[ఒక స్ట్రీట్ ఫోటోగ్రాపర్ గురించి ‘ఆమె ఎవరు?’ అనే పేరుతో వ్యాసం అందిస్తున్నారు శ్రీమతి శ్రీదేవీ మురళీధర్.]
ఒక మహిళ. మెడలో రోలీకార్డ్ కెమెరా. అద్దంలో తన ప్రతిబింబాన్ని తానే చూస్తూ నిలబడింది. ఆ కెమెరా ఎన్నో వేల ముఖాలను చిత్రీకరించింది. కానీ దాని వెనుక ఉన్న మహిళ ఎవరో మాత్రం ప్రపంచానికి తెలియదు.
ఆమె జీవితమంతా తన చుట్టూ ఉన్న మనుషులను గమనించింది. వీధుల్లో తిరిగింది. తనకు ఎదురైన దృశ్యాలను కెమెరాలో బంధించింది. లక్షకు పైగా ఛాయాచిత్రాలను సేకరించింది. కానీ వాటిని ప్రపంచానికి చూపించలేదు. తన ప్రతిభ గురించి ఎవరికీ చెప్పుకోలేదు. తాను సృష్టిస్తున్న అపూర్వమైన కళాసంపదకు ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందనే ఆశతో జీవించినట్లు కూడా ఆధారాలు లేవు.
అసలు ఆమె ఎవరు? అంతటి ప్రతిభను ఎందుకు రహస్యంగా ఉంచింది? తాను తీసిన చిత్రాలను ఎవరి కంటా పడకుండా దాచుకోవలసిన అవసరం ఏమిటి?
ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలంటే ఒక అసాధారణమైన మహిళ జీవితంలోకి ప్రవేశించాలి.
చికాగోలో సంపన్నుల ఇళ్లల్లో పిల్లల దాయిగా పనిచేసిన వివియన్ మాయర్, తన జీవితంలో ఎక్కువ భాగం ఎవరి దృష్టినీ ఆకర్షించకుండా గడిపింది. పిల్లలను ప్రేమగా సంరక్షించేది. వారిని వెంటబెట్టుకుని నగరమంతా తిరిగేది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించినవారికి సమాధానాలకంటే ప్రశ్నలే ఎక్కువగా మిగిలేవి.
2009లో, ఎనభైమూడేళ్ల వయసులో, ఒక వృద్ధుల సంరక్షణ కేంద్రంలో ఆమె ఒంటరిగా కన్నుమూసింది.
ఆమె మరణించే సమయానికి ప్రపంచానికి తెలియని ఒక అపురూపమైన కళాసంపద అప్పటికే ఇతరుల చేతుల్లోకి చేరిపోయింది.
ఆమె జీవితకాలంలో వెలుగుచూడని వేలాది ఛాయాచిత్రాలు, నెగెటివ్‌లు అనుకోని పరిస్థితుల్లో బయటపడ్డాయి. వాటిని పరిశీలించినవారు ఆశ్చర్యపోయారు. వీధి ఫోటోగ్రఫీలో ప్రపంచప్రఖ్యాతి పొందిన కళాకారుల సరసన నిలవగల ప్రతిభ ఆ చిత్రాల్లో కనిపించింది.
అంతటి ప్రతిభ కలిగిన మహిళ ఇన్నేళ్లూ ఎవరికీ తెలియకుండా ఎలా జీవించింది?
ఆమె చిత్రాల్లో కనిపించిన మనుషులు, నగరాలు, జీవితాలు అందరికీ పరిచయమైనవే. కానీ వాటిని చిత్రీకరించిన మహిళ మాత్రం అంతుచిక్కని వ్యక్తిగా మిగిలిపోయింది.
వివియన్ మాయర్ జీవితాన్ని అన్వేషించే ప్రయత్నంలో బయటపడిన వివరాలు ఆమె ఛాయాచిత్రాలంత ఆసక్తికరమైనవి. ఫ్రెంచ్ యాసతో మాట్లాడే ఆ మహిళ ఎవరు? ఎక్కడికి వెళ్లినా కెమెరాను ఎందుకు వెంట తీసుకెళ్లేది? తాను సృష్టించిన చిత్రాలను ఇతరుల కంటపడకుండా ఎందుకు కాపాడుకునేది?
ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నమే “ఫైండింగ్ వివియన్ మాయర్” అనే డాక్యుమెంటరీ చిత్రానికి దారితీసింది. ఆ చిత్రం ఆమె అసాధారణ ప్రతిభను కొత్త తరానికి పరిచయం చేసింది. అయితే ఆమె కళను తెలుసుకున్న కొద్దీ, ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆవరించిన అనామకత్వం, ఆమె అవలంబించిన రహస్య ప్రవృత్తి మరింత ఆసక్తిని, ఉత్సుకతను రేకెత్తించాయి.
వివియన్ మరణానంతరం ఆమె ఛాయాచిత్రాలను వెలుగులోకి తీసుకువచ్చిన జాన్ మాలోఫ్ అనే యువ వ్యాపారి, ఆమె జీవిత విశేషాలను అన్వేషించే క్రమంలో అనేక ఆసక్తికరమైన విషయాలను గుర్తించాడు. చికాగో స్థానిక చరిత్రను తన పుస్తకం కోసం పరిశోధిస్తున్న మాలోఫ్, పనికి రావచ్చనుకుని ఒక వేలంలో ఆమె నెగెటివ్‌లను కొనుగోలు చేశారు. ఆ సంఘటన అతడిని ఒక అసాధారణమైన ఛాయాగ్రాహకురాలి జీవితాన్వేషణ వైపు నడిపించింది.
