[రాపాక శ్రీనివాస్ గారు రచించిన ‘ఆకలి తీరింది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
మధ్యాహ్నం సెంటర్లో నేను సతీష్ బస్సు దిగేసరికి కేదారి సఫారీ సూట్ వేసుకొని ఎదురుగనే ఉన్నాడు. మమ్మల్ని చూడగానే చిరునవ్వులు చిందిస్తూ ఎయిర్ ఇండియా మహరాజా ఫోజు ఒకటి ఇచ్చేశాడు. తను మేము నలభై ఏళ్ల కిందట పదవ తరగతి క్లాస్మెట్లము. అప్పటి మా బ్యాచ్మేట్ వాళ్ళ ఇంట్లోని శుభకార్యం దగ్గర్లో వున్న ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నాడని అటెండెన్స్ వేసుకోవడానికి వెళ్తున్నాం.
ఏప్రిల్ ఎండ గట్టిగానే కొడుతున్నా.. స్నేహితుల పలకరింపుతో, కుశల ప్రశ్నల సంధింపులతో చల్లబడిపోయింది ఆ మధ్యాహ్నం. ఇంకా వేడిగా ఉందని దోవలోని నూకుడు బండిపై ఉన్న చెరుకు రసాన్ని, చిన్ననాటి ముచ్చట్లనూ చప్పరిస్తూ ఆ కాస్త వేడిని చల్లపరిచాం. జ్యూస్ తాగుతూనే ఆ బండతన్ని అడిగాం, ఫంక్షన్ హాల్ ఎక్కడా అని. మంచోడే అనుకుంటా యథాలాపంగా ఎటోవైపు చేయి చూపెట్టి అటు వెళ్ళు అని నిర్లక్ష్యంగా చెప్పకుండా.. “వాకింగ్ డిస్టెన్స్ అండి, నడుస్తూ వెళ్లొచ్చు ఆ మూల తిరగగానే ఉంటుంది, ఫంక్షన్ హాల్ అందంగా ఉంటుంది” అని అడిగిన అడగని సమాచారం మొత్తం చెప్పేశాడు మర్యాదగా. నెమ్మదిగా బయలుదేరాం.
మా స్నేహితులకు ఎండ దెబ్బ తాకొద్దనేమో బజారెంబటి చెట్లు తమ నీడను మా ఒంటిపై నవనీతంలా పూస్తూన్నాయి, ఈ కాస్త ఓపిక చాలదూ చిన్ననాటి చిలిపి ముచ్చట్లు చెడుగుడు ఆడుతాంటే తాకిన దెబ్బల గురించి మాట్లాడుతుంటే కేదారి అందుకున్నడు కబడ్డీ ఆడుతుంటేనా దెబ్బలు తాకింది గూఢార్థమేదో ధ్వనించేలా సతీష్ కెలి చూస్తూ.. వానికి అర్థమయింది తనను ఉద్దేశించే అంటున్నాడని. ఇంకేముంది బలంగా చరిచాడు వాని వీపుపై. “ఇంకా ఎందుకు ఉలికిపాటు యాభైఅయిదు ఏళ్లకు వచ్చాం దాచుకోదగ్గ ముచ్చట్లు ఉన్నాయని” సంబరపడ్తూ అంటూ వానితో కొట్లాటకు దిగాడు కేదారి.
అలా ఆనందపు అలలపై మా నడక సాగుతూ ఉంటే సడన్‌గా అరిచాడు కేదారి, ఎదురుగా పాత బైకును మొబైల్ కంగనాలుగా మార్చి రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటున్న అతనిని చూపెట్టి “వాడు మన క్లాస్మేట్ చంద్రమౌళి కదా” అని, ప్రజల మధ్య ఉండడం వల్లో, ఏమో వానికి అందరూ ఎరికే. నేను సతీషూ అన్యమనస్కంగానే ఊ కొట్టాం. అప్పటిదాకా దంట పెట్టుకొని నడుస్తున్న కేదారి మా చేతుల విడిపించుకొని చంద్రమౌళి వైపు కదిలాడు అతనితో పాటు మేము కూడా.. ఆనందం ఆశ్చర్యం కలగలిపిన గొంతుతో “ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి ఏంటి ఇక్కడ కొత్తగా?” అంటూ ఎదుటివారికి స్పందించే సమయం ఇవ్వకుండానే ప్రశ్నలను సంధించాడు.
