[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన సింగీతం ఘటికాచల రావు గారి ‘ఆప్తుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆరు గంటల నుంచి కాచుకుని కూర్చున్నా ద్వారపూడి నుంచి పిఠాపురం వెళ్లే బస్సు ఇంకా రాలేదు. ఓపిక నశించి వెంటనే పక్కనే ఉన్న సామర్లకోట బస్సు ఎక్కేసాడు సదాశివం. నేరుగా వెళ్లే బస్సు ఎక్కితే ఒక పది రూపాయలు మిగల్చుకోవచ్చు అనుకున్నాడు కానీ అలా కుదరలేదు. ఇక గత్యంతరం లేక సామర్లకోట బస్సు పట్టుకోవాల్సి వచ్చింది.
బస్సు చాలా రద్దీగా ఉంది. ఎక్కువగా అక్కడ చుట్టుపక్కల పల్లె వాళ్ళు తమ తమ ఉత్పత్తులతో గంపలు గంపలుగా కాయగూరలు వేసుకుని ఎక్కుతున్నారు. బస్సు లోపల గంపలు. బస్సు పైన మూటలు. స్థానికంగా రాజమండ్రి మార్కెట్ లోనే అమ్ముకునే వాళ్ళు కొందరు ఉంటే మరి కొంతమంది ఇలా బస్సు పట్టుకుని చుట్టుపక్కల కొంచెం దూరంగా ఉన్న ఊర్లకు వెళుతుంటారు. బస్సు రద్దీ ఎక్కువగా ఉన్నా ఎలాగోలా కూర్చునేందుకు కిటికీ పక్కన సీటు దొరికింది.
ఉదయం సుమారు ఆరున్నర గంటల సమయం. కాబట్టి బస్సు ఎక్కువ భాగం రైతులతోనే నిండి ఉంది. ఎవరి మానాన వాళ్ళు ఇద్దరు ముగ్గురుగా గుంపులు చేరి తమ తమ సమస్యలను వెళ్ళగక్కుతున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య. కొంతమందికి ఎరువుల సమస్య అయితే కొంతమందికి నీటి సమస్య. మరికొంతమందికి నీరు ఉన్నా కరెంటు లేమి. ఇంకొంతమందికి పండిన పంటను దాచుకునేందుకు స్థలాభావం. ఆ బస్సు ఎందుకు అంత రద్దీగా ఉందో అప్పుడు కొద్దిగా అర్థమైనట్టు అయింది. ఎందుకంటే సామర్లకోట పక్కనే ఎఫ్‌సీఐ ధాన్యాగారాలు ఉన్నాయి.
బహుశా అక్కడ పక్కన మార్కెట్ యార్డ్ కూడా ఉండే ఉంటుంది. అందువల్ల అందరూ ఉదయాన్నే తమ తమ ఉత్పత్తులతో అక్కడికి వెళుతున్నట్టు ఉన్నారు అనుకున్నాడు సదాశివం.
పక్కనే మరొకతను కూర్చుని ఉన్నాడు. అతను అక్కడున్న వాళ్ళందరినీ భృకుటి ముడివేసి అదోరకంగా చూస్తున్నాడు. తాను చాలా ధనవంతుడు, అక్కడ కూర్చున్న మిగతా వాళ్లంతా తనకన్నా చాలా పేదవాళ్ళు అన్న భావన అతని చూపుల్లో కనిపిస్తుంది. “ఈ లెక్కన సామర్లకోట చేరాలంటే కనీసం రెండు గంటలు పడుతుంది” అన్నాడా మనిషి విసుగ్గా.
సదాశివం మౌనంగా వింటున్నాడు. చూడ్డానికి బాగా ధనవంతుడని కనిపిస్తున్న అతను హాయిగా తన సొంత కారులో వెళ్లకుండా బస్సులో ఎందుకు వస్తున్నాడో అనుకున్నాడు సదాశివం.
