Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆమె

[స్వాతీ శ్రీపాద గారు రచించిన ‘ఆమె’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

డ్డకట్టిన నదిలా
తెల్లని మంచు ముద్దలా విస్తరించి ఉంది
పొగపేరుకున్న చూపులను దాచుకుంటూ
నిండు మేఘాలను చిరునవ్వులు చేసుకు
సగం చెక్కిన విగ్రహం లా అనిపిస్తుంది.

పెదవులు కదిలించకముందే
నాలుక చివర మాటల మడతలను సరిచేసుకుంటూ
మృతభాషనూ లోలోనే దిగమింగుకుంటూ
మధుర సంగీతాలనూ
మెత్తని గులకరాళ్ళను పలకరించే నదినీటిలా
పరస్పరం ఓదార్చుకునే ఇసుక రేణువుల్లా
స్వరాలను నురగలు నురగలుగా వినిపిస్తుంది

రెల్లు పూవు కొమ్మలా ఊగే ఒంటి చివర
ముద్దమందారంలా అరవిరిసిన ఆమె
తెల్ల మేఘంలా కదిలినప్పుడు
ఒక్కసారి మగత నీళ్ళలో మునిగినట్టుగానే ఉంటుంది
ఆమె గతంలోకి పొగమంచులా కరిగినప్పుడు
ఉప్పునీటి సముద్రాలు ఉప్పొంగుతాయి
ఉనికిని ముంచేస్తూ.

Exit mobile version