్జన్యంతో తీసికొన్నాడు. సీతను చెరపట్టి అపహరించాడు. చివరికి రాముడి చేతిలో అతని ప్రాణం పోయింది. ఒక దుర్మార్గుడిని తీసెయ్యాల్సిందే కదా! ఇది హింస ద్వారానే సాధ్యమైయ్యింది. కనక ప్రపంచంలో హింస అనివార్యమే.” అని వారికి సమాధానం చెప్పారు. నేడు ప్రపంచంలో ఒక దేశం మరో దేశంతో అప్రకటిత యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి. ఆర్థిక సంపత్తి, ఆయుధ సంపత్తి ఉన్న దేశాలు ఏవేవో సాకులతో చిన్న చిన్న దేశాలను చిన్నవో, పెద్దవో కారణాలను చెప్పి బలప్రయోగం చేసి ప్రాంతాలని ఆక్రమించడం, ఆ దేశ అధ్యక్షులను నిర్బంధించి తమ దేశం తీసికెళ్ళడం, ఈ సందర్భంగా అనివార్యంగా కొంత హింస ప్రబలడం వర్తమాన చరిత్రే కదా! అట్లాగే వివిధ భావజాలాలకు సంబంధించిన వర్గాలు రకరకాల పేర్లతో ముఠాలుగా ఏర్పడి తమకు వ్యతిరేకంగా ఉన్న సమూహాలపై దాడులు చేసి హింసకు పాల్పడడం, మతాల పేరు మీద ఆత్మాహుతి దాడులు జరిపితే క్షణ కాలంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. ఇలాంటి దాడుల్లో మానవ శరీరాలు ముక్కలు ముక్కలై భయంకరంగా, బీభత్సంగా, జుగుప్సగా కనిపించడం ప్రత్యక్షంగానో పరోక్షంగానో చూస్తూనే ఉన్నాం. కేవలం ఆయుధాల ప్రయోగం ద్వారా మాత్రమే కాకుండా, మానసిక హింస వివిధ మార్గాల ద్వారా ఎదుర్కొక తప్పట్లేదు అన్నారు. గురువు గారితో సంభాషణ ముగిసిన తరువాత మేం కారులో ఇంటికి వస్తూ ఈ విషయమే మాట్లాడుకుంటూ వచ్చాం. ఇదంతా భారత సైన్యంలో పనిచేసిన విద్యార్థి గారికి తెలియదా! తెలుసు. అట్లాగే ఎనభై ఏళ్ళ జీవితానుభవం వారికుంది. పైగా కవి కూడా! కానీ, ‘హింస’ పట్ల గురువు గారి అభిప్రాయం ఎలా ఉందో కనుక్కోవాలని వారికి ఎప్పటి నుండో మనస్సులో బలంగా ఉంది. చివరికి వారికి సమాధానం దొరికినట్లు నేను భావించాను. బహుశా గురువు గారి అభిప్రాయంతో వారు ఏకీభవించినట్లు కూడా నేను గమనించాను.
వి.ఆర్. విద్యార్థి గారి ఎనభై ఏళ్ళ వయస్సు నిండిన సందర్భంగా ‘అశీతి’ జరుపాలని కొందరు సాహితీ మిత్రులం భావించాం. విద్యార్థి గారికి కో.సు. గారికి సాహిత్య బంధమే కాకుండా వారి మధ్య జిడ్డు కృష్ణమూర్తి గారి తాత్త్విక బంధం కూడా ఉంది. ఈ సంచిక కోసం కో.సు. గారిని అభినందనలు రాసివ్వాలని కోరడానికి నారపల్లి (హైదరాబాద్)లోని వారింటికి తేది: 10 జూన్ 2025 నాడు నేను, డా॥ రఘురాం, వి.ఆర్. విద్యార్థి కలిసి వెళ్ళాం. మొదలు అపాయింట్మెంట్ తీసికున్నాం కనక వారు మాతో మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆచార్యులవారు వారి హెల్పర్ సహాయంతో వచ్చి హాలులో కూర్చున్నారు. “ఆశీరభినందనలు” పేరుతో, సందేశమిచ్చారు. గురువుగారు చెబుతుంటే డా॥ రఘురాం గారు చక చకా రాస్తూ వెళ్ళారు. తరువాత వారికి చదివి వినిపిస్తే బాగుంది ఫెయిర్ చేసి ఇచ్చేయండి అని రఘు గారికి చెప్పారు. “అభినందనల్లో విద్యార్థి గారి గూర్చి చెప్పుతూ తనకు కృష్ణమూర్తితో ఉన్న అనుభవాన్ని ఒక పేరాగ్రాఫ్‌లో ఇలా చెప్పారు. “శ్రీ కృష్ణమూర్తిగారు భూత భవిష్యత్‌లు తన్ను తాను తెలుసుకున్నవారు. నేను నా అదృష్టం కొద్దీ జనవరి 4, 1986 నాడు మద్రాస్‌లో ఆయన చేసిన చివరి ఉపన్యాసాన్ని విన్నాను. ఆ ఉపన్యాసం చివర శ్రోతలను రెండు నిమిషాల పాటు నిశ్శబ్దంలో నిలిపి ఇది నా చివరి ఉపన్యాసం అని ప్రకటించారు. నిజంగా అదే జరిగింది” అని చెప్పారు. గురువు గారి కవిత్వంలో కృష్ణమూర్తి గారి తాత్త్వికత ఉందని తెలుసుకానీ, అప్పటి వరకు వీరు స్వయంగా వారి ఉపన్యాసం విన్నారనే విషయం నాకు అప్పుడే తెలిసింది. ఇంకా ఆ వ్యాసంలో ‘విద్యార్థి కవిత్వంలోనూ తన ప్రత్యేక మార్గాన్ని నిర్మించుకొన్నారు. ఆ ప్రత్యేకత వెనుక శ్రీ కృష్ణమూర్తి భావసుదర్శన చక్రం పరిభ్రమిస్తున్నది’ అని తెలిపారు. ఆయన స్ఫూర్తి ఈ తరం కవులకు సారస్వత వేత్తలకు కలుగవలెనని ఆశిస్తున్నానని అన్నారు.
