Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి-3

[‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపరని అందిస్తున్నారు శ్రీ మైలవరపు సుధా మోహన్.]

పంచములు-‘బహిష్కృతులు’/‘వెలివేయబడిన’ వారు కారు:

ఊరిబయట ఉండటమే ఆయా కులాల వర్గీకరణకు ప్రాతిపదిక అయితే, భారతీయసమాజంలో కొన్ని జాతులు ఊరివెలుపల ఉండటానికి గల కారణాలు రక్షణావ్యవస్థతో కూడా ముడిపడి ఉన్నాయి. దీనికి మూలాలు కౌటిల్యుని అర్థశాస్త్రంలో కనిపిస్తాయి. వాటి ఆధారంగా చూస్తే మన సమాజం బ్రిటిష్ వారి వర్ణనకు భిన్నంగా కనిపిస్తుంది, కానీ హిందూ శాస్త్రాలను లోతుగా పరిశోధించకుండా, బైబిల్ పాతనిబంధన ఆధారంగా క్రైస్తవ సమాజానికి చెందిన ‘బహిష్కృత’/‘వెలివేయబడటం’ (out-caste, excommunication) అనే ప్రక్రియను హిందూ సమాజంపై ఆరోపించి ఆ విధంగా విశ్లేషించడం వలన కొన్ని కులాలు ఊరిబయట ఉండటానికి గల వాస్తవ కారణాలు నేటికీ మరుగునే ఉన్నాయి.

బైబిల్ మూలం కలిగిన out-caste, excommunication వంటి పదాలు 16-19 వ శతాబ్దాలలో మిషనరీల ద్వారా ప్రాచుర్యంలోకి తేబడ్డాయని పరిశోధకులు రుజువుచేశారు. పదిహేడవ శతాబ్దపు యూరోపియన్ రచనలను పరిశీలిస్తే, వారు భారతీయ ప్రజలను అర్థం చేసుకోవడానికి యూదుల జాతిని (దేవుని ఆరాధన ద్వారా ఏకమై ఉన్న తెగల సమూహం) ప్రాతిపదికగా తీసుకుని, పాత నిబంధన (Old Testament) లోని తెగలు, వంశాలు వంటి భావనలను భారతదేశానికి అన్వయించారని స్పష్టంగా తెలుస్తుంది. ఇంతేకాక, ముందు గమనించిన విధంగా వివిధ పాశ్చాత్యులు, వారి మిషనరీలు బ్రాహ్మణులను నేరుగా యూదులతో పోల్చారు. యూదుల వ్యవస్థలు, ఆచారాలు, హిందూ సమాజంతో, ముఖ్యంగా బ్రాహ్మణులను పోలి ఉన్నాయన్నట్లుగా వర్ణించారు.

ఐరోపా పర్యాటకులు భారతదేశాన్ని నాలుగు తెగలుగా విభజించబడిన అన్యమత దేశంగా చూశారు. వారు యూదు జాతిని (Tribes of Israel) నమూనాగా తీసుకుని భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. అబ్రహం రోజర్ (1609-1649) బ్రాహ్మణ ఆచారాలు యూదుల ‘లేవీయుల’ ఆచారాలను పోలి ఉన్నాయని భావించి, ఆ విధంగా తన గ్రంథంలో వర్ణించాడు. యూదుల లాగానే హిందువులకు కూడా ‘మనువు’ లేదా ‘బ్రహ్మ’ వంటి ప్రాచీన ధర్మకర్తలు ఉన్నారని భావించారు. భారత సమాజంలో వారు గమనించిన జాతుల మధ్య పరస్పరం ఉన్న అశ్పృశ్యత (untouchability) వంటి ఆచారాలను కూడా యూదుల మతంతో, వారిలోని కులబహిష్కరణ (excommunication) తో ముడిపెట్టారు. ఆ వివరాల ద్వారానే అర్థం చేసుకున్నారు. ఆ కారణం వల్లనే, పదహారవ శతాబ్దపు ఫ్రెంచ్ రచయిత డీ లా క్రెకినియర్ (De la Crequinière) భారతీయులు కూడా యూదుల మాదిరిగానే నిచ్చెనమెట్లతో కూడిన (hierarchically) సమాజంగా ఏర్పాటై ఉన్నారని భావించాడు.

అదేవిధంగా, బ్రాహ్మణులు కూడా లేవీయుల మాదిరిగానే శుద్ధతపై (purity) ప్రత్యేక శ్రద్ధ చూపించారని, శుద్ధతకు సంబంధించిన నియమాలు, అపవిత్రత పరిహారం కోసం ఆచారాలు కూడా వారికి ఉన్నాయని భారతదేశంలో పర్యటించిన యూరోపియన్ పర్యాటకులు వ్రాసారు. ముఖ్యంగా పరియా (Pariahs) లను కూడా వారు యూదుల మత నమూనాతోనే అర్థం చేసుకున్నారు. దీంతో కుల నియమాలను ఉల్లంఘించినందుకు హిందూ సమాజం నుండి బహిష్కరించబడినవారిగా పరియాలను చూశారు. యూదులలో మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వారిని మతసమాజం నుంచి వెలివేసిన విధానానికి ఇది సమానమని వారు అనుకున్నారు (38).

భారత సంస్కృతిని, సమాజాన్ని అర్థం (అపార్థం!) చేసుకోడానికి పాశ్చాత్య యాత్రీకులు, మిషనరీలు బైబిల్ చట్రాలను ఉపయోగించారని చెప్పడంతో మాత్రమే పాశ్చాత్య పరిశోధకులు ఆగిపోలేదు. ఇతరదేశాలలోని వైవిధ్యాన్ని, భారతదేశం వంటి ఇతరదేశాలను అర్థం చేసుకోడానికి యూరోపియన్ పండితులు, మిషనరీలు పాత నిబంధనలోని కాలక్రమం, బైబిల్ జాతిశాస్త్రాన్ని ఉపయోగించారని అనేక ఆధారాలతో సహా ఋజువుచేశారు. ఇంతేకాదు నేటికీ కుల వ్యవస్థపై చేయబడుతున్న వర్ణనల, వ్యాఖ్యానాల, విశ్లేషణల పునాదులలో కూడా పాతనిబంధనలోని అంశాలే ఉన్న విషయాన్ని జాకోబ్ డె రూవర్ (Jakob De Roover) తన పరిశోధనాత్మక వ్యాసంలో సహేతుకంగా విశ్లేషించాడు (39).  పాశ్చాత్య భాషాశాస్త్రపు బైబిల్ పునాదులను కూడా థామస్ ట్రౌట్ మాన్ ‘Languges and Nations’ అనే గ్రంథంలో సహేతుకంగా వివరించాడు.

