Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆమె గెలిచింది

“నిజమైన క్రీడాకారుడు ఆటల్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఓడిపోతాడు. కానీ జీవితంలో మాత్రం ఓడిపోడు” అని చెప్పే స్పందన అయాచితం కథ ‘ఆమె గెలిచింది‘. 2019 ఉగాది సందర్భంగా సంచిక ప్రచురిస్తున్న క్రీడా కథల సంకలనంలో ఎంపికయిన కథ.

రోజు నేషనల్ బ్యాడ్ మింటన్ ఛాంపియన్ షిప్ ఫర్ విమెన్ ఫైనల్స్.

స్టేడియం అంతా కిక్కిరిసి పోయింది. మామూలుగానే జరిగే పోటీలకు ఇంత జనం రారు. విమెన్ పోటీలకు అసలే రారు. కానీ ఈ సారి దేశం నలుమూలల నుంచి జనం వచ్చారు. స్టేడియం దాటిపోయి చుట్టుపక్కల కూడా జనాలు నిండిపోయారు. పేరు మోసిన పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చారు. క్రికెట్ క్రీడాకారులు వచ్చారు. వాళ్ళను చూసి జనం ఈలలు, గోలలు.

మా కమిటీకి సెక్యురిటీతో తల నొప్పి ఎక్కువయింది. కారణం ఆ రోజు ఫైనల్స్‌లో ఆడేది మైథిలి.

మైథిలి, బ్యాడ్‌మింటన్ జూనియర్స్ అండర్ నైన్టీన్ సింగిల్స్ పోటీల్లో పాల్గొనే వారిలో ఈ పేరు తెలియని వారు లేరు. ఈ సారి ఇండియన్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటుంది. ఇప్పటికే “మహారాణి గాయత్రీ దేవి కప్ ఒలంపియన్ బ్యాడ్ మింటన్ ఛాలెంజ్ కప్ ఫర్ విమెన్” లో ఆమె ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది.

ఆమెని పొగడని పత్రిక లేదు. మెచ్చుకోని మనిషి లేడు. ఈసారి ఇంటర్నేషనల్ పోటీలకు ఆ మైథిలి మీదే ఆశంత. ఆమె రాకెట్ తిప్పితే మెరుపు మెరిసినట్టు ఉంటుంది. అతిశయోక్తి కాదు. దాని ప్రత్యక్ష సాక్షిని నేనే.

మగవారు సైతం ఆమె ధాటిని తట్టుకోలేరు.

చాలా మంది క్రీడాకారులు మెళకువలు నేర్చుకుంటారు. అతి కొద్ది మందే అది సహజంగా పుట్టుకతో తెచ్చుకుంటారు. మైథిలిది అంతే.

“షి ఈస్ బోర్న్ విత్ టాలెంట్”.

ఆట ఇంకాసేపటిలో మొదలు కాబోతుంది. సాధారణంగా కమిటీ తరపు వారు ఆటకు ముందు క్రీడాకారులని కలవరు.

కానీ నేను అలా కాదు. ముందుగా ఇద్దరినీ కలుస్తాను. ప్రోత్సాహం ఇస్తాను. నా ఉద్దేశం ప్రకారం ఇద్దరూ నా శిష్యులే.

ఎవరు గెలిచినా నాకు సంతోషమే కాని ఈ సారి ఒక ప్రత్యేకత ఉంది. నాకు స్వయంగా మైధిలిని కలవాలని ఉంది.

ముందుగా మైథిలికి ప్రత్యర్థిగా ఆడుతున్న సుమన్‌ని కలిసాను. చాలా ధైర్యంగా ఉంది. నాకు ముచ్చటేసింది.

“నీకు పోటీ ఇచ్చేది మైథిలి కదా! ఓడిపోతావని భయం లేదా??” అని ఎవరో అడిగిన ప్రశ్నకు ‘గట్టి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తే ఓడిపోయినా విలువ ఉంటుంద’ని సమాధానం ఇచ్చింది. నాకు ఆ సమాధానం విని సంతోషం వేసింది.