అప్పటికే మధ్యాహ్న భోజన సమయం కావడం వలన ఇక్కడే భోజనం చేసి వెళ్ళండని వారి పెద్ద కోడలు (అనిరుధ్ తల్లి) సునీత గారు అన్నారు. మేము వచ్చామని తెలిసి కోవెల సంతోష్ కుమార్ గారు అప్పుడే అక్కడికి వచ్చారు. సంతోష్ గారు ‘స్వాధ్యాయ’ పేరుతో ఒక యుట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. దానికోసం నన్ను ఇంటర్వ్యూ ఇవ్వమని ఎప్పటి నుండో అడుగుతున్నారు. ఈ రోజు సమయం కుదిరింది కనుక ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందేనని కోరారు. అక్కడి నుండి సంతోష్ గారింటికి నేనూ వి.ఆర్. విద్యార్థి గారు వెళ్ళాం. విద్యార్థి గారే నన్ను ఇంటర్వ్యూ చేశారు. తర్వాత సంతోష్, స్వాతి దంపతులు మమ్మల్ని భోజనం చేసి వెళ్ళాల్సిందేనని కోరారు. ఈ సంఘటన వారి కుటుంబ సభ్యుల సంస్కారానికి నిదర్శనం. ఇంతేగాదు గురువుగారి పెద్దమ్మాయి శ్రీవాణి దంపతులు కూడా నాయందు గౌరాభిమానాలను ప్రకటిస్తారు. వారి ఆత్మీయ ఆతిథ్యాన్ని కూడా స్వీకరించిన రోజులున్నాయి. ఒక అతిథిని గౌరవించే పద్ధతిని కో.సు., శారదమ్మల ద్వారా ఆ కుటుంబం అలవర్చుకుందని చెప్పవచ్చు.
ప్రొఫెసర్ కోవెల సుప్రసన్న గారంటే కేవలం ఒక కవి మాత్రమే కాదు, ఒక ఆచార్యుడు మాత్రమే కాదు, నిరంతర అధ్యయనశీలి మాత్రమే కాదు, నిత్యం మానవ సంబంధాలను కొనసాగించేవారు మాత్రమే కాదు. నిరంతర చింతనాపరులు కూడా. లౌకిక ప్రపంచంలో అందరితో ఉంటూనే ఆంతరికమైన చింతన, అధ్యయనం చేస్తుంటారని నాకనిపించింది. వీరిలో నిరంతర జిజ్ఞాస వుంటుంది. సుప్తచేతనలో ఉన్నా అంశాలు ఇతరులతో పంచుకున్నప్పుడు చైతన్యమై వెలుగు చూస్తాయి. ఇవ్వాళ వారికి చూపు లేకపోయినా చదివించుకోవడం, తెలుసుకోవడం, తెలియజేయడం, బోధించడం, తన ఆలోచనలను వ్రాయసకారులకు చెప్పి పుస్తకాలు వెలువరించడం చేస్తూనే వున్నారు. వారి అభిప్రాయాలతో ఏకీభవించని వారితో కూడా సత్సంబంధాలను కొనసాగించడం నేర్చుకోదగినది. ఏ చర్చనైనా ఆబ్జెక్టివ్ గానే గురువుగారు చూస్తారు. వారి ప్రారంభ రచనల్లో మార్క్సిజం ప్రస్తావన ఉంది, అనంతర రచనల్లో బౌద్ధం, కృష్ణతత్వం, అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి, రమణ మహర్షి, వివేకానందుడు, రామకృష్ణుల తత్త్వం వారి రచనల్లో అంతర్గతంగా కనిపిస్తుంది. తెలుగు విశ్వవిద్యాలయం డా॥బి.ఆర్. అంబేడ్కర్ సంపుటాలను తెలుగులో వెలువరించింది. ఐదవ సంపుటానికి గురువుగారు సంపాదకులుగా ఉన్నారు. అందువలన అంబేడ్కర్ భావజాలాన్ని కూడా కొంతవరకు సానుకూలంగానే అర్థం చేసుకున్నారని వారి ఆలోచనల ద్వారా మనం గ్రహించవచ్చు. ఈ గొప్ప లక్షణం వారికుంది కనుకనే వారి ప్రపంచం విస్తృతమవుతుందే తప్ప సంకుచితం కాలేదు. అందుకే వారిని ‘ఆధునిక ఋషి’ అనాలపిస్తుంది.
