Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఆరోహణ-18

[శ్రీమతి సాధనా శంకర్ ఆంగ్లంలో రచించిన ‘Ascendance’ అనే సైన్స్ ఫిక్షన్ నవలను ‘ఆరోహణ’ పేరుతో అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

[ఆస్ట్రనామిక్ టవర్‌లో ఆర్యన్‌ని కలుస్తుంది మాయ. తాను కనిపెట్టిన ఓ పెద్ద గ్రహాన్ని చూడమని చెప్తాడు ఆర్యన్. ఆ గ్రహాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. భవిష్యత్తులో మానవాళికి ఆ గ్రహం నివాసం కావచ్చునని అంటాడు ఆర్యన్. ఆ గ్రహం దాదాపుగా భూమి లనే ఉందనీ, కాకపొతే సమయంలో తేడా ఉండని, ఋతువులు ఎక్కువ కాలం కొనసాగుతాయని చెప్తాడు. ఆ గ్రహాన్ని ప్రపంచానికి పరిచయం చేసేముందు దానికో పేరు పెట్టమని సూచిస్తుంది మాయ. మానవులు అంత దూరం ప్రయాణించి, అక్కడ జీవించడానికి అవసరమైన సాంకేతికతను కనుక్కోడానికి చాలా సమయం పడుతుందనీ, అప్పుడు జీవించి ఉండేవాళ్ళు ఏదో ఒక పేరు పెట్టుకుంటారులెమ్మని అంటాడు. అయినా తాను దాన్ని ఎర్త్ క్లోన్ అని పిలుస్తాననీ, మనం ఎలోన్ అని అనుకుందామని అంటాడు ఆర్యన్.  తాను బాగా అలసిపోయానని అంటాడు. తాను విన్న మెర్జర్ ప్రాజెక్టు గురించి చెప్తుంది. ఆ మెర్జర్ సంగతి తరువాత, ముందు మన కలయిక అంటాడు. వాళ్ళిద్దరూ శృంగార రసాస్వాదనలో మునిగి తేలుతారు. ఆ తరువాత ఆమె చెప్పిన మెర్జర్ వివరాలు విని తన అభిప్రాయం చెప్తాడు. అదే జరిగితే స్త్రీ పురుషుల మధ్య ఇక ప్రేమ ఉండదనీ, సంపూర్ణ సౌందర్యం, ఆనందం తెలియవని వాదిస్తాడు. అప్పటి దాకా మాయ చెప్తున్న కథని వింటున్న ఈవీ ఆశ్చర్యపోతుంది. పురుషులు ఇలాంటివారా అని మాయని అడుగుతుంది. ఎలోన్‌ను కనుగొన్నది ఓ పురుషుడా, ఈ విషయం ఇప్పటి దాకా తనకి ఎవరూ ఎందుకు చెప్పలేదో అని అనుకుంటుంది ఈవీ. టియోనీ అప్పట్లో సృష్టి ఎలా జరిగేదో తెలుసుకోవాలనుకుంటుంది, రియా పదే పదే ప్రస్తావించిన ‘నాన్న’ ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది. మాయ అన్నీ వివరంగా చెప్తుంది. కాసేపు బయటకు వెళ్ళి వచ్చిన ఈవీ ప్రేమ అంటే ఏమిటని మాయని అడుగుతుంది. జవాబిస్తుంది మాయ. సంతానోత్పత్తి కోసం స్త్రీ పురుషుల అవసరం ఒకరినొకరికి లేకుండా పోయాకా, సంఘర్షణ జరగదని భావించాననీ, కానీ ఇంకా ఎక్కువైందని చెప్తుంది మాయ. ఇక చదవండి.]