మిషనరీలు/బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని జాతులపై వేసిన ‘బహిష్కృత’/‘వెలివేయబడిన’ వర్గాలు అనే ముద్రను వలసకాలపు గ్రంథాలే తప్పుబట్టాయి. ఉదాహరణకు, 1886 లో ప్రచురించబడిన హాబ్సన్-జాబ్సన్ అనే పాశ్చాత్య నిఘంటువు ‘బహిష్కృత’/‘వెలివేయబడ్డ’ అనే సంబోధన అసత్యమని పేర్కొన్నది. ఆ గ్రంథం ఇలా వివరించింది. “ఇతరులకన్నా ఎక్కువగా యూరోపియన్ల దృష్టిలోకి పరియాలు వచ్చారు. దాని ఫలితంగా “పరియా” అనే పేరు, క్రమంగా అతి తక్కువ కులాలన్నింటికీ వర్తించే సాధారణ పదంగా, లేదా కులవ్యవస్థకు వెలుపల ఉన్నవారు (బహిష్కృతులు), వెలివేయబడినవారు (out-castes) అనే అర్థంలో కూడా ఉపయోగించబడడం ప్రారంభమైంది. కానీ ఇది నిజానికి సరైన ప్రయోగం కాదు. తమిళ దేశంలో పరియాల కంటే కూడా తక్కువగా పరిగణించబడే అనేక కులాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పులు తయారీ చేసే కులం, అలాగే అత్యల్ప స్థాయిగా పరిగణించబడే దోబీ (వాషర్‌మెన్) కులం. ఈ కులాల పట్ల, పరియాలు కూడా, పై కులాలవారు తమపట్ల చూపే తక్కువచూపునే ప్రదర్శిస్తారు.” (40).

అంబేద్కర్ గారు కూడా వారు ‘బహిష్కృత’/‘వెలివేయబడిన’వారు’ అన్న అభిప్రాయాన్ని పూర్తిగా అంగీకరించలేదు. ఒకచోట ఇలా పేర్కొన్నారు.. “అస్పృశ్యులుగా ముద్రవేసి, గ్రామంలో నుండి, గ్రామం వెలుపలకు బహిష్కరించబడినవారు మాత్రం కాదు. గ్రామాల్లో స్థిరపడిన తెగకు చెందినవారు కాక, వేరే తెగలకు చెందినవారు కావడం చేతనే వీరు గ్రామాల వెలుపల నివసించారు.” (41).

ఈ వివరాలు రెండు అంశాలను స్పష్టం చేస్తాయి. పరియా అనే జాతి ‘బహిష్కృత’/‘వెలివేయబడిన’ (outcaste) జాతి కాదు, అలాగే పరియాజాతి కులవ్యవస్థకు వెలుపల లేదు. ఎందుకంటే ఆ పరియాజాతికి ఉపకులాలు, ఆశ్రితకులాలు, వారికి కింద కులాలు ఉన్నాయి. కానీ వాస్తవం ఇలా ఉండగా బ్రిటిష్ అధికారిక రిపోర్టులలో మాత్రం ఈ ‘వెలివేసే’ ధోరణే కొనసాగింది.

1871 నాటికి కూడా ఈ జాతుల గురించిన పూర్తి వాస్తవాలు బ్రిటిష్ వారి వద్దలేవని వారే స్వయంగా పేర్కొన్నారు. ఒకచోట J.S.F.మెకంజీ ఇలా వ్రాశాడు, “ప్రతి గ్రామంలో హోలీగిరి అనే ప్రాంతం గ్రామం బయటఉంటుంది. ఇందులో హోలియర్ కులం వారు నివసిస్తారు. ఇలా బయట ఉండటానికి కారణం వారు శుభ్రత పాటించకపోవడం, వారి స్పర్శ అశౌచాన్ని కలిగించడం వలన కావొచ్చని ‘నేను అనుకున్నాను’. బ్రాహ్మణులు సాధారణంగా ఇలాంటి అభిప్రాయాన్నే ‘వ్యక్తపరుస్తార’”ని వ్రాశాడు (42).  1871 మద్రాసు టౌన్ సెన్సస్ లో పరియాల గురించి హిందువులకు కూడా ఏమీ తెలియదని చెబుతూనే ‘outcaste’ అనే వర్గీకరణను కొనసాగిస్తున్నామని పేర్కొన్నది (43).  ఈ వివరాలు అప్పటికి ఆయా కులాలు ఊరిబయట ఎందుకున్నారో బ్రిటిష్ వారికి, అక్కడివారికి కూడా తెలియదన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయి.

ఇలా తెలియకపోవడానికి ఈ కింది కొన్ని ముఖ్యకారణాలు దోహదపడి ఉండవచ్చు. 1. అప్పటికే న్యాయశాఖలో బ్రాహ్మణులు తొలగించబడటం వలన పరంపర్యంగా కొనసాగిన జ్ఞానం లుప్తమై ఉండవచ్చు. 2. గ్రామాల స్థాయిలో అనేక వృత్తులు తొలగించబడి అప్పటికే అనేక దశాబ్దాలు దాటడం వలన కూడా ఆ విషయాలు తెలిసినవారు కొద్ది మందే మిగిలి ఉండవచ్చు. 3. అర్థశాస్త్రం గురించిన అవగాహన ఎక్కువమందిలో లేకపోవడం. 4. ఇస్లామిక్ పాలనలో అనేక గ్రంథాలయాలు, గ్రంథాలు, జ్ఞానోత్పత్తి వ్యవస్థలు విధ్వంసం గావించడబడటం. 5. మన్రో రిపోర్టు (1823) నాటికే దక్షిణాదిలో విద్యావ్యవస్థ పతనం వైపుకు కదులుతూ ఉండటం. 6. దక్షిణాదిలో ఏర్పడిన అంటురోగాలవలన, కరువులవలన (44)  పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోవడం (45),  ఇలాంటి కారణాల వలన జ్ఞాన ప్రవాహం ఆగిపోయి ఉండవచ్చు. 7. మెకెంజీ వంటి పాశ్చాత్యులు సరైన వారిని కాకుండా తెలియని వారిని అడిగి ఉండవచ్చు.

అయితే ఈ చర్చలో మరొక విరుద్ధమైన విషయం బ్రిటిష్ సెన్సస్లో కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాలలో వ్యక్తులు ఆయా జాతుల నుండీ బహిష్కరించబడి/వెలివేయబడి ఉండవచ్చు. కానీ అలా బహిష్కరించబడినవారు, పరియాలు ఒకే జాతికి చెందినవారా కారా అన్నది అసలు ప్రశ్న. ఎందుకంటే 1881 మద్రాసు సెన్సస్ లో వివిధ జాతుల నుండీ వెలివేయబడిన వారు ఇతరజాతులతో కాక ప్రత్యేకంగా పేర్కొనబడ్డారు. ఈ సెన్సస్ లోని వివరాలు వెలివేయబడిన వారు-పరియాలు ఒక్కరే కాదని, వీరు రెండు వేరు వేరు వర్గాలని సూచిస్తున్నాయి (46).

మరొక ముఖ్యభేదం, హిందూ ధర్మశాస్త్రాలలో, సమాజంలో పతితులు ఉన్నారు కానీ పాశ్చాత్యుల వర్ణనలోని ‘కుల వ్యవస్థకు వెలుపలి బహిష్కృతులు’ లేరు. పలు ధర్మశాస్త్రాలు చండాలురు-పతితుల మధ్య స్పష్టమైన భేదాన్ని చూపాయి (47).  (యమస్మృతి 2వ శ్లోకం, గౌతమస్మృతి 14,15 అధ్యాయాలు) వివిధ నేరాల వలన కులాల నుండీ వెలివేయబడిన ‘పతితులు’ అతి స్వల్ప సంఖ్యలో ఉండేవారు. ఆయా జాతులు పేర్కొన్న ప్రాయశ్చిత్తాలను చేసుకుంటే వారిని తిరిగి జాతిలో కలుపుకునేవారు.

