[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
[చాలా రోజుల తర్వాత ప్రామ్లీ నగరానికి వస్తుంది. ఇరానా హబ్‌లోని ఎత్తైన భవనంలో ఓ గదిలో వర్క్ స్టేషన్ ముందు కూర్చుంటుంది. ఎనోడస్ నుంచి ఎన్నో నివేదికలు తెరపై కనబడతాయి. వాటిల్లో అసాధారణమైనది ఏదీ ఆమెకు కనిపించదు. కాసేపయ్యాకా, తనకీ, ఉల్తూర్కి మధ్య ఉండే ఎన్క్రిప్టెడ్ ఛానెల్ తెరిచి, అక్కడ ఉల్తూర్ స్క్రీన్ మీదకి రాగానే ఆమెతో మాట్లాడుతుంది. ఎనోడస్ తీసుకున్న చర్యలపై కౌన్సిల్‌కి నివేదిక ఇస్తావా, సమావేశాన్ని ఏర్పాటు చేయమని అడగనా అని అడుగుతుంది ఉల్తూర్. అప్పుడే వద్దంటుంది ప్రామ్లీ. తాను మరికొంత సమాచారం సేకరించి ఇచ్చేవరకు ఆగమని చెప్తుంది. మాయ ఎవరో తెలుసా అని ఉల్తూర్ ప్రామ్లీని అడిగితే తెలియదంటుంది. దాంతో ఉల్తూర్ కనెక్షన్ కట్ చేసేస్తుంది. తనకీ ఉల్తూర్కి మధ్య ఏర్పడ్డ అగాధం మరింత విస్తరిస్తోందని గ్రహిస్తుంది ప్రామ్లీ. ఇంతలో తెర మీదకి కొత్త నివేదిక రావడంతో, అందులోని అంశాలను క్లెపోకికి పంపుతుంది. ఉల్తూర్ ఫెన్స్ దగ్గరకు వెళ్ళి సీని చచ్చిపోయి పడి ఉన్న చోటు దగ్గర నిల్చుని వస్తుంది, క్రానికల్-i ని ప్రాసెస్ చేస్తుండగా తనకో సందేశం వచ్చినట్టు ట్యాగ్ ద్వారా తెలుసుకుంటుంది. తారా తనంతట తాను నడుస్తున్న క్లిప్‌ను పంపిస్తుంది టియోనీ. కాసేపు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. సీని మరణం గురించి, ఆమె చెప్పిన అభిరుచి గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరూ తార సెల్ స్ట్రక్చర్‌ను ప్రాసెస్ చేయడానికి సిద్ధమవుతారు. ఇంతలో సీనిని ఉద్దేశించి పలకరిస్తూ ఒక గొంతు వినబడుతుంది. తానే మాయననీ, సీనీ తన నేస్తం అని పరిచయం చేసుకుంటుందా స్వరం. సీని లేదని, చంపబడిందని చెప్తుంది ఈవీ. అలా ఎలా చనిపోతుంది, మీ గ్రహంలో మరణాలు లేవు కదా అడుగుతుంది మాయ. మాయ సిస్టమ్ నుంచి తమతో మాట్లాడాన్ని ఊహించలేకపోయింది ఈవీ. బహుశా ఉల్తూర్ అంచనా నిజమే కావచ్చు. సీని మృతి విషయంలో మాయ కీలకం కావచ్చని ఈవీ భావిస్తుంది. ఒక అన్వేషణ ముగిసినట్టు భావిస్తుంది. – ఇక చదవండి.]
అధ్యాయం-3 – అన్వేషణ – 3వ భాగం
టియోనీ గది కిటికీ బయట, కటిక చీకటిగా ఉంది. నక్షత్రాలు బలహీనంగా ప్రకాశిస్తున్నాయి, మూడు చందమామలు నింగిలో దాక్కున్నాయి. తార మరో గదిలో నిద్రపోతోంది. టోబోట్ (1) హాప్ నుండి వెలువడుతున్న ప్రశాంతమైన నీలి కాంతి గదిని ముంచెత్తుతోంది.
