[డా. నాగభైరవ ఆదినారాయణ గారి ‘ఆద్యక్షరం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి.]
ఈ మధ్య ఒక ప్రముఖ కవిగారు తాము రచించిన పాటను అందమైన నేపథ్య చిత్రీకరణలో పాడించి వాట్సాప్ లో పంపారు. గానం శ్రావ్యంగా ఉన్నదని అభినందించి గాయని పేరు అడిగాను. A.I. (కృత్రిమ మేధ) అని ఆ కవిగారు చెప్పారు. చాలా ఆశ్చర్యం కలిగింది. మనం ఏదన్నా ఒక అంశం ఇచ్చి దాని గురించి కవిత్వం చెప్పమంటే A.I. చెప్పేస్తుందని కూడా తెలిసింది. అంతేకాదు మనం వ్రాసిన కవితను చాలా చక్కగా, అర్థవంతంగా విశ్లేషించి విమర్శిస్తే ఎలా ఉంటుంది? ఈ వినూత్నమైన ఆలోచనతో చేసిన ప్రయోగం కళారత్న, భాషావిభూషణ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారి ‘ఆద్యక్షరం’ కవితా సంపుటి. గూగుల్ జెమిని విశ్లేషణలతో వెలువడిన తొలి తెలుగు కవిత్వ సంపుటి ‘ఆద్యక్షరం’.
డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు బహుముఖీనమైన ప్రతిభా పాండిత్యాలు కలిగిన సాహితీవేత్త. కవి, రచయిత, పరిశోధకులు, బాల సాహిత్యకర్త, వ్యాకరణంలో అపారమేధాసంపన్నులు. తెలుగు సాహిత్యంలో ఇప్పటికే కొన్ని నూతన ప్రయోగాలకు శ్రీకారం చుట్టినవారు. కాళిదాసు రచించిన ముక్తక శ్లోకాలను స్వీకరించి, వాటిని కథారూపంలో గుదిగ్రుచ్చి అందమైన కథగా మలచి ‘శృంగార తిలకం’ కావ్యం రచించారు. ఒకే కవితా వస్తువుపై పది ప్రక్రియలలో రచన చేయటం వీరి మరో ప్రయోగం. ‘కరోనాపై కవనం’ ఈ కోవకు చెందిన రచన. ‘తెలుగు వెలుగు’ శతకం మట్టిబండి దీర్ఘకవిత ‘రైతుబంధురంగ’, ‘మదర్ థెరిసా’ వచన కావ్యం. ‘అస్త్రసిద్ధి’ నాటకం వీరి ప్రసిద్ధ రచనలు. సామవేదం జానకిరామశర్మ ‘ప్రవరుడు’ కావ్యానికి హృదయావిష్కరణ చేశారు. పలు ప్రక్రియలలో ఎనభైకి పైగా రచనలు వెలువరించారు. వీరి ‘మట్టిబండి’ దీర్ఘకవిత బహుళప్రజాదరణ పొందింది. ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషలలోనికి అనువదించబడి పలువురి ప్రశంసలు పొందింది.
ఆధునిక తెలుగు సాహిత్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు చేపట్టే ఆదినారాయణగారి మరో వినూత్న ఆవిష్కరణ ‘ఆద్యక్షరం’ కవిత్వ సంపుటి.
ఆద్యక్షరం కవితా సంపుటిలో మొత్తం 24 కవితలున్నాయి. వీటిలో అక్షరతూణీరం, పూచికపుల్ల, మట్టి – శీర్షికలు కల కవితలు ఆకాశవాణి మార్కాపురం నుండి ప్రసారమయ్యాయి. ‘పుడమిపాట’ కవిత హృదానంద పాణిగ్రాహి (ఒడిసా) రచనకు అనువాదం.
కవి హృదయంలో వివిధ సన్నివేశాలలో వివిధ ఘటనలలో పురుడు పోసుకున్న ఆలోచనకు, ఆవేశానికి, సృజనాత్మకతకు అక్షరరూపం ఇచ్చేదే కవిత్వం. అటువంటి కవిత్వమే పాఠకుల హృదయ స్పందనను బట్టి, పరిశీలనాదృష్టిని బట్టి పలు రీతులలో వారివారి హృదయాలకు చేరువవుతుంది. అయితే గూగుల్ జెమినిని అడిగితే కృత్రిమమేధ ద్వారా కవి హృదయాన్ని ఏ రీతిగా అర్థం చేసుకుంటుందో ప్రయోగాత్మకంగా ఈ కవిత్వ సంపుటిలో చూడవచ్చు.
