Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి-7

[‘ఆంగ్లేయులు సృష్టించిన పంచమజాతి’ – వ్యాస పరంపరని అందిస్తున్నారు శ్రీ మైలవరపు సుధా మోహన్.]

పంచమ, మిశ్రిత/సంకీర్ణ, అస్పృశ్య ప్రజలు – శాస్త్ర దృష్టి:

బ్రిటిష్ వారు పంచమవర్ణం ఏర్పాటు చేసిన వైనాన్ని చూసాం. పంచమ వర్ణాన్ని బ్రిటిష్ వారు సృష్టించడానికి చూపించిన కారణాలు వేరు, దానిని వైదిక పండితులు సమన్వయం చేయడానికి చూపించిన ఆధారాలు వేరు. ఎప్పుడైతే పంచమ అనే వర్గం ప్రాచుర్యంలోకి వచ్చి సమాజంలో గందరగోళాన్ని సృష్టించడం మొదలుపెట్టినపుడు, వైదిక పండితులలో దాని గురించిన చర్చ మొదలైంది. బ్రిటిష్ వారి చర్చ పూర్తిగా పాశ్చాత్యుల, మిషనరీల, బ్రిటిష్ అధికారుల రచనలపై, అభిప్రాయాలపై ఆధారపడి సాగింది.

పాశ్చాత్యులు ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని బలపరచడంకోసం వేదాలలోని పదాలను వక్రంగా ఉపయోగించడంతో వైదిక పండితుల చర్చ పూర్తిగా స్మృతులు, వేదాల మీద ఆధారపడ్డది. ఈ పరిణామాల నేపధ్యంలో పంచముల వర్గీకరణ గురించిన చర్చను రెండు కోణాలలో చూడాలి. ఇందులో మొదటిది పంచమ అనే వర్గీకరణను ప్రాచుర్యంలోకి తేవడానికి బ్రిటిష్ వారు చూపిన కారణాలు, సమాజంలో ఈ వర్గీకరణ కల్లోలం రేపినప్పుడు పండితులు దీనిగురించి చేసిన చర్చ. ఇందులో మొదటి అంశాన్ని ఇంతకు ముందే గమనించాం. ఇక రెండోది ఈ భాగంలో చూద్దాం.

పాశ్చాత్యులు ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని హిందువుల మీద రుద్దడానికి వేదాలలోని పలు శబ్దాలను వక్రీకరించి ఉపయోగించారు. అలాంటి వాటిలో దస్యు అనే పదం ఒకటి. ద్రావిడ సిద్ధాంతాన్ని నిలిపేందుకు కొన్ని జాతులను దస్యులుగా చిత్రించారు. (దస్యు అనే పదం దుష్ట లేక ఆసురీ ప్రవృత్తిగలిగినవారిని సూచిస్తుందని, వీరు ఈశ్వరీయ విషయములను పాటించనివారని, సమాజాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవారని సూచించే వివరాలు మహర్షి దయానంద సరస్వతి గారు వ్రాసిన గ్రంథంలో ఉన్నాయి. 149) అయితే ఈ దస్యులు, ఆర్యుడైన విశ్వామిత్ర మహర్షి పుత్రులు! దస్యుల గురించి అంబేద్కర్ గారు ఇలా వ్యాఖ్యానించారు, “దాస, దస్యులు, శూద్రులు ఒకటేననడం కేవలం ఊహమాత్రమే. భయంకరమైన ఊహ.”…. దస్యులు, దాసులు ఆదిమ ప్రజలు కారని కూడా ఆయన నిర్ధారించారు (150).

పంచములు వేదాలలో చెప్పబడిన పంచజనులనే వాదన కూడా గతంలో జరిగింది. వేదాలలో “పంచక్షితీనాం – పంచకృష్టీః – పంచజన్యాసు కృష్టిషు-జనేషు పంచసు – పంచమానుషాన్ – పంచజనాన్ – పంచజనాః – పాంచజన్యయా విశా” – మొదలైన పదాలు ఉన్నాయి (151).  ఇందులో నిషాదులు పంచములుగా వర్ణించబడ్డారని కొన్ని గ్రంథాలలో ఉంది. అయితే ఈ పదాలకు పలువురు పలు విధాలైన అర్థాలను చెప్పారు.

జాన్ ముయిర్, పంచజనులను, పూజారులుగా, యజ్ఞంలో పాల్గొనే వారిగా సాయనాచార్యులవారు వర్ణించాడని వ్రాశాడు. ఇతను వివిధ ఆధారాలను చూపుతూ పంచములను ఐదో వర్ణంగా అంగీకరించలేదు (152).  అంబేద్కర్ గారి అభిప్రాయంలో ఈ ఐదు వర్గాలూ ఆర్యులే. అంటే బ్రాహ్మణులు ఏ జాతికి చెందుతారో, శూద్రులు, పంచములు కూడా అదే జాతికి చెందుతారు! (153)  పంచజనులు పంచములని భావిస్తే, జాన్ ముయిర్, అంబేద్కర్ లు చూపిన ఆధారాలను బట్టి వారు ఆర్యులు, పూజారులు, యజ్ఞాలు చేసేవారవుతారు.

శ్రీ మల్లాది సూర్యనారాయణశాస్త్రిగారి గ్రంథంలో సాయణాచార్యులిచ్చిన మరొక భాష్యం ఉంది. దాని ప్రకారం పంచజన మొదలైన పదాలు స్వభావాన్ని సూచిస్తున్నాయి (154).

కానీ కొందరు ముఖ్యమైన పండితుల రచనలలో పంచజన అనే పదం ఆర్యవాచకంగా, నిషాదవర్ణం మాత్రమే పంచమవర్ణంగా పేర్కొనబడ్డది. ఉదాహరణకు, కోటవెంకటాచలం గారు పంచజన, పంచక్షితి ఇత్యాది పదాలకు అయిదు వర్ణాలని, ఐదవది సంకీర్ణవర్ణమని చెప్పారు (155).  కోట వేంకటాచలం గారు తన గ్రంథంలో ఈ అంశం గురించి ఎక్కువగా వివరించలేదు.

ఈ అంశంపై ముఖ్యమైన, లోతైన చర్చ 1920 వ దశకంలో ‘అస్పృశ్యత’ గురించి శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి చయనులు గారు, శ్రీ కావ్యకంఠ గణపతి ముని గార్ల మధ్య జరిగింది. వీరు ‘పంచమ’ అనే అంశాన్ని తమతమ ప్రసంగాలలో చర్చించారు. ఈ మహాపండితులిద్దరూ “పంచమ” అనే వర్గీకరణను వేదకాలం నుంచే ఉన్న స్పష్టమైన, స్వతంత్ర జాతిగా అంగీకరించలేదు. గణపతి ముని గారి అభిప్రాయంలో ఇవి జాతి వాచకాలే. (‘శూద్రులు ఇరుతెగలుగానున్నారు. వారిలో ఇప్పుడు వ్యవహారములో నున్న శూద్రులు నిరవసితులు పంచములు, నిరవసిత శూద్రులు ఈ విధముగా అయిదు స్వతంత్రజాతులున్నట్లు ఋగ్వేదంలో పంచజనపంచక్షితి పంచచర్షణీ శబ్దములచే స్పష్టముగా తెలియుచున్నది. క్షితి చర్షణీ శబ్దములు మనుష్యవాచకములు.’) (156) నిరవసిత శూద్రులంటే బహిష్కృతులు/వెలివేయబడినవారు కారు. (“నిరవసితులన పాత్రమునుండి బహిష్కృతులు, ఎవరిచే భుజింపబడినపాత్రము స్మృతులందు విధింపబడు సంస్కారముచేనైన శుద్ధిగలది కాదో యట్టివారు పాత్రబహిష్కృతులనబడుదురు.) (157). వారి పాత్రలను మాత్రం ఉపయోగించకూడదని అర్థం. ఆయా జాతుల ఆచారాలను, వ్యవహారాలను, లోకాచారాలను (చరిత్ర- అర్థశాస్త్రం) పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే ఈ నియమాలు పూర్తిగా అర్థమవుతాయి.

కావ్య కంఠగణపతి ముని గారు తన ప్రసంగంలో ‘చండాల, చాండాల’ అనే పదాల మధ్య భేదాన్ని వివరించారు. ఈయన అభిప్రాయంలో పంచములు నాలుగు వర్ణాలలోకే వస్తారు (158).  (‘एवं पञ्चजनाश्चतुर्षु वर्णेष्वन्तर्भवन्ति चत्वारश्च वर्णाः स्युर्धर्माधिकारिणा इत्युक्तं भवति I’) (159). పంచములు అంటే నిరవసితశూద్రులు, వీరు అస్పృశ్యులు కారు. (160).

మల్లాది వారు చండాలులు సంకీర్ణులు అని చెబుతూ వ్యవహారం కోసం చండాలులను ఐదవ వర్గంలో చేర్చితే తప్పులేదని భావించారు. మల్లాది వారి అభిప్రాయంలో “పంచమ” అనే పదం కొన్ని జాతులకు ప్రాచీనంగా ఉపయోగించబడలేదు; ఇది ఇటీవలి (మధ్యకాల/ఆధునిక) ప్రయోగం మాత్రమే. కేవలం “ఐదవవారు” అన్న కారణంతో ఐదవ స్వతంత్ర జాతి ఉందని వాదించడం యుక్తం కాదు. వేదాలలో కనిపించే పంచజన / పంచచర్షిణీ / పంచక్షితి వంటి పదాలు సంఖ్యాపూరణార్థకాలే కాని అవి ఐదు స్వతంత్ర జాతులను కచ్చితంగా సూచించవు. పురుషసూక్తంలో నాలుగు వర్ణాలే స్పష్టంగా చెప్పబడ్డాయి; ఐదవ జాతి ఉంటే దాని ఉద్భవస్థానం ఎక్కడా చెప్పలేదు. చండాలుడు సంకీర్ణులలో చివరివాడే గాని, అతనిని స్వతంత్ర ఐదవ జాతిగా గ్రహించడం అపసిద్ధాంతమని పేర్కొన్నారు. (161)

పై చర్చ ప్రధానంగా వేద–స్మృతి వ్యాఖ్యానాలపైనే ఆధారపడ్డది. ఇలా పంచజన మొదలైన పదాలకు విస్తృతమైన అర్థాలు లభిస్తాయి. పంచమ అనే వర్గీకరణ పూర్వ వాఙ్మయంలో ప్రాచుర్యంలో లేదని, చండాలురు, సంకీర్ణులని పంచమవర్గానికి చెందినవారు కారన్న విషయాన్ని పండితులు వివిధ రకాలుగా వ్యక్తీకరించారు.

దీనిని శాస్త్రీయంగా కుల్లూకభట్టుడు మన్వర్థముక్తావళిలో చతుర్వర్ణాల సంకరం వలన అనేక జాతులు పుట్టవచ్చని, అవాంతర వర్ణాలు ఎన్నయినా ఉండవచ్చునని, శుద్ధవర్ణాలు లేక మూలవర్ణాలు మాత్రం నాలుగేనని సమన్వయించాడు (162).  ఈ అభిప్రాయాన్ని శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని ‘య ఏకో అవర్ణో బహుధా శక్తియోగాత్ వర్ణాననేకాన్ నిహితార్థో దధాతి I  విచైతి చాంతే విశ్వమాదౌ చదేవః        స నో బుద్ధ్యా శుభయా సంయునక్తు” (4.1) (163) అనే శ్రుతితో పోల్చినప్పుడు, పరమాత్మ ఒక్కడే అవర్ణుడని, ఆయన అనేక వర్ణాలను సృజించాడన్న విషయం స్పష్టమవుతుంది. ఈ పోలిక వలన అవాంతర-శుద్ద వర్ణాల విస్తారమైన అర్థం బోధపడగలదు.

