Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి-5

[‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపరని అందిస్తున్నారు శ్రీ మైలవరపు సుధా మోహన్.]

బ్రిటిషు పాలన-పంచములు:

బ్రిటిష్ పాలనలో వారి పాలనకు అనుకూలమైన అమరికను, వర్గీకరణలను సృష్టించారు. ఈ భాగంలో వారి వలన హిందూ సమాజపు రూపు రేఖలు ఏవిధంగా మార్చబడ్డాయో చూద్దాం. యూరోప్ సమాజం పట్టణ-గ్రామ (Urban-Rural) అనే రీతిలో అమరి ఉండేది. భారతదేశంలోకి వచ్చిన పాశ్చాత్యులు ఇక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అదే పద్దతిని ఉపయోగించారు. అయితే ఈ పద్దతి భారతీయ సమాజానికి పూర్తిగా సరిపోదు. ఈ విధమైన వర్గీకరణ ముఖ్యంగా గ్రామాల బయట ప్రత్యేకంగా నివసించిన కులాలపై, అలాగే అటవీ-గిరిజన సమాజాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది.

యూరప్లో పట్టణాలు వ్యాపార కేంద్రాలతో, పరిశ్రమలతో నిండి, కేంద్రీకృత పాలనను కలిగి ఉండేవి. అక్కడ వ్యవసాయానికి గ్రామం కేంద్రంగా ఉండేది. బ్రిటిష్ పాలకులు కూడా ఇదే అమరిక ద్వారా భారత సమాజాన్ని అర్థం చేసుకోవడమే కాదు, ఆ అమరికను హిందువుల మీద కూడా రుద్దారు. కానీ భారతదేశంలో గ్రామ, నగర, పట్టణాలలో మాత్రమే కాదు, విస్తృతమైన జనపదాలు, వీటి వెలుపల నివసించే జనాభాకూడా ఉండేది. ఉదాహరణకు, దేవాలయ కేంద్రాలు, కొండలు, అడవులలో నివసించేవారు, పుణ్యక్షేత్రాలలో నివసించేవారు, వీటిలో కాకుండా వీటికి వెలుపల సంచరించే సన్యాసులు, ఋషులు, యోగులు ఇలా విభిన్న రీతులలో జనాభా పరస్పరం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉండేవి. ఇవన్నీ హిందూ సమాజంలో, సామాజిక వ్యవస్థలో భాగమే కాని, వేరు వర్గాలు కావు. అందువల్లనే వీరందరి గురించిన చర్చ అన్ని హిందూశాస్త్రాలలో పెద్ద ఎత్తున కనిపిస్తుంది (103).

చాలా ప్రాంతాల్లో గ్రామరక్షణకోసం లేదా సరిహద్దులను కాపలాకాయడం కోసం, కొన్ని ప్రత్యేక వృత్తుల వలన, వివిధ రకాల సాధనలతో కూడిన ఆచారాల వలన వేరు వేరు ప్రాంతాలలో ప్రజలు నివసించేవారు. గ్రామానికి బయట నివసించే చిన్న సమూహాలకు చేరి, పల్లె, పరాచేరి, పాలెం వంటి పేర్లు ఉండేవి.

పాశ్చాత్యులు తమ ‘పట్టణ-గ్రామ’ (Urban-Rural) అమరికను హిందువుల మీద రుద్దినప్పుడు గ్రామం ఒక యూనిట్ గా నిర్వచించబడి, ఆ గ్రామం వెలుపల ఉన్నవారు బహిష్కృతులుగా నమోదు చేయబడ్డారు. దీంతో నివాస ప్రాంతం కాస్తా సామాజిక స్థాయికి కొలమానంగా మారింది. వృత్తి వలన ఏర్పడిన నివాసప్రాంతం కాస్తా కులస్థితికి, కుల వివక్షకు ప్రతీకగా మారింది.

ఈ Urban-Rural అమరికలో కొండ, అడవి ప్రాంతాలలో నివసించే ప్రజలకు స్థానం లేకపోవడంతో, పాశ్చాత్యులు వారికి “ట్రైబ్”, “అబోరిజినల్” వంటి పేర్లు పెట్టి, ఆ వర్గాలుగా వేరు చేశారు. కానీ వాస్తవానికి హిందూ సమాజంలో అడవి, కొండజాతుల వారు భాగం. వీరికి మిగతా హిందువులతో వ్యాపారపరమైన, సైన్యపరమైన, ఆచారాల పరమైన సంబంధాలు చాలానే ఉండేవి. హిందూ రాజుల సైన్యాలలో అడవులలో ఉండేవారి సైన్యం భాగమని (ఆటవి సైన్యం) అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఇస్లామిక్ దాడులను ఎదుర్కోవడంలో అడవి కొండజాతుల వారు హిందూ రాజుల సైన్యంలో పోషించిన ముఖ్యపాత్రను చరిత్రకారులు పలుగ్రంథాలలో వర్ణించారు. అడవి-కొండజాతులపై లోతుగా పరిశోధించిన వెన్నెలకంటి రాఘవయ్య గారు (నెల్లూరు గాంధీ), హిందూ సమాజంతో వీరికి గల గాఢమైన సంబంధాన్ని తన గ్రంథాలలో వివరించారు.

ఉదాహరణకు, విజయనగర సామ్రాజ్యంలో కొండజాతులు యుద్ధాలలో శత్రువులను నాశనం చేయడానికి రాజులకు సహాయపడేవారని, ఈ విధంగా అప్పటి రాజులకు సహాయపడిన పద్దెనిమిది కొండజాతుల వివరాలు దక్షిణాది చరిత్రలో కనిపిస్తాయి (104). 1798 నుండీ 1834 వరకూ ఒరిస్సాలో పర్లాకిమిడి రాజా, కొండజాతుల వారితో కలిసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటుచేశాడు. మహారాష్ట్రలో పేష్వాల సైన్యంలో పనిచేసిన రామోసీ తెగ వారు 1825లో తిరుగుబాటును లేవదీశారు. కొల్హాపూర్ రాజ్యానికి చెందిన గడ్కారీ తెగవారు కూడా బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. ఇష్టం వచ్చిట్లు విధించిన భూమి శిస్తును కట్టలేకపోవడం వల్ల భూములను కోల్పోయిన రైతులు, వృత్తులను కోల్పోయిన చేతివృత్తుల వారూ, బ్రిటిష్ వారి వలన ధ్వంసంమైన ఆస్థానాల సైన్యంలో పనిచేస్తూ వృత్తులు కోల్పోయినవారూ తదితరులందరూ బ్రిటిష్ వారికి ఎదురుతిరిగిన కొందరు జమీందారులకు తోడై పోరాటం చేసారు (105).