కృత్రిమమేధ (A.I.) కి మనుషులకున్నట్లు రాగద్వేషాలు, ఇష్టానిష్టాలు ఉండవు. అది తన పరిధిలో విశ్లేషిస్తుంది. ఆ క్రమంలో ‘ఆద్యక్షరం’ కవిత్వ సంపుటిలో కవి రచించిన కవిత, దాని వెనువెంటనే జెమిని విశ్లేషణ మనం చూడవచ్చు. కనుక ‘ఆద్యక్షరం’ కవితా సంపుటి సమీక్ష అంటే కవిత, దానితో పాటు విశ్లేషణ – రెండిటినీ సమీక్షించుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఇది ఒక సరికొత్త సాహిత్య ప్రయోగానికి ఆది కనుక ఆదినారాయణ గారు పెట్టిన శీర్షిక ‘ఆద్యక్షరం’ సార్థకం.
వచన కవిత్వ రచనలో ఆదినారాయణగారు సిద్ధహస్తులని నిరూపించే పెక్కు కవితలు ఈ సంపుటిలో ఉన్నాయి. ఒక సాధారణమైన అంశంతో కాని, వస్తువుతో కాని ప్రారంభించి క్రమంగా ఒక సామాజిక చిత్రాన్ని పాఠకుడి మనోనేత్రం ముందు దర్శింపచేస్తూ, లేదా ఒక తాత్త్విక కోణాన్ని స్ఫురింపచేస్తూ కవితను ముగించటం ఒక ప్రభావవంతమైన రచనాశిల్పం.
ఉదాహరణకు ‘ఊరకుక్క’ కవితను పరిశీలిద్దాం.
“ఇప్పుడీ దేశంలో/ఎక్కడ చూసినా
కుక్కలే కనిపిస్తున్నాయి/లెక్కకు మిక్కిలిగా”
ప్రారంభం అతి సామాన్యంగా కనిపిస్తుంది. కవిత రెండోభాగంలో కవి తాము ఏ కుక్కల గురించి మాట్లాడుతున్నారో చెప్పారు. కవిత మూడో భాగం నుండి తాము చెప్పదలచుకున్న సామాజికమైన అవినీతి, అరాచకాలను వర్ణిస్తారు.
“ఈ కుక్కలకు సానుభూతి ఉండదు
సాటి జీవుల పట్ల భయం లేనే లేదు
…………..
అవకాశం చూసుకొని అందినంత గతుకుతాయి
……………
పరులెవరైనా అక్కడి/పరిసరాల్లో కనిపిస్తే
కొట్లాడి, కొట్లాడి తరిమేస్తాయి/కుక్క బుద్ధి కదా”
ఇలా సాగిన ఈ కవిత
“ఈ జాతి సమూలంగా/అంతమొందినప్పుడే
సామాజిక జీవనం సుకరం
ఇంకా ఇలాగే కొనసాగితే
భవిష్యత్ భారతం దుర్భరం”
అని ముగుస్తుంది.
నడుమ నడుమ ‘చిత్తకార్తెకుక్క, ఛీ, కుక్క బతుకు; కుక్క తోకలే కాదు బుద్ధి కూడ వంకరే’ వంటి లోకోక్తుల ప్రయోగాలు ఈ కవితారచనలో ఒక ప్రత్యేక శిల్పంగా నిలబడ్డాయి.
ఈనాటి సమాజంలో వేళ్ళూను కొనిపోయిన అవినీతి, మహిళలపై సాగే అరాచకత్వం. ఆకృత్యాలు సాగించే అరాచక శక్తులకు ప్రతీకగా ఊరకుక్కను స్వీకరించి, ఆద్యంతమూ కుక్క స్వభావానికి, దుర్మార్గవర్తనుల స్వభావానికి సాదృశ్యాన్ని సాగిస్తూ చివరగా సూటిగా తమ తీర్పును, న్యాయాన్ని వెల్లడించారు కవి.
