Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆహార సామాజికశాస్త్రం

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘ఆహార సామాజికశాస్త్రం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

అన్నం మనిషి ఆకలి తీర్చటంతో పాటు మానవ నాగరికతను మోస్తూ సాగుతున్న మహాశక్తి.

మనిషి చరిత్రను చదవాలంటే చేసిన యుద్ధాలనో, ఏలిన రాజ్యాలనో మాత్రమే కాదు, అతను తిన్న అన్నాన్ని కూడా చదవాలి. ఎందుకంటే ప్రతి వంటకం వెనుక ఒక వలస, ఒక వేదన, ఒక వర్గచరిత్ర, ఒక సంస్కృతి ఉంది.

అన్నం అనేది శక్తినిచ్చే ఇంధనం మాత్రమే అనుకోవటం వలన అన్నం మన కళ్ళకు ‘రుచుల కుప్ప’గా మాత్రమే కనిపిస్తుంది. అన్నం ఒక సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఒక వర్గాన్ని, ఒక ఉనికిని సూచిస్తుంది. ఒక చరిత్రకు ప్రత్యక్ష సాక్షి అవుతుంది. అది మనిషి ఉనికిని నిర్మిస్తుంది. మానవ సంబంధాలను బలపరుస్తుంది. జాతి జ్ఞాపకాలను నిలబెడుతుంది. ఒక ప్రాంతపు భౌగోళిక స్వభావాన్ని, వాతావరణాన్ని, శ్రమ సంస్కృతిని చాటుతుంది.

పళ్ళెంలో వడ్డించుకున్న ఆహారం తినేవాడి ఆర్థిక స్థితిని, ఆ సమాజపు చరిత్రని, ఆధ్యాత్మిక విశ్వాసాల్ని, ఇంకా ఎన్నెన్నో విశేషాలను చెప్పగలదు. అయినా, అన్నం పైన చర్చలు అసలే జరగటం లేదు. జీవనాధారమైన అన్నం పవిత్రత, నాణ్యత, పరిశుభ్రతల గురించి ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. ఏది ఏమిటో తెలీకుండానే అన్నం తినేస్తున్నాం మనం!

భాషాశాస్త్రం, వృక్షశాస్త్రం, ఆరోగ్యశాస్త్రం, సామాజిక శాస్త్రాల సంగమంగా తెలుగువారి ఆహార సామాజికశాస్త్ర నిర్మాణం జరగాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. విశ్వవిద్యాలయాల స్థాయిలో అది మొదలవ్వాలి. విద్యార్థులకు కేవలం పోషక విలువల గురించిన ఫుడ్ సైన్సు మాత్రమే కాదు, ఆహారం వెనుక ఉన్న సంస్కృతి, సమాజం, రాజకీయాలు, అసమానతలు, పర్యావరణ సంబంధాలతో కూడిన ఫుడ్ సోషియాలజీని కూడా బోధించాలి. ప్రతీ విశ్వ విద్యాలయ పరిథిలోనూ తెలుగువారి ఆహార సామాజిక శాస్త్ర విభాగం ఏర్పడాలి.

ఆహార అవగాహన ఒక సామాజిక హక్కుగా మారాలి. మనం తినే ప్రతి అన్నపు ముద్దలోనూ వేల యేళ్ల మానవ అనుభవం దాగుంది. ఆ అనుభవాలు నేర్పే పాఠాలను వదిలేసి అన్నం మాత్రమే ముఖ్యం అనుకోవటమే మనం అన్నానికి చేస్తున్న అన్యాయం.

అన్నం గురించి మాట్లాడటం అంటే కేవలం వంటకాల గురించి మాట్లాడటం కాదు; అది మనిషి గురించి మాట్లాడటం. సమాజం గురించి మాట్లాడటం. నాగరికత గురించి మాట్లాడటం. అందుకే ఆహార సామాజిక శాస్త్రం భవిష్యత్తరాలకు అత్యంత అవసరమైన విజ్ఞాన శాఖగా మారాలి.

