Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆమె ఎవరు?

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘ఆమె ఎవరు’. రచన శ్రీ సింగీతం ఘటికాచల రావు.]

మయం సుమారు రాత్రి ఏడుగంటల ప్రాంతం. బస్సు రిపేర్ కావడంతో సాయంత్రం ఆరు గంటలకే రావలసిన బస్సు ఆలస్యంగా వచ్చింది. అందులోనుంచి దిగిన ఒకమ్మాయి ఒంటరిగా చిమ్మచీకటిగా ఉన్న దారిలో పరిసరాలన్నీ భయం భయంగా చూస్తూ నడిచి వస్తున్నది. సరిగ్గా హవేలీ దగ్గరకు వచ్చేసరికి కెవ్వున గుండెలవిసేలా భయంకరమైన కేక వినబడింది. ఆ వెంటనే చెట్టు పైనుంచి ఒక మానవకారం ఆమె ముందుకు దూకింది. చుట్టూ చీకటి ఉండడం మూలాన కంటికెదురుగా ఎవరున్నారో కనబడలేదు. వెంటనే తన మొబైల్ టార్చ్ ని ఆ దిశగా ప్రసరింపజేసిందా అమ్మాయి. కొద్ది దూరంలో ఆపాదమస్తకం నల్లని వస్త్రధారణతో ముంగురులు గాలికెగురుతుండగా, మొబైల్ టార్చ్ వెలుతురులో నీలం రంగు గోళీల్లా మెరుస్తున్న కళ్ళతో ఒక మానవకారం కనిపించింది.

ఆ ఆకారం చూడగానే హడలిపోయి తాను విన్న దానికన్నా మరింత పెద్దగా కేక పెట్టి వెల్లికిలా పడి దిగ్గున లేచి వెనక్కు తిరిగి చూడకుండా గ్రామంలోకి పరుగు లంకించుకున్నదా అమ్మాయి. ఇల్లు చేరుకునేసరికి చెమటతో తడిసిపోయింది. కాళ్లు వణసాగాయి. గొంతు తడారిపోయింది. నాలుక తడబడసాగింది. ఏమైందని ఇంట్లో వాళ్ళడిగే ప్రశ్నకి జవాబు చెప్పలేకపోతున్నది. చాలాసేపు అడిగిన తర్వాత మెల్లగా జరిగిందంతా తండ్రికి చెప్పింది. ఆ అమ్మాయి ప్రవల్లిక, ఆ గ్రామ సర్పంచ్ కూతురు.

***

పట్టణంలో ఉద్యోగం చేస్తున్న ప్రవల్లిక ప్రతి రెండు వారాలకొకసారి సొంత ఊరుకి వస్తుంది. పట్టణంనుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లె అది. పల్లెకు రెండు కిలోమీటర్ల దూరంలో తారు రోడ్డు ఆగిపోతుంది. అక్కడినుంచి కాలిబాటనే పల్లెకు చేరుకోవాలి. దారిలో దాదాపు అరకిలోమీటరు మేరకు దట్టమైన కారడవిలాంటి ప్రదేశం. సాయంత్రం ఆరుగంటల తర్వాత ఆదారిలో జనసంచారమే ఉండదు. చీకటి పడ్డాక ఆ దారిలో వెళ్ళాలంటే అందరికీ హడల్. ఈ భయం ఈ మధ్యకాలంలోనే ఏర్పడింది. అందుకు కారణం ఊరి చివర ఉన్న పాడుబడ్డ ఇల్లు. అది ఒకప్పటి ఆ ఊరి జమీందారుగారి రాజప్రాసాదం లాంటి భవనం. ఏడాది క్రితం అంతు తెలియని వ్యాధితో జమీందారు కుటుంబ సభ్యులందరూ గతించారని అందరూ అనుకుంటారు. జమీందారు గారి ఏకైక కూతురు మాత్రం మిగిలిపోయింది. ఆ అమ్మాయి పేరు నీరజ, వయసు పాతికేళ్ళు. కొన్నాళ్లకు ఆమె సైతం కనిపించకుండా పోయి ఆ భవంతి నిర్మానుషమైంది.