మైథిలి ఉన్న గదిలోకి వెళ్ళాను. నన్ను చూసి చుట్టూ ఉన్న వాళ్ళని ఉండమని చెప్పి నా దగ్గరకు వచ్చింది. “ఆల్ ది బెస్ట్, బాగా ఆడు” అన్నా నవ్వుతూ. మైథిలి వినయంగా తలూపింది.

“సర్! మా అమ్మ, నా గైడ్, టీచర్, నా కోచ్” తన వెనకాలే నిల్చున్న తన తల్లిని చూపించి పరిచయం చేసింది.

“నమస్తే అమ్మా!” నేను మర్యాదగా అన్నాను.

“నమస్తే సార్!” ఆమె కొంచెం ముందుకు వచ్చి పలుకరించింది.

అబ్బా!, ఎక్కడో బాగా తెలిసిన ముఖం, చాలా పరిచయం ఉన్నట్లు, చాలా దగ్గరి బంధం. గుర్తు రావడం లేదు.

ఒక్క సెకన్ మనసులో అలజడి. ఆలోచనల్లో పడి మాటలు మరిచి పోయాను. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.

“మీ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉంది మేడమ్!” పొడిపొడిగా అన్నాను.

“మేడం ఎందుకు సార్!! నా పేరు పల్లవి. పల్లవి అని పిలవండి” అంది తల దించుకొని. పల్లవి!!…పల్లవి!! ఔను తను పల్లవే.

నేను పల్లవిని ఎలా మర్చిపోగలను. నేనే కాదు….! ఆ రోజు జరిగిన సంఘటన చూసిన వారు ఎవ్వరూ పల్లవిని మర్చిపోలేరు. సరిగ్గా పాతికేళ్ళ క్రితం..

***

పల్లవి హడావిడిగా ట్రైన్ ప్లాట్‌ఫామ్ మీద పరిగెడుతోంది.

“సార్ బొంబాయ్ వెళ్ళే టైన్ ఏ ఫ్లాట్ ఫామ్ సార్?!”

“అదిగో ప్లాట్ ఫామ్ మూడు. రెండు నిమిషాల్లో బయలుదేరిపోతుంది” టి.సి తొందర చేసాడు. పల్లవి వెంటనే పరుగందుకుంది.

ఏమైతేనేం ట్రైన్లో వచ్చి పడింది. ఆయాసపడుతూ వచ్చి ఒక సీట్లో కూర్చుంది. చుట్టూ చూసింది.

ఎదురుగా తనకు తెలిసిన వాడే…! శరత్. హమ్మయ్య పల్లవి మనసు తేలిక పడింది.

“ఏమ్మా నువ్వు…!” శరత్ పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు.

“అంకుల్ నేను పల్లవిని”.

“ఓ వెరీ గుడ్. అదే ఎక్కడ చూసానా అనుకున్నా. బాంబేకి నువు కూడా వెళుతున్నావా?!” “అవును అంకుల్….”

“మంచిది. ఎప్పుడమ్మ నీ టోర్నమెంట్?”

“రేపే అంకుల్. అండర్ 16”

“అయ్యో రేపేనా!? మరి ఈ రోజు ప్రయాణం. రేపెలా ఆడతావమ్మ…”

పల్లవి ఏం మాట్లాడలేదు.

“ఇదిగో మావాడు శరత్ వీడు అండర్ 19 ఆడుతున్నాడు. కాని ఎల్లుండి.”

“తెలుసంకుల్. పేపర్లో చదివాను. ఒకసారి కలిసాను కూడా”.

పల్లవి శరత్‌ని చూసి నవ్వింది.

“మీ అమ్మా, నాన్న ఎవరూ రాలేదే?!”

“రేపు వస్తానన్నారు” పల్లవి కొంచెం తడబడుతూ అంది.

అతను అనుమానంగా మొఖం పెట్టాడు.

“పోనీలే ప్రస్తుతానికి నేను ఉన్నాను కదా!” నచ్చ చెప్పాడు.

కాసేపటికి టి.సి వచ్చాడు.

పల్లవి మొఖం వెలతెలా పోయింది.

“ఏమ్మా నీ టికెట్ ఏది?”

“టికెట్ లేదు….!”

