[శ్రీమతి జె. శ్యామల రచించిన ‘ఆకుపచ్చని ఆశ!’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
బాల్కనీలో నిలుచున్న వసుధ చూపంతా ఎదురింటి తోట మీదే ఉంది. “అబ్బ! ఎన్ని పూల మొక్కలు. ఆ మందారాలయితే గాలికి సుతారంగా ఊగుతుంటే చేయి ఊపి పలకరిస్తున్నట్లే ఉంది. గులాబీలైతే చెప్పక్కర్లేదు, ‘మేమే రాణీలం’ అన్నంత విలాసంగా హొయలొలక బోస్తున్నాయి. మల్లియలు ‘తెల్లందనాలలో లేరు ఇలను మా సాటి’ అన్నట్లు ప్రత్యేకంగా ఉంటే, కనకాంబరాలు ‘మా రంగు తీరే వేరబ్బా’ అన్నట్టున్నాయి. “వసూ!” అన్న పిలుపుకు ఉలిక్కిపడి పక్కకు తిరిగింది.
చూస్తే సూర్య! ఆమె ఉలికిపాటుకు నవ్వుతూ “నువ్వు అంతలా చూస్తే ఆ చెట్లకు దిష్టి తగిలేను” అన్నాడు.
“నేనేం దిష్టి పెట్టడం లేదు. ఆ తోట అందాన్ని ఆస్వాదిస్తున్నాను” చిరుకోపంగా అని లోపలికి నడిచింది.
సూర్య రిఫ్రెష్ అవడానికి వెళ్ళాడు.
వసుధ వంటింట్లోకి నడిచి చపాతీ పిండి కలిపింది.
సూర్య రాగానే కాఫీ కలిపింది.
టీవీ చూస్తూ ఇద్దరూ కాఫీ తాగారు.
ఆ తర్వాత లేచి చపాతీలు చేస్తుండగా పిల్లలు ట్యూషన్ నుంచి రానే వచ్చారు. వసుధ అందరికీ ప్లేట్లలో చపాతీ పెట్టి, పొద్దున చేసిన మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అంతా వచ్చి కూర్చుని తినడం మొదలుపెట్టారు.
అంతలో పెద్దవాడు అజయ్ “డేడీ! ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్” అన్నాడు.
“డేడీ! వచ్చే వారమే నా బర్త్‌డే. కొత్త డ్రెస్ ఎప్పుడు కొంటావ్,! క్లాసులో క్యాడ్‌బరీ చాక్లెట్లు పంచాలి. మామూలివి ఇస్తే నవ్వుతారు” అన్నాడు.
“అన్నీ నేను చూసుకుంటా. ముందు మీరు బాగా చదవండి” అన్నాడు సూర్య.
‘ఏం చూస్తాడో ఏమో. రాబడికి, ఖర్చుకు పొంతన లేదు. ఇద్దరివీ ప్రైవేట్ ఉద్యోగాలు. పెద్ద జీతాలేం కాదు. పైగా సూర్య నెలలో ఆరు సార్లయినా మందు తాగుతాడు. ఆ విషయంలో తానెంత వారించినా మార్పు లేదు’ మనసులోనే అనుకుంది వసుధ.
***
రాత్రి పదకొండయినా వసుధకు నిద్రపట్టలేదు.
సూర్య కూడా కదులుతూనే ఉన్నాడు.
“ఏమండీ!” సూర్యని చేత్తో తడుతూ పిలిచింది.
“ఊ.. చెప్పు” అన్నాడు సూర్య.
“మీ దగ్గర డబ్బుల్లేవని తెలుసు. రేపు అజయ్ ఫీజు, విజయ్ డ్రెస్ ఎలా? పైగా ‘నేను చూసుకుంటా’ అన్నారు. ఏం చూసుకుని ఆ ధైర్యం?” అడిగింది.
“అట్లా అనకపోతే పిల్లలతో ఏం చెపుతాను. అప్పో సొప్పో చేసి అయినా చేయాల్సిందే. పోనీ నీ దగ్గర రహస్య నిధి ఏమైనా ఉందా?” నవ్వుతూ అడిగాడు.