నేటిలా సాంకేతిక పరిజ్ఞానం అందరికీ సులభంగా అందుబాటులో లేని కాలమది. తీసిన చిత్రాన్ని వెంటనే చూసుకునే అవకాశం లేదు. చిత్రీకరణలో జరిగిన పొరపాట్లు తెలుసుకోవాలన్నా, సరిదిద్దుకోవాలన్నా ఫిల్మ్‌ను డెవలప్ చేసే వరకు వేచి ఉండాల్సిందే. ఫోటోగ్రఫీలో శిక్షణ పొందేందుకు అవసరమైన ఆర్థిక స్థోమత గానీ, అత్యాధునిక పరికరాలను సమకూర్చుకునే అవకాశం గానీ వివియన్‌కు లేవు. అయినా, ఆ పరిమితులేవీ ఆమె కళాసాధనకు అడ్డుకాలేదు.
ఎవరూ నేర్పకుండానే ఆమె తనకు తానుగా నేర్చుకుంది. వెలుతురు ప్రసరించే తీరును, నీడల మధ్య కనిపించే సూక్ష్మమైన తేడాలను, మనుషుల ముఖాల్లో క్షణకాలం మెరిసి మాయమయ్యే భావాలను నిశితంగా పరిశీలించింది. ప్రతి ఛాయాచిత్రం ఆమెకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. ప్రతి ప్రయత్నంతో తన దృష్టిని మరింత పదును పెట్టుకుంది. సాంకేతిక సౌకర్యాల కంటే పరిశీలనాశక్తి, ఓర్పు, సరైన క్షణాన్ని గుర్తించగల వివేచన ముఖ్యమని ఆమె చిత్రాలు నిరూపిస్తాయి.
వివియన్ ప్రతిభలోని విశేషం కేవలం ఆమె తీసిన ఛాయాచిత్రాల సంఖ్యలో లేదు. ఇతరులు గమనించకుండా దాటిపోయే సాధారణ దృశ్యాల్లోనూ ఆమె ఒక ప్రత్యేకతను గుర్తించగలిగింది. అందరూ చూసే ప్రపంచాన్నే ఆమె భిన్నంగా చూసింది. ఆ చూపును నిరంతర సాధనతో పరిపక్వం చేసుకుంది. తన కళకు ఇతరుల ప్రశంసలు లభిస్తున్నాయో లేదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా, తనకు తానే విమర్శకురాలిగా, తన అనుభవాన్నే గురువుగా చేసుకుని ఒక అసాధారణమైన ఛాయాగ్రాహకురాలిగా ఎదిగింది.
1926 ఫిబ్రవరి 1న న్యూయార్క్ నగరంలో ఫ్రెంచ్ తల్లికి, ఆస్ట్రియన్ తండ్రికి వివియన్ జన్మించింది. అమెరికా, ఫ్రాన్స్‌ల మధ్య ఆమె బాల్యజీవితం సాగింది. దాదాపు 1930 నుంచి తండ్రి పేరు రికార్డుల్లో లేదని మాలోఫ్ చెబుతాడు.
ఆ సమయంలో వివియన్, ఆమె తల్లి, పందొమ్మిదో శతాబ్దంలో జన్మించిన జీన్ బెర్ట్రాండ్ అనే పేరొందిన చిత్రపట ఫోటోగ్రాఫర్‌తో ఆమె ఇంట్లో నివసించేవారు.
1930 నాటి జనగణన వివరాల ప్రకారం, జీన్ కుటుంబ పెద్ద. జీన్ బాల్యం కూడా ఒక కష్టాలకడలి. పేదరికంలో పెరిగింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. కుట్టు కర్మాగారంలో కఠినమైన పరిస్థితుల మధ్య పనిచేసింది. అయినా, 1905 నాటికే కనెక్టికట్‌లో పేరొందిన ఫోటోగ్రాఫర్లలో ఒకరిగా బోస్టన్ గ్లోబ్ ఆమె గురించి రాసింది. ఫోటోగ్రఫీ మొదలుపెట్టిన నాలుగేళ్లలోనే ఆమె ఆ గుర్తింపు పొందడం విశేషం.
జీన్ వివియన్‌కు తొలి ప్రేరణ అయి ఉండవచ్చు. అయితే జీన్ ప్రధానంగా పోర్ట్రైట్ ఫోటోగ్రాఫర్. ఆమెకు విట్నీ మ్యూజియం స్థాపకుడితో పరిచయం ఉండేది. జీన్ ఇంట పెరిగిన చిన్ననాటి వాతావరణం వివియన్ కళాభిరుచిపై లోతైన ప్రభావం చూపి ఉండవచ్చని మాలోఫ్ భావించాడు.
1949 ప్రాంతంలో ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడే వివియన్ తొలిసారిగా ఫోటోలు తీయడం మొదలుపెట్టింది. ఆమె చేతిలో ఉన్నది సాధారణమైన కోడాక్ బ్రౌనీ బాక్స్ కెమెరా. దానికి ఒకే షట్టర్ వేగం ఉండేది. ఫోకస్‌ను మార్చే వీలూ, ఎపర్చర్‌ను నియంత్రించే సౌకర్యమూ లేవు. దాని చిన్న వ్యూఫైండర్ ద్వారా కనిపించే దృశ్యం కూడా పరిమితమే. ఫోటోగ్రాఫర్ తనకు కావలసిన చిత్రాన్ని కచ్చితంగా రూపొందించేందుకు ఆ కెమెరా పెద్దగా తోడ్పడేది కాదు. అయినా, నిశితమైన తన కళాత్మక దృష్టిని ఆ సాధారణ పరికరంతోనే పరీక్షించుకుని, పదును పెట్టుకుంది వివియన్.
దక్షిణ ఫ్రాన్స్ పర్వతప్రాంతంలో కెమెరా పట్టుకున్నప్పుడు, ఆమె మొదటి చిత్రాలు నియంత్రిత భంగిమల్లో తీసిన చిత్రపటాలు, ప్రకృతి దృశ్యాలే.
