Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆకాశమే నీ హద్దు

[డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు గారు రచించిన ‘ఆకాశమే నీ హద్దు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ధ్య హాల్లో అటూ ఇటూ అస్థిమితంగా తిరుగుతున్నాడు రంగనాథం. ఆయన భార్య సులోచన మరో రెండడుగులు ముందుకేసి ఆరుబయట గేటు దెగ్గరికి ఇంటి మెట్ల దగ్గరికి అదే అస్థిమితంతో తిరుగుతోంది.

“వచ్చాడా?” నడక ఆపి బయటకు తొంగి చూస్తూ అడిగాడు రంగనాథం.

“ఇంకా రాలేదు – నేనూ అదే చూస్తున్నా. ఆ బండేసుకొని తిరక్కురా అంటే వినడు. మనకేమో రావటం ఆలస్యమయితే గుండెలు పీచుపీచు మంటూ ఉంటాయి.” అని సులోచన అంటుండగానే, కొంచెం దూరం నుంచి మోటర్ బైక్ శబ్దం వినిపించింది. గేటు ముందు బైక్ ఆగగానే ‘హమ్మయ్య’ అనుకున్నారు భార్యాభర్తలిద్దరూ ఒకేసారి.

గేటు తీస్తున్న తల్లిని చూసి “గేటు ముందే తారట్లాడతున్నావా అమ్మా? అనుకున్నా..! కొంచెం ఆలస్యమయితే ఎందుకంత భయం? నాకేదో అయిపోయినట్లు చెడు సీన్లన్నీ కళ్ళముందు నిల్పుకొని ఏదేదో ఊహించుకుంటూ భయపడిపోవటం నీకు, నాన్నకు బాగా అలవాటయిపోయింది” అన్నాడు కౌశిక్ టూవీలర్ పార్క్ చేస్తూ.

అయినా కొడుకు మాటల్ని పట్టించుకోకుండా “నిన్ను కాదు, నువ్వు అడగగానే బైకు కొనిచ్చిన మీ నాన్నను అనాలి” అంది సులోచన చిరుకోపంతో.

“ఉరుము వురిమి మంగలం మీద పడ్డట్టు వాడు లేటుగా వస్తే నన్నంటావేంటే?” అన్నాడు రంగనాథం భార్యతో.

“లేకుంటే ఏంటి? వయసులో వున్న పిల్లల మనసు కోతి లాంటిది. రోజూ చూడటం లేదూ టీ.వీ.లో, ఈ కుర్రకారు బైక్ తీసుకొని రింగ్ రోడ్ మీదికి వెళ్ళి ప్రమాదకరమైన ఫీట్స్ చేస్తున్నారట. ఆ మధ్య ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు యాక్సిడెంట్‌లో.”

తల్లి మాటలు విని ముఖం చిట్లిస్తూ గయ్యిమని లేచాడు కౌశిక్.

“అమ్మా, ఇలా ఎప్పుడూ నెగటివ్‌గా ఆలోచిస్తూ భయపడతూ కూర్చుంటే లైఫ్‌లో ఎవ్వరూ ఏ పనీ చెయ్యలేరు. ఏదీ సాధించలేరు. ఎంతసేపూ చదువూ సంధ్యా లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లల గురించి, వాళ్ళకు ప్రమాదాల గురించి చెబుతావే గానీ బాగా చదువుకొని, వృద్ధిలోకి వచ్చి, ఘనకార్యాలు, సాహసాలు చేసే యువత గురించి చెప్పవేం?” అన్నాడు.

‘నిజమే’ అనిపించింది రంగనాథంకు, కొడుకు మాటలు వింటుంటే. ఎందుకంటే కౌశిక్ మొదటి నుంచీ ప్రతి క్లాసులో టాపర్‌గా ఉంటూ స్కూలు, కాలేజీ యాజమాన్యం ప్రశంసలనందుకునే ‘బెస్ట్ స్టూడెంట్. ‘బుద్ధిమంతుడ’ని ఇరుగుపొరుగులతో చుట్టపక్కాలతో ‘శభాష్’ అనిపించుకుంటూ వస్తున్నవాడు. ‘కనుకనే అలా మాట్లాడుతున్నాడు’ అనుకున్నాడు.

