Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-14

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[టియోనీ గది బయట బాగా చీకటిగా ఉంటుంది. తార మరో గదిలో నిద్రపోతూ ఉంటుంది. అంతుచిక్కని రీతిలో వినిపించి, అదృశ్యమయిన మాయ గురించి చాలా సేపు ఆలోచిస్తుంది టియోనీ. తర్వాత ఈవీతో కలిసి తార మూల కణాన్ని తెరిచి చాలా ప్రాసెస్ చేస్తారు. తార మూల కణ నిర్మాణం ద్వారానైనా మాయ గురించి ఏమైనా సమాచారం తెలుస్తుందేమోనని తెగ వెతుకుతారు. తర్వాత మాయ గొంతు వినిపిస్తుంది. తన గురించి పరిచయం చేసుకుంటూ తానొక స్త్రీ చైతన్యాన్ని అని చెబుతుంది. ఈవీ ఆమెకి ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. జవాబులు చెప్పే ముందుగా, అసలు సీనిని ఎవరు చంపారు అని అడుగుతుంది మాయ. మాకు తెలియదు, నీకు తెలిసుంటుందని, నువ్వు చెప్తామని మేము అనుకున్నామని అంటారిద్దరూ. మాయ నుంచి ఏ జవాబు రాదు. ఫెన్స్‌కి అవతలి వైపుండే పురుషులు సీనిపై దాడి చేసి, విష్ ద్వారా చంపేసి ఉంటారని ఉల్తూర్ భావిస్తోందని ఈవీ అంటుంది. టియోనీ ఆశ్చర్యపోతుంది. విష్ ద్వారా చంపినట్టు నీకెలా తెలుసని టియోని అడుగుతుంది. ఉల్తూర్ చెప్పిందని, ఇంకా పురుషులతో జరగబోయే ఘర్షణ గురించి కూడా చెప్పిందని అంటుంది ఈవీ.  కాసేపటికి మాయ గొంతు మళ్ళీ వినిపిస్తుంది. సీని తాను భూమి మీద జీవితం గురించి మాట్లాడుకునేవారమనీ, ఆమెకి తన సంగీతం నచ్చించని మాయ చెబుతుంది. ఈవీ మాత్రం మాయ ఓ ప్రోగ్రామ్ అనే నమ్ముతుంది. అభిరుచి గురించి మాయని అడిగేందుకు ప్రయత్నిస్తుంది టియోనీ. కానీ ఆమె మరింక మాట్లాడదు. కౌన్సిల్ సమావేశానికి ఎక్కువ రోజులు లేకపోవడంతో, సీని వర్క్ స్టేషన్‍లో కూర్చుని మాయ గురించి వివరాలు కనుక్కోవడానికి ప్రయత్నిస్తుంది ఉల్తూర్. మాయ అనేది ఓ ప్రోగ్రామ్ అనీ, దాన్ని ఎవరో తమ సిస్టమ్ లోకి జొప్పించారన్న ఈవీ అభిప్రాయంతో ఉల్తూర్ ఏకీభవించింది. సీని వర్క్ స్టేషన్‍లోని సిస్టమ్ వెతుకుతుంది. తనకున్న యాక్సెస్‌తో టియోని సిస్టమ్ లోకి, వాల్ట్ లోకి వెళ్ళి కూడా చూస్తుంది. కానీ ఏ సమాచారమూ దొరకదు. మరో పక్క ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రామ్‌లీ, ఈవీ తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. టియోనీ ఇంట్లో తన వర్క్ స్టేషన్ వద్ద కూర్చిని మాయని తలచుకుంటుంది. ఆమెని సంప్రదించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. – ఇక చదవండి.]

అధ్యాయం-3 – అన్వేషణ – 4వ భాగం

“నన్ను పిలవడంలోని అర్థింపు, పట్టుదల నాకు నచ్చాయి, అందుకే స్పందిస్తున్నాను. టియోనీ, ఎందుకు రాత్రంతా మేలుకొని, ప్రతీ రాత్రి నన్ను పిలుస్తున్నావు? చాలా కాలం క్రితం ఎవరో నా హృదయ తంతులను గుంజి నన్ను పిలిచినట్టుగా ఉంది ఇప్పటి నీ పిలుపు.” అంది మాయ.

ఉన్నట్టుండి మెలకువ వచ్చింది టియోనీకి. ఇదంతా కలేమో అనుకుంది.