1951లో ‘డి గ్రాస్’ అనే నౌకలో న్యూయార్క్ చేరుకుంది. సౌత్ హాంప్టన్‌లోని ఒక కుటుంబంతో ఉండి, వారి పిల్లల బాగోగులను చూసుకునే దాయి ఉద్యోగం చేపట్టింది.
న్యూయార్క్ వీధుల్లో తిరుగుతూ తన చూపును, తన కళను మెరుగు పరుచుకుంది. ఫ్రాన్స్‌లో సాధన చేసిన పద్ధతులతోనే, అదే కోడాక్ బ్రౌనీ కెమెరాతో, 6 × 9 ఫార్మాట్లో ఛాయాచిత్రాలు తీసింది.
1952లో తన ఫోటోగ్రఫీ ఆసక్తిని కొనసాగించేందుకు రోలీఫ్లెక్స్ కెమెరా కొనుక్కుంది. ఆ సంవత్సరంలోనే ఆమె ఫోటోగ్రఫీలో పెద్ద మార్పు కనిపించింది. చదరపు ఫ్రేమ్‌లో చిత్రాలు తీయడం మొదలు పెట్టి, సాధారణ బాక్స్ కెమెరా నుంచి ఖరీదైన రోలీఫ్లెక్స్ కెమెరాకు మారింది. ఆమె చిత్రణావిధానం కూడా మారింది.
వీధిలో అనుకోకుండా ఎదురయ్యే క్షణాలను అసాధారణంగా బంధించింది. ఆమె వీధి చిత్రాల్లో ప్రఖ్యాత ఛాయాచిత్రకారుల చురుకుదనం, కూర్పుల్లో ప్రత్యేకత కనిపించాయి.1952 నుంచే వివియన్ మాయర్గా ప్రపంచానికి పరిచయమైన ఒక విలక్షణ శైలి రూపుదిద్దుకోవడం మొదలైంది.
1956 వరకు ఆ న్యూయార్క్ కుటుంబంతోనే ఉంది. ఆ తరువాత చికాగోకు ఉత్తరాన ఉన్న ఉపనగరానికి చేరుకుంది. ఒక ధనికుల కుటుంబం ఆమెను దాయిగా నియమించింది. ఆ పిల్లలతో, ఆ కుటుంబంతో ఆమెకు ఏర్పడిన అనుబంధం జీవితాంతం కొనసాగింది.
1956లో చికాగోకు వెళ్లినప్పుడు, వివియన్‌కు ఫిల్మ్‌ను డెవలప్ చేసుకునేందుకు డార్క్ రూం, ప్రత్యేక స్నానాల గది ఉండేవి. తన నలుపు తెలుపు ఫిల్మ్‌లను తానే ప్రాసెస్ చేసి, ప్రింట్లు తయారుచేసుకునే అవకాశం ఆమెకు లభించింది.
వివియన్‌ను చూసినవారు ఆమెను తరచుగా బాలసాహిత్యంలో అత్యంత ప్రియమైన దాయి ‘మేరీ పాపిన్స్’తో పోల్చేవారు. చికాగోలో ఒక సంపన్న కుటుంబంలోని ముగ్గురు అబ్బాయిలకు ఆమె సంరక్షకురాలుగా విధులు నిర్వర్తించింది. 1956లో మొదలైన ఆ ఉద్యోగం ఆమెకు మాతృత్వ అనుభవాన్నిచ్చింది. ఆ పిల్లలను తన సొంత పిల్లలుగా చూసుకుంది. వారు కూడా కడదాకా ఆమెను తల్లిగానే ప్రేమించారు.
స్ట్రాబెర్రీ తోటలకు తీసుకెళ్లి పండ్లు కోయించేది. కాలిబాట పక్కన చచ్చిపడి ఉన్న పామును చూసి, దాన్ని పిల్లలకు చూపించడానికి ఇంటికి తీసుకువచ్చేది. వీధిలోని పిల్లలందరినీ కలిపి నాటకాలు వేయించేది.
“వివియన్ దాయిగా, పిల్లల సంరక్షకురాలిగా పని చేసిన చోట పిల్లలు ఆమెను అత్యంత ఆసక్తికరమైన వ్యక్తిగా భావించి ప్రేమించేవారు,” అని మాలోఫ్, ఆమె పెంచిన పిల్లలతో మాట్లాడిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ అన్నాడు.
“పిల్లలందరికీ ఆమెతో ఉండటం ఇష్టం. నగరమంతా తిప్పుతూ కొత్త ప్రదేశాలు చూపించేది. ప్రదర్శనలకు, నాటకాలకు తీసుకెళ్లేది. ఈ స్మృతులను బంధించడానికి ఆమె కెమెరా ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. పిల్లలకు అదొక గొప్ప అనుభవం.”
తాను ఇంగ్లీషు భాషను నాటకశాలల్లోనూ, రంగస్థల ప్రదర్శనల్లోనూ నేర్చుకున్నానని ఆమె చెప్పేది. జీవితమే ఆమె ముందున్న రంగస్థలం. దానిలోని అసాధారణ క్షణాలను తన కెమెరాలో శాశ్వతంగా పొందుపరచుకునేది.
ఆమెను ఎరిగినవారి జ్ఞాపకాలు చాలావరకు ఒకేలా ఉంటాయి. ఆమె విలక్షణమైన వ్యక్తి. బలమైన, స్థిరమైన అభిప్రాయాలు కలిగినది. ఎంతో తెలివైనది. తన వ్యక్తిగత జీవితాన్ని అపరిమితమైన గోప్యతతో కాపాడుకునేది.
