Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆమె ఎవరు

[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘ఆమె ఎవరు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

రాఘవరావు ఒక ప్రముఖ ఐ.టి. కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తన టీంలో పనిచేసే స్టాఫ్‌ని చాలా గౌరవంగా చూసుకుంటాడు. తన టీంలో పని చేసే సుధ విషయంలో అతనికి కొన్ని సందేహాలు వచ్చేయి ఈ మధ్య. ఆ డైరీ దొరకక పోయి ఉంటే అతను ఎన్నడూ ఆమె విషయంలో ఇంతగా ఆలోచించేవాడు కాదు.

అసలు జరిగిందేమిటో తెలియాలంటే, ఒక 10 రోజుల ముందు నుండీ జరిగిన విషయాలు తెలియాలి.

రాఘవరావు 15 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో వుద్యోగం చేస్తూ, మాదాపూర్‌లో ఉంటున్నాడు. కొద్ది కాలం కిందట అతని తమ్ముడికి విజయవాడ నుండి హైదరాబాద్ బదిలీ అయ్యింది. అతని ఆఫీస్ వనస్థలిపురం దగ్గర. తనకి ఏదయినా సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ ఉంటే చూడమని ముందుగా చెప్పడంతో తన టీమ్ మేట్స్‌తో ఆ విషయం రాఘవరావు ప్రస్తావించేడు.

ఇక్కడ సుధ గురించి కూడా కొంత చెప్పాలి. సుధ, ఆమె భర్త సురేష్ వనస్థలిపురం దగ్గర ఒక ఫ్లాట్ కొనుక్కుని 2019లో కొత్త కాపురం పెట్టేరు. అయితే 6 నెలలకి ముందు కంపెనీ మారడం, రాఘవరావు పనిచేసే ఐ.టి. కంపెనీలో సుధ చేరడం జరిగింది. సుధ భర్త సురేష్ కూడా వీళ్ళ ఆఫీస్ దగ్గర్లో మరొక కంపెనీలో పనిచేస్తాడు. వనస్థలిపురం నుండి ఇప్పటి ఆఫీస్‌కి చాలా దూరం అయిపోయిందని, ఆఫీస్ దగ్గరలో ఫ్లాట్ కొనుక్కుని వచ్చేసేరు.

సుధ చాలా చురుకయినది, ఆఫీస్ వర్క్ విషయంలో సిన్సియర్‌గా ఉంటుంది. రాఘవరావు ఆఫీస్‌లో సుధ మీద ఎక్కువ ఆధారపడతాడు. ఒక విధంగా ఆమెని, సురేష్‌ని ఇంట్లో మనుషులుగా చూస్తాడు అతను. తన ఇంటికి వాళ్ళని భోజనాలకి పిలుస్తూ ఉంటాడు, అలాగే తాను కూడా ఫామిలీతో వాళ్ళ ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాడు.

మాటల సందర్భంలో తన తమ్ముడికి వనస్థలిపురం ఏరియాలో ఫ్లాట్ కావాలని చెప్పడం, సుధ తన ఫ్లాట్ అమ్మేద్దామని అనుకుంటున్నట్లు చెప్పడం జరిగింది. అందుబాటు ధరలో దొరకడం, మరియు, రాఘవరావు తమ్ముడికి ఆ ఫ్లాట్ నచ్చడంతో తొందర్లోనే ఆ డీల్ ఓకే అయిపొయింది. గత వారం రిజిస్ట్రేషన్ కూడా అయిపొయింది. ఈ ఇంటి లావాదేవీల వల్ల కూడా ఇరువురి కుటుంబాలు మరింత దగ్గర అయ్యేయి.

ఒక వారం రోజులుగా ఆ ఫ్లాట్‌కి రంగులు వేయించే పనిలో వున్నాడు రాఘవరావు. పని వాళ్ళు ఇల్లు దులిపి రంగులు వేస్తున్నప్పుడు ఒక పాత డైరీ అటక మీద దొరికిందని రాఘవరావుకి అందించారు.

ఇతరుల డైరీ చదవకూడదని తెలిసినా, సహజంగా పారేసిన డైరీ కాకపోతే వదిలి వుండరు కదా అనుకుంటూ, యథాలాపంగా తిరగేసేడు రాఘవరావు.