అన్నశాస్త్రం అంటే, మన ఆహారపు అలవాట్లు, వంట విధానాలు, భోజనాచారాలు, ఆహార ఉత్పత్తి మరియు వినియోగం వెనుక ఉన్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక శక్తుల అధ్యయన శాస్త్రం. వర్గం, జాతి, లింగం, వలసలు, ప్రపంచీకరణ వంటి అంశాలు ఆహార వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇది విశ్లేషిస్తుంది.

అన్నం అంటే..

అన్నం అంటే జాతి చరిత్రను నిశ్శబ్దంగా చెప్పే ఒక కథకుడు. మన ఊరి వాసన, మన ఇంటి జ్ఞాపకం. కాల ప్రవాహాన్ని దాటించే వారధి. పండే కళ్ళం నుంచి తినే పళ్లెం దాకా జరిగే సామాజిక యాత్ర. మనుషులందరినీ ఒకే చాపపైన కూర్చోబెట్టే అనుబంధం. మనసును నింపే మమకారం. అమ్మ చేతి ప్రేమకు రూపం. నేల, నీరు, రైతు చెమటల కలయిక. సంస్కృతిని మోసుకొచ్చే మౌన భాష. పండుగల పరిమళం, పేదరికపు బాధ రెండింటి సమ్మేళనపు జీవగాథ. పంచుకుంటే పెరిగే అనురాగం.

అన్నం అంటే తరతరాల జ్ఞాపకాల ముద్ద. మన ఉనికిని నిలబెట్టే సంస్కృతి. అన్నం అంటే, మనిషి బ్రతుకులో మొదటి సామాజిక ఒప్పందం. అన్నం అంటే భూమి ఇచ్చిన ఆశీర్వాదం, కూడి తినే కూటి వైభవం.

అఫ్రికాలో పుట్టిన బెండకాయనో గుత్తి వంకాయనో ఇక్కడ తెలుగువాళ్లం ప్రధాన ఆహార పదార్థంగా తింటున్నామంటే వేల యేళ్ల క్రితం జాతుల వలస మన కళ్ళముందు మెదుల్తుంది. అందుకే అన్నం గురించి మాట్లాడటం అంటే కేవలం వంటకాల గురించి కాదు; మనిషి గురించి, సమాజం గురించి, నాగరికత గురించి మాట్లాడటమే.

అన్నంలో సామాజికత

అన్నం అనగానే రుచుల కోసం ఆరాటం కనిపిస్తుంది. నా అన్నం-నా ఇష్టమే అయినా, ప్రతి రుచివెనుక ఒక కుటుంబ చరిత్ర, ఒక ప్రాంతపు సంస్కృతి, ఒక జాతి ప్రయాణం దాగి ఉంటుంది.

“మా ఇళ్ళలో ఇలా వండుకుంటాం” అన్నప్పుడు అది కుటుంబ చరిత్ర అవుతుంది. బూందీనో, జలేబీనో మనం ఇష్టంగా తింటున్నప్పుడు ఉత్తరాది, దక్షిణాది ప్రజల మధ్య ఏర్పడిన సంలీనాల జ్ఞాపకాలు కళ్ళముందు తారట్లాడతాయి. మోరుండ (మొర్మరాల ఉండలు) అనే తెలుగు పేరు ఢిల్లీ వీధుల్లో వినిపిస్తోందంటే, ఆహారం కేవలం రుచుల మార్పిడి కాదని, భాషలు–జాతులు–వలసల సంచార చరిత్ర అని తెలియజేస్తుంది.

ఆహార చరిత్రను వలసపాలన, బానిస వ్యవస్థ, అంతర్జాతీయ వాణిజ్యాల నుంచి వేరు చేసి చూడలేము. Sidney Mintz చక్కెర చరిత్రను విశ్లేషిస్తూ, కరీబియన్ దీవుల్లో బానిసల శ్రమ ద్వారానే చక్కెర ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందన్నాడు. మన అన్నం వెనుక దోపిడీ, అధికార రాజకీయాలు, శ్రమ చరిత్రలెన్నో దాగి ఉంటాయి.

