[ప్రసిద్ధ రచయిత్రి గీతాంజలి గారు రచించిన ‘ఆకాశం మారిన చంద్రుడు!’ అనే మినీ కవితలని అందిస్తున్నాము.]
~
1.
రోజులో ఏవో కొన్ని
కన్నీటి సమయాలు ఉంటాయి!
బడి విడిచే ముందు గంట మోగినట్లు
నువ్వు జ్ఞాపకం వచ్చేముందు కళ్ళు
వరదలవుతాయి!
2.
చంద్రుడి ఆకాశం మారిపోయింది!
తరలిపోయాడేటో!
ఆకాశాన్ని ఖాళీ చేసి వలసపోయాడేటో!
ఏ వీధిలో బిక్షుకుడు కానున్నాడో?
నీ వైపుకిక వస్తాడో రాడో?
3.
వృద్ధురాలైన ఎండిన చెట్టు,
వసంతాన్ని రమ్మని పాడే
గిటారులా వణుకుతూ నిలబడింది!
మేఘానికే దయలేదు!
4.
గాయకుడా నీకేం
నువ్వు పాడేసి వెళ్ళిపోయావు!
పాట మరచిపోలేని
వీణ తీగలు తెగి
స్పృహ కోల్పోయింది!
5.
మోహం తీర్చమన్న మల్లెల్ని
వేసవి కాల్చిపడేసింది
మల్లెలు కమిలిపోయాయి!
6.
ఇద్దరి మధ్య ప్రేమ
మాగిన పండై నేల రాలి
ఎండి పోయిందనుకున్నా!
చూడెలా మొలకెత్తిందో?
రాకూడదా ఒకసారి?
7.
రాగాలను వినడం
అలవాటైనాక
అతగాడు వీణను విరగ్గొట్టి
మాయం అయినాడు!
8.
నిలువునా ఆవహించిన
పరిమళం!
తోటని వీడి
యుగాలైనవి కదా?
9.
అందిన దాంట్లోనే
ఆనందం వెతుక్కోవాలంటావు!
అందిన దాంట్లో
నువ్వుండని లోటులో
ఆనందం ఎక్కడిది చెప్పు?
శ్రీమతి గీతాంజలి (డా. భారతి దేశ్పాండే) వృత్తిరీత్యా సైకోథెరపిస్ట్, మారిటల్ కౌన్సిలర్. కథా, నవలా రచయిత్రి. కవయిత్రి. అనువాదకురాలు. వ్యాస రచయిత్రి. ‘ఆమె అడవిని జయించింది’, ‘పాదముద్రలు’. లక్ష్మి (నవలిక). ‘బచ్చేదాని’ (కథా సంకలనం), ‘పహెచాన్’ (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), ‘పాలమూరు వలస బతుకు చిత్రాలు’ (కథలు), ‘హస్బెండ్ స్టిచ్’ (స్త్రీల విషాద లైంగిక గాథలు) ‘అరణ్య స్వప్నం’ అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఈ మోహన్రావున్నాడు చూడండీ..! (కథా సంపుటి)’ . ఫోన్: 8897791964
