[‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపరని అందిస్తున్నారు శ్రీ మైలవరపు సుధా మోహన్.]
ముగింపు:
పై సమాచారం అంతా బ్రిటిష్ పాలనకు పూర్వం దక్షిణ భారతదేశపు హిందూ సమాజం చాతుర్వర్ణాత్మకమే గానీ పంచవర్ణాత్మకమైనది కాదని స్పష్టం చేస్తుంది. ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, శాసనాలు, ప్రాచీన సాహిత్యాలలో శాశ్వతమైన, వ్యవస్థీకృత, దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ‘పంచమవర్ణం’ – ‘స్పృశ్య-అస్పృశ్య’ అనే వర్గీకరణకు చెందిన ప్రామాణిక ఆధారాలు లేవని ఈ వ్యాసం వివరించింది. వలసపాలనలో సృష్టించబడిన వర్గీకరణలను, వక్రీకరణలను ఆ పాలనావిధానాలలో భాగంగానే చూడాలే తప్ప, వాటిని ధర్మశాస్త్రాలపై ఆరోపించడం తప్పు అని కూడా ఈ సమాచారం తెలియజేస్తుంది.
ధర్మ-అర్థశాస్త్రాలు వ్యష్టి, సమిష్టుల ధర్మాలను, శారీరిక, మానసిక ఆరోగ్యాన్ని, అభ్యుదయ-నిశ్శ్రేయసాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా తాకకూడని వాటిని తాకవద్దని (స్పర్శ) చెప్పాయో, అదే విధంగా చూడకూడని వాటిని చూడవద్దని (చక్షుషా), తినకూడని వాటిని తినవద్దని (స్వాద్య), వాసన పీల్చకూడని వాటిని పీల్చకూడదని (ఘ్రాణ్య), అనవసరమైన మాటలాడకూడదని (వాచ్య) కూడా చెప్పాయి. ఈ అంశాలన్నింటి ద్వారా కూడా పాపం సంక్రమిస్తుంది కాబట్టి ఆ నిబంధనలను ఏర్పరచాయి. స్పర్శ ద్వారా అనేక రోగాలు సంక్రమిస్తాయన్నది దృష్టిగోచరం. అలాగే మిగతా ఇంద్రియాల ద్వారా కూడా పాపం సంక్రమిస్తుంది. ఇతరులనుండి స్పర్శ ద్వారా పాపం సంక్రమించకుండా హిందువులు తాపత్రయపడేవారు. కానీ కేవలం త్వగింద్రియానికి చెందిన అలవాట్లకే వివక్ష ముసుగులో ‘untouchability’ అనే పేరును పెట్టారు పాశ్చాత్యులు. మరి శాస్త్రాల ప్రకారం, ‘unseeability’ ‘unsmellability’ ‘uneatability’ ‘untalkability’ లు కూడా ఉన్నాయి. వీటిపై కూడా వివక్ష అని ముద్రవేసి రాబోయే రోజుల్లో చట్టాలు చేసినా చేస్తారేమో!
ఇవి వ్యక్తుల, సమాజాల శారీరిక-మానసిక ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకుని, అభ్యుదయ-నిశ్శ్రేయసాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటుచేయబడిన నియమాలు. ఇందులో కేవలం త్వగింద్రియానికి చెందిన స్పర్శను మాత్రమే చర్చలోకి తీసుకొని దానిని క్రైస్తవ చరిత్రలోకి, బైబిల్ పాతనిబంధన చరిత్రలోకి ఇరికించి వక్రీకరించి చూపితే అపోహలే కలుగుతాయి. ప్రతి వ్యక్తికి, ప్రతి జాతికి వారివారి సాధన, ఆరోగ్యాలు అతి ముఖ్యం. దీనితో విభేదించేవారు వివిధ అంటురోగాలు ఉండేవారితో నివసించడం మొదలుపెట్టాలి. లేదంటే వారికి వివక్ష ఉందని అంగీకరించాలి. అందరు సామాన్య మానవులకు ప్రాణం మీద తీపి ఉంటుంది, ప్రతి వ్యక్తి తన ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి యథాశక్తి ప్రయత్నిస్తాడు. ఇలా చేయడం వివక్ష అని క్రైస్తవులు చెప్పగా నేటి కమ్యూనిస్టులు ఈ పద్దతిని కొనసాగిస్తున్నారు. తమ వాదనను సాగించడానికి వారు కొన్ని అంశాలను మాత్రమే ఏరికోరి వక్రీకరించి ప్రయోగిస్తున్నారు.
హిందూ సమాజంలో కనిపించిన స్పర్శాస్పర్శలు, పరస్పర దూరాలకు క్రైస్తవుల ద్వారా హిందువులపై ఆరోపించబడిన శాశ్వత సామాజిక బహిష్కరణ వర్గీకరణలకు ఏ సంబంధమూ లేదు. ఈ పద్దతులన్నీ సందర్భాత్మకమైనవి, ఆచారపరమైనవి, ఆరోగ్య–శౌచ నియమాలకు సంబంధించినవని పైన చూపబడిన అంశాలు చెబుతున్నాయి. కుటుంబవ్యవస్థలో దీక్షలు, పూజలు, జాతమృతాశౌచాల వంటి సందర్భాలలో తాత్కాలిక స్పర్శనిషేధాలు ఉండేవి.
అలాగే, కౌలాచార–తాంత్రిక సంప్రదాయాలలో సిద్ధులు, శక్తులు, సాధనలు వంశపారంపర్యంగా సంక్రమిస్తాయన్న నమ్మకం కారణంగా, కొన్ని జాతుల మధ్య ఆచారపరమైన దూరాలు పాటించబడేవి. ఈ దూరాలు ఒకేవైపు కాకుండా రెండువైపులా పాటించబడుతూ, విభిన్న ప్రాంతాలలో విభిన్న రీతులుగా ఉండేవి. అందరూ వివిధ దేవతలను ఉపాసించడం వలన, ఆయా దేవతలు ఆయా ఉపాసకుల గృహాలలోకి ఆహ్వానించబడటం, వారి గృహాలు దేవతాస్థానాలు కావడం వలన, కొన్ని రకాల మంత్రశక్తులు, సిద్ధులు వంశపారంపర్యంగా వస్తాయని శాస్త్రాలు చెప్పవడం వలన కూడా ఆయా వ్యక్తులు ఇతరుల గృహాలలోకి ప్రవేశించేవారు కారు. అయితే, ఈ పరస్పర దూరాలను, విభిన్న రీతులను తరువాతి కాలంలో ఏకరీతితో కూడిన సామాజిక వర్గంగా మార్చడం కేవలం బ్రిటిష్ పాలనా అవసరాల ఫలితమని పై వివరాలు స్పష్టంగా చూపుతాయి.
ఈ నేపథ్యంలో, ‘పంచములు’, ‘అంత్యజులు’, ‘అస్పృశ్యులు’, ‘out-caste’, ‘untouchable’ వంటి పదాలు ప్రధానంగా బ్రిటిష్ సెన్సస్ రిపోర్టులు, మిషనరీ వ్రాతలు, విద్యా శాఖలోని వర్గీకరణల ద్వారా 19వ శతాబ్దంలో దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తేబడిన ఏకరీతి పాలనా పదజాలమని పై వివరాలు సూచిస్తాయి. ఫ్రాన్సిస్ బుకానన్, కాల్డ్వెల్, 1871 మద్రాస్ సెన్సస్, తదనంతర బ్రిటిష్ అధికారిక నివేదికలలో కనిపించే అయోమయాలు, విభిన్న అర్థప్రయోగాలు ఈ వర్గీకరణల కృత్రిమ స్వభావాన్ని స్పష్టంగా వెల్లడిస్తాయి.
