Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి-2

[‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపరని అందిస్తున్నారు శ్రీ మైలవరపు సుధా మోహన్.]

క్షిణాదిలో హిందూ సమాజం అష్టాదశ ప్రజలుగా, ప్రకృతులుగా, వర్ణాలుగా వర్గీకరించబడింది. ప్రాచీనకాలం నుండీ దక్షిణాదిలో కులాలెన్ని ఉన్నా కూడా అందరినీ కలిపి అష్టాదశ ప్రజలుగా పిలిచేవారు. సుమారుగా శా.స 1457 (1535CE) కాలానికి చెందిన పులివెందుల శాసనంలో బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వ్యావహారిక, గోరక్షక, శిల్పక, పంచాణ, కుంభాకార, తంతువాయ, క్షౌరక, రజక, వస్త్రఛ్చేదక, చర్మకార, తిలఘాతక, లుబ్ధక, ఛండాల, మాతంగులనే వారు అష్టాదశ ప్రజలని చెప్పబడ్డారు (11). సాశ 1172 లో కాకతీయరాజైన రుద్రదేవుడిచే వేయించబడిన నాగులపాడు శాసనంలో కూడా అష్టాదశ ప్రజకు సంబంధించిన వివరాలున్నాయి. కాకతీయుల కాలంలో ప్రతి గ్రామపు ఆర్ధిక వ్యవస్థకు ఈ అష్టాదశ ప్రజలు లేదా ప్రకృతులు కీలకంగా ఉండేవారు (12). శబ్దరత్నాకరము అనే గ్రంథంలో కూడా అష్టాదశకులాల వర్ణన ఉంది (13). 14వ శతాబ్దం మధ్యన తమిళనాడులో అష్టాదశజాతులుండేవని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి (14).

అనేక శాసనాలలో, పుస్తకాలలో మనకు దక్షిణదేశ సామాజిక వ్యవస్థ అమరిక గోచరిస్తుంది. ఈ అష్టాదశ ప్రజలలో అనేకమంది వివిధ చేతివృత్తులు, వర్తకవాణిజ్యాలను నిర్వహిస్తూండగా, వీరికి తోడుగా పరిపాలనలో భాగంగా వివిధ కులాలకు చెందిన వారికి, ఆయా కులాల సామాజిక నైపుణ్యత ఆధారంగా ప్రభుత్వ్యోద్యోగాలు ఇవ్వబడేవి. స్కాందపురాణపు నాగర ఖండంలో అష్టాదశ జాతి భేదాలు, అరవైనాలుగు కళల ఉత్పత్తి క్రమమూ ఉన్నాయని, ఈ నాగర ఖండాన్నే సనత్ కుమార సంహిత అని అంటారని కొన్ని గ్రంథాలలో ఉంది (15).

అష్టాదశ ప్రజల అమరిక ప్రాంతాలనుబట్టి కొన్ని భేదాలతో కనిపించినా, దక్షిణ భారతదేశంలో ఈ అమరిక ఒక ప్రబలమైన సామాజిక వ్యవస్థగా కనిపిస్తుంది (16). ఈ వర్గీకరణ ప్రకారం సమాజంలో చతుర్వర్ణాలు, దాన్లో అంతర్భాగమైన మిశ్రితజాతులతో కూడిన 18 వర్గాలుండాలి. కానీ బ్రిటిష్ పాలనలో ప్రాచుర్యంలోకి వచ్చిన పంచమవర్ణానికి ఇతర వర్గీకరణలకు భారతీయశాస్త్రాలలో, చరిత్రలో స్థానమున్నట్లుగా సూచించే ఆధారాలు లభించడంలేదు. బ్రిటిష్ వారు సృష్టించిన వర్గీకరణలు ఎక్కువగా వారి పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటుచేసుకున్నవేనని వారి రిపోర్టులలో స్పష్టంగా ఉంది.

అలా అని హిందూ గ్రంథాలలో పంచమ ప్రస్తావన పూర్తిగా లేదు అనడం కూడా పూర్తి సత్యం కాబోదు. శాస్త్రాలలో అక్కడక్కడా ‘పంచమ’ ప్రస్తావన ఉంది. పంచముల గురించి నిరుక్తంలో(3.8), బృహద్దేవత (7.69) (17), సాంబపురాణం, అదితి సూక్తంలో (18) కనిపిస్తుంది. ‘అస్పృశ్య’ (Aspr̥śya) అనే సంస్కృత పదం విష్ణుస్మృతిలో కనిపిస్తుందని, ధర్మశాస్త్రాలలో ఐదవ వర్ణానికి ఎటువంటి స్థానం లేకపోయినా బ్రహ్మసూత్రాలకు చెప్పబడిన భాష్యంలో (1.4.12) పూర్వం కొందరు నిషాదులను ఐదవ వర్ణంగా భావించారని (19), అదేవిధంగా, సాంబ పురాణం (66.10) లో కూడా ఐదవ వర్ణం ప్రస్తావన కనిపిస్తుందని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు (20).

పంచముల గురించిన చర్చలో తరచూ అస్పృశ్యత గురించిన చర్చ కూడా కనిపిస్తుంది. విష్ణుస్మృతిలో ప్రస్తావించబడిన ‘అస్పృశ్య’ అన్నపదం కేవలం చండాలులకు మాత్రమే కాదు, ఇతరజాతులకు (‘చండాలాద్యాః’) కూడా వర్తిస్తుంది (21). చండాలురు పలురకాలుగా ఉన్నారు (22). ట్రావెన్‌కోర్ సంస్థానంలో జరిగిన ఆలయప్రవేశ ఉద్యమం సమయంలో అక్కడ ఏర్పాటు చేయబడిన కమిటీ (1934లో) ఇచ్చిన నివేదిక కూడా చండాలురు ముఖ్య, మధ్యమ, హీన అనే మూడు రకాలుగా ఉన్నారని చెప్పింది (23). చండాలురు ఒకే వర్గానికి చెందినవారు కారని అందులో మూడు రకాల స్థాయిలు ఉన్నాయని, వీరిలో కొందరు మాత్రమే ఊరిబయట ఉండేవారని అప్పటి వివరాలు తెలియజేస్తాయి!