ఇదేవిధమైన అర్థాన్ని రుద్రయామళ తంత్రానికి చెందిన జాతిమాల అనే గ్రంథం కూడా సూచిస్తున్నది. నిమ్నకులానికి చెందిన పురుషుడు ఉన్నత వర్ణానికి చెందిన స్త్రీతో కలవడం వలన పుట్టిన 42 మిశ్రిత లేదా సంకీర్ణజాతుల గురించి ఈ గ్రంథం పేర్కొన్నదని, ఈ జాతులు మిగతా సంకీర్ణులలాగానే శూద్రులుగా ఈ గ్రంథంలో పేర్కొనబడ్డారని, అనగా ప్రతిలోమ సంకీర్ణ జాతులు శూద్రులుగా ఈ గ్రంథంలో పరిగణింపబడ్డారని 1799లో కోల్బ్రూక్ వ్రాసాడు (164).  కోల్బ్రూక్ ప్రకారం, ఈ తంత్ర గ్రంథం అన్ని సంకీర్ణజాతులూ చాతుర్వర్ణాలలో అంతర్భాగమై ఉన్నారని చెబుతుంది.

దీని అర్థం సంకీర్ణవర్ణాలు వర్ణబాహ్యులని కాదు  (165).  వీరు నాలుగు శుద్ధ వర్ణాలలో చేరరు అని మాత్రమే! ధర్మ బాహ్యులని, బహిష్కృతులని అసలే కాదు! ప్రతిలోమ సంకీర్ణులు శూద్రతుల్యులు అని మనువు పేర్కొన్న అంశాన్ని ముందే గమనించాము. ఆయా జాతులు పరంపరాగతంగా కొనసాగించుకుంటూ వచ్చిన ఆచారాలు వారి ధర్మాలుగా భావించబడ్డాయి, పైగా ప్రతి తరమూ ఆ ఆచారాలను కొనసాగించడానికే మొగ్గుచూపారు కాబట్టే ఆ లోకాచారాలు కొనసాగాయి. ఈ సంకీర్ణజాతులను లోకాచారాల వెలుగులో చూసినప్పుడే ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాలు పూర్తిగా అర్ధమయ్యే అవకాశముంది.

కానీ బ్రిటిష్ వారు సృష్టించిన వర్గీకరణలకు అనుగుణంగా అంబేద్కర్ గారు ఒక సందర్భంలో సంకీర్ణులు-అశౌచ్యులు అనే భేదాన్ని ప్రతిపాదించారు. “అస్పృశ్యుల మూలం గురించి పరిశోధిస్తున్నప్పుడు, వారిని అశౌచ్యులు – లేదా సాంకర్యుల (Impure) నుండి జాగ్రత్తగా వేరు చేసి చూడాలి. సనాతన హిందూగ్రంథకర్తలందరూ సంకరజాతీయులైన అశౌచ్యులను అస్పృశ్యులతో కలిపి చూసారు. ఇది తప్పు. అస్పృశ్యులు వారి కంటే భిన్నమైనవారు” (166)  అని పేర్కొన్నారు. ఇది చాలా ముఖ్యమైన విభజన. ఇందులో అంబేద్కర్ గారు నిబంధకారులు ఏర్పరచిన వర్గీకరణలకు భిన్నంగా నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

పాశ్చాత్యుల రచనల్లో impure అన్న పదం రేస్ వర్గీకరణలకు కూడా ఉపయోగించబడ్డది. భగవద్గీత ప్రకారం వర్ణాలకు గుణకర్మలు ఆధారం. ఆ దృష్టితో చూస్తే వర్ణసంకరం అంటే విభిన్న వర్ణాల గుణకర్మల సంకరమే. గుణకర్మలు అన్న పదం చిన్నదిగా కనిపించినా, దానిని లోతుగా వివరించడానికి కొన్ని గ్రంథాలను వ్రాయవచ్చు. అంతవిస్తృతమైన అర్థం కలిగిన గుణకర్మల వర్ణ సంకరాన్ని క్రైస్తవంలోని అశుద్ధ రక్తాన్ని సూచించే ‘impure’ అనే పదంలోకి కుదించడం శాస్త్రాలను వక్రీకరించడమే అవుతుంది.

చండాలాది జాతులను హిందూ శాస్త్రాలు సంకీర్ణులుగా చూడగా, అంబేద్కర్ గారు ఆ వర్గీకరణను కాదని బ్రిటిష్ వారు సృష్టించిన అస్పృశ్యులు అనే నూతన వర్గీకరణలో బంధించారు. ఇలా బ్రిటిష్ వారు మొదలు పెట్టిన జ్ఞాన మీమాంసా హింసకు (epistemic violence), అంబేద్కర్ గారు సైద్ధాంతిక భూమికను ఇచ్చారు.

ఈ వివరం కూడా ‘అస్పృశ్యులు’ అనే బ్రిటిష్ వర్గీకరణకు హిందూ ధర్మశాస్త్రాలకు ఏ సంబంధమూ లేదన్న విషయాన్ని స్పష్టంచేస్తుంది. పైగా క్రైస్తవంలోని ‘pure- impure’ వంటి పదాల ద్వారా క్రైస్తవ వర్ణనలైన ‘impure castes’ (స్వచ్చమైన రక్తం లేని వారు) లాగానే సంకీర్ణులను అశౌచ్యులు అని పిలిచాడు. ఇవి రెండు విషయాలను స్పష్టంగా నిర్ధారిస్తున్నాయి. మొదటిది హిందూశాస్త్రాలలో లేని వర్గీకరణలను, అభిప్రాయాలను ప్రాచుర్యంలోకి తేవడం, క్రైస్తవ పదజాలంతో, భావజాలంతో హిందువులను వర్ణించడం. ఈ విధమైన ప్రయోగం ద్వారా హిందూశాస్త్రాలలో లేని భావాలు, క్రైస్తవులకు నైతికపాపం వలన కలిగే అశుచి ఆ హిందూ సంకీర్ణజాతులకు అపాదించబడుతుంది. శాస్త్రీయంగా ఇది విపరీతార్థాలకు దారితీస్తుంది కాబట్టి రాబోయే రోజులలో ఈ అంశంపై లోతుగా పరిశోధన జరిగి ఈ క్రైస్తవపదజాలాన్ని, దానివలన ఉత్పన్నమైన భావజాలాన్ని సంపూర్ణంగా ప్రక్షాళించడం అత్యవసరం.

పై వివరాలనన్నింటినీ గమనించిన తరువాత పంచములు శూద్రులా కాదా అన్న అంశంపై పండితులలో స్వల్ప అభిప్రాయ భేదాలున్నాయని తెలుస్తుంది. పండితుల అభిప్రాయాల ద్వారా ఈ కింది అంశాలు బోధపడుతాయి.

  1. శూద్రులలో నిరవసిత-అనిరవసిత అన్న విభజన ఉందని, వారిరువురూ శూద్రులేనని, చండాలురు అస్పృశ్యులు కారని గణపతిమునిగారి వాదన.
  2. మల్లాది వారి అభిప్రాయంలో చండాలురు సంకీర్ణులు.
  3. అంబేద్కర్ గారి అభిప్రాయంలో వీరు అశౌచ్యులు-లేదా సాంకర్యులు (Impure) లేదా సంకీర్ణులు కారు. వీరు వేరే వర్గానికి చెందినవారు. ఆ వర్గానికి ఆయన పెట్టిన పేరు ‘అస్పృశ్యులు’.
  4. ధర్మశాస్త్రాల ప్రకారం చండాలురు సంకీర్ణులు!

పై అభిప్రాయాలను, ఆధారాలను బట్టి శాస్త్రపరంగా వీరు సంకీర్ణులేనని, శాస్త్రప్రకారం అంటరానివారు అనే ప్రత్యేక వర్గం లేదని, గణపతిముని గారి అభిప్రాయంలో వీరు అస్పృశ్యులు కారని, అంబేద్కర్ గారి అభిప్రాయంలో మాత్రం వీరు అస్పృశ్యులని స్థిరపడింది.

హిందూ సమాజం వికేంద్రీకృతమైనది. ధర్మం దేశ-కాల-పాత్రంగా వికేంద్రీకృతమై ఉండటం వలన, ధర్మశాస్త్రాలలోని పద్దతులను వికేంద్రీకృత అమరిక ద్వారానే అర్థం చేసుకోవాలి. కానీ దీనికి భిన్నంగా పాశ్చాత్యులు తమ పాలనా సౌలభ్యం కోసం వివిధ జనగణనల భారతదేశమంతా విస్తారంగా దేశ-కాల-పాత్రాల ఆధారంగా విభిన్న రీతులలో అన్వయించబడిన ధర్మశాస్త్రాలను, జాతులను క్రైస్తవ సిద్ధాంతాల, వ్యవస్థలకు అనుగుణంగా కేంద్రీకృతం చేశారు. దీంతో విభిన్న ప్రాంతాలలో విభిన్న రీతులుగా ఉన్న జాతులన్నీ కొన్ని కుప్పలలోకి ఇమడ్చబడటంతో, వారి సంఖ్య అతి పెద్దదిగా, కొన్ని వేలజాతులున్నట్లుగా కనిపించింది. వాస్తవానికి వీటన్నింటినీ పూర్వపు పండితులు ఆయా శాస్త్రాలకు అనుగుణంగా సమన్వయించారు. ఎప్పుడైతే స్వదేశీ న్యాయవ్యవస్థ, ధర్మ-న్యాయశాస్త్రాలపై ఆధారపడటం తొలగించబడిందో, అప్పుడు కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఈ సమస్యలకు పునాదిలో మనకు బ్రిటిష్ వారి కేంద్రీకరణ, న్యాయవిధానాలు, పాలనావిధానాలు కనిపిస్తాయి.

సంకీర్ణులు-తంత్రశాస్త్రం:

1920లో మల్యాల సాంబశివరావుగారు పంచముల (167)  గురించి వ్రాసిన వ్యాసంలో ఈ ముఖ్యమైన అభిప్రాయాలు లభిస్తాయి.

  1. శక్తిని పూజిస్తారు, ఇతరులు కూడా శక్తిని పూజిస్తున్నా వీరిలాగా పూజించేవారు లేరు.
  2. గ్రామదేవతల పూజారులు.

గతంలో పంచముల గురించి మరికొందరు చర్చించారు. అలాంటివారిలో శ్రీ జి యస్ బి సరస్వతి స్వాములు గారు ఒకరు. ఈయన 1924 లో వ్రాసిన ‘పంచముల చరిత్ర’ అనే వ్యాసం అంతా ఊహలతో నిండి వాస్తవదూరమై ఉంది (168).  దాని విమర్శ 13-8-1930 బుధవారం నాటి గోలకొండ పత్రికలో ప్రచురించబడ్డది.