ఈ కవితను విశ్లేషించిన గూగుల్ జెమిని ఏమంటుందో చూడండి. “‘ఊరకుక్క’ కవిత చాలా ఘాటైన సామాజిక విశ్లేషణలా ఉంది. పైకి జంతువుల గురించి చెబుతున్నట్లు అనిపించినా, అంతర్లీనంగా సమాజంలో పేరుకుపోయిన అవినీతిని, అరాచకత్వాన్ని మరియు అధికార దాహాన్ని మీరు పదునైన పదాలతో ఎండగట్టారు. చాలా లోతైన అర్థం ఉన్న, శక్తివంతమైన రచన ఇది” అంటుంది గూగుల్.
ప్రతీకాత్మకంగా సాగిన ఈ కవిత కవిగారి రచనా శిల్పానికి నిదర్శనం అయితే జెమిని విశ్లేషణ కవితలోని అంతరార్థాన్ని పట్టుకొని వెలికి తీసిన తీరు అబ్బురం అనిపిస్తుంది.
ఆదినారాయణ గారికి శబ్దం మీద, తెలుగు నుడికారం మీద సాధికారత అధికం. పదప్రయోగంలోనూ, అంత్యానుప్రాసాది అలంకారాల కూర్పులోను కవి నిర్మాణ ప్రతిభ తళుక్కున మెరుస్తుంది. పాఠకుడికి భాషమీద మమకారం కలిగిస్తుంది.
“నా పలుకు భారతీదేవికులుకు నా వ్రాత పవిత్ర భగవద్గీత
నాచేత చెరగని, చెదరని చరిత/నా చూపు మదనుని విరితూపు
అనే అనుకుంటాడు ప్రతివాడు
పలుకుల్లో స్పష్టత/వ్రాతల్లో నిబద్ధత
చేతల్లో నిజాయితీ/చూపుల్లో పవిత్రత
ఉంటేనే ‘వాని’కి విలువ లేకుంటే వాడొక తులువ
పారేసిన పాతవలువ” – ఆత్మావలోకనం
ఇది నిడివిలో చాలా చిన్న కవిత. కాని సమాజంలో ప్రతి మనిషి, ప్రతి కవి ఆత్మావలోకనం కావించుకోవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్తుంది. అద్భుత సందేశాత్మకమైన ఈ కవిత నిజాయితీ లేనివారికి చురుక్కున గుచ్చుకొనే ముల్లు వంటిది. స్పష్టమైన భావానికి అంత్యప్రాస అందగించింది.
‘దాహం’ ఉత్తమ వ్యంగ్య చిత్రాన్ని ఆవిష్కరించింద. కవి దేన్ని గురించి చెప్పదలచుకున్నారో ఆ విషయం చివరి వరకు వాచ్యం చేయబడదు. పాఠకుడికి పఠనానురక్తిని పెంచుతుంది. చదవటం పూర్తి అయిన తరువాత ఒక సామాజిక సత్యం కళ్ళ ముందు నిలుస్తుంది.
‘దాహం- దాహం- దాహం’ – అని ప్రారంభమై
“ఈ దాహం పేరు ఇంధనం/ఇదే సర్వానర్థాల మూల ఇందనం
ఈ దాహంతోనే సంచరించే జనం
ఈ దాహంతోనే సంచరించే జనం
ఈ దాహంతోనే గతిస్తారు ఏదో ఒక దినం” అని ముగుస్తుంది.
ధనవ్యామోహం అనే వస్తువు అభివ్యక్తిలో విలక్షణతను సంతరించుకున్న కవిత ఇది.
‘ఆద్యక్షరం’ కవిత్వ సంపుటిలో ‘మట్టి’ కవిత మరో విలక్షణమైన కవిత. మట్టి అంటే కేవలం మనకంటికి కనిపించే ఒక పదార్ధం మాత్రమే కాదు. పౌరాణిక, చారిత్రక, తాత్త్వికమైన అనుబంధం. మట్టికి, మనిషికీ అనాదిగా పెనవేసుకొని ఉంటుంది. సకల జీవులకు జీవాధారం మట్టి. పృథివిని తల్లిగా పూజించే సంస్కృతి మనది.