మొత్తంగా, ఈ వ్యాసం భారతీయ సమాజాన్ని బిబ్లికల్–యూరోపియన్ చట్రాలలో అర్థం చేసుకోవడం వల్లే ‘పంచమవర్ణం’, ‘అస్పృశ్యులు’ అనే ఏకరూపతతో కూడిన వర్గీకరణలు సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను కొనసాగించడం కోసమే చరిత్రలో స్థిరపడ్డాయని చూపుతుంది. వైదిక-తాంత్రిక ఆచార భేదాలను అంగీకరిస్తూనే, వాటిని శాశ్వత సామాజిక వివక్షగా మలచిన వలసకాలపు వ్యాఖ్యానాన్ని ఈ అధ్యయనం విమర్శాత్మకంగా విశ్లేషించింది. తద్వారా ప్రస్తుతం భారతీయులకు తెలిసిన సామాజిక వర్గీకరణలు, సిద్ధాంతాలు బ్రిటిష్, ఇస్లామిక్ పాలనలో వారి వారి విధానాల వలన తీవ్రంగా ప్రభావితమయ్యాయని. కొన్ని సామాజిక అంశాలు పూర్తిగా రూపు మారగా, మరికొన్ని సృష్టించబడ్డాయని చూపడం ద్వారా, ఈ రంగంలో స్వదేశీ దృష్టికోణంతో లోతుగా పరిశోధన జరగాల్సిన అవసరముందన్న అంశాన్ని గట్టిగా చెబుతున్నది.
వాస్తవానికి హిందూదేశానికి చెందిన విశ్వవిద్యాలయాలు ఈ పరిశోధన చేసి ఉండాలి. లేదా హిందువులు ధర్మప్రచారం కోసం ఆలయాలకు దానం చేసిన డబ్బును తన అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటున్న ప్రభుత్వాలయినా ఒక పరిశోధనా విభాగాన్ని సృష్టించి, దానితో ఈ అంశాలను పరిశోధించి ఉండాలి. కానీ ఇది జరుగకపోవడానికి పలు కారణాలున్నాయి. వాస్తవాలు బయటపడితే రాజకీయ సమీకరణాలు మారుతాయి. ఇది అధికారాన్ని పొందడానికి అవసరమైన పాత చట్రాలను కూల్చి, కొత్త చట్రాలను నిలబెడుతుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వారి ప్రయోజనాలకు ఇది వ్యతిరేకం అందువల్ల వారు చేయరు. విశ్వవిద్యాలయాలలో పనిచేసే వారు రాజకీయవివాదాలకు దూరంగా ఉండటం కోసం ఈ అంశాల జోలికి పోరు. ఆలయాల డబ్బు ప్రభుత్వం తీసుకుని ఖర్చు చేయడం వలన, ఆ ఆలయాలలో కూడా ప్రభుత్వ ప్రతినిధులే ఉండటం వలన ఆలయ వ్యవస్థ ఈ అంశాలపై పరిశోధించే స్థితిలో లేదు. ఇది నేటి హిందూ సమాజ స్థితి.
నైతికత ముసుగులో సనాతన ధర్మాన్ని వక్రీకరించడం, దూషించడం భారతసమాజానికి అంగీకారమా? నైతికత ముసుగులో కమ్యూనిస్టులు కొనసాగిస్తున్న జ్ఞానమీమాంసా హింసను ప్రశ్నించే బాధ్యత హిందూ సమాజానిది కాదా? ఒకవైపు హిందువులమని చెప్పుకుంటూ, అనైతికంగా సనాతన ధర్మాన్ని వక్రీకరిస్తున్న కమ్యూనిస్టులు, వోకిష్టులు, పెరియారిస్టులు, అబ్రహామిక్ మతాలను ప్రశ్నించడం వారి బాధ్యత కాదా? కొన్ని కులాల దీనస్థితికి సనాతనధర్మాన్ని ప్రశ్నించడం నైతికమని భావించిన వారందరూ ఇప్పుడు వక్రీకరణలను, పైన పేర్కొన్న చతుష్టయాన్ని ప్రశ్నించడం తమ నైతిక బాధ్యత అని భావిస్తారా? దీనికి లేదు అని సమాధానం వస్తే హిందూ సమాజం ద్వంద్వ వైఖరిని పాటిస్తోందని, నైతికత అన్నది కేవలం సనాతన ధర్మానికి మాత్రమే వర్తిస్తుందని, మిగతా మతాలు, ఇజాలు అన్ని అనైతికమైనవని వారు చెప్పకనే చెప్పినట్లు. అలాగే హిందూ సమాజం కూడా సనాతనధర్మం పట్ల ద్వంద్వ నైతిక నియమాలను పాటిస్తున్నట్లు కూడా ఇది రుజువు చేస్తుంది. భావదాస్యంలో నుండి బయటపడాలంటే ఈ వలసవర్గీకరణల నుండి, వాటి భావజాలం నుండి దూరం జరగాలి. ఒక వైపు హిందువులమని చెప్పుకుంటూ మరో వైపు వైదిక సిద్ధాంతాలకు, ఋషి వాక్యాలకు విరుద్ధంగా నడవడం మానాలి.
నేడు కొన్ని వర్గాలకు చెందిన వారు హిందూయిజంలో అసమానతలు వేళ్లూనుకొని ఉన్నాయని చూపడానికి వలస పాలనలో వ్యవస్థీకరించబడిన వర్గీకరణలను చూపుతున్నారు. వాళ్ళు మతం మారాలనుకుంటే నిరభ్యరంతరంగా మారవచ్చు. కానీ దానికి కారణం హిందూయిజం ఎంతమాత్రమూ కాదన్న విషయాన్ని ఇకపై అంగీకరించి తీరాలి. హిందూయిజంలో అసమానతలు అనే కారణాన్ని చూపుతున్న వారు ఇతర మతాలలోకి మారగానే హిందువులను తక్కువగా చూడటం మానట్లేదు. మతవివక్షను భుజాన వేసుకుని విభిన్నతను నాశనం చేయడానికి కులవివక్షను సాకుగా చూపుతున్నారు. గతంలో ఇస్లాం, క్రైస్తవాలు విభిన్నతను నాశనం చేయడానికి ఉపయోగించిన వాదనలను, పద్ధతులనే ఉపయోగిస్తున్నారు! మతం మారినా వారి ప్రవృత్తిలో మార్పు రావడం లేదన్న విషయాన్ని వారు గమనిస్తున్నారో లేదో? కొన్ని తాత్కాలిక ఫలితాల కోసం ఎన్ని మతాలు మారినా వారి గుణసంచయంలో, ప్రకృతిలో, ప్రవృత్తిలో మార్పు రాకపోతే దాని ఫలితం తాత్కాలికం లేదా శూన్యం. సాధన ద్వారా ప్రకృతిని (జీవలక్షణాన్ని), ప్రవృత్తిని మార్చుకోవడమే హిందూయిజంలో ఉన్నది, ఇతర మతాలలో లేనిది.
