[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘ఆలోచన మార్చుకుంటేనే..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
అటుగా వెళుతున్న మూర్తిగారిని చూసిన శేఖరం, ‘చూస్తుంటే ఇతను పెళ్లి సంబంధాలు చూసే మూర్తిలా అనిపిస్తున్నాడే’ అని నెమ్మదిగా అతని వెనకాలే నడిచి వెళ్ళి, “మూర్తిగారూ” అని పిలిచాడు. ఆ వ్యక్తి ఏం వినబడనట్టు నడిచేస్తున్నాడు. ‘ఇతను మూర్తిగారు అయిండడు. అతనే అయితే, ఇలా పిలిస్తే పలికేవాడు కదా’, అని వెళ్లిపోబోతూ, ‘కావాలని పలకకుండా వెళ్లిపోతున్నాడా, ఎందుకైనా మంచిది ఒకసారి మొహం చూద్దాం’ అని కొంచెం వేగంగా నడిచి వెళ్ళి అతని మొహంలో మొహం పెట్టి చూసి, కాస్త గట్టిగా నవ్వుతూ, “అరే మూర్తిగారు, ఎలా ఉన్నారు. మీరా కాదా అని తన్నుకు చచ్చాను. మీకు నేను చాలాసార్లు మీకు ఫోన్ చేశాను. కానీ మీరు బిజీ అనుకుంటాను, లిఫ్టు చేయలేదు” అని క్షణం ఆగి, “ఓ పదినిమిషాలు మా ఇంటికి రండి, లోనికి వెళ్లి టీ తాగుతూ మాట్లాడుకుందాం” అన్నాడు చిరునవ్వుతో.
మూర్తిగారు వాచీ చూసుకుంటూ, “కొంచెం పని ఉంది. వీలు చూసుకుని మరెప్పుడైనా మీ ఇంటికి వస్తాను. అప్పుడు టీ ఏవిటి ఖర్మ, ఏకంగా రోటీ తినే వెళ్తాను. సరేనా” అంటూ వెళ్లిపోబోయాడు.
“ఆ పప్పులు నా దగ్గర ఉడకవు. మీరు ఇప్పుడు మా ఇంటికి రావాల్సిందే, టీ తాగాల్సిందే. అయినా ఓ పది నిమిషాలకి కొంపలు మునిగిపోవుగానీ రండి”. అన్నాడు శేఖరం.
చేసేదేం లేక “సరే పదండీ, రాక చస్తానా, వస్తాను.” అంటూ శేఖరాన్ని అనుసరించాడు.
మూర్తిగారు పెళ్లిళ్ల పేరయ్య. మంచి పెళ్లి సంబంధాలు వెతికి మరీ పట్టుకొస్తుంటాడు. అతను కుదిర్చిన సంబంధాలు అన్నీ కూడా పచ్చగా ఉన్నాయ్. ఎవరికీ ఏ గొడవలు లేవు, అందరూ కూడా చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. ఇప్పుడని కాదు, అతనికి గత ముప్పై ఏళ్ల నుండి అదే పని. దాంతో శేఖరం కూడా, తన కొడుక్కి ఓ మంచి సంబంధం చూడమని అతనికే పురమాయించాడు. అయితే గత మూడేళ్లుగా అతని కొడుక్కి మాత్రం సంబంధం కుదర్చలేక పోతున్నాడు. శేఖరం సంబంధం కుదరక అయోమయం అయిపోతున్నాడు. దాంతో ఆయన ఫోన్ చేసినా పెళ్లిళ్ల పేరయ్య మూర్తి ఫోను లిఫ్టు చేయడం లేదు.
మూర్తిగారు సంబంధాలు తీసుకొస్తూనే ఉన్నారు. అయితే దాంట్లో వారికి ఏదో ఒక చిన్న లేదా పెద్ద లోపం కనిపిస్తూనే ఉంది. అన్నీ నచ్చితే అవతలి వాళ్ళు వద్దనేవారు. మూర్తిగారు కూడా శేఖరం కుటుంబాన్ని బలవంత పెట్టలేదు. అలా గడిచిన మూడేళ్ళుగా వచ్చ్హిన సంబంధాలు వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోవడంతో ఏవి కుదరలేదు. పైగా మూర్తిగారు ఈ మధ్య శేఖరం ఫోన్ లిఫ్టు చేయకపోవడంతో, ఇలా కలిసిన మూర్తిని శేఖరం, ఇంటికి ఆహ్వానించాడు.