ఏ జాతులను బ్రిటిష్ వారు చండాలురుగా, బహిష్కృత/వెలివేయబడినవారిగా వర్ణించారో, ఆ జాతులలో కూడా వెలివేయబడే ప్రక్రియ ఉండేదని బ్రిటిష్ రిపోర్టులే సూచిస్తున్నాయి (48).  దీని అర్థం ఏమిటంటే ఊరిబయట ఉన్నవారు ‘బహిష్కృత’/‘వెలివేయబడిన’వారు కారు, వీరికి ఒక నిర్దుష్టమైన కులం, ఆచారం, కట్టుబాట్లు ఉన్నాయి. ఈ కులాలలో కూడా బహిష్కరణ అనే పద్దతి ఉంది. సమాజంలో వారికి వృత్తులు ఉండేవి. వారికి ప్రత్యేక నీటి వసతులు ఉండేవి. ఈనాము భూములు ఉండేవి. ఒకవేళ ఈ జాతులు ‘బహిష్కృత’/ ‘వెలివేయబడిన’వారేనని వాదించే పక్షంలో, ఆ జాతుల నుండీ బహిష్కృతులు/వెలివేయబడిన వారెవారు, వారెక్కడ నివసించారు? వారి జాతి ఏమిటి? వారు పంచములా లేక షష్టులా లేక సప్తములా? వంటి ప్రశ్నలకు సమాధానమివ్వవలసి ఉంటుంది.

19 వ శతాబ్దంలో పలువురు పాశ్చాత్యులు అప్పటి సమాజంలో గమనించిన ఈ క్రింది అంశాలను పరిగణించడం ఈ చర్చకు అవసరం,

..”మరియమ్మ, ఎగట్టాళ్ వంటి గ్రామదేవతల పండుగలు సాధారణంగా ఒక వారంపాటు లేదా పదహారురోజుల పాటు సాగుతాయి. ఈ మొత్తం కాలంలో ఒక పరియానే అమ్మవారికి వరుడుగా అంగీకరించబడుతాడు. అతను వరుడి వస్త్రాలను ధరిస్తాడు, వరుడి భోజనం కూడా ఏర్పాటు చేయబడుతుంది. చివరి రోజున ప్రజలు నీటితో నిండిన కుండలను మోసుకుంటూ, దేవత విగ్రహాన్ని గ్రామ వీధుల చుట్టూ ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆ సమయంలో అమ్మవారికి వరుడుగా భావించబడిన పరియా గౌరవార్థం డప్పులు మోగిస్తారు”..

“ఈనాటికీ మద్రాసు బ్లాక్ టౌన్ సంరక్షక దేవత అయిన ఎగట్టాళ్ అమ్మవారి (కాళికాదేవి) మెడలో పరియానే తాళిని కడతాడు.”

“మైసూరులో ప్రాంతంలో కూడా హోలియర్ గ్రామ దేవతకు పూజారిగా ఉంటాడు; అలాగే గ్రామ సమాజానికి చెందిన కులవాది లేదా పరియా గ్రామ పెద్దనే గ్రామానికి నిజమైన యజమానిగా పరిగణిస్తారు.”

“మెల్కోటైలో హోలియలు రథాన్ని లాగుతారు; రథానికి దగ్గరవడంపై వారికి ఎటువంటి నిషేధం ఉండదు. కాంచీపురం, కుంభకోణం, శ్రీవిల్లిపుత్తూర్ తదితర ప్రాంతాల్లోనూ వారు రథాల తాళ్లను లాగుతారు. నిజానికి పెద్ద దేవాలయాలు ఉన్న అన్ని చోట్లా వారు ఇదే విధంగా వ్యవహరిస్తారు.” (49)

ఈ ఆచారాలేమీ గాల్లోనుండి ఊడిపడలేదు, వీటికి కొన్ని నిర్దుష్టమైన కారణాలు ఉండబట్టే పరియా అమ్మవారికి తాళికట్టడమనే ఆచారం కొనసాగింది. మరి పరియా బహిష్కృతుడు/వెలివేయబడిన వ్యక్తి అయితే ఇవన్నీ ఎలా చేయగలిగాడు?

J.S.F.మెకెంజీ తన వ్యాసంలో హోలీయార్ అనే కులాన్ని సరిహద్దు కాపలాదారులుగా వర్ణించాడు. ఆ వ్యక్తి బహిష్కృత/వెలివేయబడిన కులానికి చెంది ఉంటే, కాపలాకాసే వృత్తిని ఎలా చేయగలిగాడు. పైగా పరియా, హోలియా వంటి వారు సరిహద్దు తగవుల్లో తీర్పు చెప్పేవారు. ఆ తగవుల్లో అతను ఇచ్చిన తీర్పే శాసనమని పలు పాశ్చాత్య గ్రంథాలలో ఉంది! (50).

సమాజంపై పరియా ప్రభావం ఉన్నప్పుడు, ఆ సమాజంలో అతను కొన్ని కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు అతనిని ‘బహిష్కృతుడు’/‘వెలివేయబడిన’ వాడు అని ఎలా అంటారు? గ్రామ సమాజంలో పరియాల పాత్రకు చెందిన ఇంకా చాలా వివరాలు లభిస్తాయి. సమాజంలో వారి కీలకపాత్రను, గ్రామసమాజంతో వారికి గల సంబంధాలను విస్మరించి పరియా ‘బహిష్కృతుడు’/‘వెలివేయబడిన’వారు అని చెప్పడం వారి పాత్రను వక్రీకరించడం కాదా?

ఈ చర్చలో మనం విస్మరించే ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఇస్లామిక్, బ్రిటిష్ పాలనా విధానాలు, భూమి చట్టాలు, ఫ్యూడల్ విధానాలు ‘కులవాది’గా ముద్రించబడిన హోలీయార్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపాయి? పూజాపరమైన అతని స్థాయిపై ఇది ఎలాంటి ముద్రవేసిందనే ముఖ్యమైన ప్రశ్నలకు నేటికీ ఎవరివద్దా సరైన సమాధానం లేదు! ఇలా లేకపోవడానికి కారణం వారు అర్థశాస్త్రం వంటి హిందూ శాస్త్రాలను వదిలి బైబిల్ చట్రాలను, మిషనరీ విజ్ఞానాన్ని, బ్రిటిష్ దృష్టికోణాన్ని ఉపయోగించడంతో బాటుగా, బ్రిటిష్ వారు చేసిన గ్రామ ఆర్ధిక వ్యవస్థ విధ్వంసం, పరియాలపై దాని ప్రభావం గురించిన లోతైన పరిశోధన నేటికీ జరుపకపోవడమే!

పంచములు-అంత్యజులు:

పంచములను కొన్ని గ్రంథాలలో ‘అంత్యజులు’గా కూడా వర్ణించడం కనబడుతుంది. అంత్యజుడు అంటే బహిష్కృత/వెలివేయబడినవాడా (Outcaste)? వారికి గ్రామస్థులతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు. కానీ పూర్వపు పరిస్థితులు అలా లేవు. అంత్యజుడు ఊరిబయట ఉండాలి అని చెప్పిన గ్రంథాలు, ఎందుకు బయట ఉండాలో చెప్పలేదా? ఒకవేళ అవి చెప్పినా మనం ఆ విషయాన్ని విస్మరిస్తున్నామా? బ్రిటిష్ పాలనా కాలంలో మిషనరీల వర్ణనల ఆధారంగానే హిందూ సమాజం వర్గీకరించబడ్డది. ఈ అంశంలో హిందూ శాస్త్రాలలో రంధ్రాన్వేషణ చేయడానికి ఆ శాస్త్రగ్రంథాలను జల్లెడ పట్టిన వారు, మరి ఆ మిషనరీలు చెబుతున్న విషయాలు సరైనవా కావా అని నేటికీ లోతుగా పరిశీలించి, పరిశోధించక పోవడమే విడ్డూరం. ఆ పనిని హిందువులు, హిందూత్వవాదులు కూడా చేయకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది!