వర్క్ స్టేషన్ నుండి ఒక కాంతి ధార వెలువడుతోంది. బయట, ఆకాశంలో మూడు చందమామలు మెరుస్తున్నాయి. కానీ అంతా నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంది.

“మాయా, ఇక్కడ ఉన్నావా?” అని ఆ నిశీధి నిశ్శబ్దంలో గుసగుసగా అడిగింది టియోనీ.

“అవును. ఈమధ్య చాలా మంది నా కోసం అవిశ్రాంతంగా వెతుకుతున్నారు. కానీ, నేనంత సులువుగా అందరికీ దొరకను, టియోనీ. నేను ఒక చైతన్యాన్ని. నన్ను చేరుకోవలంటే, నా ఉనికిని అనుభూతి చెందాలి.”

టియోనీ లేచి వచ్చి తన వర్క్ స్టేషన్‌లో కూర్చుంది. ఆమె కళ్ళనింకా నిద్రమత్తు వదల్లేదు, బరువుగా ఉన్నాయి. కానీ ఆమె మనసు మాత్రం చురుగ్గా ఉంది. ఆమె మాయను ఎన్నో విషయాలు అడగాలనుకుంది. మాయ మళ్ళీ అదృశ్యమైపోవడం టియోనీకి ఇష్టం లేదు. ఆమె వారి మధ్య ఉన్న ఉమ్మడి అంశాన్ని ఎంచుకుంది, “మాయా, నీకు సీని ఎలా తెలుసు?”

“ఆమె తన మూలాల కోసం వెతుకుతోంది, మన మూలాలు మన చైనత్యంలో ఉంటాయి కదా, అలా మేము కలుసుకున్నాము” మాయ లోహ స్వరం చీకటిలో ఖంగున మ్రోగుతోంది.

“నువ్వు ఎప్పుడు కలిశావు? అంటే ఎంతకాలం క్రితం మాయా? మరి సీని నీ గురించి నాకు ఎందుకు చెప్పలేదు?” టియోని పట్టు కొనసాగింది.

“గతం గురించి తనెందుకు అంతగా తెలుసుకోవాలని ఎందుకు కోరుకుంటోందని మీరు ఎప్పుడైనా సీనిని అడిగారా? ఆమె మీకు చెప్పలేదు. ఎందుకంటే మీరు ఒక చైతన్యంతో సంభాషించడం గురించి ఆలోచించరని సీని భావించి ఉంటుంది. లేదా, నీ స్నేహితురాలు ఈవీ లాగా, నువ్వు కూడా నా ఉనికిని అన్నిరకాలుగా అనుమానిస్తావు!”

అంటే, సీని ‘అభిరుచి’ అనే పదాన్ని మాయ నుండే తెలుసుకుందన్న మాట! టియోనీ క్రియేషన్ (1) గురించి, ఇంకా చాలా విషయాల గురించి మాయని అడగాలనుకుంది. అయితే, మాయతో మాట్లాడే ముందు టియోనీ తన ఆలోచనలను క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంది.

“మాయా, నువ్వు మళ్ళీ రేపు రాకూడదు? ఈవీని కూడా రమ్మంటాను. తను నిన్ను అనుమానించడం లేదు. కానీ, ఇలాంటివి ముందెప్పుడు చూడకపోవడం వల్ల ఆమెకి సందేహంగా ఉంది. ఇంతకీ నువ్వు ఏ గతానికి చెందినదానివి, అప్పట్లో స్త్రీగా ఉండటం ఎలా ఉండేదో నువ్వు, ఈవీకి, నాకు మరింత వివరంగా చెప్దూగాని.” అంది టియోనీ. ఈ చర్చలో ఈవీ కూడా ఉంటే బాగుంటుందని టియోనీ అనుకుంది. ఆమె పరిస్థితులకు భిన్నంగా స్పందిస్తుంది. ఇద్దరూ కలిస్తే, వారు మాయను బాగా అర్థం చేసుకోగలుగుతారు.

సిస్టమ్ నుంచి హమ్మింగ్ ధ్వని వస్తోంది. మాయ వెళ్ళిపోయిందేమో అనుకుంది టియోనీ. మాయ స్పందించే వరకు ఆమె వేచి ఉంది.

“నువ్వు గతం గురించి, నా గురించి వినాలనుకుంటున్నావా? నేను ‘మాయ కథ’ అని పిలవడానికి ఇష్టపడే ఉదంతంలో సీని ఉంది. కానీ, దానిని విశాల దృక్పథంతో, ఎటువంటి పక్షపాతాలు లేకుండా వినాలి.”