వెడల్పాటి టోపీ, పొడవాటి దుస్తులు, ఉన్ని కోటు, పురుషుల పాదరక్షలు ధరించి అమిత వేగంగా నడిచేది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడల్లా కెమెరా ఆమె మెడలో ఉండేది. విస్తారంగా ఫోటోలు తీసేది. కానీ తాను తీసిన చిత్రాలను ఎవరికీ చూపించేది కాదు. తనదైన పంథాలో, ఎక్కడా రాజీ పడకుండా, ఎవరికీ అనుకరించటానికి సాధ్యం కాని విధంగా జీవించింది.
ఆమె స్వతంత్రురాలు. సాహసి. తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచినా, ఎవరు విన్నా వినకపోయినా తన అభిప్రాయాలను మాత్రం బలంగా వ్యక్తపరచేది.
1959 ప్రాంతంలో, వివియన్ తన మీడియం ఫార్మాట్ కెమెరాలను ఒక పెద్ద పెట్టెలో సర్దుకుని, ఏడాది పాటు ప్రపంచయాత్రకు బయలుదేరింది. అది కేవలం ఒక విహారయాత్ర కాదని మాలోఫ్ భావిస్తాడు. జీవనయాత్రలో తన ఉనికికి ప్రయోజనం తెలుసుకోవడానికి, సుదూర ప్రపంచాన్ని దగ్గరగా చూడడానికి ఆమె బయలుదేరి ఉండవచ్చు. థాయ్‌లాండ్, ఈజిప్ట్, యెమెన్, ఇటలీ, ఫ్రాన్స్, తైవాన్, వియత్నాం, మొరాకో, కెనడా, ఫిలిప్పీన్స్ ఇలా ఎన్నో ప్రాంతాలను సందర్శించింది.
దూరదేశాల్లో కొత్తదనాన్ని వెదికిన ఆమె, తన చుట్టూ ఉన్న నగరంలోనూ చాలామంది పట్టించుకోని దృశ్యాలను గుర్తించింది. యుగోస్లావియా నుంచి వచ్చిన వలసదారులు తమ చక్రవర్తి మరణించినప్పుడు అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యంలో వారి శోకాన్ని వివియన్ గమనించి భద్రపరచింది. ప్రసిద్ధ చికాగో పశువుల మార్కెట్ చివరి రోజులు, మిల్ఫోర్డ్ థియేటర్లో జరిగిన పోలిష్ సినిమా ప్రదర్శన, అపోలో వ్యోమగాములు తిరిగి వచ్చినప్పుడు చికాగో ప్రజలు వారికి స్వాగతం పలికిన చారిత్రక క్షణం, ఇవన్నీ ఆమె తన కెమెరాలో నమోదు చేసింది. ఆమెకు కనిపించినవన్నీ ఫోటోలలోనో, చలనచిత్రంలోనో, ఆడియో రికార్డులోనో నిలిచిపోయేవి.
ఆమె ఛాయాచిత్రాల్లో పేదల పట్ల, దీనుల వేదన పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనిపిస్తుంది. బతుకుతెరువు కోసం పోరాడుతున్న వారి స్థితిగతులతో ఆమెకు ఏదో ఆంతరంగిక అనుబంధం ఉండేదని ఆ చిత్రాలు సూచిస్తాయి.
తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కెమెరాలో భద్రపరచాలన్న వివియన్ మాయర్ అభిరుచి ఛాయాచిత్రాలకే పరిమితం కాలేదు. స్వయంగా రూపొందించిన లఘు చిత్రాలు, ధ్వని రికార్డింగులు, సేకరించిన అనేక వస్తువుల ద్వారా ఆమె తన పరిశీలనను మరింత విస్తరించింది. ఆ విధంగా ఇరవయ్యవ శతాబ్దపు ద్వితీయార్థంలో అమెరికా ప్రజల జీవన విధానాన్ని, ఆనాటి సమాజాన్ని, నిత్యజీవితంలోని అనేక పార్శ్వాలను కళ్లకు కట్టే అపురూపమైన చారిత్రక సంపదను ఆమె సృష్టించింది.
పాత చారిత్రక కట్టడాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించడం, సమాజం చూడని పేదల జీవితాలు, నగరంలోని విభిన్న వర్గాల జీవనశైలి, చికాగోకు ప్రత్యేకమైన ప్రదేశాలు ఇవన్నీ ఆమె దృష్టిలో నిలిచాయి. వాటిని ఆమె ఓర్పుగా, శ్రద్ధగా కెమెరాలో భద్రపరిచింది.
1950ల నుంచి 1970ల వరకు వేలాది ఫోటోలు తీసింది. అయితే వాటిని ఒక గదిలో దాచి ఉంచుకుంది. ఆ గదిలోకి ఎవరినీ వెళ్లనిచ్చేది కాదు.
పిల్లలు పెద్దయ్యాక, డెబ్బైల ప్రారంభంలో ఆ కుటుంబానికి ఆమెతో పని ముగిసింది. అక్కడి నుంచి మరో కుటుంబానికి వెళ్లిన తరువాత, తన ఫిల్మ్‌లను డెవలప్ చేసుకునే సౌకర్యం లేకపోయింది. తీసిన ఫోటోల రోల్స్ అలాగే పేరుకుపోయాయి. ప్రింట్ కాని అసంఖ్యాకమైన నెగటివ్ రోల్స్ ఆమె దగ్గరే మిగిలిపోయాయి. గది నిండిపోయింది.
ఆ సమయంలోనే ఆమె కలర్ ఫోటోగ్రఫీ వైపు మళ్లింది. ఎక్కువగా కోడాక్ ఎక్టాక్రోమ్ 35 ఎం.ఎం. ఫిల్మ్ వాడింది. లైకా IIIcతో పాటు, జర్మన్ ఎస్.ఎల్.ఆర్. కెమెరాలనూ ఉపయోగించింది. ఆమె రంగు చిత్రాల్లో కొత్తదనం కనిపించింది. కాలం గడిచేకొద్దీ ఆ చిత్రాలు మరింత ప్రయోగాత్మకంగా మారాయి.