అంబేద్కర్ గారు, అంత్యజులు అనే పదానికి హిందూ ధర్మశాస్త్రాలలో సరైన అర్థం వివరించబడలేదని చెబుతూ ఇలా వ్రాసారు, ..”తరువాతి ప్రశ్న ఏమిటంటే అంత్యులు, అంత్యజులు, అంత్యవాసులు, బాహ్యులు అనే పదాలలో పిలువబడిన వర్గాలు; అంటరానివారుగా అర్థం వచ్చే అస్పృశ్యులు అనే వర్గం వారు ఒక్కరేనా అనేది. క్లుప్తంగా చెప్పాలంటే ఇవన్నీ ఒకే వర్గం ప్రజలకు పెట్టిన వివిధ రకాలైన పేర్లా? దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ధర్మసూత్రాలలో తగిన ఆధారాలు లేవు. అస్పృశ్య అనే పదం రెండు చోట్ల (సూత్రాలలో ఒకచోట, స్మృతులలో 2 చోట్ల) మనకు కనిపిస్తుంది. అయితే ఈ వర్గాల క్రింద వచ్చే ప్రజలు ఎవరో వివరించలేదు..

“ఇంతవరకూ మనం పరిశీలించిన అంశాల సారాంశం క్లుప్తంగా చెప్పాలంటే -అస్పృశ్యుల తరగతిలోకి వచ్చేవర్గాలు ఏమిటో నిర్ధారించుకోడానికి ధర్మసూత్రాలు గాని, స్మృతులు గాని ఉపయోగపడటం లేదు; అంత్యవాసులు, అంత్యజులు, బాహ్యులు అని పిలువబడ్డవర్గాలు అస్పృశ్యులేనా అనే విషయం నిర్ధారించుకోడానికి ధర్మసూత్రాలు, స్మృతుల వల్ల ప్రయోజనం శూన్యం. ఈ వర్గాల వారు అస్పృశ్య లేదా అంటరానివారు అనే తరగతి కిందకే వస్తారా? లేదా అనే విషయం నిర్ధారించుకోడానికి వేరేమార్గం ఏదైనా ఉందా?”

..”మన పరిశీలన ఇక్కడితో నిలిపివేసి అంత్యవాసులు, అంత్యులు, అంత్యజులు అని పిలువబడిన ప్రజల సామాజిక స్థితిగతులను గూర్చి ప్రాచీన వాఙ్మయంలో మనకు లభించిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్న విషయాలు పరిశీలిస్తే, ఆధునిక కాలంలో మనం అస్పృశ్యులుగా పరిగణిస్తున్న వర్గానికే వీరు చెందుతారు అని నిర్ధారించేందుకు అవకాశాలు లేవు” (51)  అని వ్రాసారు.

కానీ ఆయన అక్కడితో ఆగలేదు, ఆ పదాలకు కొన్ని అర్థాలను ఆయనే స్వయంగా ప్రతిపాదించారు. ముఖ్యవిషయమేమిటంటే ఈ అర్థాలకు ఆధారం ఆయన ఊహలే! ఆ విషయం ఈ వాక్యాలలో స్పష్టంగా చెప్పబడింది.

“నాదృష్టిలో అంత్య అనేది సృష్టికి అంతమని కాదు గ్రామానికి చివరన అని ఆమాటకు అర్థం, గ్రామానికి పొలిమేరన నివసించే ప్రజలకు పెట్టిన పేరది. అంత్య అనే పదం మనుగడకు సంబంధించింది. ఒకప్పుడు గ్రామాల్లో కొందరు ప్రజలు గ్రామంలోపల, మరికొందరు గ్రామం వెలువల నివసించేవారని ఆ పదం చెబుతుంది. గ్రామం చివర (అంతలో) నివసించే వారిని అంత్యజ అంటారని కూడ తెలుపుతుంది.” (52).

ఊరిబయట ఉండేవారు, ఊర్లో ఉండేవారు వేరువేరు జాతులకు చెందినవారని నిర్ధారించడానికి రిస్లీ మొదలైన వారు ఉపయోగించిన పాశ్చాత్య చారిత్రిక భాషాశాస్త్రంపై (Historical Linguistics) అంబేద్కర్ గారు కూడా ఆధారపడ్డారు. పాశ్చాత్య చారిత్రిక భాషాశాస్త్రం, భాష ఆధారంగా జాతిని, ఆ భాషలలోని పదాల ఆధారంగా వివిధ జాతుల పరిణామాలని, వాటి చరిత్రను ఊహిస్తుంది. విమర్శకుల అభిప్రాయంలో ఈ శాస్త్రం మోకాలికీ, బోడిగుండుకూ ముడిపెట్టే ప్రక్రియే తప్ప, ఇది చెప్పే విషయాలకు వాస్తవాలు ఆమడదూరంలో ఉంటాయి. సూటిగా చెప్పాలంటే ఈ శాస్త్రం పాశ్చాత్యులు తమ సామ్రాజ్యవాదాన్ని స్థిరపరుచుకోడానికి ఉపయోగించిన ఒక ఆయుధం.

పై విధంగా అంత్యజ, అంతేవాసి అనే పదాలకు `ఊరిబయట ఉండేవారనే’ కొత్త అర్థాన్ని అంబేద్కర్ గారు ప్రతిపాదించారు. గ్రామం బయట ఉండేవారిని `అంత్యజ’ అని పిలుస్తారని సూచించే వివరాలు ఆయన రచనలలో కనిపిస్తాయి. అంత్య, అంత్యజ, అంతేవాసి అనే పదాలన్నీ ఒకే అర్ధాన్ని సూచించేవిగా ఆయన వర్ణించారు (53).  ఈ వివరణలో కూడా అంబేద్కర్ గారు అంత్యజ అనే పదానికి అర్థం ఊహించి, తన వాదనకు అనుగుణంగా ప్రతిపాదించారు తప్ప, ఫలానా శాస్త్రంలో అంత్యజులు అంటే ఊరిబయట ఉండేవారనే అర్థం ఉందని స్పష్టంగా చెప్పలేదు.