“వీళ్ళ కోసమే స్పెషల్ గా ఒక బస్సు వేస్తే బాగుంటుంది. రైతు బజారు లాగా రైతు బస్సు ఎందుకు ఉండకూడదు? అడగందే అమ్మయినా పెట్టదు అంటారు. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఏదైనా ఒక డిమాండ్ పెడితే కదా వీళ్ళకి కావాల్సిన అనుకూలం ప్రభుత్వం కల్పిస్తుంది. ఇప్పుడు వీళ్ళ మూలంగా మనకంతా టైం వేస్ట్ అవుతుంది. ఎవరికీ టైం విలువ తెలీదు. టైం సెన్స్ లేనేలేదు. ఇలాగైతే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది” అన్నాడు అతను మళ్ళీ మరింతగా విసుక్కుంటూ.
“అన్ని నిర్ణయాలు ప్రభుత్వం ఆలోచించుకోవాలంటే కుదరని పని. సలహాలు, సంప్రదింపులు, సమాలోచనలు అన్ని జరిగితేనే కదా ప్రభుత్వం సక్రమంగా పనిచేయగలిగేది” అన్నాడు మళ్ళీ.
సదాశివం వింటున్నాడే తప్ప మాట్లాడదలచుకోలేదు. అందులోనూ రాజకీయాల గురించి అస్సలు నోరు తెరవదలుచుకోలేదు.
“మాస్టారు మీరు కూడా సామర్లకోటకేనా” ఎలాగైనా సదాశివం నోటి నుంచి మాట పలికించాలన్న కృతనిశ్చయంతో ఉన్నట్టున్నాడతను.
“కాదండి పిఠాపురం వెళ్లాలి” అనేసి అంతలోనే నొచ్చుకున్నాడు ఎందుకన్నా చెప్పానని. పక్కనున్న మనిషికి మాట్లాడేందుకు బ్రహ్మాస్త్రం దొరికినట్టు అయింది.
“అదేంటి సార్ ఇది సామర్లకోట వరకే కదా. పిఠాపురం అంటే వేరే బస్సు ఎక్కాలి కదా” అతని కంఠంలో ఏదో ఉత్సాహం.
“అవును కానీ అరగంట నుంచి చూస్తున్న ఏ బస్సు రాలేదు పిఠాపురానికి. అందువల్ల సామర్లకోటలో దిగి అక్కడినుంచి వేరే బస్సు పట్టుకోవాలనుకున్నాను”
అప్పటికి బస్సు బయలుదేరి సుమారు అరగంట అయింది .
“భలేవాళ్లే. నేను ఎక్కే ముందే చూసాను పిఠాపురం బస్సు పక్కనే ఉంది” అతను అలా అంటుండగానే తాను ఎక్కిన బస్సు పక్కనుంచి పిఠాపురం బస్సు దాటి ముందుకు వెళ్ళింది. నిరాశగా చూసాడు సదాశివం.
ఎలాగైనా ఆ వెళ్ళే బస్సును ఆపగలిగితే అందులో ఎక్కేయవచ్చు. డ్రైవర్ తో ఒక మాట మాట్లాడితే బాగుంటుందేమోనన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ డ్రైవర్ దగ్గరికి వెళ్లే పరిస్థితి లేదు. బస్సు చాలా రద్దీగా ఉంది. పోనీ కండక్టర్ తో చెప్తామంటే అతను కూడా చాలా దూరంగా వెనక ఎక్కడో టిక్కెట్లు వేస్తూ ఉన్నాడు. కాసేపు తన దురదృష్టాన్ని నిందించుకున్నాడు సదాశివం.
“పోనీ డ్రైవర్‌తో చెప్పి కాస్త ముందుకు వెళ్లి ఆ బస్సును ఆపమని చెప్పొచ్చు కదా” పక్కనున్న మనిషి మాట్లాడిన మాటలవి. తన మనసులోని మాట ఇట్టే పట్టేసాడతను.
“లాభం లేదండి బస్సు దాటి చాలా దూరం వెళ్ళిపోయింది ఇక సామర్లకోటలో దిగి వేరే బస్సు, బహుశా ఆ ముందు వెళ్లే బస్సే పట్టుకోవాల్సి ఉంటుంది” అన్నాడు.
