[8 మార్చ్ 2025 మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఆకాశంలో సగం’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
ప్రపంచ సాహిత్య చరిత్రను పరిశీలించి చూస్తే భారతీయ సాహిత్యంలో కనపడే స్త్రీత్వ ఛాయలు మరే సాహిత్యం లోను కనిపించవు. పాశ్చాత్య రచయితలు తత్వవేత్తలు భారతీయ మహిళను అనేక దృష్టికోణాలలో పరిశీలించి “భారతదేశపు స్త్రీ కనుపాపలలో ఉండే నిర్మలత్వం, ప్రేమ, అనురాగం, సహనం వంటి గుణాలు ప్రపంచంలో మరే మహిళలోను కనుపించవు” అని పేర్కొని స్త్రీని పరిపూర్ణ మూర్తిగా పరిగణించారు. భారతదేశం నందలి కవులు అర్ధనారీశ్వర తత్వంను ప్రతిపాదించి పురుషునితోపాటు స్త్రీకి సమాన ప్రాతినిధ్యమును ఆపాదించారు. వేద వాఙ్మయములో గార్గి, మైత్రేయి వంటి విదుషీమణులు పండిత సభలలో పాల్గొన్నట్లు ఉదాహరణలు చూపారు. తర్వాత వచ్చిన రాజకీయ వ్యవస్థల కారణంగా స్త్రీలపై జరిగే అత్యాచారాలతో స్త్రీవిద్య అంతరించి పురుషాభిజాత్యం ప్రబలింది.
ఆ తర్వాత 17వ శతాబ్ద కాలంలో ముద్దుపళని, రంగాజమ్మ వంటి కవయిత్రులు కాకతిరుద్రమ, ఝాన్సీలక్ష్మీబాయి వంటి వీరనారీమణులు మనకు దర్శనమిస్తారు. తర్వాత బ్రిటిష్ వారి కాలంలో కూడా స్త్రీ విద్య అంతంత మాత్రంగానే ఉన్నది. మాతృస్వామ్య వ్యవస్థ దూరమై స్త్రీ పూర్తిగా అణిచివేతకు గురయి లైంగిక వివక్షకు గురికాసాగింది. సాంప్రదాయవాదుల అణచివేతలతో కేవలం ఇంటికే పరిమితమైన మహిళ తరువాత సంస్కర్తవాదులైన కందుకూరి, గురజాడ , రాజారామ్మోహన్ రాయ్ వంటి సంస్కర్తల ఆలోచనల యజ్ఞంలో నుంచి ఆధునిక మహిళ పురుడు పోసుకున్నది. సమాజంలో ఒక మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నది.
అప్పుడే 1975-85 సంవత్సరములు అంతర్జాతీయ మహిళాదశాబ్ద సంవత్సరముగా గుర్తించి, మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళ దినోత్సవంగా ప్రకటించింది ప్రభుత్వము. విద్య, వైద్య, వైజ్ఞానిక, పారిశ్రామిక, క్రీడా, కళా రంగాలలో ప్రథమ స్థానం సాధించింది. మహిళా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి పదవులను అలంకరించింది.
ఆధునిక మహిళ చరిత్రను తిరగ వ్రాస్తుంది అని వంద సంవత్సరాల క్రితం గురజాడ అన్నమాటలు అక్షర సత్యమైనాయి. అందుకే అంటారు “కవిః క్రాంతదర్శిః” అని. స్త్రీ విద్య కోసము కవులు తమ రచనల ద్వారా ఎంతగానో కృషి చేశారు. అంతే కాదు ఒక ప్రత్యేకతను సంపాదించుకోవటానికి స్త్రీని కూడా పురుషునితో పాటు సమానంగా ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వము అనేక విధాల ప్రోత్సాహములను కల్పించింది. కొద్దిపాటి ఆదాయముతో కుటుంబమును సమర్థించగలిగిన ఇల్లాలు అతి సమర్థవంతంగా దేశ ఆర్థిక ప్రణాళికలను సైతం చక్కదిద్ద గలదు. అందుకే ఆర్థిక మంత్రిగా ఒక స్త్రీ ఎంపిక చేయబడినది.
స్త్రీ అను సంయుక్తాక్షరములో సమస్తము ఇమిడి ఉన్నది. ‘స’ కారమనగా సత్త్వ గుణము, ‘త’ కారమనగా తమోగుణము, ‘ర’ కారమనగా రజోగుణమనియు అర్థము. ‘ఈ’ కారము ప్రాణాక్షరము కామ బీజాక్షరమని అని అర్థములను చెప్పుకొనినచో త్రిమూర్తులకు నిలయములగు సత్వ రజస్తమోగుణములకు ప్రతీకయగు ఏకరూపమే స్త్రీ.
నేటి బాలలే రేపటి పౌరులు
నేటి బాలికలే రేపటి మహిళలు
మహిళ బలవంతురాలైన కొద్దీ పురుషుడు శక్తిహీనుడైనట్లు భయపడుతాడు. అందుకే పోటీ ప్రపంచంలో ఆమె అడుగు పెట్టిన తర్వాత అనేక ఆటంకాలు సృష్టించబడ్డాయి. నేడు జనాభాలో సగభాగం స్త్రీలు ఉన్నారు. మహిళా ప్రగతి నేడు అన్ని రంగాలలో విస్తరిస్తున్నది. బహుళజాతి అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహించే విషయంలో మహిళలు ముందున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలలో నిర్వహించబడిన సర్వేలో దాదాపు 46 శాతం మంది మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు. దానికి కారణం అందరిని కలుపుకుపోయే వారి మనస్తత్వమే. సమాజంలో ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, వ్యతిరేకతలు ఎదురైనా సహనంతో ఎదుర్కొనే గుణమే ఆమె విజయాలకు మూలం.
అయినప్పటికీ వైవాహికపరంగా కుటుంబపరంగా, సామాజంలో నాడు నేడు అనేక అవమానములను లోనవుతూనే ఉన్నది. స్త్రీ వ్యక్తిత్వం గురించి ఆలోచించరు. ధైర్యాన్ని పెంచుకొనగలిగినప్పుడు ఎంతటి కష్టతర పరిస్థితులను అయినా ఎదుర్కొనగలదు. తనంత తానుగా స్వయంశక్తితో ఎదగగల ఓర్పు నేర్పులు ఆమె స్వంతం. కనుకనే అన్నిఆటంకాలను, అణచి వేతలను లెక్క చేయక అణువునుంచి అంతరిక్షందాకా ఎదిగి తన ప్రతిభా వ్యుత్పత్తులతో ఆకాశంలో సగం తానంటూ మహిళా సాధికారతను నిరూపించుకున్నది. స్త్రీశక్తికి ఎదురులేదని నిరూపించింది. ఆడది తలచుకుంటే అమ్మలా లాలించగలదు, పాలించగలదు, ఆది శక్తిలా హుంకరించగలదు. ఇదే ఏనాడయినా, ఏయుగంలోనయినా మహిళలయొక్క
గొప్పతనం. అందుకే
యత్రనార్యస్తు పూజ్యంతే
తత్ర రమంతే దేవతా
అన్నారు. స్త్రీలు గౌరవించబడినచోట సిరులు పండాయి అవమానించినచోట ఎడారులయ్యాయని. అదే స్త్రీశక్తి గొప్పతనం. అందుకే ఒకరోజుకాదు ప్రతిరోజు ఆమెకే స్వంతమని ఘంటాపథంగా చెప్పవచ్చు.