అందులో ముత్యాల లాంటి అక్షరాలతో రాసిన 2 ఉత్తరాలు కనపడ్డాయి. అది సుధ రైటింగ్.

సుధ ముత్యాల లాంటి అక్షరాలతో రాస్తుందని, అతను అప్పుడప్పుడు తెలుగు సాహితీ సంఘం వాళ్లకి రాసే ఉత్తరాలు ఆమెతో రాయిస్తూ ఉంటాడు. రాఘవరావుకి తెలుగు సాహితీ సంఘంలో ఓ పదవి కూడా వుంది లెండి.

మొదటి వుత్తరం 26.2.2017 తేదీ న రాసింది. మొదటి వుత్తరం సారాంశం, సుధ తాను లవ్ చేసిన రమేష్‌ని ఒక రహస్య ప్రదేశానికి రమ్మనమని చెప్పడం, వాళ్ళ నాన్న తమ లవ్‌ని అంగీకరించట్లేదని, తన దగ్గర సెల్ ఫోన్ కూడా లాగేసుకుని, ఇంట్లో బందీగా వుంచుతున్నాడని, ఎలాగయినా, 27.02.2017 తెల్లవారుఝామున తప్పించుకుని, స్టేషన్‌కి వస్తాను అని, కలిసి పారిపోయి, హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుందామని వుంది. ఎడమ పక్క, “స్టేషన్ నల్గొండ” అని వుంది, కింద “ WITH LOVE.. నీ సుధ” అని వుంది.

రాఘవరావు ఆసక్తి ఆపుకోలేక, 2వ వుత్తరం కూడా చదివేడు.

“February 27 వ తారీఖున ఇల్లు కదలడానికి వీలు లేకుండా ఇల్లు తాళం పెట్టేసేరని, వాళ్ళ నాన్న చాలా కట్టడి చేస్తున్నాడని, ఈ సారి 15.03.2017 నాటికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానని, వాళ్ళు వేస్తున్న తాళానికి మారు తాళం సంపాదించేనని, ఆ రోజు అమ్మ, నాన్న పెళ్ళికి వెళ్తున్నట్లు, ఎప్పటి లాగే ఇంట్లో బందీగా ఉంచి వెళ్తారు కనుక ఈ సారి తప్పించుకోవడం చాలా సులభం అని రాసి వుంది. యథాప్రకారం “స్టేషన్ నల్గొండ” అని, “ WITH LOVE.. నీ సుధ” అని వుంది.

ఆ డైరీ చూసేక, రాఘవరావుకి అనేక సందేహాలు వచ్చేయి.

సుధ లవ్ చేసింది సురేష్‌ని కదా, వాళ్లిదరిదీ లవ్ మ్యారేజ్ అని, కొత్త కాపురం వనస్థలిపురంలో పెట్టారని చెప్పేరు ఆ దంపతులు. మరి ఈ రమేష్ ఎవరు. రమేష్‌తో పెళ్లి జరగలేదా? ఏం జరిగి ఉంటుంది? అనే అనుమానాలు వచ్చేయి. వాళ్ళది నల్గొండ అని సురేష్ ద్వారా తెలిసింది కానీ, సుధ ఎప్పుడూ తన స్వస్థలం గురించీ, కుటుంబం గురించీ ప్రస్తావించలేదు రాఘవరావు దగ్గర. అతను కూడా ఎప్పుడూ అనవసరపు విషయాలు మాట్లాడడు.

ఇప్పుడు తెలిసిన కొత్త విషయాలు అతన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి.

సుధ వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి. సురేష్ కూడా ఆమెని చాలా అభిమానంగా చూసుకుంటాడు. కానీ, ఈ రమేష్ ఎవరు అన్న విషయం తెలుసుకోవాలని అనుకున్నాడు.

అందుకని, డైరీ విషయం ఎవరితో డిస్కస్ చేయలేదు. కనీసం భార్యతో కూడా ప్రస్తావించలేదు. అదను చూసి విషయం రాబట్టాలని 3 రోజులుగా అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడు. సుధ దగ్గర ఈ విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. నిన్న స్నేహితుడు దగ్గర నుండి వచ్చిన ఫోన్ కాల్‌తో ఆ విషయం మర్చి పోయాడు.