హొకార్ట్ అనే పాశ్చాత్యుడు బౌద్ధం ఐదో జాతి గురించి అక్కడక్కడా వర్ణించిందని వ్రాశాడు (24). బౌద్ధం చండాలులపై చూపిన అంటరానితనం గురించి 1964లో వాసుదేవ ఉపాధ్యాయ గారు తన గ్రంథంలో ప్రస్తావించారు. పాల, చందేలా శాసనాలలో సమాజంలోని నిమ్నకులాల గురించి ప్రస్తావించబడింది. ఈ శాసనాలు తూర్పు పంజాబ్ సహా, ఉత్తర భారతదేశంలో, నాలుగు వర్ణాలతో పాటు చండాలులు, ఇతర నిమ్న కులాలనూ ఉద్దేశించి రాజు సంబోధించాడని చెబుతాయి. అప్పటి చండాలురు సమాజంలో భాగమని కూడా ఈ శాసనాలు సూచిస్తున్నాయి. వాసుదేవ ఉపాధ్యాయ గారి ప్రకారం, జైన గ్రంథాలలో చండాలుడు కళింగ, గాంధార వంటి ఇతర జనజాతులతో పాటు ప్రస్తావించబడి, అస్పృశ్యుడిగా పరిగణించబడ్డాడు (S.B.E. II, 2, 27). పాళి గ్రంథాలలో కూడా చండాలుడు స్పష్టంగా అస్పృశ్యుడిగా చిత్రించబడ్డాడు. చండాలుని శరీరాన్ని తాకిన గాలి తగిలినా అది మలినంగా (pollution) భావించబడింది (జాతక III.233; IV.376, 397). అదేవిధంగా, గారడి చేసేవారు (Jugglers), శరీర విన్యాసాలు (Acrobats) చేసేవారు కూడా కొన్ని సందర్భాల్లో చండాలులుగా పేర్కొనబడ్డారు (25). వామపక్ష చరిత్రకారుడైన వివేకానంద ఝా గారు వ్రాసిన ‘చండాల’ అనే గ్రంథం జైనుల సూత్రకృతాంగ సూత్ర అనే గ్రంథం చండాలురను క్షుద్రవిద్యాశాస్త్రంలో ప్రవీణులుగా, చేతబడులు ఇత్యాదివి చేసేవారిగా వర్ణించిందని, బౌద్ధ జాతక గ్రంథాలు. మొదలైన గ్రంథాలు చండాలులను అసహ్యించుకున్నాయని తెలిపింది (26). (ఈ అంశంపై మరిన్ని వివరాలకు ‘Sivasya Kulam’ అనే గ్రంథాన్ని చూడండి.) ఈ నేపథ్యంలో బౌద్ధ గ్రంథాలలో కనిపించే ‘ఐదవ జాతి’, అస్పృశ్యత గురించిన చర్చ ఇక్కడ చేయడం లేదు, దానిని పరిశోధించాల్సిన అవసరం ఉంది.

పంచమ అనే వర్గీకరణ గురించిన చర్చలో మనం మనుస్మృతిని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేటట్లైతే, మనుస్మృతి (10.4) పంచమ వర్ణం లేదని తేల్చి చెప్పింది (27). ఈ విషయాన్ని మహాభారతం కూడా ధృవీకరించింది (‘స్మృతాశ్చ వర్ణా చత్వారో పంచమో నాధి గమ్యతే’-అనుశాసన పర్వం 47-18). హిందూ సమాజపు వర్గీకరణకు కేవలం స్మృతులే మూలమని చెప్పినట్లైతే, ధర్మశాస్త్రాలు, మహాభారతం రెండూ కూడా పంచమవర్ణమే లేదని తేల్చి చెబుతున్నా పంచమ వర్ణం, పంచమ వర్గం, అస్పృశ్యులు మొదలైన ప్రత్యేక వర్గీకరణలు హిందూ సమాజంలో ప్రాచుర్యంలోకి రావడానికి గల వాస్తవ కారణాలు ఇంకా ప్రజాబాహుళ్యంలో లేవు.

సామాజికంగా విభిన్న రూపాలలో ఉన్న శౌచ పద్దతులను ద్వంద్వాలలోకి కుదించి ఏకపక్ష వివక్షతో కూడిన వ్యవస్థగా ముద్రవేసి దానికి అన్-టచబిలిటీ లేదా అస్పృశ్యత అనే పేరు పెట్టి దానిని ఒక వర్గీకరణలాగా ఉపయోగించింది మాత్రం బ్రిటిష్ వారేనన్న విషయం ఫ్రెంచ్ సోషియాలజిస్టు లూయీ డుమోంట్ గ్రంథంలో ఉంది (28). సైమన్ ఛార్స్లీ కూడా ఈ అంశాన్ని ధృవీకరించాడు.

పంచములు-బహిష్కృతులు/వెలివేయబడినవారు (Out-caste):

1807 లో దక్షిణాదిలో పర్యటించి హిందువులపై పుస్తకాలను వ్రాసిన ఫ్రాన్సిస్ బుకానన్ వ్యవసాయం చేసే వారిలో శూద్రులను, పంచమ బంధం అనే వర్గానికి చెందినవారిని ‘Inferior Castes’ (తక్కువ జాతులు) అని పిలుస్తూ, వీరందరూ వ్యవసాయంలో ఉపయోగించబడే బానిసలని చెబుతూ క్రైస్తవసమాజం ఆధారంగా హిందూసమాజాన్ని వర్ణించాడు. బ్రాహ్మణులు తాకకపోవడం ఆధారంగా ఈ జాతులను తక్కువగా వర్గీకరించాడని బుకానన్ వ్యాఖ్యానాన్ని గమనిస్తే అర్థమౌతుంది. ఆరోగ్య-ఆచార కారణాల వలన బ్రాహ్మణులను ఇతరులు, ఇతరులు బ్రాహ్మణులను కూడా తాకేవారు కారు. కానీ బుకానన్ ఈ అంశాన్ని గమనించలేదు లేదా పట్టించుకోలేదు. వ్యవసాయంచేసే కులాలలోని ధనికుల వద్ద బ్రాహ్మణులు గుమాస్తాలుగా, వంటవారిగా పనిచేసేటప్పుడు ఆ వ్యవసాయం చేసేవారందరూ తక్కువ జాతులు ఎలా అవుతారు?