కూర్చోనే దుకాణం సదురుతూ సామానులవైపే చూస్తూ ఉన్న చంద్రమౌళి తనకు అత్యంత పరిచయం ఉన్న గొంతు వినబడేసరికి ఎవరా అని వెనక్కి తిరిగి చూసాడు అప్పుడు చూడాలి వాన్ని, కొలవడానికి ఏ కొలమానం సరిపోదు అంత దేదీప్యమానంగా ఆగుపడింది వాని ముఖం. గాబరా పడుతూ కళ్ళకున్న కళ్లద్దాలను సరి చేసుకుంటూ ఒక నిశ్చల భావన లోకి వెళ్లిపోయాడు. మరలా మొదలు ఆర్థికం, ఆరోగ్యం, స్థిరపడ్డ పిల్లలు అన్ని ముచ్చట్లు కనుక్కోవడం ఇటువైపు యాంత్రికంగా సాగిపోతూనే లోలోపల నా మనసు మాత్రం చిన్నప్పటి చంద్రమౌళిని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. నిజం చెప్పాలంటే ఓ పరాయి మనిషితో మాట్లాడే భావనే కలుగుతుంది నాకు. ఇంకా తను ఎవరో నాకు గుర్తుకు రావడం లేదు. కానీ తను మాత్రం బత్తసంచి చింపికుట్టిన నీల్ల క్యాన్ నుంచి నీటిని తన ఒంటిమిది అంగితో తుడిచిన గ్లాసులో వంపి భక్తితో ఇస్తున్నాడు దాహం తీర్చుకోమని, బండి పై ఉన్న చిన్న మొబైల్ ఫ్యానును మా వైపు తిప్పాడు ఎంతో ఇష్టంగా, ఎండవేడిమి మాకు తాకొద్దని. తను అమ్మే సెంటు సీసాలను ఓపెన్ చేసి మా ఒంటిపై సెంటును స్ప్రే చేస్తున్నాడు ప్రేమతో.. సహజంగా అతని చర్యలు చూస్తే కృష్ణుడికి కుచేలుడు చేసిన సపర్యాలు గుర్తుకు రావాలి కానీ నా మనసు నిమ్మలంగా లేదు అవన్నీ కృతకంగానే అనిపించాయి ఆతనిని సొంతం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు నా మనసు, ఈ నాటకీయత నుండి ఎలా తప్పించుకోవాలా అని అటు ఇటు చూస్తూ.. మేము ముగ్గురం వచ్చి నిలబడ్డా వాడు కూర్చొని లేవకుండానే మాట్లాడుతున్నడు చూడు వానికి ఎంత పొగరు అంటూ గుసగుసగా సతీష్ వైపు సయిగ చేస్తూ కూర్చున్న చంద్రమౌళిని చూశాను.
అంతే.. వేల పిడుగులు నెత్తిన పడ్డట్టుగా, సర్వశక్తులు కోల్పోయి కాళ్లు వణుకుతూ కూలబడ్డట్టుగా అనిపించింది నాకు. సతీష్ బుజం అసరాతో తడబడుతూ నిలబడ్డా.. మరోసారి నేను చూసింది నిజమేనా అని కళ్ళు తెరిచి సరిగ్గా చూసే ప్రయత్నం చేశా.. చంద్రమౌళి కూర్చున్నది వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చిన ట్రై సైకిల్ మీద, ఇంతసేపు తన రెండు మోకాళ్ళను కప్పి ఉంచిన తువ్వలముక్క క్రిందకు జారిపోయింది. అతడు అదేది గమనించట్లేదు మమ్మల్ని చూసిన ఆనందంలో.., మేమూ ఆకాశంలో ఎగిరే పక్షులను, నీలి మేఘాలను చూస్తున్నమే తప్ప నేల మీద ఏమి జరుగుతుందో చూడట్లే.. మొండిగా వేలాడుతున్న అతని రెండు కాళ్ళను చూసి తప్పు చేసిన భావనతో భూమిలోకి కుంగిపోతున్నానేమో అని అనిపించింది. అనుకోకుండానే నా చేతులు అతని మోకాళ్లను పట్టుకున్నాయి అప్పుడు గుర్తొచ్చింది అతను బడిలో నా వెనక బెంచి మీదనే కూర్చునే వాడని, నేనెప్పుడూ ముందుకు వెళ్లాల,ని పైకి ఎదగాలని కలలు కనేవాడిని, నన్ను అనుసరిస్తూ వస్తూ ఉంటే ప్రమాదంలో తన కాళ్లు పోగొట్టుకున్నానని చెబితే.. సిగ్గుతో చచ్చిపోయా, అప్పుడు వాడు ఆర్థిగా వచ్చిన కుచేలుడిలా కాదు, ధైర్యంతో స్థైర్యంతో యుద్ధాన్ని ముందుకు నడుపుతున్న రథసారధి కృష్ణుడిలా అగుపించాడు.