లభించిన ఇతర ఆధారాలు, శాస్త్రాలు మాత్రం అంత్యజుడు అనే పదాన్ని చివరగా పుట్టినవాడు అనే అర్థంలో ఉపయోగించాయి. అనగా శూద్ర వర్ణానికి చెందినవాడనే అర్థం. ఉదాహరణకు, శంఖుధర్మశాస్త్రానికి తెలుగు అనువాదంలో అంత్యజన్మః =శూద్రుని యొక్క (2.4) అనే అర్థం చెప్పబడ్డది (54).  తాంత్రిక గ్రంథమైన `కౌలజ్ఞాన నిర్ణయ’ అనే గ్రంథంలో కూడా అంత్యజ అనే పదం చివరి వర్ణం లేదా శూద్ర వర్ణం అనే అర్థంలో ఉపయోగించబడ్డది (55).  కొలిన్ మెకంజీ అనుచరుడిగా పనిచేసిన కావలి వెంకట బొర్రయ్య గారు 1802లో వ్రాసిన అఠవణ వ్యవహార తంత్రమనే గ్రంథంలో అంత్యజులు అంటే చివరగా పుట్టినవారు అనే అర్థాన్ని చెప్పారు (56).  పైగా 18వ శతాబ్దంలో అంత్యజులు అనే సంబోధన ప్రాచుర్యంలో లేదని, ఒక వేళ ఉన్నా దాని అర్థం వేరని ఈ గ్రంథంలోని ఈయన వ్యాఖ్యానం సూచిస్తున్నది. 1931 మైసూర్ సెన్సస్ రిపోర్ట్ లో అంత్యజ అంటే చివరివాడని, మాదిగ కులం గురించి చెబుతూ ఈ కులాన్ని సాధారణంగా అంత్యజ అనే పేరుతో పిలవరని నంజుండయ్యగారు స్పష్టం చేసారు (57).  అప్పటి వివరాలు అంత్యజ వర్ణం అంటే చివరగా ఉండే వర్ణమని, అది అష్టాదశ ప్రకృతులలో చివరగా ఉండే ప్రకృతి లేదా వర్ణమే అంత్యజులని తెలుపుతుంది. అంతేకానీ ఊరిబయట ఉండే వారు కాబట్టి వారు అంత్యజులని, అందువల్ల వారిది అంత్యజ వర్ణమని చెప్పలేదు.

భాగవతంలోని ఒక శ్లోకం అన్తేవసాయిల గురించి వ్యాఖ్యానించింది. కానీ పండితులు ఈ పదానికి ఆశ్రమబాహ్యులని అర్థం చెప్పారు (58).  ఆశ్రమ బాహ్యత్వం పలు కారణాల వలన సంభవిస్తుంది. ఉదాహరణకు భార్య మరణించిన వ్యక్తి ఆశ్రమ బాహ్యుడిగా పరిగణించబడుతాడు. వివాహితుడైన వ్యక్తి భార్య మరణిస్తే అతను పూజాది కర్మలకు అనర్హుడు. అలాగే అవసరమైన సంస్కారాలను పొందని వారు కూడా ఆశ్రమ బాహ్యులే, ఆశ్రమ ధర్మాల నుండీ పతితులైనవారు, గృహస్థాశ్రమంలో ఉండి కూడా విరాగులైనవారు, బ్రహ్మచర్యాన్ని పాటించకపోయినా వివాహం కాని వారు తదితరులందరూ ఆశ్రమబాహ్యులే. ఇక్కడ ఆశ్రమ బాహ్యత్వం ఆ అర్థాన్ని సూచిస్తుండవచ్చు.

అంతేవాసి, దాస అనే రెండు పదాలు శిష్యుడిని ఉద్దేశించి చేయబడినవని యాజ్ఞవల్క్యస్మృతికి తెలుగు అనువాద గ్రంథంలో మహామహోపాధ్యాయ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడుగారు పేర్కొన్నారు.  అమరకోశం మాతంగుడంటే గ్రామమధ్యాన్ని పొందనివాడనే అర్థాన్ని చెబుతున్నది (59). వాస్తుశాస్త్రంలో కొన్ని రకాల గ్రామనిర్మాణాలలో చర్మకారులకు ఊరి చివరిభాగంలో ఇళ్ళుండాలని ఉంది (60).  అమరకోశం ప్రకారం అంతేవాసి అంటే ఊరి చివర ఉండేవాడని అర్థం (61).  స్వదేశీ Town Planning లో దానికి చెందిన వివరాలున్నాయన్న విషయాన్ని గమనించాం. ఈ వర్ణనలలో ఈ జాతులు బహిష్కృతులు/వెలివేయబడినవారని ఎక్కడా చెప్పలేదు. పైగా గ్రామనిర్మాణంలో వారికోసం ఎక్కడ ఏ సౌలభ్యాలు ఉండాలో స్పష్టంగా పేర్కొన్నాయి.

(ఇంకా ఉంది)

Footnotes:

  1. ttps://www.indica.today/research/research-papers/the-dravidian-movement-part-iii/
  2. Jakob De Roover-A Nation of Tribes and Priests: The Jews and the Immorality of the Caste System-Martin Farek, Dunkin Jalki, Sufiya Pathan, Prakash Shah-2017-Western Foundations of the Caste System-p185-189. ‘During the eighteenth century, European authors took further steps in what appears to have been a mapping of the idea of a fifth class of “outcasts” onto the institution of excommunication among the Jews. Scrafton, for instance, pointed to a group called “the Hallachores, who I cannot call a tribe, being rather the refuse of all the tribes.” These had been excluded from the system established by the ancient legislator because they had violated its laws: All the different tribes are kept distinct from each other, by insurmountable barriers; they are forbid to intermarry, to cohabit, to eat with each other, or even to drink out of the same vessel with one of another tribe; and every deviation in these points, subjects them to be reject by their tribe, renders them for ever polluted, and they are thenceforward obliged to herd with the Hallachores. One of his colleagues in the East India Company similarly noted a fifth group distinct from the four main castes, called “the Chandalas” which consisted of those expelled from all castes. This expulsion was “a punishment inflicted for certain offences.” These people, he wrote, were denied any rank in society, could not enter a temple, and be present at any religious ceremony or serve in any public employment. “Hence the punishment of expulsion, which is supposed in its consequences to extend even to another life, becomes more terrible than that of death”
  3. Henry Yule, Arthur Coke Burnell-1886-Hobson-Jobson: A Glossary of Anglo-Indian Colloquial Words and Phrases, and of Kindred Terms; Etymological, Historical, Geographical, and Discursive-p513. ‘From their coming into contact with and under observation of Europeans, more habitually than any similar class, the name Pariah has come to be regarded as applicable to the whole body of the lowest castes, or even to denote out-castes or people without any caste. But this is hardly a correct use. There are several castes in the Tamil country considered to be lower than the Pariahs. e.g the caste of shoemakers, and the lowest caste of washermen. And the Pariah deals out the same disparaging treatment to these that he himself receives from higher castes. The Pariahs “constitute a well-de-fined, distinct, ancient caste, which has ‘subdivisions’ of its own traditions, and its own jealousy of the encroachments of the castes which are above it and below it. They constitute perhaps, the most numerous caste in the Tamil country.’
  4. డా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-1994-ప్రసంగాలు-సంపుటం 7-p 266 & B. R. Ambedkar-1948-The Untouchables-p31. The settled tribes founded the village and formed the village community and the Broken Men lived in separate quarters outside the village for the reason that they belonged to a different tribe and, therefore, to different blood. To put it’ definitely, the Untouchables were originally only Broken Men. It is because they were Broken Men that they lived outside the village. This explains why it is natural to suppose that the Untouchables from the very beginning lived outside and that Untouchability has nothing to do with their living outside the village.
  5. Capt JSF Mackenzie, Maisur Commission-The Kulwadi of the Hassan District-Indian Antiquary – A Journal of Oriental Research – Jas Burgess-Vol2-1873-p 65
  6. Madras Town Census-W. R. Cornish-1871, 1873-p82 ‘But the Committee would guard themselves from being thought to use the word “out-caste” in anything more than a conventional sense. So little is known of Pariahs by the Hindus generally that it seems almost impossible to obtain at this time a trustworthy account of such organization as, in the lapse of years they have worked out for themselves.’
  7. W.R. Cornish-On the Census of the Madras Presidency 1871-p2. In the year 1818 epidemic cholera appeared, if not for the first time within this Presidency, certainly for the first time within the memory of the then oldest habitants. From the time of this invasion until 1820 or 1827, a large number of the people fell victims to the disease, and in the year 1833-34 a more deadly epidemic than any former ones swept over the land. In this latter period a terrible famine preceded the cholera, and in the Guntoor District alone it was estimated at the time, by competent local observers, that more than one-half of the people had perished from famine and disease. The census returns of the district for 1822 show a population of 454,754, but in 1836-37 the number had decreased to 267,426. Admitting that the census returns of zemindary tracts were defective in 1836-37, it is quite certain that the calamities of adverse seasons, famine, and pestilence, during the preceding ten years, had powerfully affected the normal increment inherent to an Indian population.

