[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘ఆప్యాయతానురాగాల ‘రాఖీ’ బంధం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆనందమయమైన ఈ సుశోభిత వేళ
నా రక్తంలోని ప్రతి అణువు
నిన్నే పలవరిస్తోంది!
ఈ ఆధునిక యుగంలో
మనిషి బంధాలకు దూరంగా
అనుబంధాలకు ఆవల..
నిస్సారమైన జీవనాన్ని అనుభూతిస్తున్నాడు!
తాను జీవిస్తున్న క్షణాలన్నింటినీ
వ్యర్థమైన అర్థం (ధనం) కోసమే
వెచ్చిస్తున్నాననే వాస్తవం తెలుసుకునేసరికి
అద్భుతమైన జీవితకాలం..
కన్నుల ముందరే అదృశ్యమైపోతుంది!
గమ్యం తెలియని ప్రయాణీకుడిలా
జీవనయానంలో పరుగులు తీస్తోన్న వేళ..
ఓ అందమైన ‘శ్రావణం’లో
నిండు పున్నమి రేడు..
చిక్కని చిరునవ్వుల వెలుగులతో
ప్రకృతిని పరవశింప జేస్తోన్న
ఆహ్లాదకర సుమధుర ఘడియలలో..
నా హృదయం లోగిలికి చేరువై
‘రాఖీ’ బంధంతో నన్ను అలవరించావు!
బంధాల విలువ తెలుసుకుని
అనుబంధాల పవిత్రతను అనుభవించి
నీ అనురాగ బంధంతో హాయిగా సేదదీరాను!
ఈ కాల నదీ ప్రవాహంలో
ఎన్నో.. ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కుని
సమస్యల సుడిగుండాలను అధిగమించి
ప్రశాంత జీవన గమ్యాన్ని చేరేసరికి..
నీ ఉనికి నాకు ప్రశ్నార్థకమైంది!?
దశాబ్దాల ప్రేమానురాగ బంధం
క్షణాల వ్యవధిలో కనుమరుగై
కొత్త బంధాలేవో వచ్చి
ప్రాణప్రదమైన మన పాత బంధాన్ని
ముక్కలు చేసి నా మనసులో మంటలు రేపాయి!
ఇప్పుడు కేవలం..
ఎండి బీటలు వారిన నా గుండె లోతులలో
నీ జ్ఞాపకాల చిరుజల్లులు వర్షించి
సంతోషం మొక్కలు మొలక లెత్తుతున్నాయి!
ఏన్నో ఏళ్ళుగా నా హృదయంతో మమేకమైపోయి
అకస్మాత్తుగా మాయమైపోయావు!
నీ జ్ఞాపకాల స్మరణలో
ఎంత కాలం ఇలా బ్రతకగలను..!!?
ఇదిగో.. మళ్ళీ ‘శ్రావణం’ వచ్చింది
నిండు జాబిలి కౌముదీ కాంతులతో
పుడమి తల్లిని మురిపిస్తోంది!
కానీ.. నువ్వు లేని ఈ ‘రాఖీ’ పూర్ణిమ
నన్ను నిశీధి కౌగిలిలో బంధించింది!
బంగారు తల్లీ..!
ఆప్యాయతానురాగాలను
పంచిపెట్టాల్సిన సుమధుర క్షణాలలో
నాకు దూరంగా..
ఏ సుదూర తీరాలను ఏలుతున్నావ్?!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.