వీరే కాదు అస్సాం ప్రాంతంలో సాంతాల్ జాతులు వంటి అడవి కొండ జాతి ప్రజలు చేసిన తిరుగుబాట్లు బ్రిటిష్ వారికి వెన్నులో వణుకుపుట్టించాయి. ఈ జాతుల వలన బ్రిటిష్ వారికి తీవ్రమైన ముప్పు ఉండేది. అనేక ప్రాంతాలలో అడవి-కొండ జాతులు బ్రిటిష్ అధికారాన్ని నేరుగా ధిక్కరించారు. బ్రిటిష్ వారు అటవీ చట్టాలు అమలులోకి తేవడంతో, అడవులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కాస్త బ్రిటిష్ ప్రభుత్వ ఆస్తిగా మారాయి. ఆ ప్రభావం వలన అక్కడి ప్రజల స్వేచ్చ, స్వాతంత్రం, సంప్రదాయ జీవన విధానాలు కుదించుకోవడం మొదలుపెట్టాయి. ఈ జాతులకు అంతకుముందు ఉండే సంచార జీవనం, వేట, పశువుల మేత వంటి హక్కులు తగ్గించబడ్డాయి.

ఆ తరువాత కాలంలో Urban-Rural అమరిక ఆధారంగా పట్టణాభివృద్ధి, గ్రామాభివృద్ధి అనే రెండు వేరు విధానాలు ప్రాచుర్యంలోకి రావడంవలన, ప్రభత్వం ద్వారా ఇవ్వబడిన మౌలిక సదుపాయాలు గ్రామాలకు మాత్రమే చేరేవి, గ్రామం బయట ఉన్న వర్గాలకు తక్కువ హక్కులు, వసతులు లభించాయి. ఇవన్నీ ఆయా జాతుల పరస్పర సంబంధాలపై, వృత్తులపై పెనుప్రభావాన్ని చూపాయి.

వలసపాలనలో మొదలైన ఈ పద్దతి, దాని వర్గీకరణలు స్వాతంత్ర్యం తర్వాత కూడా కొనసాగాయి. ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి ప్రణాళికలు, సామాజిక గుర్తింపులు మొదలైన అన్ని అంశాలలోనూ గ్రామం-పట్టణం, కాస్ట్-ట్రైబ్ అనే పాశ్చాత్య విభజనలు ప్రాముఖ్యాన్ని పొందాయి. దీంతో తమ హక్కుల కోసం, ప్రభుత్వం ఇచ్చే వసతుల కోసం అనేక వర్గాలు ఈ కొత్త పరిపాలనా గుర్తింపులలో తమను తాము ఇముడ్చుకున్నాయి.

పై చారిత్రిక కారణాల వలన భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే, పాశ్చాత్యులు ప్రవేశపెట్టిన ద్వంద్వ నమూనా కాకుండా స్వదేశీ వాస్తు శాస్త్రంలోని town planning ఆధారంగా జనపద-క్షేత్ర-నగర-గ్రామ-అటవీ సంబంధాలను సమగ్రంగా చూడడం అవసరం

బ్రిటిష్ పాలన- భారతీయ సమాజ పరిణామం:

పంచమ అనే వర్గీకరణ 18,19 వశతాబ్దపు హిందూ సమాజంలో ప్రాచుర్యంలో లేదని పాశ్చాత్యుల వ్రాసిన గ్రంథాలే సూచిస్తాయి. ఉదాహరణకు బుకానన్ తెలిపిన పంచమ అనే పేరు లేదా వర్గం భారతదేశం అంతటా లేదు, దక్షిణాదిలో కూడా కేవలం కర్ణాటకప్రాంతంలో మాత్రమే ఉండేది. బ్రిటిష్ వారు పేర్కొన్న వివరాలను బట్టి అందులో కేవలం ఊరిబయట ఉండే జాతులు మాత్రమే కాదు, వేరే జాతులు కూడా ఉన్నాయి. బుకానన్ భారతదేశమంతా పర్యటించాడు, కానీ అతికొన్ని ప్రాంతాలలో మాత్రమే పంచమ లేక పంచమ బంధం అనే పేర్లను నమోదుచేశాడు. కావలి బొర్రయ్యగారి పుస్తకంలో దాని ప్రస్తావనే లేదు. హిందువులను ఆర్యులు-ద్రావిడులుగా విభజించడానికి వేదాలను, హిందువుల పురాణేతి హాసాలలో వర్ణాశ్రమ ధర్మాల గురించి శోధించిన జాన్ ముయిర్ కూడా పంచమవర్ణం లేదని చెప్పాడు (106).

ధర్మశాస్త్రాలలో పంచమవర్ణానికి ప్రామాణికతే లేదన్న విషయాన్ని కూడా మునుపే చూశాం. అయినా కూడా స్మృతులకు విరుద్ధంగా హిందువులను ఐదు వర్ణాలుగా విభజించాలనే తీర్మానం 1871 మద్రాస్ టౌన్ సెన్సస్ మీటింగ్లో చేయబడింది. ఆ కమిటీలో చేయబడిన వర్గీకరణ భారతదేశంలో జరిగిన ఇంపీరియల్ సెన్సస్ లకు అన్నింటికీ వర్తింపజేయబడిందని ఆ రిపోర్టులో ఉంది (107). సెన్సస్ కమీషనర్ కోర్నిష్ ఈ వర్గీకరణను సమర్ధించుకోడానికి బుకానన్ ప్రస్తావించిన పంచమ, పంచమ-బంధాలను ఆధారంగా చూపాడు. హిందువులకు వారిగురించి వారికే సరిగ్గా తెలియదని బుకాయిస్తూ, బిషప్ కాల్డ్వెల్ ప్రతిపాదించిన ద్రావిడ జాతుల సిద్ధాంతానికి అనుకూలంగా కొన్ని జాతులను హిందువులనుండీ చీల్చడానికి ‘fifth-caste’ అనే కారణాన్ని చూపాడు.