“ఫరవాలేదు. ఇప్పుడైనా కొనొచ్చు” టి.సి చిన్నగా నవ్వాడు.

“నా దగ్గర…డబ్బులు లేవు”.

“ఏంటీ??”

అందరూ ఆశ్చర్యపోయారు.

“అదేంటమ్మా…!”

“అంకుల్ ప్లీజ్, నాకు ఈ సహాయం ఒకటి చేయండి..”

“అంకుల్ నాకు మీరే టికెట్ కొనరా?!” గుటకలు మింగుతూ అంది.

పల్లవి ఏడ్చేస్తూంది.

“సరే సరే!” ఆయన విసుక్కున్నాడు.

“హైదరాబాద్ తిరిగి రాగానే ఇప్పించేస్తాను”.

“అనవసరంగా అంటుకున్నాను…. ఇదేంటి నాకీ ఖర్మ!!” ఆయన గొణుక్కున్నాడు.

“ఏంటమ్మా డబ్బులు కూడా లేవా!! అసలు, ఒంటరిగా ఒక ఆడపిల్లని నీ తల్లిదండ్రి ఎలా పంపించారు. అది కూడా ఒక చిల్లిగవ్వ చేతిలో లేకుండా!!” ఆయన విరుచుకు పడ్డాడు.

“అంకుల్…! నేను వచ్చిన సంగతి అమ్మా నాన్నకు తెలియదు” పల్లవి కంగారుపడి పోయింది.

“మరి???”

 నేను పారిపోయి వచ్చాను”.

“ఆ…..!” ఆయన నోరు తెరిచారు. పక్కనే ఉన్న శరత్ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నాడు..

“ఏంటీ నీకేమన్నా పిచ్చా?? ఏమన్నా ఆలోచించావా?? విషయం తెలిస్తే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎంత కంగారు పడతారు?! అసలే వెళుతున్నది బొంబాయి నగరం. ఆడపిల్లవి… అసలు బుద్దుందా!!”

“అంకుల్ అంకుల్ ప్లీజ్ నా మాట వినండి…”

“ఏం కుదరదు… వచ్చే స్టేషన్లో నువ్వు దిగుతున్నావు. అక్కడ మీ అమ్మ నాన్నకి ఫోన్ చేస్తాను. నిన్ను స్టేషన్ మాస్టారుకి అప్పజెప్తాను. అంతే!!!” ఆయన వేలు చూపిస్తు బెదిరించారు.

“అంకుల్ నా మాట వినండి. తెలిస్తే మా నాన్న నన్ను ఆడనివ్వరు. ఆయనకు నేను ఆడడం ఇష్టం లేదు. అంకుల్ ఒక్కసారి నేను అక్కడ ఆడి గెలిస్తే నేనే ఫోన్ చేసి చెప్తాను. అక్కడ నా కోచ్ ఉంటానని చెప్పారు. ఆయన్ని కలవగానే కబురు చేస్తాను. ప్లీజ్ అంకుల్” పల్లవి బావురుమంది. ఆయన విసురుగా వెళ్ళి పడుకున్నాడు. కాసేపటికి అందరూ పడుకున్నారు. పల్లవి నిద్రపోలేదు. ‘వద్దు ఈ రోజు నిద్ర పోవద్దు, కనురెప్ప కూడా పడవద్దు’ ప్రతిజ్ఞ చేసుకుంది. మధ్య రాత్రిలో శరత్ లేచి చూసి ఆశ్చర్యపోయాడు.

“ఇంకా పడుకోలేదా??”

“అదీ…. ఒకవేళ పొద్దున్న మెలుకువ రాకపోతే, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే…”

శరత్ చిన్నగా నవ్వాడు. “ఇదిగో అమ్మ నాకు చపాతీలు కట్టించింది. తింటావా?!”

పల్లవి ఆశగా తలూపింది.

“తినేసి పడుకో…రేపు నిన్ను నేను నిద్ర లేపుతాను….”

బ్యాడ్‌మింటన్ అకాడమి, బొంబాయి చేరేటప్పటికి ఆరోజు ఆటకు సన్నాహాలు మొదలైపోయాయి. పల్లవి హడావిడిగా తన కోచ్ కోసం వెతుక్కుంటూ పరిగెత్తింది.