అధ్యాయం-5 – ప్రత్యామ్నాయాలు – 1వ భాగం

బయట కమ్ముకున్న దట్టమైన మంచు దుప్పటిలో ఒక్క మచ్చా లేదు, ప్రశాంతంగా, అంతు అనేదే లేనట్టుగా ఉంది. దూరంగా క్షితిజంలోకి వంగినట్టున్న గంభీరమైన పర్వత శ్రేణి దాని సహజమైన తెల్లని వాలుల నుండి – నాట్యం చేస్తున్న సూర్యుడి కిరణాలతో మిరుమిట్లు గొలుపుతోంది. ఆ నిషేధిత ప్రాంతపు ప్రకృతి దృశ్యంలో, గేజర్ భవనం ఒక దీపస్తంభంలా నిలిచింది. ఒక పర్వతం పైన, సన్నని దీర్ఘచతురస్రం ఆకారంలో నిర్మించబడిన ఈ భవనం – ఆకాశాన్ని తాకుతున్నట్లు అనిపిస్తుంది. పర్వతం మీద అదొక్కటే భవనం, కావాలనే మరో నిర్మాణం చేపట్టలేదు. ఎలోన్‌ (1)లో అత్యంత ఎత్తైన టెలిస్కోప్‌ ఇక్కడే ఉంది. భవనం లోపల, పూర్తిగా భిన్నమైన ప్రపంచం ఉంది. పువ్వులు వివిధ స్థాయిలలో వికసించాయి; వాటి రంగులు, సువాసనలు వెచ్చని పరిసరాల చుట్టూ వ్యాపించాయి. లోపల వికసించే ఆకులు – మంచుతో కప్పబడిన పర్వతాల నడుమ ఉన్న భవనాన్ని ఉత్సాహపరుస్తున్నాయి.

టోబోట్‌లు (2) వివధ అంతస్తులలో నివసిస్తూ, ఆ కేంద్రంలో పని చేస్తూ, దాన్ని నిర్వహిస్తున్నాయి. ఇమే మూడు విహాన్‌ల (3) క్రితం వచ్చాడు. ప్రస్తుతం, అతను కాకుండా, మరో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఆ భారీ భవనంలో ఉన్నారు.

భవనం పై అంతస్తులో ఉన్న వర్క్‌స్టేషన్‌లో కూర్చున్న ఇమే, సమీపంలో నాటిన గులాబీ పువ్వుల నుండి వచ్చే సున్నితమైన సువాసనను గ్రహించగలిగాడు. అతను ఫురావా నుండి ఎర్రటి త్రిభుజాకార పువ్వుల మొలకలను కూడా తెచ్చి గేజర్‌లో నాటాడు. వల్హాన్ అన్వేషణ అతన్ని గేజర్ టెలిస్కోప్‌లో కొన్ని కాలంటే (4)ల కోసం అవసరమైన పనిలో ఉంచింది.

భవిష్యత్తులో ఆవాసాలుగా పనికొస్తాయనుకున్న జీటా, తాయ్‌ అనే రెండు గ్రహాలను కనుగొన్న ఇమే ఆనందం, రెండు గ్రహాలలో దేనిలోనైనా నెపో (5) గాని లేదా నెపోకి ప్రత్యామ్నాయ పదార్ధం నిల్వలు ఉన్నాయో లేదో కనుగొనవలసిన అవసరంతో చెల్లిపోయింది. గత విహాన్‌లో, రెండు గ్రహాల నుండి నేల మరియు వాతావరణపు డేటాతో ఒక చిన్న ప్రోబ్ తిరిగి వచ్చింది.

రాత్రి ఆకాశంలో; జీటా, తాయ్ పసుపురంగు రంగులో కనిపించాయి, సమీపంలోని నక్షత్రం నుండి వచ్చే కాంతి వాటిపై ప్రతిబింబిస్తుంది. నెపో కోసం అన్వేషణలో మునిగిపోయిన ఇమే, రెండు గ్రహాలపై ఇప్పటికే సేకరించిన డేటాను ఇంకా ప్రాసెస్ చేయలేదు; అతను ఇంకా వాటి వాతావరణాలను పూర్తిగా మ్యాప్ చేయాల్సి ఉంది. నెపోకు సంబంధించిన అతని డేటాలో ఇమే కొంత అసాధారణతను గమనించాడు. అడ్వాన్స్‌డ్ టోబోట్‌లలో ఒకటి దానిపై పనిచేస్తోంది, కానీ ఎటువంటి నిర్ణయానికి రాలేదు.

ఫెన్స్ (6)కి అవతలి వైపు, నెపోకు ప్రత్యామ్నాయం ఇప్పటికే ఉంది, కానీ వారు దానిపై చేయి వేయలేకపోయారు – దొంగతనం ద్వారా లేదా చర్చల ద్వారా కూడా. ప్రస్తుతం వస్తున్న డేటా గురించి ఇమే లోతుగా పరిశీలిస్తున్నప్పుడు, వారి పొరుగువారి నుండి పూర్తిగా విడిపోవడం సరైన వ్యూహమేనా అని ఆశ్చర్యపోయాడు.