“నాకు అంత సీన్ ఎక్కడుంది? ఎంత పొదుపుగా ఖర్చు చేసినా మిగులేమీ కనబడడం లేదు. మీరు మందు అలవాటు మానుకోవచ్చు కదా. కొంతయినా ఆదా అవుతుంది. మందు వల్ల ఆరోగ్యం దెబ్బ తినడం, ఆసుపత్రి ఖర్చు తప్ప ఏమొస్తుంది చెప్పండి” అంది వసుధ.
“టాపిక్ నా మందు మీదికి మళ్ళించావా? అది తప్ప వేరే ఏదైనా చెప్పు. అయినా రోజు తాగుతున్నట్టు గొడవ. రేపు ఏదో ఒకటి చేస్తా కానీ ఇప్పటికి నన్ను పడుకోని” అంటూ పక్కకు తిరిగాడు.
“హు.. ఈ మనిషి మారతాడనుకోవడం నా భ్రమ” అంటూ తానూ పక్కకి తిరిగి నిద్రను ఆహ్వానించింది వసుధ.
***
ఆరోజు ఆదివారం. భోజనాలయ్యాక వసుధ “పంట డబ్బులు వచ్చి ఉంటాయి కదా. మీ అన్నయ్య డబ్బు పంపుతానన్నాడా?” సూర్యని అడిగింది.
“మొన్ననే ఫోన్ చేశాడు. ఈ సారి పంటలు సరిగా పండలేదట. డబ్బులేం లేవు. ఓ బస్తా బియ్యం పంపుతా, అంతకంటే ఏం చేయలేను అన్నాడు” చెప్పాడు సూర్య.
“ఎప్పుడూ ఏదో ఒకటి చెపుతారు. పొలం వాటాలు పంచుకోమంటే నన్ను శత్రువు లాగా చూస్తారు. ఆదాయం మాట వచ్చేసరికి మొండి చేయి చూపుతారు. అసలు వాళ్ళను అనుకోవడం ఎందుకు? మనమే ఈ అటు, ఇటు గాని ఉద్యోగాలను విడిచిపెట్టి, మన భాగం పొలం తీసుకొని సొంతంగా వ్యవసాయం చేసుకుంటే సరి. ఇంటి ముందు చక్కని తోట, చల్లని గాలి, హాయిగా, ప్రశాంతంగా ఉండక, ఈ సిటీలో ఎప్పటికప్పుడు అప్పులు చేసుకుంటూ.. తీర్చుకుంటూ.. అగచాట్లు పడుతూ బతకడం ఎందుకు?” ఆవేశంగా అంది వసుధ.
“వీరనారీ వసుధమ్మా, ఆగవమ్మా. పిల్లల చదువుల మాటేమిటి? మనక్కూడా సిటీ లైఫ్ అలవాటైంది. ఊరికిపోతే నాలుగు రోజులు లేదంటే ఓ వారం బాగుంటుంది. ఆ తర్వాత తోచదు. వ్యవసాయం అంటే ఆఫీసులో సీట్లో కూర్చుని పని చేసినట్లు కాదు. అది మన వల్ల అయ్యే పని కాదు కానీ టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది. డిస్టర్బ్ చేయకు” టాపిక్ ముగించి, రిమోట్ అందుకున్నాడు సూర్య.
***
కాలం పరుగులు తీస్తోంది. వసుధ పట్టుబట్టి, పొలం వాటాలు పంచేలా చేసింది. పట్టా పుస్తకం చేతికి రావడంతో ఆమెకు కొద్దిగా ధైర్యం వచ్చింది. రైతుబంధు డబ్బులు పడుతున్నాయి. అజయ్ ఇంజనీరింగ్‌లో చేరాలంటే మళ్ళీ డబ్బు సమస్య మొదలైంది. బ్యాంకు లోనుతో సమస్య తీరింది. విజయ్ ఇంటర్‌లో చేరాడు. కష్టాలు, కోపతాపాలు, తగవులు, అంతలోనే పొంగుకొచ్చే ప్రేమలు, చిన్ని చిన్ని సంతోషాలు అనుభవిస్తూనే వసుధ, సూర్యం సంసారం సాగిస్తున్నారు. అజయ్ ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. తమలాగా కాకుండా అజయ్ పెద్ద జీతంతో ఉద్యోగం సాధిస్తాడు అని ఆశ పడుతున్న వేళ, సూర్యకు సుస్తీ చేసింది. తీవ్రమైన కడుపు నొప్పి. ఆసుపత్రి, వైద్యం, మందులు.. సిగరెట్, మందు మానమని డాక్టర్ల సలహా. ‘విన్నారా’ అని వసుధ అంటే సూర్య అసహనపు చూపులు..