***

“సార్ నా పేరు ప్రభాకర్, తను నా కొడుకు శరత్, రెండు రోజులు తరువాత అండర్ నైన్టీన్ టోర్నమెంట్లో ఆడుతున్నాడు.”

అక్కడ ఉన్న వ్యక్తి రిజిస్టర్ చెక్ చేసాడు.

“అవును సార్..! చెప్పండి మీకేం సహాయం చెయ్యాలి!!”

“సార్, నాకో చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ రోజు అండర్ సిక్స్టీన్ విమెన్ విభాగంలో హైదరాబాద్ తరఫున ఆడుతున్న పల్లవి గురించి కొన్ని వివరాలు కావాలి. ఆమె ఇంటి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ ఏమైనా ఉన్నాయా??”

ఆ వ్యక్తి రిజిస్టర్ తిరగేసాడు.

“సార్, కొంచెం చూడండి. నాకా వివరాలు తెలియడం చాలా అవసరం” ప్రభాకర్ ఒత్తిడి చేసాడు.

అతను ముందు వెనుక కాస్త తటపటాయించి, “సార్ ఈ రోజు ఆటలు మొదలవుతున్నాయి. ఆఫీసులో చాలా హడావిడిగా ఉంది. చాలా మంది పనుల కోసం ఎదురుచూస్తున్నారు. మీరు ఒక పని చేయండి.”

అతను ఒక్క క్షణం ఆగి “రాజేందర్!!” కొంచెం దూరంలో కూర్చున్న అతన్ని పిలిచాడు. “సార్, ఇతను ఇవాళే ఉద్యోగంలో చేరాడు. మీకేం కావాలో ఇతన్ని అడగండి.”

“సార్ చెప్పండి.”

“నాకు పల్లవి అనే అమ్మాయి గురించి వివరాలు కావాలి.”

రాజేందర్ ఉన్న రికార్డ్స్ అన్నీ చూసాడు.

“లాభం లేదు. సార్! నాకు కొంచే టైం ఇవ్వండి ఈ రోజు సాయంత్రం కల్లా వెతికి పట్టుకుంటాను.”

“ప్లీజ్ కొంచెం త్వరగా” ప్రభాకర్ ఖచ్చితంగా చెప్పాడు.

తన మొదటి రోజు ఉద్యోగంలో తను చేసే మొదటి పని, రాజేందర్ తన పని మీద శ్రద్ధ పెట్టాడు. క్వార్టర్ ఫైనల్స్ పూర్తయ్యాయి. ఆ రోజు ఆటలో పల్లవి గెలిచింది. రెండు రోజుల తర్వాత సెమీ ఫైనల్స్.

“సార్, నాకు అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఏం దొరకలేదు. కానీ ఆమె చదివే స్కూల్ వివరాలు దొరికాయి. ఇదిగో” అతను చేతికి అందించాడు.

చెప్పిన పని పూర్తిగా చేయలేక పోయానన్న వెలితి రాజేందర్లో స్పష్టంగా కనిపించింది.

“సరే! వెంటనే కాల్ చెయ్” ప్రభాకర్ తొందర పెట్టాడు.

“సార్! ఇప్పుడు ఆరు కావస్తుంది. స్కూల్ మూసేస్తారు”.

“అయ్యో రేపు సండే…ఇప్పుడెలా?? తరువాత మా వాడి టోర్నమెంట్, నాకు కుదరదు.”

“సార్, ఎందుకంత కంగారు పడుతున్నారు?” రాజేందర్ విషయం ఏంటని అడిగాడు.

“ఏం చెప్పమంటారు!! ఇదిగో ఈ అమ్మాయి ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చింది. నాకు ఆ విషయం తను ట్రైన్‌లో కలిసినప్పుడు చెప్పింది. అప్పుడే వాళ్ళ తల్లిదండ్రులకు చెపుదామంటే కాళ్ళావేళ్ళా పడి ఏడ్చింది. ఏం చేస్తాం!! కానీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఆలోచిస్తే భయంగా ఉంది. నేనూ ఒక తండ్రినే! ఉన్న పళాన ఆడపిల్ల కనిపించక పోతే ఇంకేమన్నా ఉందా? ఎంత భయపడతారు. ఆడపిల్ల, బొంబాయి నగరం, ఒంటరిగా అంటే మాటలా!”