మిషనరీలు, పాశ్చాత్యులు, కమ్యూనిస్టులు, పాశ్చాత్య విద్యారంగానికి చెందిన సామాజిక శాస్త్రవేత్తలు తదితరులందరూ కూడా సమాజంలో తాము గమనించిన అంశాలను, విశ్లేషణలను తమతమ గ్రంథాలలో నమోదుచేశారు. పాశ్చాత్యుల narrative war కి వీరందరూ సేకరించిన సామాజిక సమాచారం బాగా ఉపయోగపడ్డది. నిరంతరం పరిణామం చెందుతూ ఉండే లోకాచారాలను విస్మరించి, వీరు ఆయా కాలాలలో సేకరించిన సమాచారం అప్పటి సమాజాన్ని ధృఢంగా తమ రచనలలో దిగ్బంధించింది. దాంతో సమాజం మార్పులు లేకుండా ఒకేలా ఉన్నట్లుగా చూపబడ్డది. వాస్తవానికి భారతసమాజం ఎంతో చలనశీలతను కలిగి ఉంది. ఇస్లామిక్, క్రైస్తవ దండయాత్రల వలన భారతీయ సమాజంలో ఎన్నో మార్పులు కలిగాయి. బౌద్ధం కూడా భారత సమాజం మీద గాఢమైన ప్రభావాన్ని చూపింది. బౌద్ధంలో పటిష్టమైన జాతి వ్యవస్థ ఉండటమే కాదు, బౌద్ధం నిమ్నకులాలను నీచంగా చూసిందని కొందరు చరిత్రకారులు వ్యాఖ్యానించారు. కానీ నేటి సామాజిక శాస్త్రవేత్తలు మాత్రం బౌద్ధం గురించి మాట్లాడరు, నిమ్నకులాలు బ్రాహ్మణుల పట్ల చూపిన అంటరానితనం గురించి మాట్లాడరు. అక్కడ వీరి గొంతు పెగలదు. నిమ్నకులాల ఉద్ధరణకు ఎంతోమంది బ్రాహ్మణులు తమ ఆస్తిపాస్తులను, కుటుంబాలను సైతం త్యాగం చేసి తీవ్రమైన కృషి చేశారు. స్వతంత్రం కోసం పోరాడుతూ బ్రిటిష్ బుల్లెట్లు తగిలి మరణించిన వారిలో 70% మంది బ్రాహ్మణులని కొందరు పరిశీలకులు తెలిపారని చరిత్రకారిణి మీనాక్షిజైన్ వ్రాసారు. (‘In the words of an observer, “If any community could claim credit for driving the British out of the country, it was the Brahmin community. Seventy percent of those who were felled by British bullets were Brahmins.” -The Plight of Brahmins-Meenakshi Jain-The Indian Express, Tuesday, September 18,1990) అయినాకూడా నేడు వారి పేర్లను సైతం కమ్యూనిస్టులు గాని, వారి త్యాగం, కృషి వలన లబ్దిపొందిన వారు తలుచుకోవడం లేదు! వారి కృషి, త్యాగం అంతా ఎడారి ఇసుకలో పోసిన నీరులాగా మటుమాయం అయ్యింది.
వీరందరూ బ్రిటిష్ సామాజిక శాస్త్రవేత్తలు నమోదు చేసిన ఏకపక్ష అంటరానితనం గురించే మాట్లాడుతారు. దాని ఆధారంగానే అనేక చట్టాలను కూడా చేశారు. 100 సంవత్సరాల మునుపటి భారత సమాజం నేడు లేదు, ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. వీరు సృష్టించిన ఒకప్పటి అంటరానితనం నేడు లేదు. ఒకప్పటి అంటరానికులాల వారు నేడు అనేక కీలకపదవుల్లో ఉన్నారు. సమాజపు గతిని నిర్ధేశిస్తున్నారు. నేడు కొందరు బ్రాహ్మణులను దేశం నుండి తరిమికొట్టాలని, బ్రాహ్మణులను హత్యచేయాలన్న భావజాలాన్ని బాహాటంగానే వ్యాప్తి చేస్తున్నారు. కానీ ఒకప్పటిలాగా సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పటి బ్రాహ్మణుల పరిస్థితిని నమోదు చేయడం లేదు! దీంతో ఇప్పుడు బ్రాహ్మణుల పట్ల చూపబడుతున్న వివక్ష ఆధారంగా భవిష్యత్తులో ఎలాంటి చట్టాలూ చేయబడే అవకాశం లేదు!
మరోవైపు సమాజంలో దేవతా పూజలు, సాధన అడుగంటడం వలన, ఆచారాలు లుప్తమవడంవలన, విస్తృతమైన ప్రతికూల ప్రచారం వలన పరస్పర స్పర్శాదోషాన్ని పాటించడం తగ్గిపోయినా పుస్తకాలలోని అంటరానితనం మాత్రం పోవడం లేదు, దాని స్థితి ఎంతమాత్రమూ మారడం లేదు. బ్రిటిష్ వారి విధానాలను అనుకరించడం వలన నేడు భారతదేశంలో ఆర్ధికస్థితితో సంబంధంలేని వెనుకబడ్డ కులాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. ఇది ఇలాగే కొనసాగితే ఒకనాటి విశ్వగురువైన భారతదేశం, భవిష్యత్తులో ‘రాజ్యాంగ ప్రేరిత వెనుకబడ్డ దేశంగా’ (constitutionally backward country) చరిత్రలో మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ఓం శాంతి శాంతి శాంతిః
——–End ———-
అనుబంధము-1-తంత్రములు-శ్రీ జమ్మలమడక మాధవరామ శర్మ: (241)
తంత్రములు: తంత్ర పదమునకు శాస్త్రము అని యర్థము. “తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇతి తంత్రం” జ్ఞానమును విస్తరింపజేయునది తంత్రమని భావము, తత్త్వ మంత్రార్థములను విస్తరింప జేయునది, త్రాణమొనరించునది తంత్రమగును, శాస్త్రము, సిద్ధాంతము, అనుష్టానము, విజ్ఞానము – వీటికిని, వీటిని బోధించు గ్రంథమునకును ‘తంత్రము’ అనెడి ప్రసిద్ధి కలిగినది. యంత్ర మంత్రములతో కూడుకొనిన సాధన మార్గమును ఉపదేశించు గ్రంథమును ‘తంత్రము’ అనుచున్నారు.
‘ఆగమము’ అని తంత్రములకు వేరొక పేరు. అభ్యుదయ నిశ్శ్రేయసముల ఉపాయములు ఆగమములలో నున్నవి, ‘భోగము, మోకము’ అను ఈ రెండిటి ఉపాయములను ఆగమము బోధించును. వేదములనదగిన నిగమములు కర్మ, ఉపాసన, జ్ఞానము అనువాని రూపములనే
నిరూపించుచున్నవి. ఆగమములు వీని సాధనోపాయములను నిరూపించుచున్నవి. కలియుగములో ఆగమముల యుపయోగము ప్రధానముగా నున్నదని కులార్ణవ తంత్రము చెప్పుచున్నది. “కృతయుగములో వేదాచారము, త్రేతలో స్మార్తాచారము, ద్వాపరములో పురాణాచారము, కలిలో “ఆగమాచారము” అని తంత్రమెరిగినవారి భావము.
తంత్రములలో ఈ నిరూపించిన విశేషములున్నవి: 1. దేవతా స్వరూపము, 2. సత్త్వరజస్తమోగుణ స్వరూపము, 3. కర్మాది విధానములు, 4. ఆయాదేవతల మంత్రములు, 5. ఆ మంత్రముల ఉద్ధార క్రమము, 6. ఆయా దేవతల ధ్యాన రీతి 7. పటలము, పద్ధతి, కవచము, 8. నామ సహస్రము, స్తోత్రము.
“సృష్టి, ప్రళయము, దేవతా పూజనము, సాధన రీతి, మంత్రపురశ్చరణము, షట్కర్మలు, వాని సాధనములు, ధ్యాన యోగము” అను సప్తవిధములయిన లక్షణములు ఆగమములలో ప్రసిద్ధములు.
“శాంతి, వశీకరణము, స్తంభనము, విద్వేషణము, ఉచ్చాటనము, మారణము” అను వానికి షట్కర్మలని పేరు. తంత్ర గ్రంథములలో క్రియాచరణము ముఖ్యము. వేదములలో నిర్దిష్టములయిన జ్ఞాన రీతులకు క్రియాపర్ధతి ప్రయోగ పద్ధతి తంత్రములందున్నది. ఆ పద్ధతుల యాచారము తంత్రములలో ముఖ్యములు. ఇది తంత్రముల రీతి.
కొన్ని తంత్రములు వేదానుకూలములని, మరికొన్ని అట్లు కావని గోచరించును. పాంచరాత్రము, పాశుపత శైవము వేదమూలములని ప్రసిద్ధి, ప్రాచీనులు కొందరు ఇవి యట్టివి కావనినారు. “శాక్త తంత్రములు వేదమూలములు” అనుటను లోకులు సందేహించుచున్నారు. శాక్త తంత్రములలోని సప్తవిధములయిన యాచారములలో నొకటి వామాచారము, వామమార్గుల పూజాపద్ధతి వైదికముగా నుండదు. తంత్ర గ్రంథములలో వేదానుకూల తంత్రములు చాల కలవు, అట్లే ఇతరములుకూడ అనేకములున్నవి.