శక్తి పూజ ప్రధానంగా (వామ-దక్షిణ) తాంత్రిక పద్దతులలో సాగుతుంది. 1927 నాటి ‘రెడ్డికులనిర్ణయచంద్రిక’ అనే గ్రంథానికి పీఠిక భాగంలో శ్రీ కావ్యకంఠగణపతి మునిగారు ఇలా వ్రాసారు, ‘హిందూమతమునందు రెండు శాఖలుగలవు. ఒకటి వైదికశాఖ. ఇంకొకటి తాంత్రికశాఖ. ఆర్యులు సంప్రదాయమునందు వైదికులుగానుండి జపపూజాస్తోత్రాదులయందు దాంత్రికులుగా గూడానున్నారు. ద్రావిడులు తాంత్రికులు. ఆదిద్రావిడులుగూడ తాంత్రికులేకానీ ప్రస్తుతము చాలకష్టస్థితిలోనున్న వీరియందు మతశ్రద్దాచిహ్నములు విరళములుగానున్నవి’ అని పేర్కొన్నారు (169).  ఇది చాలా ముఖ్యమైన, అందరూ విస్మరించిన అంశం. పంచమవర్గానికి తాంత్రికంతో ఉన్న సంబంధం గురించి నేటికీ ఏ పరిశోధకుడూ, శాస్త్రజ్ఞుడు లోతుగా పరిశోధించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఈ సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ అమరిక గురించిన కొన్నిముఖ్యాంశాలను తెలుసుకోవడం అవసరం. రాజవ్యవస్థ ఏర్పాటును బట్టి భారతీయ సమాజంలో ఉండేవారందరూ అర్థ, ధర్మశాస్త్రాలకు లోబడే ఉండేవారు. శాస్త్రాల ప్రకారం అవిద్య తొలగాలంటే మలదోషాలు, ఆవరణ, విక్షేపదోషాలను తొలగించుకోవాలి. ఇందులో నిష్కామకర్మ మలదోషాలను తొలగించగా, ఉపాసన, బ్రహ్మవిద్యలు విక్షేప, ఆవరణ దోషాలను తొలగిస్తాయి. అవిద్య త్రిగుణాలను ప్రభావితం చేస్తుంది. కర్మలు, ఉపాసనలు ప్రతి జాతిని, వారి అవిద్యను, గుణకర్మలను ప్రభావితం చేస్తున్నాయి. ధర్మనిర్ణయానికి జాతుల ఆచారం (చరిత్ర) ప్రమాణమని కౌటిల్యుని అర్థశాస్త్రం చెబుతుంది. ఈ నేపథ్యంలో ఆయా జాతులు చేస్తున్న సాత్విక, రాజసిక, తామసిక పూజలు, ఉపాసనలు, ఆ పూజలలో వారు నిర్వహించే బలి మొదలైన కర్మలు ఆయా పూజలు, ఉపాసనల యొక్క గుణాన్ని తెలియజేస్తాయి. పూర్వం కొందరు తామసిక పద్దతులలో ఉపాసన చేసేవారని మిషనరీల, పాశ్చాతుల గ్రంథాలు సూచిస్తాయి.

మన సమాజంలో వివిధ సంప్రదాయాలకు చెందిన వారందరూ అర్థ, ధర్మశాస్త్రాల పరిధిలో సామూహిక నియమాలను పాటించేవారు. కానీ వ్యక్తిగత సాధన, ఆచార వ్యవహారాల విషయంలో ఆయా సంప్రదాయాలకు చెందిన నియమాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు. వ్యక్తిగత ఆచారాల విషయంలో స్మార్త సూత్రాలలో (గృహ్య, ధర్మ సూత్రాలు) చెప్పబడిన విధినిషేధాలకు భిన్నంగా ఉండే ఆచారాలకు చెందిన కులాలు మనలో చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ముందు మనం గమనించిన పాశుపతవ్రతానికి చెందిన అత్యాశ్రమం, శాక్తేయానికి చెందిన కౌలాచారం వంటివి. ఆది శంకరుల కాలం నుండీ ఈ ప్రక్రియ సాగుతోందని శంకర విజయం, ఇత్యాది ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుస్తోంది.

శక్తి పూజనే ఆధారంగా తీసుకున్నట్లైతే శాక్తేయాన్ని, తంత్రశాస్త్రాన్ని కూడా లోతుగా పరిశీలించాలి. శక్తిపూజలో కౌలాచారానికి విశిష్టమైన స్థానం ఉంది. కౌలాచారం అనుకల్పాలతో, ప్రత్యక్ష మద్యమాంస, మైథున సాధనలతో నిండి ఉంది. శాక్తేయంలో శక్తిని మూడు విధాలుగా ఉపాసిస్తారు. మొదటి పద్దతిలో సౌమ్య రూపంలో ఉన్న దేవికి పూజలు, అర్చనలు చేస్తారు. రెండవ పద్దతిలో కాపాలిక, కాలముఖ సంప్రదాయీకులు మొదలైన వారు దుర్గాదేవి ఉగ్ర రూపాన్ని ఉపాసిస్తారు. ఈ పూజలలో జంతుబలులు, నరబలులు ఉంటాయి. మూడవ పద్దతిలో ఇంద్రియాలను తృప్తి పరుస్తూ ప్రత్యక్షంగా శక్తిని ఉపాసిస్తారు. ఈ దేవీ పూజలకు సంబంధించిన వివరాలు పలు తంత్రాలలో కనిపిస్తాయి (170).  తంత్రాలలో 64 కౌల తంత్రాలు, 64 భైరవతంత్రాలు ప్రామాణికమైనవని పండితులు చెబుతారు. గురువులు, పండితుల ద్వారా చెప్పబడిన వివరాలు అమ్మవారి పూజ మూడు విధాలని ధృవీకరించడమేకాకుండా, మంచి ఆచారాలను పొందిన శూద్రులు కూడా సమాచారాన్ని పాటించవచ్చని పేర్కొన్నాయి (171).

ఆ కౌలాచారానికి చెందిన తంత్ర గ్రంథాలలో సంకీర్ణజాతులను ఐదో జాతిగా వర్ణించడం కనిపిస్తుంది. శాక్త తంత్ర పూజలు చక్రపూజలలో వర్ణసంకరాన్ని ప్రోత్సహిస్తాయి. కౌలాచారానికి చెందిన మహానిర్వాణ తంత్రం (8 వ అధ్యాయం) కలియుగంలో ఐదు వర్ణాలని చెబుతుంది. ఐదవ వర్ణాన్ని ‘సామాన్య’ అనే పేరుతో పిలిచింది. ఇందులో అన్ని మిశ్రిత వర్ణ లేదా మిశ్రిత జాతులున్నాయి. కలియుగంలో బ్రహ్మచర్య, వానప్రస్థాశ్రమాలు లేవని, గృహస్థాశ్రమంలో ఉండేవారు ఆగమాల ప్రకారం జీవనాన్ని గడపాలని, కలియుగంలో సన్యాసాశ్రమం బదులు అవధూతాశ్రమాన్ని స్వీకరించాలని కూడా ఈ తంత్రం చెబుతుంది. శూద్రులు, సామాన్యులు ఆగమాల ఆధారంగా పూజలు చేయాలని, తద్వారా వారి కోరికలు సిద్ధిస్తాయని చెప్పింది. కేవలం భైరవీ చక్రం, తత్త్వ చక్రాలలో తప్ప వ్యక్తులందరూ కూడా వారి వారి వర్ణాలు, కులాల వారితో వివాహ సంబంధాలను కలిగి ఉండాలని, వారి కుల, వర్ణాలకు చెందిన వారితోనే కలిసి భోజనం చేయాలనీ ఈ తంత్రం చెబుతోంది (172).

కలియుగంలో వర్ణాశ్రమధర్మాలు బలహీనపడుతాయని, దాని ప్రభావం సమాజం మీద ఎక్కువగా ఉంటుందని, వ్యవస్థలో ఐదవ ‘సామాన్య’ వర్ణం ప్రత్యక్షమవడం ఈ పతనానికి ప్రారంభమని, కలియుగంలో వర్ణ నియమాలు నిర్లక్ష్యం చేయబడినప్పుడు, వర్ణాల పరస్పర మిశ్రమంతో ఏర్పడేదే సంకర వర్ణమని, సంకర స్వభావం కారణంగా, బ్రాహ్మణునికి ప్రత్యేకంగా కేటాయించిన వృత్తులు తప్ప మిగతా అన్ని వృత్తులను అందరూ స్వీకరించవచ్చునని, కర్మకాండలో నిపుణుడవడం వలన బ్రాహ్మణుడు మాత్రం ఆ వృత్తులను మాత్రం కొనసాగిస్తాడని. సామాన్య వర్ణం స్వతంత్ర వర్ణం కాదని; అది మిగతా నాలుగు వర్ణాలకు చెందిన వ్యక్తుల మిశ్రమ రూపమేనని తంత్రాలు చెబుతాయి. ఇలా వ్యవహారం కోసం మాత్రమే తంత్రాలు సామాన్య వర్ణాన్ని సృష్టించాయి, ఇది స్వతంత్రమైనది కాదన్న విషయాన్ని అదే తంత్రం స్పష్టంగా చెప్పడాన్ని గుర్తుంచుకోవాలి.

ఈ విధానమే బెంగాల్, మద్రాసు ప్రాంతాలలో ప్రాచుర్యంలో ఉండటాన్ని పాశ్చాత్యులు గమనించారు. ఉదాహరణకు, 1799 లో కోల్బ్రూక్, రుద్ర యామళ తంత్రానికి చెందిన జాతిమాల అనే గ్రంథం కొన్ని వృత్తులు కొన్ని కులాలే చేస్తూ ఉన్నా, నిజానికి అనేక కులాలకు చెందిన వారు కూడా ఆ వృత్తులు చేయవచ్చని చెప్పిందని, కేవలం వేదం నేర్పించే వృత్తి, పూజారులుగా వ్యవహరించే వృత్తి మాత్రం బ్రాహ్మణులకేనని అందులో ఉన్నదని, ఆ విధంగానే అక్కడి సమాజంలో వృత్తులు ఉండేవని పేర్కొన్నాడు (173).  అలాంటి ధోరణినే (మద్రాసు లో కూడా) గమనించి ఆ తరువాతి కాలంలో అనేకులు తమతమ గ్రంథాలలో నమోదు చేశారు.

1775 వారెన్ హేస్టింగ్స్ కాలంలో బెంగాలులో కులాల గురించిన గొడవల కోసం ప్రత్యేక కోర్టులు ఉండేవి. వీటిని `జాతిమాలా కచేరి’ అనేవారు (174).  జాతిమాల కచేరి గురించి రాజా బినయ్ కృష్ణదేబ్, వి.పి.ఎస్. రఘువంశీ (175) మొదలైన చరిత్రకారులు కూడా తమతమ రచనలలో ప్రస్తావించారు. జాతిమాలలో పేర్కొనబడిన నియమాలు కేవలం పుస్తకానికి మాత్రమే అంకితం కాలేదని, వాటి ప్రభావం సమాజంపై ఉండేదని అప్పటి వాస్తవాలు సూచిస్తున్నాయి.

కొందరు పండితుల అభిప్రాయంలో తంత్రాలు స్మృతులపై విస్తృతంగా ఆధారపడ్డాయి; అయితే కొన్ని మార్పులు, చేర్పులను చేశాయి. తంత్రాలు వర్ణాశ్రమ ధర్మాలను అంగీకరిస్తూనే, సామాన్య అనే ఐదవ వర్ణాన్ని, కౌలమనే ఐదవ ఆశ్రమాన్ని చేర్చాయి (176).  తంత్రాలు పంచమ వేదమని, కులాచారం పంచమ ఆశ్రమమని నిరుత్తర తంత్రం చెబుతుంది. సాంఖ్య, వేదాంత దర్శనాలను మధిస్తే పుట్టినదే తంత్రమని నిశ్వాసతత్త్వ సంహిత చెపుతున్నదని P.C బాగ్చి పేర్కొన్నారు (177). స్మృతులు ఏర్పరచిన నియమాలను తంత్రాలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయని ఈ వివరాలు సూచిస్తున్నాయి. అందువల్ల భారతసమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం స్మృతులను మాత్రమే కాదని, లోకాచారాలను, సమాజాన్ని ప్రభావితం చేసిన తంత్రశాస్త్రాన్ని కూడా లోతుగా పరిశోధించాలని ఈ వివరాలు సూచిస్తున్నాయి.