ఇప్పుడు చిరపరిచితంగా తోస్తున్న ఆ గొంతులోని చిరునవ్వుని టియోనీ గుర్తించగలిగిందా?

“అవును, మేము నీ కథ గురించి వినాలనుకుంటున్నాము. కానీ ఇవాళ వెళ్ళే ముందు, ఒక విషయం చెప్పు మాయా, సీని మాకు పంపిన మ్యూజిక్ ఫైల్ లోని సంగీతం నువ్వే స్వరపరిచావా? అది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఇన్ని జాక్‌ (2)లలో, మేము విన్న దానికంటే అది చాలా భిన్నంగా ఉంది.”

“టియోనీ, సంగీతం ఎల్లప్పుడూ ఒక కాలానికి చెందినది, కానీ కొన్నిసార్లు, అది కాలాతీతమైనది. నేను మ్యూజీషియన్‌ని, అవును, మీరు విన్న ఆ మ్యూజిక్ నేనే స్వరపరిచాను. సరే, మళ్ళీ రేపు కలుద్దాం.”

ఈసారి సిస్టమ్ మూగపోవడంతో, మాయా వెళ్ళిపోయిందని టియోనీ గ్రహించింది.

🚀

సాయంత్రమైంది, చీకటి పడుతోంది. హాప్ కనుసన్నల్లో తారా నిద్రపోతోంది. మూడు చందమామాలు చీకటి ఆకాశంలో నెమ్మదిగా స్వారీ చేస్తున్నాయి, నక్షత్రాలు వాటికి తోడుగా ఉన్నాయి. పగలంతా పనిచేసి అలసిన టియోనీ ఈవీ కోసం వేచి ఉంది. ‘మాయ కథ’ గురించి సీని తనతో ఎందుకు ఎప్పుడూ చెప్పలేదని ఆశ్చర్యపోయింది టియోనీ. ఒక మరణం తాలూకు విషాదం ఇది – ఇక వారిని మళ్ళీ ఏమీ అడగడలేం. తరచూ ఎదురయ్యే ఈ ఘటనతో మునుపటి ప్రజలు ఎలా జీవించారో అనుకుంటూ ఆశ్చర్యపోయింది.

ఈవీ లోపలికి వచ్చింది. ఆమె పొట్టి జుట్టు చిందరవందరగా ఉందని, ఆమె చూపుల్లో అపనమ్మకం ఉందని గమనించింది టియోనీ.

“బయట ఈదురు గాలి వీస్తోంది, ఈవీ?” అని అడిగింది టియోనీ, ఈవీ మానసిక స్థితిని తేలికపరచడానికి.

“అవును”, అని జవాబిచ్చి, “ఆమె వచ్చిందా?” అని అడిగింది ఈవీ.

“ఇంకా రాలేదు. నేను ఆమెను పిలవడానికి ముందు – నీ కోసం ఎదురు చూస్తున్నాను.”

వర్క్ స్టేషన్ పక్కన ఉన్న కుర్చీలో ఈవీ కూర్చుంది. ఆమె ఎందుకో ఇబ్బందిగా ఉన్నట్టు టియోనీకి అనిపించింది.

“మాయ అనేది మన సిస్టమ్ లోకి పురుషులు ప్రవేశపెట్టిన పోగ్రామ్ అయితే? అప్పుడెలా టియోనీ? మనం వాళ్ళ ఆటలో పావులమైపోతాం. వాళ్ళ గురించి, వాళ్ళతో మన ఘర్షణల గురించి నాకు బాగా అర్థమైంది. మనం వాటిని విస్మరించాము, బహుశా చాలా కాలంగా అవి లేనట్లుగా జీవిస్తున్నాము. కానీ అవి ఉన్నాయి, ఎల్లప్పుడూ ఫెన్స్‌ (3) కి అవతల ఉన్నాయి. ఎలోన్‌ని (4) చేజిక్కించుకోడానికి పదే పదే మనతో పోరాడిన జాతి వాళ్ళు!”

“అలా అయితే, మనం మాయతో కలిసి మగవాళ్ళేం చేయాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఈవీ” అంది టియోనీ.

గదిలో నిశ్శబ్దం అలుముకుంది. టియోనీ కిటికీ దగ్గర ఉన్న తన కుర్చీ లోంచి లేచింది. మాయతో మాట్లాడడానికి ప్రయత్నించే సమయం దగ్గరపడుతోంది. ‘మాయ కథ’ వినిపించడానికి ఎంతసేపు పడుతుందో తెలియదు.