తంత్రములను ముఖ్యముగా మూడు విధముల విభాగింపవచ్చును. 1. దేవతంత్రములు; వీనినే బ్రాహ్మణ తంత్రములనియునందురు 2. బౌద్ధ తంత్రములు. 3. జైన తంత్రములు.
బ్రాహ్మణ తంత్రములు ఉపాస్య దేవతా భేదమున మూడు విధములుగా నున్నవి: 1. వైష్ణవాగమములు, పాంచరాత్రము మొదలగునవి, 2. శైవతంత్రములు, 3. శాక్త తంత్రములు, ఈ త్రివిధ తంత్రములలో విష్ణు- శివ- శక్తి దేవతల ఉపాసనములున్నవి.
తంత్రములలోని తత్త్వమనుసరించి చూచినచో నీ భేదములు మూడు గోచరించును. 1. ద్వైత ప్రధాన తంత్రములు, 2. అద్వైత ప్రధాన తంత్రములు, 3. ద్వైతాద్వైత ప్రధానములు.
వైష్ణవ తంత్రములు ద్వైతమును, విశిష్టా ద్వైతమును బోధించునవిగా నున్నవి. శైవ తంత్రములలో మూడు విధములయిన భేదములును కలవు. శాక్త తంత్రము లద్వైతమునే బోధించునవిగా నున్నవి.
తంత్రముల సంఖ్య పరిగణింప శక్యము కాదు. కాని 108 తంత్రములను మేరుతంత్రము పరిగణించినది. శివుడు తానే గురువై, తానే శిష్యుడై నానా తంత్రముల వెలయింప చేసెనని ప్రసిద్ధి.
వైష్ణవ తంత్రములలో వైఖానస తంత్రములు నేడు గోచరించుట లేదు. పాంచరాత్ర తంత్రము వైష్ణవ తంత్రములలో పరిగణింపదగినది. భాగవత ధర్మమని, సాత్వత ధర్మమని పాంచరాత్ర విధానమున కే పేరు. ఈ తంత్రమునకు సంబంధించిన గ్రంథములనేకములున్నవి. కొన్నియే ముద్రితములు. కపింజల సంహిత చెప్పిన విధమున పాంచరాత్ర సంహితములు రెండువందలకు పైగా గలవు.
వీనిలో 1. జ్ఞానము, 2 యోగము, 3, క్రియా పద్ధతి, 4 చర్యారీతి అని నాలుగు విధానములు ప్రథానములుగా నున్నవి. వీనిలో నీ క్రింది విషయములు నిరూపితములై యున్నవి.
- జ్ఞానము. ఇందు బ్రహ్మ, జీవ, జగత్తుల తత్త్వము నిరూపిత మయినది.
- యోగము. ఇది ముక్తి కెట్లు సాధనమగునో నిరూపితము, ఈ యోగమునకు సంబంధించిన ప్రక్రియలు కూడ దీనిలో కలవు.
- క్రియ, ఇందు దేవాలయ నిర్మాణము, మూర్తి స్థాపనము, మూర్తి యందలి యాకార విశేషములుఉన్నవి.
- చర్య. చర్యాపద్ధతిలో మూర్తులకు, యంత్రములకు చేయవలసిన పూజా పద్ధతి యున్నది.
పాంచరాత్రములు సాధన మార్గమును విస్తరముగనే నిరూపించునవి. ఇష్ట దేవతను స్థాపించి వాని అర్చనము చేయుట, భక్తి కలిగి యుండుట వీనిలో ముఖ్యము. ఇందంతట ప్రపత్తి (శరణాగతి) ప్రధానముగా నున్నది.
వైఖానస తంత్రములలో విష్ణు పూజ ప్రధానము. అర్చనా కాండ ముఖ్యము. జపము, హోమము, ధ్యానము, అర్చన ఇందలి ముఖ్యములయిన సాధనములు.
శైవ తంత్రములు దేశమంతట వ్యాపించినట్లు గోచరించును. వీనిలో మూడు రీతులున్నవి.
- కొన్ని తంత్రములు ద్వైతము నిరూపించును, ఇట్టి వానికి శివతంత్రములని పేరు.
- కొన్ని తంత్రములు ద్వైతాద్వైతమును ప్రతిపాదించుచున్నవి. వీనికి రుద్ర తంత్రములని ప్రసిద్ధియున్నది.
- కొన్ని తంత్రములు అద్వైత పరములు. ఇవి భైరవ తంత్రములని వ్యాప్తిపొందినవి.
శైవులలో నాలుగు సంప్రదాయములు కలవు. “పాశుపతము, శైవము, కాలగమనము, కాపాలికము” అని వాని పేర్లు. వీని కన్నిటికి శైవ తంత్రములే మూలముగా నున్నవి. పాశుపత తంత్రము ననుసరించిన గ్రంథములు నేడధికముగా లభించుట లేదు. శైవ రీతి దక్షిణ భారతములో బాగుగా వ్యాపించినది. ఎనుబది నలుగురు శైవ భక్తులు పరమాచార్యులై తమ సిద్ధాంతములను బోధించి నారు. శివుడు తన భక్తులనుద్ధరించుటకై తన పంచముఖములనుండి యిరువది తంత్రములను వెలయింప జేసినాడట. వీని తత్త్వమును బోధించు ఆగమములు, ఉపాగమములు, సంహితలు చాల వెలువడినవి. మొత్తమవి రెండువందలకు పైగా కలవట, ఈ శివశాస్త్రమే ముక్తి ఉపాయమని వారి నిశ్చయము. ఈ సంప్రదాయము ననుసరించిన మహా మహేశ్వరు లనేకు లెన్నియో గ్రంథములు వ్రాసినారు. శైవులలో వీరశైవులు కొందరు కలరు. వారు లింగాయతులు, జంగములన్న ప్రసిద్ధితోనున్నారు.
శాక్తతంత్రములు బహుళముగా నున్నవి. శాక్తపూజా రీతి రహస్యము. దాని వారిసంప్రదాయముననే తెలిసికొన వలయును. శాక్తతంత్రము లనేకములు ముద్రితములు కాలేదు. ప్రకాశితములయిన తంత్రములను పరిశీలించిన ఆ తంత్రములరీతులు మూడు విధములుగా గోచరించును. 1. కొన్ని సాత్విక తంత్రములు, 2. కొన్ని రాజస తంత్రములు, 3. కొన్ని తామస తంత్రములు, సాత్వికములకు “తంత్రము” లని, రాజసములకు “యామలము” లని, తామసములకు “డామరము” లని సంజ్ఞ కలిగినది.
శివుని యయిదు ముఖములనుండి వెలువడిన ఆగమములను “ఆమ్నాయము” అందురు.
- పూర్వామ్నాయము సృష్టిరూపము., ఇది మంత్ర యోగము నిరూపించును.
- దక్షిణామ్నాయము స్థితి రూపము. ఇది భక్తి యోగము చెప్పును.
- పశ్చిమామ్నాయము సంహార రూపము. ఇది కర్మయోగము నిరూపించును.
- ఉత్త రామ్నాయము అనుగ్రహరూపము. జ్ఞానయోగము ప్రతిపాదించును,
- ఊర్థ్వామ్నాయము సకల విశేషములను ఉద్భోధించును.
తంత్ర గ్రంథముల ననుసరించి చూచిన ఈ దేశమంతయు విష్ణు క్రాంతము, రథ క్రాంతము, అశ్వక్రాంతమని మూడు విధముల గోచరించును. ఈ మూడు క్రాంతప్రదేశములలో అరువది నాలుగు తంత్రములు వ్యాపించినవి,
కాశ్మీరము, కాంచి, కామాఖ్య అనుమూడు ప్రదేశములు శ్రీవిద్యకు కేంద్రము అయినవి. ఒక్కొక్క స్థలమున ఒకొక్క ఆచారము ప్రధానమై వ్యాప్తి పొందినది.