కానీ ఆ తరువాతి దశకాలకు చెందిన పాశ్చాత్యుల/మిషనరీల గ్రంథాల్లోనే పంచముల వర్గీకరణ గురించిన వివరాలు వేరే వాస్తవాలను చూపుతాయి. బ్రిటిష్ రిపోర్టులలో తరచూ కనిపించే పంచమ జాతి/వర్ణము అనే వర్గీకరణ ఈ మధ్య కాలంలో సృష్టించబడ్డదని కొందరు భారతీయులు, పాశ్చాత్యులు అతి స్పష్టంగా పేర్కొన్నారు. ఉదాహరణకు 1899లో మిషనరీ ఎమ్మా రోషెన్ బుష్, 1908లో మిషనరీ రెవరెండ్ జాన్ క్రెగ్, జూలియా రిచర్, 1912 లో మిషనరీ హిబ్బర్ట్ (‘This word is of British invention, and signifies the fifth caste’) 1932లో మైసూర్ సెన్సస్ అధికారి అయిన H.V నంజుండయ్య గారు తదితరులు పంచమ వర్గీకరణ ఈ మధ్యనే బ్రిటిష్ వారి ద్వారా సృష్టించబడ్డదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆ కాలానికి చెందిన అనేకమంది పుస్తకాలలో లభ్యమవుతాయి (108).

సైమన్ చార్స్లీ అభిప్రాయంలో ‘పంచమ బంధం’ అనే పదాన్ని 1893లో మద్రాస్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అధికారికంగా పంచమ అని ఉపయోగించింది (109). పంచమవర్ణం సృష్టించబడటానికి మద్రాసు సెన్సస్, విద్యాశాఖ వర్గీకరణలు కీలకంగా ఉండగా, అది ఆ తరువాత 1901 సెన్సస్ కమీషనర్ రిస్లీ వలన భారతదేశమంతా పాకింది. గమనించాల్సిన ముఖ్యవిషయమేమిటంటే, బ్రిటిష్ వారు, మిషనరీలు స్వయంగా తమంతట తాముగా పంచమవర్ణ వర్గీకరణ తామే సృష్టించామని చెప్పుకున్నారు! అయినా కూడా నేడు ఆ పంచమవర్ణాన్ని హిందూ ధర్మశాస్త్రాలకు ఆపాదించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా క్రైస్తవులు చేసిన వక్రీకరణలు ధర్మశాస్త్రాలకు వేరుపురుగులాగా పట్టాయి.

దానికి సరిపోయే ఆధారాలు కూడా బ్రిటిష్ రిపోర్టులలోనే లభిస్తాయి. ఉదాహరణకు, మద్రాస్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వివరాల గురించి, పంచమ వర్గీకరణ గురించి 1909లో ఎడ్గర్ థర్స్టన్ ఇలా వ్రాశాడు; 1871 మద్రాస్ సెన్సస్ రిపోర్టులో కొన్ని జాతులు తమను తాము ఐదవ వర్ణంగా (fifth caste) పేర్కొంటాయని సంగ్రహంగా పేర్కొన్నారు. బుకానన్, ఇతర రచయితలు వీరినే “పంచమ బంధం” అని వర్ణించారు. బుకానన్ ప్రకారం, పంచమ బంధం పరయర్, బాలువన్ (వళ్ళువన్?), సెక్కిలియర్, తోటి అనే నాలుగు జాతులతో కూడి ఉంది. బుకానన్ పంచమ బనజిగారు మరియు పంచమ కుంభారు (కుమ్మరులు) గురించి కూడా ప్రస్తావించాడు. 1893 వరకు, విద్యాశాఖలో పంచమ అనే వర్గాన్ని “పరియాలు – అనుబంధ తరగతులు” గా పిలిచేవారు. ఆ తరువాత, సూచనా సౌలభ్యం కోసం ఈ వర్గీకరణను “పంచమ”గా మార్చారు. దీనిలో చచ్చాదీలు, గోదారీలు, పులయలు, హోలేయలు, మాదిగలు, మాలలు, పల్లన్లు, పరియాలు, తోటిలు మరియు వల్లువన్లను చేర్చారు.

1902లో విద్యావిభాగపు డైరెక్టర్ ఇలా వ్రాశారు: “సంక్షిప్తత, పాలనా సౌలభ్యం కోసం వివిధ జాతులను ఒకే సాధారణమైన పేరుతో పిలవాలా వద్దా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిగణించాలి. పరయ, తక్కువ జాతి, వెలివేయబడిన జాతి వంటి పదాలు అవమానకరమైన అర్థాన్ని కలిగి ఉన్నందున అవి అనుచితమైనవి. పంచమ బంధం, లేదా సంక్షిప్తంగా పంచమ అనే పదం మరింత సముచితమైనదిగా కనిపిస్తుంది.” దీనికి ప్రతిస్పందనగా, ప్రభుత్వం భవిష్యత్తులో పరియాలు మరియు అనుబంధ తరగతులను పంచమ బంధం లేదా పంచములుగా పేర్కొనడంలో ఎటువంటి అభ్యంతరం లేదని తీర్మానించింది, అయితే వారిని “ఐదవ తరగతిగా పిలవడం మరింత సులభమైనదని తీర్మానించింది. 1891 మరియు 1901 జనగణన నివేదికల్లో పంచమను బలిజ మరియు బనజిగ ఉపవిభాగం కింద నమోదు చేశారని మిసెస్ కోర్ట్‌రైట్ వ్రాసారని థర్స్టన్ పేర్కొన్నాడు (110). ఇలా బ్రిటిష్ వారి పాలనా సౌలభ్యంకోసం పంచమవర్ణం, పంచములు, ఐదవ జాతి వర్గీకరించబడి వ్యవస్థీకృతం చేయబడ్డది.