బయట, మెత్తటి మంచుముక్కలు పైనుంచి క్రిందికి జారుతున్నప్పుడు – వంపులు తిరుగుతూ, మెలి తిరుగుతూ ఉన్నాయి. తాను తెల్లవారుజాము నుండి పని చేస్తున్నాడని ఇమేకు అర్థమైంది. అతను లేచి, ఒళ్ళు విరుచుకుని, గేజర్ ఉన్న పర్వతం చుట్టూ తిరిగే రోండ్యురల్‌ (7) లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు.

గేజర్ భవనం నుంచి బయటకి వచ్చి పర్వతాలు దిగి మైదాన ప్రాంతాలకు చేరుకోవడానికి ఉన్న ఏకైక సాధనం రోండ్యురల్ మాత్రమే. మైదాన ప్రాంతం నుండి నగరానికి తిరిగి వెళ్ళడానికి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంది. ఇమే తరచుగా దానిలో ప్రయాణించి అక్కడి దృశ్యాలను చూడటానికి ప్రయత్నిస్తాడు, అక్కడ ఉన్న అన్ని యంత్రాలకు నిరంతరం వస్తూనే ఉండే డేటా నుండి దూరంగా ఉండాలనుకుంటాడు.

అతను లిఫ్ట్ ఎక్కి ఎంబార్కేషన్ ఫ్లోర్ వరకు వెళ్లి అక్కడ వేచి ఉన్న రోండ్యురల్‌ లోకి అడుగు పెట్టాడు. అతను ఒక చిన్న బెంచ్ మీద కూర్చుని రోండ్యురల్‌ను స్టార్ట్ చేసే ముందు తనను తాను సురక్షితంగా బెల్ట్‌తో కట్టుకున్నాడు. తన ముక్కును పేన్‌కు నొక్కి ఉంచి పర్వతం దిగువకి బయలుదేరాడు. పారదర్శక గోళాకార వాహనం భవనం చుట్టూ నెమ్మదిగా, మనోహరంగా తేలుతూ, క్రిందకి పడితున్న మంచుముక్కలతో నృత్యం చేస్తున్నట్లుగా ఉంది.

అతను ప్రకృతి దృశ్యం గుండా తేలుతూ ఉండగా, తన మొక్కల పురోగతిని అంచనా వేయడానికి ఇమే తన లెక్స్ ద్వారా ఫురావాలో ప్రవేశించాడు. అతను రూపొందించిన పువ్వులు తదుపరి విహాన్‌లో వికసించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంతలో, మర్నాడు ఒడెప్‌ గేజర్‌ను చూడ్డానికి వస్తున్నాడనీ, తాను ఆ తర్వాతి రోజు వచ్చి వారితో చేరతానని వల్హాన్ నుండి సందేశం రావడంతో, రోండ్యురల్ వెనక్కు మళ్ళింది.

ఇమే ఆశ్చర్యపోయాడు. గేజర్ భవనం ప్రజలు సందర్శించే ప్రదేశం కాదు. అయోనా మాదిరిగా కాకుండా, దాని ఉనికి గురించి కొద్దిమందికే తెలుసు. ‘ఒడెప్’ – ఆ పేరు ఖచ్చితంగా సుపరిచితమే, కానీ ఇమే ఖచ్చితంగా గుర్తురాలేదు. అతను లెక్స్ (8) ద్వారా ఒడెప్‌ గురించి తెలుసుకున్నాడు. వివరాలు అందుతుండగా, ఇమే గుర్తుచేసుకున్నాడు. ఒడెప్ గొప్ప వాస్తుశిల్పి, సైనెడ్ సభ్యుడు, సమస్యల పరిష్కర్త. కానీ ఇప్పుడు అతను ఎక్కడో కొండలలో, జనాలకి దూరంగా నివసిస్తున్నాడు. అతను గేజర్‌కు ఎందుకు వస్తున్నాడు? అంతకుముందు, పాటిక్స్ తనపై రాదుల్‌ను బలవంతంగా రుద్దాడు; ఇప్పుడు వల్హాన్ కూడా ఎవరినైనా పంపుతున్నాడా?