శాక్త తంత్రములు కాలతంత్ర ములని, మిశ్రతంత్రములని, సమయ తంత్రములని మూడువిధముల నున్నవి. కాల మార్గమునకు సంబంధించిన తంత్రము లరువదినాలుగు, మిశ్రమార్గమునకు సంబంధించిన తంత్రము లెనిమిది. సమయమతమునకు సంబంధించిన తంత్రము లయిదు. ఈ సంహితలు తాంత్రికులలో ప్రసిద్ధము లయినవి. సమయ మత సంహితలకు శుభాగమ పంచకమని ప్రసిద్ధియున్నది, శాక్త తంత్రములన్నియు వేయికి పైగా నున్నవి. ముద్రిత ప్రకటితములు తక్కువ.
తంత్రములలోని యాచారములను గురువులనుండియే గుర్తింపవలెను. అర్హుడైన శిష్యుడు సమర్థుడైన గురువు సమక్షమున దీక్షను స్వీకరింపవలెను. ఆ శిష్యున కప్పుడు గురువు తంత్రరహస్యముపదేశించును. దీక్షవలన శిష్యునకు మంత్రదేహము కలుగును. దీక్షలనేక విధములు. ఆణవ దీక, శాక్త దీక్ష, శాంభవదీక్ష అను వీనిని మూడు వర్గములందు చేర్చినారు. దీక్షితుడయిన శిష్యునకు మంత్రోపదేశ దక్షత కల్గును.
తాంత్రిక పూజలో కొందరే యర్హులు. వీరి యాచార రీతి సర్వదాగోప్యము, శాక్త మతములో మూడు భావములు, ఏడు ఆచారములు కలవు,
- పశుభావము, 2, వీరభావము, 3. దివ్యభావము. ఈ మూడు నీ విధముగా నున్నవి.
- జీవుల కవిద్య యావరణముగా నున్నది. అందుననే అద్వైతజ్ఞానము లేశముగా నయిన గలుగదు. అట్టివారి మనసులోని యవస్థను ‘పశుభావము’ అందురు. వశువు వలె జీవుడు సంసారమున అజ్ఞానమనెడు రజ్జువుతో బద్ధుడగుచున్నాడు. సంసార మోహములో చిక్కుకొనిన జీవుడు ‘అధమ పశువు’. సత్కర్మ లొనరించు ధార్మికుడయిన భక్తుడు ‘ఉత్తమ పశువు’,
- తన అద్వైతజ్ఞానమును లేశముగా నయిన అనుభవించి, ఆస్వాదించి, అజ్ఞాన వినాశనమునకై యత్న పడు వాడు ‘వీరభావము’ కలవాడగును. తన సాధనములో సిద్దుడయిన వానిని ‘వీర’ పదమున వ్యవహరింపవలెను,
- వీర భావమువలన గలిగిన పుష్టిపొంది ద్వైత భావమును పోగొట్టుకొనుటకై యత్నించు మానవుడు తన ఉపాస్య దేవతకై తన్ను సమర్పించుకొని అద్వెతా నందము పొందును. అట్టివాని దశను ‘దివ్య భావము’ అనవలెను.
ఆచారము లేడు విధములు :1. వేదాచారము, 2.వైష్ణవాచారము, 3. శైవాచారము, 4, దక్షిణాచారము, 5, వామాచారము, 6. సిద్ధాంతాచారము, 7, కౌలా చారము, ఈ ఆచారములు పైమూడు భావములతో సంబంధించి యున్నవి.
- వేద, వైష్ణవ, శైవ, దక్షిణాచారములు పశుభావ సంబద్ధములు.
- 2 వామ, సిద్దాంతాచారములు వీర భావమునకు సంబంధించినవి,
- కౌలాచారము దివ్యభావమున నుండును,
వీనిలో కౌలాచారము రహస్యము; మిక్కిలి నిగూఢము, సాధకుని యద్వైతభావము పరిపూర్ణము, విశుద్ధము అయినప్పుడే కౌలాచారములో ప్రవేశము కలుగును. అప్పుడు చందన కర్దమములు, శత్రుపుత్రులు, శ్మశాన భవనములు, తృణ కాంచనములు సమానముగ నుండును. కౌల సంప్రదాయములో చాల విశేషములు కలవు, వీని ననుసరించిన సంప్రదాయము లనేకరూపములతో నున్నవి.
వీనికన్న వేరుగా సమయాచారమనునది కలదు. శ్రీవిద్యోపాసకులకిది పరిచితము. ఈ ఆచారమున అంతర్యాగము ముఖ్యము. సాధకుడు తన హృదయములో శ్రీ దేవిని, శ్రీ చక్రమును భావించి పూజన మొనరించుట చాల ముఖ్యము. దహరా కాశములో చక్రము భావించి పూజ చేయుటను “సమయము” అందురు. సమయాచారములో సాధకుడు తన మూలాధారములోనున్న కుండలినీ శక్తిని మేల్కొన జేసి, క్రమక్రమముగా స్వాధిష్టానము మొదలయిన చక్రములను దాటించి, సహస్రార చక్రములో నుండు నదాశివునితో సంబంధింప జేయుటయే ప్రధానా చారము. సమయాచారము గురుముఖైక గమ్యమని ఆ సంప్రదాయ విదుల నిశ్చయము.
కౌల, సమయ మార్గములలో కొంత తేడా కలదు. అయినను పరిణామములోని వారి యనుభూతిలో నేకరీతి గోచరించును. ఇదియే మంత్రశాస్త్ర సిద్ధాంతమని మంత్ర చేతనుల నిశ్చయము.
తాంత్రికాచారములును, వాని రహస్యములును చాల విశేషములతో నున్నవి. తంత్రములలోని భాష, వాని సంకేతము స్పష్టముగా భావించుట కష్టము. ఆచారమార్గములలోని భేదము లనేకభావములను గలుగ జేసినవి. ప్రత్యక్షముగా పూజలుచేయు తాంత్రికులు కౌలికులు; భావనాత్మకముగా నుపాసించువారు సమయమార్గులు, ఈ కౌల, సమయ మార్గములలో పంచవిధ సాధనపద్ధతి యొకటి ప్రసిద్ధముగానున్నది. ఈ అయిదు రీతులకు “పంచ మకారములు” అని పేరు.
“మద్యము – మాంసము – మత్స్యము – ముద్ర – మైథునము” అనునవి పంచమకారములు. వీనిని ప్రత్యక్షముగ ప్రయోగించువారును, వాని ప్రతినిధి రూపముల వినియోగించువారునున్నారు. కావుననే శ్రీచక్రమారాధించు వారలలో (1) పూర్వకౌలికులు, (2) ఉత్తర కౌలికులు అను రెండు విధముల వారి విశేషములున్నవి. కౌలాచారములలో “తిబ్బతు” దేశములోని తంత్రముల భావములు వ్యాపించి యుండును.
మూలాధారములోని కుండలినీ శక్తిని సహస్రార శివునితో సంబంధింప జేయు సాధకుడు *’ కౌలికుడు” అని వారి నిర్ణయము. ఇట్లే పంచమకారములకు ఆ తంత్ర గ్రంథములలో విశేషార్థములు, సంకేతార్థములు కలవు.
తంత్రోపాసనములలో సర్వవర్ణముల వారికి స్త్రీ, పురుషుల కందరకును అధికారము కలదు, మంత్ర – బీజ- యంత్ర – ముద్రా – న్యాస – భూత శుద్ధి- కుండలినీ యోగములు తంత్రములలోని సాధనములు. మంత్ర- యంత్ర- న్యాస – దీక్షా – గురుశిష్యాదుల తత్త్వ లక్షణములను తంత్రములు నిరూపించినవి.