మాయ అంతుచిక్కని రీతిలో కనిపించి అదృశ్యమైనప్పటి నుండి ఈవీ, టియోనీ ఆమెను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళిద్దరూ తార మూల కణాన్ని చాలాసార్లు తెరిచి ప్రాసెస్ చేశారు. టియోనీ వర్క్‌స్టేషన్‌లో కూర్చుని, వారు మళ్ళీ ప్రయత్నించారు. తార మూల కణ నిర్మాణం తెరుచుకుంది, ఇంతలో మాయ తన లోహ స్వరంలో, “హలో” అంది. అది ఒక వింత పదం. వారిద్దరూ ఇంతకు ముందు ఎప్పుడూ దానిని వినలేదు.
“ఎలా ఉన్నారు? అలా మాయమైననందుకు క్షమించండి. సీని గురించి దుఃఖించడానికి నాకు కొంత సమయం కావాల్సివచ్చింది. అందుకే క్రితంసారి సంభాషణను అర్ధాంతరంగా ముగించాను. నేను తనని మిస్ అవుతున్నాను. మీరు కూడా మిస్ అవుతున్నావని నాకు ఖచ్చితంగా తెలుసు” అంది మాయ.
“అసలు ఇంతకీ నువ్వెవరు? నీకో ముఖం ఉందా, శరీరం ఉందా?” అంటూ జోక్యం చేసుకుంది ఈవీ.
“నేనా? సరే, నన్ను నేను ఎలా వర్ణించుకోవాలి? చాలా సంవత్సరాల క్రితం మేం మొదటిసారి ఒకరినొకరు కనుగొన్నప్పుడు నేను సీనికి ఎలా చెప్పానో అలాగే మీకు కూడా చెబుతాను. క్షమించండి, నేను ఆమెను చివరి జాక్‌లో (2) కలిసినప్పుడని నా ఉద్దేశం. నేను ఒక స్త్రీ చైతన్యాన్ని; భూమి మీద మీ పూర్వీకురాలిని”, మాయ లోహ స్వరం టియోని చిన్న అపార్ట్మెంట్లో ప్రతిధ్వనించింది.
“నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు?” అసహనంగా అడిగింది ఈవీ.
వారు చివరిసారిగా మాయను కలిసినప్పటి నుండి, మాయ అనేది సీని సృష్టించిన ప్రోగ్రామ్ అయ్యుండచ్చు కదా అని ఈవీ ఆలోచిస్తూ ఉండేది. ఇది అత్యంత తార్కికమైన ముగింపుగా అనిపించింది. అయితే, అద్భుతమైన కూర్పులు తర్కాన్ని ధిక్కరించాయి.
“మీ ప్రపంచాన్ని నడిపే ఈ బృహత్తరమైన వ్యవస్థలో నేను నివసిస్తున్నాను.”
వారిద్దరూ ఆమెను ఇంకేమీ అడగకముందే, ఆమే మళ్ళీ మాట్లాడింది, “ఇప్పుడు, నాదో ప్రశ్న. సీని ఏ ప్రమాదంలో చనిపోయింది? లేదా ఆమెను ఎవరు చంపారు? ఆమెకు ఏమైంది?”
“మాకు తెలియదు. దాని గురించి మాకు నువ్వేదైనా చెప్పగలవని మేము అనుకున్నాము. నిజానికి, ఫెన్స్ (3)కు అవతలి వైపు ఉన్నవారు ఆమెపై విష్ (4) ప్రయోగించారని కౌన్సిల్‌కు నివేదికలు అందాయి. సీనికి ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి నువ్వే కీలకం అని ఉల్తూర్ గట్టిగా అనుకుంటోంది” అని బదులిచ్చింది ఈవీ, ఇప్పుడామెలో ఎంతో ఉపశమనం!