క్రమంగా చిత్రాల నుంచి మనుషులు మాయమై, వారి స్థానంలో వస్తువులు, వార్తాపత్రికలు, గోడలపై రాతలు కనిపించసాగాయి. చెత్తబుట్టల్లో, రోడ్డు పక్కన కనిపించిన వస్తువులను ఇంటికి తీసుకురావాలనే అలవాటు జబ్బుగా కూడా ఆమెలో స్థిరపడింది. ఎనభైలలో ఆర్థిక ఇబ్బందులు, స్థిరమైన నివాసం లేకపోవడం ఆమె పనిని నిరోధించాయి. రంగు ఫిల్మ్ రోల్స్ కూడా డెవలప్ కాకుండా అసంఖ్యాకంగా పేరుకు పోయాయి.
తొంభై దశకం మధ్యకాలం వరకు వివియన్ పిల్లల సంరక్షకురాలిగా పనిచేసింది. పెళ్లి చేసుకోలేదు. తనకంటూ కుటుంబం, పిల్లలు లేరు. చాలా తక్కువ మాట్లాడేది. కొన్నిసార్లు మౌనమే ఆమె సమాధానమయ్యేది. అందుకే ఆమెను రహస్యాలు దాచుకునే వ్యక్తిగా చాలామంది భావించారు.
“ఆమెకు ఏ కుటుంబంతోనూ బలమైన అనుబంధం లేదు. సన్నిహిత స్నేహితులు, పరిచయస్తులు లేరు. పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు. అందుకే తన జీవితాన్ని అంత గోప్యంగా ఉంచిందేమో. నాకు తెలిసినంతవరకు ఆమెకు ప్రేమజీవితం కూడా లేదు.
ఫోటోగ్రఫీ ఒక్కటే ఆమె సమస్త ప్రపంచం. మనకు అత్యంత వ్యక్తిగతమైన అనుభూతిని ఇతరుల ముందుంచడం మనల్ని బలహీనంగా చిత్రించవచ్చు. ఈ రోజున ఆమె ఛాయాచిత్రాలను ప్రజలు ఇంతగా ఆదరిస్తారని ఆనాడు ఆమెకు తెలిసి ఉంటే, వాటిని దాచిపెట్టే విషయంలో మరోసారి ఆలోచించి ఉండేదేమో. కానీ జరిగినదాన్ని వెనక్కి తిరిగి చూసినప్పుడు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి” అని మాలోఫ్ అభిప్రాయపడ్డాడు.
తొంభైల చివరి దశ నుంచి కొత్త సహస్రాబ్దపు తొలి సంవత్సరాల మధ్యకాలంలో ఎప్పుడో ఆమె కెమెరాను పక్కన పెట్టింది. తన వస్తువులను అద్దె నిల్వ గదుల్లో పెట్టి, జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చింది. కొంతకాలం ఇల్లు లేకుండా ఉండాల్సి వచ్చింది. తరువాత ఆమె గతంలో పని చేసిన ఒక కుటుంబం అద్దె చెల్లించేందుకు సాయం చేయడంతో చిన్న స్టూడియో అపార్ట్మెంట్లో నివసించింది. ఆమె పెంచిన పిల్లలు ఆమె పట్ల మాతృభావం చూపించారు.
ఆమె చేతిలో డబ్బు చాలా తక్కువ. నిల్వ గదుల్లో ఉన్న ఫోటోలు కూడా ఆమెకు అందని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. 2007లో వివియన్ మాయర్ జీవితానికి సంబంధించిన ఒక అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిల్వ గదుల అద్దె చెల్లించలేకపోవడంతో, స్టోర్ హౌస్ యజమానులు ఆమె భద్రపరిచిన వస్తువులను వేలం వేశారు. వాటిలో వేలాది ఛాయాచిత్రాలు, ఫొటోగ్రాఫిక్ నెగెటివ్‌లు, ఫిల్మ్ రోల్స్, వ్యక్తిగత వస్తువులు పెద్దపెద్ద పెట్టెల నిండా ఉన్నాయి.
వాటి వెనుక ఒక అసాధారణమైన ఛాయాగ్రాహకురాలి జీవితం దాగి ఉందని అప్పటికి ఎవరికీ తెలియదు.
ఆ వస్తువులను నిల్వ సంస్థ పెద్ద వేలంలో పెట్టెల రూపంలో ఆర్.పి.ఎన్. సేల్స్‌కు విక్రయించింది. మరికొన్ని వస్తువులను విడివిడిగా కూడా అమ్మింది.
ఆ వేలంలో పాల్గొన్నవారిలో జాన్ మాలోఫ్ ఒకరు. చికాగోలోని పోర్టేజ్ పార్క్ ప్రాంతానికి సంబంధించిన స్థానిక చరిత్రపై అతడొక పుస్తకం రూపొందిస్తున్నాడు. ఆ ప్రాంతపు గతాన్ని తెలియజేసే పాత ఛాయాచిత్రాల కోసం అన్వేషిస్తున్న సమయంలో వివియన్ మాయర్కు చెందిన నెగెటివ్‌ల పెట్టె అతడి దృష్టికి వచ్చింది. తన పుస్తకానికి ఉపయోగపడే చిత్రాలు అందులో ఉండవచ్చనే ఆశతో దానిని కొనుగోలు చేశాడు.
అయితే ఆ నెగెటివ్‌లను పరిశీలించినప్పుడు తాను వెతుకుతున్న ప్రాంతానికి సంబంధించిన చిత్రాలు కనిపించలేదు. దాంతో వాటిని పక్కన పెట్టాడు. దాదాపు రెండేళ్లపాటు ఆ పెట్టెలను మళ్లీ పరిశీలించలేదు.