“నిజం సార్, అయ్యో ఎంత ప్రమాదం!! సార్, నేను ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నాకు అప్పజెప్పిన మొదటి పని. ఛాలెంజ్‌గా తీసుకుంటాను. ఎట్టి పరిస్థితిలో సోమవారం పల్లవి తల్లిదండ్రులకు విషయం అందేలా చేస్తాను.”

***

మంగళవారం పల్లవి సెమీఫైనల్ ఆట మొదలైంది. ఆ రోజు ఆట చూడడానికి వచ్చిన జనం ఆటతో పాటు ఒక అద్భుతం చూసారు. పల్లవి రాకెట్ ఎత్తి కాక్ సర్వ్ చేసిన ప్రతిసారి పులిపంజా ఎలా విసురుతుందో చూసారు.

ఒక క్రీడాకారిణి ఆటలో ఇంత పంతం ఉంటుందా! ఇంత బలం ఉంటుందా?

తోటి మగ క్రీడాకారులు ఆమె ఆటలో తీవ్రతను చూసి ఖంగుతిన్నారు. కమిటీ వాళ్ళు విమెన్స్ విభాగంలో ఇంత అరుదైన ఆట ఎప్పుడూ చూడలేదు.

ఆట ముగిసింది. అందరూ వచ్చి పల్లవిని పైకి ఎత్తేసారు. పల్లవి కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. గబగబా కళ్ళు తుడుచుకుంది. ఎదురుగా తన తండ్రి, అన్న, “నాన్న” అని పరిగెత్తుకుంటూ దగ్గరికి వెళ్ళింది.

పల్లవి అతని దగ్గరికి చేరిందో లేదో, అతను తన కుడి చేయి ఎత్తి ఫట్ మని పల్లవి చెంప మీద కొట్టాడు.

ఆ ధాటికి పల్లవి కింద పడిపోయింది. ఆడిటోరియం అంతా నిశ్శబ్దం. పరిస్థితి గమనించి కమిటీ వాళ్ళు అక్కడికి వచ్చారు.

“నాన్నా సారీ నాన్నా!! మీరు ఒప్పుకోవటం లేదు. అందుకే పారిపోయి వచ్చాను.”

“పద, ఇంటికి!!” అని కింద పడిపోయిన పలవిని తన అన్న బలవంతంగా పైకి లేపాడు. కంగారుగా కోచ్ దగ్గరికి వచ్చాడు.

“ఏంట్రా?, మాకు అమ్మాయిని పంపించడం ఇష్టం లేదని చెప్పాం. అస్సలు వీలు కాదని చెప్పాం. అందుకని, మాకు తెలియకుండా ఇంట్లోంచి పారిపోయి రమ్మని అడ్డమైన సలహాలు ఇస్తావా?”

కోచ్ వణికి పోయాడు. అయోమయంగా పల్లవివైపు చూసాడు.

“నాన్నా, కోచ్ సార్‌కు ఏమీ తెలియదు. నేను పారిపోయి వచ్చిన సంగతి చెప్పలేదు.”

“నువ్వు నోరుముయ్యి, సిగ్గులేని దానా. మా ఇంటి ఆడపిల్లలు గడప దాటరు అని ఎంత మంది చెప్పిన వినలేదు. సర్లే ఆడపిల్లల స్కూల్ కదాని పదవ తరగతి వరకు చదివించాను. ఆడే ఆటలు స్కూలు వరకు పరమితమే కదా అని ఊరుకున్నాను. ఇలా బట్టలు విప్పి అందరి ముందూ గంతులేసి నా పరువు తీస్తావనుకోలేదు” అతను కోపంతో ఊగిపోతున్నాడు.

అప్పటికే అందరూ గుమిగూడారు. మీడియా వాళ్ళు కొంతమంది చూస్తూ ఉన్నారు. విషయం కొంచెం చేయి దాటి పోయేలా ఉంది.