జమీందారువల్ల గ్రామస్తులకు ఏనాడూ ఎటువంటి ఇబ్బంది కలిగిన దాఖలాలు లేవు. మరి జమీందారును గ్రామస్తులంతా ఎందుకు దూరం పెట్టారో ఎవరికి అర్థంకాని విషయమైంది. ఒక్కసారి మాత్రం సర్పంచ్ కు జమీందారుకు ఏదో గొడవ జరిగిందన్న విషయం గ్రామ ప్రజలందరికీ తెలుసు.

ఆ తర్వాత నెల రోజులకే జమిందార్ కుటుంబం మొత్తం గతించింది. ఆ ఊర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ వాళ్లను పరీక్షించి ఏదో విష జ్వరం కారణంగానే వాళ్ళందరూ చనిపోయారని చెప్పాడు.

జమీందారు కూతురు పక్కనున్న పట్టణంలో హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. సాధారణంగా వారాంతానికి ఇంటికి వస్తుంది. ఆరోజు నీరజ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెకేం చేయాలో ఎవర్నడగాలో తోచలేదు. ఆ సమయంలో భవంతి పరిసరాలలో తచ్చాడుతూ ఆమె కంటపడిన మొదటి వ్యక్తి గ్రామ సర్పంచ్. కొద్దిరోజుల క్రితం సర్పంచ్ తండ్రితో గొడవ పడుతుండటం ఆమె చూసింది. ఐతే ప్రస్తుతం అతనక్కడ ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు నీరజ సర్పంచ్ కంట పడలేదు. గ్రామంలో విచారించినా విషయం అర్థం కాలేదు. గ్రామస్తులంతా ఆ అమ్మాయిని అసహ్యించుకున్నట్టుగా చూశారు. అలా ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు. గ్రామంలో సహజంగా జరిగే గొడవలే అనుకుంది.

అంతకుముందు కొద్దిరోజుల క్రితం పట్టణంనుంచి కొంతమంది వచ్చి పల్లె పరిసరాలను పరిశీలించి వెళ్లడం ఆమెకు తెలుసు. ఆరోజు సాయంత్రం తండ్రితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటల ద్వారా తమ పల్లె లోపలికి రోడ్డు వేయబోతున్నారని పాఠశాల కూడా కట్టబోతున్నారని అర్థం చేసుకుంది. అయితే రోడ్డుకు సంబంధించిన పనుల్లో సమస్యలు ఉన్నట్టు తండ్రి చెప్పాడు. అదేమిటంటే ఊరి లోపలికి వెళ్లాల్సిన రోడ్డు తమ పొలం మధ్య నుంచి వెళ్లాలని ప్రతిపాదన చేశారు. అందుకు జమీందారు ఒప్పుకోలేదు. వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత జమీందారుకు గ్రామ సర్పంచ్ కి రోడ్డు విషయమై మాటా మాటా పెరిగింది. రోడ్డు పొలం మధ్యనుంచి వస్తేనే దానివల్ల ఖర్చు తగ్గుతుందని సర్పంచ్ తెగేసి చెప్పడంతో జమీందారు విపరీతమైన అసహనానికి లోనయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డును తమ పొలం మధ్యనుంచి వెళ్ళనివ్వనని ఖరాఖండిగా చెప్పేశాడు. రోడ్డు కోసం ఎంత దూరమైనా వెళ్లగలనని ఏమైనా చేయగలనని సర్పంచ్ తెగేసి చెప్పడంతో జమిందార్ ఆవేశం కట్టలు తెచ్చుకుంది.