ఆ రోండ్యురల్ మళ్ళీ పైకి చేరుకుని డాక్ అయింది. ఆ ఎత్తులో ఎప్పుడూ చలిగా ఉంటుంది. ఇమే త్వరగా భవనంలోకి వెళ్లి తన వర్క్ స్టేషన్‌కి తిరిగి వచ్చాడు. మంచుతో నిండిన ఆకాశంలో, ఏమీ కనిపించలేదు. వాతావరణ అంచనా ప్రకారం, రాత్రి నిర్మలంగా ఉంటుంది. బహుశా అప్పుడు అతను విశ్వం అంతటా మిణుకుమిణుకుమనే మార్మికమైన పసుపురంగు కాంతిని విడుదల చేసే ఆ సుదూర గ్రహాలపై ఎలోన్ కోసం కొంత ఆశను కనుగొంటాడు.

🚀

‘పాయింట్‌’ లో కలిసినప్పటి నుండి రాదుల్ పాటిక్స్ నుండి ఒక సంకేతం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే, అతని నుండి ఎటువంటి సమాచారం రాలేదు.

రోజులు నిశ్శబ్దంగా గడిచిపోయాయి. ‘పాయింట్‌’ లో సమావేశం ఎప్పుడూ జరగనట్లు అనిపించింది. రాదుల్ కోషుమ్‌లో తనకు ఇష్టమైన ప్రదేశంలో కూర్చుని కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు అతను ఇక్కడికి తరచుగా వస్తున్నాడు. ‘పాయింట్‌’ లో సమావేశం జరిగినప్పటి నుండి, అతను నెపో గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. గైనేక్‌ (9) పై జరిగే యుద్ధానికి కారణం నెపో అయితే మాత్రం, రాదుల్ బాగా సిద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. అతను ఇతర విషయాలను కూడా చూడటం ప్రారంభించాడు, గతంలో తనను ఎప్పుడూ ఆకర్షించని సమాచారం, వాస్తవాలు, గణాంకాల ద్వారా యాదృచ్ఛికంగా వెతుకుతున్నాడు.

అతని శోధన భూమిపై జీవితం గురించిన సమాచారం వైపు అతన్ని తీసుకెళ్లింది, గత రెండు యుద్ధాల వివరాలు, అనేక జాక్‌ (10) లలో సైనెడ్ నిర్ణయం తీసుకోవడం; చివరికి ప్రత్యామ్నాయాలు నెక్స్‌ (11) ని ఎలా ఓడించాయో తెలుసుకున్నాడు. తన అవగాహన పెరిగేకొద్దీ, పాటిక్స్ ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాడో రాదుల్ అర్థం చేసుకున్నాడు. స్మారక చిహ్నాన్ని చూసిన పాటిక్స్ ముఖంలో ఉన్న భావన రాడుల్ మనస్సులో ముద్ర వేసింది.

ఫెన్స్‌కి అవతలివైపు నుంచి నెక్స్‌కి సంబంధించిన సమాచారం ఏదైనా తెలుస్తుందేమోనని, రోజుల తరబడి, రాదుల్ హైవేలపై నిఘా ఉంచాడు. అయితే, దానికి రిమోట్‌గా అనుసంధానించబడినది ఏదీ కనిపించలేదు. రాదుల్‌కు ఎప్పుడూ నెక్స్ (మరణం) గురించి తెలియదు. ఎవరో ఒకరు లేకపోవడం అనేది జరగలేదు – అది ఊహించలేనిది. అది అతను ఊహించలేని విషయం. ఫెన్స్‌కి ఆవలివైపున మరణాన్ని సృష్టించల సామర్థ్యం పురుషులకి నిజంగా ఉందా? వారు అలా ఎందుకు చేస్తారు? ఒకవేళ చేసి ఉంటే, ఎలా చేశారు?

అతనికి ఎటువంటి సమాధానాలు దొరకకపోవడంతో, రాదుల్ తన దృష్టిని చేతిలో ఉన్న పని వైపు మళ్ళించాడు. నెపో – ప్రత్యామ్నాయ అవయవాలను తయారు చేయడానికి ఉపయోగించే ‘అద్భుత’ ఖనిజం. చాలా మంది పురుషులు దానిని శుద్ధి చేయడంలో, దానిని మెరుగ్గా, దీర్ఘకాలంగా, అనుకూలంగా మార్చడంలో కృషి చేస్తున్నారని అతనికి తెలుసు. కాబట్టి, వారు ఇంకా పునరుత్పాదక ప్రత్యామ్నాయాన్ని ఎందుకు కనుగొనలేకపోయారు? నెపో నిల్వల కోసం డేటాను పరిశీలించినప్పుడు, డేటా సులభంగా అందుబాటులో లేదని అతను గ్రహిండు. ఈ సమాచారం సైనెడ్‌లో చాలా కాలంగా ఉన్న సభ్యులకు మాత్రమే అందుబాటులో ఉంది. పాటిక్స్, సైనెడ్‌లోని ఇతర సభ్యులను తలచుకుని ఆశ్చర్యపోయాడు రాదుల్. వాళ్ళే తమని నడిపిస్తారా? వారు దేనినైనా మార్చగలరా?