“ఆ వేలంలో కొనుగోలు చేసిన కొద్దిమందిలో నేనొకణ్ణి. ‘వివియన్ మాయర్’ అని గూగుల్‌లో వెతికాను. ఏమీ కనిపించలేదు. 2009లో ఆమె పేరు ఉన్న ఒక ఫోటో ల్యాబ్ కవరు దొరికిన తరువాత మళ్లీ వెతికాను. అప్పుడే కొన్ని రోజుల క్రితం ప్రచురించిన ఆమె మరణవార్త కనిపించింది. అప్పటి నుంచి వివియన్ నా జీవితంలో అతి ముఖ్యమైన భాగమైపోయింది,” అని మాలోఫ్ గుర్తుచేసుకున్నాడు.
ఆ తరువాత వివియన్ ఛాయాచిత్రాల ప్రాధాన్యాన్ని గుర్తించిన మాలోఫ్, ఆమె జీవితానికి సంబంధించిన వివరాలను అన్వేషించడం ప్రారంభించాడు. ఆమె వద్ద పెరిగిన పిల్లలను, ఆమెను ఎరిగిన వ్యక్తులను సంప్రదించాడు. ఆమె గతాన్ని తెలుసుకునేందుకు పాత రికార్డులను పరిశీలించాడు. అప్పటివరకు ఎవరికీ తెలియని ఒక ఛాయాగ్రాహకురాలి ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడంలో అతడు కీలకపాత్ర పోషించాడు.
వివియన్ చిత్రాలూ, వ్యక్తిగత వస్తువులూ ఎక్కువ భాగం మాలోఫ్ దగ్గర ఉన్నాయని భావిస్తున్నారు. అయినా, మరికొన్ని నెగెటివ్‌లు, ప్రింట్లు, ఫిల్మ్‌లు, డెవలప్ చేయని వేలాది రోల్స్ వేర్వేరు వ్యక్తుల వద్ద ఉన్నాయి. వాటిలో కొన్ని చికాగోకు చెందిన జెఫ్ గోల్డ్‌స్టీన్ సేకరించాడు. మాలోఫ్కు దక్కని వస్తువులను వెదికి సంపాదించిన ఆయన కూడా వివియన్ ఛాయాచిత్రాలపై అధ్యయనానికి, వాటి ప్రాచుర్యానికి కృషి చేశాడు.
మాయర్ ఛాయాచిత్రాల ముద్రణకు సంబంధించి స్వయంగా ఇచ్చిన కొన్ని సూచనలు
నేడు వివియన్ మాయర్ ఛాయాచిత్ర ప్రదర్శనలలో, వెబ్సైట్లలో కనిపించే ఛాయాచిత్రాలలో ఎన్నో చిత్రాలు వివియన్ మాయర్ స్వయంగా ముద్రించినవి కావు. ఆమె భద్రపరిచిన వేలాది ఫొటోగ్రాఫిక్ నెగెటివ్‌లను కొత్తగా స్కాన్ చేసి రూపొందించినవి.
ఈ సందర్భంలో కళాకారిణి అసలు ఉద్దేశానికి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. వివియన్ జీవించి ఉంటే ఏ చిత్రాలను ముద్రణకు ఎంపిక చేసుకునేది? వాటిని ఏ విధంగా ముద్రించేది? ఈ ప్రశ్నలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
అందుకే ఆమె స్వయంగా ఛాయాచిత్రాలను ముద్రించేటప్పుడు అనుసరించిన పద్ధతులను, కళాత్మక అభిరుచులను తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
ఇందుకోసం మాయర్ స్వయంగా ముద్రించిన ఛాయాచిత్రాలను నిశితంగా పరిశీలించారు. అంతేకాకుండా, ఫొటోగ్రాఫిక్ స్టూడియోలకు ఆమె ఇచ్చిన అనేక లిఖితపూర్వక సూచనలను కూడా అధ్యయనం చేశారు. చిత్రాలను ఎలా ముద్రించాలి, వాటిలో ఏ భాగాన్ని ఉంచి ఏ భాగాన్ని తొలగించాలి, ఎలాంటి కాగితాన్ని ఉపయోగించాలి, కాగితం ఉపరితలం ఏ విధంగా ఉండాలి వంటి విషయాలపై ఆమె అత్యంత స్పష్టమైన సూచనలు, నిర్దేశాలు ఇచ్చేది. ఈ వివరాలన్నీ ఆమె కళాత్మక దృష్టిని అర్థం చేసుకోవడానికి విలువైన ఆధారాలుగా నిలిచాయి.
చికాగో కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ప్రదర్శనతో సహా, మాయర్ ఛాయాచిత్రాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిన ప్రతి సందర్భంలోనూ ఈ ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆమె స్వయంగా అనుసరించిన ముద్రణ పద్ధతులకు, కళాత్మక నిర్ణయాలకు సాధ్యమైనంత దగ్గరగా ఉండేలా చిత్రాలను రూపొందించడానికి కృషి చేశారు. తద్వారా మాయర్ ఛాయాచిత్రాలలోని మౌలిక స్వరూపాన్ని, ఆమె వ్యక్తిగత కళాదృష్టిని యథాతథంగా పరిరక్షించేందుకు ప్రయత్నించారు.
వివియన్ మాయర్ తన ప్రతిభకు గుర్తింపు కోరకుండా అజ్ఞాతంలోనే జీవించడం గురించి ఏమనుకునేదో తెలుసుకోవడం సాధ్యం కాదు. అయితే ఆమె తీసిన ఛాయాచిత్రాలు సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గం, జీవితంలో వెనుకబడిపోయిన సామాన్యుల స్థితిగతులను ఎంతో సున్నితంగా ఆవిష్కరిస్తాయి.