కొన్ని తంత్రములు కొందరకుపాదేయములు కాలేదు. అందులకు ఈ హేతువులు కొన్ని ప్రసిద్ధములు-
(1) జగదతిసంధానము (లోకవంచనము), (2) వైదిక మార్గమునకు దూరముగా నున్నవి, (3) మాయేంద్రజాలములు కల శాంబరరీతి; శ్మశానాది విమార్గమున సాధింపవలెను; (4) కాపాలిక సంప్రదాయమున చేరినవి; (5) మహా సమ్మోహ రూపములు; (6) బాల జిహ్వా చ్ఛేదనాది విరుద్ధ మార్గములున్నవి ; (7) పరతంత్ర భేదనము – బహు హింసా ప్రసక్తి (8) పరదారగమనాది నిషిద్ధాచారము; (9) దిగంబర రీతులుండుట; (10) మారణ విధానము లుండుట (11) కేవల మైహిక సిద్ధిపరము లగుట; (12) వామాచారముతో నుండుట. ఇట్టి నానాదోషములున్నందున ఆ తంత్రముల ననుసరింపరాదని, శుభాగమాది పంచ తంత్రములనే యనుసరింపవలెనని లక్ష్మీధర పండితుడు సౌందర్యలహరి వ్యాఖ్యానములో వ్రాసినాడు. శుభాగమ పంచకము సమయమార్గమును ప్రదర్శించును. షోడశ నిత్యలను ప్రతిపాదించును.
(1) వాసిష్ట సంహిత, (2) సనక సంహిత, (3) సనందన సంహిత, (4) సనత్కుమార సంహిత, (5) శుక సంహిత. ఈ అయిదును శుభాగమ పంచకమని ప్రసిద్ధి.
అనుబంధము-2-అలంగీర్ ఫర్మాన-హక్కులు: (242)
మహారాజశ్రీ అలంగరు పాదుషావారు మంత్రిమహానాటివారికి దయచేయించిన ఫర్మానా-
….. బట్టు కవిరాజు పాదుషాగారికి ఖూనీసలాము చేసి ఆదినియోగియైన రాయనిమంత్రి భాస్కరునితో అడిగిన యుత్తరం నీపు అయితే ఆదినియోగివెకాని యీ పంచాణమువారు, సంకును, దాగటిని, నాగటిమీదను సుత్తిపని చేస్తూవున్నారుగనుక యిది సమయము. పదునెనిమిదిజాతులవారిలో అవుదురోకారో అని అడిగిన పిమ్మట విని పంచాణమువారు మహానాటివారితో దిరుగుబాటుగ చెప్పిన యుత్తరము. మేము కులాలలోనికి విశ్వకర్మసంతతివారము. భూలోకమందు కాడి, మేడి, వస్తువాహనాదులుచేయక మీకు జరుగవుగదా, మేమున్న చోటికి మీరు రావలయునుగాని, మీరున్న చోటికి మేము రావడములేదు అని తిరస్కరించి యుత్తరముచెప్పిన తరువాత, పాదుషాగారికి కోపము వచ్చి పంచాణము వారు దేవతల శాపముచేత సభాయోగ్యులుకారని శాపం యిచ్చిరి. మహానాటివారంతా చెప్పిన యుత్తరము, నాడు ఆగస్త్యమహాముని వారి శాపముచొప్పున మిమ్మును కులములలో కలియనిచ్చిననారుకారు గనుక, నేడున్ను మీరు మహానాటివారితో గర్వించియుత్తరము చెప్పినారు, గనుక మా సమయములో కలియనివ్వలేదు సరిగదా మీరు మీమీ కులాలలో నొకరినొకరు పొందక ద్వంద్వ యుద్ధముగా అఘోరింతురు అని మహానాటివారు శాపము పెట్టిరి. కామాక్షమ్మ వరప్రసాదము వలన వచ్చిన శాపము చేతనున్నూ, కులభేదములాయెను. నాడు కలియకుండా చేసిన హేతువుచేతను ఇప్పుడున్న కలియనియ్యవలసిన ప్రసక్తిలేదు అనిన మంత్రిభాస్కరుని బట్టకవిరాజు బహుజన సింహాసనస్థుడవోయి, భయకులాధీశ్వరుడవోయి, మహానాటికికీర్తి తెచ్చినవాడవోయి, జయవిజయీభవ అని పాదుషాగారి సమ్ముఖమందు కైవారము చేసెను. తరువాత ముగ్గురురాజులు, సోరాష్ట్ర దుర్గాలవారు, యేబదియారు దేశాలవారు, ముప్పది యిద్దరు సరదారులున్ను, బెజ్జీనీడిని, నల్లామల్లాపాత్రుని విశేషముగా బహుమతిచేసి మెప్పించిరి. తరువాత పాదుషాగారి సముఖమందు సమస్తమైన వర్ణాలవారు వివాహములు మొదలయిన శుభకార్యములయందు బెజ్జినీడు, నల్లమల్లా పాత్రుడు మొదలైన మహానాటివారి తాంబూలములు కట్నములు యివ్వవలసినందుకు నిర్ణయించిన పద్ధతులవైనమున్ను వాహనములు మొదలయినవినడిచేప్రకారమున్ను యీ క్రిందివ్రాయబడమయినది.
- బ్రహ్మక్షత్రియులు రెండువర్ణములవారికి వివాహకాలములయందు పల్లకీలు, తురంగములు మొదలగు సమస్తవాహనుములు నడచును.
- దేవతెలుకులవాళ్ళకు కపిలమహామునిశాపము చేతను, తిలలయొక్క తైలంతీసినందున అయోగ్యత పట్టినది. వీరు మనువంశజులైన క్షత్రియులు, గనుక వీరికీవివాహకాలములయందు పల్లకీలుమాత్రము నడుచును. మహానాటివారికి తాంబూలము యిచ్చుకోవలసినది.
- వైశ్యుల పెండ్లిండ్లకు పాలకీలు, తురంగములు నడుచును. వీరు మహానాటివారికి తాంబూలము యిచ్చుకోవలసినది.
- శూద్రుల పెండ్లిండ్లకు పాలకీలు, తురంగంబులు మొదలగు వాహనములు నడుచును. ఈ శూద్రరత్నంబులు మంత్రులకు సమయమంత్రికట్నముయివ్వవలసినది. ఈ శూద్రరత్నంబులు వ్యవహారరీతువును ఇతరవర్ణాలకు చేసే నిర్ణయము.
- సాలీల పెండ్లిండ్ల కాలముయందు మూడు కట్టలు తమలపాకులు, సేరుపోక చెక్కలు, రూపాయి కట్నము మహానాటివారికి తంబూవులము యివ్వవలసినది, సాలీలు భావనాఋషి సంతతిగానుక పాలకీలు, తురంగములు నడుచును.
- కుమ్మరుల పెండ్లిండ్ల కాలములయందు మూడుకట్టల ఆకులు, సేరు పోకలు ఆరురూపాయలు మహానాటివారికి తాంబూలము యివ్వవలసినది. కుమ్మరులు శాలీవాహనుని సంతతివారు గనుక పాలకీలు నడుచును.
- కైకాలవాళ్ళ పెండ్లిండ్ల కాలములందు మూడు కట్టల ఆకులు, సేరుపోకలు, ఆరురూపాయలు, కట్నము మహానాటివారికి, 1సెల్లా మంత్రులకు, యీ ప్రకారం మహానాటివారికి తాంబూలం ఇచ్చుకోవలసినది. కైకాలవాళ్ళు షోడచక్రవర్తి సంతతివారుగనుక పల్లకీలు నడుచును.
- కరణీలు (కరణి బత్తులు)పెండ్లిండ్లకాలమందు మూడుకట్టల ఆకులు, సేరు పోకలు, ఆరురూపాయలు, మంత్రులకొక సెల్లాయీ ప్రకారం మహానాటివారికి యివ్వవలసినది. కరిణీలు మాండవ్యముని సంతతివారుగనుక పల్లకీలు నడుచును.
- గొల్లవాండ్ర పెండ్లిండ్లకు 1కట్ట ఆకులు, పావుసేరు పోకలు, రెండు రూపాయల కట్నము, మహానాటివారికి యివ్వవలసినది. వీళ్ళు యాదవ సంతతి గనుక పల్లకీలు నడుచును.
- నటకులు అనగా భోగమువాండ్రు, పెండ్లిండ్ల కాలములయందు తాంబూలము రెండురూపాయిలున్ను కట్నము యివ్వవలసినది. వీళ్ళు రంభసంతతి గనుక పాలకీ నడుచును.