తల్లి సులోచనకు మాత్రం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు కాసేపు.

“లేక లేక కన్న ఒక్కగానొక్క కొడుకువిరా, నీకు ఏమన్నా అయితే ఈ తల్లిప్రాణం తట్టుకోలేదురా. చిన్నప్పటి నుంచీ గారాబంగా పెంచుకున్నాం” అంది కళ్ళనీళ్ళ పర్యంతం అవుతూ.

దాంతో తల్లి దగ్గరికి వెళ్ళి భుజం మీద చెయ్యేస్తూ “అమ్మా! తల్లికి, తండ్రికి బిడ్డ మీద ప్రేముండదని ఎవరంటారమ్మా? మీరు అతి గారాబంగా, నన్ను పెంచారనీ తెలుసు. అఫ్ కోర్స్, దాని వల్ల నేను ఉండాలనుకున్నట్లు వుండలేకపోయాననుకో!” అని నవ్వి, “ఆ విషయం అలా ఉంచితే అమ్మా. మీ అతి ప్రేమ, అతి భయాల మూలంగా నేను బయట మనశ్శాంతిగా వర్క్ చేసుకోలేకపోతున్నాను. ఆలస్యమైతే మీరు కంగారు పడతారని నా ధ్యాస అంతా మీ మీదే ఉంటోంది. ఒక్కోసారి అనుకున్న టైముకు పనికాకపోతే మధ్యలో వదిలేసి రావాల్సి వస్తోంది, నాన్నా! నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి. నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది. నాకో పెద్ద కోరిక ఉంది. అది నెరవాలంటే నేను చాలా కష్టపడాలి. ఎక్కువ సమయం పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి నా మానాన నన్ను వదిలేసి మీరు మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండండి, మీరు నా మీద నమ్మకం ఉంచితే, నాకు కొంచెం స్వేచ్ఛనిచ్చి నా మానాన నన్ను వదిలేస్తే నా కాలేజిలో నేను కూల్‌గా పనిచేసుకోగలుగుతాను. దయచేసి మీ ప్రేమను నా ఎదుగుదల అనే దారికి అడ్డు రానివ్వకండి. అది నా కాళ్ళకు బంధమవుతుంది, నా ఆలోచనలకు ఆటంకమవుతుంది” అన్నాడు కౌశిక్ తల్లిదండ్రుల వంక చూస్తూ.

అలా చెప్పాక, ఎన్నో రోజుల నుంచి అమ్మానాన్నలకు చెప్పాలనుకుంటున్న మాట ఆ రోజు చెప్పేసిన నిశ్చింత, రిలీఫ్ కనిపించాయి అతని ముఖంలో.

‘వింటున్నావా?’ అన్నట్టు భార్య వంక చూసాడు రంగనాథం.

‘నీ పిరికితనం మూలంగానే నేనూ భయస్థుడిగా మారాను’ అన్నీ ఆరోపణ వుంది ఆ ఒక్క ప్రశ్నలో.

కొడుకు మాటలు, భర్త ‘అంతా నీ మూలంగానే’ అన్నట్టున్న ఆ ప్రశ్న విన్న తర్వాత ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సులోచనకు.

‘నిజంగా నా ప్రేమ వాడి ఎదుగుదలకు అడ్డం వస్తోందా? ఈ కాలం పిల్లల తెలివితేటలని, చురుకుదనాన్ని, వాయువేగాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నానా? వాడన్నట్టు అన్ని ప్రతికూల ఆలోచనలు తప్ప అనుకూల ఆలోచనలు నా మనసు లోకి ఎందుకు రావు?’ అని ఆలోచనలో పడిపోయింది సులోచన మనసు.

***

కౌశిక్ ఆరడుగుల అందగాడు. అంత పొడగాటి దేహానికి తగినట్టు ధృడత్వం కలవాడు. దానికి తోడు శరీర బలాన్ని తలదన్నేంతటి మానసిక బలం! దేనికీ భయపడడు, దేనికీ వెనుకంజ వేయడు. యువ లోకానికే ఓ విలువైన రత్నం కౌశిక్.

ఏరోస్పేస్ ఇంజనీర్‌గా బాచిలర్ డిగ్రీ పూర్తి చేసాడు. అదే సబ్జెక్ట్‌లో ఎమ్.టెక్ చేస్తున్నాడు.