మాయర్ చిత్రాల్లో ఇతర వీధి చిత్రాల కంటే ఎక్కువ సున్నితత్వం కనిపిస్తుంది. వాటిలో మనుషుల పట్ల లోతైన సహానుభూతి వ్యక్తమవుతుంది. సమాజానికి దూరంగా జీవించేవారి వ్యక్తిగత క్షణాలను చిత్రీకరించేటప్పుడు కూడా వారి ఏకాంతాన్ని, ఆత్మగౌరవాన్ని గౌరవించే దూరాన్ని ఆమె పాటించేది.
ఆలోచనల్లో మునిగిపోయి ఎటో చూస్తున్న యువకుడి చూపును, వైకల్యం ఉన్న వ్యక్తిని చాటుగా గమనిస్తున్న మధ్యవయస్కురాలి బిగుతైన ముఖకవళికల్లో కనిపించే భావాన్ని ఆమె కెమెరా పట్టుకుంది. ఆమె చిత్రీకరించిన ముఖాల్లో ఎక్కువగా గాంభీర్యం, జీవితానుభవాల తాలూకు విషాదం కనిపిస్తాయి. మాయర్ ఛాయాచిత్రాల్లోని ప్రపంచం ఎప్పుడూ పాతకాలపు నలుపు తెలుపు చిత్రాల్లో కనిపించే గంభీరమైన వాతావరణాన్ని గుర్తుచేస్తుంది.
మాయర్ సాధారణంగా ఎవరి దృష్టినీ ఆకర్షించని వ్యక్తులను, ముఖాలను తన ఛాయాచిత్రాలకు ఎంచుకున్నట్లే, ఎటువంటి ప్రత్యేకత కనిపించని ప్రదేశాలను కూడా చిత్రీకరించేది.
అమెరికాలో అత్యధికంగా ఫొటోలు తీసే ప్రసిద్ధ నగరాల్లో సైతం ఆమె చూపు అందరూ చూసే దృశ్యాలకంటే భిన్నమైన వాటిపై నిలిచేది. చికాగో వంటి నగరాన్ని ఫొటోగ్రాఫర్లు సాధారణంగా ఏ విధంగా చిత్రీకరిస్తారో అందరికీ బాగా తెలుసు. నగరంలోని ఎత్తైన భవనాల సముదాయాన్ని చూపించే దృశ్యాలు, సూర్యాస్తమయ సమయంలో ఆకాశహర్మ్యాలు, చికాగో థియేటర్ వెలుపల వెలుగుతున్న విద్యుద్దీపాల మధ్య సందడిగా సాగే నగరజీవితం వంటి దృశ్యాలు ఛాయాచిత్రాల్లో పదేపదే కనిపిస్తుంటాయి.
కానీ మాయర్ చిత్రాలేవీ ఈ మూసను అనుసరించలేదు. చికాగో నగరాన్ని ఆమె మరింత నిశితంగా పరిశీలించి, సాధారణంగా అందరి దృష్టికి రాని జీవితక్షణాలను తన కెమెరాలో నమోదు చేసింది.
మాయర్ తన ఫిల్మ్ రోళ్లను డెవలప్ చేయించుకునే సెంట్రల్ కెమెరా దుకాణం మేనేజర్ జో గలీనా ఆమె ఫొటోగ్రఫీ గురించి ఇలా వివరించారు.
“చికాగోలో వీధి ఛాయాగ్రహణం అనే కళ పట్ల మొదటి నుంచీ ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అందుకు అనువైన నగరం కూడా అదే. అయితే వివియన్ శైలి మిగతా ఫొటోగ్రాఫర్లకు భిన్నమైనది. ఆమె కేవలం నగరంలోని దృశ్యాలను చిత్రీకరించలేదు. ఆ నగరపు వాస్తవ జీవితాన్ని తన ఛాయాచిత్రాల్లో బంధించింది. ఆమె తీసిన ప్రతి చిత్రం చికాగో సామాజిక చరిత్రలో ఒక భాగమే.”
వెలుగులోకి వచ్చిన వివియన్ ఛాయాచిత్రాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. డ్యూష్ బోర్స్ ఫోటోగ్రఫీ బహుమతికి నామినేట్ అయిన అన్నా ఫాక్స్ అభిప్రాయం ప్రకారం, ఇకపై వీధి ఫోటోగ్రఫీ గురించి వచ్చే పుస్తకాల్లో వివియన్ కళకు గౌరవస్థానం తప్పక లభిస్తుంది.
“చాలామంది ఫోటోగ్రాఫర్ల కళ, పనితనం వారు మరణించిన తరువాత వెలుగులోకి వచ్చాయి. కానీ వివియన్ చిత్రాలు మొదటిసారి చూసినప్పుడే నన్ను సంభ్రమపరచాయి. ఆమె నేపథ్యం గురించి, ఆమెను తెలిసినవారి నుంచి లభించిన సమాచారం చాలా తక్కువ. ఆ తెలియకపోవడమనే అనామకత్వం ఆమె విషయంలో ఆసక్తిని మరింత పెంచుతుంది.
అంతేకాదు, ఆమె పనితనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి జరిగిన కృషి కూడా అసాధారణం. ఆమె చిత్రాలు చక్కగా నిర్మితమయ్యాయి. ఏ చిత్రాల ప్రభావం ఆమెపై ఉండి ఉండవచ్చో కూడా తెలుస్తుంది. కొన్ని చోట్ల డయాన్ ఆర్బస్, మరికొన్ని చోట్ల రాబర్ట్ ఫ్రాంక్ గుర్తుకు వస్తారు,” అని ఫాక్స్ పేర్కొంది.
వివియన్ దగ్గర కళ, ఫోటోగ్రఫీపై పెద్ద పుస్తకాల సేకరణ ఉండేది. వాటి ద్వారా ఇతర ఫోటోగ్రాఫర్ల పనిని తెలుసుకుని అవగాహన పెంచుకుని ఉండవచ్చు. కానీ ఆమె ఎటువంటి ఫోటోగ్రఫీ శిక్షణ పొందిన రికార్డు కానీ, రుజువు కానీ లేదు.