పంచములు తాంత్రికులని కావ్యకంఠగణపతి మునిగారు చెప్పడాన్ని ముందేగమనించాం. దక్షిణాదిలో తాంత్రిక సాధనగురించిన ఎన్నో ఆధారాలు బ్రిటిష్, మిషనరీ రిపోర్టులలో లభ్యమవుతాయి (178).  తంత్రాలు వ్యవహారం కోసం మిశ్రిత వర్ణాలనే లేదా సంకీర్ణులనే పంచమ వర్గంగా పేర్కొన్నాయని, ఆ పంచమవర్ణం చాతుర్వర్ణాలలో అంతర్భాగమని, సంకీర్ణజాతులతో కూడిన పంచమ వర్గీకరణకు తాంత్రికం ఆధారమని, మహానిర్వాణ తంత్రంలోని వివరాలు తెలియచేస్తున్నాయి (179).

పంచమవర్ణానికి వైదిక వాఙ్మయంలో ఏ విధమైన ప్రామాణికత లేకపోయినా, తాంత్రికం ద్వారా ఏర్పడిన ఆచార-వర్ణ సంకరాన్ని వ్యవస్థలో ఇమడ్చడానికి, వారికి ప్రత్యేక హోదా కల్పించడానికి గతంలో కొందరు అక్కడక్కడా పంచమ పదాన్ని కొన్ని చోట్ల ప్రయోగించే పని చేసి ఉండవచ్చు! అందువల్లనే అది కొన్ని ప్రాంతాలలో ఉపయోగించబడి ఉండవచ్చు. ఏది ఏమైనా వైదిక శాస్త్రాల ఆధారంగా ఋషులు, నిబంధకారులు ఏర్పరచిన వర్ణాశ్రమధర్మాలే మనకు ప్రామాణికం.

(ఇంకా ఉంది)

Footnotes:

  1. శ్రీ మహర్షి స్వామి దయానంద సరస్వతి-పండిత గోపదేవ్(తెలుగు అను)-1967-వేదతత్త్వప్రకాశము-ఋగ్వేదాది భాష్యభూమిక-p 372-375. “ఈ విషయమున నీ క్రిందివిశేషములు విశేషముగ గ్రహింపనగును. ప్రథమమున మానవజాతి యొక్కటిగనే యుండెను. వేదమువలన నట్లే తెలియనగుచున్నది. ఇందులకు ప్రమాణము సృష్టివియమున వ్రాయబడినది. మనుష్యజాతిలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూ ద్రులనునవి వర్ణము లనబడును. వేదరీతితో నీ వర్ణములు ఆర్యులు దస్యులు నని రెండు విధములు. (విజానీహ్యార్యాన్ యేచదస్యవః) అను మంత్రమావిషయమున ప్రమాణము. మనుష్యులలో శ్రేష్ఠులార్యులనియు, దుష్టస్వభావముకలవారు దస్యులనియు తెలిసికొనుడని యీశ్వరోక్తి -మంత్రాభిప్రాయము. అట్లే (ఉతశూద్రే ఉత ఆర్యే) అను మంత్రమునుబట్టి ఆర్యులు-బ్రాహ్మణక్షత్రియ వైశ్యశూద్రులని వ్యవహరింపదగుదురు (అసూర్యానామతే లోకాః) ఈ మంత్రము ననుసరించి మనుజులు దేవాసురులు-విద్వాంసులు, మూర్ఖులునని రెండువిధములుగ వ్యవహరింపదగుదురు. విద్వాంసులకు మూర్ఖులకు మధ్య జరుగు విరోధమే దేవాసురసంగ్రామ మనబడును. “. సమీక్ష:- పండిత వర్గము పైన చూపినట్లు వర్ణించిన వర్ణముల విషయమునకు నంబంధించినంతవరకు కొన్నియంశములు మాకు సమ్మతముకాదు. పైన వ్రాసిన వాక్యములనుబట్టి చూచిన బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులనబడు వర్ణముల వారిని ఆర్యులు, దస్యులు, అని రెండుగాభాగించినట్లు కనబడుచున్నది. మరియొక విధముగ నీ విభాగమును ఆర్యులు, శూద్రులు ననియు, దేవాసురులనియుకూడ చెప్పినట్లును కానవచ్చుచున్నది. దాని ఫలితముగా పండితులు శూద్రులు, దస్యులు, అసురులు అను పదములు సమానార్ధకములుగ వాడినట్లు తెలియనగుచున్నది. కాని మా తుచ్చ సమ్మతిలో మాత్రము వేదము, మనుస్మృతి మున్నగు ప్రామాణిక గ్రంథములలో దస్యు శూద్ర శబ్దములు ఏ కార్థకములుగ వాడినట్లు కనిపింపదు. వైదిక పరిభాషనుబట్టి చూచిన దస్యులనబడు వారు దేశమును, ధర్మమును జాతిని అన్నివిధముల నాశము చేయుటకు సిద్దపడిన వారుగ కనబడు చున్నారు. దస్యులు, దాసులు, అసురులు ఈ మూడు పదములు మాత్రము సమానార్థకములుగ కనిపించుచున్నవి. ‘దసు’ ‘ఉపక్షయే’ అను ధాతువు వలన దస్యు పద మేర్పడినది. దస్యుడు సమాజమును నిర్మించుటకు తోడ్పడు వాడుకాదు. పై పెచ్చు సమాజమును నాశముచేయుటకు యత్నించువాడు. దస్యుడన దొంగ, బంది పోటుదొంగ, లూటీ చేయువాడు, లంపటుడునని యర్థము. వైదికభాషనుబట్టి చూచినపుడు దస్యువు విషయమున చాల చెడ్డభావము కలుగును. చూడుడు. (౧) వధేర్హి దస్యుం ధనినం ఘనేన (బు. ౧-౩౩-౪) అను నీ మంత్రము ననుసరించి ధనవంతుడగు దస్యుని బందిపోటు దొంగను వజ్రముతో చంపుటకు విధి కనబడుచున్నది. ఇట్లే తరువాత మంత్రమున దస్యుడు – అయజ్వా – యాజ్ఞికుల నీర్ష్యతో చూచువాడనియు, ‘అవ్రతీ’ సామాజికములు,ధార్మికములు, రాజకీయములు, ఈశ్వరీయములునగు నియమములను పాటింపని వాడనియు వర్ణింపబడినది. ఇక శూద్రవిషయమున వేదమునందు పలు తావులలో సమానార్థకశబ్దములు ప్రయోగింపబడియుండుట జూడనగును. ఇట్టి ప్రయోగములు ముందుచూపుదుము. (3) “అవాదహో దివ ఆదస్యుమ్ “ (బు, ౧-౩౩-౭) ‘దస్యుని దగ్ధము’ చేయుము, (౪) “ విజానీ హ్యార్యాన్ యేచదస్యవో బర్షిష్మతే రంధయ శాసదహ్రతాన్” (ఋ. ౧-౫౧-౬.) దస్యుని వశమున నుంచు కొనుడు, నాశము “ చేయుడు (5) గ దస్యుం వకురేణాధమంతా (ఋ. ౧-౧౧౭-౨౧.) “దస్యుని అస్త్రశస్త్రములతో వధింపుము “ అను నిట్టి మంత్రములలో దస్యుడు వధ్యుడుగా వర్ణింపబడుట చూడనగును. ఇంతేకాక యీ క్రింది మంత్రములలో (6) “హ..(?) దస్యూన్ ప్రార్యం వర్ణమావత్” (ఋ ౩-౩౪-౯.) (౭) “యధావశం నయతి దాసమార్యః” (ఋ. ౫-౩౪-౬.) (8) “విశోఽవతారీర్దాసేః “ (ఋ ౬-౨-౫-౨.) (౯) “యోదా సంవర్ణ మధరం గుహాకః (ఋ. ౨-౧౨-౪) (౧ ౦) “అవగ్దిరేర్దాసం శంబం” (ఋ ౬-౨౬-౫) దస్యు- దాస-విషయములో నీచ శబ్దములు ప్రయోగింపబడుట చూడనగును అంతేకాక వీరిని చంపుటకు, వశములో నుంచుటకు, ఖైదు చేయుటకు, దండించుటకు, దేశమునుండి వెడలగొట్టుటకు విధానములు చూడనగును. వీరు సమాజమునకు విఘాతకులు. ఈ దస్యులే యసురులనియు చెప్పబడుదురు. (ఋ. ౧-౫౧-౫) మంత్రమునందు వీరినిగూర్చి (అధిషు-ప్రావజుహ్యట్) “అసురులు ముఖమునందే హవనము చేయుదురు. పరుల కుపకార మొనర్చు యజ్ఞములు చేయక తమపొట్టలుమాత్రము నింపుకొందురు. అని భావము” అని వర్ణింపబడినది. కౌషీతకీ బ్రాహ్మణమునందును వీరినిగూర్చి యిట్టి భావమే ప్రకటింపబడినది. “అసురావా అత్మన్యజుహవుః “ అసురులు శరీరమునందే హవనము చేయుచుండిరి. అందువలననేవారు ఓడిపోయిరి, వాజసనేయులు చెప్పిరి. ‘దేవాశ్చహవా అసురాశ్చాస్పర్థన్త. తతోహాసురా అభిమానేన కస్మై చ నజుహుమ ఇతిస్వేషు ఆస్యేషు జుహ్వతశ్చరుస్తేపరాబభూవుః ఇతి.’ దేవతలు అసురులు పరస్పరము స్పర్థతో ‘మెలగజొచ్చిరి. అసురులు తామెవరిని పూజింపము, స్తుతి చేయము, అను నభిమానముతో తమ ముఖములందే హవనము చేయుచు విచరించిరి. కావున వారు పరాజితులయిరి” ఇక్కడ అసురులని చెప్పబడినవారే “వేదమున దస్యులనబడిరి. దస్యు అసురపదములు రెండు పర్యాయ పదములని నిరూపించుట నా కిట ప్రస్తుతము కాదు. కానీ, పై వాక్యములవలన దస్యులు, అసురులు దుష్టులని మాత్రము తెలిసికొన పాఠకుల కవకాశము గలిగించితినని యొంచెద. కాని శూద్రపదమునుగూర్చి పరీలించినపుడు వైదిక సాహిత్యమున శూద్రుడొక సత్పురుషుడుగా తెలియనగును. దస్యునకు శూద్రునకు సామ్య మెక్కడను జూడము.”
  2. డా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-1994-ప్రసంగాలు-సంపుటం 7-p 72,102,103. ‘ఈ మంత్రాలు ఏమి సూచిస్తున్నాయి? ఆర్యులకు దాస దస్యులకు మధ్య భేదం ఆకారంలో రంగులో ఉన్న జాతిభేదం కాదని ఇవి నిరూపిస్తాయి. అందువల్లనే దాసుడు గాని దస్యుడు గాని ఆర్యుడు కావచ్చు. కనుకనే వారిని ఆర్యుల నుంచి వేరుచేయమని ఇంద్రుని కోరవలసి వచ్చింది.’, ‘వాళ్ళు బానిసలా? దస్యులు, దాసులు ఆదిమ ప్రజలు కారు. ఆర్యులు ఎంతనాగరికులో వారూ అంతే నాగరికులు. నిజానికి శక్తి మంతులు ఋగ్వేదం సాక్ష్యం అలా వుంది. అయ్యంగార్ దాన్ని ఇలా బాగా సంక్షేపించి చెబుతున్నారు. “దస్యులు నగరాల్లో జీవించారు (ఋ i 53.8,103.3) రాజులుగా చాలామంది చెప్పబడ్డారు. గో, అశ్వ, రథ రూపాలలో (ఋ ii 15.4) బాగా సమీకృతమైన సంపదను కలిగి ఉన్నారు. (ఋ viii 40.6) దాన్ని శతద్వార సముపేత నగరాలలో (ఋ x .99.3)దాచుకొన్నప్పటికీ, ఇంద్రుడు జయించి తనను అర్పించే వారికి, ఆర్యులకు పంచిపెట్టాడు. (ఋ.i 16.4) దస్యులు సంపన్నులు (ఋ ii 39.4) మైదానభూముల్లోనూ, పర్వత ప్రాంతంలోనూ ఆస్తులు కలిగి ఉన్నవారు (ఋ x 69.6) సర్వభూషణావళితో అలంకృతులు (ఋi 33.8) అనేక దుర్గాలను కలిగినవారు (ఋ i 22.13, viii 17.14) దస్యదానవులు, ఆర్యదేవతలు ఒకే విధంగా బంగారు, వెండి, ఇనుపదుర్గాలలో జీవించారు. (శం.శె. సూ vi 23. అ.వే v 28.9, ఋ ii 20.8)’
  3. మర్రిబోయిన రామసుబ్బయ్య-2001-బ్రహ్మజిజ్ఞాస- అద్వైతబోధఅను ప్రథమభాగము-p 4 “యద్వా పంచక్షితీనాం ద్యుమ్నమా భరసత్రా విశ్వాని పౌస్యా యదింద్ర నాహు పిష్వా ఓజో విష్ణుంచ కృష్టిషు” I తా- ఓ యింద్రా! మానవులగు- ప్రజలందు ఏ తేజస్సు బలమును గలదో అదిగాక అయిదు జాతులయిన ప్రజల యొక్క ప్రకాశించు నన్నమును సర్వమును దెచ్చియిమ్ము గొప్పవయిన పౌరుషము లన్నింటిని మాకునిమ్ము.” మల్లాది సూర్యనారాయణశాస్త్రి-1982ద్వితీయ ముద్రణము-సంస్కృత వాఙ్మయ చరిత్ర – ప్రథమ సంపుటము వైదిక వాఙ్మయము-p 143 సప్తసింధు దేశమందు, లేక యార్యావర్త మందు తొలుదొల్త నివసించిన ప్రాచీనులయిన యుత్తమజాతివారిని దెలిపెడి సామాన్యనామమైన యార్యశబ్దమువలెనే వారి తెగలను బోధించెడి యదు-తుర్వశ-అను -ద్రుహ్యు – పూరు – శబ్దములును, ఈ యైదింటిని దెలిపెడి పంచజన శబ్దమును, ఆర్యవిశేష వాచకములుగా బుక్కులలో నలుగడల. గనవచ్చుచున్నవి. ఇట్లే చతుర్వర్ణ వాచకములైన బ్రాహ్మణ రాజన్య వైశ్యశూద్ర శబ్ధములును, పంచవర్ణ వాచకమగు నిషాదశబ్దమును, అనార్యవాచకములైన అసుర -దస్యు – దాస – యాతుధాన – క్రవ్యాద – మూరదేవ – రక్షశ్శబ్దములును బుక్సంహితలోః బ్రయోగింపబడి యున్నవి.” డా బుడ్డిగ ఆదినారాయణమూర్తి గౌడ్-1993-సమగ్ర గౌడుల చరిత్ర-ప్రథమభాగము-p36. పంచజనశబ్దానికి యాస్కాచార్యుడు -పంచజనా మమహోత్రంజుషంతామ్ అని చెప్పాడు. పంచజనులనగా -గంధార్వా, పితరః దేవా అసురాః రక్షాంసీత్యేకే చత్వారో వర్ణా నిషాదః పంచమయితి ఔపమన్యవః (నిరుక్తం 3/8).  గంధర్వులు, పితరులు, అసురులు, రాక్షసులు ఈ ఐదుగురు పంచజనులు. కాని ఔపమన్వాచార్యుడు-నాలుగువర్ణములు కాక ఐదవది నిషాదులు. యీ ఐదుగురు కలిసి పంచజనులయ్యారని చెప్పాడు.
  4. John Muir-1890-3rd ed-Original Sanskrit Texts on the Origin and History of the People of India, Their Religion and Institutions-p176-181. ‘Sayana here defines the five tribes as “ priests and offerers of sacrifices “ (ritvig-yajamana-lahshanah). ix. 65, 22. Ye somasah . . sunvire . . | 23. Ye va janeshu panchasu |
  5. డా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-1994-ప్రసంగాలు-సంపుటం 7-p 22. ‘ఈ అయిదు గణాలు ఎవరెవరన్న అంశం గురించి కొంత అభిప్రాయభేదం వుంది. యాస్కుడు తన నిరుక్తంలో ఆ అయిదు తెగలు గంధర్వులు, పితరులు, దేవతలు, అసురులు, రాక్షసులు అనువారలని పేర్కొన్నాడు. నాలుగు కులాలు, నిషాదులు వెరసి ఆ అయిదు తెగలని ఔపమన్యం చెపుతోంది. ఈ రెండు వివరణలో సత్యదూరంగా కనిపిస్తాయి. ఎంచేతనంటే, ఈ అయిదు తెగలవారు సమిష్టిగా ఈ క్రింది ఋక్కుల్లో కీర్తింపబడ్డారు. 1. ఋ II . 2.10: అధిగమించజాలని అనంతాకాశంలా, మన కీర్తి ఈ అయిదు తెగల్లో ఉన్నతంగా ప్రకాశించుగాక!. 2. ఋ vi 46.7 ఓ ఇంద్రుడా! నహుషగణంలో వుండే శక్తి, బలము, అయిదు గణాలకు చెందిన కీర్తి మాకు ప్రసాదించు. ఈ అయిదు గణాలలో శూద్రులు కూడా చేరివుంటే అంతటి ప్రశంసాపూర్వక ప్రకటనలు జరిగివుండేవి కావు. పైగా, అందులో వర్ణం అనే పదం వాడబడి వుండలేదు. ‘జన’ అనే పదం వాడబడింది. అది అయిదు గణాలను గురించి పేర్కొన్నదే గాని నాలుగు వర్ణాలు ఇంకా నిషాదులు గురించి కాదనేది ఈ క్రింది శ్లోకాల ద్వారా విస్పష్టమవుతుంది. ఋ i 108.8 ఓ ఇంద్రాగ్నులారా మీరు యదు, తుర్వశ, ద్రుహ్య, అను, పురుషగణాల మధ్య వాసం చేస్తున్నట్లైతే అన్ని దిక్కుల్లోనున్న మహావీరులారా ఇక్కడకు విచ్చేసి సోమపానం చేయండి. ఈ అయిదు తెగలు సంలీనమై ఆర్యజాతి ప్రజగా రూపొందారనేది అథర్వణవేదంలోని ఈ క్రింది శ్లోకం విస్పష్టం చేస్తుంది.’…
  6. మల్లాది సూర్యనారాయణశాస్త్రి-1982ద్వితీయ ముద్రణము-సంస్కృత వాఙ్మయ చరిత్ర – ప్రథమ సంపుటము వైదిక వాఙ్మయము-p145-155. ‘అయినను నిజముగా బంచజనశబ్ద మార్యవర్గ వాచకముగా నెదుట గనబడుచున్నది గావున నితరవర్గములెన్ని యున్నను బ్రధానములైన యైదు వర్గములివియని వాని నొక్కచో జేర్చి చెప్పుచున్న యీ క్రింది ఋక్కును బట్టి తెలియవచ్చును. యదింద్రాగ్నీ యదుషు తుర్వశేషు యద్దృహ్యూ ష్వనుషుపూరుషుస్థః I దీనినిబట్టి యదువులు తుర్వశులు ద్రుహ్యులు అనువులు పూరువులు, అనునవి యైదును బంచజన శబ్దముచే జెప్పదగిన యైదార్య వర్గములనుట విదితము. ఇది సత్యమని తోచుచున్నను సాయణాచార్యులవారీఋక్కునకు భాష్యమువ్రాయుచు:-”“యదుష – అహింసకేషు మనుష్యేషు, తుర్వశేషు = హింసకేషు మనుష్యేషు, ద్రుహ్యుషు = ఉపద్రవ మిచ్చత్సు మనుష్యేషు, అనుషు = జ్ఞాతృ వ్వనుష్థాతృషు మనుష్యేషు, పూరుషు, = కామైః పూరయితవ్యే ష్వున్యేషుస్తోతృజనేషు”అనే అర్థాలను వ్రాసారు.’
  7. కోట వెంకటాచలం-1949-ఆర్య విజ్ఞానం-1 (బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం)-p 130-136 & దిగవల్లి వేంకటశివరావు-1930- కథలు- గాథలు (నాలుగవ భాగము)-p49-50 & ఆంధ్రపత్రిక-సోమవారం-22 జనవరి 1945 శృతి:- “యఏకశ్చర్షణీనాం వసూనామిరజ్యతి! ఇంద్రః పంచ క్షితీనామ్”II (ఋగ్వేదం. 1. 68) తాII “ ఏ ఇంద్రుడు ఒక్కడే మనుష్యులకు, ధనములకు అధికారియో అతడు (ఆ ఇంద్రుడు) అయిదు వర్ణములవారికిని ఈశుడు.” (అయిదు వర్ణములు:- బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నిషాద, లేక సంకీర్ణ)
  8. కావ్యకంఠగణపతిశాస్త్రిగారి ప్రత్యుత్తరము-అస్పృశ్యతానిరసనము-ఆంధ్రపత్రిక(దినపత్రిక)-1924-జూన్ 27వ తేదీ- శుక్రవారము & పండితమహాసభ-అస్పృశ్యతా నివారణము-ఆంధ్రపత్రిక-1924మే 7వతేదీ-బుధవారము & బ్రహ్మశ్రీ కావ్యకంఠగణపతిశాస్త్రిగారు-అస్పృశ్యతానిరాకరణ మండనము-ఆంధ్రపత్రిక-1924-సెప్టెంబరు-9వతేదీ-మంగళవారము & కావ్యకంఠగణపతిశాస్త్రిగారి ప్రత్యుత్తరము-అస్పృశ్యతానిరసనము-ఆంధ్రజ్యోతి(దినపత్రిక)-1924-జూన్ 27వ తేదీ- శుక్రవారము శ్రీ కావ్యకంఠగణపతిముని గారు- ‘వైదిక పంచక్షిత్యాది పదములిట్లుఋజువుగా వ్యాఖ్యానము చేయబడినయెడల నిరవసితశూద్రులకు ప్రకృతపంచముల స్వతంత్రసత్త గోచరమగును. పై శాస్త్రీయయుక్తులన్నింటివలన పంచములు నిరవసితశూద్రులేగాని బ్రాహ్మణస్త్రీ కళంకోద్ఘోషకానేక కోటిస్తంభములుగారని స్థిరపడినది. సంకీర్ణచండాల పరస్మృతులకు వీరు విషముగారు.’ ‘చయనులుగారి వ్యాసములోనొక శుభసూచకమున్నది. పంచములకు వైదికకర్మాధికారభాగము లేదనుటకు ప్రమాణమును చూపు సందర్భమున వారిని శూద్రులుగా ఒప్పుకొనినారు. వారి వాదములోని చమత్కారమేమనగా నిషేధములందు చండాలురు శూద్రజాతివారే. ధర్మాచరణవిషయములో మాత్రము వారు వేరుజాతివారై శూద్రధర్మముల నాచరింప అనర్హులగుదురు.’
  9. అప్పల్ల జోగన్నశాస్త్రి-1942-కౌముదీశరదాగమము-p347-348. 919. శూద్రాణామనిరవసితానామ్‌. 2-4-10. శూద్రాణామ్‌। అనిరవసితానామ్‌॥ అబహిష్కృతానాం శూద్రాణాం ప్రాగ్వత్‌ I తక్షాయస్కారమ్‌I పాత్రాద్బహిష్కృతానాం తు చణ్డాలమృతపాఃII నిరవసితులన పాత్రమునుండి బహిష్కృతులు, ఎవరిచే భుజింపబడినపాత్రము స్మృతులందు విధింపబడు సంస్కారముచేనైన శుద్ధిగలది కాదో యట్టివారు పాత్రబహిష్కృతులనబడుదురు. చండాలాదులిట్టివారగులదురు. అనిరవసితానామనునిషేధమువలననిచట శూద్రశబ్దము బ్రాహ్మణ క్షత్రియవైశ్యులకంటెభిన్నులగుమనుష్యులను బోధించును గానిశూద్రత్వ జాతిగలవారినిమాత్రము బోధింపదు. బహిష్కతులు గానట్టి శూద్రులను బోధించుశబ్దముల ద్వన్ద్వ మేకవద్భావమునొందునని సూత్రార్థము. తక్షాయస్కారమ్‌ (తక్ష్ణాం చాయస్కారాణాం చ సమాహారః) అనిరవసితానా మనుటచే పాత్రబహిష్కృతులగు చణ్డాలాదులబోధించుశబ్దములకిత రేతర యోగద్వన్ద్వముగూడనగును. చణ్డాలమృతపాః మనుస్మృతి-ఆంధ్ర మన్వర్థ దీపిక-1939-p579 చండాలశ్వపాకులకు గ్రామమునకు పైని నివాసము వాళ్ళు పాత్ర రహితులుగా జేయదగుదురు. ఏ లోహాది పాత్రమందు వాళ్ళు భుజింతురో యాలోహాదకము కరిగిమరల సంస్కరించబడినప్పటికీ వ్యవహారమునకదియుపయోగించదు.
  10. కావ్యకంఠగణపతిశాస్త్రిగారి ప్రత్యుత్తరము-అస్పృశ్యతానిరసనము-ఆంధ్రజ్యోతి(దినపత్రిక)-1924-జూన్ 27వ తేదీ- శుక్రవారము నిషాదశబ్దమునకు పంచమునియందు రూఢి. మరియొక సంగతి. మౌర్యచంద్రగుప్తుని ఉగ్రనామక సంకీర్ణునిచాణక్యుడు తన్మాతృ జాతివాచకమగు వృషలపాదముతోనే వ్యవహరించుచు వచ్చినట్లు చరిత్రగ్రంథముల వలన తెలియవచ్చుచున్నది. ఇదికూడా సంకీర్ణుడు చతుర్వర్ణాంతర్భూతుడే యనుటకు చరిత్రోదాహరణము.
  11. Editor K. Natesan-2006-Collected Works of Vasishta Kavyakantha Ganapathi Muni-Vol5-p277
  12. పండితమహాసభ-అస్పృశ్యతా నివారణము-ఆంధ్రపత్రిక-1924మే 7వతేదీ-బుధవారము “నాస్తితు పంచమః” అను వచనము ఒక పుట్టుకగల వారందరిని అనగా ద్విజసంస్కారము లేని వారందరిని శూద్రులుగా చెప్పుచున్నది. దాని ప్రకారము పంచములు గూడ శూద్రులే. “ముఖ బాహూరు పజ్జేభ్యః” అను వచనములోని పజ్జశబ్దము ఆర్యాధిష్ఠితశూద్రపరము, లేక అనిరవసిత శూద్రపరము. పంచములకు నిరవసితశూద్రులు అను పేరుగలదు. పంచములుకూడా శూద్రులలో రెండవతెగవారు కనుక వీరిని నామశూద్రులని వ్యవహరించుటపొసగును. ఇందువలన అనిరవసిత, నిరవసిత భేదవివక్షలో పంచజాతులు, అభేదవివక్షలో నాలుగు జాతులు అని తేలినది.
  13. బ్రహ్మశ్రీమల్లాదిరామకృష్ణశాస్త్రిచయనులు గారు-అస్పృశ్యతా నిరాకరణఖండనము-ఆంధ్రపత్రిక-1924-ఆగష్టు-22-శుక్రవారము & జానపాటిపట్టాభిరామశాస్త్రి-1924-అక్టోబరు-అభినవసరస్వతి-p 10-16 మల్లాది రామకృష్ణశాస్త్రి చయనులు గారు-”చండాలురకు పంచములను పేరు ఈ శతాబ్దములో వాడబడుచున్నదిగాని పూర్వగ్రంథములలో గనుపించలేదు. ఇట్టిదానినిబట్టి అయిదవవారు స్వతంత్రజాతియే యని వాదించుట యుక్తముకాదు. శ్రుతులలోని పంచయేమిరేఇత్యాదిస్థలములలో పంచత్వసంఖ్యాపూరణము నిషాదునికాని రధకారునిగాని గ్రహించి శాస్త్రాంతరవిరోధములేకుండ సమన్వయము చేయవచ్చును. సంకీర్ణత్వేన సంకీర్ణుని అయిదవవానిగా గ్రహించినను తప్పేమియులేదు. సంకీర్ణులలోనను ఉత్తమాధమవృత్తులగు అవాంతరజాతులెన్నియోయుండవచ్చును. సంకీర్ణులలో నధమాధముడు ఛండాలుడనుటకు సంశయము లేదు. శూద్రత్వానాక్రాంత చండాలుని పంచత్వసంఖ్యా పూరకునిగా వీరిమతమునను తేజాలరు. శూద్రత్వాదివర్ణచతుష్టయానాక్రాంతుడగు నిషాదునిగాని రధకారునిగాని గ్రహించి పంచత్వసంఖ్యాపూరణము చేయుటయే వీరివాదము కంటే యుక్తము గనుకనే భాష్యకారులటులనేచేసిరి. సకలప్రమాణవిరుద్ధముగా చండాలురను స్వతంత్రజాతిగా గ్రహించుట యపసిద్ధాంతము.”