బుకానన్ వ్యవసాయ కూలీలను బానిసలని పిలవడానికి సరిపోయే ఆధారాలు చూపలేదు. హిందూ సమాజంలో వ్యవసాయకూలీలు పలు విధాలుగా ఉండేవారు. చాలామందికి ఆ పంటలో వాటా లభించేది. అప్పుడు వారు ఆ వ్యవసాయంలో వాటాదారులవ్వాలి. మరి వారందరూ కూడా కూలీలెలా అయ్యారు? ఇందులో అంతర్గతంగా ఉన్న మరొక అంశమేమిటంటే ఒకే జాతికి చెందినవారు వ్యవసాయంలో కూలీలుగా పనిచేస్తున్నా, అదే జాతికి చెందిన గ్రామభటులకు ఆ పంటలో వాటా లభించేది. అప్పుడు ఈ జాతి మొత్తాన్ని వ్యవసాయకూలీగా పిలవడం శాస్త్రీయంగా ‘over simplification’ ‘over generalisation’ లేదా ‘reductionism’ గా పరిగణించబడుతుంది. జాగ్రత్తగా చూస్తే బుకానన్ ఈ ప్రక్రియను సరిగ్గా అర్థం చేసుకోలేదని తెలుస్తుంది.

క్రైస్తవ చట్రాల, బైబిల్ సిద్ధాంతాల, క్రైస్తవుల ప్రాపంచిక అనుభవాల ద్వారా ఇతర దేశాల ప్రజలను, సమాజాలను నిర్వచించడం, విశ్లేషించడం అప్పటి పాశ్చాత్యులలో సామాన్యమైన విషయం. వారు ఇదే పద్దతిని హిందువులపై కూడా ప్రయోగించారు. ఈ ధోరణి పూర్వపు క్రైస్తవ గ్రంథాలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, 1768లో అలెగ్జాండర్ డౌ బ్రాహ్మణులను యూదుల లెవిట్స్ తో పోల్చుతూ సంబోధించడాన్ని అతని గ్రంథంలో గమనించవచ్చు (29). ఫ్రాన్సిస్ బుకానన్ కూడా ఇదే ధోరణిని కనపరిచాడు. బ్రాహ్మణులను యూదులతో పోల్చడం, యూదులలాగానే బ్రాహ్మణులు వ్యవసాయం చేయరని చెప్పడాన్ని గమనిస్తే, పాశ్చాత్య సమాజపు జ్ఞానం, అనుభవాల ఆధారంగా భారత సమాజాన్ని విశ్లేషించాడన్న అభిప్రాయానికి మరింత బలం చేకూరుతుంది. ఈ రకమైన ధోరణినే మిగతా సమాజాన్ని వర్ణించడం పట్ల కూడా ప్రయోగించాడని పూర్వపు గ్రంథాలు సూచిస్తున్నాయి (30).

బ్రిటిష్ పాలనలో సృష్టించబడిన పంచమవర్ణమనే వర్గీకరణకు మూలాలుగా బుకానన్ వంటి పాశ్చాత్యుల వర్ణనలు పనిచేశాయి. ఆ తరువాతి కాలంలో పంచమవర్ణం గురించిన చర్చలో బుకానన్ పేర్కొన్న ‘పంచమ బంధం’ ఆధారంగా చూపబడ్డది. పంచమ బంధం అనే వర్గంలో పరియా, బలన్ (వళ్ళువన్?), సెక్కిలియర్ మరియు తోటి అనే కులాలవారున్నారని బుకానన్ తెలిపాడు (31). తోటి అనేది వృత్తి పేరు. గ్రామభటులుగా, పూర్వపు గ్రామ ప్రభుత్వోద్యోగాలలో ఉన్న 12 వృత్తులలో- బారాబలోతీలలో ఇది ఒకటి (32). ఈ జాతులను పంచమ అనే పేరుతో పిలిచారని భావించినా, బంధం అనే పదం యొక్క అర్థం వివరించబడలేదు. పంచమ అనే పేరుతో పంచమ బనజిగారు అనే కులం పేరును కూడా బుకానన్ ప్రస్తావించాడు.

ఆ తరువాత కాలానికి చెందిన బ్రిటిష్ రిపోర్టులలో ఈ పదాలకు అర్థాలు వివరించబడ్డాయి. ఉదాహరణకు, 1855నాటి బ్రిటిష్ అధికారిక నిర్వచనాలలో పంచమ, పంచమబనజిగారు మొదలైన పదాలన్నింటికీ బహిష్కృతులు/వెలివేయబడినవారనే (Out-caste) అనే అర్థం ఉంది (33).

Out-caste, excommunicated వంటి పాశ్చాత్య పదాలకు చెందిన అర్థాలను మనం అర్థం చేసుకోవడం అవసరం. అవుట్‌కాస్ట్ అంటే కులవ్యవస్థకు వెలుపల ఉన్నవాడు లేదా బహిష్కృతుడు అని అర్థం. ఇది వలసపాలనలో ప్రాచుర్యంలోకి వచ్చిన అపోహ. ముందు మనం గమనించిన గ్రామ ఆర్ధిక వ్యవస్థకు కీలకమైన అష్టాదశ ప్రజలలో చండాలురు ఒకజాతి. వారు కూడా వర్ణాశ్రమధర్మాలలో అంతర్భాగంగా ఉన్నారు. వారి గురించి ధర్మశాస్త్రాలలో పెద్ద ఎత్తున చర్చ ఉందంటే దాని అర్థం ధర్మశాస్త్రాలు వారిని కూడా సమాజంలో భాగంగా పరిగణించాయి కాబట్టే. కాదు వీరికే వర్ణమూ-జాతి-కులం లేదని వాదించే పక్షంలో, ఈ కింది సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది. పంచమ బనజిగారు అనే వర్గం వీరశైవానికి చెందింది. వీరశైవుల అత్యాశ్రమం వర్ణాశ్రమధర్మాలకు అతీతమైనదని చెబుతుంది. అప్పుడు వీరశైవులందరూ కూడా వర్ణబాహ్యులుగా పరిగణించబడే అవకాశముంది. దీనివలన కేవలం ఊరిబయట ఉండే కులాలు మాత్రమే కాదు, ప్రస్తుతం దక్షిణాదిలో ఉన్నత కులాలుగా పరిగణించబడుతున్న ఎన్నో కులాలు వర్ణబాహ్యులవుతారు. ఈ సృష్టిమొత్తం త్రిగుణాత్మకమని, ఇందులో మూడు గుణాల ద్వారా ఆవరించని పదార్థమే లేదని వైదిక విజ్ఞానం చెబుతుంది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కేవలం ఆ పరమాత్మే అవర్ణుడని స్పష్టంగా పేర్కొన్నది (34). తంత్ర సిద్ధాంతాల ప్రకారం కేవలం శివుడు మాత్రమే అవర్ణుడు, మిగతా అందరూ కూడా సవర్ణులే! కానీ బ్రిటిష్ పాలనలో మొదలైన narrative యుద్ధంలో వాస్తవాలతో పనిలేదు!