ఓ నెల ఇబ్బంది పడ్డాక సూర్య కోలుకున్నాడు. ఇంటికి వచ్చాక ఓ రెండు వారాలు బుద్ధిగానే ఉన్నాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లో లేని సమయాల్లో సిగరెట్ కాల్చడం, మందు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఉద్యోగం, పిల్లలు, ఇంటి పనులు వీటన్నిటి మధ్య వసుధ ఆ విషయం గుర్తించలేదు. ఒకరోజు ఆమె తలనొప్పిగా ఉందని ఇంటికి వచ్చేస్తే తలుపు తీసే ఉంది. భయంగా తొంగి చూస్తే సిగరెట్ తాగుతూ సూర్య. పక్కనే బాటిల్. “దొంగచాటుగా ఎప్పటినుంచి తాగుతున్నారు? డాక్టర్ చెప్పినా కూడా లెక్కలేదా? నీకేమన్నా అయితే నేను, పిల్లలు ఏంకావాలి? మా గురించి ఆలోచనే లేదా? మాకంటే మందే ఎక్కువా?” కోపంతో, బాధతో నిలదీసిన వసుధ, ఆగని దుఃఖంతో కూలబడింది.
సూర్య మత్తు దిగిపోయింది. “ఇదే లాస్ట్ టైమ్. ఇంక తాగను. ఒట్టు. వసూ ప్లీజ్ ఏడవకు” అంటూ బాటిల్ ఒంపేశాడు.
వసుధ దుఃఖాన్ని దిగమింగి కళ్ళు తుడుచుకుంది. అతడి మాట మీద నమ్మకం లేకున్నా చేసేది ఏముంది?
అర్ధరాత్రి సూర్యకు మళ్ళీ కడుపు నొప్పి మొదలైంది.
“హాస్పిటల్ కు వెళ్దామా?” అడిగింది కంగారుగా.
“టాబ్లెట్ వేసుకుంటున్నాలే. రేపొద్దున చూద్దాం. ఏం కాదు, నువ్వు పడుకో” అన్నాడు సూర్య.
దిగులు, అలసట, నీరసంతో కొద్ది సేపటికే ఆమెను నిద్ర ఆవహించింది..
తెల్లవారింది. అలారం మోతకు వసుధ ఉలిక్కిపడి లేచి, దాన్ని ఆపింది. సూర్య వైపు చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ‘హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాలి. త్వరగా తయారు కావాలి’ అనుకుంటూ “ఏమండీ! లేవండి” అంటూ చేత్తో తట్టింది. కదలిక లేదు. ఏదో భయం. గట్టిగా తట్టి పిలిచింది. కళ్ళు తెరవనే లేదు. “అజయ్” గట్టిగా అరిచింది. అజయ్ నిద్ర కళ్ళతోనే పరుగెత్తుకు వచ్చాడు. వెనకే విజయ్. “నాన్న.. నాన్న” ఏడుస్తూ అతడి వైపు చూపించింది. పిల్లలిద్దరూ ఏడుస్తూ “డాడీ! డాడీ” అంటూ సూర్యను పట్టుకు కుదిపేస్తున్నారు.
ఆ తర్వాత పొరుగు వాళ్ళు రావడం, పెదవి విరుస్తూ, డాక్టర్‌ను పిలిపించడం, డాక్టర్ వచ్చి చనిపోయాడని నిర్ధారించాడు. బంధు, మిత్రుల రాకలు, ఓదార్పులు.. సూర్యకు అంతిమ సంస్కారం అన్ని ముగిశాయి. మనసెంత రోదిస్తున్నా, పిల్లలకు అండగా ఉండాలని ధైర్యం తెచ్చిపెట్టుకుంటోంది. అజయ్‌కి ఉద్యోగం వచ్చింది. ఆనందించే విషయం అయినా అది పంచుకునేందుకు సూర్య లేడనే విచారం మరో వైపు. అయినా ఏదీ ఆగదు.