సర్పంచ్ మెడ పట్టుకుని ఒక్క తోపు తోసేసాడు. అవమానం భరించలేని సర్పంచ్ ‘నీ అంతు చూస్తానని నీ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసైనా సరే పల్లెకు రోడ్డు వేయిస్తా’నని శపథం చేసి మరీ బయటికి వెళ్లిపోయాడు. జమీందారు గురించి ఉన్నవి లేనివన్నీ కల్పించి గ్రామ ప్రజలకు చెప్పేశాడు.

ఈ సంఘటన జరిగిన తర్వాత సరిగ్గా నెల రోజులకే జమీందారు కుటుంబం మొత్తం అకాల మరణం చెందారు. ఆ సమయంలో నీరజ లేకపోవడం వల్ల ఆమె మాత్రం బతికి బయటపడింది.

జరిగిన సంఘటనకు సర్పంచికి తప్పకుండా సంబంధం ఉందని నీరజ అర్థం చేసుకుంది. కానీ దాన్ని ఋజువు చేసేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఏమి చేయలేక మౌనం వహించింది.

సర్పంచ్ మాత్రం శత్రు శేషం ఉండకూడదన్న ఆలోచనతో అప్పుడప్పుడు భవంతికి వచ్చి నీరజ కోసం చూసి వెళ్లేవాడు. ఎలాగైనా ఆమెను కూడా అంతం చేయాలని అతని ఉద్దేశం. విషయం అర్థం చేసుకున్న నీరజ మాత్రం ఆనాటినుంచి అతనికంట పడలేదు.

నిజంగానే గ్రామంలోకి రోడ్డు వేయదల్చుకుంటే ఒక అరమైలు పక్కకు వెళ్లి తమ పొలం సరిహద్దును ఆనుకుని గ్రామంలో లోపలికి దారి వెయ్యవచ్చు. కానీ సర్పంచ్ తన పంతమే నెగ్గాలన్న భావనతో మాట మాట పెరిగి పరిస్థితులు ఇలా పరిణమించాయి. సర్పంచ్ నాలుగైదు సార్లు భవంతి పరిసరాల్లో తచ్చాడడం గమనించిన నీరజ అతను కచ్చితంగా తనను అంతం చేసేందుకే వచ్చాడని నిర్ధారణ చేసుకొంది. తన తండ్రిని కుటుంబ సభ్యులను అంతం చేసి కనీసం శరీరాలను కూడా దక్కకుండా చేసింది కూడా అతనేనని అర్థమైపోయింది. ఎవరికీ ఏనాడూ ఏ విధమైన అపకారం చేయని జమీందారు అకాల మరణాన్ని గ్రామ ప్రజలు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడంతో మొత్తం గ్రామంమీదే విరక్తి కలిగింది నీరజకు. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గ్రామానికి ఎటువంటి సౌకర్యాలు కలగనివ్వకూడదని, గ్రామ ప్రజలను నిరంతరం ఇబ్బందులకు గురి చేసినందుకే కంకణం కట్టుకుంది నీరజ.

ఒకరోజు సాయంత్రం ఊరిలోని ఒక వ్యక్తి చీకటి పడ్డాక గ్రామంలోపలికి వస్తూ ఉండగా హఠాత్తుగా అతని ముఖం పైన ఏదో ద్రావకం పడినట్టై బాధతో విలవిలలాడిపోయాడు. దానితో అతని ముఖమంతా మాడిపోయింది. ఆ వ్యక్తి సర్పంచ్ కి బాగా కావలసిన వ్యక్తి. రెండు రోజుల తర్వాత మళ్లీ అలాంటిదే సంఘటన జరిగింది. ఈసారి ఆ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఆ సంఘటనకు బలయ్యాడు. అతనికి కూడా ఒళ్లంతా కాలిపోయింది. జమీందార్ భవనంలో ఎవరూ లేరు కానీ అక్కడే ఏదో మర్మం ఉందని గ్రామస్తులందరూ భయపడిపోయి అప్పటినుంచి సాయంత్రం చీకటి పడ్డ తరువాత ఆ దారిన రాకపోకలు సాగించడం మానేశారు. ఆ భయం కారణంగా చాలామంది గ్రామం విడిచి పక్క గ్రామాలకు వలస వెళ్లిపోయారు. దాంతో గ్రామం జనాభా సగానికి సగం తగ్గిపోయింది. కానీ ఇప్పటికీ భవనం పరిసరాల్లోని మర్మమేమిటో ఎవరికి అర్థం కాలేదు.