అంతలో కండక్టర్ అక్కడికి వచ్చాడు టికెట్లు అడుగుతూ. ఒకసారి అతన్ని అడిగి చూస్తే ఎలా ఉంటుంది అనిపించింది సదాశివంకు. వెంటనే అమలు చేశాడు.
“కండక్టర్ గారు ముందు వెళ్లే ఆ పిఠాపురం బస్సును ఆపగలరా. నిజానికి నేను పిఠాపురం వెళ్లాలి” అన్నాడు సౌమ్యంగా అభ్యర్థిస్తూ.
“వీలుపడదు సార్” ముక్తసరిగా చెప్పాడు కండక్టర్.
“ఏమయ్యా, మీ అందరి దగ్గర ఒకరినొకరు కాంటాక్ట్ చేసుకునేందుకు మొబైల్స్ ఉంటాయి కదా ఒకసారి ట్రై చేయకూడదూ” దర్పంగా అడిగాడు పక్కనున్న పెద్దమనిషి.
“అలాంటివేవీ లేవండి” నిర్లక్ష్యంగా అనేసి ముందుకెళ్ళిపోయాడు కండక్టర్.
“చూశారా మరొకరికి సహాయం చేయాలన్న ఆలోచన మనసులో ఉండనే ఉండదు వీళ్ళకి. ఎందుకంటే మీరు దిగి వెళ్ళిపోతే తనకు టికెట్టు తగ్గిపోతుందని వీడి భావన. పరోపకారం అనే ఆలోచన మచ్చుకైనా ఉండదేమో. ఏం మనుషులు” అంటూ ఈసారి బాగానే విసుక్కున్నాడు.
అయినా తనకు లేని ఇబ్బంది అతనికెందుకు కలిగిందో సదాశివం కు అర్థం కాలేదు. అయితే పరోపకారం అన్న ఒక మాట మాత్రం అతనికి బాగా నచ్చింది. పరవాలేదు మంచివాడే అనుకున్నాడు మనసులో. అంతలో ముందర ఏదో ఒక గొడవ జరుగుతోంది. కండక్టర్ ఎవరినో అరుస్తున్నాడు.
“ఎక్కేటప్పుడు చిల్లర తెచ్చుకోవాలని తెలియదా. రూపాయిలు రెండు రూపాయలు నేనెక్కడినుంచి తేను. మా ఇంట్లో ఏమన్నా చిల్లర మిషన్ ఉందా”
“తొందర ఏమి లేదులే సామీ. దిగేపాల తీసుకుంటాను” అంటున్నాడా రైతు.
“సరిపడా చిల్లర తెచ్చుకోవాల్సిన బాధ్యత కండక్టర్ ది. అలాంటిది ఎలా మాట్లాడుతున్నాడో చూడండి” విసుక్కున్నాడు ఆ పెద్దమనిషి.
“బస్సులో ఉన్న మొత్తం మంది చిల్లర లేకుండా వస్తే ఆయన మాత్రం ఎంత ఇస్తాడు చెప్పండి” సమర్ధించాడు సదాశివం.
“అదీ నిజమే కష్టాలు రెండువైపులా ఉన్నాయి. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం. ఈ గొలుసు తెగదు ఇలాగే ఉంటుంది” వైరాగ్యంగా మాట్లాడాడు పెద్దమనిషి.
బస్సు దారిలో ప్రతి నాలుగైదు కిలోమీటర్లకు ఆగుతూనే ఉంది దిగేవాళ్ళు దిగుతున్నారు ఎక్కేవాళ్లు ఎక్కుతూనే ఉన్నారు. సదాశివానికి విసుగు అధికమైంది. కానీ మరో గత్యంతరం లేదు వెళ్లి తీరాలి అంతే. అరగంట ఆగిన తను మరొక ఐదు నిమిషాలు ఆగి ఉంటే బాగుండేదేమో అనిపించింది.