సోఫాలో కూలబడిన మూర్తిగారిని “ఏమిటి ఈ మధ్య మీరు మా మీద సీత కన్ను వేశారు. ఇవ్వాళ మీరు నాకు కనబడ్డారు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను, మా ఆవిడ కలిసి మీ ఇంటికి వచ్చి మరీ మీతో గొడవపెట్టుకుని అటో ఇటో తెల్చుకోవాలనుకున్నాం.” చెప్పాడు శేఖరం
“ఏదో నా ఎరుకలో ఉన్న పెళ్లి సంబంధాలు చూసి పెట్టేవాడిని. అవి కుదరలేదు. ఇందులో మీరు నాతో గొడవ పెట్టుకునేంత నేరం నేనేం చేశానండీ బాబూ. తెలిసో తెలియకో ఏవైనా పొరబాట్లు నా నుండి జరిగి ఉంటే, మీరు పెద్ద మనసు చేసుకోవాలి.” అంటూ బిక్క మొహం వేసి పిచ్చి చూపులు చూశాడు మూర్తి.
“నేరం అంటే, అంత పెద్దది కాదు లెండి. మీరు ఎంతో కాలంగా నాకు తెలుసు. మన మధ్య మంచి స్నేహం కూడా ఉంది. అలాంటిది, హఠాత్తుగా మీకు ఏమైందో ఏమో కానీ, ఉన్నట్టుండి మీరు మా కుటుంబానికి దూరంగా జరిగిపోయారు. ఎంతలా అంటే, నేను మీకు చాలా సార్లు పనిగట్టుకుని ఫోన్లు చేసినా లిఫ్టు చేయలేదు. మా కాలనీలోకి అప్పుడప్పుడూ వస్తూ వెళుతున్నారని తెలిసింది. కానీ కనీసం ఒక్క సారి కూడా మా ఇంటి వైపు వచ్చి, నన్ను ఓ మాట పలకరించి కూడా వెళ్లలేదు. ఏం జరిగిందో బుర్ర బద్దలు కొట్టుకున్నా వివరం అర్థం కాలేదు. మీరు ఇలా మా నుండి దూరం జరగడానికి కారణం వివరంగా చెబితే కానీ, మిమ్మల్ని ఇక్కడి నుండి కదలనిచ్చేది లేదు” చెప్పాడు శేఖరం కాస్త సూటిగా చూస్తూ.
మూర్తి కాస్త తత్తర బిత్తర చూపులు చూస్తూ, ఇబ్బందిగా చేతులు నలుపుకుంటూ, “అది మరీ ఏమీ లేదండి. మీరు ఏమనుకోకపోతే, ఒక పది నిమిషాలలో వెళ్ళిపోవాలి” చెప్పాడు మూర్తి కాస్త కంగారుగా.
కొత్త మనిషిలా మాట్లాడడం అతనికి అర్థం కాలేదు. శేఖరం మళ్ళీ మొదలుపెడుతూ, “ఎనిమిది నెలలుగా మీరు మాకు అసలు టచ్ లోనే లేరు. విషయం వివరంగా చెప్పండి. నేనేం అనుకోనులెండి. మా నుండి ఏదైనా దోషం ఉంటే సరిదిద్దుకుంటాం” చెప్పాడు
“అదీ, మరీ, సూటిగా చెప్పాలంటే, మీ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడమని మూడు సంవత్సరాల క్రితం మీరు నాకు చెప్పారు. సరే అని నేను కూడా మీ అబ్బాయి కోసం సంబంధాలు చూడటం మొదలు పెట్టాను. అప్పటి నుండే అసలు కథ మొదలైంది. నేను అమ్మాయిల గుణగణాలు గురించి మీకు చెబితే, మీరు కట్న కానుకలు గురించి అడిగేవారు. అమ్మాయి చదువు గురించి చెప్తే, మీరు ఆమెకి ఎంత బంగారం ఉందని వాకబు చేసేవారు. నేను కూడా ఆడపిల్ల తండ్రినే. మీ ఇంటికి ఏ ఆడపిల్ల అయినా వస్తే, ఆ అమ్మాయి సుఖపడుతుంది అని నేను ముందు నమ్మాలి కదా. ఆ నమ్మకం నాకు మీ కుటుంబం విషయంలో కలగలేదు. మీరు మరీ అంత కమర్షియల్‌గా ఆలోచిస్తుంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే మీ గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పి, ఆడపిల్ల తరుపు వారిని మరో సంబంధం చూసుకోమనేవాడ్ని. నెలలు గడిచినా, అన్ని పెళ్లి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోయినా, మీలో కనీస మార్పు రాకపోగా, కట్నం, పెట్టి పోతలపై ఆశ రోజు రోజుకీ పెరిగిపోతుండడంతో, ఇక మీ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే మీకు దూరం జరిగిపోయాను” చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు శేఖరం.