చివరికి విషయం బయటపడింది. మాయను ఎదుర్కోవడానికి వేరే మార్గం లేదు. మరోవైపు టియోనీ ఆశ్చర్యపోయింది. ఫెన్స్‌కి అటువైపు ఉన్నవాళ్ళు సీనిపై దాడి చేశారా! ఆ ఆలోచన అసంబద్ధంగానే కాకుండా ఆందోళనకరంగా కూడా అనిపించిందామెకు. ఆమె ఈవీ వైపు చూసింది. ఈవీ ఎంతో నమ్మకంగా సమాచారం చెప్పింది. అంటే అది సరైనదే అయి ఉండాలి.
అక్కడ దట్టమైన నిశ్శబ్దం ఆవరించింది. హాప్ నుండి వెలువడుతున్న నీలిరంగు కాంతి గదిలో పర్చుకుంటోంది. టియోనీ అశాంతితో ఉంది. ఆమె వెళ్లి కిటికీ దగ్గర ఉన్న తన వాలుకుర్చీలో కూర్చుంది. బయట, నగరం చాలాసేపటి క్రితమే నిద్రలోకి జారుకుంది. చాలా భవనాల్లో లైట్లు ఆపివేశారు.
“విష్ కారణమని నీకు ఎవరు చెప్పారు?” అని టియోనీ ఈవీని అడిగింది.
“ఉల్తూర్. జరగబోయే ఘర్షణ గురించి కూడా కొంత చర్చ జరుగుతోంది. ఇదంతా చాలా గందరగోళంగా ఉంది, టియోనీ. ఫెన్స్‌కి అవతలి వైపు ఎవరున్నారో నీకు తెలుసా? వారు ‘పురుషులు’ అని పిలవబడే మరొక జాతి. వారు కూడా భూమి నుండి మనతో పాటు వచ్చారు. మనం ఇప్పటికే రెండుసార్లు వారితో పోరాడాము. వారు సీనిపై దాడి చేసుంటే, అది తీవ్రమైన విషయం. మాయకీ సీని మరణానికి ఏదో విధంగా సంబంధం ఉందని ఉల్తూర్ భావిస్తోంది. అందుకే నేను మాయ కోసం వెతుకుతున్నాను,” అని ఈవీ నోటి నుండి వచ్చిన మాటలు టియోనీ నిశ్శబ్దపు ఇంట్లో మారుమ్రోగాయి.
“ఈవీ, నువ్వు చెప్పేది నమ్మశక్యం లేదు” అని కొద్దిసేపటి తర్వాత టియోనీ అంది. ఆమెకు ఏమి చెప్పాలో తెలియలేదు. ఆమె కూడా ‘పురుషులు’ అనే పదాన్ని ఎప్పుడూ వినలేదు. అవతలి పక్షం అకస్మాత్తుగా బయటకు వచ్చినట్లు అనిపించింది; ఒక తెర విడిపోయి చివరికి వేదిక కనిపించినట్లుగా. కానీ వాళ్ళు వారిపై ఎందుకు దాడి చేస్తారు? అది అసంబద్ధం.
“నాక్కూడా అయోమయంగానే ఉంది, టియోనీ. కొంతసేపు ఆగుదాం. సీనీ చనిపోవడంలో మాయ పాత్ర ఏమిటో తెలిసిన తర్వాత, నేను ఉల్తూర్‌కు తెలియజేస్తాను. అప్పుడిక ఈ విషయంలో నా పని పూర్తవుతుంది. మాయా, నువ్వు ఉన్నావా?” అని ఈవీ అడిగింది.
“నేను ఇక్కడే ఉన్నాను. నేనెక్కడికి వెళ్తాను? ఆ మనుషులు సీనీని ఎందుకు చంపుతారో అని నేను ఆలోచిస్తున్నాను. మీ నమ్మకానికి విరుద్ధంగా, నాకు దాని గురించి ఏమీ తెలియదు. సీనీ, నేను చాలా విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆమె ఎప్పుడూ చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటోంది. ఆమెలో ఎన్నో ప్రశ్నలు. భూమి మీద జీవితం పట్ల అంతులేని ఆసక్తి కలిగి ఉండేది. వాస్తవానికి, ఆమెకు నా సంగీతం కూడా నచ్చింది..”