రాఘవరావు స్నేహితుడి కొడుకు పెళ్లి నల్గొండలో అని, మర్నాడు నైట్‌కి పెళ్ళికి తప్పక రావాలని పిలుపు అందింది. 2 రోజులు సెలవు పెట్టి నల్గొండ వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు రాఘవరావు. అతనికి అప్పుడు తెలియదు, నల్గొండలో ఇంకొన్ని భయంకరమయిన విషయాలు తెలియబోతున్నాయి అని.

రాఘవరావు నల్గొండ స్టేషన్ లో దిగగానే, పెళ్లి వారింటికి వెళ్లకుండా, హోటల్‌లో రూమ్ తీసుకుని, రిలాక్స్ అయ్యేడు. మరొక స్నేహితుడి సునీల్‌కి ఫోన్ చేసేడు. సునీల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సి.ఐ.గా పనిచేస్తున్నాడు. సునీల్ 5 సంవత్సరాలుగా అదే స్టేషన్‌లో చేస్తున్నాడు. మధ్యలో వచ్చిన బదిలీ కూడా ఆపించుకున్నాడు. లోకల్ ఎం.ఎల్.ఎ. దగ్గర అతనికి పలుకుబడి వుంది.

సునీల్ స్టేషన్‌లో వున్నాడని తెలిసి, రాఘవరావు బయలుదేరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కి ఆటోలో వెళ్ళేడు. పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక, మధ్యాహ్నం లంచ్‌కి ఇంట్లో ఏర్పాటు చేయిస్తానని, పెళ్లి ఫంక్షన్‌కి నైట్‌కి వెళ్ళచ్చు అని సునీల్ అన్నాడు. సరే అన్నాడు రాఘవరావు.

మాట్లాడుతుండగా ఫోన్ వచ్చింది సునీల్‌కి. అతను ఫోన్ లోనే సెల్యూట్ చేసి మాట్లాడాడు.

‘బహుశా పై ఆఫీసర్ అయి ఉంటాడు’ అనుకున్నాడు రాఘవరావు.

ఫోన్ పెట్టేయగానే, “203” అని కానిస్టేబుల్‌ని పిలిచి, “1516 నెంబర్ ఫైల్ అర్జంటుగా తీసుకుని రా” అని పురమాయించేడు.

ఫోన్ చేసింది డీఎస్పీ అని, ఒక ఫైల్ విషయంలో మాట్లాడమని అన్నారని చెప్పాడు సునీల్ రాఘవరావుతో.

5 నిముషాలలో ఫైల్ అతని టేబుల్ మీదకి వచ్చింది. ఫైల్ తీసి, “4 సంవత్సరాలకి ముందర క్లోజ్ అయింది అనుకున్న ఫైల్, ఇప్పుడు మళ్ళీ దీనితో పని పడింది” అని స్వగతంగా అనుకుంటూ ఫైల్ తెరిచాడు.

ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. వెంటనే అలెర్ట్ అయి పోయి “సార్ సార్” అంటూ 2 నిముషాలు మాట్లాడి, “సరే సార్, వస్తాను” అంటూ ఫోన్ పెట్టేసి, ఫైల్ మూసేసేడు.

రాఘవరావు వైపు తిరిగి, “ఒరేయ్ రాఘవా, ఏమీ అనుకోకు, ఒక్క 15 నిముషాలు బయట పని పడింది. మా డీఎస్పీ, తన భార్యతో పక్క వీధికి వస్తున్నాడు. వాళ్ళు ఒక ఫ్లాట్ కొనాలని అనుకుంటున్నారు. ఫ్లాట్ చూపించి వచ్చేయడమే.

నువ్వు నా రూమ్ లోనే కూర్చుని పేపర్ చూస్తూ వుండు. జర్నల్స్ కావాలంటే, ఇదిగో ఈ సొరుగులో ఉంటాయి, చదువుతూ వుండు. 15, 20 నిముషాల్లోనే వచ్చేస్తాను. వచ్చేక, నా వెహికల్లో ఇంటికి వెల్దాము” అన్నాడు.