చిన్నప్పుడు తన ఇంటి ఆరుబయట మంచం వేసుకొని ఆకాశం వంక చూస్తూ పడుకున్నప్పుడు – ‘ఏమిటో ఆకాశం? అది నీలి రంగులోనే ఎందుకుంటుంది. అక్కడికెళితే ఆ ఆకాశం ఎలా కన్పిస్తుంది? సూర్యుడు, చంద్రుడు ఎలా ఉంటారు? ఆ నక్షత్రాలు అంత చిన్నవిగా అలా మినుకు మినుకుమని మెరుస్తుంటాయి ఎందుకు? ఆ మధ్య ఎవరో చెబుతుంటే విన్నాను, నక్షత్రాలు చందమామ కన్నా పెద్దవనీ.. చాలా దూరంగా వుండటాన అలా చిన్నగా కనపడతాయని – నిజమా?’ అని ఇలా ఎన్నో ఆలోచనలు, సందేహాలు ఆ చిన్ని మెదడు లోకి వస్తుండేవి.

వాటి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో లైబ్రరీకి వెళ్ళి అంతరిక్షశాస్త్ర పుస్తకాలను తీసి స్పేస్ గురించి, గ్రహ గమనాలను గురించి, అక్కడి వాతావరణం గురించి, భారరహిత స్థితికి కారణమైన ఏర్త్ గ్రావిటీ లేమి గురించే ఇలా ఎన్నో విషయాలను గురించి చదివి తెలుసుకునేవాడు. ఆ పుస్తకాల పేజీల మధ్య తల దూర్చి ఉన్నంతసేపూ బయటి ప్రపంచం తెలిసేది కాదు. స్కూలు ఉన్నంత సేపూ స్కూలులో మిగతా సమయాలు లైబ్రరీలో! ఇంటికెళ్ళగానే తల్లి సులోచన “నాలుగు గంటలకు స్కూలు వదిలి పెడితే ఇంతసేపూ ఎక్కడ తిరిగివస్తున్నావురా? ఫ్రెండ్స్‌తో సినిమాలూ, షికార్లా? ఇంటికొచ్చి హోమ్ వర్క్ చేసుకోవాలనీ, పరీక్షలకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలనే తెలియదా?” అని గర్జించేది.

“లైబ్రరీకి వెళ్ళొస్తున్నానమ్మా!” అంటే – “దేనికి? సినిమా మ్యాగజైన్లు, హర్రర్ కథలు, ప్రేమకథలు చదవటానికా? ఇంట్లో చదివితే మేము అరుస్తామని!” అంటూ దండకం చదివేది. డిగ్రీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ తీసుకున్నప్పుడు తండ్రి రంగనాథం “ఏ సివిలో,  మెకానికలో తీసుకోక, పోనీ సాఫ్ట్‌వేర్ జాబ్ చేయదలుచుకుంటే కంప్యూటర్ సైన్స్.. అంతవరకూ ఒకే గానీ, స్పేస్ గురించి నీకెందుకు? దానికి ఉద్యోగాలు వస్తాయా?” అంటూ డిస్కరేజ్ చేస్తూ మాట్లాడాడు.

తమది సగటు మధ్యతరగతి సంసారమనీ, తండ్రి రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైరయిన వాడనీ; తల్లి చిన్న చదువులు చదివిన హౌజ్ వైఫ్ అనీ తెలుసు కౌశిక్‌కి. వాళ్ళ ఆలోచనా ధోరణి, మాటతీరు అలాగే ఉంటాయనీ తెలుసు.

అలాంటి ఇంటి పరిస్థితిలో తను పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే – ‘ఉట్టికెగరలేని అమ్మ స్వర్గానికి ఎగురుదామని అనుకునట్టు’ అంటూ అమ్మ సామెతలు చెపుతుందనీ – నాన్న ‘మన స్థాయిని మరిచి పెద్ద పెద్ద కోర్కెలు పెట్టుకుంటే త్రిశంకు స్వర్గంలా అటూ, ఇటూ కాని సంకట పరిస్థితి ఏర్పడుతుంది నీకు- ఆలోచించుకో’ అని అంటారని తెలుసు కౌశిక్‌కు. అందుకే మౌనమే సమాధానంగా ఇచ్చి తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ప్రతి విషయాన్నీ పూస గుచ్చినట్టు చెప్పి వాళ్ళను భయాందోళనలకు గురి చెయ్యదలుచుకోలేదు. డాక్టర్ కొడుకు మాత్రమే డాక్టరు కాగలడని, కలక్టర్ కొడుకు మాత్రమే కలక్టర్ కాగలడని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ భావజాలం అలాంటిది.

