[డా. కొర్లగుంట సాయి ప్రసాద్ రచించిన ‘ఆగు.. ఆలోచించు’ అనే పద్య కవితని అందిస్తున్నాము.]
~
సీ.:
మాట్లాడుటకు ముందు మంచిగా విని చూడు
అర్థవంతమొ, కాదొ అరయగలవు;
కువినర్శనకు ముందు స్వవిమర్శనము చేసి
నిష్కళంకుడవేమొ నిర్ణయించు;
దాడి చేసేముందు తాలిమి వహియించు
సంధి చేసుకొనిన సబబు యేమొ;
అనవసర సలహాల అడగకే ఇవ్వకు
మేలు కలుగునేమొ మిన్నకున్న;
‘వ్రాలు’ పెట్టకమున్నె పలుమార్లు పఠియించు
దోషమున్నదొయేమొ దొరకవచ్చు;
ఖర్చు సేయక మున్నె కష్టించి ఆర్జించు
అప్పులు సేయుట తప్పునేమొ;
వదలిపెట్టకమున్నె వొకసారి యత్నించు
విజయుడౌతావేమొ విశ్వసించు;
ప్రార్థించుటకు మున్నె పరమాత్ము నమ్ముము
వరములిచ్చునేమొ కరుణజూపి;
మరణించుటకు మున్నె మంచి చేసి బ్రతుకు
నిల్తువేమొ జనుల నాల్కలందు;
తే.గీ.:
తొందర పడుట మరియు దుందుడుకుతనము
మంచి సేయదు సరి కదా ముంచివేయు,
ఓర్పు యున్నట్టి వారలు ఓడిపోరు,
విజయమన్నది అవ్వారి వెంటనడచు
