[డా. గాదిరాజు మధుసూదన రాజు గారు రచించిన ‘ఆరాటం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
“పోదాం” అని కొడుకు చెప్పినప్పటినుంచి పుట్టి పెరిగిన దేశాన్ని వదలిపెట్టి, ఏదో పరాయి దేశంలో బతికేందుకు పోవాలని తలచుకుంటేనే అల్లకల్లోలంగా అయిపోతూ ఉంది మనస్సు.
‘అడపా దడపా వచ్చి పలకరించి హత్తుకునే వారిని, ఆత్మీయులైన అన్నతమ్ములను, బంధువులను,నా వాళ్ళను కలుసుకోకుండా ఉండగలనా?’
‘అమ్మమ్మా’ అంటూ అల్లుకుపోయే మనుమరాళ్లకూ, మనుమళ్లకూ దూరమై బతగ్గలనా?
‘నాతో నా ఇంట్లో ఉండవే’ అని నా కూతురు కుసిలిస్తోంది గోముగా.
‘అలా అని కొడుకు ఉండగా, కూతురి తో అల్లుని ఇంట్లో ఉండటం మర్యాదగా ఉండదు కదా! ఏమి నిర్ణయించుకోవాలో? ఇవన్నీ ఎలా భరించాలో’ అనుకుంటూ ఊగిసలాడుతూ ఊహలలో సందేహపు ఉయ్యాల ఊగుతోంది సావిత్రమ్మ మనస్సు!
***
స్కూల్ యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.
యాజమాన్యం వారి ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం పిల్లలతో రకరకాల ఈవెంట్లు చేయిస్తూ ఉంటారు టీచర్లు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి స్కూల్‌కి వచ్చి కార్యక్రమాలకి హాజరవుతూ ఉంటారు.
“డాడీ వస్తానన్నాడా మమ్మీ? డాడీ, నువ్వూ ఇద్దరూ కలిసి మా స్కూల్ సెలబ్రేషన్స్‌కి ఈ సారైనా వస్తున్నారా? లేదా?” అంటూ తల్లిని అడిగింది మృదుల.
“లేదంటే! మనమే దుబాయ్ పోదాం. అక్కడే మేమూ చదువుకొంటాం.” కొడుకు చైతన్య బుంగమూతి పెట్టాడు.
“ఎంతకాలం ఈ ఒంటరి జీవితం? జీవితం మీద విరక్తి వస్తోంది అత్తయ్యా!” అరచింది మాధురి చిరాగ్గా, పిల్లలకి జవాబు చెప్పలేక.
“ఓపికపట్టమ్మా! ఈ కష్టాలూ దిగుళ్లూ ఇక నాలుగు నెలలే లే..” అంటూ కోడలిని ఓదార్చింది సావిత్రి, మృదువుగా ఆమె చుబుకాన్ని స్పృశిస్తూ..
అత్తయ్య కళ్ళలోని నీటిపొరలు గమనించి, ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకున్నదానల్లే, ఆమె వైపు వాలుగంట ప్రేమగా చూసి స్కూటర్ స్టార్ట్ చేసి రోడ్డెక్కి హైదరాబాద్ ట్రాఫిక్‌లో లీనమయ్యింది మాధురి.
ఈసారి ఎలాగైనా.. తన కొడుకు దుబాయ్ నుండి వచ్చి కుటుంబంతోపాటు తనను తీసుకెళతాడని ఆమె నమ్మకం.
భర్తకు దూరంగా ఉండి అవస్థలు పడుతున్న మాధురికి, ధైర్యం చెబుతూనే ఉందామె.
అంతే కాదు.
ఆమె తన ఆఫీసుకు వెళ్ళే వరకూ, హడావిడిగా.. ఇంటిపని చేస్తూ, వంటలు సిద్ధం చేసి, కాచుకొని, చూసుకొని, పిల్లల్ని రెడీ చేసి స్కూల్ బస్సు ఎక్కించటం వరకూ ఏదో తన చేతనైన సాయం చేస్తూనే ఉంది.
కోడలిని ఒక అత్తలా కాదు, కన్నతల్లి లా చూసుకుంటూ, ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటోంది ఆమె, శక్తికి మించిన ప్రయాసపడుతూ, అది తన బాధ్యతగా భావిస్తూ.
***
“పాపం! రాజేష్! అత్తయ్యకి అబద్ధం ఎందుకు చెప్పారు?”
“ఏమి మాట్లాడుతున్నావ్ మాధురీ!”
“ఇండియా వచ్చి మమ్మల్ని దుబాయ్‌కి..”
“ఓ.. అదా? నీవు ఏదో ఇబ్బంది పడుతున్నావనీ, పిల్లలు తండ్రి ప్రేమకు దూరం అవుతున్నారనీ. ఏవేవో ఊరికే తనకు తాను ఊహించుకొని నస పెడుతోంది. డిప్రెషన్‌తో ఆమెకి పిచ్చి పట్టకుండా అలా చెప్పాను. అంతే! ఓ నాలుగు నెలలు ఆ ఆశతో హుషారుగా ఉంటుంది లే” అంటున్న రాజేష్ జవాబుతో సంతోషపడింది మాధురి.