రాదుల్ లేచి హాలుకు ఎదురుగా ఉన్న పెద్ద కిటికీ వైపు నడిచాడు. బయట ఆకాశం చీకటిగా ఉంది. కోషుమ్ భవనం ఇరవయ్యవ అంతస్తు నుండి చూస్తే, క్రింద ఉన్న నగరంలో నక్షత్రాల మాదిరిగా లైట్లు మెరుస్తున్నాయి. రాదుల్ ఫెన్స్ వైపు చూస్తూ ఉన్నాడు. గైనేక్ నెపో గురించి ఏమి చేస్తున్నారు? తమ మాదిరే, సుదీర్ఘ కాలంగా ఈ గ్రహం మీద నివసిస్తున్నందున వారు కూడా అదే క్షీణతను ఎదుర్కొంటు ఉండి ఉండాలి. నిజానికి, వారు లేకపోతే, నెపో మొత్తం నిల్వలు పురుషులకు అందుబాటులో ఉండేవి.

అక్కడ నిలబడి ఉండగా, పాటిక్స్ నుండి సంకేతం కోసం తానెందుకు వేచి చూస్తున్నాడో రాదుల్‌కి అర్థం కాలేదు. యుద్ధభేరి మ్రోగించడానికి అవసరమైన అన్నీ తన వద్ద ఉన్నాయి; అతను చేయాల్సిందల్లా ఒక ప్రణాళికను రూపొందించడమే. రాదుల్ శూన్యంలోకి చూశాడు, ఇక తానే స్వయంగా కథ నడపాలని నిర్ణయించుకున్నాడు.

(సశేషం)

—-

ఈ సైన్స్ ఫిక్షన్ నవలలో రచయిత్రి సృజించిన కొత్త పదాలు, వాటి అర్థాలు:

(1) Elone, ఎలోన్ = ఒక గ్రహం

(2) Tobok, టోబాక్, Tobot, టోబాట్ = యంత్ర సహకారి

(3) Vihan, Vihaan విహాన్ =ఎలోన్ గ్రహంలో ఒక వారం

(4) Calante, కాలంటే = ఎలోన్ గ్రహంలో ఒక నెల

(5) Nepo, నెపో = అవయవాల భర్తీకి ఉపకరించే ఒక ఖనిజం

(6) Fence ఫెన్స్= సరిహద్దు

(7) Rondural, రోండ్యురల్ – పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి తీసుకెళ్ళే వాహనం

(8) Lex, లెక్స్ = సమాచార పరికరం

(9) Gynake, గైనేక్ = ఎలోన్ గ్రహంలో స్త్రీలను సూచించేందుకు పురుషులు వాడే పదం

(10) Zacs, జాక్స్ = సంవత్సరాలు

(11) Nex, నెక్స్ = మరణం, చావు


రచయిత్రి పరిచయం:

రచయిత్రి శ్రీమతి సాధన శంకర్ రిటైర్డ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారిణి. ఆర్థికశాస్త్రంలో పి.హెచ్.డి. చేశారు. ‘Ascendance’ వారి ఐదవ పుస్తకం, రెండవ నవల, మొదటి సైఫి నవల. అంతకుముందు ఆమె ‘నెవర్ ఎ డిస్‌కనెక్ట్’ (2010) అనే నవల; ‘వెన్ ది ప్యారలల్స్ మీట్’ (2007) అనే వ్యాసాల సంపుటి; ‘అహ్లాన్ వా సహ్లాన్ – జర్నీ టు సిరియా’ (2006), ‘కాచింగ్ ఫైర్‌ఫ్లైస్’ (2016) అనే రెండు ట్రావెలాగ్‌లు ప్రచురించారు. ఆమె వివిధ ఆంగ్ల వార్తాపత్రికలకు, మ్యాగజైన్‌లకు వ్రాస్తారు. దూరదర్శన్‌లో యాంకర్‌గా, హోస్ట్‌గా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత నివాసం ఢిల్లీ.

https://themindprism.com అనే బ్లాగ్/వెబ్‍సైట్ నిర్వహిస్తున్నారు.

Exit mobile version