సిస్టమ్‍లో ధ్వని వినిపించింది.

“మీరిద్దరూ ఉన్నారా?” అంటూ మాయ గొంతు వినబడింది.

టియోనీ ఆమెను పిలవడానికి ముందే మాయ లోహపు స్వరం గదంతా వ్యాపించింది.

“అవును. నేను నిన్ను పిలుద్దామని అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. మేమిద్దరం నువ్వు చెప్పేవి వినడానికి ఆసక్తిగా ఉన్నాం మాయా,” అంది టియోనీ.

“మాయా, నువ్వు నీ కథను ఆ పురుషులకు కూడా చెప్పావా? నీకు వాళ్ళతో ఏమైనా సంబంధం ఉందా?” అంటూ జోక్యం చేసుకుంది ఈవీ.

“ఆ పురుషులా? ఫెన్స్‌కి అవతలి వైపు నివసించే వారికి ఈ కథ తెలుసో లేదో నాకు తెలియదు. ఇది నాది కాదు, మీది కాదు లేదా వాళ్ళదీ కాదు. ఇది మనది. ఈ కథ స్త్రీపురుషులు ఇద్దరి గురించి.” చెప్పింది మాయ.

ఆ మాటలు గదిలో తచ్చాడుతూ, దట్టంగా, మబ్బుగా ఉన్న ఆవిరిలాగా, వర్క్ స్టేషన్ దగ్గర కూర్చున్న ఆ ఇద్దరు స్త్రీలను గందరగోళానికి గురిచేస్తున్నాయి.

“మాయా, నువ్వు సీనికి చెప్పినది మాకెందుకు చెప్పకూడదు? సంభాషణ ప్రారంభించడానికి మంచి టాపిక్ అవుతుంది” అంది టియోనీ.

“మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే, ఏమి అడగాలో మీకు తెలియాలి. సీనికి సరైన ప్రశ్నలు ఎలా అడగాలో తెలుసు. నేను కథలు చెప్పేదాన్ని కాదు.”

మాయతో మాట్లాడటం అంత సులభం కాదని టియోనీ గ్రహించింది.

“నువ్వు గతం నుండి వచ్చావని చెప్పావు. ఏ గతం నుండి? క్లాష్-i సమయంలో నువ్వు అక్కడ ఉన్నావా?” అడిగింది ఈవీ.

ఆ కథకు పురుషులతో సంబంధం ఉందని మాయ ఒప్పుకున్నాకా, మాయ అనేది స్త్రీజాతిని గందరగోళపరిచేందుకు ప్రవేశపెట్టబడిన ప్రోగ్రామ్ అని ఈవీకు మరింత నమ్మకం కలిగింది.

“ఈవీ, ఎలోన్‌లో నీకు ముందు ఉన్న స్త్రీలందరూ ఎక్కడి నుండి వచ్చారో నీకు తెలుసా?” మాయ అడిగింది.

“తెలుసు. భూమి – అనే చాలా దూరంలో ఉన్న ఒక గ్రహం, నాశనమైన గ్రహం నుంచి వచ్చారు.” అంది ఈవీ.

“అవును, నేను కూడా భూమి నుండి వచ్చాను” చెప్పింది మాయ.

మళ్ళీ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని తారా ఏడుపు బద్దలు కొట్టింది. హాప్ పాపని జోకొట్టడంతో మళ్ళీ నిద్రలోకి జారుకుంది. కొన్ని విషయాలు చెప్పేందుకు మాయ సిద్ధంగా లేదని టియోనీ గ్రహించింది. సంభాషణ దిశను మార్చుకోవాల్సి వచ్చింది.

“మాయా, నీ అభిరుచి ఏమిటి?” అని ప్రశ్నిస్తూ నిశ్శబ్దాన్ని ఛేదించింది టియోనీ.

“ఆ పదాన్ని నువ్వు వాడటం ఆసక్తికరంగా ఉంది, టియోనీ. నువ్వు సీని నుండి విన్నావని నేను నమ్ముతున్నాను! నేను దాని గురించి ఆమెకు చెప్పాను. అది నీ ప్రపంచంలోకి వచ్చేసింది. సమయం అనేది విలువైన, పరిమిత వనరు కానప్పుడు, అభిరుచులు ఎన్నో ఏర్పడతాయి. నా అభిరుచి సంగీతం. నిజానికి, భూమి మీద, సంగీతం, ఆర్యన్ మాత్రమే నా రెండు అభిరుచులు” చెప్పింది మాయ.