దిగవల్లి వేంకటశివరావుగారు-1986-వీరేశలింగం వెలుగు నీడలు అనుబంధం-1- వీరేశలింగం-వాస్తవాలు-p68.1890-1900 మధ్యకాలంలో గోదావరి కృష్ణా డెల్టాలో కూడా రెండో పర్యాయం శిస్తు సెంటిలుమెంటు జరిగింది. ఆ దశాబ్దంలో రాష్ట్రంలో 1890-92, 1896, 1897 1898, 1900 సం॥రాలు కరువు సంవత్సరాలు. కృష్టా డెల్టాలో కూడా కరువువచ్చింది. [A.V. రామారావుగారి The Economic Development of A.P- 4,5 అధ్యాయాలు] మా అంగలూరు హరిజనులు గుడివాడలో దుకాణాలు దోచుకున్నారు. మా పాలేళ్ళు మాదిగవారు అందులో పాల్గొన్నారని మాతాతగారు చెప్పేవారు. వారిని నేను బాగా ఎరుగుదును.

హిందూ రాజ్యాలు అంతరించినది లగాయతు జలాధారాల మరమ్మతుల ఆలన పాలనపోయి, ముస్లిం పాలన నుంచీ ఇంగ్లీషు పాలనాకాలం వచ్చేసరికి గత శతాబ్దం మొత్తం భారత దేశం చరిత్రలో కరవుల శతాబ్దమై పోయిందని చరిత్ర ఘోషిస్తుండగా, ఇంగ్లీషుపాలనలో కరవులే కరవై పోయాయని వ్రాసిన వ్రాతలుతెల్ల దొరతనపు దాసానుదాసత్వపు వ్రాతలు కాక మరేమవుతాయి ? ముస్లింపాలనలూ 1/6 శిస్తునుంచి యింగ్లీషు పాలనలో 1/3 శిస్తు అయిందని పత్రికలో వ్రాసినవారే శాశ్వత మైన గ్రంధాలలో కరవులు కరవైన మంచి కాలమని, ధనమును ప్రయోగించు తెలివిలేని రైతుకు పదిరెట్లు ధనాదాయం పెరిగే మార్గాలు ఏర్పరచడం నిష్ఫలమని వ్రాయ జాలిన మహానుభావుని సంస్కారాన్ని, భావసరళిని ఏమనాలో మతిమంతులమై ఆలోచించాలా అక్కరలేదా ? ఇట్టి వ్రాతలు 1915లో కూడావీరేశలింగంగారు వ్రాయగలిగారు, రైతు కూలీ సంఘాలు పెట్టి పని చేసిన కమ్యూనిస్టులు ఇటువంటి వ్రాతలు కానకుండా వున్నారు. వారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్రకారులే వీరేశలింగంగారి అసత్య చరిత్రను నమ్మినడుస్తున్నారు; నడిపిస్తున్నారు. ప్రశ్నించినవారిపై పిచ్చి ప్రచారం చేస్తున్నారు!!

  1. Dr A. V. Raman Rao-1958-Economic Development of Andhra Pradesh [1766-1957]- p29,64, 68-70,165,168,195

మన్రో స్వయంగా ఇచ్చిన రిపోర్టు ప్రకారం సీడెడ్ జిల్లాలో రైతుల దుస్థితి కడు దీనంగా ఉండేది. రైతులలో కేవలం 17% మంది మాత్రమే శిస్తు కట్టగలిగే స్థితిలో ఉండేవారు. 49% మంది రైతులు పంటలపై అప్పు చేసి శిస్తు కట్టేవారు, 34% మంది పంట అమ్మిన తరువాత మాత్రమే శిస్తు కట్టగలిగే స్థితిలో ఉండేవారని తెలిపాడు.

1801-02 లో తీవ్రమైన కరువు వలన ఆకలితో మనుషులు పిట్టలు రాలినట్లు రాలి చనిపోయినా కూడా ఏ మాత్రం జాలీ దయలేకుండా మన్రో పన్నులు వసూలుచేయించాడు. 1811లో నెల్లూరు కరువు సమయంలో కూడా కంపెనీ ఏ మాత్రం దయచూపలేదు, తన విధానాలను మార్చలేదు. 1823లో ఏర్పడిన కరువు కడప, కర్నూలు, బళ్లారి, వైజాగ్, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. 1824 నాటికి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.

అప్పట్లో బ్రిటిష్ వారి ద్వారా చేపట్టిన పబ్లిక్ వర్క్స్ వలన భుక్తి లభించడం వలన కొద్దిగా ప్రజలకు తేరుకునే అవకాశం లభించింది. 1833 నాడు ఏర్పడిన కరువులో వ్యవసాయం పూర్తిగా నాశనమైంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఆకలితో పొట్టచేతపట్టుకుని ఉపాధికోసం ప్రజలు పెద్దఎత్తున దూరప్రాంతాలకు వలసపోవడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో పశు సంపద కూడా నాశనమైంది. కలరా వంటి వ్యాధులు ప్రబలి పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించింది. 1839లో సంభవించిన కరువులో పంటలు నాశనమవడం వలన రాజమండ్రి, బళ్లారి, వైజాగ్, మచిలీపట్నం ప్రాంతాలలో ధాన్యపు కొరత ఏర్పడింది. ప్రజలు పెద్దఎత్తున ఆకలిబాధలకు, చావులకు గురయ్యారు. 1853లో సీడెడ్ జిల్లాల్లో పంటలు పండలేదు, దానికి తోడు వివిధ వృత్తులు కూడా నాశనమయ్యాయి. 1854 నాటికి గ్రామాలలో పశువుల ఎముకల గుట్టలు పేరుకున్నాయి. బళ్లారిలో మాత్రం 25,000 పైగా పశుసంపద నాశనమైంది. 1867-77 మధ్యలో వచ్చిన కరువులతో అనేకమంది రోగాలు ప్రబలడం వలన మృతి చెందారు. 1881 లో వచ్చిన కరువులో అనంతపూర్, కర్నూలు, బళ్లారి, కడప జిల్లాలలో 17-26% ప్రజలు మరణించారు. యం.వి. రమణారెడ్డి-1983,2011-రాయలసీమ కన్నీటి గాథ-p 10-111876లో వచ్చిన ధాతు అనే కరువులో 40% మంది ప్రజలు మరణించారు.