పాశ్చాత్యులు Out-caste అనే క్రైస్తవ సంస్కృతికి చెందిన పదాన్ని హిందువులలో కొన్ని వర్గాలపై ఆపాదించారు. దీనివలన ఆ తరువాత కాలంలో ‘వెలివేయబడినవాడు’, ‘అవర్ణుడు’, ‘బహిష్కృతుడు’ అనే అర్థాలు విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. దీనిని ‘సమాజం నుండి పూర్తిగా బహిష్కృతుడైనవాడు’ అనే అర్థంలో గ్రహించడం తప్పు. గ్రామ వెలుపల నివాసం ఉండటం, భిన్నమైన ఆచారాలు, పరస్పర స్పర్శ నియమాలు ఉండటం అన్నది బహిష్కరణ కాదు. ఎందుకంటే ఇది ఆరోగ్యకారణాల వలన ఒకరినొకరు తాకకపోవడం, లేదా సాధనాపరమైన నియమాల వలన ఒకరినొకరు తాకకపోవడం, వృత్తులవలన విభిన్న ప్రాంతాలలో నివసించడం వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ఊరివెలుపల ఉండటానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి. వలసపాలనలో ఉపయోగించబడిన పదాలకు 20వ శతాబ్దంలో అంబేద్కర్ గారు ప్రతిపాదించిన ‘అస్పృశ్యులు’ అన్న వర్గీకరణను కూడా హిందూ శాస్త్రాలు చెప్పలేదు. కానీ ఈ అర్థమే సాధారణీకరించబడి తర్వాత చరిత్రలో స్థిరపడ్డది.

హిందూసమాజంలో కుల బహిష్కరణ ఉంది, అది ఎప్పుడోకాని జరిగేది కాదు. దానికి ఎన్నో ప్రాయశ్చిత్తాలు ఉండేవి. కానీ బ్రిటిష్ వారు సిద్ధాంతీకరించిన ‘బహిష్కృత’/‘వెలివేయబడిన’ అనే వర్గానికి చెందిన జాతుల జనాభా అతిపెద్దది. ఇంతపెద్ద సంఖ్యలోని ప్రజల జాతులకు జాతులే ఎలా వర్ణబాహ్యులు, సమాజబహిష్కృతులు, వెలివేయబడ్డారనే ప్రశ్నకు వలసకాలపు చరిత్రకారులు, సామాజికశాస్త్రవేత్తలు సంతృప్తికరమైన సమాధానాన్ని ఇవ్వలేదు. అదే సమయంలో ఆ ‘బహిష్కృత’/‘వెలివేయబడిన’ జాతుల వారికి ఆసేతుహిమాచలం గ్రామోద్యోగాలు ఎలా ఇవ్వబడ్డాయో, వారికి ప్రత్యేక పూజలు, గుడులు, ఆచారాలు, ఆర్ధిక వ్యవస్థలు ఎలా ఏర్పడ్డాయో కూడా బుకానన్ వంటి పాశ్చాత్యుల గ్రంథాలలో వివరించబడలేదు. ఈ విరోధాభాసం బ్రిటిష్ వర్గీకరణలు సామాజిక వాస్తవాలపై కాకుండా మిషనరీల అసమగ్ర వ్రాతలపై, పరిపాలనా అవసరాలపై, ఆ అవసరాల ఆధారంగా చేసిన ఊహలపై ఆధారపడ్డాయని సూచిస్తుంది

Out-caste-బహిష్కృతులు/వెలివేయబడినవారు పంచములైతే, 1859లో బిషప్ కాల్డ్వెల్ పరియా కులం గురించి వ్రాసిన వివరాలలో, అప్పటి స్థానికులు పరియాలు వెలివేయబడినవారు లేదా మిశ్రిత జాతికి లేదా సంకీర్ణ జాతికి చెందినవారని చెప్పారని ఉంది (35). ఇది కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. వీరు పంచములా? ‘బహిష్కృత’/‘వెలివేయబడిన’ వారా? లేక సంకీర్ణులా? అస్పృశ్యులా? ‘బహిష్కృత’/‘వెలివేయబడిన’ వారికి వర్ణం లేదు కాబట్టి వారు అవర్ణులని బ్రిటిష్ గ్రంథాలలో ఉండగా, ప్రతిలోమ సంకీర్ణులకు వర్ణం ఉంది. అందువలన వారు అవర్ణులా, సంకీర్ణులా అన్నది తేల్చుకోవడం కూడా ముఖ్యం. పైగా ఒకే వర్గానికి ఇన్ని పేర్లు ఎందుకు పెట్టబడ్డాయన్న ప్రశ్నకు కూడా సమాధానాన్ని వెతకాలి.

ఆ తరువాతి కాలంలో ఈ అయోమయాన్ని తొలగించకుండా బ్రిటిష్ ప్రభుత్వం పంచములు (పంచమవర్ణం) అనే వర్గీకరణను అధికారికంగా ఉపయోగించడం మొదలుపెట్టింది. దీనికి పునాదులు 1871 మద్రాసు సెన్సస్ లో కనబడుతాయి. 1871 మద్రాస్ సెన్సస్ రిపోర్టులో పరియా కులం తమను తాము ‘ఐదో జాతి’కి (fifth caste) చెందినవారమని చెప్పుకుంటారని సెన్సస్ కమీషనర్ కోర్నిష్ వ్రాశాడు (36).

కానీ ఆ కాలంలో వేరే ఇతరజాతులు కూడా పంచమ లేక పంచమబంధం అని పిలువబడేవారని అప్పటి బ్రిటిష్ గ్రంథాలు సూచిస్తాయి. ఉదాహరణకు, 1873లో ఎడ్వర్డ్ బాల్ఫోర్ పాంచాలులనే చేతి వృత్తి కులాల వర్గాన్ని పంచమ బంధం అనే వర్గం రెండూ ఒకటే అనే విధంగా వ్యాఖ్యానించాడు (37). ఇప్పటివరకూ గమనించిన అంశాల ద్వారా బుకానన్, కాల్డ్వెల్, 1871 సెన్సస్ కమీషనర్ కోర్నిష్, ఎడ్వర్డ్ బాల్ఫోర్ ఎవరూ కూడా లోతుగా పరిశీలించకుండానే పంచముల గురించి పైపై వ్యాఖ్యానాన్ని తీసుకుని వర్గీకరించారని లేదా ఉపయోగించారని తెలుస్తుంది. వీరందరూ కూడా భారతసమాజం గురించి లోతైన పరిశోధనే చేయలేదు, పైగా ఆట్టే లోతుగా పరిశోధించకుండా ఒకరు చెప్పిన విషయాన్ని మరొకరు పునరావృతం చేశారు. వీరందరికీ బుకానన్ పేర్కొన్న పంచమ బంధం ఆధారంగా ఉంది!