విమర్శకులు, నిపుణుల నుంచి ఆమె తన చిత్రాలపై అభిప్రాయాలు పొందినట్లు కూడా మాలోఫ్కు తెలియరాలేదు. అయినా, ఆమె వదిలివెళ్లిన ఛాయాచిత్రాలు ఒక పరిపక్వమైన హస్తవాసి గల కళాకారిణి నైపుణ్యానికి నిదర్శనాలు.
ఫాక్స్ దృష్టిలో, మహిళా ఫోటోగ్రాఫర్ల పనికి తగిన గుర్తింపు రాకపోవడం కూడా ఈ కథలో ఒక భాగం. ఫోటోగ్రఫీ నేర్చుకునేవారిలో, బోధించేవారిలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఈ రంగం ఇప్పటికీ ప్రధానంగా పురుషుల ఆధిపత్యంలోనే ఉంది. ఫొటోగ్రఫీ ప్రదర్శనల్లోనూ, ఆ రంగానికి సంబంధించిన ప్రచురణల్లోనూ మహిళా ఫొటోగ్రాఫర్ల ప్రస్తావన, వారి కృషికి దక్కాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కడం లేదు. ఈ పరిస్థితి మారే అవకాశం ఉంది. అంతకంటే ముఖ్యంగా, మారాల్సిన అవసరం ఉన్నదని అంటుంది ఫాక్స్.
“మహిళలు తాము ఫొటోలు తీసే వ్యక్తులతో సులభంగా పరిచయం పెంచుకోగలుగుతారు. వారితో నమ్మకమైన అనుబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ముఖ్యంగా మీడియం ఫార్మాట్ కెమెరాతో ఫొటోలు తీస్తున్నప్పుడు ఎదుటివారికి మహిళల ఉనికి అంత ఇబ్బందికరంగా అనిపించదు. మహిళల దృష్టిలో జీవితాన్ని చూసే విధానంలో ఒక సున్నితమైన వ్యంగ్యం, మనుషుల పట్ల సహజమైన సానుభూతి కనిపిస్తాయి.
అయితే ఫొటోగ్రాఫర్లను స్త్రీ పురుష భేదాలతో కాకుండా వారి ప్రతిభ ఆధారంగా అంచనా వేయడమే సమంజసం. వివియన్ మాయర్ ఛాయాచిత్రాల్లో అంతటి తీవ్రశక్తి ఉన్నది. వాటి గొప్పతనాన్ని గుర్తించడానికి ఆమె మహిళ అనే విషయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు.”
2008 డిసెంబరులో ప్రమాదవశాత్తు వివియన్ మంచు గడ్డపై జారి పడింది. ఆ గాయం నుంచి ఆమె పూర్తిగా కోలుకోలేదు. 2009 ఏప్రిల్ 21న, చికాగో శివార్లలోని వృద్ధుల సంరక్షణ కేంద్రంలో మరణించింది. ఆమె జీవించి ఉన్నప్పుడే, జీవితం, మరణం గురించి తన ఆలోచనలను ఎవరో రికార్డు చేశారు. ఆ స్వరంలో నిశ్చయభావం, ఆత్మవిశ్వాసం ఉన్నాయి.
“ఏదీ శాశ్వతంగా ఉండాలని ప్రకృతి నిర్ణయించలేదు. ఇతరులకు చోటివ్వాలి. జీవితం ఒక చక్రం లాంటిది. మనం దానిపై ఎక్కి చివరివరకు వెళ్తాం. ఆ తరువాత మరొకరికి కూడా అదే ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. చివరికి మన స్థానాన్ని ఇంకొకరు తీసుకుంటారు.”
ఆ మాటలు ఆమె ఫోటోగ్రఫీకి కూడా వర్తిస్తాయేమో. ఆమె చిత్రాలు దాదాపు మరుగున పడిపోయాయి. అయినా, ఇప్పుడు అవి వెలుగులోకి వచ్చి కొత్త ఫోటోగ్రాఫర్లను కెమెరా చేతబట్టి వీధుల్లోకి వెళ్లేలా ప్రేరేపించవచ్చు.
ప్రసిద్ధ రచయిత కాఫ్కా, తన మరణానంతరం తన అముద్రిత రచనలన్నిటినీ నాశనం చేయమని స్నేహితుడు మాక్స్ బ్రాడ్‌ను కోరాడు. బ్రాడ్ ఆ కోరికను పాటించలేదు. వివియన్ తన చిత్రాలు ఎవరూ చూడకూడదని అనుకుని ఉండవచ్చు. ఆ చిత్రాల సున్నితమైన శక్తిని జాన్ మాలోఫ్, జెఫ్ గోల్డ్‌స్టీన్, మరికొందరు ప్రపంచానికి పరిచయం చేశారు.
తన ఛాయాచిత్రాలతో నేడు ప్రపంచాన్నే అబ్బురపరుస్తున్న వివియన్ మాయర్ ఒకప్పుడు సాధారణ దాయిగా జీవించిందంటే నమ్మడం కష్టమే. ఇరవయ్యవ శతాబ్దపు ద్వితీయార్థంలో అమెరికా నగర జీవనంలోని ఆసక్తికరమైన విశేషాలను, వింతలను, విలక్షణమైన సంఘటనలను ఆమె తన కెమెరాలో భద్రపరిచింది.
అలా తనకు తెలియకుండానే ఒక కాలపు సామాజిక జీవనానికి అరుదైన దృశ్య చరిత్రను అందించిన ఈ మహిళ జీవితగాథ కల్పనకు మించిన వాస్తవంలా అనిపిస్తుంది.