మల్లాది రామకృష్ణ చయనులుగారు-అస్పృశ్యతా నిరూపణము, జానపాటిపట్టాభిరామశాస్త్రి-1924-అక్టోబరు-అభినవసరస్వతి-p10-20 -”…. “పంచచర్షిణీ”అనినప్పుడైదుగురు మనుష్యులను (ఐదుజాతులవారిని) గూర్చి యభిముఖముగా బ్రతిగృహముననుండునని చెప్పినను ద్రైవర్ణికేతరుల నిరవసితానిరవసితులని రెండు విధములుగా విభజించి యైదుజాతులవారని శృతిచెప్పినట్లు సమన్వయము చేయవచ్చును-ఈ శృతియందు స్వతంత్రజాతులని కాని యస్వంతంత్రజాతులనికాని గ్రహించుటకాధారములు లేవు. స్వతంత్ర జాతులు పరమేశ్వరుని వలన నైదును నేర్పరుపబడినవంటిరేనిఋగ్వేదాంతర్గతమగు పురుషసూక్తమందు నాలుగుజాతులే చెప్పనేల? అయిదవజాతియొక్క యుత్పత్తి స్థానముగూడ జెప్పబడలేదు. కొన్ని స్థలములలో స్వతంత్రజాతులు నాలుగును సంకీర్ణజాతి యొకటియుగలిపి యైదింటిగా లెక్కించుటగలదు. మరికొన్ని యెడల సంకీర్ణుల నందరిని గ్రహింపక కించిత్కర్మాధికారముగల నిషాదునిగాని రథకారునిగాని సంఖ్యాపూరకునిగాగొని “పంచచర్షిణీ, అనియు “పంచక్షతయు” యనియు జెప్పుటగలదు. కనుకనే విద్యారణ్యులు తదానుసారముగా సకల శృతిస్మృత్యవిరుద్ధముగా వ్యాఖ్యానముజేసిరి. ఋగ్వేదము 3వ యష్టకము 5వ వర్షము 8వ మంత్రముII మిత్రాయ పంచయే మిరే జనా అభీష్ఠిశవసే సదేవాన్ విశ్వాన్ బిభర్తిI భాష్యంI పాంచజనాః నిషాద పంచమాశ్చత్వారో వర్ణా అభీష్ఠిశవసే శతౄణామభిగంతృబలయుక్తాయ మిత్రాయ యేమిరే హవీంష్యుద్యచ్ఛంతి, సతాదృశోమిత్రవిశ్వాన్ సర్వాన్ దేవాన్ బిభర్తి స్వస్వరూపతయా ధారయతిII మహాబలసంపన్నుడగు సూర్యునకు నాలుగు వర్ణములవారును నిషాదుడును హవిస్సులనిచ్చుచున్నారని యర్థము. నిషాదుడన బ్రాహ్మణునకు శూద్ర స్త్రీయందు బుట్టినవాడు. అనులోమసంకరుడు. ఇతనికి కొన్ని కర్మలయందధికారము గలదు.”, “పంచయని చెప్పినమాత్రమున నయిదును స్వతంత్రజాతులనుట చెల్లదు-స్వంత్రతాస్వతంత్రతలిచ్చట జెప్పబడలేదు-వివక్షాధీనముగా స్వతంత్రజాతులు నాలుగును సంకరజాతి యొకటియుగలసి యయిదనికాని నిషాదునితోగలిపికాని వచనాంతవిరోధములేకుండ సమన్వయము జేయవచ్చును…. ఈ సభాధ్యక్షులు చెప్పినరీతినిబంచములు నిరవసిత శూద్రులగుచు నాల్గువర్ణములలో బరిగణింపబడినప్పుడు “పంచయేమిరే పంచచర్షిణీ” అను శ్రుతులలోని పంచసంఖ్యాపూరకులెవ్వరు? అనిరవసిత శూద్రులజతుర్థులగాను, నిరవసిత శూద్రులబంచములగాను జెప్పవలెగదా? అటులనే జాతి శూద్రులనాలుగవవారిగాను సంకీర్ణుల నైదవవారిగాను వాడినదప్పేమి?”