ఈ సందర్భంగా ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం అవసరం, ఈ గ్రంథంలో ఎక్కువగా మిషనరీ రచనలే ఆధారాలుగా ఉపయోగించబడ్డాయి. అది మిషనరీల నిర్ణయాలను, విశ్లేషణలను సమర్థించడానికి ఎంతమాత్రమూ కాదు; వారి వర్ణనలలోనే అంతర్లీనంగా కనిపించే అప్పటి సమాజపు తీరుతెన్నులను, వ్యవహారశైలిని అర్థం చేసుకోవాలంటే ఆ మిషనరీలు  చెబుతున్న విషయాలను సమగ్రంగా పరిశీలించడం, వాటిని మన దృష్టితో అర్థం చేసుకోవడం అవసరం.

(ఇంకా ఉంది)

Footnotes:

11) Dr. Avadanam Umamaheswara Sastry-1995-Kadapa Jilla Sasanaalu Samskruti Charitra (Telugu) p 71

12) డా.పి. కనకదుర్గ-1992-కాకతీయులనాటి సామాజిక జీవనము- p 62-63, ‘గ్రామీణ వ్యవస్థలో వివిధ జాతులకు, వృత్తులకు సంబంధించిన ప్రజలందరూ అష్టాదశ ప్రజలు, సమస్త ప్రజలు, పదునెనిమిది జాతులవారు, పదునెనిమిది సమయములవారు అని పిలువబడేవారు. వారు 1) మహాజనులు 2)నకరము 3)కాంపులు 4)బలిజసెట్టికాండ్రు 5)కోమట్లు 6)ఈదరవారు 7)గొల్లవారు 8)అక్కసాలవారు 9)సాలెవారు 10)శ్రీవైష్ణవులు 11)వెలమ వేగురు 12)ఇల్లర్లు 13)గాండ్లవారు 14)నాయకులు 15)రెడ్లు 16)కరణాలు 17)తెలికెవారు 18)నాయీలు. క్రీశ 14వ శతాబ్దానికి చెందిన ఒక శాసనములో 1)బ్రాహ్మణ 2) క్షత్రియ 3)వైశ్య 4)శూద్ర 5)వ్యవహార 6)పాంచాల 7)కుంభకార 8)తంతువాయ 9)వస్త్రభేదక 10)తిలఘాతక 11)కురంతక 12)రజక 13)వస్త్రరక్షక 14)దేవంగ 15)పెరిక 16)గోరక్షక 17)కిరాతక 18)క్షురక అనే పదునెనిమిది జాతులు పేర్కొన్నది. కాకతీయులనాటి అనేక శాసనాల్లో ఈ పదునెనిమిది సమయాలవారు కలిసి అష్టాదశలను పేర సమయంగా ఏర్పడి ప్రభువుల సంక్షేమార్థ, తమ జాతుల పుణ్యం కోసం సంఘటితంగా దేవాలయాలకు దానధర్మాలు చేసినట్లు తెలియజేయబడ్డది.’ & డా. ఏలె లక్ష్మణ్-కులపురాణాలు-తెలంగాణ సంస్కృతి – సాతవాహనుల నుండి కాకతీయుల వరకు తెలంగాణ (చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం)-2017-p 183

13) ప్రసాద భూపాలుడు-1941-ఆంధ్ర విజ్ఞానము – మొదటి సంపుటము- p 217, ‘వీనిని గూర్చి “శబ్దరత్నాకరమను” గ్రంథమందిట్లు వివరింపంబడి యున్నది, అవి ౧. వ్యావహారికకులము, ౨. గోరక్షక (గొల్ల) కులము, 3, శిల్పకకులము, 4. పంచాణకులము, ౫ కుంభకార (కుమ్మరి) కులము, ౬ తంతువాయ (పద్యశాలీ) కులము, ౭. క్షౌరక (మంగలి) కులము, ౮ రజక (చాకలి) కులము, ౯ వస్త్రఛేదక (దర్జీ) కులము, ౧౦. చర్మకార (గొడారి) కులము, ౧౧. తిలఘాతక (తెలుకుల) కులము, ౧౨ లుబ్దక (బోయ, కులము ౧౩. ఛాండాలకులము, ౧౪౨ మాతంగ (మాల) కులము. ఈ పదునెనిమిదికులములను అష్టాదశ వర్ణములని గ్రంథములందువాడియున్నారు.’

14) M.Srinivasa Iyengar-1914-Tamil Studies-p 73

15) బి విజయభారతి (పరిష్కర్త)-1980-తెలుగు సాహిత్యకోశము ప్రాచీన సాహిత్యము- p 524 & మల్లంపల్లి సోమశేఖర శర్మ-ప్రాచీన హిందూ గ్రామపరిపాలనము-ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక(మార్చి 15 1926)-p 165, ‘ఇక రెండవది గ్రామము. ఇందు బ్రాహ్మణులే కాక అష్టాదశవర్ణముల వారు కూడ నుండువారు. మన హిందూ సాంఘీక పద్దతి ప్రకారము వర్ణములు పదునెన్మిదియున్నను అవి యన్నియు చతుర్వర్ణములలోని దిగిపోవును.’

16) మల్లంపల్లి సోమశేఖర శర్మ(సం)- ముఖ్యమతవర్గములు-1958-తెలుగు విజ్ఞాన సర్వస్వము- మూడవ సంపుటం-p 14-17, ………..హిందూసంఘములోని కులములన్నియు కలిసి పదు నెనిమిది – అష్టాదశ – వర్ణములని ప్రతీతి. ఈ యష్టాదశ వర్ణములు ఏ వను విషయమున పండితులలో అభిప్రాయ భేదము కలదు. ఉన్నతకులములవారు క్రింది కులములలోని కన్యలను వివాహమాడి సంతానము కన్నచో అట్టి సంతానమునకు అనులోమజాతులవారని, క్రింది జాతులవారు ఉన్నతకులములలోని కన్యలను వివాహము చేసికొని సంతానము కన్నచో అట్టిసంతానమునకు విలోమజాతులవారని ధర్మ శాస్త్రవిదులు పేరిడియున్నారు. అట్టి అనులోమజాతులు ఆరు, విలోమజాతులు ఆరు, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణములు నాలుగు, మాల, మాదిగ కులములు రెండు – ఇవన్నియు కలిసి అష్టాదశవర్ణములని కొందరు అందురు. మరికొందరు వేరొకరీతిని చెప్పుదురు. అష్టాదశ వర్ణములనుగూర్చిన జాబితాలు నాలుగైదువరకు కలవు. కాని అవి ఒకదానితో ఒకటి సరిపడవు, వీనిలో ఏది సరియైనదో చెప్పలేము; కాని హిందూసంఘము అష్టాదశవర్ణ సమన్వితమని ప్రసిద్ధము. ప్రతి గామములోను, ప్రతిపురములోను అష్టాదశవర్ణములు ఉన్నను లేకపోయినను వ్యవహారమునకు అవి యన్నియు ఉన్నట్లే లెక్క.’

