Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆధ్యాత్మిక-కళల సమాహారం-దక్షిణాపథం

[తమిళనాడులోని పలు ఆధ్యాత్మిక చారిత్రిక ప్రదేశాలు సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ షేక్ అమీర్ బాషా.]

సారి మా ప్రయాణం, ఆధ్యాత్మితకు, అందమైన ఆలయాలకు, విశిష్టమైన శిల్ప సంపదకు నిలయమైన తమిళనాట సాగింది.

ముందుగా చిదంబరం చేరుకున్నాము. చిదంబర నటరాజ ఆలయము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.ఈ దేవాలయం శైవ సంప్రదాయానికి అత్యంత పవిత్రమైన పంచభూత స్థలాలలో ఒకటి. ఇక్కడ పరమశివుడు ‘ఆకాశ తత్త్వం’ రూపంలోపూజలందుకుంటాడు.

చిదంబరం అనే పేరు ‘చిత్ + అంబరం’ అనే సంస్కృత పదాల నుండి వచ్చింది. ‘చిత్’ అంటే జ్ఞానం, ‘అంబరం’ అంటే ఆకాశం. అంటే ‘జ్ఞానాకాశం’ అనే అర్థం వస్తుంది. స్నానాధుల అనంతరం దైవదర్శనానికి వెళ్ళాము.

ఈ ఆలయంలో శివుడు నాటరాజ రూపంలో దర్శనమిస్తాడు. దర్శనానంతరము దాదాపు నాలుగు గంటల పాటు ఆలయ వైభవాన్నిసందర్శించాము.

ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ వాస్తుకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ఆలయంలోని గోపురాలు అద్భుత శిల్పకళకు నిదర్శనం. ‘చిదంబర రహస్యం’ అనే ప్రసిద్ధ లోకోక్తి, ప్రపంచానికి తత్వ జ్ఞానాన్ని బోధిస్తుంది.

చిదంబర రహస్యం అనేది ‘ఆకాశ లింగం’ రూపంలో పరబ్రహ్మ స్వరూపాన్ని సూచిస్తుంది. తెర వెనుక ఖాళీ స్థలాన్ని దర్శించడం ద్వారా ‘దేవుడు రూపరహితుడు, మనలోనే ఉన్నాడు’ అనే తత్త్వాన్ని తెలియజేస్తుంది.

ఆలయ 9 ప్రవేశ ద్వారాలు మానవ శరీరంలోని 9 రంధ్రాలను, 21600 బంగారు రేకులు మనిషి రోజుకు 21600 సార్లు శ్వాస తీసుకోవడాన్ని సూచిస్తాయి. అదే విధంగా 72000 బంగారు మేకులు శరీరంలోని 72000 నాడులను సూచిస్తాయి.

ఆలయంలోని 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు, 64 దూలాలు 64 కళలకు ప్రతీకలు.

నటరాజ విగ్రహ కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి కేంద్రబిందువుగా భావించబడుతుంది.

మధ్యాహ్న భోజనానంతరము చిదంబరానికి దగ్గరలో ఉన్న ‘పిచ్చావరం’కు వెళ్ళాము. Pichavaram Mangrove Forest భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మాంగ్రూవ్ అరణ్యాలలో ఒకటి. ఇది ప్రకృతి సౌందర్యానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మాంగ్రూవ్ అడవిగా పిచ్చావరం గుర్తింపు పొందింది. ఇక్కడ బోటింగ్ ప్రధాన ఆకర్షణ.

మేము పడవ ప్రయాణం చేస్తూ సన్నని నీటి మార్గాల గుండా ప్రయాణించి అద్భుతమైన నీటిమధ్యలో పెరిగే మాంగ్రూవ్ చెట్ల ప్రకృతి అందాలు తిలకించాము. అనేక రకాల పక్షులు, జలచరాలు కూడా కనిపిస్తాయి.

చిదంబరంలో ఆధ్యాత్మికతతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించి తంజావూరు చేరుకున్నాము.

చోళ రాజుల వైభవానికి, కళా పోషణకు, ఆధ్యాత్మిక భావాలకు నిదర్శనంగా నిలచిన తంజావూరు నగరంలో అడుగుపెట్టగానే ముందుగా మేము చూసినది ఆకాశాన్ని అంటేలా నిలచిన బృహదీశ్వరాలయపు గోపురాన్ని.