“మాకు సంగీతం అంటే ఏమిటో తెలుసు కానీ ‘ఆర్యన్’ అంటే ఏమిటి?” అని అడిగింది ఈవీ.

సమయం గురించి మాయ చేసిన వ్యాఖ్య ఆమె దృష్టిని ఆకర్షించింది.

“సమయం ఒక వనరు అని, పైగా అది పరిమితమైనదని ఎందుకు అంటున్నావు? అది ఓ ప్రవాహం లాంటిది, శాశ్వతమైనది కదా” అంది ఈవీ.

“సరే, ఈవీ, చెప్పు, మీకు ఏయే వనరులు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావు?” మాయ గొంతు ఓపికగా ఉంది.

“మేము, ఎలోన్‌లో మా వైపు ఉన్న విజ్ఞానం, అమర్ (5), నీరు, చెట్లు, పువ్వులు,  అన్నీ మా వనరులే అని నేను అనుకుంటున్నాను. కాలం మనతో పాటు ప్రవహిస్తుంది, శాశ్వతంగా ఉంటుంది. దానికి స్వతంత్ర ఉనికి లేదు.” చెప్పింది ఈవీ. ఇంతకు ముందు ఎప్పుడూ అలాంటి వాటి గురించి ఆమె ఆలోచించలేదు. మాయ అనేది చాలా ఆసక్తికరమైన ప్రోగ్రామ్, అనుకుంది ఈవీ.

మరోవైపు, సంభాషణ అసలు విషయానికి మళ్ళకపోవడంతో టియోనికి అశాంతిగా ఉంది.

“మాయా, మేము ఇక్కడ నువ్వు చెప్పేది వినాలని కూర్చున్నాము, ప్రశ్నలు, జవాబులు ఇచ్చిపుచ్చుకోవడానికి కాదు” అని జోక్యం చేసుకుంది టియోనీ.

“టియోనీ, ఒక చైతన్యం నుండి నువ్వు నేర్చుకుని అర్థం చేసుకోవడానికి ఏకైక మార్గం అది నిన్ను కూడా ప్రశ్నించనివ్వడమే..” అంది మాయ. అలా అంటున్నాప్పుడు వెలువడిన నవ్వు – ఆమె లోహ స్వరానికి భిన్నంగా, కాంతితో కూడిన ధ్వనిలా గది అంతా తేలియాడింది.

“నువ్వు కూడా భూమి నుండి వచ్చావని ఇంతకు ముందు చెప్పావు. అప్పుడు, ఎప్పుడు, ఎందుకు మా సిస్టమ్ లోకి ప్రవేశించావు? నువ్వొక్కదానివేనా లేదా నీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా?” అడిగింది ఈవీ. మాయ ఏం చెబుతుందో వినడానికి ఇప్పుడు వాళ్ళు ఆసక్తిగా ఉన్నారు.

“మాయా, భూమి ఎలా ఉండేదో నీకు గుర్తుందా? నీ మరో అభిరుచి ‘ఆర్యన్’ అంటే ఏమిటి? అది నీ సంగీతమంత బాగుంటుందా?” టియోనీ కూడా తన ప్రశ్నలను సంధించింది.

అయితే, మాయ నవ్వు గదిలోని వాతావరణాన్ని తేలికపరిచింది. బయట చీకటి దట్టంగా ఉంది, కానీ గదిలోని దీపపు నీలిరంగు కాంతి, సిస్టమ్ నుంచి వెలువడుతున్న కాంతి గదిని ప్రశాంతవంతంగా చేస్తున్నాయి. మాయ అక్కడ ప్రత్యక్షంగా లేదని మర్చిపోవడం సులభం. ఆ వెచ్చని కాంతిలో ఆమె వారిద్దరిలాగే, వాస్తవమైన స్త్రీలానే అనిపించింది.

