[శ్రీమతి హిమజ రచించిన ‘ఆకాశం ఒక్కటే, వర్ణాలు ఐదు’ అనే కవితని అందిస్తున్నాము.]
రాత్రి తన చివరి స్వప్నాన్ని
తెలి మంచుబిందువుగా వదిలి వెళ్లిన తరువాత,
నెమ్మదిగా తెరుచుకునే
లే శిశువు కనురెప్పలా ఉంటుంది పొద్దుటి ఆకాశం
వెలుగు ఇంకా పచ్చిగానే ఉంటుంది.
ప్రపంచాన్ని మొదటిసారి చూస్తున్నట్టుగా.
పొద్దెక్కిన ఆకాశం
నీలి చీర మడతల్లో
రోజంతా చేయాల్సిన పనులను దాచుకుంటుంది
మేఘపు తునకలు కూడా
ఎక్కడికో- ఆలస్యమవుతున్న మనుషుల్లా
త్వర త్వరగా కదుల్తుంటాయి
ఈ సమయానికి ఆకాశం
కలలు, కవిత్వం గురించి మాట్లాడదు..
బాధ్యతల పరుగు మాత్రమే తెలుసు.
మధ్యాహ్నపు ఆకాశం
తనని తాను నిరూపించుకునే అవసరం లేని
ఒక సంపూర్ణ వాక్యంలా
నేరుగా భూమి కళ్లలోకి చూస్తుంది.
దాని వెలుగు కింద
చెట్లు తమ నీడలను కుదించుకుంటాయి,
మనుషులు తమ ఆలోచనలను.
సాయంత్రపు ఆకాశం
ఆ రోజు రాసుకున్న డైరీ చివరి పేజీ.
సూర్యుడు వెళ్లిపోతూ
కొన్ని రంగులను మర్చిపోయినట్టుగా,
పడమర అంతా
నారింజ, అరుణం, గులాబీ జ్ఞాపకాలతో నిండిపోతుంది.
ఈ వేళన
పక్షులు మాత్రమే కాదు,
మనసులు కూడా
ఎక్కడో తమ ఇళ్ళని వెతుక్కుంటాయి
రాత్రి పూట ఆకాశం
కాలం చింపేసిన ఉత్తరాలన్నీ
నక్షత్రాలై అతికించబడిన నల్లని గోడ.
దూరంగా కనిపించే ప్రతి వెలుగు వెనుక
ఎవరో ఒకరి కథ ఉంటుంది.
ఎవరో ఒకరి నిరీక్షణ.
ఎవరో ఒకరి ప్రేమ
ఎవరో ఒకరి విరహం
చంద్రుడు మాత్రం
ఆ కథలన్నింటినీ చదివి
ఏమీ తెలియనట్టు కూర్చున్న
పాత స్నేహితుడిలా
నిశి వేళ ఆకాశం
ఎప్పుడో వెళ్లిపోయిన వాళ్లందరూ
చిరునామా మార్చుకుని ఒక్కచోట చేరిన
కాంతుల కాలనీలా ఉంటుంది.
అందుకేనేమో
కొన్ని నక్షత్రాలు కనిపించినప్పుడల్లా
వాటిని పేరుపెట్టి పిలవాలనిపిస్తుంది..!!
సుతిమెత్తగా కవిత్వం రాసే ‘హిమజ’ కవితా సంకలనం ‘ఆకాశమల్లె’కి కవయిత్రి మొదటి పుస్తకానికి ఇచ్చే సుశీలా నారాయణరెడ్డి పురస్కారం (2006), రెండవ పుస్తకం ‘సంచీలో దీపం’కు ‘రొట్టమాకు రేవు’ అవార్డు (2015) వచ్చాయి.
‘మనభూమి’ మాసపత్రికలో స్త్రీలకు సంబంధించిన సమకాలీన అంశాలతో ‘హిమశకలం’ పేరున సంవత్సర కాలం ఒక శీర్షిక నిర్వహించారు.
ప్రపంచ ప్రఖ్యాత ఆఫ్రో అమెరికన్ కవయిత్రి ‘మాయా ఏంజిలో’ కవిత్వాన్ని అనువదించి 50 వారాలు ‘సంచిక’ పాఠకులకు అందించారు.
‘పొయెట్స్ టుగెదర్’ శీర్షికన భిన్న కవుల విభిన్న కవిత్వపు అనువాదాలు అందించారు.