హోటల్లో కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం ఎంతో ఉత్సాహంగా వేయి సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఆలయానికి బయలుదేరాము. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన శైవ ఆలయాలలో ఇది ఒకటి. ఈ ఆలయాన్ని ‘రాజరాజేశ్వర ఆలయం’ అని కూడా పిలుస్తారు. క్రీ.శ. 1010 ప్రాంతంలో రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని పూర్తిగా గ్రేనేట్ రాళ్లతో నిర్మించాడు. ప్రధాన గోపురం సుమారు 216 అడుగుల ఎత్తు కలిగి ఉంది. గ్రానైట్ రాళ్లపై నడుస్తూ, గోడలపై చెక్కిన శిల్పాలు, చిత్రాలు చూస్తూ ప్రవేశించిన మేము వెయ్యి సంవత్సరాల వెనక్కి వెళ్లినట్లు అనుభూతి చెందాము.

ఆలయంలో చాలా పెద్ద శివలింగం ఉంది. ఒకే రాతితో చెక్కబడిన ఇక్కడి నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి.

గోపురం పైభాగంలో ఉన్న భారీ రాతి కలశం సుమారు 80 టన్నుల బరువు ఉందని చెబుతారు. ఈ ఆలయం UNESCO ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ‘Great Living Chola Temples’లో భాగంగా ఉంది. ఆలయ గోడలపై చోళ కాలపు శాసనాలు కనిపిస్తాయి.

మధ్యాహ్నం వరకు ఆలయంలోనే గడిపి, తంజావూరు రాజమహల్‌కు వెళ్ళాము. విశాలమైన ప్రాంగణాలు, చిత్రలేఖనాలతో అలంకరించిన దర్బార్‌ హాల్‌ చరిత్రను మళ్లీ మళ్లీ గుర్తు చేసింది. అక్కడే ఉన్న సరస్వతి మహల్ లైబ్రరీలో అరుదైన తాళపత్ర గ్రంథాలు, పాత పుస్తకాలు భద్రపరచి ఉన్నాయి.

సాయంత్రం అందమైన శివ గంగ ఉద్యానవనంలో అందంగా గడిపి హోటల్‌కి వెళ్ళాము.

మరుసటి రోజు ఉదయం, తంజావూరు70 km దూరంలో ఉన్న గంగైకొండ చోళపురం సందర్శించాము. ఇది ఒక చారిత్రక నగరం మరియు అద్భుతమైన దేవాలయ సముదాయం. ఇది చోళ రాజు ఒకటవ రాజేంద్ర చోళుడు నిర్మించిన రాజధాని నగరం. ఆయన గంగానది వరకు విజయ యాత్ర చేసి తిరిగి వచ్చిన తరువాత ‘గంగైకొండ చోళన్’ అనే బిరుదును పొందాడు. అందుకే ఈ నగరానికి ‘గంగైకొండ చోళపురం’ అనే పేరు వచ్చింది.

ఒకప్పుడు ఈ నగరం చోళుల రాజకీయ, సాంస్కృతిక కేంద్రంగా పెద్ద రాజభవనాలతో, కోటలతో, విరాజిల్లుతుండేదని చరిత్ర చెబుతుంది. భక్తి కళ చరిత్ర మేళవించిన తంజావూరు నగరాన్ని సందర్శించిన అనంతరం మరో టెంపుల్ టౌన్ తిరుచిరాపల్లికి ప్రయాణమైనాము.

తిరుచిరాపల్లి (తిరుచ్చి) తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఒకటి. కావేరీ నది తీరాన ఉన్న ఈ నగరం దక్షిణాదిలోని పురాతన నగరాలలో ఒకటి. చరిత్ర, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది.

ముందుగా విశ్వప్రసిద్ధి గాంచిన శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం సందర్శించాము. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వైష్ణవ క్షేత్రంగా, ఆలయ సముదాయంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి గోపురాల వైభవం, శిల్పకళా నైపుణ్యం, ఆలయంలోని ఆధ్యాత్మిక వాతావరణం భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి.

భోజనానంతరం, నగరానికి తల మానికంగా ఉన్న ‘రాక్‌ఫోర్ట్’ కొండ ఎక్కాము. 83 మీటర్ల ఎత్తైన ఈ కొండపై గణేశుడి ఆలయం ఉంది. పైకి ఎక్కిన తరువాత నగరమంతా ఆకాశ దృశ్యంలా కనిపించింది. ఒక వైపు కావేరీ నది ప్రవాహం, మరోవైపు పచ్చని పరిసరాలు, మధ్యలో తిరుచ్చి – ఈ అద్భుతమైన దృశ్యం మనసును పరవశింపజేసింది.