‘రొటీన్ లైఫ్ స్టయిల్ మీద తప్ప అద్భుతాల మీద వాళ్ళకు నమ్మకం ఉండదు. రొటీన్ జాబులు తప్ప ‘కొంతమంది’ ఆశయాలలో మాత్రమే భాగమైన శాస్త్రపరిశోధనా రంగం వాళ్ళ ఆలోచనా పరిధి లోకి రాదు’ అనుకుని చాలా వరకు మౌనంగా ఉండిపోతాడు కౌశిక్.

వాళ్ళను కన్విన్స్ చేయటం అన్నది కూడా అంత సాధ్యమయ్యే పనికాదు. ప్రయత్నిస్తే తన ఎయిమ్ సడలిపోయి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. ‘మానసిక స్థిరత్వం అనేది ఒకసారి ‘కొంచెం’ జారిపోవటం అన్నది జరిగినా ఇక జీవితంలో ఏమీ సాధించలేం. ఏ ప్రభావాలకూ లొంగకుండా ఉండటం అన్నది తన తక్షణ కర్తవ్యం’ అనుకున్న కౌశిక్ ఒక రోజు తల్లిదండ్రులిద్దరినీ ఉద్దేశించి “నాకు ఇస్రోలో ఇంటర్న్‌షిప్  వచ్చిందమ్మా. వెళుతున్నాను” అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యంలో ఉండగానే సూట్‌కేస్ సర్దుకొని వెళ్ళిపోయాడు. కొన్ని నెలలకు మళ్లీ వచ్చి “నాకు ఇస్రోలో జాబ్ వచ్చింది.” అంటూ మళ్లీ వెళ్ళిపోయాడు.

‘ఏంటి వీడు? వీడు మాకు అర్థం కాడా? వీడు మా కొడుకేనా?’ అని అప్రతిభులవ్వటం రంగనాథం, సులోచనల వంతు అయింది.

***

సులోచన వంటింట్లో వంట చేసుకుంటూ వుంటే రంగనాథం సిటౌట్‌లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు.

ఉన్నట్టుండి ఒక వార్త మీద, ఒక ఫోటో మీద ఆయన దృష్టి నిలిచిపోయింది.

“ఇదిగో సులోచనా! ఒక వార్త.. ఇలా రా!” అంటూ భార్యకు వినిపించేలా పెద్దగా పిలిచాడు.

“ఏంటండీ?” అంటూ హడావిడిగా వచ్చింది సులోచన.

“ఇదిగో చూడు, మన అబ్బాయి కౌశిక్ విమానం నడపటానికి పైలట్ డ్రెస్‌లో ఎలా వెళుతున్నాడో. ఎంత దర్జాగా ఉన్నాడో చూడు. ‘వీడు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదో చేస్తుంటాడు – మనకు చెప్పడు’ అంటుంటావు కదా, ‘ఇది’ అక్కడ వీడు చేస్తున్న పని” అన్నాడు.

“ఏంటీ? మనబ్బాయి విమానం నడుపుతున్నాడా?! అంత పెద్ద విమానాన్ని అంత మంది జనాన్ని లగేజీని వేసుకొని పైన ఆకాశంలో, తనే గాల్లో ఎలా నడపుతాడండీ? బైక్ వేసుకొని బయటికి వెళితేనే ఇంటి కొచ్చేదాకా భయపడి చచ్చేవాళ్ళం ఇంతకు ముందు మనం” అంది సులోచన.