పై వివరాలు ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేస్తున్నాయి. ఒకవేళ హిందూసమాజంలో అతి కొన్ని ప్రాంతాలలో కొన్ని జాతులు పంచములుగా పిలువబడటం వలన (బుకానన్ చెప్పినవిధంగా) వారిని పంచములుగా వర్గీకరించినట్లైతే, వారిలో వేరే ప్రాంతాలకు చెందిన మరికొన్ని జాతులను ఎలా చేర్చగలిగారు? అలా చేర్చడం హిందూశాస్త్రాల ఆధారంగా జరగలేదు సరికదా బ్రిటిష్ పాలకుల అవసరార్థమే జరిగిందని పాశ్చాత్యులే స్వయంగా చెబుతున్నా కూడా హిందువులు, హిందూత్వవాదులు దీనిని గమనించకపోవడం దురదృష్టకరం!

పై వివరాలు పంచములు అనే అధికారిక వర్గీకరణకు చెందిన వాస్తవాన్ని చూపుతాయి కాని, అవి భారతీయ వ్యవస్థలోని పంచమ అన్న పేరుకు ఉన్న అర్థాన్ని, వాటి కారణాలను వివరించడం లేదు.

పంచమ బనజిగారు-వీరశైవం:

పాశ్చాత్యులు పంచమ, పంచమ బంధం, పంచమ బనజిగారు మొదలైన పేర్లను పంచములతో అనుసంధానించారు. కానీ ముందు గమనించిన విధంగా పంచమ బనజిగారు అనే వర్గం లేక వర్గీకరణ వీరశైవానికి చెందినదనే వివరాలు వివిధ సెన్సస్ లలో లభిస్తాయి. ఉదాహరణకు, 1901 మైసూర్ సెన్సస్ రిపోర్టు పంచమ బనజిగారు అనే కులం వీరశైవానికి చెందిందని. వీరు ఐదుమంది ఋషుల నుండీ ఉద్భవించారు కాబట్టి, వీరికి ఐదు గోత్రాలుంటాయని చెప్పింది. రేణుక అనే ఋషి నుండీ మకర పంచములు, దారుక అనే ఋషి నుండీ కలారి పంచములు, ఘంటకరణ అనే ఋషి నుండీ కమరి పంచములు, గజకర్ణ అనే ఋషి నుండీ పురారి పంచములు, విశ్వకర్మ అనే ఋషి నుండీ భవరి పంచములు పుట్టినట్లుగా చెబుతూ, ఈ ఋషుల నుండీ ఉద్భవించిన వారందరినీ పంచములుగా పిలుస్తారని ఈ సెన్సస్ చెప్పింది. ఇక్కడ పంచమ అనే పదం వర్ణాన్ని, ఆశ్రమాన్ని కాదు కొందరు ఋషుల నుండీ ఉద్భవించిన గోత్ర సంప్రదాయాన్ని సూచిస్తున్నదని స్పష్టమవుతున్నది. (‘The descendants of the five Gotrakartas are commonly known as the Panchamas’) (111).

ఇందులోని మరో విశేషమేమిటంటే వీరశైవం తనను తాను అత్యాశ్రమానికి చెందినదిగా చెప్పుకుంటుంది. అత్యాశ్రమం గురించి దోర్బల విశ్వనాథ శర్మగారు ఇలా వ్రాశారు, “శాక్తశైవ గ్రంథములలో సంన్యాసమునకు కూడ పై మెట్టు అని చెప్పదగిన ‘అవధూత’ స్థితి యొకటి చెప్పబడినది. వారికి విధినిషేధములు పాపపుణ్యములు లేవు. వారిని అత్యాశ్రములందురు. బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మానుష్టానానంతరము గుర్వనుగ్రహముచే నీ స్థితి లభించును. వారి యెడ ‘అనాశ్రమీ న తిష్టేత’ అను శాస్త్రవచనము చెల్లదు. వారు బాలురవలె అనాశ్రములు కారు. ఆశ్రమ ధర్మానుష్టాన పుణ్యము పండించుకొని అత్యాశ్రమ స్థితి నందిన వారు వారు. వారు పరమ శివానుగ్రహదృష్టిపాత పాత్రులు కావున వైదిక విధి నిషేధములు వారి యెడల చెల్లవు. అహంకారరహితులు కావున వారి కర్మలు పుణ్యపాపముల కలిగింపలేవు. పాపమున్నచో నరకాది భోగము, పుణ్యమున్నచో స్వర్గాది భోగము తప్పదు. అది యెఱిగి విరక్తులెన ఆ అవధూతలు ప్రారబ్ధశేషము ననుభవించుచు తదనుకూల కర్మలు చేయుదురు. వారు ఆ కర్మలు చేసినట్లు కనబడు జీవన్ముక్తులు. ‘నిస్త్రైగుణ్యే పథి విహ(చ)రతాం కో విధిః కో నిషేధః అను సూక్తి ననుసరించి వారికి విధి నిషేధములు పుణ్యపాపములు కలిగింపవు. పుణ్యపాప విహీనత అనగా ఇట్టిది. కృత్యాకృత్యవిహీనత అనగా ఇట్టిది.” (112). అత్యాశ్రమం సంన్యాసానికి చెందినదని కొందరు భావించే అవకాశముంది. ఆచార్య నిర్మల శంకరశాస్త్రిగారు అత్యాశ్రమ పదం సన్న్యాసపదము కాదని అది పాశుపతవ్రతాన్ని సూచిస్తుందని ఒక గ్రంథంలో వ్రాసారు (113). వీరశైవుల అత్యాశ్రమం పాశుపతవ్రతానికి చెందినదని ముదిగొండ కోటయ్య శాస్త్రి గారు కూడా వివరించారు (114). ఈ విధంగా శైవంలో వర్ణాశ్రమ ధర్మాలను దాటిన అత్యాశ్రమం ఉన్నది.