సాయంత్రం, తిరుచిరాపల్లి (ట్రిచీ)లో ప్రసిద్ధి చెందిన ‘తబ్లే ఆలమ్ బాదుషా దర్గా’ (నత్తర్ వలీ దర్గా అని కూడా పిలుస్తారు.) సందర్శించాము. ఇది తమిళనాడులో ముస్లింలతో పాటు హిందువులు, క్రైస్తవులు కూడా భక్తితో సందర్శించే పవిత్ర స్థలం. దర్గా ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఓ రకమైన అలౌకిక ఆనందానికి లోనైనాము. చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలు, దట్టమైన సాంబ్రాణి ధూపం అగరొత్తుల, గులాబీ పూల పరిమళం, మరోవైపు భక్తుల సందడి కవ్వాలి పాటల మాధుర్యం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి.

‘హజరత్ నత్తర్ వలీ’ అసలు పేరు సుల్తాన్ ముతహరుద్దీన్. క్రీ.శ. 927 లో తుర్కీ-సిరియన్ వంశంలో జన్మించి, రాజ్యాన్ని, రాజసంపదను వదిలి సూఫీ మార్గాన్ని అనుసరించాడు.

900 మంది అనుచరులతో దక్షిణ భారతదేశానికి వచ్చి, తిరుచ్చిలో స్థిరపడ్డాడు. ఈ దర్గా ఆయన సమాధి మీద నిర్మించబడింది. అన్ని మతాల వారికి ఇక్కడ స్వాగతం లభిస్తుంది. ప్రార్థించిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

తమిళనాడులో చాలామంది తెలుగు మాట్లాడుతారు కాబట్టి మాకు భాషా పరమైన సమస్యలు రాలేదు. స్థానిక వంటలైన ఇడ్లీ, దోసె, పొంగల్, కుర్మా, సాంబారు – కావేరి తీరంలో చిన్న హోటళ్లలో తప్పకుండా తినవలసిన రుచులు. మా పర్యటన వేసవిలో కాబట్టి సహజంగా ఈ ప్రాంతపు వాతావరణం కొంచెం చీకాకు కలిగిస్తుంది. ఉష్ణోగ్రత ఎక్కువగానే ఉండి చెమట పట్టిస్తుంది.

మరుసటిరోజు ఉదయం నాగూరు, నాగపట్నం సందర్శించడానికి బయలుదేరాము.

ముందుగా నాగూరు దర్గాకు వెళ్ళాము. ఇక్కడ ప్రముఖ సూఫీ సాధువు, బోధకుడు సయ్యద్ అబ్దుల్ ఖాదరి షాహుల్ హమీద్ గారి సమాధి ఉంది. స్థానికులు దీనిని ‘నాగూరు ఆండవర్’ అంటారు. మతాతీతంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఇక్కడ ధూప దీపాలతో ప్రార్ధనలు జరపడం విశేషం. భక్తికి, విశ్వాసానికి కులమతాల తేడా లేదని చాటిచెప్పే పవిత్ర స్థలం ఇది.

16వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ దర్గాకు హిందూ రాజులు కూడా విరాళాలు ఇచ్చిన చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం నాలుగు రోజులపాటు జరిగే ఉర్స్ ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది ఇక్కడకు వచ్చి ప్రార్థనలు జరుపుతారు.

మధ్యాహ్నం దర్గా లోనే భోజన ప్రసాదాలు తిని ‘వెలంకన్నీ’ కి బయలుదేరాము.

నాగూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపట్నం లో ‘వెలంకన్నీ ఆరోగ్య మాత’ చర్చి ఉంది.

16వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ చర్చ్ ‘Our Lady of Good Health’ అనే మరియమ్మకు అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. వేల మంది భక్తులు హాజరవుతారు.

సాయంత్రం చర్చికి దగ్గరలోనే ఉన్న సముద్ర తీరంలో సేద తీర్చుకొని తిరుగుముఖం పట్టాము. వెలంకన్నీ నుంచి తంజావూరు మీదుగా రైలు ప్రయాణం చేసి బెంగళూరు చేరాము.

పురాతన ఆలయాలు, చారిత్రిక కట్టడాలు,వాటి వాస్తు శిల్పకళల వైభవం చూసిన ఎవరికైనా ‘రాజుల సొమ్ము రాళ్లపాలు’ అనే నానుడి తప్పకుండా గుర్తుకు వస్తుంది.

Images Credit: Autor

Exit mobile version