[శ్రీమతి శాంతిశ్రీ బెనర్జీ రచించిన ‘ఆమె స్వగతం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నన్ను భయపెట్టదు వార్ధక్యం!
నా వయస్సు అధిరోహించే నిచ్చెన
నన్ను వేదనకు గురిచెయ్యదు
కీళ్ళనొప్పులు ముడుతలు తెల్లజుట్టు
మానసికంగా నన్ను బాధించవు
నాకు తెలుసు వయస్సంటే
మనస్సులో శరీరంలో జీవనరీతిలో
వచ్చే సహజమైన పరిణామమని!
నన్ను భయపెట్టదు ఒంటరితనం!
నా కోసం నేను సమయం సమర్పించుకునే
అమూల్య అవకాశం అది
స్నేహం కరువైన తరుణంలో
నాకు నేనే నెచ్చెలి అయినప్పుడు
ఒంటరితనం అవుతుంది నా ప్రియ బాంధవి
నా ఆలోచనల విశాల నీలాకాశంలో
స్వేచ్ఛగా విహరించే విహంగాన్ని నేను!
కానీ —–
నన్ను వెంటాడే భరమొకటుంది!
నేనెవరికీ భారం కాకూడదని
మరొకరి బాధ్యతగా మిగలకూడదని
ఊహించని బంధంగా మారకూడదని
నా బలహీనతలు ఇతరుల
త్యాగాలకు నాంది కాకూడదని
నా వలన ఇతరుల నొసటిపై
చింతల గీతలు రాకూడదని
అందుకే —-
నా వయస్సు ఇతరులకు వెలుగునిచ్చే
అనుభవాల ఖజానా కావాలి
వారి జీవితాల్లో సఫలత నింపాలి
నా జీవితమొక రాయని కవితై
ప్రతి పదం జీవించడంలోని
ఆనందాల అనుభవాల లోతులను వివరించాలి
నా ఆఖరి రోజులు —-
పొగలుగక్కే టీ కప్పుగా మారి
త్రాగే ప్రతి గుటకలో
వెచ్చదనం తియ్యదనం వొలకాలి
నాకు నేనుగా నిలవాలి
బతుకులో ప్రశాంతత నిండాలి!
(ఎస్. గుహ థాకుర్తా బెంగాలీ కవితకు ప్రభావితమై చేసిన స్వేచ్చానువాదం.)
శాంతిశ్రీ బెనర్జీ గుంటూరులో పుట్టి పెరిగారు. ఎమ్.ఏ. వరకు వారి విద్యాభ్యాసం అక్కడే జరిగింది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీలో ఎమ్.ఫిల్. చేశారు. తీన్‌మూర్తి భవన్, డిల్లీలో నెహ్రూకు సంబంధించిన ‘సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ’ ప్రాజెక్ట్‌లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అప్పటినుండి కథలు, కవితలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్ రాస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. 2022 జూలైలో వారి కథా సంపుటి ‘మానుషి’, కవితా సంపుటి ‘ఆలంబన’ వచ్చాయి. 2024 డిసెంబర్ లో వారి ట్రావెలాగ్ ‘గమనకాంక్ష’, వ్యాస సంపుటి ‘వ్యాస వల్లరి’, హిందీలో వచ్చిన వారి కథల అనువాదం ‘మానుషి’ వచ్చాయి.