సుమారు ఒక గంట ప్రయాణం ముగిశాక బస్సు ఒకచోట ఆగింది.
పక్కనున్న పెద్దమనిషి ఠక్కున లేచి గబగబా బస్సు దిగాడు. అతను దిగడమే తరువాయి, పక్కనుంచి వేగంగా ఒక కారు వచ్చి అతని పక్కన ఆగింది. అతను అందులో ఎక్కబోయి ఆగి బస్సు వంక చూశాడు.
బస్సులో ఉన్న సదాశివం అతన్నే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ‘అంటే ఇతనికి కారు ఉందన్నమాట. ఉన్నా కూడా బస్సులో వచ్చాడు. అదేం కక్కుర్తి? ఎలాగూ కారు ఇంత దూరం వస్తూనే ఉంది. అలాంటప్పుడు బస్సులో రావడం టిక్కెట్టు డబ్బులు దండగ కదా’ అనుకుంటూ ఆ పెద్దమనిషినే చూస్తూ ఉన్నాడు.
బస్సు వంక చూసిన పెద్ద మనిషి సదాశివాన్ని చూసి రమ్మని పిలిచాడు. అతను పిలిచేది తననేనా అన్న విషయం సదాశివానికి అర్థం కాలేదు. తన చుట్టుపక్కల చూశాడు.
ఈసారి అతను సూటిగా వేలు చూపించి “మాస్టారు మిమ్మల్నే. లేచి రండి” అన్నాడు.
అయోమయంగా ఉన్న సదాశివం లేచి బస్సు దిగాడు.
“రండి వెళదాం. సామర్లకోట వరకు నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను” అన్నాడు.
“వద్దండీ. నేను బస్సులోనే వెళ్ళిపోతాను” అన్నాడు మొహమాటంగా.
“మీరు మరీ మొహమాట పడవద్దు. కారు ఖాళీగానే ఉందిగా ఎక్కండి. పైగా నాకు మాట తోడు కూడా ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఈ బస్సులో వెళ్తే ఇంకో గంటకు గాని మీరు సామర్లకోట చేరుకోలేరు. ఆ తర్వాత ఇంకా పిఠాపురం కూడా వెళ్లాలి మీరు” అన్నాడు పెద్దమనిషి.
మొహమాటపడుతూనే కారులో ఎక్కి కూర్చున్నాడు సదాశివం. అతనికేమీ అర్థం కావడం లేదు. కారు బయలుదేరింది. సదాశివం ఇక ఉండబట్టలేక అడిగేశాడు.
“మీకు కారు ఉండగా మరి బస్సులో ఎందుకు వచ్చారు?”
సన్నగా నవ్వేశాడు పెద్దమనిషి. “ఎక్కడికి వెళ్ళినా కారులో ఒంటరిగా వెళ్లి చాలా బోర్ కొట్టింది. అందువల్ల అలా సరదాగా బస్సు ఎక్కాను. అంతేకాకుండా సామాన్య ప్రజల మధ్య జీవనం ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది కదా. అప్పుడప్పుడు ఇలాంటి జీవితాన్ని కూడా జీవించాలి. దీనికన్నా ట్రైన్లో జనరల్ బోగీలో ప్రయాణం అద్భుతం. అయినా ఇవన్నీ అసలు కారణాలు కావు. మా డ్రైవర్ కూతురు కాన్పు కోసం కారు తీసుకెళ్ళమన్నాను. వీడు మరీ సిన్సియర్‌గా అమ్మాయిని ఆసుపత్రిలో చేర్చి వెంటనే మళ్ళీ వచ్చేసాడు. ఎందుకంటే కాన్పు రేపో మాపో అన్నారట” అనేసి మరింతగా నవ్వాడు పెద్దమనిషి.
సదాశివం ఆ మనిషిని ఒక పట్టాన అర్థం చేసుకోలేక పోతున్నాడు.
“ఏం పని చేస్తుంటారు మాస్టారు” అడిగారు పెద్దమనిషి.