- సానివాళ్ళ పెండ్లిండ్ల కాలములయందు తాంబూలము, రెండురూపాయలు కట్నము యివ్వవలసినది. వీళ్ళు ఊర్వశి సంతతిగనుక పల్లకీలు నడుచును. నవకోటి సిద్ధులలో ఏ తప్పులున్నా ఆ తగవులు తీర్చి తప్పులు నిర్ణయించి నేరంకొలది తాంబూలము పుచ్చుకోవలెను.
- దాసరివాళ్ళ పెండ్లిండ్ల కాలములయందు తాంబూలము, అర్థరూపాయి యిచ్చుకోవలసినది. దాసర్లకు గుఱ్ఱములు నడుచును.
- ఈడిగ వాండ్ర పెండ్లిండ్ల కాలముల యందు తాంబూలము, అర్ధరూపాయి కట్నము యివ్వవలసినది. వీళ్ళు తెలియ మహాముని సంతతివారుగనుక పాలకీ నడుచును.
- గమళ్ళవాళ్ళ పెండ్లిండ్ల కాలములయందు మాలవాళ్ళు వచ్చి గమళ్లమందిరాల మీద పడి తోరణములు తెంచి కామధేనువు శల్యములు కట్టించి, పందలిపాకలు అన్నీవిరగగొట్టించి వీధిలో వేసి తగులబెట్టించి వాహనములు విరగగొట్టించి కూడా వేసి కట్టి మహానాటివారి శెలవు ప్రకారము నడవక వ్యతిరేకముగా సంచరించినందున వాళ్ళకు వాహనములు మొదలగునవి జరుగవు.
- మంగలవాండ్ర పెండ్లిండ్లకు మహానాటివారితాంబూలము, యివ్వవలసినది వీళ్లకు గుఱ్ఱములు నడుచును.
- చాకలవాళ్ళ పెండ్లిండ్ల కాలములయందు మహానాటివారికి తాంబూలము యివ్వవలసినది, వీళ్లకు గుఱ్ఱములు నడుచును.
- ఎరకల వాళ్ళు పెండ్లిండ్లకాలమందు తాంబూలము, అర్ధరూపాయి యివ్వవలసినది.
- మేదరవాండ్ల పెండ్లిండ్ల కాలములయందు తాంబూలము, అర్ధరూపాయి యివ్వవలసినది.
- కొండవాళ్ళు, కోయవాళ్ళు, ఓదుల వాళ్ళు యీ మూడువర్ణములవాళ్ళు తాంబూలము, అర్ధరూపాయిచొప్పున కట్నము యివ్వవలసినది.
- శిల్పికారులు, పంచాణంవార్లు, యీ అయిదువర్ణములవారికి దేవతలనాటి శాపమున్నదిగనుకను, మహానాటివారి సమయములోనివారు కానందున పాలకీ మొదలయినవి నడువవు. శుభకార్యములు వచ్చినప్పుడు కొమ్మతోరణము కట్టకూడదు. మహానాటివారి సమ్మతిని ఆకుమడిచి దొప్పతోరణము కట్టుకోవలసినది. గోడకు వెల్లవేయకూడదు, మూడుచెంగులయిల్లడము పట్టవలసినది.
- మాలవాళ్ళు మొగవాళ్ళ పెండ్లిండ్లకు మహానాటివారికి తాంబూలము, అర్ధరూపాయి కట్నము ఇవ్వవలసినది. గ్రామములో ఆడపడుచు పెండ్లికి పావలాకట్నము ఇవ్వవలసినది. వెల్లగుఱ్ఱము, వెల్లగొడుగు, పట్టమునడుమ నాలుగువీధులు ఊరేగడమును గలదు. ఇదిగాక మహానాటివారికి సంకురాత్రికట్నము, ఇంటికి మూడేసి కుంచముల పరిగలు ఇవ్వవలసినది.
- మాదిగవాళ్ళ పెండ్లికి మూడు స్తంభముల పందిరి. బొట్టమోపుగా నొకరాట నిల్పుకునేది. మూడు చెంగుల యుల్లనము పట్టవలసినది. తుడుముతప్పెట్లు దొడ్డికొమ్ము యముడుఎక్కే వాహనము కలదు. ఊరికి ఉత్తరమున ఊరేగింపుకలదు. విడి మూరెడు పసుపులో తడిపిన పసుపుపొత్తి ఉత్తరము, దక్షిణము తూర్పు ఇండ్లు కట్టరాదు. విడి మూరెడు పసుపులో తడిపిన పసుపుపొత్తి ఉత్తరము, దక్షిణము తూర్పు ఇండ్లు కట్టరాదు. పడమర యిల్లు గోడలు మట్టికట్టుక నక్షత్రవీధి కనిపించేలాగున విడిచిపెట్టవలసినది. ఇండ్లకు వేలుముద్దలేదు. బోయలు కానకుండా అవిరేడుకలదు. ఎండిన కుండయందు వాళ్ళు వెల్లతీసేది, కత్తివంకపిళ్లు, విచ్చుకత్తి, విసనకర్ర, సింధుప్రతిమ, దొప్పతోరణము, అరుంధతీదేవి శాపము వల్ల యీ ప్రకారముగా నడిచేమర్యాదలు, పెండ్లికి మహానాటివారికి కట్నము ఇవ్వవలసినది. ఇదిగాక సంకురాత్రి పండుగకింద కత్తికి బేడ, గూటమునకు బాతిక, ఆరెకు దూలము, కులాచార ధర్మములు చెడగొట్టక యీ చొప్పున నిచ్చుకోవలసినది. యీ పద్దతికి ఈ పైన వ్రాసిన జాతులలోను వ్యవహారపు పద్దతుల చొప్పున వప్పుకున్న కులాలవారికి ఎవరి పద్దతుల చొప్పున వారికి నడిపించవలసినది.