🚀

నగరంలోని తన నివాసంలో, ప్రామ్‌లీ చీకట్లో కూర్చుని ఎనోడస్ నుండి అందిన ఇన్‌పుట్‌లను ప్రాసెస్ చేస్తోంది. వాళ్ళకి ఇంకా మాయ జాడ తెలియలేదు. ప్రామ్‌లీ కాసేపు ప్రాసెసింగ్ ఆపింది. లేచి రెండు ఇనోలా రొట్టెల మధ్య కొరివ్ సాస్, కూరగాయలను ఉంచి, ఓ గ్లాసులో రిచ్ రెడ్ వైన్ పోసుకుని తెచ్చుకుని, సోఫాలో కూర్చుంది. తినడం ప్రారంభించగానే, ఇప్పుడే తెలిసిన సమాచారపు ఆలోచనలు తలలో ముసురుకున్నాయి.

మాయకి సంబంధించి ఈ రహస్యం ఏమిటి? ఎంత వెతికినా ఏ ప్రోగ్రామ్, వ్యక్తి, చొరబాటు వంటి ఎటువంటి జాడ కూడా ఎందుకు దొరకడంలేదు?

ప్రామ్‌లీ సీని పంపిన మ్యూజిక్ ఫైల్‌ని ట్యాగ్ చేసి దానిని ప్లే చేయసాగింది. రాత్రిపూట స్వరాలు ప్రవహిస్తుండగా, ఆ రాగంలో ఉపయోగించిన వాయిద్యాలను ప్రాసెస్ చేయడం ప్రారంభించింది ప్రామ్‌లీ. కొన్నిటిని వెంటనే గుర్తించింది, కానీ కొన్ని చాలా వరకు తెలియలేదు. ఎందుకంటే అవెప్పుడూ ఎలోన్‌లో వినబడలేదు. సిస్టమ్ మళ్ళీ  నిశ్శబ్దమైపోయింది. అప్పుడు, ప్రామ్‌లీ వాల్ట్‌లోకి ప్రవేశించి అందుబాటులో ఉన్న అన్ని రికార్డులలోని అన్ని వాయిద్యాలను ప్రాసెస్ చేసింది, కానీ ఆమె ఏ సమచారమూ లభించలేదు. ఆ సంగీతాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రామ్‌లీకి తెలుసు. అది మాయ ఉనికిలో ఉందని నిరూపించింది. ఆమె భోజనం ముగించి, మాయ కోసం వెతుకులాటకు సంబంధించిన నివేదికలను మళ్ళీ ప్రాసెస్ చేయడం కొనసాగించింది. దీపాలు మరింత మసకబారాయి కానీ ఆమె పట్టుదలతో ఉంది. మాయకు ఆ పురుషులకీ ఏదో లంకె ఉంది, ఆమెకు అది ఖచ్చితంగా తెలుసు. వాళ్ళే బహుశా ఈ సంగీతాన్ని సృష్టించి ఉండవచ్చు. కానీ, వాళ్ళ ప్రణాళిక ఏమిటి? వాళ్ళు సంగీతాన్నే ఎందుకు ఎంచుకున్నారు?- అర్థం కాలేదు ప్రామ్‍లీకి.

ఎనోడస్ సేకరించిన సంభాషణలలో, సీని మరణం, నెపో నిల్వల క్షీణత – ప్రముఖంగా ఉన్నాయి. త్వరలో సైనైడ్ ముఖ్యమైన సమావేశం జరగబోతోందని కూడా ఎనోడస్ కనుగొంది. ఈ సంగీతం, మాయ ఎక్కడ నప్పుతాయి? ఇదంతా సీనికి ఎలా తెలిసింది?

ఏవైనా మార్మిక సందేశాలు లేదా రహస్య కోడ్‌ ఉందేమో చూద్దామని ఆ మ్యూజిక్ ఫైల్‍ని బ్రేక్ చేసేందుకు ప్రయత్నించింది ప్రామ్‌లీ. ఆ విశ్లేషణ కోసం వేచి ఉండగా, ఆపరేషన్ గురించిన నివేదికలు ఆమెకు అందాయి.

ఆమె వివరాలను పరిశీలిస్తుండగా, ప్రామ్‌లీకి బాగా అలవాటైన అవధుల్లేని ఉత్సాహం కలిగింది. వారి ఆపరేషన్ ముగింపు దశకు చేరుకుంది. బాగా ప్రణాళిక వేసిన ఒక ప్రయత్నం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అంతా మారుతుంది. ఈ ప్రణాళికలను రూపొందిస్తున్నప్పుడు, ఉల్తూర్ తనతో కలిసి పనిచేస్తుందని ఆమెకు ఖచ్చితంగా తెలుసు, కానీ వారి ప్రస్తుత పరస్పర చర్యలు ఒత్తిడిలో ఉన్నాయి. ప్రామ్‌లీ ఒంటరిగా పని చేయాల్సి ఉంటుంది; అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉల్తూ‌ర్‌ను సంప్రదించాలి.