“విమానం నడపటం అంటే అంత పెద్ద విమానాన్ని నెత్తిన పెట్టుకొని మోస్తూ వెళతాడంటావా మన వాడు? కుర్చీలో కూర్చొని స్విచ్చులు నొక్కటమే. అంతా కంప్యూటర్ చేసుకుంటూ పోతుంది. ఆ మధ్య ‘కాశీ వెళ్ళాలని వుందిరా’ అంటే మనబ్బాయి మనిద్దరినీ ఫ్లయిట్‌లో తీసుకెళ్ళలేదూ.. ఎక్కావుగా నువ్వూ ఒకసారి” అని అడిగాడు రంగనాథం.

“వామ్మో – నాకు భయమేస్తోందండీ”

“ఎందుకు భయం? మనవాడు చదువుకున్న చదువు, వాడు అక్కడ తీసుకున్న ట్రయినింగు అదే! ఏం పరవాలేదులే.”

“అదేంటండీ. మీరు కూడా ఇలా మారిపోయారు! వాడ్ని వెనకేసుకొస్తున్నారేంటి?!”

“పిచ్చిమొహమా – కాలాన్ని బట్టి మనమూ మారాలే. ఇంతటి దైర్యసాహసాలు, ఇంతటి గొప్ప ఆశయాలు ఉన్న కౌశిక్ మన కడుపున పుట్టడమో మన అదృష్టం. మన ఆర్థికస్థాయికి, మన సగటుమనిషి ఆలోచనా ధోరణికి ఇంత ఉన్నత ఆశయాలు గలవాడు కొడుకుగా పుట్టడం అబ్బురం కాదూ – నువ్వు కూడా ఇలాంటి కొడుకును చూసి గర్వించటం నేర్చుకో. మనం ఇలా భయపడతామనే.. ముందుకు వెయ్యాల్సిన వాడి అడుగును వెనక్కి పట్టి లాగుతామనే మనకేదీ ముందుగా వాడు చెప్పడు. సాయంత్రం ఇద్దరం కలిసి వాడికి ఫోన్ చేసి శభాష్ అందాం. మనలోని మార్పుకు మురిసిపోయి మరింత ఎత్తుకు దూసుకెళ్ళిపోతాడు వాడు.” అన్నాడు రంగనాథం భార్యకు ధైర్యం నూరిపోస్తూ,

‘ఏంటో.. ఏం కాలమో ఇది.. ఈ రోజుల్లో పిల్లలు పిడుగులే గానీ, మనమే భయాందోళనలతో బితుకు బితుకుమంటున్నాం’ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది సులోచన, ‘తరాల అంతరం’ అని మనసులో అనుకుంటూ తనలో తనే ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు రంగనాథం.

***

ఆ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రపంచంలో ఒక కొత్త అధ్యాయం ఆరంభం కాబోతోంది. అంతరిక్ష పరిశోధనల కోసం స్పేస్ జట్‌లో వెళ్ళబోతున్న వ్యోమగాములయిన ముగ్గురు సైంటిస్ట్లలో కౌశిక్ శర్మ కూడా ఒకడని! ఇంకో పదిరోజుల్లోనే లాంచింగ్ ముహూర్తం. మాధ్యమాలన్నీ ఆ వార్తను కోడై కూస్తున్నాయి. ఆ ముగ్గురు ఆస్ట్రనాట్స్‌ను మాటిమాటికి టీ.వీ. తెరమీద చూపిస్తున్నారు. నవ్వుతూ చెయ్యి ఊపుతున్న కొడుకును చూసి రంగనాథం చిరునవ్వు నవ్వుతుంటే సులోచనకు మాత్రం గుండె ఆగినంత పని అవుతోంది.

“ఎక్కడికండీ వీడు వెళ్ళేది? ఆకాశంలోకా?” అని భార్య అడిగిన ప్రశ్నకు “అంతకన్నా ఎత్తుకు ఆకాశం దాటి అంతరిక్షానికి” అంటూ వివరాలు, తను పేపర్లో చదివినవి భార్యకు చెప్పాడు రంగనాథం.

“అక్కడ గాలి ఉండకపోతే వాడికి పాపం ఊపిరెలా ఆడుతుందండీ? కాళ్ళు కింద పెట్టడానికి పాదాల కింద భూమి లేకపోతే, అలా గాల్లో తేలుతూ ఎలా ఎంత సేపని వుంటాడు?” అని అడిగింది సులోచన కళ్ళనీళ్ళ పర్వంతం అవుతూ.