ఈ అత్యాశ్రమం చాతుర్వర్ణాలకు, చతురాశ్రమాలకు అతీతమైనందువలన వీరు పంచములుగా, పంచమ బంధంగా పరిగణించబడి ఉండవచ్చు, లేదా ముందు గమనించిన విధంగా అది పంచమ గోత్రపరంపరను సూచిస్తూ కూడా ఉండవచ్చు. అయితే దీనికి ఏకరీతితో నిండిన అంటరానితనానికి, బహిష్కృత/వెలివేయబడడానికి ఏ సంబంధమూ లేదు. వీరశైవులలో అనేక శక్తివంతమైన జాతులున్నాయి. వీరందరూ అత్యాశ్రమీయులుగానే పరిగణింపబడుతారు. అందువల్ల అత్యాశ్రమీయులలో కొన్ని జాతులు పంచములుగా వర్గీకరించబడడానికి వారు ఊరిబయట ఉండటానికి, మిగతా ప్రజలు పరస్పర దూరాన్ని పాటించడానికి గల కారణాలు వేరని ఇంతవరకూ మనం గమనించిన విషయాలు తెలియజేస్తున్నాయి.

వైదికశాస్త్రాల ప్రకారం జ్ఞానాన్ని పొందిన వ్యక్తి వర్ణ-జాతి ధర్మాలకు అతీతమవుతాడు. మానవుడికి ఉండే అష్టపాశాలలో జాతి కూడా ఒకటి అని తంత్రశాస్త్రం చెబుతుంది. వ్యక్తులు జ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే వారికే వర్ణమూ-జాతి ఉండదు. అదేవిధంగా సన్యాసాన్ని తీసుకున్న వ్యక్తి సమాజానికి దూరంగా ఉండాలనే నియమం ఉంది. అవి నివృత్తికి మార్గానికి చెప్పబడిన పద్ధతులు. ఇలాంటి పద్దతులను సమాజబహిష్కరణగా, వెలివేయబడటంగా చూడకూడదు.

పంచముల తంత్ర సాధన:

పంచముల ఆచారాల గురించి కూడా పాశ్చాత్యుల గ్రంథాలలో కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభిస్తాయి. ఫ్రాన్సిస్ బుకానన్ మలబార్ ప్రాంతంలో ఉన్న తీయన్ (తీయ్య) లేదా షనర్ అనే కులాన్నికూడా పంచమ అనే పేరుతో పిలిచాడు. పైగా ఈ కులం తమ జాతి పట్ల గర్వ భావంతో ఉండేవారని తెలిపాడు (115). వీరు కూడా ఆ తరువాత కాలంలో పంచములుగా పిలువబడ్డారు. ఈ జాతిలో ఒక ఉపకులంపై బిషప్ కాల్డ్వెల్ పరిశోధన చేశాడు. 1849లో బిషప్ కాల్డ్వెల్ తిరునల్వేలి అనే జిల్లాలో ఉన్న షనర్ అనే కల్లుగీత కార్మికుల ఆచారాలపై, ఆలయాలపై, వారు పూజించే కాళికాదేవిపై ఒక పుస్తకాన్ని వ్రాసాడు. ఈ కులం వారు దెయ్యాల పూజలు (Demonolatry) చేస్తారని తీర్మానించాడు. వీరు బ్రాహ్మణులకన్నా భిన్నమైన ఆచారాలను, పూజాపద్దతులను, ఆలయాలను కలిగి, దెయ్యాలపూజలను చేసేవారు కాబట్టి వీరు ద్రావిడ మతానికి చెందినవారని బిషప్ కాల్డ్వెల్ నిర్ధారించాడు. ఫ్రాన్సిస్ బుకానన్ కూడా షనర్లు, తీయర్ అనేవి రెండూ ఒకే జాతి అని వ్యాఖ్యానించాడు. 1871 మద్రాస్ సెన్సస్ రిపోర్ట్ తియర్ జాతి షనర్ జాతిలో అంతర్భాగమై ఉందని చెబుతూ, కేరళలో వీరు ఇతర కులాలకు 16 అడుగుల దూరంలో (unapproachability) ఉండాలనే నియమం ఉందని పేర్కొన్నది(116). కేరళలో ‘కావు తీండల్’ కులాలు ఉండేవి. తీయన్ జాతి ఆ కులాలలో ఒకరు. ఈ కులాలు గ్రామదేవతలను (కాళీ-భగవతి అమ్మన్) పూజించేవారు (117).

ఎక్కడెక్కడ అంటరానితనం, ఊరిబయట ఉండటం అనే అంశాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయో, అక్కడ ఎక్కువగా శక్తి పూజలు, వామాచార సాధన, బలులు, క్షుద్రవిద్యలు, అంటురోగాలు, వ్యాధులపరమైన జాగ్రత్తలు మొదలైనవి కనిపిస్తాయి. ఉదాహరణకు, షనర్ కులం, తియన్ అన్నవి ఒకేజాతిలోని ఉపకులాలు. తియన్ అనే కులం వామాచార శక్తి పూజలు చేసేవారని ఎడ్గర్ థర్స్టన్ గ్రంథం సూచిస్తుంది (118). అదే విధంగా సెక్కిలియర్ అనే కులానికి చెందినవారు కూడా శక్తి పూజలలో పాల్గొంటారని పాశ్చాత్యుల గ్రంథాలలో ఉంది (119).

ముఖ్యంగా కాల్డ్వెల్, షనర్లు అనబడే తమిళ కల్లుగీత కార్మికులను తమిళ -సంస్కృత భాషల ఆధారంగా వేరుచేయడానికి ప్రయత్నించాడు. కానీ 1823 నాటికి మలబార్ లో ఆ షనర్ జాతిలో భాగమైన తియర్ అనే జాతివారు సంస్కృత పాఠశాలలను నడుపుతూ, నాయర్ ఇత్యాది జాతులకు సంస్కృతాన్ని బోధించడాన్ని మిషనరీలే చూసి, అప్పటి తమ గ్రంథాలలో వ్రాసారు. ఇందులోని ముఖ్యవిషయమేమిటంటే పంచములుగా పరిగణించబడినవారు పాఠశాలలను నడుపుతూ సంస్కృతంలో ఇతరులకు విద్యను బోధించడం. ఇలా చూస్తే పంచములలో సంస్కృతపండితులు ఉండటమే కాదు, వారివద్ద ఉన్నతకులాలు కూడా సంస్కృతవిద్యను నేర్చుకునేవారని మిషనరీలే చెప్పారు!