17) Gualtherus H.Mees-1935-Dharma and Society-p112,120 -‘The Dravidians were at first classed as Sudras, and the aboriginal tribes as ‘fifth Varna’ (Nirukta III : 8, Brihaddevata VII : 69), ‘The present untouchable castes developed from those groups: Pulkasas, Chandalas, Nishadas, Dasyu-groups, etc. “It seems”, to quote Dr. Ghurye, “that the Vedic Dasa, by constant association and slow assimilation, had been partially turned into the Sudra and partially into the Nishada, while the refractory and incorrigible elements were despised and styled Paulkasa and Chandala”. The authors of the Dharmasastras wanted to keep to the fourfold division of society. A ‘fifth Varna’ was rejected and these groups were placed among the mixed castes. It was a hopeless effort to bring about conformity between theory and actuality, and it entailed ridiculous explanations.’

18) బలదేవ ఉపాధ్యాయ, కుందుర్తి వేంకటనరసయ్య(అను.)-1953- భారతీయ దర్శనము (ప్రథమ ఖండము)-p 84 అదితి సూక్తం 1-89 లో పురుషుడి గురించిన వర్ణన ఉంది. అదితియే ఆకాశము, అదితి అంతరిక్షము, అదితి మాత, అదితియే పితాపుత్రులును, అదితి సమస్త దేవతలు, అదితి పంచజనులు (నిషాదులతో చతుర్వర్ణములు) పుట్టినదియు బుట్టబోవునదియు అంతయునదితియే-అదితిర్ద్యౌరదితి రంతరిక్ష మదితి ర్మాతా సవితా సపుత్రాః విశ్వేదేవా అదితిః పంచజనా అదితిర్జాత మదితిర్జనిత్వం II ఋ వే 1-89-10

19) వావిలాల రామస్వామి శాస్త్రులు-బ్రహ్మసూత్ర చంద్రిక-p476, ‘ఇట్లుగాక కొందరు దేవతలు, పితృదేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు, అనునీయైదుగురును ఐదుగురు పంచజనులు. అని వ్యాఖ్యానము చేసియున్నారు. మరికొందరు బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులు నలుగురును నిషాదులును కలిసి పంచజనులని చెప్పియున్నారు. వేదమున కొన్ని చోట్ల ‘పాంచజన్యయా’ ‘ప్రజాసంబంధమైన’ అని పంచజనశబ్దము కేవలమనుష్య వాచకముగానే ప్రయోగించబడియున్నది. ఈ పక్షములలో దేనినంగీకరించినను మాకు సమ్మతమే. ఎప్పటికిని మీ పంచవింశతితత్వములు మాత్రము వేదోక్తములు కానేరవు.’ (మృగ పక్షి వధచే జీవించుబోయలు నిషాదులు)

20) Vivekananda Jha-Social Stratification in Ancient India; Some reflections-1996-Culture Through The Ages : (Prof. B.N. Puri Felicitation Volume)-p9, ‘It is significant that the Sanskrit term Asprsya for untouchability was first used in the Visnusmriti, a text of the third century AD, and the phenomenon existed for long with terms like anta, antya, antyaja, antyayoni, antyavasayin, apapatra,abhisasta;etc The classical varna theory did not have any place for a fifth varna, though in his commentary to the Brahmasutra,1.4.12 Samkaracarya (early eight century) shows awareness of a school of thinkers who regarded the Nisada as a fifth Varna; and the Samba Purana 66.10 (sixty-eighth centuries mentions the fifth varna.’

21) విష్ణుస్మృతి-అస్పృశ్యః కామకారేణ స్పృశన్ స్పృశ్యం త్రైవర్ణికం వధ్యః (5-104) కృతమలినీకరణకర్మణాం మనుష్యేష్వస్పృశ్యయోనయః (44-9)

22) మా. వెం. భాగ్యరెడ్డి వర్మ-అనంతపుర మండల ఆదిమాంధ్రమహాజనసభ-ఆంధ్రపత్రికానుబంధము-1925-19-అక్టోబరు & పెనుగొండ ముకుందదాసు-1915-బ్రహ్మజ్ఞానామృతసారము-p 21-24, ‘చండాలురు ఎవరు?- సత్యం నాస్తి తపోనాస్తి నాస్తి యేంద్రియనిగ్రహః సర్వభూతదయానాస్తి ఏతి చండాలలక్షణః అసత్యము పల్కుట, భగవధ్యానము లేకపోవుట, ఇంద్రియనిగ్రహములేకపోవుట, అఖిలభూతములందు దయారహితముగా యుండుట ఇవి చండాలలక్షణములు. అసత్యం పక్షపాతంచ నిర్మలాత్మంచ వంచకః జ్ఞానద్రోహీ శృతిద్రోహీ ఏతి చండాలలక్షణః అనృత పక్షపాతము నిర్మలమగు మనస్సుగలవారిని వంచించుట, జ్ఞానులకు ద్రోహముచేయుట, వేదమునకు విరోధముగా సంచరించుట, ఇవి చండాల లక్షణములు. ఇట్టి లక్షణములు గలవారిని నిజమైనచండాలురని తలంచవలయునని పై ఆర్య వచనములే బోధించుచున్నవి.          గ్రామ చండాలురు ఎవరు?-రజకశ్చర్మకారశ్చ నటో బురుడ ఏవచ కైవర్త మేద భిల్లాశ్చ స్వర్ణకారశ్చ సౌచికః తక్షకస్తిల యంత్రీచ సూనుశ్చక్రీ తధాధ్వజీ           నాపితః కారుకశ్చైవ షౌడశై తేజనంగమాః గ్రామచండాలా ఇత్యర్థః 1.అసహ్యకరవస్త్రములచే చాకలి 2. గొడ్డు చర్మములతో మెలగుటచే చర్మకారుడు 3. దేవాలయాది పవిత్ర స్థలములయందు ధనమును స్వీకరించి నాట్యమాడుటచే నటుడు, 4. మద్యమాంసముల విస్తారము భుజించుటచే దొమ్మరి, 5. మత్స్యములను జంపుటయే వృత్తిగలవాడగుటచే పల్లెవాడు 6. సదావేణువులను చీల్చుటచే మేదరి 7. జంతుహింసకుడగుటచే భిల్లుడు 8. జనులను కనుగప్పి బంగారునపహరించువాడగుటచే కంసాలి, 9.ప్రజల నుండి ధనమును స్వీకరించి దుస్తుల గుట్టునప్పుడు గుడ్డనపహరించు స్వభావము కలవాడగుటచే దర్జీ 10. ఎప్పుడును వృక్షములీతని కారణమున నరకబడుచుండుటచే వడ్రంగి, 11. పవిత్రమగు తిలధాన్యములను భేదించుటచే తిలఘాతకుడు, 12.జంతుహింసకుడగుటచే కటికవాడు, 13. పవిత్రమగు మట్టినిగాల్చువాడగుటచే కుమ్మరి, 14. అపవిత్రమగు కల్లును విక్రయించువాడగుటచే నీడిగ, 15. ఖండించువాడగుటచే మంగలి, 16. లోహములగాల్చువాడగుటచే కమ్మరి. ఈ పదునారుగురు ఛండాలత్వము నొంది, గ్రామచండాలురుగా హేమాద్రియే తన చాతుర్వర్ణ చింతామణిలో నుడివియున్నాడు…. కానీ యాపస్థంభుడు నుడివిన ఛండాలుడు పై షోడశవిధ చండాలురలోనివాడు కాడని తలంతురు. పై షోడశవిధ చండాలురేదర్శన స్పర్శనాదులయందు నిషిద్దులైనచో మనద్విజులనబడువారు పృథ్విని వదిలి ఆకాశాన నిల్లు గట్టుకొనవలసియుందురు. చండాల శబ్దము దూషణక్రింద నుపయోగించుపదము కాని ప్రత్యేక జాతివాచకముగాదు.’