సంభాషణలో ఈవీకి ఆసక్తి తగ్గింది. మాయను కనుగొనడం వల్ల ఆ రహస్యం ఛేదించబడలేదు. మాయ సీని గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే, మాయ అనేది అద్భుతమైన సంగీతాన్ని సృష్టించే వ్యవస్థలో ఒక ప్రోగ్రామ్ తప్ప మరేమీ కాదని ఈవీకి అంతగా నమ్మకం కలిగింది. ఆమె గతం నుండి వచ్చినట్లు ఆమె చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా, ఆడంబరంగా అనిపించాయి.
“నువ్వు ఓ ప్రోగ్రామ్వి కదా, మాయా? ఎందుకంటే నువ్వు వ్యక్తివి కాదనేది స్పష్టమవుతోంది” అని ప్రకటించింది ఈవీ.
టియోనీ వాలు కుర్చీలోంచి లేచింది. భూమిపై సీనికి ఉన్న ఆసక్తి గురించి మాయ చేసిన వ్యాఖ్యలు ఆమె దృష్టిని ఆకర్షించాయి. సీని ఎప్పుడూ గతంలోకి తొంగి చూడాలనుకునేదని టియోనీకి తెలుసు. చాలా కాలంగా విస్మృతికి గురైన ఆ సమయానికి లింక్ తానేనని మాయ చెప్పుకుంది.
“మాయా, సీనీకి ‘అభిరుచి’ గురించి నువ్వు చెప్పావా? ఆమె నిన్ను ఎలా కనుగొంది? నువ్వు మా వ్యవస్థలోకి ఎప్పుడు వచ్చావు? ఎలా? నువ్వు ఎవరు?” అడిగింది టియోనీ. ఆమెలోంచి ప్రశ్నలు దూసుకు వస్తున్నాయి. ఆమె మాయను చేరుకుని పట్టుకోగలిగితే బాగుండేది!
కానీ, ఆమెకు వచ్చిన సమాధానం వ్యవస్థ యొక్క మందమైన ‘హమ్’ అనే ధ్వని మాత్రమే. టియోనీ కొంతసేపు వేచి ఉండి, మళ్ళీ “మాయా?” అని పిలిచింది.
“ఆమె వెళ్ళిపోయింది టియోనీ. మోసపోకు. ఇది ఏదో అల్లరి ప్రోగ్రామ్” అని ఈవీ ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించింది. నీలిరంగు కాంతి చుట్టూ వ్యాపించి ఉండగా, టియోనీ ఆ చీకటి గదిలో తన వర్క్ స్టేషన్ దగ్గర కూర్చుంది. ఈవీ వచ్చి ఆమె పక్కనే కూర్చుంది. మాయ మళ్ళీ వస్తుంది. ఖచ్చితంగా.
🚀
కౌన్సిల్ సమావేశం ఇంక కొద్ది రోజుల్లోనే ఉంది. సీని వర్క్‌స్టేషన్‌లో కూర్చుని మాయను కనుగొనడానికి ప్రయత్నించింది ఉల్తూర్. ఆమె ఈవీతో ఏకీభవించింది. మాయ అనేది కేవలం ఒక ప్రోగ్రమ్, పురుషులు తమ వ్యవస్థలోకి జొప్పించారు.
‘ఒక స్త్రీ చైతన్యం’ – ఆ వర్ణనలో ఏదో అశుభం ఉంది. దాని అర్థం ఏమిటి? పురుషులు యుద్ధాన్ని పూర్తిగా వేరే స్థాయికి తీసుకెళ్తున్నట్లు అనిపించింది. ఎలోన్ (5) ను ఇప్పటికే రెండుసార్లు గాయపరిచిన ‘స్థలం’, ‘వనరుల’ కోసం పోరాటం నుండి, వారు ఏదో అస్పష్టమైన, ప్రాణాంతకమైన ఆటకి మారినట్లు అనిపించింది. ఆమె క్రియేషన్ (6), జిజ్ఞాసగల సీని, ఏదో ఒక విధంగా ఈ ఆటలోకి అడుగుపెట్టింది. ఆట ఎందుకు ప్రారంభమైందో, అది ఎక్కడ ముస్తుందో, బహుశా సీనికి తెలిసిపోయినట్టుంది. అందుకే, ఆమెను చంపేశారు.