Footnotes:
- జమ్మలమడక మాధవరామ శర్మ-తంత్రములు- 1962-విజ్ఞాన సర్వస్వము-ఏడవ సంపుటము-దర్శనములు-మతములు-(తెలుగు భాషా సమితి)-p 440-443 & నోరిహనుమఛ్ఛాస్త్రి-2000-విశిష్టశ్రీచక్రము- వామాచారము (అనుబంధము-8)-p 151-152. భారతభూమియందు వైదికమతమునకు శత్రువుగా ఘోరములగు ఆచారములు కలిగిన వామపర్యాయియగు శాక్తేయమను ఒక ఉపాసనా పద్దతి అప్పుడప్పుడు ప్రబలుచుండును. దానిని వైదిక మార్గప్రర్తకులగు శ్రీకృష్ణ ద్వైపాయన, శ్రీ విద్యా శంకర, శ్రీ కల్యాణానంద భగవత్పాదాది మహనీయులు అన్ని విధముల వారించి వైదిక ధర్మమును స్థాపించుటయు జరుగుచునే యున్నది ఇట్టి వైదిక ధర్మ విరుద్దములగు వామాద్యాచారములను పూర్వము జాతి వర్ణకుల గోత్రహీనులును, అజ్ఞాత కులగోత్రులును, ప్రారబ్దవశమున అర్ధకామాశచే కులభ్రష్టులై చండాల మ్లేచ్చాది జాతులందు ప్రవేశించిన పాండిత్య విశేషముతో నొప్పువారలును లేవదీసి వైదిక ధర్మమునకు బ్రతి ద్వందిగా ప్రచారము చేయ మొదలిడిరి. వీరి దుశ్చేష్ణలకు సహింపక శిష్ట వైదిక ధర్మప్రవర్తకులు వారలను చాతుర్వర్ణ్యము నుండి బహిష్కరించుచు అపహసించుచుండిరి. దానికి ఈ భ్రష్ట్రులగు విద్వాంసులు ఈర్ష్య చెంది తమ భ్రష్ట స్థితియే పరమ పురుషార్ధ సాధనమనియు, చాతుర్వర్ణ్యముతో నొప్పు వైదికాచారము పురుషార్థమును సాధింపజాలడనియు బోధించు తంత్ర గ్రంథములను గొన్నింటిని చిత్రించి సక్రమంబగు వైదిక మార్గమునకు భ్రంశమును కలుగ చేయుటకై ఆ తంత్ర గ్రంథములకు వైదికత్వానులేపనము చేయమొదలిడిరి. కాలక్రమమున అర్థకామాసక్తులగు ద్విజులు సైతము ఈ తంత్ర గ్రంధములను ప్రమాణముగా స్వీకరించి వైదికమత విరుద్దములగు కొన్ని మతములను బ్రచారము చేయమొదలిడిరి. ఈ గ్రంధముల అవలంబనమునే భారత భూమియందు నేడు అసంఖ్యాకములగు అవైదిక మతములు ప్రబలుటయు,. పై తాంత్రికాచారములు ద్విజులయందు చెలరేగుటయు గల్గినది. అంతేకాక విక్రమార్క శకారంభమున భారతభూమియందు అనులోమ విలోమ జాతులవారు విరళ సంఖ్యాకులుగా నుండిరి. అట్టి వారలలో విద్యాబుద్దులు గల కొందరు అర్థకామాశ వలన పై తాంత్రికోపాసనను బోధించు పుస్తకముల కొన్నింటిని విరచించి బహుళ ప్రచారము చేయ మొదలిడిరి. వీరి ‘ప్రచారముచే ఆ ఉపాసకులందరు పంచ విధములుగా విడిపోజొచ్చిరి. ఇట్టి విభాగమునందు ఉపాసకులు తమ తమ కభీష్టములగు గుణముల నాధారముగా చేసికొని తత్త ద్విశిష్టమగు దేవతల నుపాసించుటయేగాని వేరొండుగాదు. అందు శాక్తులను వారలు శక్తియే తమ కుపాస్యదేవతయని తలంచువారలు. వీరలచే ఉపాసింపబడు శక్తి విశేషభేదముచే వీరలు మరల పది విధములుగా విభజింపబడుచున్నారు. ఆశక్తి విశేషము చేతనే వీరలు జపించు మంత్రము అనుసరించు ఉపాసనా పద్దతి గూడ పరస్పరము భేదించు చుండును. అట్టి శక్తి భేదములు “కాళీ, తారా, త్రిపురసున్డరీ, భువనేశ్వరీ, ఛిన్నమస్తా, త్రిపురభైరవీ, ధూమావతీ, బగళాముఖీ, మాతంగీ, కమలాత్మికా” అనునవి. వీనికి ప్రత్యేకముగా పది విధములగు తంత్ర గ్రంథములు వెలువడినవి. ఈ గ్రంథములను అనుసరించి ఉపాసన గావించు వారలే శాక్తేయులనియు, వామాచారులనియు బ్రసిద్ది నేటికిని గాంచుచున్నారు. ఈ శాక్తేయులు క్రీ. శ పదియవ శతాబ్దము వరకు తమ కభీష్టమగు శక్తిరూపమును ఉపాసించుట తప్ప వేరొక తత్వాన్వేషణమును గూర్చి ఎట్టి ప్రయత్నమును ఎవ్వరు చేసి యుండలేదు. ఈ భిన్నశక్త్యుపాసననే యవ్వారలు “దశ మహావిద్యలు” అని ప్రచారమును చేసిరి. వీనియందు గూడ కాళి ఉపాసన అ గ్రస్థానము అలంకరించి యుండెను…….; కుమారి. పి. చెంచుసుబ్బమ్మ-వజ్రయానము-డా.కొత్తసచ్చిదానందమూర్తి(సం)-1962-విజ్ఞానసర్వస్వము-ఏడవ సంపుటము-దర్శనములు-మతములు-p 672. తాంత్రిక మతము ముఖ్యముగా రెండు విధములు, ఒకటి సామాన్య జనులచేత, విద్యాబుద్ధులు లేనివారిచేత ననుసరించబడు మంత తంత్రములను ఒక క్రమ పద్ధతి లోనికి తీసుకొని వచ్చిన తాంత్రికము. రెండవది మరికొంత సంస్కరింపబడి బాగుగావృద్ధిపొందిన తాంత్రికము. దీనిని వజ్రయాన మందురు. ఈ రూపములో తాంత్రిక మతము బౌద్ధమతములో చేర్చబడినది. ఈ తాంత్రిక మతాను యాయులలో యోగులు, సిద్ధులు, వారి శిష్యగణము గలరు, ఇందులో ప్రముఖులైన యోగులు, సిద్ధిని పొందిన వారు భిన్న భిన్న శాఖలను స్థాపించిరి, ఒకొక్క శాఖ వేరు వేరు దేవతలు, మంత్రములు, అనుష్టాన పద్ధతులు గలిగియుండును. శ్రీమాన్ మేడేపల్లి వరాహ నరసింహస్వామి-ఆగమములు-కొత్తసచ్చిదానందమూర్తి(సం)-1962-విజ్ఞానసర్వస్వము-ఏడవసంపుటము-దర్శనములు-మతములు-p279-281. కుమారిలాది శుద్ధ వైదికులు సాంఖ్యయోగ పాంచ రాత్ర పాశుపతాదుల ధర్మాధర్మ నిబంధనలను, బౌద్ధ జైనాదుల మతములతోపాటుగ ఆగమములనిరి, కాని కొంత విశాలదృష్టిగల ఆస్తిక దార్శనికులు (ఉదా, వాచస్పతి) బౌద్ధాది నాస్తికమతములు ఆగమా భాసములనియు, ఆగమములు వేదానుకూలములే అనియు ఎంచిరి. Alexis Sanderson-The Development of Tantric Buddhism Through the Adoption and Adaption of Saiva and Sakta Saiva Models-2009-The Saiva Age-The Rise and Dominance of Saivism during the Early Medieval Period- Genesis And Development of Tantrism- Alexis Sanderson-Edited by Shingo Einoo-p124, 143-145. ‘He should wander in other lands, in which he is known nowhere. With firm resolve the Sadhaka should enter among untouchables who are devotees of Siva and recognize no other deity as absolute, who are inspired by the Siddhanta, always attached to [the rituals of] bathing and deity-worship, and dedicated to the doctrines of its scriptures through some slight degree of literacy. After entering among them in the guise of an untouchable votary (candalaganah), he should, while cultivating insight into the highest wisdom, instruct them in the religion of the Siddhanta established in such scriptures as the Kalottara, or the Nisvasa, and in order to win their trust he should take as his disciples all those who are enjoined by the Tantra after [initiating them before] the Initiation Mandala [of Siva]. Then he should give back to them all the goods and money that they will previously have gathered and given him as their offering to their Guru and take [instead] a girl of theirs with a beautiful face and eyes. After acquainting her with the essence of the Mantras and making her adhere to the rules of an initiate that wise one should practice the Vidya observance [with her], after resolving to become a Buddha.’
- S.P. Narasimmalu Naidu-Origin and History of Balija Caste-p 27d-31d & సేలము పగడాల నరసింహులు నాయుడుగారు-1905-శ్రీ చంద్రవంశక్షత్రియులైన, ఆంధ్రులు, గౌరవులు, అను బలిజవంశ పురాణము లేక నాయుడుగార్ల సంస్థాన చరిత్రము-p 111,114-116 & ఆలందూరు రాజమన్నారునాయుడు-1951-బలిజవంశేతిహాసము-p 151-157
రచయిత మైలవరపు వి.యన్.యల్. సుధామోహన్ గారు ఒక పరిశోధనాత్మక రచయిత. ఆయన వృత్తి రీత్యా వైమానిక రంగంలో పనిచేస్తున్నా, ప్రవృత్తి రీత్యా ధార్మిక సిద్ధాంతాలను, దర్శనశాస్త్రాలను నేర్చుకుంటున్న నిత్య విద్యార్థి, వాటితోబాటుగా పాశ్చాత్య భావదాస్య విముక్తిపై (De-colonization) కూడా అధ్యయనం చేస్తున్నారు. భారతదేశం ధార్మిక నాగరికతగా కొనసాగాలని, భారతీయులందరూ ఆర్షపరంపర ద్వారా లభించిన జ్ఞానామృతాన్ని గ్రోలాలన్నదే ఆయన ఆకాంక్ష.