23) Report of the Temple Entry Enquiry Committee-p24, Pollution-distance is to be calculated by means of the Yuga measure. A Yuga is equal to six feet only until we reach the Chandalas, Chandalas are of three kinds, Mukhya , Madhyama and Heena (high, middle and low). In their case, the Yuga is equivalent to six feet, nine feet, and twelve feet, respectively. Mrigayus (hill tribes), Pulkasas and Svapachas are heenas ; Soundikas and Takshas are mukhyas ; and the remaining Chandalas are madhyamas.

24) A.M. Hocart-1950,2018-Caste-A Comparative Study-p5      ‘In addition to the four castes Buddhist writings occassionally mention a fifth which is in one place called “low one,” as opposed to the exalted one of the kings and priests. This low caste is composed of five divisions: Candala, bamboo-workers, hunters, chariot-makers, scavengers.’

25) Vasudeva Upadhyay-1964-The Socio Religious Condition Of North India-p90-91 & స్వామి శివశంకరశాస్త్రి(అను)-1963-జాతక కథలు-తృతీయ సంపుటి-p 197-198 & స్వామి శివశంకరశాస్త్రి (అను)–1970-జాతక కథలు చతుర్థ సంపుటి-p 285

26) Vivekananda Jha-2018,2022-Candala (Untouchability and caste in Early India)-p18,67 & The Doms and Their Near Relations-George Weston Briggs-1953-p8-12,17,20 ‘…the Sutrakrtanga Sutra mentions the art of the Candals among the evil occult sciences which include, among others, the art of making on miserable, immobile or sick, lose wits, fall asleep, fall down, and a woman pregnant and the practioners of which were to be reborn among the Asuras and evil-doers; their aboriginal background is suggested by a reference to the Sabaras, the Dravidas, the Kalingas, the Gaudas, and the Gandharasa also here.’ ‘In fact the Pali Canon and the Jatakas corroborates and supplement the information from the Brahmanical sources……..We see him contaminating atmosphere, polluting through sight and from a distance. … The Buddha is himself declared to have been quite categorical on this point.’, Edward Balfour-1885-The Cyclopaedia of India and of Eastern and Southern Asia, Commercial Industrial, and Scientific Products of the Mineral, Vegetable, and Animal Kingdoms, Useful Arts and Manufactures · Vol 1-p602          If a Jain come into contact with an outcaste, he, like the Hindu, touches fire or water to purify himself ; if he have occasion to receive anything from a Pariah, he causes the Pariah to set it down on the ground, and purifies it with fire or water before he takes it up.

27) ‘అస్పృశ్యత- ఆంధ్రపత్రిక-1925అక్టోబరు26వతేదీ-సోమవారము, ‘”నాస్తితు పంచమః” అను వాక్యము అయిదవ కులము లేదని నిరూపించుచున్నది. ఈ సంగతిని కావ్యకంఠ గణపతిశాస్త్రులవారు తమయధ్యక్ష్యప్రసంగమునందు చక్కగ నిరూపించిరి. ఈ అయిదవ కులమును ప్రత్యేకించుటవలన, క్రైస్తవమిషనరీలును, మహమ్మదీయ ప్రచారకులును హిందూ సంఘమునందలి యధికసంఖ్యాకులను తమతమ మతములలో కలుపుకొనుట తటస్థించుచున్నది. హిందూమతమును వీడిఅన్యమతమును స్వీకరించిన పంచములను, దగ్గరజేర్చుకొనుటకు హిందువులకెట్టియాక్షేపణగనుపించుటలేదు.’

28) Louis Dumont-Translated by Mark Sainsbury, Louis Dumont, Basia Gulati-1999-Homo Hierarchicus-The Caste System and its Implications- p 47     ‘The term ‘Untouchable’ to designate the category is English rather than indigenous: the notion is present, but in common usage, these people are designated by the name of the particular caste to which they belong. Euphemisms are usually resorted to when the category is designated, the most recent, introduced by Gandhi, being ‘Harijan’, ‘Sons of Hari’, that is, Creatures of God (Vishnu).’

29) Ibid-Alexander Dow-1768-p xxxi “The first, and most noble tribe, are the Brāhmins, who alone can officiate in the priesthood like the Levites among the Jews.