“రైల్వేలో ఉద్యోగం చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాను”
“అలాగా. అది సరే ఇప్పుడు ఏం చేస్తుంటారు? సమయం అంతా ఖాళీయే కదా”
చెప్పకూడదు అనుకుంటూనే చెప్పేసాడు సదాశివం.
“ఉబుసుపోకకు ఏవో రచనలు చేస్తూ ఉంటాను”
“ఓహో రచయిత అన్నమాట. మరింకేం. సమాజాన్ని ఉద్ధరించే పెద్ద బాధ్యత మీపైనే ఉంది నిజమేనంటారా”
నవ్వేసాడు సదాశివరావు “ఎవరూ ఎవరినీ ఉద్ధరించలేరండి. అది అసాధ్యం. ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఒకరు చెప్తే వినాలి అన్న నిర్బంధం ఎవరికీ లేదు. మాకున్న అనుభవాలు క్రోడీకరించి రాసే రాతలవల్ల అందులోని మంచి ఎవరికైనా కనిపిస్తే, అది ఆచరణ యోగ్యమైతే, దానివల్ల వాళ్ళ జీవితాలకు ఒక దిశా నిర్దేశం లభిస్తుందని అనిపిస్తే, వాళ్లు దాన్ని అనుసరించవచ్చు. అంతే. అంతకన్నా మరి ఏమీ లేదు”
“ఒక్క వాక్యంలో జీవిత సత్యాన్ని ఎంత చక్కగా చెప్పారండి అందుకే రచయిత అయ్యారు”
సదాశివానికి అప్పుడు అడగాలనిపించింది ఆ పెద్దమనిషి గురించిన వివరాలు. “మీరేం చేస్తుంటారండి?” అనడిగాడు.
మళ్లీ గట్టిగా నవ్వేశాడు పెద్దమనిషి. “తాత తండ్రులు సంపాదించిన ఆస్తి పెద్దగా లేకపోయినా ఎంతోకొంత దాచుకున్నాను. పెద్దగా చదువుకోలేదు కాబట్టి ఉద్యోగం చేయలేదు. ఎందుకు చదువుకోలేదు అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. పదో తరగతితో చదువు ఆపేశాను. కొద్దిగా పొలం ఉండేది. చేసినన్ని రోజులు పొలం పనులు చేశాను. కానీ విలాసాలు ఎక్కువవ్వడంతో ఖర్చులు పెరిగి ఆదాయం తరిగింది. దాదాపుగా పొలం అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది కానీ సరైన సమయంలో బుద్ధి తెచ్చుకుని దాన్ని అమ్మలేదు. ఇదివరకే చెప్పాను కదా తాత తండ్రుల ఆస్తి ఎంతో కొంత ఉందని. ప్రస్తుతం దానివల్ల బతుకు నెట్టుకు వస్తున్నాను” చెప్పడం ఆపి నిట్టూర్చాడు.
సదాశివానికి ఎందుకో ఆ పెద్దమనిషి చెప్పిన మాటలు అతికినట్టు కనిపించలేదు. కారులో విలాసంగా తిరిగే పెద్దమనిషి గత చరిత్ర ఇలా ఉంటుందా అనిపించింది.
పెద్దమనిషి సదాశివం వంక అదోలా చూసి “ఏంటి నేను చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదా” అన్నాడు నవ్వుతూ. అవునన్నట్టు తలాడించాడు సదాశివం.
“సరే మీరేమనుకుంటున్నారో చెప్పండి” అన్నాడు కుతూహలంగా.
“నేనేం చెప్పగలనండి మీ గురించి” అన్నాడు సదాశివం.
“రచయితలు కదా, ఏదో ఒకటి ఊహించండి పర్వాలేదు. ఇదంతా ఒక టైం పాస్ కదా మనం ఊరు చేరేవరకు” మళ్ళీ అదే కల్మషం లేని నవ్వు.