ఎందుకంటే ఆమెకి ఉద్యోగం మానేసి దుబాయ్‌కి వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి.
***
“డాడీ వస్తాడన్నావు కదా! రాలేదే మరి?” చైతన్య కోపంగా చూశాడు నాన్నమ్మ సావిత్రమ్మ వైపు.
“పాపం! డాడీకి వాళ్ళ మాస్టర్ పర్మిషన్ ఇవ్వలేదటరా నాన్నా!” ఓదార్చింది బుగ్గలపై ముద్దుపెట్టి.
కన్నీళ్ళు ఆమెకూ పిల్లలకూ బుగ్గల మీదనుంచి జారి వచ్చి త్రివేణీ సంగమం సృష్టించి ముగ్గురి ముఖాలపై మెరిశాయి ఫంక్షన్ లైట్ల కాంతులతో పోటీ పడుతూ.
***
“మా సాఫ్ట్వేర్ కంపెనీలో.. మా ఇంజనీర్లకూ, పిల్లలకు మాత్రమే టూర్ ప్యాకేజీ. పిల్లలను తీసుకొని వెళ్ళిరానా అత్తయ్యా “ అంటున్న మాధురితో
“క్షేమంగా వెళ్ళి ఆనందంగా రా తల్లీ” అంది సావిత్రమ్మ, పిల్లలు కోడలి ఆనందం కన్నా తనకు కావలసింది వేరే ఏముంది? అనుకుంటూ.
‘ఇండియాలో ఉండిఉంటే హాయిగా కుటుంబం మొత్తం సరదాగా వెళ్ళేవారు కదా! ఈ డబ్బు సంపాదనల పిచ్చిలో పడి, అసలైన సుఖ సంతోషాలకు దూరమై పోతున్నారు పాపం!’ అనుకుంటూ ఆరాటం చెందటంతో గుండెల్లో నొప్పిమొదలైంది సావిత్రమ్మ కి.
అయినా బయటకు కనబడనీయకుండా నవ్వుతూ టాటా చెప్పి పంపింది వాళ్ళకి.
తన నొప్పి గురించి చెబితే.. టూర్‌కి వెళ్లకుండా మానేస్తారేమో? పాపం! వాళ్ళు అయినా ఆనందంగా వెళ్ళి ఎంజాయ్ చెయ్యనీ అని.
***
వాయిదాల మీద వాయిదాలు నెలలు సంవత్సరాలు ఆమె ఆరాటపడేది తన సుఖం కోసం కాదు.
ఆత్మీయంగా అందరూ ఒక చోట కలిసి ఉండటం కోసం.
***
*ఈసారి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. రాకపోతే నేను నీ అమ్మని చచ్చినంత ఒట్టు” అంటూ తన మీదనే ఒట్టు వేయించుకుంది సావిత్రమ్మ. అందుకే కొండంత ధైర్యంతో గడిపింది ఈ నాలుగునెలలు.
అర్థరాత్రి వీడియో కాల్ రావటంతో కోడలు పిల్లల్ని నిద్రలేపి మరీ సంతోషపడింది.
“అమ్మా! దుబాయ్‌లో మా కంపెనీ వాళ్ళతో కలిసి హాయిగా గడిపాను చూడవే” అంటూ వీడియోలు ఫోటోలు చూపెట్టాడు కొడుకు రాజేష్ ఆన్లైన్ వీడియోలో.
“నీవు నీ భార్యా పిల్లలతో హాయిగా ఇలా గడపడం నేను చూడాలిరా వస్తున్నావు కదా! రా రా” అంది ధీమాగా.
“ఇంకో నాలుగు నెలలు..” అంటున్న కొడుకు రాజేష్ మాటలు పూర్తి కాకముందే..
“ఈ జన్మలో నేను బతికి ఉండగా నీవు వస్తావా?” అంటూ కన్నీరు పెట్టుకుంది సావిత్రమ్మ.
“అబ్బ! ఏడ్చి నా మూడ్ పాడు చేయకు. నాలుగు నెలలు ఓపికపట్టు. వచ్చి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తా. అప్పుడు మన పిల్లలతో కోడలితో మాతో వీడియోలు ఫోటోలు తీసుకుందువు గానీ, అన్నీ చూద్దువుగానీ” అంటూ వీడియో కాల్ కట్ చేశాడు రాజేష్, ఎప్పటిలాగానే మళ్ళీ.
***
సావిత్రమ్మ మృత దేహాన్ని చూస్తూనే బావురుమన్నాడు కొడుకు రాజేష్.
“కొడుకుతో పాటు దుబాయ్‌కి పోలేక, వదలి ఇక్కడ ఉండలేక పదేళ్ళుగా డోలాయమానంగా ఎదురు చూసింది పాపం!” అంటూ అంగలార్చాడు ఒకాయన చుట్టూ మూగిన బంధువులను చూస్తూ.
“ఆ ఊగిసలాటలో ఉత్కంఠను తట్టుకోలేక గుండెపగిలి చచ్చిపోయింది పాపం!!” అంటూ నిట్టూర్చింది మరో బంధువు, గతంలో ఆమెతో పంచుకున్న భావోద్వేగాల్ని నెమరువేసుకుంటూ.