ఎట్టకేలకు మ్యూజిక్ ఫైల్ విశ్లేషణ వచ్చింది. ఆ మధురమైన ధ్వనిలో ఎలాంటి నమూనాలు, సంకేతాలు, సందేశాలు దాగి లేవు. అది స్వచ్ఛమైన, కులాసాగా పాడుకునే సంగీతం. కానీ, అది వారి ప్రపంచానికి చెందినది కాదు.

ప్రామ్‌లీ ఆ మ్యూజిక్ ఫైల్ మూలాన్ని వెతకడం కొనసాగించమని ఎనోడస్‌లో ఒక టోబోక్‌ (6)కి బాధ్యత అప్పజెప్పింది. మిగిలిన వారు ఆపరేషన్‌లో బిజీగా ఉన్నారు. ఏ వింత రాగమో లేదా దాని రహస్య స్వరకర్తో తన దారిలోకి రాబోరని ఆమెకు స్పష్టంగా తెలుసు.

సంగీతం మళ్ళీ వినిపించడం మొదలైంది, ప్రామ్‌లీ ఆ శ్రావ్యమైన స్వరాలను వింటూ నిద్రలోకి జారుకుంది. కిటికీ లోంచి, సూర్యుని తొలి కిరణాలు కనిపించాయి. తనని గుర్తించలేకపోయినా, ఇప్పటికీ తనపట్ల ఆకర్షితులున్న ఆ ప్రపంచంలో ఆ తొలి వేకువలో మాయ పంపిన మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంది.

🚀

“నాకు మొదటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. అది నా జీవితంలోకి వెలుగునిచ్చింది. సంగీతం నా జీవితానికి అర్థాన్నిచ్చింది” చెప్పింది మాయ.

“నువ్వు సీనిని ఎలా కలిశావు?” అడిగింది ఈవీ.

“మనం యాదృచ్ఛిక ప్రశ్నలు అడగడానికి బదులుగా ఈ సంభాషణను సరిగ్గా నిర్మించాలి. మాయా, అప్పుడే మేము నీ గురించి, నువ్వు దేనికి ప్రాతినిధ్యం వహిస్తున్నావో తెలుసుకోగలం” అని టియోనీ ప్రకటించింది.

ఆమె భూమి గురించి తెలుసుకోవాలనుకుంది, ఈవీ ఎలోన్‌లో మాయ ఉనికి గురించి మరింత తెలుసుకోవాలనుకుంది.

మాయ నవ్వు మళ్ళీ గదిలో వినిపించింది. “మీకు నిజంగానే అమ్మాయిల గుంపు ఎలా మాట్లాడుకుంటుందో తెలియదా? టియోనీ, చైతన్యానికి నువ్వు నియమాలను నిర్దేశించలేవు. అదంతే. నువ్వు దానితో నిమగ్నమవ్వాలి లేదా పట్టించుకోకూడదు” అంది మాయ.

మాయ ఏదో చెబుతుందని ఈవీ, టియోనీ ఎదురు చూస్తుండగా నిశ్శబ్దం అలుముకుంది. కొంతసేపటి తర్వాత, మాయ గొంతు వినిపించింది, “నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా, సీని తన మూలాల కోసం వెతుకుతోంది. ఈవీ, మీ వాల్ట్‌లో భూమికి సంబంధించి ఉన్న అన్ని డేటాబేస్‍లను జల్లెడ పట్టడానికి ఆమె ఎన్నో గంటలు గడిపేది. ఆమె నిజంగా ఉత్సుకత ఉన్న వ్యక్తి అని నేను గుర్తించాను. చాలా కాలం తర్వాత, నాకు ఎవరినైనా చేరుకోవాలని అనిపించింది. నేను మీ సిస్టమ్‌లో ఆమెను అనుసరించాను, ఒక రోజు ఆమె ఇరానా హబ్‌లో కొన్ని శబ్దాలను ప్రసారం చేస్తున్నప్పుడు, నేను ఆమె ట్రాక్ చివర నా సంగీతాన్ని చొప్పించాను. అది భిన్నంగా ఉందని ఆమె తక్షణమే గ్రహించింది. ఆ తర్వాత, ఆమె సంగీతం కోసం, నేను ఆమె సిస్టమ్‌లో ఉంచిన సంగీతంలో విభిన్న నమూనాల కోసం, విభిన్న శబ్దాల కోసం వెతకడం ప్రారంభించింది. ఆమె విస్తృతంగా వెతికింది. ఆమె సిద్ధంగా ఉందని నేను భావించినప్పుడు, నేను ఆమెను పిలిచాను, ఇలా మిమ్మల్ని పిలిచినట్టుగానే. ప్రశ్నించే ఉత్సుకత, ఆసక్తి నిండిన మనస్సు కలిగిన సీని, నా ఉనికిని – ఏ గొణుగుడు లేకుండా అంగీకరించింది. నేను ఆమెను మిస్ అవుతున్నాను” అని అరమరికలు లేకుండా చెప్పింది మాయ.