“డీఎస్పీ అంటున్నావు, అంత త్వరగా వదులుతాడా నిన్ను” అన్నాడు రాఘవరావు.

“పర్వాలేదు. ఆయన ఫామిలీతో వస్తున్నాడు కదా, బిల్డింగ్ చూసి వెళ్లిపోవడమే. బిల్డర్‌తో రేపు మాట్లాడు తాము” అన్నాడు సునీల్. ఇంక రాఘవరావుకి తప్పలేదు.

కానిస్టేబుల్‌ని పిలిచి, “సర్ ఇక్కడే వుంటారు.. నేను బయటికి వెళ్లి వస్తాను. సార్‌కి కాఫీ తీసుకుని రా” అని చెప్పేడు సునీల్.

రాఘవరావు వైపు తిరిగి, “వచ్చేస్తానురా వెయిట్ చెయ్యి..” అంటూ సునీల్ వెళ్ళిపోయాడు.

సునీల్‌ది సెపరేట్ కేబిన్ అవడంతో రాఘవరావుకి కూడా కంఫర్ట్ గానే వుంది.

పేపర్, ఇండియా టుడే జర్నల్ తిరగేసినా బోర్ కొడుతోంది. సడన్‌గా ఐడియా వచ్చింది.

చిన్నప్పటినుండి, అపరాధ పరిశోధనలు చదవడం అలవాటు వున్న అతనికి కొత్తగా టేబుల్ మీదకి వచ్చిన కేసు ఫైల్ చదవాలి అనిపించింది, ఫైల్ తీసేడు.

ఫైల్ తిరగెయ్యగానే, ఒక వుత్తరం కనపడింది. హ్యాండ్ రైటింగ్ చూడగానే, రాఘవరావు గుండె వేగంగా కొట్టుకుంది. తేడా లేదు.. అదే లెటర్.. అదే చేతి రాత. తానూ రఫ్ కాపీ డైరీలో చూసినట్లు గుర్తుకొచ్చింది. “WITH LOVE నీ సుధ” అని ముగించిన వుత్తరం, లవర్ రమేష్‌కి 15.03.2017 న తప్పించుకుందామని సుధ రాసిన వుత్తరం. రాఘవరావుకి కుతూహలం పెరిగిపోయింది. ఏ సస్పెన్స్ అతన్ని వెంటాడుతోందో ఆ సస్పెన్స్ అతనికి తెలిపే ఫైల్ అది.

ఇంతలో కానిస్టేబుల్ రూమ్ లోకి ప్రవేశించేసరికి, ఏమీ ఎరగనట్లు సర్దుకుని కూర్చున్నాడు, ఫైల్ మూసేసేడు.

కానిస్టేబుల్ ఫైల్ టేబుల్ మీద నుండి తీసుకుని వెళ్ళిపోయాడు.

పూర్తిగా ఫైల్ చూడలేకపోయినందుకు బాధపడ్డాడు రాఘవరావు.

ఆ విషయం సునీల్ దగ్గర ప్రస్తావించాలా? లేక, తన వద్ద పనిచేస్తున్న సుధ ఇలా ఎందుకు చేసి ఉంటుందో తెలుసుకున్నాక చెప్పాలా? అని ఆలోచిస్తున్నాడు రాఘవరావు.

ఇంతలో సునీల్ తిరిగి రావడం, కలిసి భోజనాలకి వెళ్లడం జరిగింది. భోజనాలయ్యేక సుధ తన వద్ద పని చేస్తున్న విషయం దాచి, “ఫైల్ No.1516 ఏమిటిరా.. అంత అర్జంటుగా తీయమని మీ డీఎస్పీ గారు చెప్పేరు కదా” అని ప్రశ్నించేడు.

“నువ్వు స్టేషన్‌కి వచ్చినప్పుడు తీయించిన ఫైల్ గురించేనా అడుగుతున్నావు?” అన్నాడు సునీల్.

“అవునురా” అన్నాడు రాఘవరావు.