సదాశివానికి కుతూహలం పెరిగింది అప్పటిదాకా ఆ పెద్దమనిషి గురించి ఏదో ఏదో అనుకుంటున్న అతను హఠాత్తుగా మరో విధంగా ఆలోచించసాగాడు
బస్సులో అతని ప్రవర్తన చూస్తే మంచివాడ లాగానే అనిపించింది. రైతుల కోసం ప్రత్యేక బస్సు సదుపాయం కలిగించాలి అన్న అతని ఆలోచన అతనిలో ఏదో ఒక నాయకుడిని చూపించింది. చిల్లర కోసం బస్ కండక్టర్ గొడవ పడడం సరిగా అనిపించకపోయినా చిల్లర సమస్య అన్ని చోట్ల ఉండేదే కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోనవసరం లేదనిపించింది. ఇక హఠాత్తుగా బస్సు దిగి కార్ ఎక్కిన అతను నిజంగానే ధనవంతుడు అనిపించింది. డ్రైవర్ కోసం తన కారును త్యాగం చేసిన అతనిలో ఒక మానవతావాది కనిపించాడు. ఇలా అనేక రకాలైన స్వభావాలు కలబోసిన అతను ఏమై ఉంటాడు అన్నది బుర్రకు తట్టలేదు.
“సార్ మీ టైం పాస్ ఆట బాగుంది కానీ మీరు ఎవరో నాకు మాత్రం అర్థం కావడం లేదు మీరే చెప్పేయండి” అన్నాడు సదాశివం. అంతలో సామర్లకోట వచ్చింది.
“మాస్టారు మిమ్మల్ని ఎక్కడ దింపమంటారు? బస్టాండులోనేనా. అన్నట్టు మీరు పిఠాపురం వెళ్లాలి కదూ బస్టాండులోనే దిగాలి. డ్రైవర్ బస్టాండ్ కి పోనీ” అన్నాడు పెద్దమనిషి.
కారు దిగేముందు “మాస్టారు గారు మీ పరిచయం చాలా బాగుంది. ఒక సెల్ఫీ తీసుకుందాం” అంటూ తన ఫోన్లో నుంచి ఒక సెల్ఫీ తీసుకున్నాడు పెద్దమనిషి. దాన్ని సదాశివం నంబరు తీసుకుని అతనికి పంపించాడు.
సదాశివానికి ఆ ప్రయాణం చాలా ఉత్సుకతగా విచిత్రంగా అనిపించింది. బస్సు ఎక్కినప్పుడు ఎవరో అపరిచిత వ్యక్తిగా పరిచయమైన అతను కారు దిగేసరికి ఎంతో ఆప్తుడుగా అనిపించాడు.
సదాశివం పిఠాపురం చేరుకునేసరికి పది గంటలయింది. బస్టాండులో బస్సు దిగగానే తాను దిగిన బస్సు పక్కనే ఒక కొత్త రంగుల బస్సు కనిపించింది దానిమీద రైతు బస్సు అని రాసి ఉంది. ఆశ్చర్యపోయాడు సదాశివం బస్సులో తన పక్కన కూర్చున్న పెద్దమనిషి కూడా ఈ మాటే అన్నాడు ‘రైతు బజార్ లాగా రైతుబస్సు ఎందుకు ఉండకూడదు’ అని. ఇదేంటి నిజంగానే రైతు బస్సు ఉంది ఇక్కడ అనుకున్నాడు.
ఇంటికి వెళుతూ ఆ రోజు పేపర్ తీసుకుని చంకలో పెట్టుకుని ఇల్లు చేరుకున్నాడు. స్నానం చేసి నిదానంగా కుర్చీలో కూర్చుని ఈ పేపర్ తిరగేసాగాడు రెండో పేజీలో ఒక ఫోటో ఒక వార్త.
“మాజీ ఎమ్మెల్యే సాంబయ్య గారి కోరిక మేరకు రైతుబస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి” వార్తకు పక్కనే ఉన్న ఆ ఫోటో కింద పేరుతో సహా చూసి ఆశ్చర్యపోయాడు సదాశివం.
అది మరెవరో కాదు తన పక్కన కూర్చున్న పెద్దమనిషి.