  1. Lewis McIver -Imperial Census of 1881-Vol1 (The Report)-Operation and Results in The Presidency of Madras-p116 ‘Outcastes-in the schedules 669 persons, of whom 413 are makes and 253 are females, are returned as excommunicated. These entries were probably made by the Enumerators without the approval of the individuals. Only 42 entries gave the return of ‘excommunicated’ without naming their cate. The remainder named their caste from which they were outcasted. These cases chiefly occur in South Canara.’ A.Govindacharya-The Vedanta and the Panchama Question-p9. Ask the pure Pariah and he will give you his opinion of the spoiled Pariah. Try if you can prevail upon the pure Pariah to take back into his fold the spoiled Pariah? Go out to the villages and visit a Paracheri, or quarters assigned to the Panchamas and there you will see how. the Tirukkulattars or that portion of them who came under the influence of Ramanuja, are given a separate place to live in, and how the other portions respect them and accord them honors as if they were Brahmans made out of them. And contrast this with the Pariah whom the missionary has made convert, for the pure Pariahs will never admit him back into his fold ; not only that, these look upon those as outcastes.
  2. నల్లతింఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు-2008-బోధాయన ధర్మసూత్రము-p 35 ఆసనం శయనం యానం నావః పంథాః తృణాని చః చండాల పతిత స్పృష్టం మారుతేనైవ శుద్ధ్యతి॥ 9-7. ముదిగొండ వేంకటరామశాస్త్రి-1934-ధర్మసిద్ధాంత సంగ్రహము-p 40 చండాల పతిత వాయసేభ్యో భూమా వన్నం నిక్షిపేత్ -అశ్వలాయన గృహ్యసూత్రము.
  3. P.Y. Luke and John B.Carman-1968-Village Christians and Hindu Culture: study of a rural church in Andhra Pradesh South India-p10-11.“The ‘Kula Panchayat’ or Caste Council: It is to the caste headman that all difficult questions affecting the caste system are referred. He calls a few elders from the same palem in the village, who are versed in the intricacies of the matters in dispute. Two or three elders from other castes in the village are also invited to their council. Some cases brought before the council arise merely from personal hatred or caprice. When without any apparent justification persons refuse to attend the funeral or marriage ceremonies of their relatives or people of the same caste or when they happen not to invite the latter on similar occasions, the individuals thus slighted never fail to appeal to the caste headman for satisfaction for the insult. Cases of breach of caste obligations or rules, of adultery within the caste group or across caste barriers, and of divorce are all taken up by the caste councils. The Panchayat usually imposes a heavy fine or decrees excommunication or expulsion from the caste. This is a kind of social ostracism or boycott, which deprives the unhappy person who suffers it of all intercourse with the people of his own caste. No one dares to eat with him or give him a drop of water, or attend any of his marriage festivities and family ceremonies. He is refused fire, and is not allowed under any conditions to mingle in the marriage festivities of his friends. About twenty years ago a Sudra man who had sexual relations with a Mala woman in Kondapuram village was rigorously expelled from his caste when his offence became known. He built a hut in the Mala basti and lived with this Mala woman for the rest of his life, leaving his caste wife and children. If a man loses his caste, he loses not only his relations and friends, but often his wife and children, who would rather leave him to his fate than share his disgrace with him. In some cases, restoration of caste is possible. If the culprit shows signs of repentance, pays the fine levied, and then serves a feast to the persons present, he will be taken back into his caste. In Jangarai village during 1958 there were three cases of discipline of Mala men who had committed adultery with a Madiga woman. The caste headmen from eighteen or twenty other villages were called for a territorial intervillage caste panchayat held in Rudaram village. The cases were proved and the accused confessed their fault, so they were fined Rs. 130, and were made to bear all the expenses of a meal and toddy for fifty people. Then the Mala jangam (priest) was called from another village to perform purificatory rites: shaving their heads, giving them a bath in a tank, and three times slightly burning their tongues with a piece of heated gold wire. Thus they were restored to their caste. The caste headmen and others who attended the council were paid two rupees each.Each caste in a village is related to the same caste in the surrounding villages. The same caste in ten to twenty adjacent villages has the same organization, and may call such an inter-village council.”
  4. Gustav Oppert-1893- On the Original Inhabitants of Bharatavarsa or India-p52-53
  5. Edgar Thurston-1909-stes And Tribes Of Southern India Vol 2-p340
  6. డా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-1994-ప్రసంగాలు-సంపుటం 7-p 334-335,337
  7. డా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-1994-ప్రసంగాలు-సంపుటం 7-p 265
  8. Dr. B.R. Ambedkar -The Untouchables-p 33
  9. పళ్లే చెంచలరావు పంతులు-1888-శంఖుధర్మశాస్త్రము- p 4