“అది, ఒక పరువు హత్య కథ రా” అన్నాడు సునీల్. అని, మళ్ళీ ఇలా వివరించేడు:

“సుధ, రమేష్ లవ్ చేసుకున్నారు. 15.3.2017న రైలు ఎక్కి పారిపోయి, హైదరాబాద్లో పెళ్లి చేసుకోవాలని ఆ యువ జంట ఆలోచన. కులాంతర వివాహం ఇష్టం లేని సుధ తండ్రి ప్రకాశరావు కూతురికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసేడు. వినక పోవడంతో, కిరాయి గూండాలతో రమేష్‌ని చంపించాలని ప్లాన్ వేసేడు. 15వ తేదీ నైట్ వాళ్లిద్దరూ పారిపోతున్నప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ మీద దాడి జరిగింది. గొడ్డలి వేటు పడుతున్నప్పుడు, అడ్డుపడడంతో, ఆమె కూడా అతనితో బాటు చనిపోయింది. 2017లో ఇదొక సంచలనం. ప్రకాశరావుని అరెస్టు చేయడానికి వెళ్లిన మా పోలీసులకి దొరకకుండా దేశాలు పట్టి పోయాడు.

6 నెలలు తిరగకుండా అతని భార్య చనిపోయింది. 5 సంవత్సరాలుగా వెతుకుతున్న ఆ ప్రకాశరావు నాగపూర్‌లో సన్యాసిగా ఉన్నట్లు న్యూస్ వచ్చింది. మా టీం నాగపూర్ వెళ్లి అతన్ని పట్టుకుని తిరిగి వస్తూ ఉండగా వాన్‌కి ఆక్సిడెంట్ అయ్యి, మా పోలీసు వాళ్ళకి గాయలయ్యేయి. ప్రకాశరావు మాత్రం చనిపోయాడు. రేపో మాపో అతని డెడ్ బాడీ మహారాష్ట్ర పోలీసులు మనకి అందజేస్తారుట. అదీ మా DSP చెప్పింది. ఆ ప్రకాశరావు తాలూకు వాళ్ళు ఎవరయినా ఉన్నారేమో డెడ్ బాడీ అప్పగించడానికి.. అని వాకబు చెయ్యమని చెప్పేరు” ..అని ఆపాడు సునీల్

రాఘవరావుకి ఒక విషయం అర్థం అయింది. ఆ చనిపోయిన సుధ, తన వద్ద పని చేస్తున్న సుధ ఒకరు కాదు అన్న మాట. మరి ఆ ఫైల్ లో చూసిన ఉత్తరానికి కాపీ ఆ డైరీలో రాసి ఉండడం చూసేడు కదా.. అదెలా సాధ్యం? పైగా అదే హ్యాండ్ రైటింగ్. ఏదో మిస్టరీ వుంది అనిపించింది.

“నయం.. తన ఆఫీస్‌లో పని చేస్తున్న సుధ గురించి సునీల్ దగ్గర చెప్పలేదు..” అని అనుకున్నాడు.

ఇంకేమీ మాట్లాడకుండా, సునీల్ ఇంటి నుండి పెళ్ళికి వెళ్లి, తిరిగి హైదరాబాద్ వచ్చేసాడు. వచ్చేడు కానీ, జవాబు దొరకని ప్రశ్నలు వేధిస్తూ ఉంటే స్థిమితంగా ఉండలేక పోయాడు.

మర్నాడు యథాప్రకారం ఆఫీస్‌కి వెళ్ళేడు రాఘవరావు. “గుడ్ మార్నింగ్” అని విష్ చేసింది సుధ.

“గుడ్ మార్నింగ్! నిన్న నేను నల్గొండ వెళ్లి వచ్చాను”  ..ఆమె అడగకుండానే చెప్పేడు సుధతో.

“నల్గొండ” అన్నప్పుడు ఆమె మొహంలో రంగులు మారడం గమనించేడు..

ఇవాళ ఏదో ఒకటి తేల్చుకోవాలి అను కున్నాడు మనసులో.