విజయ్ చదువు కూడా పూర్తయింది. ముంబైలో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు. వసుధకు తన రొటీన్ ఉద్యోగం విసుగనిపిస్తోంది. పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొద్దికాలంలో పెళ్ళిళ్ళు కూడా అవుతాయి. వాళ్ళ జీవితాలు వాళ్ళవి. తన సంగతి? చిన్నప్పటి నుంచి తోటలంటే ఉన్న ఇష్టం ఇంతకాలం తీరనే లేదు. ఊరు వెళ్ళి తనే పొలం చూసుకుంటే..తన ఆకుపచ్చని ఆశ ఫలించదా?
అదే మాట అజయ్‌తో అంది.
“అమ్మా! నన్ను వదిలి వెళ్తానంటున్నావు. నేనెలాగో కాలక్షేపం చేస్తాను. కానీ నువ్వు అక్కడ ఒంటరిగా ఉండగలవా? నీకు అదంతా అలవాటు లేని పని. శ్రమ కదా” అన్నాడు అజయ్.
“కొన్నాళ్లుగా, ఇక జీవితం ఇంతేనా. ఇక్కడే ఆగిపోవాలా అన్న ప్రశ్న నా మనసు పదేపదే అడుగుతోంది. ఇష్టమైన పని కష్టం కాదని, సాధించాలని అనిపిస్తోంది. ప్రయత్నించడంలో తప్పేముంది. పెదనాన్న వాళ్ళు మాట సాయం అయినా చేస్తారుకదా. ఇప్పటివరకు సాగు చేయకపోయినా సాగు గురించి చాలా విషయాలు చదివి, విని తెలుసుకున్నాను. చేయగలననే నమ్మకం ఉంది. ఆర్గానిక్ పద్ధతుల్లో సేద్యం చేస్తాను. పంటలు కూడా మారుస్తాను” చెప్పింది.
“భలే అమ్మా. నీకు అవగాహన ఉందన్నమాట. సరే నీ ఇష్టం నేను కాదనను. నీకు ఏదన్నా సమస్య వచ్చినా నాకు వెంటనే కాల్ చెయ్” అన్నాడు.
ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేయడం, ఇతరత్రా సర్దుబాట్లు చకచకా ముగించింది. అనుకున్నట్లే తోటపేటకు వెళ్ళింది. బావగారు, తోటికోడలు ఆమె చెప్పింది విని “ఎంతైనా చదువుకున్నదానివి. అట్లాగే కానీ” అన్నారు.
ఇంటి ముందు కూడా కొత్త మొక్కలు తెప్పించి ఒక పద్ధతి ప్రకారం నాటింది. తక్కువకాలంలో కాపుకొచ్చే పండ్ల మొక్కలను కూడా నాటింది. పొలం చేస్తున్న వారితో కూడా మాట్లాడి, తన ఆలోచన చెప్పి, వారికి సలహాలిస్తూ పని చేయించడం మొదలుపెట్టింది. రోజు దగ్గరుండి, అన్నీ పర్యవేక్షిస్తూ, కొన్ని సలహాలిస్తూ, కొన్నిసార్లు మెచ్చుకుంటూ, తమతో పాటే తింటూ, ఎన్నో వైజ్ఞానిక విషయాలు చెపుతున్న ఆమె పట్ల పనివారికి కూడా అభిమానం ఏర్పడింది. దాంతో పనిపట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయి. జరుగుతున్న మార్పుల్ని వసుధ, పిల్లలకు కూడా ఎప్పటికప్పుడు చెపుతూ తన సంతృప్తిని పంచుకోవడంతో, పిల్లలు కూడా సంతోషించారు. కాలం గిర్రున తిరిగింది. వసుధ కోరిక నిజమైంది. పంట గతంలో కంటే బాగా పండింది. ఇంటిముందు కలలు గన్న పూలతోట నిజమై వెలిసింది.
ఆ సంక్రాంతికి అజయ్, విజయ్ తోటపేటకు వచ్చారు. ఆహ్లాదకరంగా ఉన్న ఇంటిని, చేనుని చూసి అమ్మను అభినందించారు. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నానని వసుధ మనసు సంతోషాల తోటే అయింది.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