పజిల్ సరిగ్గా జరిగినట్లు అనిపించడంతో, మాయను యాక్సెస్ చేయడానికి ప్రయత్నాలు మరింత తీవ్రతరం చేసింది ఉల్తూర్. అయితే, ఆమె శోధన ఫలించలేదు. ఉల్తూర్ కూడా తార మూల కణాన్ని యాక్సెస్ చేసి చాలాసేపు వేచి ఉంది. ఆమె టియోని సిస్టమ్ లోకి, వాల్ట్‌లోకి ప్రవేశించింది, తన వద్ద ఉన్న అన్ని శోధన పద్ధతులను ఉపయోగించింది, కానీ మాయ గురించి అస్పష్టతే మిగిలింది.
సీని వర్క్ స్టేషన్ మీద వంగిపోయి, ఉదయం నుండి మాయ కోసం సిస్టమ్‌ని వెతుకుతోంది ఉల్తూర్. ఆమె అలసిపోయింది, నీరసపడింది. వెళ్లి సోఫాలో పడుకుంది.
వారికి తెలిసిన వారి ప్రపంచానికి ఏం జరగబోతోంది?
ఎనోడస్ అధిపతిగా ప్రామ్లీ ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సింది. అయితే, ఉల్తూర్ ఆమెకు చెప్పడానికి సంకోచించింది. ప్రామ్లీ ఎనోడస్కు వెళ్లడం వారి మధ్య సమీకరణాన్ని మార్చివేసింది. అమర్ (7) పంటను పండిచుకోవడానికి ఆమె పర్వత ప్రాంతాలకు వెళ్లడం వల్ల వారి మధ్య ఉన్న అంతరం మరింత పెరిగింది. ఉల్తూర్ ఇంతకు ముందు ఎప్పుడూ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు, కానీ సీని చంపబడడం – వారి మధ్య ఉన్న లోతైన అగాధాన్ని బయటపెట్టింది. ఉల్తూర్ ఏవైనా సమాధానాలు కనుగొనలేకపోతే మాత్రమే ప్రామ్లీని సంప్రదిస్తుంది. వ్యవస్థలో ఏదైనా వింతైన, వివరాలు తెలియని ప్రోగ్రామ్ మూలాన్ని గుర్తించమని ఆమె ఈవీని ట్యాగ్ చేసింది, తన ప్రతిస్పందన కోసం వేచి చూడసాగింది.
ఉల్తూర్ ట్యాగ్ మెసేజ్ చూసినప్పటికి ఈవీ ఇంకా వాల్ట్ లోనే ఉంది. ఉల్తూర్కి మాయ గురించి చెప్పిన తర్వాత, ఆ పరిస్థితి నుండి వైదొలిగింది ఈవీ. తాను ఇకపై అంతుచిక్కని నమూనాల కోసం లేదా వ్యక్తుల కోసం, చాలా తక్కువ వింతైన ప్రోగ్రామ్‌లు వెతకడం లేదు. ఈ విషయాన్ని కౌన్సిల్ స్వాధీనం చేసుకోవాలి. ఉల్తూర్ పంపిన సందేశాన్ని చదివి దానిని డిలీట్ చేసింది ఈవీ. మాయ అనేది సీని కనుగొన్న వ్యవస్థలోని ఏదో ప్రోగ్రామ్ అనీ, ఆమె చేసిన విషయాలను చెప్పడానికి బహుశా సీనినే కల్పించి ఉంటుందని ఈవీకి నమ్మకం కలిగింది. వాస్తవాలు ఎవరికి తెలుసు? మరీ ముఖ్యంగా, ఆ ప్రోగ్రామ్ సంగీతాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది, వేరే భాష మాట్లాడుతుంది కాబట్టి పట్టించుకోనక్కరలేదు. పైగా అది చెడ్డదిగా అనిపించలేదు.
