[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారు రచించిన ‘ఆమె కథలు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆమె పుట్టిన రోజు లెక్కకు
కార్యాలయ బాధ్యతల గడువు ముగిసింది.
వీడ్కోలు సభలో విందు నిచ్చారు.
కృష్ణుని గీతా బోధను చిత్రంగా కానుక నిచ్చారు.
ఆమె ఉత్సాహంగా ఊబరెక్కింది.
ఇంటికి తిరిగొచ్చి దీర్ఘ శ్వాస పీల్చింది.
ఇంతకాలం అతికిన
రెండు భుజాలకు
సహస్ర రెక్కలనిప్పుడు
దులిపి వేసింది.
ఇంటి ముంగిట పూల మొక్కలను చూచింది.
వాలి వచ్చిన రెక్కల సీతాకోక చిలుకల
ముచ్చటకు మురిసింది.
కుసుమ పరాగ ధూళికి
కొత్త ఆశలను పులిమింది.
ఆతని పక్కన చేరి కూచుంది.
పిల్ల పాపల సంగతులనెన్నింటినో
ముచ్చట లాడింది.
చీర కుచ్చిళ్ళ నడుముకు
దోపిన బాధ్యతల నన్నింటిని
కొంగు చివరకు జారవిడచింది.
బజారు కెళ్ళింది. లేత కూరల నేరింది.
పావుశేరు తక్కెడ ముల్లెటు వంగిందో మేలమాడింది.
పని కట్టుకు సమయం ఖర్చు చేసింది.
ఇరుగు పొరుగులకు వెళ్ళింది.
సంసార విషయాల సంగతులనడిగింది.
అత్త కోడళ్ళ విరస సరసాలను
కొత్తగ తెలుసుకుంది.
యోగ ప్రవచనాల జతకు కలిసింది.
చిన్ని చిన్ని సరదాలలో తేలి ఆడింది.
మలయ సమీరాలను
దోసిట నింపింది.
ఈ జీవననమిలా కొనసాగిపోవాలని
దేవునికి దీపం పెట్టింది.
ఆ రోజున వత్తి రెప రెప లాడింది.
ప్రమిదలో నూనె అడుగు అంటింది.
భర్త మూలుగొకటి రమ్మని పిలిచింది.
సపర్యల మంచం దాంపత్యానికి
ముడుపు కట్టింది.
సూర్యుడు మునిగిన వేళకు
పడమట దృశ్యం ధారావాహిక
కొనసాగిపోయింది.
ఎప్పుడెంత సుఖపడిందో
తెలియని అగమ్య గోచరంలో
కనుపాపల
నీటి బుగ్గలతో
బాహ్యాకాశ శూన్యానికి బెదరక
హృదయ భూమిని సారవంతం చేసింది.
ఇంటి పై కప్పున
ఇంద్రధనుసు వర్ణాలనన్నింటిని
కలబోసి
పిల్లల భవితవ్యానికి
బ్రతుకు విలువల గట్టి పునాది
కథల పుటలను తెరచింది.
సందీప గురుని సాంగత్యాన
స్నేహం ఒడిని నింపుకున్న
కృష్ణకుచేలుర కథను వినిపించింది.
అర్జునుని
ఏకాగ్రతల విలు సారింపులను
శ్రవణాలకు నాటింది.
గౌతముని దయల పరమార్థము
తెలిపింది
బడి చదువుల పాఠాలకు తోడు
ఆమె కథలు వినిపించిన ఊహాలోకపు ధాటి
బాలురకు
భవితవ్యాన భయమన్నది లేని
దూది పింజల కలల
రంగు రంగుల పూలజల్లుల
డోలా యాత్రల
హోలీ పండుగ ఆచరణలకు కదలి రమ్మంది.