30) మానికొండ సత్యనారాయణ శాస్త్రి-1945-భూమి – రైతు – రాజు-p -28-30 & A.V. Raman Rao-1958-Economic Development Of Andhra Pradesh 1766-1957-p14, ‘The majority of lands in the Circars were either haveli or zamindari. Most of the zamindars were either Brahmins, Kshatriyas, Velamas or Kammas. But the question of their basic right to the land was an unsolved riddle to the Circuit Committee, which often wrongly identified them with the feudal barons of Europe. This misled the Company to claim a considerable part of the harvest, ignoring the rights of the ryots.’ ‘భూమిహక్కు ఎవరిది? అనే సమస్యలో ఇండియా సాంప్రదాయములకున్ను, ఇంగ్లండు సాంప్రదాయాలకున్నూ తల్లకిందులైన తేడాయున్నది. ఇంగ్లండులో భూమియావత్తు రాజుదే; ప్రజలందరు రాజు క్రింద కౌలుదార్లో, లేక పాలేళ్లో. ఇండియాను పరిపాలింపవచ్చిన మొదటి రోజులలో ఆ నాటికంపెనీనౌకర్లకు ఇక్కడ ఇండియాలోని భూమి పద్దతు లేమియో తెలియక తికమకపడిరి. తమ ఇంగ్లీషు సాంప్రదాయములను తీసికొనివచ్చి ఇక్కడ ప్రవేశపెట్టజూచిరి. ఒకప్పుడొక అభిప్రాయమున్ను, మరొకప్పుడు మరొక అభిప్రాయమున్ను పరిపాలకులు, రివిన్యూబోర్డులవారు, వివరించుచూ, భూమివ్యవహారముల నన్నిటిని ఇండియాలో నానా తీన్ తేరా చేసివైచిరి, ఏమీ తెలియని తెల్లవారు వచ్చి, పెద్ద పండితులవలె చర్చలు, వాదోపవారములు చేసి, గవర్నమెంటు రికార్డుల నన్నిటిని నింపిరి, ఆ రికార్డులన్నిటితో మనము ఇప్పుడు, తల బద్దలుకొట్టుకొనుట ఇచ్చట అనవనరం..’

31) Francis Buchanan-1807-A Journey from Madras through the countries of Mysore, Canara, and Malabar-Vol1-p19,236 ‘Much of the land is rented by them; but, like the Jews, they seldom put their hand to actual labour, and bn no account will they hold the plough. Their farms they chiefly cultivate by slaves of the inferior casts, called Sudra, and Panchum Bundum.          The Panchum Bundum are by far the most hardy and laborious people of the country, but the greater part of them are slaves. So sensible of their value was Hyder, that in his incursions it was these chiefly, whom he endeavoured to carry away. He settled them in many districts as farmers, and would not suffer them to be called by their proper name, which is considered opprobrious; but ordered, that they should be called cultivators. The Panchum Bundum consist of four tribes; the Parriar, the Baluan, the Shecliar, and the Toti. The Shecliars dress hides; and from among the Toti is chosen a particular class of village officers.’; ‘The Pancham Banijigaru are also the heads of the right hand side. They admit of no distinction of cast among themselves, except that arising from a dedication to the service of God; but they do not admit of any proselytes from other Hindu races; nor do they intermarry with any of the lower casts that wear the Linga. The Brahmans allege, that they are Sudras; but this, in general, they earnestly deny. The manner in which the Brahmans reason with them is this: You are, say they, neither Brahman, Kshatri, nor Vaisya.”

32) శేషాచలకవి-1846-నీలగిరియాత్ర-p21 & footnote …….దినాంతానంతర ప్రయాణంబుల నాయాగ్రామంబుల నుండి నిశాంతపర్యంతంబు బారిక వాండ్రేయనియు దుడుమువాండ్రేనియు గొరకచ్చు కర్రల రగిలించుకొని యనుగమించుచుండెదరు…….. (వీరు తలారియనియుం దోటియనియు నరవంబున జెప్పబడుదురు. ఇయ్యిరువురు నూరూరం గలిగియున్నవారు. వీరు మేర మిరాసీల వలన జీవించువారు.)

33) H. H. Wilson-1855-A Glossary of Judicial and Revenue Terms and of useful words occurring in Official documents relating to the Administration of the Government of British India-p395 ‘Panchama, S. &c. (पञ्चम) Fifth. Panchami, (fern, of पञ्चम) The fifth lunar day of each half month.’ ‘Panchaman, Tarn. (பஞ்சமன்) An outcaste, a Pareya, a fifth caste man, not being included among the four regular castes.’ ‘Pancham-bandham, (?) Karn. Outcaste and servile tribes in Karnata, four of whom are named, as, the Pareya, Balman, Chaklar, and Toti, and who are the agrestic slaves of Brahman cultivators. -Buchanan.’ ‘Panchama-banajiga, Karn. (ಪಂಚಮ ಬಣಜಿಗ) An Out caste, a man of the fifth order : it denotes also the Pancham-banijigaru, of Buchanan, traders and religious persons of the Lingait sect, and the heads of the right-hand castes in Mysore’

34) శ్రీ రావినూతల రాధాకృష్ణయ్య- 1987-శ్వేతాశ్వతర ఉపనిషత్తు-p 129

35) Rev Robert Caldwell-1856-A Comparative Grammar of the Dravidian or South-Indian Family of Languages-p492-493 & కా మృత్యుంజయ వర్మ-పంచములు-అస్పృశ్యులా?స్పృశ్యులా-ఆంధ్రజ్యోతి- 1922 డిసెంబరు 14వతేదీ-గురువారము, ‘Europeans were generally led to suppose, on their arrival in India several generations ago, that the Pariars were either the illegitimate offspring of adulterous intercourse, or were persons who had been excluded from caste for their crimes. This notion was invented and propagated by the Brahraans and the higher castes, and originated, in part, in their wish to justify their exclusive, unsocial behaviour towards the Pariars, on principles which they supposed that Europeans would approve. In part, also it originated in error arising from the uncritical habit of the Hindu mind;…..’, ‘శూద్రుడుగాక అనంతము చండాలశబ్దపర్యంతము ముందుచెప్పెడి అంబష్టకరణాదిజాతులు సంకీర్ణములనబడును. సంకీర్ణములనగా-విజాతీయ మాతాపితృ సంబంధమువలన గలిగిన వేర్వేరుజాతులు సంకీర్ణజాతులనబడును.’

36) W.R. Cornish-On the Census of the Madras Presidency 1871-p168    ‘We now come to that great division of the people, spoken of by themselves as the “ fifth caste,” and described by Buchanan and other writers as the Pancham Bandam. There is no part of the country in which these out-caste races are not to be found under various designations.’

37) Edward Balfour-2nd ed-1873-Cyclopaedia of India and of Eastern and Southern Asia-Vol4-p354

Exit mobile version