బయట చీకటి పడుతోంది. వాల్ట్ లోని సిస్టమ్‌లను షట్ డౌన్ చేయసాగింది ఈవీ. ప్రాసెసర్లు ఆగిపోతున్నప్పుడు, ఆమె మాయ ఉపయోగించిన కొన్ని వింత పదాలను గుర్తుచేసుకుంది. వాటిలో చాలా వాటి అర్థాన్ని ఆమె కనుగొనగలిగింది. చైతన్యం, లేదా మాయ చెప్పినట్లుగా, ‘ఒక స్త్రీ చైతన్యం’, అత్యంత ఆసక్తికరమైనది.
దీపాలు మసకబారాయి, వాల్ట్ చీకటిగా మారింది. ఈవీ బయటకు అడుగుపెట్టి షటిల్ స్టాప్ వైపు నడిచింది. మూలలో, వాయునం (8) యొక్క లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. రోడ్డు పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది, చీకటిలో మూగబోయిన హల్క్ లాగా, చీకటి రాత్రిలో నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంది.
షటిల్ కోసం వేచి ఉండగా, ఈవీ ‘చైతన్యం’ గురించి ఆలోచించింది. మాయ ప్రకటన అర్థం, పురుషుల చైతన్యం భిన్నంగా ఉంటుందా? ఫెన్స్‌కు అవతలి వైపు నివసించే జీవులు ఎవరు? తాము గ్రహాన్ని వారితో పంచుకున్నప్పుడు పురుషుల గురించి తమకి ఎందుకు అంత తక్కువ తెలుసు? ఈ విషయాల గురించి పురుషులకు భిన్నమైన అవగాహన, దృక్పథం ఉన్నాయా?
షటిల్ వచ్చి ఆమె ముందు ఆగింది. తలుపు తెరుచుకుంది. ఈవీ కదలకుండా స్థిరంగా నిలబడింది. తలుపు మూసుకుపోయింది, షటిల్ వేగంగా వెళ్లిపోయింది. ఈవీ మళ్ళీ వాల్ట్‌కి వెళ్ళింది.
ఇక్కడ ఈవీ తన వర్క్ స్టేషన్‌కు తిరిగి వెళుతుండగా, అక్కడ టియోనీ తారను పడుకోబెడుతోంది. తరువాత, టియోనీ తన వర్క్ స్టేషన్లో కూర్చుంది. మాయ వారితో మాట్లాడినప్పటి నుండి, ఆమె ప్రతి రాత్రి తార మూల కణాన్ని తెరిచి, మాయ తనతో మళ్ళీ మాట్లాడే వరకు వేచి ఉండేది. ఈవీ లాగా కాకుండా, టియోనీకి మాయ ఎవరు లేదా దేనిని సూచిస్తుందో ఖచ్చితంగా తెలియదు. సీని మాయతో సంభాషించిందని ఆమెకు ఖచ్చితంగా తెలుసు. మాయ పురుషులతో సంబంధం కలిగి ఉంటే, సీని చనిపోయిందని ఆమెకు తెలిసి ఉండేది. టియోనీ ఏదైనా నిర్ణయానికి వచ్చేముందు, ఆమె మాయను చాలా ప్రశ్నలు అడగాలనుకుంది. సీని మాయతో ఎప్పుడు కనెక్ట్ అయిందో టియోనీ తెలుసుకోవాలనుకుంది. మాయ ఏ గతానికి చెందినదని చెప్పుకుంది? ఎంతకాలం క్రితం? స్త్రీ చైతన్యం గురించి మాయకు ఏమి తెలుసు? మాయ ద్వారా సీనికి భూమిపై అంత ఆసక్తి కలిగిందా? మాయ కారణంగానే సీనిని హత్య చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్న తర్వాతే, టియోనీ – మాయ గురించి తన నిర్ణయం తీసుకుంటుంది.