***

“ఇంతకు సమస్య ఏమిటి? ఎందుకొచ్చింది?” అడిగాడు ఎస్సై.

కూతురు చెప్పిన మొత్తం విషయాన్ని ఎస్ఐకి చెప్పాడు సర్పంచ్.

“విచిత్రంగా ఉందే. ఇలాంటి కేసు నేను ఇప్పటివరకు వినలేదు” అన్నాడు ఆశ్చర్యంతో ఎస్సై.

“ఇది మొదటిసారి కాదండి. ఇలాంటి సంఘటనలు పాతిక పైగా జరిగాయి గ్రామంలో”

అది విన్న ఎస్ఐకి ఛర్రున కోపం వచ్చింది. “మరి ఇన్ని రోజులు రిపోర్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు? అంటే సమస్య మీకు వచ్చేవరకు దాని గురించి పట్టించుకోరన్నమాట. అలాంటి మీరు ఈ ఊరికి సర్పంచ్” అంటూ అరిచాడు ఎస్సై. మౌనంగా తలదించుకున్నాడు సర్పంచ్.

“నేను ఒకసారి ఆ హవేలీ చూడాలి” అన్నాడు ఎస్సై.

అప్పుడు ఉదయం పది గంటలు. వెంటనే బయలుదేరామన్నాడు సర్పంచ్.

“నోనో. సాయంత్రం ఆరు గంటల పైనే అక్కడికి వెళ్లాలి. అది కూడా ఒంటరిగానే వెళ్తాను. ఆ స్థలం మాత్రం ఇప్పుడే చూపించండి” అన్నాడు.

“ఇందులో చూపించేందుకేమీ లేదు సార్. మనం వచ్చే దారిలో ఎడం పక్కన కనబడే ఆ హవేలీనే నేను చెప్పింది” అని చెప్పాడు సర్పంచ్. తల పంకించి బయలుదేరి వెళ్ళిపోయాడు ఎస్సై.

సాయంత్రం సుమారు ఏడు గంటల ప్రాంతానికి ఎస్ఐ భవంతి దగ్గరికి వచ్చాడు. చుట్టూ చిమ్మచీకటిగా ఉంది. మెల్లిగా అడుగులు వేసుకుంటూ భవంతి ముఖద్వారాన్ని సమీపించాడు. కంటికెదురుగా ఏముందో కనబడటం లేదు. అతను మొబైల్ టార్చ్ వేయ దల్చుకోలేదు. చీకట్లోనే మెల్లగా తడుముకుంటూ గేటు వద్దకు చేరి, తోయగానే కిర్రుమని శబ్దం చేస్తూ గేటు తెరుచుకుంది.

సరిగ్గా ఒక్క నిమిషం గడవగానే ధడేలున తన ముందుకు ఎవరో దూకినట్టు అయింది.

శరీరంపై రోమాలు నిక్కబొడుచుకోగా ఒక్కడుగు వెనక్కి వేశాడు. ఇప్పుడిక టార్చ్ వేయక తప్పలేదు. టార్చ్ వేయగానే ఎదురుగా నల్లని మానవకారం కనిపించింది. క్షణమాలస్యం చేయకుండా వెంటనే లంఘించి ఆకారంపై పడిపోయి దాని జుట్టును తన చేతిలోకి తీసుకున్నాడు ఎస్సై.