తెలుగు వారి ఆహార సామాజిక శాస్త్రానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. తెలుగులో ‘పంచదార’ అనే పదాన్నే తీసుకుందాం. తీరాంధ్ర ప్రాంతాల్లో ఇప్పటికీ ‘పంచదార’ అనీ, తెలంగాణా–రాయలసీమ ప్రాంతాల్లో ‘చక్కెర’ అనీ అంటారు. ‘పంచన్+దార’ అంటే ‘బౌద్ధ భిక్షువుల కానుక’ అని పంచదార పదానికి భావం కావచ్చు. ఈ పదప్రయోగం ద్వార తెలుగు నేలపిన బౌద్ధ సంస్కృతి, తీరాంధ్ర చరిత్రలను కొంత తెలుసుకోవచ్చు.

అన్నంలో సామాజికతను చదవాలంటే కేవలం వంటకాల తయారీ తెలిస్తే చాలదు; భాషాశాస్త్రం, చరిత్ర, వృక్షశాస్త్రం, వైద్యశాస్త్రాలతోఫాటు మన సంస్కృతిని కూడా కలిపి పరిశీలించాల్సి ఉంటుంది!

తెలుగు వారి ఆహార రీతులు

ఆహార రీతులు (Food ways) ఆహార సామాజిక శాస్త్రంలో ముఖ్యమైన అధ్యయనాంశం. ఒక సమాజం ఏం తింటుంది? ఎలా తింటుంది? ఎప్పుడు తింటుంది? ఎవరు వండుతారు? ఏది పవిత్రం? ఏది నిషిద్ధం? ఈ ప్రశ్నలన్నీ ఆ సమాజపు జీవన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఆహారంతో ముడిపడిన జీవన విధానాలు, భోజనాచారాలు, కుటుంబ సంప్రదాయాలు, పండుగలు, వడ్డింపు పద్ధతుల సమాహారమే ఈ ‘ఆహార రీతి’!

ఇవి కేవలం తినే అలవాట్లు కావు; తరతరాలకు సంక్రమించే సామూహిక జ్ఞాపకాలు. తెలుగువారి ఇళ్లలో సంక్రాంతికి అరిసెలు చేయడం అనేది కేవలం వంటకం తయారీ కాదు. అది పంటపండుగ ఆనందం, కొత్త బియ్యం పవిత్రత, స్త్రీల శ్రమ, కుటుంబ సమ్మేళనం, అందరితో పంచుకునే సంస్కారాల సామాజిక అనుభవం.

ఉగాది పచ్చడి, రంజాన్ హలీం, క్రిస్మస్ కేక్‌, వినాయకచవితి ఉండ్రాళ్లు, పెళ్లిళ్లలో అరటాకుపై వడ్డన – ఇవన్నీ వంటకాలకన్నా పెద్ద సామాజిక అర్థాలను మోసుకొస్తాయి. భక్తి, పండుగ, కుటుంబ బంధం, సమూహ జీవనం, సంప్రదాయం వంటి విలువలను ఈ అన్నరీతులు నిలబెడతాయి.

ఒక జాతి మనస్తత్వాన్ని తెలుసుకోవాలంటే వారి భోజనపు పళ్లెం చూడాలని చెప్పడం యాదృచ్ఛికం కాదు. మన మనస్తత్వాన్ని అన్నం ప్రభావితం చేసినంతగా, మన మనస్తత్వం కూడా అన్నాన్ని ప్రభావితం చేస్తుంది. మనం తినే అన్నం మన సంస్కృతి, మన అభిరుచి, మన జీవనశైలుల ప్రతిబింబం. అందుకే, సామాజిక శాస్త్రవేత్తలు ఆహారాన్ని ఒక ‘సంభాషణా వ్యవస్థ’గా పరిగణిస్తారు.