చీకటి పడుతున్న కొద్దీ, టియోనీ తన వాలు కుర్చీలో కూర్చుని మాయ కోసం ఎదురు చూడసాగింది. ఆకాశంలో కదులుతున్న నక్షత్రాలు ఆమెను రిలాక్స్ అయ్యేలా చేస్తాయి, అలాంటప్పుడు ఆమె తరచుగా అక్కడే నిద్రపోతుంది. ఆకాశంలో మెరుస్తున్న గోళాలను చూసినప్పుడు, తానూ సీని చివరిసారిగా కలుసుకున్న సంగతిని గుర్తుచేసుకుంది. తార రాక గురించి వారు చర్చించుకున్నారు. టియోనీ ప్రణాళికలు వేసుకుంటూ, సిద్ధం అవుతూ, మాన్యువల్స్ చదువుతూ, ఆందోళన తోనూ, ఆత్రుతతో ఉండేది. సీని ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పిందా లేదా, మాయ గురించి ప్రస్తావించిందా అని టియోని గుర్తుచేసుకోడానికి ప్రయత్నించింది.
వర్క్‌స్టేషన్ స్క్రీన్ నుండి వచ్చే కాంతి దాని చుట్టూ చిన్న వలయాన్ని సృష్టించింది. సెల్ నిర్మాణం తెరిచి ఉంది.
టియోని మెల్లగా పిలిచి, “మాయా, నువ్వు ఉన్నావా? నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను” అని అంది.
రాత్రి నిశ్శబ్దంలో వ్యవస్థ హమ్ ధ్వని స్పష్టంగా వినిపించింది.
“టియోనీ, భూమిపై క్రియేషన్ చాలా భిన్నంగా జరిగింది. ఇది మన ప్రపంచంలో మనం ఊహించలేని ప్రక్రియ” అని సీని చెప్పిన మాటలు అకస్మాత్తుగా ఆమె చెవుల్లో మ్రోగాయి. వారు చివరిసారిగా కలిసిన సమయంలో ఆమె ఇలా చెప్పింది. తార రాకకు సన్నాహాలు చేస్తూ, టియోనీ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు, ఆమెకు నిద్ర ముంచుకురావడంతో సీని చెప్పిన మాటలు ఆమె మనసులో బిగ్గరగా, స్పష్టంగా వినిపించాయి. కొద్దిసేపటికే ఆమె పూర్తిగా మేల్కొంది. ఆమె ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటోంది.
‘మాయా, దయచేసి తిరిగి రా. నీకు తెలిసినది చెప్పు’, అని టియోనీ చీకటిలో వేడుకుంది.
నిద్రాణస్థితిలో ఉన్న నగరం మీదుగా మెల్లగా గాలి వీస్తోంది. మూడు పున్నమి చందమామలు ప్రపంచాన్ని తమ వెండి మెరుపులో ముంచెత్తుతూ అర్థం చేసుకుని నవ్వుతున్నట్లు అనిపించింది.
—-
ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:
(1) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి
(2) Zacs, జాక్స్ = సంవత్సరాలు
(3) Fence ఫెన్స్= సరిహద్దు
(4) Vish, విష్ = విషమయమైన పదార్థం
(5) Elone, ఎలోన్ = ఒక గ్రహం
(6) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం
(7) Amar = శరీర అవయవాల రీప్లేస్మెంట్లో ఉపయోగపడే ఒక మొక్క
(8) Vayunum, వాయునం = విద్యాకేంద్రం
(మళ్ళీ కలుద్దాం)
రచయిత్రి పరిచయం:
రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.
https://themindprism.com అనే బ్లాగ్/వెబ్సైట్ నిర్వహిస్తున్నారు.
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’ అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ అనువదించారు. ప్రముఖ హిందీ గీత రచయిత ఆనంద్ బక్షి జీవితచరిత్రని తెలుగులోకి అనువదించగా, ఇటీవల పుస్తక రూపంలో వెలువడింది.
ఓ ప్రముఖ ప్రచురణ సంస్థ కోసం అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు (అముద్రితం).
ప్రస్తుతం డా. సాధనా శంకర్ రచించిన Ascendance అనే సైన్స్ ఫిక్షన్ నవలని, డా. సుధాంశు మణి గారి My Train 18 Story ని అనువదిస్తున్నారు.
‘దేవుడికి సాయం’, ‘ఆహ్లాదపురం ఆరో వీధి’ అనే కథాసంపుటాలు, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.