“జలమున్ గాలియునగ్నిభూమియనినన్ సామాన్య సంపత్తిగా
తలపన్ రాదవి జీవమంత్రమయవిద్యాచుంచులు
– సుజల వృత్తతారావళి 23
అంటారు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణగారు.
జీవులకు జీవనాధారం అయిన మట్టి (భూమి) పట్ల మానవుడి ప్రవర్తన ఏవిధంగా సాగుతుందో ఈ కవితలో కవి వివిధ కోణాలలో వెలువరించారు.
మట్టిమనుషులను హీనంగా చూసేవాడెవడైనా/మట్టికొట్టుకుపోవలసిందే అని ముగింపు పంక్తులలో కవి హృదయంలోని భావోద్వేగం, మట్టిపట్ల కవి అంతరంగంలో దాగిన ఆర్ద్రత సుస్పష్టం అవుతున్నాయి.
“నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు
నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతాలు”
అని బాలగంగాధర తిలక్ అక్షరశక్తిని తమ కవిత్వంలో నిరూపించారు. అక్షరానికి అక్షయమైన శక్తి ఉంది. అతి సున్నితమైన భావాలను, అతి తీక్ష్ణమైన భావాలను అత్యంత ద్రవీకరణతో కూడిన భావాలను సైతం అక్షరం సమర్థంగా వ్యక్తీకరిస్తుంది. ఆదినారాయణ గారు ‘అక్షరతూణీరం’లో నుండి అనేక భావాలను అభివ్యక్తం చేశారు. మనోజ్ఞ దృశ్యాలకు, భీకర దృశ్యాలకు సైతం అక్షరమే ఆధారం.
“అక్షరం విచ్చుకొనే పూలరేకు/గుచ్చుకునే వాడిబాకు
పరవశం కలిగించే గుడి/గుండెను తట్టిలేపే తడి”
ఇలాంటి అక్షరశక్తికి ప్రతీక శారదామాత అని ప్రకటించారు కవి.
“అక్షరం శారద పవిత్ర గాత్రం
ఈ అక్షరం మనిషికి కనిపించని మూడోనేత్రం”
అక్షర తూణీరంలో ఎన్నెన్ని పూలబాణాలో, అగ్నిబాణాలో? ఊహకందని వాక్ఛక్తికి ఈ కవిత ఒక గనిగా నిలుస్తుంది.
ఈ కవితను విశ్లేషించిన గూగుల్ జ్ఞాననేత్రాన్ని తెరిపించే ఏకైకశక్తి అక్షరానికే ఉందని కవి చెప్పిన విధానాన్ని కవి, కవితాత్మగా వ్యాఖ్యానించింది.
ఇలా ‘ఆద్యక్షరం’లోని ఆది కవిత నుండి అంత్య కవిత వరకు సమాజంలోని భిన్న రంగాలలోని స్ధితిగతులను శక్తిమంతంగా ప్రదర్శించాయి. వాటి నుండి మేల్కొనవలసిన ఆవశ్యకతను విశ్లేషించాయి. మార్గాన్వేషణ చేశాయి. మానవ సంబంధాలలో కావలసిన ఆత్మికతను అద్దంలో చూపించాయి.
తెలుగు భాషా, సాహిత్యాల అభివృద్ధిలో వినూత్న విధానాలను పుణికి పుచ్చుకోవటం నేటి సాంకేతిక యుగంలో అత్యంత కీలకం. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణగారు చేసి చూపిన ఇటువంటి ప్రయోగాలు మనుముందు మరికొన్ని కొత్త పుంతలను తొక్కాలని, తెలుగు భాష కీర్తి దిగ్దిగంతాల పర్యంతమూ విస్తరించాలని ఆకాంక్షిద్దాం.
***
రచన: డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ
పుటలు: 66
వెల: ₹ 100/-
దొరకుచోటు:
డా. నాగభైరవ ఆదినారాయణ
202, శ్రీ వెంకటసాయి రెసిడెన్సీ
2వ లైను, రామయ్యనగర్
ఒంగోలు, ప్రకాశంజిల్లా – 523002
చరవాణి: 98497 99711