తంత్రాలలో ప్రధానంగా కేరళ, గౌడీయ (బెంగాల్), కాశ్మీర అనే మూడు సాంప్రదాయాలున్నాయి (120). వివిధ ఆగమాల లేదా తంత్రాల వర్గాలను ఆమ్నాయమనే పేరుతో కూడా పిలుస్తారు. ఆగమ మరియు తాంత్రిక గ్రంథాలలో ఆమ్నాయ విభజన తరచూ గోచరిస్తుంది. తాంత్రిక పద్ధతులు నాలుగు దిక్కులకు చెందిన నాలుగు ఆమ్నాయాలుగా కూడా విభజించబడ్డాయి, కేరళ, కాశ్మీర, గౌడ, విలాస అనే నాలుగు సంప్రదాయాలు నాలుగు ఆమ్నాయాలకు చెందినవని (121), శక్తిసంగమ తంత్రంలో పేర్కొనబడిన వామాచారపద్దతులలో కేరళ పద్దతి కూడా ఉందని కొన్ని గ్రంథాలలో ఉంది (122). ఇలా తంత్రశాస్త్రంలో కేరళకు చెందిన తంత్ర సాంప్రదాయం బాగా పేరుగడించింది.

పై వివరాల ఆధారంగా శక్తిపూజలను, తాంత్రిక సాధనను చేసే జాతులను పంచములుగా బుకానన్ పిలిచి ఉండవచ్చని ఊహించవచ్చు. ఈ కులాలవారే ఆ తరువాతి కాలంలో పాశ్చాత్యుల ద్వారా ద్రవిడియన్లుగా కూడా పిలువబడ్డారు.

(ఇంకా ఉంది)

Footnotes:

  1. V.S.Agarwala-Geographical Data in Panini-The Indian Historical Quarterly-March1953-Vol XXIX-p1-34
  2. విష్ణుభొట్ల సూర్యనారాయణ -1951-శ్రీ కృష్ణదేవరాయలచరిత్రము-p208
  3. మామిడిపూడి వేంకటరంగయ్య-1974-భారత స్వాతంత్రోద్యమ చరిత్ర మొదటి భాగము (కంపెనీ కాలము నాటి పరిణామాలు)- p 100,101
  4. John Muir-1890-3rd ed-Original Sanskrit Texts on the Origin and History of the People of India, Their Religion and Institutions-p176-181. ‘We cannot therefore regard the use of the term ” five races” as affording any evidence of the existence of a rigidly defined caste-system at the period when it was in frequent use. The frequent reference to such a division, which fell into disuse in later times, rather proves the contrary. The caste-system was always a quadruple, not a quintuple, one ; and although the ^Nishadas are added by Aupamanyava as a fifth division of the population, this class was esteemed too degraded to allow us to suppose that they could ever have formed part of a universally recognized five-fold division, of which all the parts appear to be regarded as standing on an equal, or nearly equal, footing.’
  5. Report on the Census of the Madras Presidency 1871-W.R.Cornish-p116,117 ‘In no work on tho subject of caste has any attempt been made to reduce into order and classification the almost innumerable subdivisions which still go on extending amongst the people. The Committee of the Madras Town Census, aided by some native gentlemen, proposed in 1869 a system of classification, which, it was hoped, would enable the Government to obtain important information in regard to the great divisions of the people. The system proposed by the committee has been adopted both for the town census and for the Imperial census…. The committee accepted, without question, the divisions of the Hindu community into (1) Brahmans, (2) Kshatriyas, (3) Vaisyas, (4) Sudras, and (5)Out-castes.’
  6. H.V.Nanjundayya and L.K.AnanthaKrishna Iyer-1931-Mysore Tribes and Castes-Vol4-p125, Julius Richter-1908-History of Missions in India-p230, Rev John Craig-1908-Forty Years Among the Telugus-p1& Emma Rauschenbusch Clough-1899-While Sewing Sandals: or, Tales of a Telugu Pariah Tribe-p305 A missionary Emma Rauschenbusch Clough in 1899 says, “With a true sense of what it owes to the despised class among its subjects, the Government of India has recently decided upon the name Panchamas “fifth caste,” as a just and honourable designation for the tribes which have never found a place in the Hindu caste- system.” Valentine Chirol-The Depressed Classes of India- An Enqyiry into their conditions and suggestions for their uplift-1912,1977(Reprint)-66-The “Depressed Classes” of whom we generally speak as Pariahs, though the name properly belongs only to one particular caste, the Pariahs in Southern India, include all Hindus who do not belong to the four highest or “clean” castes of Hinduism, and they are therefore now officially and euphemistically designated as the Panchamas-i. e., the fifth caste. G. Hibbert-Ware-1912-Christian Missions In The Telugu Country-p80 The Malas are one of the two classes of out-castes (the Madigas being the other) in the Telugu country. They are sometimes called Pariahs, because they correspond to that class in the Tamil country. A name which is often used to embrace both the classes of out-castes is ‘Panchamas.’ This word is of British invention, and signifies the fifth caste, in reference to the traditional Hindu classification of four castes. It was designed to spare their feelings, the names in common use having generally an opprobrious meaning.
  7. Simon Charsley-1996-Untouchable’: What is in a Name?-p 5 & Census of the Town of Madras- W.R. Cornish-1871, 1873-p79-80, W.R. Cornish -On the Census of the Madras Presidency 1871-p 80,117
  8. Edgar Thurston-1909-Castes and Tribes Of Southern India- Vol 6-p43-44. ‘Panchama-The Panchamas are, in the Madras Census Report, 1871, summed up as being “that great division of the people, spoken of by themselves as the fifth caste, and described by Buchanan and other writers as the Pancham Bandam.” According to Buchanan, “the Pancham Bandum “ consist of four tribes, the Parriar, the Baluan, the Shekliar, and the Toti.” Buchanan further makes mention of Panchama Banijigaru and Panchama Cumbharu (potters). The Panchamas were, in the Department of Public Instruction, called “Paraiyas and kindred classes” till 1893. This classi- fication was replaced, for convenience of reference, by Panchama, which included Chacchadis, Godaris, Pulayas, Holeyas, Madigas, Malas, Pallans, Paraiyans, Totis, and Valluvans. “ It is,” the Director of Public Instruction wrote in 1902, “for Government to consider whether the various classes concerned should, for the sake of brevity, be described by one simple name. The terms Paraiya, low caste, outcaste, carry with them a derogatory meaning, and are unsuitable. The expression Pancham Banda, or more briefly Panchama, seems more appropriate.” The Government ruled that there is no objection to the proposal that Paraiyas and kindred classes should be designated Panchama Bandham or Panchama in future, but it would be simpler to style them the fifth class.’
  9. T. Ananda Row-Census of India 1901 Vol.24 (Mysore)- Part1 (report)- p535. ‘These are the Panchamas or Panchama Banajigaroo, who are the descendants of the five original sages or the Gotrakartas. Members of these classes are always priests to all the other castes of the whole religion. They are never the disciples of others. For example, about 15 or 16 years ago, a religious dispute arose among the different castes of Lingayets of the Dharwar District on the question whether the people of some sub-divisions of the Veerasaiva religion known as Sadas and Nonobas were entitled to assume priesthood and to exercise the rights and privileges attached to that status among the Veerasaivas. There was a large meeting at Hanagal of about 15,000 Lingayets. The Panchayetdars (arbitrators) were composed of Smartha Brahmins, who were specially selected to secure impartiality as the dispute was among the Veerasaivas themselves. The Panchayetdars referred the question with the necessary authorities to the Sri Sringeri Swami who decided that the Veerasaiva religion had been established by the great ancestors of the five Simhasanadhipathies of Balehalli, Ujjain, Kasi, Sri Saila and Himavathkethara, that the regular descendants of these sages alone are entitled to the priesthood, that the right of assuming priesthood and of performing theDeekshasamskara vested in tile Panchamas who are the lineal descendants of the original sages above named, that there are three broad sub-divisions among the Veerasaivas, namely Samanya, Visesha and Nirabhari, that of these, the Visesha Veerasaivas alone are entitled to the priesthood and to perform the Deekshasamskara, and that the Samanya Veerasaivas are not entitled to the said right* or privileges.’
  10. దోర్బల విశ్వనాథ శర్మ-1998,2015-శ్రీః పరశమ్భు మహిమ్నః స్తోత్రమ్ మహర్షిదుర్వాసోవిరచితమ్-శివప్రియా వ్యాఖ్యానము-p 55
  11. ఆచార్య-శివ శ్రీ. నిర్మల శంకరశాస్త్రి-ఆరాధ్యులు-1998-బ్రహ్మపథము-p 177. “అత్యాశ్రమస్థః సకలేంద్రియాణి” ఇత్యాదిని-సన్న్యాసము విద్యాంగముగా విధింపబడుచున్నదని భావింపరాదు. అత్యాశ్రమపదము సన్న్యాసవాచకము కానిదై పాశుపతవ్రతమును చెప్పునది. ఎట్లనగా- “వ్రతమేతచ్చాంభవం తత్సమాచ రేన్ముముక్షు రపునర్చ వాయ” అనుచో ముక్తి సాధనముగా నిరూపింపంబడిన పాశుపత.(శాంభవ) వ్రతమును ముక్తి సాధన ప్రకరణమున జెప్పబడిన అత్యాశ్రమపదము- నిర్వచించును గాన “అత్యాశ్రమిభ్యః పరమం పవిత్రమ్” “అత్యాశ్రమీ సర్వదా సకృద్వా జపేత్” ఇత్యాది శ్రుతులు “అత్యాశ్రమమనబడు పాశుపతవ్రతము-బ్రహ్మవిద్యాంగమని విశద పఱచుచున్నవి.” . ‘…. అత్యాశ్రమ పదము-సన్న్యాస పదము కాదని విదితమైనది.’