“అవన్నీ వాడికి ముందుగానే ట్రయినింగ్ ఇస్తారే. వాడు చూడు వచ్చిన అవకాశానికి ఎంత సంబరపడిపోతున్నాడో. ఆస్ట్రనాట్స్ కావాలనుకున్న వాళ్ళందరూ అంతరిక్ష యానానికి సెలక్ట్ కాలేరు. మనవాడు అయ్యాడు. ఎంత అదృష్టమో కదా”

“మీరు కూడా అలా మాట్లాడతారేంటండీ? అంత ఎత్తుకు వెళ్లటం అంటే మాటలా? మధ్యలో ఏమయినా జరిగి మన బిడ్డ వెనక్కు తిరిగి రాకపోతే?”

“సులోచనా – అబ్బా! అపశకునాలు పలకకు. నీలా అలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఏ సాహసకార్యం చెయ్యలేరు. స్పేస్ స్టేషన్‌లో వాడుండేది ఇరవై రోజులే – ఈ ఇరవై రోజుల్లో ఎన్నో పరిశోధనలు చేస్తారట. అక్కడి వాతావరణం గురించి మన శాటిలైట్ల పనితీరులో పురోగతి గురించీ – ఇలా! దాని వల్ల ముందుముందు ఎంతమందికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెల్సా! పూర్వం ఎంతోమంది సైంటిస్టులు అందించిన పరిశోధనా ఫలితాలను ఎన్నో దశాబ్దాలుగా, శతాబ్దాలుగా మానవాళి అనుభవించటం లేదూ? వాళ్లూ నీలాగే ‘మన ప్రాణాలకేమయినా ముప్పు ఉంటుందేమో’ అని భయపడితే ఇప్పుడు ఈ లోకం ఇలా ఉండేదా? సులోచనా – ఇన్నాళ్లూ మన కౌశిక్ అన్న మాటల భావం నాకు ఇప్పుడు బోధపడింది. పిల్లలు సాధించే విజయాల వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంటుందనీ, ఉండాలనీ, తన భర్తకో, తన కొడుకుకో నుదుటన వీర తిలకం దిద్ది యుద్ధభూమికి పంపే స్త్రీమూర్తులలో ఎంతటి మానసిక స్థిరత్వం, ధృడత్వం ఉంటాయో ఆ ప్లేస్‌లో నువ్వుండి ఒకసారి ఆలోచించుకో. మన దేశం, ఈ ప్రపంచం మొత్తం మన అబ్బాయికి జేజేలు పలుకుతోంది. క్షేమంగా తిరిగిరావాలని కోరుకుంటూ అందరూ ‘All the best’ చెబుతున్నారు. మనం ఇద్దరం మాత్రం ఇలా భయపడుతూ, కీడును శంకిస్తూ ఇంట్లో కూర్చుందామా చెప్పు?” అన్నాడు రంగనాథం భార్య ముఖం వంక చూస్తూ, అందులో వచ్చే హావభావాల మార్పులను గమనిస్తూ.

“మనం శ్రీహరికోట రాకెట్‌ని చూడటానికి వెళ్తాం. మన కౌశిక్‌ను అక్కున చేర్చుకొని అభినందనలు చెప్పి ఆశీస్సులు అందించి వద్దాం.” అన్నాడు రంగనాథం ఉత్సాహంతో.

“వెళ్దామండి. మన కౌశిక్‌కు నేను చేసిన గోంగూరపచ్చడి, దోసావకాయ అంటే ఇష్టం. ఇప్పుడే అవి తయారు చేసి రెండో సీసాల్లో సర్దేస్తాను” అంది సులోచన కొంగు దోపుతూ.

“బాగుందే జోక్! రామాయణమంతా విని – అంటూ ఓ సామెత ఉందే – అలా వుంది నీ వ్యవహారం. అక్కడ ఫుడ్‌ని కాప్సిల్స్ రూపంలో వాడతారు. వచ్చాక పెడుదువుగానే – ఎంత ఇరవై రోజులేగా?” అన్నాడు రంగనాథం.

తన అజ్ఞానానికి సిగ్గపడిపోయింది చిన్నపిల్లలా సులోచన.

Exit mobile version