[కోటం చంద్రశేఖర్ గారు రచించిన ‘ఆపలేం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
అలల్ని అలల విన్యాసాల్ని
కలల్ని కలల కవాతుల్ని
ఆపలేం
ఉరకలేసే ఉత్సాహాల్ని
ఉరుముతున్న ఉద్రేకాల్ని
ఆపలేం
దాచిన దుఃఖాన్ని రేగిన కోపాన్ని
ఆపలేం
విచ్చిన తామర పువ్వులతో
సోలిపోయే గుండె ఆనందాన్ని
మెచ్చిన చిన్నారి నవ్వులతో
తేలిపోయే మనసు ఆహ్లాదాన్ని
ఆపలేం
మిత్రుడగుపిస్తే చేయి కలపక
గురువెదురైతే దండం పెట్టక
ఆపలేం
మంచు కురిసేటి
ఒకానొక సాయం సంధ్యలో
చిరు దరహాసపు
ఎర్ర గులాబీ కనిపిస్తే
కనుల భాషతో కవ్వించక
కవిత రాయక
ఆపలేం
గాలిని ఆపలేం పిల్లగాలో సుడిగాలో
జల్లుని ఆపలేం చిరుజల్లో వానజల్లో ఆపలేం
పరివ్యాప్తమై పల్లవించే పరిమళాల్ని
కన్నెర్ర చేసే ప్రకృతి ప్రళయాల్ని
ఆపలేం
వినువీధుల విహరించే నవ్య భవ్య వివేకాన్ని
విశ్వవ్యాప్త పరిపూరిత ఫరిడవిల్లు
వికాసాన్ని
ఆపలేం
అడుగు బడుగు జీవులకై అంకురించు విప్లవాన్ని
తెగిపడ్డ సంకెళ్లలో అసమాన త్యాగాల విజయాన్ని
ఆపలేం
విధి లిఖితాన్ని మార్చే వినూత్న కలాన్ని
విధి వంచితులతో విచిత్ర క్రీడలాడే కాలాన్ని
ప్రభుత్వాల నిష్క్రియత్వానికి
నీళ్లు వదలక పాలకుల
అచేతనావస్థకు చరమగీతం ఆలపించక
ఆపలేం
ఉద్యోగం లేక ఉపాధి లేక
ఉసురుమంటూ ఊరురా కూలీల వలసల్ని
బ్యాంకు రుణాలు కట్టలేక
ప్రైవేటు బాకీలు తీర్చలేక
అధికారుల అనధికారుల
సూటిపోటి మాటలు పడలేక
రైతుల ఆత్మహత్యల్ని
కనీవినీ ఎరుగని కరువుతో
పూట గడువక సాపాటు లేక
గిరిజనుల హరిజనుల ఆకలి చావుల్ని
ఆపలేం