  12. శ్రీ ముదిగొండ కోటయ్య శాస్త్రి గారు-1942-శైవ సర్వస్వము-p 113. ‘శైవమార్గ ప్రవర్తనకు నాయాగుణ సంబంధములననుసరించి చరుడు (భక్తుడు) అత్యాశ్రమి జంగముడు శివయోగి లింగాంగసంగి మాహేశ్వరుడు వీరశైవుడునను నామములు సహజములైయున్నవి. శ్రీకరభాష్యమందలి జిజ్ఞాసాధికరణమున ‘బ్రహ్మచారీ గృహస్థో వావాన ప్రస్థోయతిస్తు వాయస్తు లింగాంగసంయుక్త స్స ఏవాత్యాశ్రమీభవేత్’ బ్రహ్మచారిగాని, గృహస్థుడుగాని, వానప్రస్థుడు గాని యతిగాని లింగాంగసంయుక్తుడత్యాశ్రమీయుడగుచున్నాడని లింగధారిపదమునకు బర్యాయ పదముగ అత్యాశ్రమీశబ్దము నిశ్చయింపబడినది. మరియు లింగధారణ చంద్రికయందు ‘లింగం శివోభవేక్షేత్రమంగం సంయోగ ఆశ్రయః తస్మాత్ లింగా సంయుక్తోయోపి సోత్యాశ్రమీభవేత్’ యనువచనము లింగధారణ యత్యాశ్రమియేయని వచింపుచున్నది.’
  13. Francis Buchanan-1807-A Journey from Madras through the countries of Mysore, Canara, and Malabar-Vol2-p415. ‘The Shanar, who in the dialect of Malayala are properly called Tiar, are in Malabar a very numerous tribe, and a stout, handsome, industrious race. They do not pretend to be of Sudra origin, and acknowledge themselves to be of the impure race called Panchamas; but still they retain all the pride of cast; and a Tiati, or female of this cast, although reduced to prostitution, has been known to refuse going in to a gentleman’s palanquin, because the bearers were Mucuar, or fishermen, a still lower class of people.’
  14. Report on the Census of the Madras Presidency-1871-p 350 & Proceedings of the Church Missionary Society for Africa and the East-(1823-1824)-Appendix-Vi-p235-236 & Francis Buchanan-1807-A Journey from Madras through the countries of Mysore, Canara, and Malabar-Vol2-p415. A missionary wrote about Malabar castes and said, “….The Tiers are regarded as the servile class. The occupation of the Nairs and Tiers is that of farmers; the Tiers being either labourers or renters of land, and the Nairs generally the landlords.” …….”About 15 years ago, however, three brothers, Tiers, having by some means made themselves masters of Sanscrit, established two schools in the neighbourhood of Tellicherry, offering to give instruction to all indiscriminately. This, as it may be supposed, gave great offense to the privileged class; inasmuch as they themselves had bo business with that knowledge which they offered to communicate to others.They, nevertheless, preserved; and, as their prerensions bore the test of examination, their Schools were not only filled with Tiers, but many Nair Youths also condescended to become their pupils. The two schools together generally averaged about 200. They were supported by monthly payments, of from one to five fanams (Tellicherry, of which there are give to a rupee) from each pupil, according to his pecuniary ability; besides a quarterly present, of from one to five or more rupees each, at the four sacred festivals in the year. From these Schools, 12 other Schoolmasters have issued; who, in various places within a distance of about 20 miles from Tellicherry, have in their turn, set up Schools:but how many Scholars they average has not been ascertained. Of these Schoolmasters, two are Nairs, the rest Tiers. It is but a short time since, that two out of the three original School masters departed this life, within a month of each other; and such was the respect and gratitude with which they were regarded by their pupils, that they assembled to the number of 400 to assist at the funeral obesquies; and after having, according to the custom, distributed rice to all comers, there remained of their voluntary offerings over and above what was required for the occasion.” “Shanars number 534,602 and are chiefly formed of the three classes marginally noted, and who are peculiar to Malabar. The Tiers are not even allowed the rank of Sudras, no can they approach within 16feet of their superiors in caste. Many Tiers are in the public service, or trade, or cultivate the land. Most of the servants employed by the Europeans are drawn from this class.”. ‘The Shanar, who in the dialect of Malayala are properly called Tiar, are in Malabar a very numerous tribe, and a stout, handsome, industrious race.
  15. L.K. Anantha Krishna Iyer-1912,1989-The Cochin tribes and castes vol 2-83. The temples of the Nayars in which are enshrined these village deities or Grama devata are far less imposing than those of the Brahmans and are callad hams. The deities commonly represented are the consort of Siva or some manifestation of that female divinity, and Ayyappan or Sasta; and these are supposed to keep in subjection the demons and spirits which are ever prone to do harm to the people of the village.
  16. Edgar Thurston, K. Rangachari-1909-Castes and Tribes of Southern India-Vol7-p 100-103
  17. Edgar Thurston, K. Rangachari-1909-Castes and Tribes of Southern India-Vol2-p 2,3 & Indische Palaeographie-Buhler G-p79,80 & The Chamars- GEO. W. Briggs-p 31 & Census of India, 1891, Volume 13- H.A.Stuart-p302 &The Mysore Tribes And Castes Vol.4- L. K. Ananthakrishna Iyer-p131 & Emma Rauschenbusch-Clough-1899- While sewing sandals : or, Tales of a Telugu pariah tribe-p102-105. Edgar Thurston; ‘Their women are considered to be very beautiful, and it is a woman of this caste who is generally selected for the coarser form of Sakti worship. They indulge very freely in intoxicating liquors, and will eat any flesh, including beef, pork, etc. Hence they are called, par excellence, the flesh-eaters (Sanskrit shatkuli)’, ‘The Chucklers or cobblers, the Abbé Dubois writes, “are considered inferiors to the Pariahs all over the peninsula. They are more addicted to drunkenness and debauchery.’
  18. మామిడిపూడి వేంకటరంగయ్య(సం.)-1964-ఆంధ్ర విజ్ఞాన కోశము (నాల్గవ సంపుటము)- p 412 & శ్రీవాసిరెడ్డి పార్థసారధి-తంత్రశాస్త్రరహస్యాలు- భారతి సాహిత్య మాసపత్రిక-డిసెంబరు 1959- p 84 ‘తంత్రశాస్త్రములు దేశాచారముల ననుసరించి అనేక రూపాలుగా ఉన్నవి. ఈ సంప్రదాయములుగల రాష్ట్రములను క్రాంతములంటారు. వింధ్యకు ఉత్తరాన ఉన్న భూమిని రధక్రాంతమంటారు. ఇక్కడ కాశ్మీర సంప్రదాయం ఉంది. తూర్పున ఉన్న దేశమును విష్ణుక్రాంతమంటారు. ఇక్కగా గౌడ (వంగ)సంప్రదాయం వుంది. దక్షిణదేశమును అశ్వక్రాంతం అంటారు. ఇక్కడ కేరళ సంప్రదాయం ఉంది.’
  19. Studies in the Tantras-1- P.C.Bagchi p 98-99 & L.K. Anantha Krishna Iyer-1912,1989-The Cochin tribes and castes vol 2-80-81. The Cochin State, as well as Malabar and Travancore, is the land of magic, sorcery, and witchcraft, and as well as belief in animism, and all these are largely mixed up with the religion of the Nayars. Animism refers to the belief that man passes through life surrounded by a ghastly company of powers, elements, and tendencies, impersonal in character, mere shapeless phantoms of which no image can be made and no idea can be formed. Most of these have departments or spheres of influence of their own – one presides over cholera, another over small-pox, yet another over cattle disease, some dwell in rocks, others haunt trees, and others again haunt rivers, whirlpools and waterfalls. All of them require to be diligently propitiated by reason of the ills and calamities which they bring about, and the essence of these practices is magic. ……Animistic again is the worship of Kali or Bhagavati who presides over small-pox, cholera, and the thousand maladies that flesh is heir to, the worship of animals and plants and lastly the belief in exorcism and witchcraft in which Brahmans also share.
  20. Sarbeswar Satpathy-1982 2nd ed-Dasa Maha Vidya & Tantra Sastra-p 53. The ‘Merutantra’ describes five types of Vamachara known as Sabara, Siddhanta, China, Vama and Kaulika, The Sakti-Sangama-Tantra states that this system was in vogue among the worshippers of Ganesh, Rudra, Visnu, Siva, Svayambhu, Veda, Bhairav, Kshetrapala, Cina, Kapalika. Pasupati, Bauddha, Kerala, Vira-Vaisnab, Sambhav, Chandra and Aghora.
Exit mobile version