చంద్రమౌళిని కూడా ఎలాగైనా ఫంక్షన్ తీసుకెళ్లాలని కృతనిశ్చయముతో వున్న మేము బోజనానికి పోదాం పద అని చెప్పాం.. పిలవకుండా నేనా అని చేతులు పిసుక్కుంటూ చంద్రమౌళి వద్దు బాగోదు అన్నాడు. అదేమీ వినని మేము నువ్వు వస్తేనే మేము వెళతామని పట్టుపట్టాం. చాలసేపు బతిలాడక, సరే అయితే టాయిలెట్‌కి వెళ్లి వచ్చి షాప్ బంద్ చేసి మీతో వస్తా అని రెండు చేతుల మీదుగా దేకుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్టు చాటుగా వెళ్ళాడు.
అంతలో రోడ్డు మీదుగా పెద్ద ర్యాలి వస్తుంది దానికి నాయకత్వం వహిస్తున్న నాయకుడు అన్ని రంగుల గుడ్డలను ముక్కలుగా కత్తిరించి తయారు చేసుకున్న జెండాను పట్టుకొని గరీబి హటావో అని ఉత్సాహంగా నినదిస్తూన్నడు. అతని అనుసరిస్తున్న కార్యకర్తలు మరింత ఉత్సాహంగా చేతిలో మారణాలతో, చెవులు చిల్లులు పడే శబ్దాలు చేసే డీజేలు వెంటరాగ పాదాచారులను భయపెడుతూ, రోడ్డుమీది వాహనాలను ధ్వంసపరుస్తూ, చిరు వ్యాపారస్తుల తోపుడుబండ్లను పక్కకు నూకుతూ.. అందినకాడికి దోచుకుంటూ నానా హంగామా చేస్తున్నారు.
ర్యాలీ చంద్రమౌళి బండి దగ్గరకు వస్తుంది. కార్యకర్తలు ఆ బండిపై చేయేసి అవతలికినట్టే ప్రయత్నం చేస్తున్నరు. వాడేమో టాయిలెట్‌కి వెళ్ళిండు, మేము అడ్డుగా నిలబడ్డాం. కార్యకర్తలు ముసుగులో ఉన్న కొందరు బండి పై వస్తువులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నరు. ఒకరిద్దరి పిడికిళ్లను విడిపించగలిగాము కానీ ఒకేసారి ముగ్గురు నలుగురు మీద పడ్డారు తోడేళ్లలా.. చంద్రమౌళి ముఖం ఓడిపోయిన భావంతో ధైన్యంగా అగుపించింది మా కళ్ళలో.. అంతే బండి మీద వస్తువులను దోచుకోబోతున్న ఒకరి ప్యాంటు నడుము పట్టిని ఒక చేత్తో, మరొక ఆడామె జాకెట్ భుజంపై భాగాన్ని మరొక చేత్తో పట్టుకొని.. ఇంకొకరి చేతిని నోటితో కరచిపట్టి ఆపగలిగిన.. సతీష్ తన రెండు చేతులను బారగా చాపి బండికి రక్షణ కవచంలా నిలబడ్డడు. ఇక కేదారి తనకు బండి నడపరాకున్నా.. దేవుడు పూనినట్టుగా క్లచ్ పట్టుకొని బండిని పక్కన ఉన్న పెట్రోల్ బంకులోకి తోసుకోపోయిండు.
ర్యాలీ వెళ్ళింది. రోడ్డు కుక్కలు చెప్పిన విస్తరిలా, పేద తల్లి ఒంటి మీద అతుకుల బొంతలా.. చంద్రమౌళి రోడ్డు మీదకు వచ్చాడు. ఆత్రుతగా ఆందోళనగా చూశాడు తన బతుకుబండి ఎక్కడా అని.. అగుపిస్తలేదు. ఆగమాగం అవుతుంది అతని మనసు, అయిపోయింది తన జీవనోపాధి పోయింది, తనిక బ్రతకడం దండగని వలబోతున్నాడు. కళ్ళలో నీళ్లు సుడిలా తిరుగుతూ ఏమీ కనిపించడంలేదు. చేతులతో గుండెల బాదూకుంటున్న చంద్రమౌళి దగ్గరకు సతీష్ పరిగెత్తుకుంటూ వెళ్లి బండి వున్న బంకు దగ్గరికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆ బండి, మా స్నేహం ఎంతో విలువైనదిగా అగుపించింది చంద్రమౌళికి.
దుకాణం మూసి బండిని బంకులో పార్కింగ్ చేసిన చంద్రమౌళితో కలిసి ఫంక్షన్‌కి వెళ్లి మిగతా మిత్రులతో కూడి తిన్న బంతి భోజనం మా కడుపులనే కాదు మనసును నింపింది నిండుగా.