బ్యాడ్‌మింటన్ కమిటీలో ఒక పెద్దమనిషి గ్రహించాడు. కొంచె తేలిగ్గా నవ్వుతూ “పోనీలెండి సార్, చిన్న పిల్ల. పాపం ఆట మీద ఇష్టంతో అలా చేసింది. అయిందేదో అయిపోయింది. పల్లవికి బ్యాడ్‌మింటన్లో చాలా ఫ్యూచర్ ఉంది. ఆమె చేతిలో మంచి నైపుణ్యం ఉంది. ఇంటర్నేషనల్లో రాణించవచ్చు.”

ఒక్క ఉరుము ఉరిమాడు పల్లవి తండ్రి.

“మీరు కమిటీవాళ్ళా లేక బ్రోకర్లా?? ఆడవాళ్ళతో ఇలా చిన్న చిన్న గుడ్డలు వేయించి బజార్లో నిలబెట్టారు. ఇప్పుడు దేశ విదేశాల్లో చేయమంటున్నారు. సిగ్గుగా లేదా?”

“సార్ మీరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు” కమిటీ మెంబర్ హెచ్చరించాడు.

పల్లవి తండ్రి కొంచం తగ్గాడు. రెండు చేతులు జోడించి “అయ్యా! మీది బొంబాయి. ఇక్కడ ఇవన్నీ సాధారణ విషయాలు కావచ్చు, కానీ మా ఇల్లు, ఇంటి పద్దతులు వేరు. మా ఇంటి ఆడపిల్లలు గడపదాటి బయటకు రారు. దించిన తల ఎత్తరు. మాకు పరువు ప్రాణం కంటే ఎక్కువ. మమ్మల్ని దయచేసి విడిచిపెట్టండి” ఇంక ఎవ్వరు నోరు ఎత్తలేదు.

పల్లవిని ఈడ్చుకుంటు తీసుకువెళ్ళి కారులో తోసారు. విసురుగా ‘ధాడ్’మంటూ కార్ డోర్ వేసాడు. అక్కడితో పల్లవి కథ ముగిసిపోయింది.

***

ఇదిగో మళ్ళీ పాతికేళ్ళ తరువాత, ఇలా… పల్లవిని చూసాను. కళ్ళ కింద ముడతలు పడ్డాయి. జుట్టు కొంచెం రంగు మారింది. కాని అదే ఆత్మవిశ్వాసం. అదే ధైర్యం.

“మా అమ్మే నా గురువు, నా కోచ్” అంది మైథిలి. అప్పుడు తెలుసుకున్నాను..

అందరూ అనుకున్నట్టు పల్లవి కథ ఆ రోజుతో ముగిసి పోలేదు. కేవలం విరామం తీసుకుంది. కొంతకాలం విరామం. సమాజపు అభ్యంతరాల వల్ల ఒక చిన్న బ్రేక్… అంతే. ఇదిగో ఇప్పుడు మళ్ళీ తను ఆట మొదలుపెట్టింది. తన ప్రతిబింబానికి ఆత్మగా మళ్ళీ బరిలోకి దిగింది.

ఆరోజు నాకో విషయం అర్థమైంది. ఎన్నాళ్ళ నుంచో వెతుకుతున్న దానికి సమాధానం తెలిసింది. క్రీడాకారుడంటే జనానికి ఎందుకంత పిచ్చి.

ఎందుకంటే నిజమైన క్రీడాకారుడు ఆటల్లో ఒక్కసారైనా ఖచ్చితంగా ఓడిపోతాడు. కానీ జీవితంలో మాత్రం ఓడిపోడు. ఓటమి ఎరుగని వాడంటే ఎవరికి ఇష్టం ఉండదు?? ఇంతకీ ఈ కథ నాకెలా తెలుసంటారా?!

ఉద్యోగంలో చేరిన మొదటిరోజు వచ్చిన మొదటి పని అని పంతం పట్టి మరీ పల్లవి తల్లిదండ్రులకి విషయం తెలియజేసానే ఆ ఘనుడ్ని నేనే!!!

Exit mobile version