ప్రపంచీకరణం ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఏర్పడింది కాదు. సముద్ర మార్గాలు తెరుచుకున్న నాటినుండే ప్రపంచీకరణ ప్రారంభమయ్యింది. సముద్రమథనాన్ని సముద్రయానానికి ప్రతీకగా భావిస్తే, వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది ప్రపంచ వింత లనదగినవి లభించాయని క్షీరసాగర మథనం కథ చెప్తోంది.

చరిత్ర పూర్వయుగంలో ఆంధ్రరాజుల కాలంలోనూ ప్రపంచీకరణ బాగా జరిగింది. మన నుండి ఎగుమతులైన సన్న నూలు బట్టలు తొడిగి రోమ్ యువతులు సిగ్గులేకుండా తిరుగుతున్నారని రోమ్ పార్లమెంటు గగ్గోలు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. గాథాసప్తశతిని చదివితే ఎగుమతులు దిగుమతుల గురించిన గాథలు శాతవాహన కాలం నాటి ప్రపంచీకరణను చాటుతాయి.

శ్రీనాథుడి కాలంలో రెడ్డిరాజులు ప్రపంచంలోని విలువైన వస్తు సముదాయాన్ని గుర్రాలు కంబళ్ళు, సుగంధ ద్రవ్యాలు సహా ఎన్నింటినో తెచ్చి మనకి, మనవైన వాటిని తిరిగి వారికి పరిచయం చేశారు.

ఆంగ్లేయ యుగంలో ముఖ్యంగా డచ్చి పోర్చుగీసు వ్యాపారులు చేసిన ప్రపంచీకరణ ప్రభావం నేటి కాలపు ప్రపంచీకరణ కన్నా ఎన్నో రెట్లు అధికం. ఆ రోజున మనం పుచ్చుకునే స్థితిలో రిసీవింగ్ ఎండ్‌లో ఉన్నాం కాబట్టి! మిరపకాయలు, టమోటాలు, జామ, పొగాకు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బాదం జీడిపప్పు లాంటి విదేశీ ద్రవ్యాలు మన సంస్కృతిలోకి ప్రవేశించి విడదీయలేని భాగాలయ్యాయి. అనాదిగా ప్రపంచీకరణ మన వంట సంస్కృతిని ప్రభావితం చేస్తూనే వచ్చింది. తెలుగు ఫుడ్, తమిళియన్ ఫుడ్, నార్దిండియన్ ఫుడ్, ఇటాలియన్ ఫుడ్, చైనీస్ వంటి గుర్తింపులు చరిత్రలోని వలసలు, వాణిజ్యం, మీడియా, రాజకీయాల ద్వారా రూపుదిద్దుకున్నాయి.

అన్నం ఓ మూలధనం

అన్నాన్ని ఒక పెట్టుబడిగా ఫుడ్ కేపిటలిస్టులు ఆధిపత్యం నడవటంతో అమన్ ఆహార విధానాలన్నీవీళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. వాళ్లు పెట్టిందే తిండి, వాళ్లు అమ్మిందే వస్తువు. ఆర్గానిక్ మార్కెట్లు, ఆధునీకరించబడి అమెరికన్ జీవనశైలిని అనుకరించే రెస్టరెంట్లు, రుచికన్నా నాణ్యతకన్నా కళాత్మక అలంకారానికి ప్రాధాన్యత నిచ్చే బ్రెడ్లు, అంబలిని చద్దన్నాన్ని తూలనాడే బ్రేక్‌ఫాస్టులూ ఇవి కేవలం ఆహారపు ఎంపికలు మాత్రమే కావు; వ్యక్తుల ఉనికిని కాకుండా, వారి వర్గస్థితిని, ఆర్థిక స్థితిని సూచించే సంకేతాలు. ఇవే మంచి ఆహారం అనే అభిప్రాయం ఏర్పడ్డాక ఇలాంటి ఆహారం మాత్రమే ఎంచుకునే సామర్థ్యం వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను చాటేదిగా తయారయ్యింది. ఆహార అసమానతలు మనుషుల్ని వేరుచేస్తున్నాయని దీని భావం.