  10. P. C. Bagchi and Michael Magee -Kaula Jnana Nirnaya-of the school of Matsyendra Nath- (8 Patala-Shloka 4-12.5) అష్టమ పటలంలోని వివరాల ప్రకారం, భైరవుడు ఇలా తెలిపాడు – నిర్జన ప్రదేశంలో, పూల దండలతో, సుగంధ పరిమళాలతో మద్య, మత్స్య, మాంసాలను సేవిస్తూ ఉత్తేజాన్ని పొందాలి. శక్తితో కూడినపుడు ఆమె సహజ, కులజ లేక అంత్యజ. తన భార్యతో సాధన చేసినప్పుడు ఆమె సహజ అని, వేశ్య కులజ అని, అంత్యజ వర్ణానికి చెందిన వారితో సాధన చేస్తే ఆమె అంత్యజ అనబడుతుంది. ఇప్పుడు వారి అంతర్గుణాలను వర్ణిస్తాను విను. ఎవరన్నా ఆ శరీరంలో దేవిని ధ్యానిస్తే వారి శరీరం మదనానందాన్ని పొందుతుంది, ఇది రతి చేయడానికి మంచి స్థితి. ఈమె సహజ శక్తి. కులజ మంత్రాల పుట్ట. ఈమె కులానికి మూలం. ఆమెకు తెలియంది లేదు. అంత్యజులు గొప్ప శక్తిమంతులు. ఈమెలో మహా శక్తి ఉంటుంది. ఈమె పూల దండలు వేసుకుని, ముత్యాలు ధరించి నుదుటి మీద బొట్టుతో, నోటిలో తాంబూలంతో, గంధం పూసుకుని, ఉల్లాసంగా సంతోషంగా ఉంటుంది.
  11. Edited by M.P.Reddy-Kavali Venkata Borriah-April 1802-Athavana Vyavahara Tantram (A Mackenzie Manuscript)-p 2 “…..అంత్యమందు ఉద్భవించినది గనుక వాండ్లు అంత్యజులని పేరుబడి ఉత్తమాచార ధర్మములు మాని దుర్భక్షణ చేస్తూ ఉంటారు….”
  12. H.V.Nanjundayya & L. K. Ananthakrishna Iyer-1931-Mysore Tribes And Castes- Vol. 4 -p 127. ‘Chandala, literally a cruel man, is rarely applied to any caste, except when it is meant to exhibit contempt, and then it applies indifferently to any low caste. Antyaja (literally ‘born at the end’) can also be hardly regarded as a special name for this caste.’
  13. బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వరశర్మగారు-శ్రీమద్భాగవత మహాపురాణ సంహిత-శ్రీధరీయ భావార్థ దీపికా వ్యాఖ్య-ఆంధ్రానువాదము-ఏకాదశస్కందము-17 వ అధ్యాయము-20 వ శ్లోకము-p 376. అశౌచమనృతం స్తేయం నాస్తిక్యం శుష్క విగ్రహః కామః క్రోధశ్చ తర్షశ్చ స్వభావో అన్తేవసాయినామ్‌ । తా:- ఆశ్రమాదులకు బాహ్యులయిన వారి స్వభావ గుణములను చెప్పుచున్నారు. శుచి లేకుండుట, అసత్యము చౌర్యము నాస్తికత, కారణము లేని కలహము, కామము, క్రోధము, తృష్ట అనునవి ఆశ్రమ బాహ్యులయిన వారి స్వభావగుణములు. (20) టీ:- ఏతైరేవ ఆశ్రమస్వభావా అపి జ్ఞేయాః తద్బాహ్యానాం స్వభావా నాహ- అశౌచ మితి శుష్కవిగ్రహః నిర్మూల కలహః తర్షః తృష్ణా.
  14. MahaMahoPadhyaya Acharya Pullela SriramaChandrudu. -2003-Yagnavalkya Smruthi- Mitakshara- Telugu translation- Gopal Publications p 247 & Santosh Kumar Das-1930-Educational System of The Ancient Hindus-p79. శిష్యుడు, అంతేవాసి, భృతకుడు, అధికర్మకృత్, దాసుడు అని సుశ్రూషకులు ఐదు విధాలు. వేదవిద్యార్థి శిష్యుడవుతాడు. శిల్పశిక్ష కోరేవాడు అంతేవాసి. జీతం తీసుకుని పనిచేసేవాడు భృతకుడు. పనులు చేసేవారిపై పర్యవేక్షణ చేసేవాడు అధికర్మకృత్. దాసులు 15రకాలుగా ఉంటారని చెప్పారు.
  15. Architecture of Manasara-Vol4- Ch-9(2-4,134-137,149,154-158,170-174,284-289,404-410,446,458) p-63-88. గ్రామ నిర్మాణ సమయంలోనే వివిధ కులాలకు వివిధ ప్రత్యేక ప్రదేశాలు కేటాయించబడేవి. ఇవి ఆయా కులాల ఆచారాల, వృత్తుల ఆధారంగా ఏర్పాటుచేయబడ్డాయని వాస్తు శాస్త్రంలోని వివరాలు సూచిస్తున్నాయి. మానసారుడు వివిధ రకాల గ్రామాలూ, పట్టణాలూ ఎలా ఉండాలో వర్ణించాడు. గ్రామాలను నిర్మించడానికి దండక. సర్వతోభద్ర, నంద్యావర్త, పద్మక, స్వస్తిక, ప్రస్తార, కార్ముక, చతుర్ముఖ అనేవి 8 రకాల పద్ధతులు. దండక అనే పద్దతిలో నిర్మించిన గ్రామాలలో, ఆ ఊరి పైశాచ భాగం అంటే ఊరి చివరి భాగంలో అన్ని ఇళ్లనూ కలుపుతూన్నట్లుగా ఒక వీధిని నిర్మించి, ఆ ఊరిని కాపాడే క్షేత్రపాలక దేవత గుడి ఈ పైశాచ భాగానికి వెలుపల ఈశాన్య దిక్కులో నిర్మించాలి. అలాగే మానసారుడు వివిధ పద్దతులలో నిర్మించిన గ్రామాలలో అనేక వృత్తులు చేసే వారి గృహాలు ఎక్కడ నిర్మించాలో కూడా పేర్కొన్నాడు. ఉదాహరణకు చెప్పులు కుట్టే వృత్తికి చెందిన వారి గృహాలు వస్త్రాలు నేసే వారి గృహాలకు వెనుకల ఉండాలని తెలిపాడు. గ్రామ పొలిమేరలలో నేతపని, చర్మపు పని చేసే వారి గృహాలు ఉండాలన్నాడు, అదే వాడలో నూనె తయారు చేసే వారు కూడా ఉండాలన్నాడు. ఉత్తర దిక్కులో, గ్రామ పొలిమేర్లలో వైష్ణవి, చాముండి అమ్మవార్ల గుడులు నిర్మించాలి. గ్రామ పొలిమేర్లలో ఈ గుడికి కొద్దిపాటి దూరంలో స్మశానాలలో శవాలను దహనం చేసేవారు నివసించాలనీ మానసారుడి శిల్పశాస్త్రంలో ఉంది. నంద్యావర్త పద్దతిలో నిర్మించిన గ్రామంలో ఒక వేళ ఊరి భూమి నిర్మాణ పద్దతి చండితలో నిర్మిస్తే, అప్పుడు ఆ ఊరిని నాలుగు భాగాలుగా నిర్మించాలి. ఊరి మధ్యలో ఉండే భాగం బ్రహ్మ భాగం, దాని వెలుపల చుట్టూ ఉండే ఇంకో భాగం పేరు దైవిక భాగం, దాని చుట్టూ ఉండే భాగం పేరు మానుష భాగం, దాని చుట్టూ ఉండే భాగం పేరు పైశాచ భాగం. ఇందులో ఒక్కో భాగానికి ఒక్కో వైశాల్యం గురించి విపులంగా వివరించాడు మానసారుడు. ఇదే పద్దతిలో పరమ శాయిక, స్థండిల భూమి పట్టికల గురించి పేర్కొన్నాడు. నంద్యావర్త పద్దతిలో నిర్మించిన గ్రామంలో గ్రామానికి రక్షణగా, ఊరికి వెలుపల భైరవుడి గుడిని నిర్మించాలి. ఊరి రాక్షస లేక పుష్పదంత భాగంలో దుర్గాదేవి గుడిని నిర్మించాలి. ఊరి వెలుపల ఉత్తర దిక్కులో కాళికా దేవి గుడిని నిర్మించాలి. ఊరికి నంద్యావర్త పద్దతిలో నిర్మించబడిన గ్రామంలో ఒక క్రోశ దూరంలో ఉత్తర లేక తూర్పు దిక్కున చండాలుల గృహాలు నిర్మించాలి, ఊరికి ఉత్తర దిక్కులో స్మశానాలు ఉండాలి. ఊరికి వెలుపల ఉత్తర దిక్కులో ప్రేతాలు, భూతాలు, అంశలు, దండకులు నివసిస్తారన్నాడు. స్వస్తిక పద్దతిలో నిర్మించిన గ్రామంలో దుర్గా, గణపతి, బుద్ధ, జైన, కార్తికేయ వంటి దేవతలా గుడులను ఊరి బయట నిర్మించాలి. ఒకవేళ ఊరిలో పలుచోట్ల నిర్మించాలన్నా కూడా అభ్యంతరం లేదు. చాముండా దేవి గుడి మాత్రం కచ్చితంగా ఉత్తర ముఖంగా, ఈశాన్య దిక్కులో ఊరి వెలుపల లేక ఊరికి దూరంగా నిర్మించాలి. చాముండా దేవి గుడికి తూర్పు దిక్కులో చండాలుల గృహాలు నిర్మించాలి. ప్రస్తార పద్దతిలో నిర్మించిన గ్రామంలోని పైశాచ భాగంలో పనులు చేసే వారి గృహాలు నిర్మించాలనీ సూచించబడింది.
  16. అమరకోశము (గురుబాల ప్రబోధికా వ్యాఖ్యతో)-ద్వితీయ కాండము-19-p 606. ‘అన్తేగ్రామాన్తే వసతీతి-అంతేవాసీ. న. పు. వన నివాసే. గ్రామము కడపట నుండువాడు.’, ‘మతంగతి న గచ్చతి గ్రామమధ్య మితి మాతంగః తగిగతౌ. గ్రామమధ్యమును బొందనివాడు.’
Exit mobile version