కెవ్వును కేక వినిపించింది. అదొక ఆడ గొంతు. వెంటనే తన చేతిలో ఉన్న టార్చ్ వెలుగు ఆమె ముఖంపైకి ప్రసరింపజేసి “ఎవరు నువ్వు?” అంటూ అరిచాడు. అతడి పట్టు విడిపించుకునేందుకు శతవిధాల ప్రయత్నించసాగింది. జుట్టు పట్టుకుని బలంగా లాగి నేలమీదకు తోసేశాడు ఎస్సై.

వెంటనే తన జేబులో నుంచి తుపాకి తీసి ఆకారానికి గురి పెట్టాడు.

“ఆగు” అనేసి ఆ ఆకారం వెంటనే వెనుదిరిగి భవంతి లోనికి వెళ్ళింది. ఎస్ఐ ఆమెను అనుసరించాడు. లోపలికి వెళ్లి దీపం వేసి తన ఒంటిపైనున్న నల్లని ముసుగును తొలగించింది.

సుమారుగా పాతికేళ్ల యువతి అక్కడ నిలబడి ఉంది.

“ఎవరు నువ్వు?” అని అడిగాడు ఎస్సై మళ్ళీ.

“నా పేరు నీరజ. జమీందారు కూతురును. ఎవరికీ ఏ అపకారం చేయని మా నాన్నను అకారణంగా పొట్టన పెట్టుకున్న గ్రామ ప్రజల సంతోషాలను హరించి వేయాలని కఠోర నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళకు సహాయం చేసేవాళ్లను, అంటే ప్రస్తుతం నిన్ను కూడా వదలను” అంటూ గట్టిగా నవ్వింది.

నీరజ చెప్పింది విన్న ఎస్ఐ “చూడమ్మాయ్. నువ్వు నన్నేమి చేయలేవు. అయినా ఏ ఆధారాలు లేకుండా నువ్విలా చేయడం సరికాదు. ప్రస్తుతానికి ఎవరికీ ఏ విధమైన ప్రాణాపాయం జరగలేదు కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను. ఇకనైనా ఇలాంటి పనులు మానుకో” అని హెచ్చరించాడు.

మౌనంగా తల దించుకున్నది నీరజ. ఎస్ఐ లేచి బయటకు నడిచాడు.

సరిగ్గా గేటు తెలుసుకుని బయటికి వెళ్లే సమయంలో ఎవరో ఎదురుగా వస్తున్నట్లు కనిపించింది. హఠాత్తుగా ఆ భవంతి ఆవరణలో నాలుగైదు దీపాలు వెలిగాయి ఒక అమ్మాయి లోపలికి వస్తూంది.

నిశితంగా పరిశీలించి చూసాడు ఎస్సై. క్షణంపాటు తను చూసిందేమిటో అర్థం చేసుకోలేక వెనక్కు తిరిగి చూశాడు. తన వెనుక ఇంట్లో ఎవరూ లేరు.

“ఎవరండీ మీరు? ఏం కావాలి?” అని అడిగిందా అమ్మాయి.

ఎస్ఐ ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

కొద్దిసేపటిక్రితం ఇంట్లో తను చూసిన నీరజ ఆ అమ్మాయి. అయోమయంలో క్షణంపాటు పరిసరాలన్నీ పరికించి కెవ్వును కేక పెట్టి అక్కడనుంచి ఊరు బయటకు పరుగు తీశాడు ఎస్సై.

అలా పరిగెడుతున్న ఆ ఎస్సైని చూసిన నీరజ ఉప్పెనగా నవ్వింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా తన ప్రతిరూపాన్ని ఇంట్లో సృష్టించి అతన్ని భయభ్రాంతుణ్ణి చేసింది నీరజ. కొన్నాళ్లకు గ్రామం పూర్తిగా ఖాళీ అయిపోయింది.

Exit mobile version