  1. ముదిగొండ వేంకటరామశాస్త్రిగారు-1934-ధర్మసిద్ధాంత సంగ్రహముp 42. ‘పంచమః వునర్వర్ణో నాస్తిI సంకీర్ణ జాతీనాంతు అశ్వత తరవ న్మాతా పితృజాతివ్యతిరిక్త జాత్యంతరత్వం-మనుస్మృతి 10-4 వ్యాఖ్యామన్వర్థ ముక్తావళి అశ్వగర్దభ సంసర్గము వలన దదుభయాన్యతర వ్యతిరిక్తజాతీయమగునశ్వతరి (కంచరగాడిద)జనించినట్లు చండాలాది జాతులనేకములు జన్మించినను శుద్ధవర్ణములు మాత్రము నాలుగేయని పై మనువచనము నకర్థమని కుల్లూకభట్టు చెప్పుచున్నాడు.’ మనుస్మృతి ఆంధ్రమనవ్వర్థదీపికాసహితము-1939-p566 బ్రాహ్మణాది మూడు వర్ణముల వారున్ను ఉపనయన సంస్కారముగలవారు గావున ద్విజులైరి శూద్రుడైతే వొక్క జన్మముగలవాడేను. ఈ నాలుగేవర్ణములయిదవవర్ణము మరిలేదు. సాంకర్యముచే బుట్టినవేసడము వలెదలిదండ్రుల జాతులలో నేదియుంగాదు గావున వర్ణముల వ్యవస్థవ్యవహారోపయోగార్థము. చర్ల గణపతిశాస్త్రి-1972,1996-ఆర్షధర్మసూత్రములు-p12-13 తేనహి శూద్రాత్ బ్రాహ్మణ్యాం జాతో చండాలస్తు సంకీర్ణజాతిః నతు పంచమ ఇతి భావః- సంకర జాతులు తల్లిదండ్రుల జాతివారే గాని యన్యజాతి వారు గారు కనుక శూద్రునివలన బ్రాహ్మణస్త్రీయందు బుట్టిన చండాలుడనువాడు సంకరజాతివాడుగాని యయిదవజాతి వాడు గాడు.

గో. స. హరిశ్చంద్రరావు-1911-వర్ణావశ్యకత-p 78-79 “నాస్తిపంచమః” అను వాక్యము నెట్లు సమన్వయింపవచ్చుననియడుగుదురా? చెప్పెదను. వర్ణచతుష్టయము మాత్రమే వేదావిరుద్ధంబగు పురుషార్థచతుష్టయమునకు సాధనంబు. పరిశుద్ధనికేతనసమష్టిమాత్రమే పురపరిమాణంబు నిర్ణయించుట కుపయుక్తమగునుకదా. మూత్రా మేధ్యాదినిలయంబైన గోతులుపట్టణనికటంబున నున్నప్పటికి నుపేక్షణీయములయిన తెరంగున, బ్రాహ్మణాదిజాతి వ్యతిరిక్తజాతులున్నను లేనట్లే. కాబట్టి “నాస్తిపంచమః” నాల్గువర్ణములకును భిన్నమైనజాతిఏదియూ నుండదేని, జాతులను స్మృతికారుడు కంఠోక్తిగాబేర్కొని యుండడుకదా. కాని, దాయభాగాది నిర్ణయ సందర్భమున, వివిధ జాతి పరామర్శస్మృతికారునిచేజేయబడుచున్నది కాబట్టి, చండాలురున్నారని స్మృతికర్తసమ్మతించినవాడేయని గ్రహింపవలెను.’

  1. శ్రీ రావినూతల రాధాకృష్ణయ్య- 1987-శ్వేతాశ్వతర ఉపనిషత్తు-p 129 “అద్వితీయుడైన భగవంతుడు తాను అవర్ణుడై యున్నప్పటికిని తనని స్వకీయ శక్తితో స్వార్ధాపేక్షారహితుడై, వివిధ రంగులలో నానా రకములైన రంగులను సృజించును. తుదియందు యావత్ప్రపంచమును తనయందు అతడు లీనము గావించుకొనును. ఆ పరమేశ్వరుడు మమ్ము పరిశుద్ధ బుద్ధి సమాన్వితులను చేయుగాక.”
  2. H.T. Colebrooke-Enumeration of Indian Classes-1799-Asiatic Researches or Transactions of the Society Instituted in Bengal-5th Volume-p61. ‘However, the Jatimala expressly states the number of forty-two mixed classes springing from the intercourse of a man of an inferior class with a woman of superior class. Though, like other mixed classes, they are included under the general denomination of Sudra,…
  3. B. R. Ambedkar-1948-The Untouchables-p135-136. Though both the Anulomas and Pratilomas were alike for the reason that they were outside the Chaturvarnya, Manu proceeds to make a distinction between them. The Anulumas he calls Varna Bahya or shortlv Bahyus, while Pratilomas he calls Hinas. The Hinas are lower than the Bahyas. But neither the Bahyas nor the Hinas does Manu regard as Untouchables.
  4. డా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-1994-ప్రసంగాలు-సంపుటం 7-p232 & B. R. Ambedkar-1948-The Untouchables-p139-140,142

If these conclusions are right then this is a case of Impurity as distinguished from Untouchability- The distinction between the Impure and the Untouchable is very clear. The Untouchable pollutes all-while the Impure pollutes only the Brahmin. The touch of the Impure cause s pollution only on a ceremonial occasion. The touch of the Untouchable causes pollution at all times.

The conclusion that Untouchability is not the same as Impurity has an important bearing on the determination of the date of birth of Untouchability. Without it any attempt at fixing the date would be missing the mark.