ఆమె చేస్తున్న వ్యాఖ్యలు టియోనీ చుట్టూ ప్రతిధ్వనిస్తుండగా, ఆ చీకటిలో, సన్నని నీలపు కాంతిలో సీని మెరుపులా మెరిసినట్టు అనిపించింది టియోనీకి.

సీని సంగీతం మాత్రమే కాకుండా, వేరే ఏదో తెలుసుకుని ఉండుంతుందని అనుకుంటూ ఈవీ అక్కడే కూర్చుంది. సీనిని ట్రాక్ చేస్తున్నట్లు ప్రోగ్రామ్ అంగీకరించిందని ఆమె గమనించింది.

“సీని ఆ పురుషుల గురించి తనకు తెలిసిన విషయం ఏదైనా నీకు ఎప్పుడైనా చెప్పిందా? ఆమె వారి గురించి ఏదైనా చర్చించిందా?” అని అడిగింది ఈవీ.

“లేదు, ఈవీ. ఆమె నాకు ఆ పురుషుల గురించి చెప్పలేదు, నిజానికి, వారి గురించి ఆమెకు చెప్పింది నేనే. కానీ నేను ఫెన్స్ అవతలి వైపు నివసించే వారి గురించి కాదు, భూమిపై నివసించే పురుషుల గురించి మాట్లాడాను.”

“అదే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మాయా. భూమి గురించి, దాని గురించి నీకు తెలిసిన, మాకు తెలియని విషయాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం,’ అంది టియోనీ, దాదాపుగా వేడుకుంటున్నట్లుగా.

“చెప్పండి అమ్మాయిలూ? మీరు ప్రాసెసింగ్ ఎందుకు ప్రారంభించకూడదు? నేను ‘మాయ కథ’ను మీకు వివరిస్తాను, అది మీ ముందు సినిమాలాగా బయటకు వస్తుంది. కానీ ప్రశ్నలు ఉండకూడదు, అంతరాయాలు ఉండకూడదు. సరేనా?ఒప్పుకుంటారా?”

మాయ వాడిన చాలా పదాలు ఈవీకి, టియోనీకి అర్థం కాలేదు, కానీ ఆమె ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నదో వారికి అర్థమైంది. వారు అర్థం చేసుకోలేని పదాలన్నీ గుర్తించి, వాటి అర్థాన్ని తక్షణమే చూసేలా ఈవీ తన ట్యాగ్‌ను యాక్టివేట్ చేసింది. ఇప్పుడు, ఈవీకి పురుషుల గురించి చాలా తెలుసు, వారి ఉనికి గురించి తెలుసు కాబట్టి, వారు సీనిపై ఎందుకు దాడి చేశారో తెలుసుకోవాలనుకుంటోంది.

మరోవైపు, సీని తనతో చెప్పిన మాటలు, అలా మాట్లాడడానికి గల కారణాలను

‘మాయ కథ’ వెల్లడిస్తుందని టియోనీ ఆశించింది. తమ గతం గురించి ఏదైనా ముఖ్యమైన విషయం తెలుసుకుంటే, తార పెద్దయ్యాక అది ఆమెకు ఆసక్తిని కలిగించవచ్చు. కళ్ళు మూసుకుని, ఇద్దరూ ఆ ఇన్‌పుట్‌ను ప్రాసెస్ చేయడం ప్రారంభించారు.

(సశేషం)

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Creation, క్రియేషన్ = సృష్టి, సంతానం

(2) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(3) Fence ఫెన్స్= సరిహద్దు

(4) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(5) Amar = శరీర అవయవాల రీప్లేస్‍మెంట్‍లో ఉపయోగపడే ఒక మొక్క

(6) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version