మధ్యాహ్నం లంచ్ అయ్యాక చక్కటి అవకాశం దొరికింది రాఘవరావుకి. సుధ ని ప్రాజెక్ట్ వర్క్ పేరు మీద తన కేబిన్‌కి పిలిపించు కున్నాడు. పది నిముషాలు ఆఫీస్ సంభాషణలు అయ్యేక, ఇలా అన్నాడు:

“సుధా.. నువ్వు రమేష్‌ని లవ్ చెయ్యలేదా? అతనికి లెటర్ రాసి, ఇంట్లోంచి తప్పించుకుని వెళ్లి పోయి పెళ్లి చేసుకుందామని అనుకోలేదా? అలా పారిపోయేటప్పుడు అతన్ని చంపించింది ఎవరు?” అని ప్రశ్నల వర్షం కురిపించాడు.

బిత్తరపోయింది సుధ.

ముందురోజు నల్గొండలో తాను తెలుసుకున్న పరువు హత్య విషయం, తన స్నేహితుడు అయిన సి.ఐ. ద్వారా తెలిసిందని చెప్పేడు.

సుధ ముఖం పాలిపోయింది. ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఇలా చెప్పింది:

“ఆ వుత్తరం నేను రాసింది కాదు. అది మా అక్క సుధ రాసింది. మా నాన్న ప్రకాశరావు గారికి ఇద్దరు ఆడపిల్లలం. ఆయనకి ‘సుధ’ అన్న పేరు చాలా ఇష్టం. అక్కకి సుధ అని, 2 సంవత్సరాల తర్వాత పుట్టిన నాకు ‘రాగ సుధ’ అని పేర్లు పెట్టేరు.

అది బి.టెక్. నాలుగవ సంవత్సరం చదివేది. నేను రెండవ సంవత్సరం. అది రమేష్‌ని ప్రేమించింది. రమేష్ ఒక అనాథ. హాస్టల్‌లో వుండేవాడు. మా నాన్నకి వాళ్ళ ప్రేమ ఇష్టం లేదు. అది రమేష్‌ని వదులుకోను అంది. మా నాన్న మూర్ఖంగా ఆలోచించేడు. కిరాయి గూండాలతో రమేష్‌ని అంతమొందించడానికి చేసిన ప్రయత్నంలో అక్క కూడా అతనితో బాటు మరణించింది.

ఆవేశంలో మా నాన్న చేసిన తప్పుకు మా జీవితాలు చిన్నాభిన్నం అయ్యేయి.

మా నాన్న దేశాలు పట్టిపోయాడు. అమ్మ బెంగతో మంచం పట్టి చనిపోయింది. మా పక్కింటి సురేష్ వాళ్ళ కుటుంబం నన్ను ఆదరించింది. నేను ఈ రోజు ఇలా వున్నాను అంటే వాళ్లే కారణం. 2019లో నాకు, సురేష్‌కి హైదరాబాద్‌లో వుద్యోగం రావడంతో మేము హైదరాబాద్ వచ్చి పెళ్లి చేసుకున్నాం. మిగిలిన విషయాలు మీకు తెలిసినవే.” అంది.

“మరి.. ఆ హ్యాండ్ రైటింగ్ నీ హ్యాండ్ రైటింగ్ లాగే వుంది?” అన్నాడు రాఘవరావు.

“ఓ! అదా.. మా ఇద్దరి హ్యాండ్ రైటింగ్ ఒక్కలాగే ఉంటుంది.” అంది. అప్పుడు డైరీ విషయం చెప్పేడు.

“దానికి ప్రతీదీ డైరీలో రాసే అలవాటు. అది చివరిసారిగా రాసిన ఉత్తరాలు ఆ డైరీ లోనే రాసింది. అది ఒక సారి రాసి కానీ ఫెయిర్ చేసేది కాదు. అది దాని అలవాటు..” అంది రాగ సుధ అనబడే ‘సుధ’.

విషణ్ణ వదనంతో వున్న సుధని చూస్తే జాలి వేసింది.

‘దేశాలు పట్టి పోయాడు, ఎక్కడో బతికే ఉంటాడు’ అనుకుంటున్న ఆమె నాన్న బతికి లేడనే చేదు వార్త తన నోటితో చెప్పలేను అనుకున్నాడు.

సాయంత్రం ఆమె ఫోన్ నెంబర్ ఇన్‌స్పెక్టర్ సునీల్‌కి పంపించి, ప్రకాశరావు డెడ్ బాడీ అందించాలంటే, ఆమెకి ఫోన్ చెయ్యమని చెప్పేసేడు.

Exit mobile version