  1. మల్యాల సాంబశివరావుగారు-పంచముల ప్రాచీనత-1920-ఆంధ్రపత్రిక-పదునొకండవసంవత్సరాది సంచిక-p 153 ‘పంచములనగా నెవరు? వారిలోని జాతులేవి ? ఈవిషయమై సంపూర్ణముగ తృప్తికరమగు సమాధానమునిచ్చుట కష్టము. కాని వారియందలి మూడు ప్రధానజాతులను మాత్రము మనము తీసికొని పరిశీలింతము. ఆంధ్రదేశముననున్న మాదిగలు మాలవారును అరవదేశమున నున్న పరయాలును పంచములయందు ముఖ్యజాతులవారు. వీరు పంచములను పేరుతో నెల్లెడల వ్యవహరింపబడుచున్నారు. వీరు ద్రావిడులని నిర్ధారణచేయుటకు మంచిఆధారములు గన్పట్టకున్నవి. కానిదొరకినంతలో ఈ నిదర్శనములు ప్రయోజనకారకములనవచ్చును. వీరు ద్రావిడ సంతతివారేయని పరిశోధకశాస్త్రజ్ఞుల యభిప్రాయము. నల్లని శరీరచ్ఛాయ ఉంగరములవంటి వెండ్రుకలు నల్లని కండ్లు పొడవైనతలా మిగులవెడల్పుగల ముక్కు అను నీలక్షణములు మాల, మాదిగ, పరయలందు ప్రస్ఫుటముగా నిప్పటికినీగానవచ్చుచున్నవి. రిస్లీ దొరగారు వ్రాసినదానిబట్టి ఆంధ్రపంచములను అరవపరయాలును ఏకజాతికి సంబంధించినవారేయని స్పష్టమగుచున్నది. ఈ సంబంధమును మరింత బలవత్తరము చేయు నిదర్శనములుకొన్ని కానవచ్చుచున్నవి. ప్రాచీనము నుండియును శక్తిపూజ వీరివురియందును నిప్పటికిని చెక్కుచెదరక నడుచుచున్నది. ఇతరులీపూజను చేయుచున్నను, పంచములవలె చేయువారు లేరు. గ్రామదేవతలకు పంచములే పూజారులు. ఎల్లమ్మయను దేవతను పరయాలును, మాలమాదిగలు పూజింతురు. పరపాతమ్మ మొదలగు దేవతలు పశురోగములు నివారించునను భావము ఈ యిరువురకును కలదు. కలరా, మశూచి రోగములు కిరువురియందును ప్రత్యేకదేవతలు కలరు. భూతములను పారద్రోలుట, అరవదేశమందున్న పరయాలు తమ పిల్లలకు రాగితో చేయబడిన యొకరక్షారేకును గట్టెదరు. దానియందు తెలుగు అంకెలును తెలుగు అక్షరములును గానబడుచున్నవి. దీనిని బట్టి దక్షిణదేశపు ద్రావిడులే ఆంధ్రదేశమున పంచములైనట్లును, ఎన్ని శతాబ్దములు గడచినను వీరిరువురకును గల సంబంధము నశింపకుండా నిలిచియుండినట్లు యూహింపవలసియున్నది. భాషలు భిన్నములైనను వీరి హృదయము మాత్రమొక్కటే యనియు, వీరిజాతీయాత్మనామావశిష్టము కాలేదనియు నంగీకరింపకతప్పదు.’
  2. జి యస్ బి సరస్వతి స్వాములు- ‘పంచముల చరిత్ర’-1924-గోలకొండ పత్రిక విభవ సంవత్సరాది సంచిక-p 23
  3. శ్రీ కావ్యకంఠగణపతి ముని-1927-రెడ్డికులనిర్ణయచంద్రిక-పీఠిక-ii-iii & శ్రీవిద్యాశంకరపదమావేశప్రకాశిత జగద్గురు శ్రీకళ్యాణానందభారతీమాంతాచార్య స్వాములవారు – శ్రీమంత్రశాస్త్ర మీమాంస-ఆరాధన-మాసపత్రిక- మే 1955-p 3 & కలపర్తి వెంకటకృష్ణ శర్మ సోమయాజి-1934-స్పృశ్యాస్పృశ్య వివేకము- p 80 & కూచి నరసింహము-1939- నానావిషయక విరచనములు-p 82 ‘హిందూమతమునందు రెండు శాఖలుగలవు. ఒకటి వైదికశాఖ. ఇంకొకటి తాంత్రికశాఖ. ఆర్యులు సంప్రదాయమునందు వైదికులుగానుండి జపపూజా స్తోత్రాదులయందు దాంత్రికులుగా గూడానున్నారు. ద్రావిడులు తాంత్రికులు. ఆదిద్రావిడులుగూడ తాంత్రికులేకానీ ప్రస్తుతము చాలకష్టస్థితిలోనున్న వీరియందు మతశ్రద్దాచిహ్నములు విరళములుగానున్నవి.’ ‘మంత్రములచే నాచరింపబడక నిర్మన్త్రకముగా నెద్దియో యొకవిధమున నాచరింపబడు పురుషవ్యాపారము తంత్రమని చెప్పబడుటకు నించుకేనియు యోగ్యతలేకపోవుట యటుండనయ్యది కుతంత్రమనియు దుష్టతంత్రమనియును క్షుద్రతంత్రమనియును జెప్పబడును. అట్టి క్షుద్రతంత్రములు గ్రామోపాంత్యప్రదేశములందుండు మాలమాదిగలు, ఆరణ్యములందుండు కోయవాండ్రు, లంబాడీలు, ఏనాదులు మొదలుగాగల జాతులవారలాచరించుచుండు గ్రామదేవితోత్సవములు మొదలుగాగలవి.’ ‘వేదాధికారము లేని శూద్రాదులకు ఆగమ శాస్త్రాదులలో విధించిన ప్రకారము కాళీ మొదలగు క్రూరశక్తులను ఆరాధించుటలోనున్నూ జాతరలందు గ్రామదేవతలు మొదలగు క్షుద్రదేవతలను ఆరాధించుటలోను వారి వారి ప్రీతికరములగు మధుమాంసాదులను నివేదించుటయు పశ్వాదులను బలిరూపముగా వధించుటయు సనాతనాచారముగా నున్నది.’ ….’హరిజనులు పైజాతివారితో గుళ్ళలో భగవంతుని సేవించుటవలన, జంతుబలులు మద్యనైవేద్యములు మున్నగు వామాచారములు తొలగిపోయి, సాత్త్వికభక్తి దేశమున ప్రబలును.’. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ-రెండవ ప్రచురణము-1929-వేమన-p 141-142. అనగా హిందూదేశమందన్ని మతములవారును తాంత్రికులే. వారి వారి మతసిద్ధాంతములను సత్యాపనముచేసి యనుభవింపగోరు వారందరును తంత్రమార్గమునే యవలంబించిరి. కాని కొందరు ఆ మార్గమందు మద్యమాంసాదిపంచమకారములకు ప్రాముఖ్యమునిచ్చి యందుచే తమపూజాది సాధనలు బహిరంగముగా జరుపుకొనలేక రహస్యముగా నుంచుకొనుటవలన, తక్కినవారికన్న భిన్నులై తాంత్రికులనబడుచున్నారు… వామాచారము అట్లుండనిండు. జాతి భేదము వారికిగలదు. చక్రపూజాసమయములందు మాత్రము జాతిభేదమును గమనింపకూడదు కాని దాని బైటమనకు నాలుగుజాతులైన వారికైదుజాతులు (మహానిర్వాణతంత్రము. ఉల్లా 8. ప 5) వేరువేరు జాతులకు వేరువేరు సంస్కారములు (అదే 13) బ్రాహ్మణాదులు ముగ్గురికిని ఉపవీతములు కలవు (అదే 9-5) తమకన్న తక్కువజాతివారియన్నాము తిన్నవారికి ప్రాయశ్చిత్తముగలదు. (అదే 11-1-29)
  4. Vaishnavism Saivism and other minor Religious systems- R.G.Bhandarkar p-144-147
  5. Saundarya Lahari of Sri Samkaracarya-English Translation and notes by-Pandit. R. Ananta Krishna Sastri and Sri Karra RamanaMurthy Garu.-1957 p55-56 సింహంభట్ల రామమూర్తి శాస్త్రి-1934-కామకళా విలాసము-p 149-156 & డా పోతుకూచి సుబ్రహ్మణ్య శాస్త్రి- 2003-శ్రీ సుభగోదయ స్తుతిః-శ్రీ గౌడపాదాచార్య విరచితము-p 115-120, 173 “శ్రీ విద్యకు చెందిన 64 తంత్రములు, మిశ్ర మార్గమునకు చెందిన ఎనిమిది తంత్రములు, వేదప్రామాణ్యము నాశ్రయించి ఐదు శుభాగములు కలవు. మొదటి 72 తంత్రములు కౌల, వామాది ఆచారములనే వివరించుచున్నవి. చతుశ్శతిలో 64 తంత్రములు వివరింపబడినవి. ఇవి జగమునకు వినాశహేతువులు, అవైదికములు, సకల విద్వాల్లోకా ప్రతారకములు. ఈ 64 తంత్రములు మోసము చేయునవి, ఐహిక ఫలమునే ఇచ్చునవి, అవైదికములు అని సారాంశము. కావున కౌలమార్గము, వామాచారము నిందింపబడవలసినవి ద్విజులకు పనికిరావు. చంద్రకళాది విద్యలు ఎనిమిది కలవు 1)చంద్ర కళా 2)జ్యోత్స్నావతీ 3)కళానిధి 4)కులార్ణవము 5)కులేశ్వరి 6)భువనేశ్వరి 7)బార్హస్పత్యము 8)దూర్వాసమతము అని వీటి పేర్లు. నాలుగు వర్ణముల వారికి వీటిని సాధించుటకు అధికారమున్నది. త్రైవర్ణికులకు సవ్యమార్గముననుసరించి అనుష్టానకలాపము చెప్పబడింది. ఇతరులకు అపసవ్య మార్గమునాదేశించుటచే నివి వామాచారమునకు చెందినవి. కావున ఇవి మిశ్రమార్గమునకు చెందినవి. గ్రహింపబడరానివి. చంద్రకళావిద్యాష్టకము కౌలమతమును అనుసరించినది గనుక మిశ్రకమతము. అందుచే నిది గ్రాహ్యము కాదు. మిశ్రకం కౌలమార్గంచ పరిత్యాజ్యం హి శాంకరి అని భగవద్వాక్యము కలదు కనుక కౌలమార్గము, మిశ్రమ మార్గము అని రెంటినీ వదలివేయవలెను. వైదిక మతానుయాయులు శుభాగమపంచకమునే అనుసరించవలెను.”. “కౌళ మతము ననుసరించువారు మూలాధారమును, స్వాధిష్ఠానమును పూజించువారు. కానీ వారు వస్తుతః మూలాధారమునే పూజింతురు. భూర్జపత్రాదులలో లిఖించినచక్రయోనిని పూజించువారు గనుక వీరికి బాహ్య పూజాయందే ఆసక్తి. స్త్రీ యొక్క యోనిని ప్రత్యక్షముగా పూజించుట నిషిద్ధాచారము. యోనియనగా చతుష్కోణమందలి బిందువు. ఇది సహస్రారమందే గలదు గనుక వీరి ఆచారము వైదిక మార్గమునకు విరుద్ధమైనది. భగవతీ! నీవు నిందింపబడరాని చరిత్రగల దానివి అందుచే కౌలవామాచారములు పనికిరావు.” Saundarya Lahari Of Shankaracharya- With Many Commentaries(in Sanskrit) Lakshmidhara, Saubhagyavardhani, Arunamodin, Anandagiriya, Tatparyadipini, Padarthacandrika, Dindima Bhasya, Gopalasundari and Anandalahari Tika-Published with the financial assistance from The ministry of Education and Social welfare, Government of India.- Edited and Published by- A.Kuppuswami-1976- Shloka 31commentary-p 266-269 “एतानि तन्ताणि जगतां अतिसन्धानकारणानि विनाशहेतुभूतानि, वैदिकमार्गदूरवर्तित्वात् I”……”एवं चतुष्षटितन्त्राणि परिज्ञातृणामपि वश्चकानि । ऎहिकसिद्विमात्रपरतवात् वैदिकमार्गदूराणि” “चतुष्षष्टितन्त्राणि कुलमार्ग एव – मिश्रकं कौलमार्गं च परित्याज्यं हि शाङ्करि II इति ईश्वरवचनात मिश्रकमतं कौलमार्गं च परित्याज्यम् I” चतुःषष्टिस्तन्त्राण्यपि कुलमतं निन्दितमभूद् – यदेतन्मिश्राख्यं मतमपि भवेन्निन्दितिमिह । ॥१८॥ अतो बाह्या पूजा भवति भगरूपेण च ततो, निषिद्धाचारोयं निगमविरहोऽनिन्यचरिते ॥४३।
  6. Arthur Avalon-1953-The Great Liberation (Maha Nirvana Tantra)-p213,214,224,233 & కోట వెంకటాచలం-1949-ఆర్య విజ్ఞానం-1 (బ్రహ్మాండ సృష్టి విజ్ఞానం)-p 131 ‘అయిదు వర్ణములు-బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర, నిషాద లేక సంకీర్ణ’
  7. The Asiatic Journal and Monthly Register for British India and its Dependencies-Vol2-1816-p 572-578, Miscellaneous Essays-H.T.Colebrooke-E.B.Cowell-Vol II-1873-p157.
  8. Hastings and the Rohilla War-1892-Sir John Strachey-p308
  9. The Early History And Growth Of Calcutta-Raja Binaya Krishna Deb-1905-p135 & The Institution and Working of Caste in the latter Part of the Eighteenth Century from European Sources-V.P.S.Raghuvamshi-Kunwar Mohammad Ashraf- An Indian Scholar and Revolutionary-Edited by Horst Kruger-1960-p6172
  10. Gwendolyn Taunton-2018-Tantric Traditions Gods, Rituals, & Esoteric Teachings In The Kali Yuga & Kulacarya Srimat Virananda Giri-Constructive Philosophy Of India Vol. 2 (Tantra)-p81 & Swami Samarpanananda-The Tantras: An Overview-Prabhddha Bharata-Apr 2010-p15,16, It may conjectured here safely that Tantra sastra rooted in non-aryan Dravidian cum-aboriginal conception of Linga and Yoni reached its highest expression in the conception of the ultimate Reality which is Siva-Sakti-Samarasya. It will be highly interesting to note here that worship of the Siva Linga is to be found not only among the Aryans and non-Aryans comprising the whole of Indian population but also in the religion of Misar, Babylon, Greece which are regarded as homes of very ancient religions.The followers of tantra treat it as an integral part of the Vedas, the Agama, though not many people would support this view. Historically speaking, the tantric tradition may be considered as either parallel to or intertwined with the Vedic tradition. Later tantric writers wanted to base their doctrines on the Vedas, but orthodox followers of the Vedic tradition did not accept the tantras as products of Vedic learning and stressed their anti-Vedic character instead….. The tantras essentially teach the same tenets as the Vedas; the difference lies in the method and certain subtle points of philosophy. The animal sacrifice of the Vedas became an essential ritual in the Shakta tantra. The tantras draw heavily from the Smritis, with necessary additions and alterations. Some interesting developments in the tantras vis-à-vis the Smritis are as follows: The tantras accept the varna-ashrama dharma, but add a fifth caste called samanya and a fifth varna-ashrama called kaula. It also privileges two of the four ashramas: Grihastha and Sannyasa.
  11. P. C. Bagchi-Studies on the Tantras-1989-Evolution of the Tantras- p 7 ‘The Niruttara Tantra calls the Tantra the fifth Veda, and Kulacara the fifth asrama which follows all others.’
  12. Buhler G-Indische Palaeographie-p. 79, 80 & George W. Briggs-1920-The Chamars-p. 31,43, 45 & Saurabh Dube-1998-Untouchable Pasts : religion, identity, and power among a central Indian community, 1780-1950-p. 103-107 & Report on the Census of the Madras Presidency-1871-p 350 & Proceedings of the Church Missionary Society for Africa and the East-(1823-1824)-Appendix-Vi-p235-237 & Francis Buchanan-1807-A Journey from Madras through the countries of Mysore, Canara, and Malabar-Vol2-p415 & Edgar Thurston, K. Rangachari-1909-Castes and Tribes of Southern India-Vol7-p 100-103A
  13. John Woodroffe-2009-Sakti and Sakta-p116 & దిగవల్లి వేంకట శివరావు-1838,1941-ఏనుగులవీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర- p 264 & https://en.banglapedia.org/index.php/Raghunandan_Bhattacharya “And as far as ethics are concerned, the moral teaching in the VIII chapter of the Mahanirvana Tantra reminds us from beginning to end of Manu’s Code, the Bhagavad Gita, and the Buddhist sermons. Notwithstanding the fact that in the ritual proper of the Saktas there are no caste differences but in Sakti worship all castes as well as the sexes are equal, yet, in harmony with Brahmanism, the castes are recognized, with this modification that a fifth caste, is added to the four usual ones, which springs from the mixture of the four older ones, namely, the caste of the Samanyas. Whilst Manu, however, distinguishes four Asramas or statuses of life, the Mahanirvana Tantra teaches that there are only two Asramas in the Kali age, the status of the householder and that of the ascetic. For the rest, everything which is taught in our Tantra about the duties towards parents, towards wife and child, towards relations and in general towards fellowmen, might find a place, exactly in the same way, in any other religious book or even in a profane manual of morals. As an example we may quote only a few verses from this Chapter VIII: (vv. 24, 25, 33, 35, 39, 45-47, 63-67).”. బెంగాలీ వ్యవస్థ గురించి 1838లో ఏనుగుల వీరాస్వామయ్యగారు ఈ విధంగా వ్రాసారు. “రఘునందనుడనే వొక పురుషుడు చేసిన వుపస్మృతిని ఈ దేశములో నిండాగా వాడుకుంటారు. తంత్రజ్ఞులని పేరుపెట్టుకొని శాక్తమతస్థులు కొందరు ప్రబలి వున్నారు.”
Exit mobile version