ఆరు రుచులతో కూడిన అన్నాన్ని షడ్రసోపేతమైన ధనిక భోజనం అంటున్నాం. దాన్ని డబ్బున్నవాళ్లు తినే ఐదు నక్షత్రాల భోజనంగా భావిస్తున్నాం. కానీ, పోషక విలువలు కలిగిన అన్నం అనే ఆలోచనే రావటం లేదు. రోడ్డు పక్కన ఉచితంగా పెరిగే గలిజేరు, గంగ పావిలి కూరకన్నా మించిన ధనిక భోజనం లేదు. ఒకప్పుడు ఇవే తిన్నారని ఆముక్తమాల్యదలో రాయలవారు గురుగు చెంచలి, చింత చిగురు లాంటి ఆకులు వర్షాకాలంలో ఆహర కొరతని ఎలా తీరుస్తాయో వివరించాడు. రోడ్డు మీద మురుక్కాలవల మీద పెట్టి వండే వీధి వంటకాలను తినటానికి ఇచ్చపడే మనం రోడ్డు పక్కన పెరిగే విలువైన ఆకుకూరల్ని తినటానికి మొహమాట పడటం అనే గుణం మనకి ఫుడ్ క్యాపిటలిస్టుల వలనే కలుగుతోంది.

రాయీ అంటే హిందీలో ఆవాలు. పెరుగులో ఇష్టమైన కూరగాయ ముక్కల్ని ఉడికించి పెరుగులో కలిపి చిటికెడంత ఆవపిండి వేసి తాలింపు పెట్టిన పెరుగుపచ్చడిని ‘రాయితా’ అంటారు. మన ఫుడ్ క్యాపిటలిస్టులు పెరుగులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కలిపి అదే రాయితా అంటున్నారు. శ్రీనాథుడు శృంగార నైషధంలో వర్ణించిన ఆవపెరుగుపచ్చడి ఇప్పుడు కనుమరుగైపోయింది.

ఇవి వ్యక్తిగత వైఫల్యం కాదు; నిర్మాణాత్మక అసమానతల ఫలితం. తక్కువ ఆదాయం, రవాణా లోపం, వ్యవసాయ విధానాలు, కార్పొరేట్ ఆధిపత్యం ఇవన్నీ మన ఆహార రీతిని శాసిస్తూన్నాయి. కాగా, సమాజంలో మన స్థాయిని, ఆ స్థాయిని బట్టి మనం తినవలసిన అన్నాన్ని కూడా ఈ ఫుడ్ కేఫిటలిస్టులే నిర్ణయించే స్థితి వచ్చింది.

తిండికి కొదవలేని ధనిక వర్గాల్లో డి, ఇ, బి ఇటమిన్లు, అలాగే ఇనుము, కేల్షియం లాంటి ఖనిజ లోపాలు కనిపించటాన్ని బట్టి పోషకాహార లోపాలు పేద, మధ్యతరగతికి పరిమితమైనవనే అభిప్రాయం తప్పని రుజు వైంది.

ప్రపంచీకరణ (Globalization) ఆహార సంస్కృతులను కొత్త రీతిలో మార్చింది. స్థానిక ఆహార సంప్రదాయాలు మార్కెట్ ఒత్తిడిలో కనుమరుగైపోతున్నాయి. ఇంటి పెరుగు స్థానంలో విదేశీ తరహా యోగర్టులు వ్యాప్తిలోకి రావటాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. ఆరుకాలం కష్టించే రైతన్న, కూలన్నల మీద ఆధారపడిన సంస్కృతి మనది. ఫుడ్ కేపటలిస్టులువళ్ళ శ్రమను కాదని, మనం ఏం తినాలో నిర్ణయిస్తున్నారు

వ్యక్తిగతంగా మనలో ఆహార సామాజిక వాస్తవికతపైన అవగాహన ఉంటే మన ఆహార సంస్కృతి ఎన్నేళ్లయినా పదిలంగా ఉంటుంది.

Exit mobile version